Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 5

పది ఆజ్ఞలు

మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపరచి, వారితో యిలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, నేడు మీకు నేను చెప్పే ఆజ్ఞలను, నియమాలను వినండి. ఈ ఆజ్ఞలను నేర్చుకొని, తప్పక వాటికి విధేయులవ్వండి. హోరేబు (సీనాయి) కొండ దగ్గర మన దేవుడైన యెహోవా మనతో ఒక ఒడంబడిక చేసాడు. యెహోవా ఈ ఒడంబడికను మన పూర్వీకులతో చేయలేదుగాని మనతో, అవును నేడు సజీవులుగా ఇక్కడ ఉన్న మన అందరితో చేసాడు. ఆ కొండ దగ్గర యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడాడు. అగ్నిలో నుండి ఆయన మీతో మాట్లడాడు. ఎందుకంటే మీరు ఆ అగ్నికి భయపడి. కొండమీదికి వెళ్లేందుకు నిరాకరించారు. కనుక ఆ సమయంలో యెహోవా చెప్పిన దానిని మీతో చెప్పడానికి నేను యెహోవాకు, మీకు మధ్య నిలబడ్డాను. యెహోవా ఇలా చెప్పాడు:

“మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుణ్ణి యెహోవాను నేనే. కనుక మీరు ఈ ఆజ్ఞలకు విధేయలుగా ఉండండి.

“నన్ను తప్ప మరి ఏ దేవుళ్లనూ ఆరాధించవద్దు.

“పైన ఆకాశంలోగాని, క్రింద భూమిమీదగాని, ఆ క్రింద సముద్రంలోగాని దేని విగ్రహమైనా, రూపం అయినా చేసుకోవద్దు. ఎలాంటి విగ్రహాలను కూడా పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే నేనే మీ దేవుడైన యెహోవాను. మరియు వాళ్ల పిల్లలను, పిల్లల పిల్లలను, ఆ పిల్లల పిల్లలను నేను శిక్షిస్తాను. 10 అయితే నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలకు విధేయు లయ్యే ప్రజలయెడల నేను చాలా దయ చూపిస్తాను. అలాంటివారి వంశీయుల్లో వెయ్యితరాల వారివరకు నేను దయ చూపిస్తాను.

11 “మీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా పలుకవద్దు. ఒక వ్యక్తి యెహోవా పేరును వ్యర్థంగా పలికితే ఆతడు దోషి. యెహోవా ఆతణ్ణి నిర్దోషిగా ఎంచడు.

12 “సబ్బాతు రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చేందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారం లోని ఇతర దినాలకంటే విశ్రాంతి దినాన్ని వేరుగా ఉంచమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞ యిచ్చాడు. 13 మొదటి ఆరు రోజులు మీ పని చేసుకొనేందుకు. 14 అయితే ఏడో రోజు మీ దేవుడైన యెహోవా గౌరవార్థం విశ్రాంతి రోజు అవుతుంది. కనుక విశ్రాంతి రోజున ఏ వ్యక్తీ పనిచేయకూడదు. అంటే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ ఆడ, మగ బానిసలు, మీ ఆవులు, మీ గాడిదలు, ఏ ఇతర జంతువులు, మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులు, మీ బానిసలు కూడ మీవలెనే విశ్రాంతి తీసుకోగలగాలి. 15 ఈజిప్టులో ఉన్నప్పుడు మీరూ బానిసలే అని మరచిపోవద్దు. మీ దేవుడైన యెహోవా తన మహా శక్తితో ఈజిప్టునుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేసాడు. అందుచేతనే ఎల్లప్పుడూ సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా ఆచరించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.

16 “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీవు యిలా చేయాలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞ యిచ్చాడు. నీవు ఈ ఆజ్ఞను పాటిస్తే, నీవు చాలాకాలం బ్రతుకుతావు. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో అంతా శుభం అవుతుంది.

17 “ఎవరినీ హత్య చేయవద్దు.

18 “వ్యభిచార పాపం చేయవద్దు.

19 “ఏమీ దొంగిలించకు.

20 “మరో వ్యక్తి చేసిన దాన్నిగూర్చి అబద్ధసాక్ష్యము చెప్పకు.

21 “మరొకరికి చెందినవి నీవై యుంటే బాగుండునని ఆశించకు. ఇంకో వ్యక్తి భార్యను, అతని యింటిని, అతని పొలాలను, అతని మగ లేక ఆడ పనివారిని, అతని ఆవులను, అతని గాడిదలనుగాని ఇతరులకు చెందిన దేనినిగాని నీవు ఆశించకూడదు.”

ప్రజలు దేవునికి భయపడటం

22 “మీరంతా కలిసి ఆ కొండ దగ్గర ఉన్నప్పుడు మీ అందరికీ ఈ ఆజ్ఞలను యెహోవా యిచ్చాడు. అగ్ని, మేఘం, గాఢాంధకారంలోనుండి వచ్చిన పెద్ద శబ్దంతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత యింకేమీ చెప్పలేదు. ఆయన తన మాటలను రెండు రాతి పలకలమీద వ్రాసి వాటిని నాకు ఇచ్చాడు.

23 “పర్వతం అగ్నితో మండిపోతున్నప్పుడు అంధకారంలోనుంచి వచ్చిన ఆ స్వరం మీరు విన్నారు. అప్పుడు, మీ వంశాల నాయకులు అందరూ, మీ పెద్దలూ నా దగ్గరకు వచ్చారు. 24 వారు అన్నారు: ‘మన దేవుడైన యెహోవా తన మహిమను, మహాత్యాన్ని మాకు చూపించాడు. ఆయన అగ్నిలోనుండి మాట్లాడటం మేము విన్నాము. ఒక మనిషితో దేవుడు మాట్లాడిన తర్వాత కూడ ఆ మనిషి బ్రతకటం సాధ్యమేనని ఈవేళ మేము చూశాము. 25 కానీ మన దేవుడైన యెహోవా మాతో ఇంకొక్కసారి మాట్లాడటం గనుక మేము వింటే మేము తప్పకుండా చస్తాము. ఆ భయంకర అగ్ని మమ్మల్ని నాశనం చేసేస్తుంది. కానీ మేము చావటం మాకు యిష్టంలేదు. 26 సజీవ దేవుడు మాట్లాడటం మేము విన్నట్టుగా వినికూడ బ్రతికిన మనిషి ఎన్నడూ ఎవ్వడూ లేడు. 27 మోషే, నీవు దగ్గరగా వెళ్లి, మన దేవుడైన యెహోవా చెబుతున్న సంగతులన్నీ విను. తర్వాత, యెహోవా నీకు చెప్పే విషయాలన్నీ నీవు మాకు చెప్పు. మేము నీ మాట వింటాము, నీవు చెప్పేది అంతా చేస్తాము.’

మోషేతో యెహోవా మాట్లాడటం

28 “మీరు నాతో చెప్పిన సంగతులను యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో అన్నాడు, ‘ఈ ప్రజలు చెప్పిన విషయాలు నేను విన్నాను. వారు చెప్పింది అంతా మంచిదే. 29 వారు ఎల్లప్పుడూ వారి హృదయాల్లో నన్ను గౌరవించి, నా ఆజ్ఞలన్నింటికీ విధేయులైతే బాగుండును అని మాత్రమే నా కోరిక. అప్పుడు వాళ్లకు, వాళ్ల సంతతివారికి సర్వం శుభం అవుతుంది.

30 “‘వెళ్లి, ప్రజలందరినీ వారి గుడారాలకు వెళ్లి పొమ్మని చెప్పు. 31 అయితే మోషే, నీవు యిక్కడ నాకు దగ్గరగా నిలబడు. నీవు వాళ్లకు నేర్పించాల్సిన ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు అన్నీ నీకు నేను చెబుతాను. వారు జీవించేందుకు నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఈ పనులు చేయాలి’.

32 “అందుచేత యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేందుకు మీరు జాగ్రత్తగా వుండాలి. మీరు దేవుణ్ణి అనుసరించటం మానకూడదు. 33 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన విధంగా మీరు జీవించాలి. అప్పుడు మీరు జీవించడం కొనసాగుతుంది, మీకు అంతా శుభ ప్రదం అవుతుంది. మరియు మీది కాబోతున్న ఆ దేశంలో మీ జీవితం పొడిగించబడుతుంది.

కీర్తనలు. 88

కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీత నాయకునికి: బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.

88 యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.
    రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
దయచేసి నా ప్రార్థనలను గమనించుము.
    కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.
    మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె
    ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.
    నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను.
నీనుండీ, నీ కాపుదలనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను.
    మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
యెహోవా, నీవు నన్ను భూమి క్రింద సమాధిలో ఉంచావు.
    నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
నీవు నా మీద కోపగించావు.
    నీవు నన్ను శిక్షించావు.

నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.
    అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు.
నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
    నా బాధ అంతటిని గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.
యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను.
    ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
10 యెహోవా, చనిపోయినవారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!
    దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!

11 చనిపోయినవాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.
    చనిపోయినవారు మృతుల లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.
    మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
    ప్రతి వేకువ జామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
14 యెహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?
    నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.
    నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.
    శిక్ష నన్ను చంపేస్తుంది.
17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
    నా నొప్పులు, బాధల్లో నేను మునిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచిపెట్టివేసేటట్టుగా నీవు చేశావు.
    చీకటి మాత్రమే నాకు మిగిలింది.

యెషయా 33

దేవుడు తన శక్తిని చూపిస్తాడు

33 మీరు యుద్ధం చేసి ప్రజల దగ్గర్నుండి దొంగిలిస్తారు, ఆ ప్రజలు మాత్రం మీ దగ్గర ఎన్నడూ ఏమీ దొంగిలించలేదు. మీరు ప్రజల మీద దాడిచేస్తారు. ఆ ప్రజలు మిమ్మల్ని ఎన్నడూ ఎదిరించ లేదు. కనుక మీరు దొంగిలించటం మాని వేసినప్పుడు ఇతరులు మీ దగ్గర దొంగిలించటం మొదలు పెడ్తారు. మీరు ప్రజల మీద పడటం మానివేసినప్పుడు, ఆ ప్రజలు మీ మీద పడటం మొదలు పెడ్తారు. అప్పుడు మీరంటారు.

దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు
    “యెహోవా మామీద దయ చూపు నీ సహాయం కోసం మేము కనిపెట్టాం
యెహోవా, ప్రతి ఉదయం మాకు బలం దయచేయి.
    మేం కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించు.
నీ శక్తిగల స్వరం ప్రజలను భయపెడ్తుంది కనుక వారు నీ దగ్గర్నుండి పారిపోతారు.
    నీ మహాత్మ్యం రాజ్యాలనే పారిపోయేట్టు చేస్తుంది.”

మీరు యుద్ధంలో వస్తువులు దొంగిలించారు. ఆ వస్తువులు మీ దగ్గర్నుండి తీసుకోబడతాయి. చాలా, చాలామంది వచ్చి మీ ధనాన్ని దోచుకొంటారు. అది మిడతలు వచ్చి మీ పంటలన్నింటినీ తినివేసే సందర్భంలాగా వుంటుంది.

యెహోవా ఎంతో గొప్పవాడు. ఆయన మహాఉన్నత స్థలంలో ఉంటాడు. సీయోనును న్యాయంతో, మంచితనంతో యెహోవా నింపుతాడు.

యెరూషలేమూ, నీవు దేవుని జ్ఞానంతో, తెలివితో ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు రక్షణతో ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు యెహోవాను గౌరవిస్తావు. అది నిన్ను ఐశ్వర్యవంతురాలిగా చేస్తుంది. కనుక నీవు కొనసాగుతావు అని నీవు తెలుసుకోవచ్చు.

కానీ, విను! బయట దేవదూతలు ఏడుస్తున్నారు. శాంతి సందేశం తీసుకొనివచ్చే ఆ దూతలు చాలా గట్టిగా ఏడుస్తున్నారు. రోడ్లు నాశనం అయ్యాయి. వీధుల్లో ఎవ్వరూ నడవటం లేదు. ప్రజలు వారు చేసుకున్న ఒడంబడికలను ఉల్లంఘించారు. సాక్షుల రుజువులను అంగీకరించటానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. ఎవ్వరూ ఇతరులను గౌరవించటంలేదు. దేశం వ్యాధిగ్రస్తమై, చస్తూ ఉంది. లెబానోను చస్తూ ఉంది, షారోను లోయ ఎండిపోయి, ఖాళీగా ఉంది. బాషాను, కర్మెలులో ఒకప్పుడు అందమైన మొక్కలు పెరిగాయి కానీ ఆ మొక్కలు ఎదగటం మానేశాయి.

10 యెహోవా చెబుతున్నాడు, “ఇప్పుడు నేను లేచి నా మహిమను చూపిస్తాను. నేను ఇప్పుడు ప్రజలకు ప్రముఖుడనవుతాను. 11 ప్రజలారా మీరు పనికి మాలిన పనులు చేశారు. ఆ పనులు గడ్డిలా, గడ్డిపోచలా ఉన్నాయి. అవి దేనికీ పనికిరావు. మీ ఆత్మ అగ్నిలా ఉండి మిమ్మల్ని కాల్చేస్తుంది. 12 మనుష్యుల ఎముకలు సున్నంలా అయ్యేంత వరకు వారు కాల్చబడుతారు. ప్రజలు ముళ్లకంపల్లా, ఎండిపోయిన పొదల్లా త్వరగా కాలిపోతారు.

13 “దూరదేశాల్లో ఉన్న ప్రజలారా నేను చేసిన కార్యాలను గూర్చి వినండి. నాకు దగ్గర్లో వున్న ప్రజలారా, మీరు నా శక్తిని గూర్చి తెలుసుకోండి.”

14 సీయోనులో పాపులు భయపడుతున్నారు. చెడ్డ పనులు చేసేవారు భయంతో వణకుతున్నారు. “మనల్ని నాశనం చేసే ఈ అగ్నిలో నుండి మనలో ఎవరైనా బ్రతకగలమా? శాశ్వతంగా మండుతూ ఉండే ఈ అగ్ని దగ్గర ఎవరు బ్రతకగలరు?” అని వారంటున్నారు.

15 మంచివాళ్లు, నిజాయితీపరులు డబ్బుకోసం ఇతరులను బాధించని వాళ్లు ఆ అగ్నిగుండా బతుకుతారు. ఆ ప్రజలు లంచాలు నిరాకరిస్తారు. ఇతరులను హత్య చేసే పథకాలను గూర్చి వినటానికి గూడ వారు నిరాకరిస్తారు. చెడ్డ పనులు చేసేందుకు వేసిన పథకాలను చూచేందుకు గూడా వారు నిరాకరిస్తారు. 16 ఆ ప్రజలు ఉన్నతమైన స్థలాల్లో క్షేమంగా జీవిస్తారు. ఎత్తయిన బండల కోటలలో వారు భద్రంగా కాపాడబడతారు. ఆ ప్రజలకు ఆహారం, నీళ్లు ఎల్లప్పుడూ ఉంటాయి.

17 రాజును (దేవుణ్ణి) ఆయన సంపూర్ణ సౌందర్యంలో మీరు చూస్తారు. ఆ మహా దేశాన్ని మీరు చూస్తారు. 18-19 గతంలో మీకు కలిగిన కష్టాలను గూర్చి మీరు ఆలోచిస్తారు. “ఆ ఇతర దేశాల మనుష్యులు ఎక్కడ? మనకు అర్థం కాని భాషలు వాళ్లు మాట్లాడారు. ఇతర దేశాల అధికారులు, పన్ను వసూలు చేసే వాళ్లు అంతా ఏమయ్యారు? మన రక్షణ గోపురాలను లెక్కించిన ఆ గూఢచారులు ఎక్కడ? వాళ్లంతా పోయారు!” అని మీరు అనుకొంటారు.

దేవుడు యెరూషలేమును కాపాడుతాడు

20 మన మతపరమైన పండుగల పట్టణం సీయోనును చూడు. ఆ అందమైన విశ్రాంతి స్థలం యెరూషలేమును చూడు. ఎన్నటికీ కదలని ఒక గుడారంలా ఉంది యెరూషలేము. దానిని తన స్థానంలో ఉంచే మేకులు ఎన్నటికి పెరికి వేయబడవు. దాని తాళ్లు ఎన్నటికీ తెగిపోవు. 21-23 ఎందుకంటే, శక్తిగల యెహోవా అక్కడ ఉన్నాడు గనుక. ఆ దేశం ఏరులు, పెద్ద నదులు ఉన్న దేశం. కాని ఆ నదుల్లో శత్రు పడవలుగాని లేక బలమైన ఓడలుగాని ఏమీ ఉండవు. ఆ పడవల్లో పనిచేసే మనుష్యులారా, మీరు మీ త్రాళ్ల పని విడిచి పెట్టవచ్చును. ఓడ కొయ్యను చాలినంత గట్టిగా చేయలేరు. మీరు మీ తెర చాపలను తెరువలేరు. ఎందుకంటే, యెహోవాయే మన న్యాయమూర్తి మన చట్టాలను యెహోవా చేస్తాడు. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు. అందుచేత యెహోవా మనకు విస్తారమైన ఐశ్వర్యం ఇస్తాడు. కుంటివాళ్లు సహా యుద్ధంలో గొప్ప ఐశ్వర్యాలు సంపాదిస్తారు. 24 అక్కడ జీవించే ఏ మనిషీ “నాకు జబ్బు” అని చెప్పడు. అక్కడ నివసించే ప్రజలు పాపాలు క్షమించబడిన ప్రజలు.

ప్రకటన 3

సార్దీసులోని సంఘానికి

“సార్దీసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“దేవుని ఏడు ఆత్మలను, ఏడు నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు:

“నీవు చేస్తున్న పనులు నాకు తెలుసు. ప్రజలు నీవు బ్రతికి ఉన్నావని అనుకొంటున్నారు. కాని నీవు నిజానికి చనిపోయిన వానితో సమానము. నా దేవుని దృష్టిలో నీవు చేస్తున్న పనులు యింకా పూర్తి కాలేదు. ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న శక్తి పూర్తిగా నశించకముందే నీ శక్తిని కాపాడుకో. నీకు లభించినదాన్ని, నీవు విన్నదాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆచరించు. మారుమనస్సు పొందు. కాని నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను ఒక దొంగలా వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నీవు తెలుసుకోలేవు.

“మలినంకాని కొందరు వ్యక్తులు అక్కడ సార్దీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు యోగ్యులు కనుక, తెల్లని దుస్తులు ధరించి నాతో సహా నడుస్తారు. విజయం సాధించిన వాళ్ళలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసినవాని పేరును నేను జీవగ్రంథంనుండి తుడిచివేయను. అతణ్ణి నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను. సంఘాలకు ఆత్మ చెబుతున్నదాన్ని ప్రతివాడు వినాలి.

ఫిలదెల్ఫియలోని సంఘానికి

“ఫిలదెల్ఫియలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“పవిత్రమైనవాడు, సత్యవంతుడు, దావీదు తాళంచెవి ఉన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన తెరిచినదాన్ని ఎవ్వరూ మూయలేరు.(A) ఆయన మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు.

“నీ పనులు నాకు తెలుసు. అదిగో చూడు! ఎవ్వరూ మూయలేని ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ బలంలేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీకరించకుండా అంగీకరించావు. సాతాను మందిరానికి చెందినవాళ్ళను, యూదులు కాకున్నా యూదులమని చెప్పుకొనేవాళ్ళను, అబద్ధాలాడేవాళ్ళను, నీ కాళ్ళ ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల ప్రేమ ఉందని వాళ్ళు తెలుసుకొనేటట్లు చేస్తాను. 10 సహనంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. నీవా ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ ప్రపంచంలో నివసిస్తున్నవాళ్ళందరిపై విచారణ జరిగే సమయం రాబోతోంది.

11 “నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్నదాన్ని అంటిపెట్టుకొని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. 12 అలా విజయం సాధించిన వాణ్ణి, నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు వ్రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గరినుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా వ్రాస్తాను. 13 సంఘాలకు ఆత్మ చెబుతున్న విషయాలను ప్రతివాడు వినాలి.

లవొదికయలోని సంఘానికి

14 “లవొదికయలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“ఈ విషయాలకు ఆమేన్[a] అనువాడును, దేవుడు సృష్టించిన వాటన్నిటికీ మొదటివాడును, నిజమైన సాక్షి అయినవాడును చెప్పుచున్నాడు.

15 “నీవు చేసిన పనుల్ని గురించి నాకు తెలుసు. నీలో చల్లదనం గాని వేడిమి గాని లేదు. రెండింటిలో ఏదైనా ఒకటి నీలో ఉండాలని నా కోరిక. 16 నీవు వేడిగానూ లేవు, చల్లగానూ లేవు. గోరు వెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి బయటకు ఉమ్మి వేయబోతున్నాను. 17 ‘నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఐశ్వర్యం ఉంది. నాకు ఏ కొరతా లేదు’ అని నీవంటున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు. దీనావస్థలో ఉన్నావు. నీవు దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. 18 నీవు ధనవంతుడవు కావాలనుకొంటే, నిప్పులో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర నుండి కొనుమని సలహా ఇస్తున్నాను. సిగ్గు కలిగించే నీ దిగంబరత్వాన్ని దాచుకోవటానికి నా నుండి తెల్లని దుస్తులు కొనుమని సలహా ఇస్తున్నాను. నా నుండి కాటుకను కూడా కొనుక్కొని నీ కళ్ళకు పెట్టుకో. అప్పుడు చూడగల్గుతావు.

19 “నేను ప్రేమించిన వాళ్ళను గద్దిస్తాను. వాళ్ళను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితితో ఉండి పశ్చాత్తాపం చెందు. 20 ఇదిగో! నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను. అతడు నాతో కలిసి తింటాడు.

21 “నేను విజయం సాధించి నా తండ్రితో కలిసి ఆయన సింహాసనంపై కూర్చున్నాను. అదే విధంగా విజయం సాధించినవాడు నాతో సింహాసనంపై కూర్చుంటాడు. 22 సంఘాలకు ఆత్మ చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International