M’Cheyne Bible Reading Plan
బాషాను ప్రజలతో యుద్ధం
3 “మనం మళ్లుకొని బాషాను మార్గంలో వెళ్లాము. బాషాను రాజు ఓగు, అతని ప్రజలందరు ఎద్రేయి దగ్గర మనతో యుద్ధం చేయటానికి వచ్చారు. 2 ‘ఓగును నేను మీకు అప్పగించాలని నిర్ణయించాను గనుక అతని గూర్బి భయపడవద్దు. అతని మనుష్యులందరిని, అతని దేశాన్ని నేను మీకు యిస్తాను. హెష్బోనులో ఏలుబడి చేసిన అమోరీ రాజు సీహోనుకు చేసినట్టే, అతన్ని కూడ మీరు ఓడిస్తారు’ అని యెహోవా నాతో చెప్పాడు.
3 “కనుక బాషానురాజు ఓగును, అతని మనుష్యులందరిని మన యెహోవా దేవుడు మనకు అప్పగించాడు. అతని మనుష్యులు ఎవరూ మిగుల కుండా మనం అతన్ని ఓడించాము. 4 తర్వాత అప్పట్లో ఓగుకు చెందిన పట్టణాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకొన్నాము. ఓగు ప్రజల పట్టణాలు అన్నింటినీ, బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతం అంతటిలో 60 పట్టణాలను మనం స్వాధీనం చేసుకొన్నాము. 5 ఎత్తయిన గోడలు, బలమైన కడ్డీలుగల గేట్లతో ఈ పట్టణాలు చాలా బలమైనవి. మరియు గోడలులేని పట్టణాలు కూడా చాలా ఉన్నాయి. 6 హెష్బోను రాజైన సీహోను పట్ణణాలకు మనం చేసినట్టే వీటినికూడా మనం నాశనం చేసాము. ప్రతి పట్టణాన్ని, వాటిలోని ప్రజలందరిని స్త్రీలు, పిల్లలను సహా మనం సమూలంగా నాశనం చేసాము. 7 అయితే ఆ పట్టణాల్లోని పశువులన్నింటినీ, విలువైన వస్తువులను మనకోసం ఉంచుకొన్నాము.
8 “ఈ విధంగా, అమోరీ ప్రజల ఇద్దరు రాజుల వద్దనుండి దేశాన్ని మన స్వాధీనం చేసుకొన్నాం. ఈ దేశాలు యొర్దాను నదికి తూర్పు వైపున ఉన్నాయి. అర్నోను లోయనుండి హెర్మోను పర్వతంవరకు ఉంది ఈ దేశం. 9 (హెర్మోను కొండను సీదోనీ ప్రజలు షిర్యోను అనీ, అమోరీలు శేనీరు అని పిలుస్తారు) 10 బాషాను అంతటిని సాలెకానుండి, ఎద్రేయివరకు, గిలాదు పీఠభూమిలోని పట్టణాలన్నింటినీ మనం మన స్వాధీనం చేసుకొన్నాం. సల్కా ఎద్రేయి బాషానులోని ఓగు రాజ్యంలో పట్టణాలు.”
11 (ఇంకా జీవించి ఉన్న కొద్దిమంది రెఫాయిము ప్రజల్లో బాషాను రాజు ఓగు ఒక్కడే. ఓగు మంచం ఇనుప మంచం. దాని పొడవు 13 అడుగులు, వెడల్పు 6 అడుగలు. అమ్మోనీ ప్రజలు నివసించే రబ్బా పట్టణంలో ఆ మంచం యింకా ఉంది.)
యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశం
12 “ఆ సమయంలో ఈ దేశాన్ని మన స్వంతం చేసుకొన్నాము. అర్నోను లోయ ప్రక్కగా అరోయేరు దేశాన్ని, గిలాదు కొండ దేశంలో సగం, వాటి పట్టణాలతోసహా రూబేను వంశంవారికి, గాదు వంశంవారికి నేను ఇచ్చాను. 13 గిలాదులో మిగతా సగం, బాషాను అంతా మనష్షే వంశంవారిలో సగం మందికి నేను ఇచ్చాను.”
(బాషాను ఓగు రాజ్యం. బాషానులో కొంత భాగం అర్గోబు అని పిలువబడింది. బాషాను ప్రాంతం రెఫాయిము దేశం అనికూడ పిలువబడింది). 14 గెషూరు, మయకాతీతు ప్రజల సరిహద్దువరకు గల మొత్తం అర్గోబు ప్రదేశం అంతా మనష్షే వంశీయుడైన యాయీరు పట్టుకొన్నాడు. ఈ ప్రాంతానికి యాయీరు తన స్వంత పేరు పెట్టుకొన్నాడు. హవ్వీత్‌యాయీరు అని పేరు పెట్టాడు. (నేటికీ ఆ ప్రాంతం బాషాను యాయీరు పట్టణాలు అని పిలువ బడుతుంది).
15 “గిలాదును నేను మాకీరుకు ఇచ్చాను. 16 మరియు రూబేను వంశానికి, గాదు వంశానికి గిలాదు వద్ద ప్రారంభం అవుతున్న దేశాన్ని నేను ఇచ్చాను. ఈ దేశం అర్నోను లోయనుండి యబ్బోకు నదివరకు ఉంది. (లోయ మధ్య భాగం ఒక సరిహద్దు. యబ్బోకు నది అమ్మోనీ ప్రజలకు సరిహద్దు) 17 పడమటి దిక్కున అరాబాలోని యొర్దాను నది వారి ప్రాంతానికి సరిహద్దు. ఈ ప్రాంతానికి ఉత్తరాన కిన్నెరెతు సరస్సు, దక్షిణాన అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) ఉన్నాయి. తూర్పున అది పిస్గా కొండచరియల క్రింద ఉంది.
18 “ఆ సమయంలో ఆ వంశాలకు నేను ఈ ఆజ్ఞయిచ్చాను: ‘మీరు నివసించడానికి యొర్దాను నదికి యివతలి ప్రక్క దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చాడు. అయితే యిప్పుడు మీ యుద్ధ వీరులు వారి ఆయుధాలు చేతపట్టి మిగతా ఇశ్రాయేలు వంశాలను నది దాటించాలి. 19 మీ భార్యలు, మీ చిన్నపిల్లలు, మీ పశువులు (మీకు పశువులు చాలా ఉన్నాయని నాకు తెలుసు) నేను మీకు యిచ్చిన ఈ పట్టణాల్లో యిక్కడ ఉండాలి. 20 అయితే మీ బంధువులైన ఇశ్రాయేలీయులకు యొర్దాను నదికి అవతల ప్రక్క యెహోవా యిస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకొనేంతవరకు మీరు వారికి సహాయం చేయాలి. ఇక్కడ మీకు శాంతి ఉన్నట్టుగానే అక్కడ వారికి యెహోవా శాంతి నిచ్చేంతవరకు వారికి సహాయం చేయండి. అప్పుడు నేను మీకు ఇచ్చిన ఈ దేశానికి మీరు తిరిగి రావచ్చును.’
21 “అప్పుడు యెహోషువతో నేను యిలా చెప్పాను: ‘మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకూ చేసిన వాటన్నింటినీ నీవు చూశావు. నీవు ప్రవేశించే రాజ్యాలన్నింటికీ యెహోవా అలాగే చేస్తాడు. 22 మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడుతాడు గనుక ఈ దేశాల రాజులకు నీవు భయపడవద్దు.’
మోషే కనానులో ప్రవేశించలేకపోవటం
23 “ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమలాడి, యిలా చెప్పాను, 24 ‘యెహోవా, నా ప్రభువా నేను నీ సేవకుడిని. నీవు చేసే ఆశ్చర్యకరమైన, శక్తివంతమైన విషయాలలో కొద్ది భాగం మాత్రమే నీవు నాకు చూపించావు అని నాకు తెలుసు. నీవు చేసిన శక్తివంతమైన మహత్కార్యాలను చేయగల దేవుడు ఆకాశంలో గాని భూమి మీదగాని లేడు. 25 యొర్దాను నదికి అవతల ప్రక్క ఉన్న ఆ మంచి దేశాన్ని, సౌందర్యవంతమైన ఆ కొండ దేశాన్ని, లెబానోనును చూడటానికి నన్ను అవతలకు దాటి వెళ్లనియ్యి అని నేను నీకు మనవి చేస్తున్నాను.’
26 “కానీ మీ మూలంగా యెహోవా నామీద కోపగించాడు. ఆయన నా మాట వినడానికి తిరస్కరించాడు. యెహోవా నాతో చెప్పాడు, ‘నీకు ఇది చాలు. ఈ విషయం నాతో యింకా చెప్పవద్దు. 27 పిస్గా కొండ శిఖరం మీదికి వెళ్లు. పడమర, ఉత్తరం, తూర్పు, దక్షిణం చూడు. నీవు నీ కళ్లతో చూడవచ్చు గాని నీవు మాత్రం ఎన్నటికీ యొర్దాను నది దాటి వెళ్లజాలవు. 28 నీవు తప్పక యెహోషువకు హెచ్చరికలు యివ్వాలి. అతణ్ణి ప్రోత్సహించి, బలపర్చు. ఎందుకంటే ప్రజలను యెహోషువ యొర్దాను నది దాటిస్తాడు. దేశాన్ని స్వాధీనం చేసుకొని దానిలో నివసించేందుకు యెహోషువ వారిని నడిపిస్తాడు. ఈ దేశాన్నే నీవు చూస్తావు.’
29 “అందుచేత మేము బేత్పెయోరు అవతలివైపు లోయలో నిలిచిపోయాము.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన
85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
వారి పాపాలు తుడిచివేయుము.
3 యెహోవా, కోపంగాను,
ఆవేశంగాను ఉండవద్దు.
4 మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,
మమ్మల్ని మరల స్వీకరించు.
5 నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
6 దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!
నీ ప్రజలను సంతోషింపజేయుము.
7 యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.
మమ్మల్ని రక్షించుము.
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
ఇశ్రాయేలు దేవుని శక్తిమీద ఆధార పడాలి
31 సహాయం కోసం ఈజిప్టుకు దిగి వెళ్తున్న ఆ ప్రజలను చూడండి. ప్రజలు గుర్రాల కోసం అడుగుతున్నారు. గుర్రాలు వారిని రక్షిస్తాయని వారనుకొంటున్నారు. ఈజిప్టు రథాలు, గుర్రాలపై సైనికులు వారిని కాపాడుతారని ఆ ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఆ సైన్యం చాలా పెద్దది. కనుక వారు క్షేమంగా ఉన్నాం అని ప్రజలు అనుకొంటున్నారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుడు) ప్రజలు విశ్వసించటం లేదు. ప్రజలు సహాయం కోసం యెహోవాను అడుగుట లేదు. 2 అయితే జ్ఞానం గలవాడు యెహోవాయే. మరియు వారికి కష్టం రప్పించేవాడూ యెహోవాయే. యెహోవా ఆదేశాన్ని ప్రజలు మార్చజాలరు. యెహోవా లేచి దుష్టుల (యూదా) మీద పోరాడుతాడు. వారికి సహాయం చేయాలని ప్రయత్నించే వారి (ఈజిప్టు) మీద యెహోవా పోరాడుతాడు.
3 ఈజిప్టు ప్రజలు కేవలం మానవమాత్రులే, దేవుడు కారు. ఈజిప్టు గుర్రాలు కేవలం జంతువులే, ఆత్మలు కావు. యెహోవా తన హస్తం చాపగా, సహాయకుడు (ఈజిప్టు) ఓడించబడతాడు. సహాయం కోరిన ప్రజలు (యూదా) పతనం అవుతారు. ఆ మనుష్యులంతా ఒక్కుమ్మడిగా నాశనం చేయబడతారు.
4 “ఒక సింహంగాని, సింహపు పిల్లగాని తినటానికి ఒక జంతువును పట్టుకొంటే, ఆ సింహం, చచ్చిన జంతువు మీద నిలబడి గర్జిస్తుంది. ఆ సమయంలో ఆ గొప్ప సింహాన్ని ఏదీ భయపెట్టలేదు. మనుష్యులు వచ్చి, సింహం మీద కేకలు వేస్తే, సింహం భయపడదు. మనుష్యులు పెద్ద ధ్వని చేయవచ్చు కానీ సింహం మాత్రం పారిపోదు” అని యెహోవా నాతో చెప్పాడు.
అదే విధంగా సర్వశక్తిమంతుడైన యెహోవా సీయోను కొండమీద దిగివస్తాడు. ఆ కొండ మీద యెహోవా పోరాడతాడు. 5 పక్షులు వాటి గూళ్ల చుట్టూ ఎగిరినట్టు, సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేమును కాపాడుతాడు. యెహోవా దానిని రక్షిస్తాడు. యెహోవా “దానిపై దాటి”, యెరూషలేమును రక్షిస్తాడు.
6 ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని మీద తిరుగుబాటు చేశారు. మీరు తిరిగి దేవుని దగ్గరకు రావాలి. 7 మీరు తయారు చేసిన వెండి, బంగారు విగ్రహాలను ప్రజలు పూజించటం అప్పుడు మాని వేస్తారు. మీరు ఆ విగ్రహాలను తయారు చేసినప్పుడు మీరు నిజంగా పాపం చేసారు.
8 నిజమే, అష్షూరు ఖడ్గం చేత ఓడించబడుతుంది, కానీ ఆ ఖడ్గం మానవ ఖడ్గం కాదు. అష్షూరు ఓడించబడుతుంది. కానీ ఆ నాశనం మనిషి ఖడ్గం ద్వారా జరగదు. అష్షూరు దేవుని ఖడ్గం నుండి పారిపోతుంది. కానీ యువకులు పట్టుబడి, బానిసలవుతారు. 9 వారి భద్రతా స్థలం నాశనం చేయబడుతుంది. వారి నాయకులు ఓడించబడి, వారి పతాకాన్ని విడిచిపెడ్తారు.
ఆ విషయాలన్నీ యెహోవా చెప్పాడు. యెహోవా అగ్ని (బలిపీఠం) సీయోను మీద ఉంది. యెహోవా కొలిమి (బలిపీఠం) యెరూషలేములో ఉంది.
తొలి పలుకు
1 దేవుడు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు తెలియచేయుమని యేసు క్రీస్తుకు చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడైన యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియచేసాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. 2 యోహాను దేవుని సందేశాన్ని, యేసు క్రీస్తు చెప్పినదాన్ని దివ్య దర్శనంలో చూసాడు. అందులో చూసినవన్నీ చెప్పాడు. 3 ఈ దైవసందేశంలో ఉన్నవాటిని చదివేవాడు, వాటిని విని, వాటిలో వ్రాయబడినవాటిని ఆచరించేవాళ్ళు ధన్యులు. సమయం దగ్గరగానున్నది.
శుభాకాంక్షలు
4 యోహాను నుండి,
ఆసియ ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు,
భూత భవిష్యత్ వర్తమానకాలాల్లో ఉన్నవాడు, ఆయన సింహాసనం ముందున్న ఏడు ఆత్మలు మీకు తమ అనుగ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక! 5 మరియు, చనిపోయి బ్రతికింపబడిన వాళ్ళలో మొదటివాడు, నిజమైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసు క్రీస్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక!
ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన రక్తంతో మనల్ని మన పాపాలనుండి రక్షించాడు. 6 మనల్ని ఒక రాజ్యంగా స్థాపించాడు. మనము ఆయన తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకులుగా చేసాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగుగాక! ఆమేన్.
7 చూడు! ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవాళ్ళు[a] కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక! ఆమేన్.
8 భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును[b] నేనే” అని అన్నాడు.
9 నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. 10 ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. 11 అది నాతో, “నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది.
12 నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. 13 వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా[c] ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. 14 ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. 16 ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.
17 నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, “భయపడకు. ఆదిని, అంతాన్ని నేనే!” అని అన్నాడు. 18 నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి. 19 అందువల్ల యిప్పుడున్నవాటిని, ముందు జరుగబోయేవాటిని, నీవు చూసినవాటిని గురించి వ్రాయి. 20 నీవు నా కుడి చేతిలో చూసిన ఏడు నక్షత్రాల రహస్యము, ఏడు దీపస్తంభాల రహస్యము యిది. ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు చెందిన దూతలు, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.
© 1997 Bible League International