M’Cheyne Bible Reading Plan
ఇశ్రాయేలీయులు ఎడారిలో సంచారం చేయటం
2 “అప్పుడు మనం తిరిగి ఎర్రసముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణం చేసాము. మనం చేయవలెనని యెహోవా నాతో చెప్పింది అదే. చాలా రోజుల వరకు మనం శేయారు[a] కొండ దేశం గుండా వెళ్లాము. 2 అప్పుడు నాతో యెహోవా అన్నాడు: 3 ‘మీరు ఈ కొండ దేశంగుండా చాలా తిరిగారు. ఉత్తర దిశగా తిరగండి. 4 మరియు మీకు ఇలా చెప్పమని ఆయన నాతో చెప్పాడు: మీరు శేయీరు దేశం గుండా దాటిపోతారు. ఈ దేశం మీ బంధువులైన ఏశావు సంతతివారికి చెందినది. వారు మీకు భయపడతారు. చాలా జాగ్రతగా ఉండండి. 5 వారితో యుద్ధం చేయకండి. వారి దేశంలో ఏమాత్రం ఒక్క అడుగు కూడ నేను మీకు యివ్వను. ఎందుకంటే శేయీరు కొండ దేశాన్ని ఏశావుకు స్వంతంగా ఉండేందుకు నేను యిచ్చాను. 6 అక్కడ మీరు తినే భోజనానికిగాని, త్రాగే నీటికిగాని మీరు ఏశావు ప్రజలకు వెల చెల్లించాలి. 7 మీరు చేసిన ప్రతిదానిలోనూ మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మహా ఎడారిలో మీరు నడవటం ఆయనకు తెలుసు. ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు గనుక మీకు అవసరమైనవి అన్నీ ఎల్లప్పుడూ మీకు దొరికాయి’
8 “కనుక శేయీరులో నివసించే మన బంధువులైన ఏశావు ప్రజలను మనం దాటిపోయాము. ఎలాతు, ఎసియోను గెబరు పట్టణాల నుండి యొర్దాను వెళ్ళే మార్గాన్ని మనం విడిచిపెట్టాం. మనం మళ్లుకొని మోయాబు అరణ్యానికి పోయే మార్గం మీద వెళ్లాము.
ఆర్ వద్ద ఇశ్రాయేలీయులు
9 “యెహోవా నాతో చెప్పాడు: ‘మోయాబు ప్రజలను తొందర పెట్టవద్దు. వారితో యుద్ధం ప్రారంభించవద్దు, వారి దేశంలో ఏ మాత్రం భూమి నేను మీకు యివ్వను. వారు లోతు సంతతివారు,[b] ఆరు పట్టణాన్ని నేను వారికి యిచ్చాను.’”
10 ఇంతకు ముందు ఎమీము ప్రజలు ఆర్‌లో నివసించారు. వారు బలాఢ్యులు, వారు చాలమంది ఉన్నారు. అనాకీము[c] ప్రజల్లాగే వారు చాలా ఎత్తయినవాళ్లు. 11 అనాకీయుల్లాగే ఎమీము కూడ రెఫాయిము ప్రజల్లో ఒక భాగం అనిచెప్పబడింది. కానీ మోయాబీ ప్రజలు వారిని ఎమీయులు అని పిల్చారు. 12 హోరీ ప్రజలు కూడ ఇంతకు ముందు శేయీరులో నివసించారు, కానీ ఏశావు ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. హోరీయులను ఏశావు ప్రజలు నాశనం చేసారు. అప్పుడు హోరీయులు అంతకు ముందు నివసించిన చోట ఏశావు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా స్వంతంగా యిచ్చిన దేశంలోని ప్రజలకు ఇశ్రాయేలీయులు చేసినట్టు వారు అక్కడ ఉన్నవారికి చేసారు.
13 “యెహోవా నాతో చెప్పాడు: ‘ఇప్పుడు లేచి, జెరెదు వాగు దాటి వెళ్లండి.’ కనుక మనం జెరెదువాగు దాటివెళ్లాం. 14 మనం కాదెషు బర్నెయ విడిచి జెరెదు వాగు దాటునాటికి 38 సంవత్సరాలు అయింది. ఆ తరం యుద్ధ వీరులంతా చనిపోయారు. ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. 15 ఆ మనుష్యులు అందరూ గతించి పోయేవరకు యెహోవా వారికి విరోధంగానే ఉన్నాడు.
16 “యుద్ధ వీరులంతా చనిపోయి ప్రజల మధ్య లేకుండా గతించిపోయిన తర్వాత 17 యెహోవా నాతో ఇలా చెప్పాడు: 18 ‘ఈ వేళ మీరు సరిహద్దు ఆర్‌వద్ద దాటి మోయాబులోనికి వెళ్లాలి. 19 మీరు అమ్మోనీయులను సమీపించినప్పుడు వారిని తొందర పెట్టవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, ఎందుకంటే వారి దేశం నేను మీకు యివ్వను. ఎందుకంటే వారు లోతు సంతానం. వారు స్వంతంగా ఉంచుకొనేందుకు ఆ దేశాన్ని నేను వారికి యిచ్చాను.’”
20 (ఆ దేశం రెఫాయిము ప్రజల దేశం అనికూడ చెప్పబడింది. వారు అంతకు ముందు అక్కడ నివసించిన ప్రజలు. అమ్మోనీయులు వారిని “జంజుమ్మీలు” అని పిలిచేవాళ్లు. 21 జంజుమ్మీ ప్రజలు చాలా బలం గలవారు, వాళ్లు చాలామంది ఉన్నారు. అనాకీము ప్రజల్లా వారు చాలా ఎత్తయిన మనుషులు. కానీ జంజుమ్మీలను నాశనం చేసేందుకు యెహోవా అమోనీయులకు సహాయంచేశాడు. అమ్మోనీయులు జంజుమ్మీల దేశాన్ని స్వాధీనం చేసుకొని యిప్పుడు అక్కడ నివసిస్తున్నారు. 22 శేయీరులో నివసించే ఏశావు ప్రజలకు (ఎదోమీలు) దేవుడు అలాగే చేశాడు. వారు అక్కడ నివసించే హోరీయులను నాశనం చేశారు. ఇంతకు ముందు హోరీయులు నివసించిన చోట యిప్పడు ఏశావు ప్రజలు నివసిస్తున్నారు. 23 క్రేతు ప్రజలలో కొందరికి దేవుడు అలాగే చేశాడు. గాజా చుట్టు పక్కల పట్టణాల్లో ఆవీయ ప్రజలు నివసించారు. అయితే క్రేతునుండి కొందరు ప్రజలు వచ్చి ఆవీయ ప్రజలను నాశనం చేశారు. క్రేతునుండి వచ్చిన ఆ ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని, ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు.)
అమ్మోరీయులతో యుద్ధం
24 “యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘ప్రయాణానికి సిద్ధపడండి. అర్నోను నది లోయ దాటి వెళ్లండి. హెష్బోను రాజు. అమ్మోరీవాడగు సీహోను మీద నేను మీకు జయాన్నిస్తాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు నేను మీకు శక్తిని యిస్తున్నాను. కనుక అతనితో యుద్ధంచేసి, అతని దేశాన్ని స్వాధీనం చేనుకోవటం మొదలుపెట్టండి. 25 ప్రపంచంలోని ప్రజలంతా మీ విషయం భయపడేలా చేయటం నేను ఈ వేళ ప్రారంభిస్తాను. మిమ్మల్ని గూర్చిన సమాచారం వారు విని, భయంతో వణకిపోతారు. వారు మిమ్మల్ని గూర్చి తలచినప్పుడు భయంతో వణికిపోతారు.’
26 “కెదెమోతు అరణ్యంనుండి హెష్బోను రాజైన సీహోను దగ్గరకు నేను వార్తాహరులను పంపించాను. వారు సీహోనుకు శాంతి సమాచారం తెలిపి, వారు చెప్పారు: 27 ‘నీ దేశంగుండా మమ్మల్ని వెళ్లనివ్వు. మేము మార్గంలోనే నడచి వెళ్తాము. మార్గంనుండి కుడికిగాని, ఎడమకుగాని మేము తొలగము. 28 మేము తినే భోజనానికి, తాగే నీళ్లకు వెండి నీకు చెల్లిస్తాము. మేము నీ దేశంలోనుండి నడచి వెళ్తాము, అంతే. 29 మా దేవుడైన యెహోవా మాకు యిస్తున్న దెశంలో ప్రవేశించేందుకే మేము యొర్దాను నది దాటేంతవరకు మమ్మల్ని నీ దేశంలోనుంచి వెళ్ల నివ్వు. ఇతరులు, అంటే శేయీరులో నివసించే ఏశావు ప్రజలు, ఆర్‌లో నివసించే మోయాబు ప్రజలు వారి దేశం బైటగా మమ్మల్ని వెళ్లనిచ్చారు.’
30 “కానీ హెష్బోను రాజైన సీహోను తన దేశంలోంచి మమ్మల్ని పోనివ్వలేదు. మీ దేవుడైన యెహోవా అతణ్ణి చాలా మొండికెత్తేటట్టు చేసాడు. సీహోను రాజును మీ అధికారంక్రింద ఉండటానికే యెహోవా ఇలా చేసాడు. ఇప్పుడు ఆయన దీనిని జరిగించాడు.
31 “సీహోను రాజును, ‘అతని దేశాన్ని నేను మీకు యిస్తున్నాను. ఇప్పుడు దేశాన్ని స్వాధీనం చేసుకోండి’ అని యెహోవా నాకు చెప్పాడు.
32 “అప్పుడు యాహసు దగ్గర మాతో యుద్ధం చేయటానికి సీహోను రాజు, ఆతని ప్రజలందరు బయల్దేరి వచ్చారు. 33 అయితే మన యెహోవా దేవుడు అతణ్ణి మనకు అప్పగించాడు. అతణ్ణి, అతని కుమారులను, ఆతని ప్రజలందరిని మనం ఓడించాము. 34 అప్పట్లో సీహోను రాజుకు చెందిన పట్టణాలన్నింటినీ మనం పట్టుకొన్నాము. ప్రతి పట్టణంలో పురుషులను, స్త్రీలను, పిల్లలను ప్రజలందరినీ మనం పూర్తిగా నాశనం చేసాము. ఎవ్వరినీ మనం బతకనియ్యలేదు. 35 మనం పట్టుకొన్న పట్టణాల్లో పశువులను, విలువైన వస్తువులను మాత్రమే మనం తీసుకొన్నాము. 36 అర్నోను లోయ అంచులోని అరోయేరు పట్టణాన్ని, ఆ లోయ మధ్యలో ఉన్న మరో పట్టణాన్ని మనం ఓడించాము. అర్నోను లోయ, గిలాదుమధ్య ఉన్న పట్టాణాలన్నింటిని మనం ఓడించేటట్టు చేసాడు యెహోవా. ఏ పట్టణం కూడా మన యెదుట నిలువలేకపోయింది. 37 కానీ అమ్మోనీయుల దగ్గరకు కూడ మీరు వెళ్లలేదు. యబ్బోకు నదీ తీరాలకుగాని, కొండ దేశంలోని పట్టణాలకుగాని మీరు వెళ్లలేదు. మన దేవుడైన యెహోవా మనకు ఇవ్వని ఏ స్థలం దగ్గరకూ మీరు వెళ్లలేదు.”
ఆసాపు స్తుతి గీతం.
83 దేవా, మౌనంగా ఉండవద్దు!
నీ చెవులు మూసికోవద్దు!
దేవా, దయచేసి ఊరుకోవద్దు.
2 దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.
నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
3 నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.
నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
4 “ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.
అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.
5 దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతో చేసిన
ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ ప్రజలంతా ఏకమయ్యారు.
6-7 ఆ శత్రువులు మనకు విరోధంగా పోరాడేందుకు ఏకమయ్యారు. ఎదోము, ఇష్మాయేలు ప్రజలు; మోయాబు, హగ్రీ సంతతివారు;
గెబలువారు; అమ్మోను, అమాలేకీ ప్రజలు;
ఫిలిష్తీ ప్రజలు; తూరులో నివసించే ప్రజలంతా మనతో పోరాడుటకు ఏకమయ్యారు.
8 అష్షూరు సైన్యం లోతు వంశస్థులతో చేరి,
వారంతా నిజంగా బలముగలవారయ్యారు.
9 దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరాను,
యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.
10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు.
వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.
11 దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబుకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము.
జెబహు, సల్మున్నా అనేవారికి నీవు చేసిన వాటిని వారికి చేయుము.
12 దేవా, మేము నీ దేశం విడిచేందుకు
ఆ ప్రజలు మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు.
13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె[a] ఆ ప్రజలను చేయుము.
గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.
14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు
కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.
15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము.
సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.
16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము.
అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము.
వారిని అవమానించి, నాశనం చేయుము.
18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు.
నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు
అని వారు తెలుసుకొంటారు.
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన
84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
2 యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
3 సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
4 నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.
5 ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
వారు నిన్నే నడిపించ నిస్తారు.
6 దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
7 వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.
8 సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
యాకోబు దేవా, నా మాట వినుము.
9 దేవా, మా సంరక్షకుని కాపాడుము.
నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[b]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్మాలి, కాని ఈజిప్టును కాదు
30 యెహోవా చెప్పాడు, “ఈ పిల్లల్ని చూడండి. వాళ్లు నాకు లోబడరు. వాళ్లు పథకాలు వేస్తారు గాని సహాయం చేయమని నన్ను అడగరు. ఇతర దేశాలతో వారు ఒడంబడికలు చేసుకుంటారు. కానీ నా ఆత్మ ఆ ఒడంబడికలను కోరటంలేదు. ఈ ప్రజలు ఇంకా మరిన్ని పాపాలు వారికి చేర్చుకొంటున్నారు. 2 ఈ ప్రజలు సహాయం కోసం ఈజిప్టుకు దిగివెళ్తున్నారు కానీ చేయాల్సిన సరైన పని అదేనా అని వారు నన్ను అడగలేదు. ఫరోచేత తాము రక్షించబడతామని వారు నిరీక్షిస్తున్నారు. వాళ్లను ఈజిప్టు కాపాడాలని వారి కోరిక.
3 “అయితే నేను మీకు చెబుతున్నాను, ఈజిప్టులో దాగుకోవటం మీకేం సహాయపడదు. ఈజిప్టు మిమ్మల్ని కాపాడజాలదు. 4 మీ నాయకులు సోయనుకు వెళ్లారు, మీ రాయబారులు హానేసుకు వెళ్లారు. 5 కానీ వారు నిరాశ చెందుతారు. వారికి సహాయం చేయలేని దేశం మీద వారు ఆధారపడ్తున్నారు. ఈజిప్టు నిష్ప్రయోజనమయింది. ఈజిప్టు ఏ సహాయం చేయలేదు. ఈజిప్టు కేవలం సిగ్గు, అవమానం కలిగిస్తుంది.”
యూదాకు దేవుని సందేశం
6 నెగెవ్‌లో జంతువులను గూర్చి విచారకరమైన సందేశం:
నెగెవ్ ప్రమాదకరమైన స్థలం. ఈ దేశంనిండా సింహాలు, సివంగులు, తాపకరమైన త్రాచుపాములు ఉంటాయి. కానీ కొంతమంది ప్రజలు నెగెవ్‌గుండా ప్రయాణం చేస్తున్నారు. వారు ఈజిప్టు వెళ్తున్నారు. ఆ మనుష్యులు వారి ధనాన్ని గాడిదల మీద వేశారు. ఆ మనుష్యులు వారి సంపదలను ఒంటెల మీదవేశారు. అంటే ఆ ప్రజలు సహాయం చేయలేని రాజ్యంమీద ఆధారపడుతున్నారని దీని అర్థం. 7 ఈజిప్టు పనికిమాలిన దేశం, సహాయం శూన్యం. కనుక ఈజిప్టును, “ఏమీ చేయలేని మహా సర్పం” అని నేను పిలుస్తాను.
8 ఇప్పుడు, ప్రజలందరూ చూడగలిగేట్టు దీనిని ఒక పలక మీద వ్రాయి. దీనిని ఒక గ్రంథంలో వ్రాయి. చివరి దినాలకోసం దీనిని వ్రాయి. అది ఎప్పుడో భవిష్యత్తులో చాలాకాలం తర్వాత.
9 తల్లిదండ్రులకు విధేయులు కాని పిల్లల్లా ఉన్నారు ఈ ప్రజలు. వారు అబద్ధాలు చెప్పి, యెహోవా ఉపదేశాలు ఆలకించేందుకు నిరాకరిస్తారు. 10 వారు ప్రవక్తలతో చెబుతారు: “మేము చేయాల్సిన వాటిని గూర్చి దర్శనాలు చూడకండి. మాతో సత్యం చెప్పకండి. మాకు చక్కని విషయాలు చెప్పి, మాకు హాయి కలిగించండి. మాకోసం మంచి వాటినే చూడండి. 11 నిజంగానే జరిగే వాటిని చూడటం మానేయండి. మా దారిలోంచి తప్పుకోండి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని గూర్చి మాకు చెప్పటం చాలించండి.”
యూదా సహాయం కేవలం దేవుని నుంచి వస్తుంది
12 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు) చెబుతున్నాడు: “యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని అంగీకరించటానికి మీరు నిరాకరించారు. మీ సహాయం కోసం మీరు పోరాటం మీద, అబద్ధాల మీద ఆధారపడాలని కోరుకొంటున్నారు. 13 ఈ విషయాల్లో మీరు దోషులు గనుక మీరు బీటలు వారిన గోడల్లా ఉన్నారు. ఆ గోడ పడిపోయి చిన్న చిన్న ముక్కలైపోతుంది. 14 ఆ ముక్కలు పనికిమాలినవి. ఆ ముక్కలు మంటల్లోంచి ఒక నిప్పుకణం తెచ్చేందుకు పనికిరావు, చెరువులోంచి నీళ్లు తెచ్చేందుకు పనికిరావు.”
15 “మీరు తిరిగి నా దగ్గరకు వస్తే మీరు రక్షించబడుతారు. మీరు నన్ను విశ్వసిస్తే, మీకు ఉన్న ఒకే బలం మీకు వస్తుంది. అయితే మీరు మౌనంగా ఉండాలి” అంటున్నాడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, యెహోవా, నా ప్రభువు.
కానీ అలా చేయటం మీకు ఇష్టం లేదు. 16 మీరు “మేము ఎక్కి పారిపోయేందుకు మాకు గుర్రాలు అవసరం” అంటారు. అది నిజమే, మీరు గుర్రాల మీద పారిపోతారు. కానీ శత్రువు మిమ్మల్ని తరుముతాడు. మరియు మీ గుర్రాలకంటె మీ శత్రువు వేగం ఎక్కువ. 17 ఒక శత్రువు బెదిరిస్తే, మీ వాళ్లు వేయిమంది పారిపోతారు. శత్రువులు అయిదుగురు బెదిరిస్తే, మీరు మొత్తం వారినుండి పారిపోతారు. మీ సైన్యంలో మిగిలేదల్లా, ఏదో ఒక కొండమీద జెండా కర్ర మాత్రమే.
దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు
18 యెహోవా మీకు తన దయ చూపించాలని కోరుతున్నాడు. యెహోవా కనిపెడ్తున్నాడు. యెహోవా లేచి, మిమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాడు. యెహోవా దేవుడు న్యాయవంతుడు, యెహోవా సహాయం కోసం వేచి ఉండే ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడతాడు.
19 యెహోవా ప్రజలు సీయోను కొండమీద యెరూషలేములో నివసిస్తారు. మీరు ఏడుస్తూనే ఉండరు. యెహోవా మీ ఏడ్పువింటాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. యెహోవా మీ మొర వింటాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు.
20 గతంలో నా ప్రభువు (దేవుడు) మీకు దుఃఖం, విచారం ఇచ్చాడు. అది మీరు ప్రతిరోజూ రొట్టెతిన్నట్లు నీళ్లు తాగినట్టుగా ఉండేది. అయితే, దేవుడు మీ ఉపదేశకుడు, ఆయన ఇకమీదట మీనుండి దాగు కొని ఉండడు. మీ ఉపదేశకుని మీరు మీ కళ్లారా చూస్తారు. 21 అప్పుడు మీరు తప్పుచేసి, తప్పు మార్గంలో పోతే (కుడికి కావచ్చు, ఎడమకు కావచ్చు) “ఇదే సరైన మార్గం, మీరు ఇలా వెళ్లాలి” అని ఒక స్వరం మీ వెనుకనుండి చెప్పటం మీరు వింటారు.
22 వెండి బంగారాల పూత విగ్రహాలు మీకు ఉన్నాయి. ఆ తప్పుడు దేవుళ్లు మిమ్మల్ని మైల (పాప భూయిష్టం) చేశారు. కానీ ఆ తప్పుడు దేవుళ్లను కొలవటం మీరు చాలిస్తారు. పనికిమాలిన మైలగుడ్డల్లా ఆ దేవుళ్లను మీరు పారవేస్తారు.
23 ఆ కాలంలో యెహోవా మీకు వర్షం పంపిస్తాడు. భూమిలో మీరు విత్తనాలు నాటుతారు, భూమి మీకు పంట పండిస్తుంది. మీకు విస్తారమైన పంట లభిస్తుంది. మీ పశువులకు మీ పొలాల్లో విస్తారమైన మేత ఉంటుంది. మీ గొర్రెలకు విశాలమైన బీళ్లు ఉంటాయి. 24 మీ పశువులకు, గాడిదలకు కావలసినంత ఆహారం ఉంటుంది. ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీ పశువులు తినే మేతను పరచేందుకు మీరు చేటను, జల్లెడను ఉపయోగించాల్సి వస్తుంది. 25 ప్రతి పర్వతం, కొండపైన నీటి వాగులు నిండుగా ప్రవహిస్తాయి. అనేక మంది ప్రజలు మరణించిన తర్వాత గోపురాలు కూలగొట్టబడిన తర్వాత ఈ సంగతులు జరుగుతాయి.
26 ఆ సమయంలో చంద్రకాంతి సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది. సూర్యకాంతి ఇప్పటికంటె ఏడు రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక్కరోజు సూర్య కాంతి నిండు వారపు కాంతిలా ఉంటుంది. యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారు తిన్న దెబ్బల బాధను స్వస్థపరచిన తరువాత ఈ సంగతులు జరుగుతాయి.
27 చూడండి! చాలా దూరం నుండి యెహోవా పేరు వస్తోంది. ఆయన కోపం దట్టమైన పొగ మేఘాలతో కూడిన అగ్నిలా ఉంది. యెహోవా నోరు కోపంతో నిండి ఉంది, ఆయన నాలుక మండుతోన్న మంటలా ఉంది. 28 యెహోవా ఊపిరి (ఆత్మ) గొంతు వరకు పొంగిన మహా నదిలా ఉంది. యెహోవా రాజ్యాలకు తీర్పు తీరుస్తాడు. “నాశనం చేసే జల్లెడలో” ఆయన వారిని జల్లించినట్లు ఉంటుంది. యెహోవా వారిని అదుపులో ఉంచుతాడు. ఒక జంతువును అదుపులో ఉంచే కళ్లెం, మనుష్యుల దవడల్లో ఉంచినట్టుగా అది ఉంటుంది.
29 ఆ సమయంలో మీరు ఆనందగీతాలు పాడుతారు. ఆ సమయంలో మీరు ఒక పండుగ ప్రారంభించిన రాత్రిలా ఉంటుంది. యెహోవా పర్వతానికి నడిచేటప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు. ఇశ్రాయేలీయుల బండ యెహోవాను ఆరాధించేందుకు వెళ్లే మార్గంలో పిల్లనగ్రోవి వినేటప్పుడు మీరు ఎంతగానో సంతోషిస్తారు.
30 యెహోవా ప్రజలంతా తన మహా స్వరం ఆలకించేట్టు చేస్తాడు. యెహోవా తన శక్తిగల హస్తం కోపంగా దిగి రావటం ప్రజలంతా చూచేట్టుగా చేస్తాడు. ఆ హస్తం సమస్తం కాల్చివేసే మహా మంటలా ఉంటుంది, విస్తారమైన వడగండ్లు, వర్షంతో నిండిన గొప్ప తుఫానులా ఉంటుంది యెహోవా శక్తి. 31 అష్షూరు యెహోవా స్వరం విన్నప్పుడు భయపడుతాడు. యెహోవా అష్షూరును దండంతో కొడతాడు. 32 యెహోవా అష్షూరును కొడతాడు, అది డప్పుల మీద, సితార మీద సంగీతం వాయించినట్టుగా ఉంటుంది. యెహోవా తన గొప్ప హస్తంతో అష్షూరును ఓడిస్తాడు.
33 తోపెతు చాలాకాలంగా సిద్ధం చేయబడి ఉంది. అది రాజుకోసం సిద్ధంగా ఉంది. అది చాలా లోతుగా వెడల్పుగా చేయబడింది. అక్కడ చాలా పెద్దగా కట్టెలు పేర్చి ఉన్నాయి. అగ్ని ఉంది. మరియు యెహోవా ఊపిరి (ఆత్మ) అగ్ని గంధక ప్రవాహంలా వచ్చి, దానిని కాల్చివేస్తుంది.
1 యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయినటువంటి యూదా, తండ్రియైన దేవుని ద్వారా పిలువబడి, ప్రేమింపబడి, యేసు క్రీస్తులో భద్రం చేయబడినవారికి వ్రాయునదేమనగా:
2 దేవుని అనుగ్రహం, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా లభించునుగాక!
దుర్బోధకులు
3 ప్రియ మిత్రులారా! మనమందరము కలిసి పంచుకొంటున్న రక్షణను గురించి మీకు వ్రాయాలనిపించింది. కాని మరొక విషయాన్ని గురించి వ్రాయటం చాలా ముఖ్యమనిపిస్తోంది. అదేమిటంటే దేవుడు తన పవిత్రులకు అప్పగించిన సువార్తలో ఏ మార్పు రాకుండా మీరు పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 4 కొందరు దుర్బోధకులు మీలో రహస్యంగా చేరి ఉన్నారు. వీళ్ళు శిక్షింపదగినవాళ్ళని చాలా కాలం క్రిందటే లేఖనాల్లో వ్రాయబడింది. వీళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించువారు. వీళ్ళు దైవానుగ్రహాన్ని ఉపయోగించుకొంటూ అవినీతిగా జీవిస్తారు. వీళ్ళు మన ఏకైక ప్రభువు, పాలకుడు అయిన యేసు క్రీస్తును నిరాకరిస్తూ ఉంటారు.
5 మీకీ విషయాలన్నీ తెలుసు. అయినా కొన్ని విషయాలు జ్ఞాపకం చెయ్యాలని అనుకొంటున్నాను. ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉండిన తన ప్రజలకు, ప్రభువు స్వేచ్ఛ కలిగించాడు. కాని ఆ తర్వాత వాళ్ళలో విశ్వాసం లేని వాళ్ళను నాశనం చేసాడు. 6 తమ తమ స్థానాలను, అధికారాలను వదిలిన దేవదూతలను దేవుడు చిరకాలపు సంకెళ్ళతో అంధకారంలో బంధించి ఉంచాడు. చివరి రోజుదాకా అదేవిధంగా బంధించి ఉంచుతాడు. 7 సొదొమ, గొమొఱ్ఱా పట్టణాల ప్రజలు, వాటి పరిసర పట్టణాల్లోని ప్రజలు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక సహవాసాలకు లోనైపొయ్యారు. అందువల్ల వాళ్ళు శాశ్వతమైన మంటల్లో శిక్షననుభవించారు. తద్వారా ఈ సంఘటన కూడా ఇతరులకు నిదర్శనంగా నిలిచిపోయింది.
8 వాళ్ళలాగే కలలుగనే ఈ దుర్బోధకులు తమ శరీరాల్ని మలినం చేసికొంటూ, అధికారాన్ని ఎదిరిస్తూ, దేవదూతల్ని దూషిస్తూ ఉంటారు. 9 కాని ప్రధాన దేవదూత అయిన మిఖాయేలు కూడా తాను మోషే దేహం విషయంలో వాదించినప్పుడు సాతాన్ని నిందించలేదు. వాణ్ణి దూషించ లేదు. అతడంత ధైర్యం చెయ్యలేకపొయ్యాడు. సాతానుతో, “ప్రభువు నిన్ను గద్దిస్తాడు” అని మాత్రం అన్నాడు.
10 ఈ దుర్బోధకులు తమకర్థం కాని విషయాన్ని గురించి దూషిస్తూ మాట్లాడుతారు. తెలివిలేక లౌకికంగా అర్థం చేసికొంటారు. పశువుల్లా వీటి ద్వారా నశించిపోతారు. 11 వీళ్ళు కయీను మార్గాన్ని అనుసరించారు. లాభం కోసం బిలాము చేసిన తప్పునే చేసారు. కోరహు వలె తిరుగుబాటు చేసి అతనిలాగే నశించిపొయ్యారు. వీళ్ళకు శ్రమ కలుగుగాక!
12 వీళ్ళు మీరు చేసే సమాజ విందుల్లో ఏ మాత్రం సిగ్గు లేకుండా పాల్గొంటారు. తమ కడుపులు బాగా నింపుకొంటారు. గాలికి ఎగిరే నీళ్ళులేని మేఘాల్లాంటి, ఫలమివ్వని ఎండిన వృక్షంలాంటివాళ్ళు. వ్రేళ్ళు పెకిలింపబడి రెండు సార్లు చనిపోయిన వృక్షంలాంటివాళ్ళు. 13 అవమానమనే నురుగు కక్కే సముద్రపు కెరటాల్లాంటివాళ్ళు. ఆకాశంలో గతితప్పి తిరిగే నక్షత్రాల్లాంటివాళ్ళు. వారి కోసం దేవుడు గాఢాంధకారాన్ని శాశ్వతంగా దాచి ఉంచాడు.
14 ఆదాము తర్వాత ఏడవ వాడైన హనోకు వీళ్ళను గురించి ఈ విధంగా ప్రవచించాడు: “అదిగో! ప్రభువు వేలకొలది పరిశుద్ధులతో కలిసి వస్తున్నాడు. 15 వచ్చి అందరిపై తీర్పు చెపుతాడు. దుర్మార్గపు పనులు చేసే అవిశ్వాసుల్ని, తమకు వ్యతిరేకంగా చెడు మాట్లాడే పాపుల్ని శిక్షిస్తాడు.”
16 ఈ దుర్బోధకులు సణుగుతూ తప్పులెంచుతూ ఉంటారు. తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ, ప్రగల్భాలు చెప్పుకొంటూ తమ లాభం కోసం ఇతర్లను పొగుడుతూ ఉంటారు.
హెచ్చరికలు, ఉపదేశాలు.
17 కాని ప్రియ మిత్రులారా! మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలులు చెప్పిన ప్రవచనాల్ని జ్ఞాపకం ఉంచుకోండి. 18 “చివరి రోజుల్లో దేవుణ్ణి దూషించేవాళ్ళు తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ వస్తారు” అని అపొస్తలులు చెప్పారు. 19 వాళ్ళు ప్రస్తావించిన ఈ దుర్బోధకులే మిమ్మల్ని విడదీస్తారు. ఈ దుర్బోధకులు పశువుల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఉండదు.
20 కాని ప్రియ మిత్రులారా! మీలో ఉన్న విశ్వాసం అతి పవిత్రమైనది. దానితో మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి. పవిత్రాత్మ ద్వారా ప్రార్థించండి. 21 దేవుని ప్రేమను వదులుకోకండి. మీకు నిత్యజీవం ఇచ్చే మన యేసు క్రీస్తు ప్రభువు దయకొరకు కాచుకొని ఉండండి.
22 సంశయాలున్నవాళ్ళ పట్ల కనికరం చూపండి. 23 మంటల్లో పడబోయేవాళ్ళను బయటకు లాగి కాపాడండి. దుర్నీతిలో మలినమైన దుస్తుల్ని వేసుకొన్నవాళ్ళ పట్ల మీకు అసహ్యము, భయము కలిగినా, వాళ్ళ పట్ల కనికరం చూపండి.
24 క్రిందపడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడగలడు. మీలో ఏ లోపం లేకుండా చేసి తేజోవంతమైన తన సమక్షంలో నిలుపుకొని ఆనందాన్ని కలిగించగలడు. అలాంటి ఆయనకు, 25 మన రక్షకుడైనటువంటి ఏకైక దేవునికి, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా గొప్పతనము, తేజస్సు, శక్తి, అధికారము భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లభించుగాక! ఆమేన్.
© 1997 Bible League International