Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 34

కనాను—సరిహద్దులు

34 మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను దేశానికి వస్తున్నారు. ఈ దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు. దక్షిణాన ఎదోము దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు మొదలవుతుంది. అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటిపోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, అక్కడ్నుండి హసరద్దారు మళ్లీ అక్కడ్నుండి అస్మోను వరకు ఉంటుంది. అస్మోను నుండి ఈజిప్టు నది వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు ముగిస్తుంది. మీ పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ప్రారంభమై, హోరు కొండవరకు ఉంటుంది. (లెబానోనులో.) హోరు కొండ నుండి లెబోహమత్ వరకు, అక్కడ నుండి సెదాదు వరకు ఉంటుంది. తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్ దగ్గర అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు. 10 మీ తూర్ఫు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షెపాము వరకు వ్యాపిస్తుంది. 11 షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పుగా వ్యాపించి రిబ్లావరకు ఉంటుంది. కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) ప్రక్కగా కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది. 12 తర్వాత సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ దేశం చుట్టూ సరిహద్దులు.”

13 కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, మనష్షే వంశంలో సగం మంది కలసి చీట్లు వేసుకొని ఆ దేశాన్ని పంచుకోవాలి. 14 రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగంమంది ముందే వారి భూమిని తీసుకున్నారు. 15 ఆ రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.”

16 అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 17 “దేశాన్ని భాగాలు చేసేందుకు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ నీకు సహయపడతారు. వీరు 18 అన్ని వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు. 19 ఆ నాయకుల పేర్లు ఇవి:

యూదా వంశంనుండి – యెపున్నె కుమారుడు కాలేబు;

20 షిమ్యోను వంశంనుండి – అమ్మిహూదు కుమారుడు షెమూయేలు;

21 బెన్యామీను వంశంనుండి – కిస్లోను కుమారుడు ఎలీదాదు

22 దాను వంశంనుండి – యొగ్లి కుమారుడు బుక్కి

23 మనష్షే (యోసేపు కుమారుడు) వంశంనుండి

ఏఫోదు కుమారుడు హన్నీయేలు

24 ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశంనుండి – షిఫ్తాను కుమారుడు కెమూయేలు

25 జెబూలూను వంశంనుండి – పర్నాకు కుమారుడు ఎలీషాపాను

26 ఇశ్శాఖారు వంశంనుండి – అజాను కుమారుడు పల్తీయేలు

27 ఆషేరు వంశంనుండి – షెలోమి కుమారుడు అహీహోదు

28 నఫ్తాలి వంశంనుండి – అమ్మీహోదు కుమారుడు పెదహేలు.”

29 ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేందుకు ఆ మనుష్యులను యెహోవా ఏర్పరచుకొన్నాడు.

కీర్తనలు. 78:38-72

38 కాని దేవుడు దయకలిగినవాడు.
    వారి పాపాల విషయంలో ఆయన వారిని క్షమించాడు. ఆయన వారిని నాశనం చేయలేదు.
అనేకసార్లు దేవుడు తన కోపాన్ని అణచుకొన్నాడు.
    దేవుడు తనకు మరీ ఎక్కువ కోపాన్ని రానీయలేదు.
39 వారు కేవలం మనుష్య మాత్రులే అని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు.
    మనుష్యులు అప్పుడే వీచి, అంతలోనే మాయమై పోయే గాలి వంటివారు.
40 అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు.
    ఆ ఎడారి దేశంలో వారు ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు.
41 ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా పరీక్షించారు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధునికి నిజంగా వారు ఎంతో బాధ కలిగించారు.
42 ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు.
    శత్రువు బారినుండి దేవుడు తమని అనేకసార్లు రక్షించిన విషయం వారు మరచిపోయారు.
43 ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు.
    సోయను పొలాలలో జరిగిన అద్భుతాలను వారు మరచిపోయారు.
44 నదులను దేవుడు రక్తంగా మార్చాడు!
    ఈజిప్టువారు నీళ్లు త్రాగలేకపోయారు.
45 ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను దేవుడు పంపించాడు.
    ఈజిప్టువారి బ్రతుకులను పాడు చేయగలిగిన కప్పలను దేవుడు పంపించాడు.
46 దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్పగించాడు.
    వారి ఇతర మొక్కలను మిడతలకు అప్పగించాడు.
47 ఈజిప్టువారి ద్రాక్షాతీగెలను నాశనం చేయటానికి దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు.
    వారి చెట్లను నాశనం చేయుటకు ఆయన హిమమును వాడుకొన్నాడు.
48 దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను
    వారి పశువులను పిడుగుల చేతను చంపేశాడు.
49 దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టువారికి చూపించాడు.
    నాశనం చేసే తన దేవదూతలను వారికి విరోధంగా ఉండుటకు ఆయన పంపించాడు.
50 దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు.
    ఆ ప్రజలలో ఎవరినీ ఆయన బతకనివ్వలేదు.
    వారినందరినీ ఓ భయంకర రోగంతో ఆయన చావనిచ్చాడు.
51 ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపివేసాడు.
    హాము[a] సంతానంలో ప్రతి మొదటి బిడ్డనీ ఆయన చంపివేసాడు.
52 తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు.
    ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు.
53 ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు.
    దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు.
    వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు.
54 దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు.
    తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు.
55 ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు.
    దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు.
    అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు.
56 కాని ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు.
    ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు.
57 ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లుకొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మకస్తులుగాను ఉన్నారు.
    వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు.
58 ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు.
    దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు.
59 దేవుడు ఇది విని చాలా కోపగించాడు.
    మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు.
60 షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు.
    ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం.
61 అప్పుడు దేవుడు ఇతర రాజ్యాలు తన ప్రజలను బంధీలుగా చేయనిచ్చాడు.
    దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు.
62 తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు.
    ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు.
63 యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు.
    పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు.
64 యాజకులు చంపివేయబడ్డారు.
    కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు.
65 త్రాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె,
    నిద్రనుండి మేల్కొన్న మనిషివలె ప్రభువు లేచాడు.
66 దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు.
    దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు.
67 కాని యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు.
    ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు.
68 దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు.
    మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు.
69 ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు.
    భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు.
70 తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు.
    దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కాని దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు.
71 గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి,
    తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు.
72 మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.
    అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.

యెషయా 26

దేవునికొక స్తుతి గీతం

26 ఆ సమయమందు యూదాలో ప్రజలు ఈ పాటలు పాడుతారు:

యెహోవా మాకు రక్షణనిస్తాడు మాకు ఒక బలమైన పట్టణం ఉంది.
    మా పట్టణానికి బలమైన గోడలు, భద్రత ఉన్నాయి.
తలుపులు తెరవండి, మంచివాళ్లు ప్రవేశిస్తారు.
    ఆ ప్రజలు దేవుని యొక్క మంచి జీవన విధానాన్ని అవలంబిస్తారు.
యెహోవా, నీవే నిజమైన శాంతి ప్రసాదిస్తావు
    నీ మీద ఆధారపడే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు.
    నీయందు విశ్వాసముంచే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు.

కనుక ఎల్లప్పుడు యెహోవాను విశ్వసించాలి.
    నీవు యెహోవాను నిజంగా శాశ్వతంగా విశ్వసించాలి.
అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేస్తాడు.
    అక్కడ నివసించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు.
ఆ ఎత్తయిన పట్టణాన్ని నేలమట్టానికి ఆయన పడద్రోస్తాడు
    అది ధూళిలో పడిపోతుంది.
అప్పుడు పేదలు, దీనులైన ప్రజలు ఆ శిథిలాల మీద నడుస్తారు.

మంచి వాళ్లకు నిజాయితీయే జీవన విధానం
    మంచి మనుష్యులు సూటి సత్య మార్గం అవలంబిస్తారు.
మరియు దేవా, ఆ మార్గాన్ని అనుసరించటానికి
    దానిని నీవు తేలికగా మృదువుగా చేస్తావు.
కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం.
    నిన్ను, నీ నామాన్ని మా ఆత్మలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాయి.
నా ఆత్మ రాత్రిపూట నీతో ఉండాలని ఆశిస్తుంది.
    ప్రతి నూతన దినపు సంధ్యా సమయంలో నీతో ఉండాలని నా ఆత్మ నాలో కోరుతుంది.
దేశంలోనికి నీ న్యాయ మార్గం వచ్చినప్పుడు
    ప్రజలు సరైన జీవన విధానం నేర్చుకొంటారు.
10 చెడ్డవాడికి నీవు దయ మాత్రమే చూపిస్తే
    వాడు మంచి చేయటం నేర్చుకోడు.
చెడ్డవాడు మంచి ప్రపంచంలో జీవించినప్పటికీ వాడు చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు.
    ఆ చెడ్డ వ్యక్తి యెహోవా గొప్ప తనాన్ని ఎప్పటికీ చూడకపోవచ్చు.
11 కానీ, యెహోవా, అలాంటి ప్రజలను నీవు శిక్షిస్తే
    వారు దానిని చూస్తారు.
యెహోవా నీ ప్రజల మీద నీకు ఉన్న బలమైన ప్రేమను నీవు చెడ్డ మనుష్యులకు చూపించు.
    అప్పుడు చెడ్డవాళ్లు సిగ్గుపడతారు.
    నీ శత్రువులు నీ స్వంత అగ్నిలో కాలిపోతారు.
12 యెహోవా, మేము చేయాలని ప్రయత్నించిన వాటన్నింటినీ చేయటంలో నీదే విజయం.
    కనుక మాకు శాంతి ప్రసాదించు.

తన ప్రజలకు దేవుడు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు

13 యెహోవా, నీవే మా దేవుడివి. అయితే గతంలో మేము ఇతర ప్రభువులను అనుసరించాం.
మేము ఇతర యజమానులకు చెందిన వాళ్లం
    కానీ ప్రజలు ఇప్పుడు ఒకే ఒక్క పేరు, నీపేరు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతున్నాం.
14 ఆ అబద్ధ దేవుళ్లు జీవం లేనివి
    ఆ దయ్యాలు మరణం నుండి మళ్లీ లేవవు
నీవు వాటిని నాశనం చేయాలని నిర్ణయించావు.
    మేము వాటిని జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసే వాటన్నింటినీ నీవు నాశనం చేశావు.
15 నీవు ప్రేమించే దేశానికి నీవు సహాయం చేశావు
    ఇతరులు ఆ దేశాన్ని జయించకుండ నీవు నిలిపివేశావు.
16 యెహోవా, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు
    నిన్ను జ్ఞాపకం చేసుకొంటారు.
నీవు ప్రజలను శిక్షించినప్పుడు
    వారు మౌన ప్రార్థనలు నీకు చేస్తారు.
17 యెహోవా, మేం నీతో లేనప్పుడు
    మేం ప్రసవవేదన పడుతున్న స్త్రీలా ఉంటాం
    ఆమె ఏడుస్తుంది, ప్రసవ బాధ పడుతుంది.
18 అదే విధంగా మాకు బాధ ఉంది
    మేము కంటాము, కాని, గాలిని మాత్రమే.
ప్రపంచానికి మేం క్రొత్త మనుష్యుల్ని తయారు చేయం.
    దేశానికి మేం రక్షణ కలిగించం
19 కాని యెహోవా చెప్పేదేమంటే,
“నీ ప్రజలు మరణించారు
    కానీ వారు మళ్లీ లేస్తారు
నా ప్రజల శరీరాలు
    మరణం నుండి లేస్తాయి.
భూమిలోని మృతులు లేచి,
    సంతోషిస్తారు.
నిన్ను కప్పియున్న మంచు,
    ఒక క్రొత్త రోజు వెలుతురులా ఉంది.
ఒక క్రొత్త కాలం వస్తోందని అది సూచిస్తుంది
    ప్రజలు ఇప్పుడు భూమిలో పాతిపెట్ట బడ్డారు, కాని వారు నూతన జీవం పొందుతారు.”

తీర్పు: బహుమానం లేక శిక్ష

20 నా ప్రజలారా, మీ గదుల్లోకి వెళ్లండి.
    తలుపులకు తాళాలు వేసుకోండి.
కొద్దికాలం పాటు మీ గదుల్లో దాక్కోండి.
    దేవుని కోపం తగ్గేంతవరకు దాక్కోండి.
21 యెహోవా తన నివాసం విడిచి వస్తున్నాడు.
    ప్రపంచంలోని మనుష్యులు చేసిన చెడు కార్యాలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు.
చంపబడిన వారి రక్తాన్ని భూమి చూపిస్తుంది
    భూమి ఇక ఎన్నటికీ చనిపోయిన వాళ్లను కప్పెట్టదు.

1 యోహాను 4

ఆత్మల్ని పరిశీలించండి

ప్రియ మిత్రులారా! అన్ని ఆత్మల్ని నమ్మకండి. ఆ ఆత్మలు దేవునినుండి వచ్చాయా అన్న విషయాన్ని పరిశీలించండి. ఎందుకంటే, మోసం చేసే ప్రవక్తలు చాలామంది ఈ ప్రపంచంలోకి వచ్చారు. యేసు క్రీస్తు దేవునినుండి శరీరంతో వచ్చాడని అంగీకరించిన ప్రతీ ఆత్మ దేవునికి చెందినదని దేవుని ఆత్మద్వారా మీరు గ్రహించాలి. యేసును అంగీకరించని ప్రతి ఆత్మ దేవునినుండి రాలేదన్నమాట. అలాంటి ఆత్మ క్రీస్తు విరోధికి చెందింది. ఆ ఆత్మలు రానున్నట్లు మీరు విన్నారు. అవి అప్పుడే ప్రపంచంలోకి వచ్చాయి.

బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళకన్నా గొప్పవాడు. క్రీస్తు విరోధులు ప్రపంచానికి చెందినవాళ్ళు. అందువల్ల వాళ్ళు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతారు. ప్రపంచం వాళ్ళ మాటలు వింటుంది. మనం దేవునికి చెందిన వాళ్ళం. అందువల్ల దేవుణ్ణి తెలుసుకొన్నవాడు మన మాటలు వింటాడు. కాని దేవునికి చెందనివాడు మన మాటలు వినడు. దీన్నిబట్టి మనము ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో తెలుసుకోగలుగుతాము.

దేవుడు ప్రేమా స్వరూపుడు

ప్రియ మిత్రులారా! ప్రేమ దేవునినుండి వస్తుంది. కనుక మనం పరస్పరం ప్రేమతో ఉందాం. ప్రేమించే వ్యక్తి దేవుని వలన జన్మిస్తాడు. అతనికి దేవుడు తెలుసు. దేవుడు ప్రేమస్వరూపం గలవాడు. ప్రేమలేనివానికి దేవుడెవరో తెలియదు. మనం కుమారునిద్వారా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపి తన ప్రేమను మనకు వెల్లడి చేసాడు. 10 మనం ఆయన్ని ప్రేమిస్తున్నందుకు ఆయన ఈ పని చెయ్యలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, మన ప్రాయశ్చిత్తానికి బలిగా తన కుమారుణ్ణి పంపాడు. ఇదే ప్రేమ.

11 ప్రియ మిత్రులారా! దేవుడు మనల్ని యింతగా ప్రేమించాడు కనుక మనం కూడా పరస్పరం ప్రేమతో ఉండాలి. 12 దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. మనం పరస్పరం ప్రేమతో ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణత చెందుతుంది.

13 ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. తద్వారా మనము ఆయనలో జీవిస్తున్నామని, ఆయన మనలో జీవిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాము. 14 దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచాన్ని రక్షించటానికి పంపాడు. ఆయన్ని మేము చూసాము, కాబట్టి సాక్ష్యం చెపుతున్నాము. 15 యేసు దేవుని కుమారుడని అంగీకరించినవానిలో దేవుడు నివసిస్తాడు. దేవునిలో వాడు నివసిస్తున్నాడు. 16 దేవునికి మనపట్ల ప్రేమ ఉందని మనం నమ్ముతున్నాము. ఆ ప్రేమ మనకు తెలుసు.

దేవుడే ప్రేమ. ప్రేమలో జీవించేవాడు దేవునిలో జీవిస్తాడు. దేవుడు అతనిలో జీవిస్తాడు. 17 తీర్పు చెప్పేరోజు మనం ధైర్యంతో ఉండాలని మన మధ్యనున్న ప్రేమ పరిపూర్ణం చెయ్యబడింది. ఎందుకంటే, మనమీ ప్రపంచంలో ఆయనవలె జీవిస్తున్నాము. 18 ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణత పొందిన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే, భయం శిక్షకు సంబంధించింది. భయపడే వ్యక్తి ప్రేమలో పరిపూర్ణత పొందలేడు.

19 దేవుడు మనల్ని ప్రేమించినందుకు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. 20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని అంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు అసత్యమాడుతున్నాడన్న మాట. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించలేనివాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించ లేడు. 21 దేవుడు మనకీ ఆజ్ఞనిచ్చాడు: నన్ను ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International