Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 33

ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి వెళ్లిపోవుట

33 మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలను వంశాలవారీగా ఈజిప్టునుండి బయటకు నడిపించారు. వారు ప్రయాణం చేసిన స్థలాలు ఇవి. ఆ ప్రయాణాలను గూర్చి మోషే ఇలా వ్రాశాడు. యెహోవా కోరిన విషయాలను మోషే వ్రాశాడు. ఆ ప్రదేశాలు ఇవి:

మొదటి నెల 15వ తేదిన వారు రామెసేసు నుండి బయల్దేరారు. పస్కా మరునాటి ఉదయం ఇశ్రాయేలు ప్రజలు జయనినాదాలు చేస్తూ ఈజిప్టునుండి బయటకు వచ్చారు. ఈజిప్టు ప్రజలంతా వారిని చూశారు. యెహోవా చంపిన తమ వారందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూఉన్నారు. తమ పెద్ద కుమారులందరినీ వారు పాతిపెడ్తూ ఉన్నారు. ఈజిప్టు దేవతల మీద యెహోవా తన తీర్పు తీర్చాడు.

ఇశ్రాయేలు ప్రజలు రామెసేసును విడిచి సుక్కోతుకు ప్రయాణం చేసారు. సుక్కోతు నుండి వారు ఏతాముకు ప్రయాణం చేసారు. అక్కడ అరణ్య శివార్లలో ప్రజలు నివాసం చేసారు. వారు ఏతాము విడిచి పీహహీరోతు వెళ్లారు. ఇది బయల్సెఫోను దగ్గర ఉంది. మిగ్దోలు దగ్గర ప్రజలు నివాసం చేసారు.

ప్రజలు సీహహీరోతు విడిచి, సముద్రం మధ్య నుంచి నడిచారు. వారు అరణ్యంవైపు వెళ్లారు. అప్పుడు వారు ఏతాము అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసారు. మారా దగ్గర ప్రజలు నివాసం చేసారు.

ప్రజలు మారాను విడిచి ఏలీము వెళ్లి అక్కడ నివాసం చేసారు. అక్కడ 12 నీటి ఊటలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. 10 ప్రజలు ఏలీము విడిచిపోయి ఎర్ర సముద్రం దగ్గర నివాసం చేసారు.

11 ప్రజలు ఎర్ర సముద్రం విడిచిపోయి సీను అరణ్యంలో నివాసంచేసారు.

12 ప్రజలు సీను అరణ్యం విడిచి వెళ్లి దోపకాలో నివాసం చేసారు.

13 ప్రజలు దోపకా విడిచి వెళ్లి ఆలూషులో నివాసం చేసారు.

14 ప్రజలు ఆలూషు విడిచి వెళ్లి, రెఫీదీములో నివాసం చేసారు. ఆ స్థలంలోనే ప్రజలు తాగేందుకు నీరు దొరకలేదు.

15 ప్రజలు రెఫీదీము విడిచివెళ్లి, సీనాయి అరణ్యంలో నివాసం చేసారు.

16 ప్రజలు సీనాయి అరణ్యం విడిచివెళ్లి, కిబ్రోతు హత్తావాలో నివాసం చేసారు.

17 ప్రజలు కిబ్రోతు హత్తావా విడిచివెళ్లి హజేరోతులో నివాసం చేసారు.

18 ప్రజలు హజేరోతు విడిచివెళ్లి, రిత్మాలో నివాసం చేసారు.

19 ప్రజలు రిత్మా విడిచివెళ్లి రిమ్మోను పారెసులో నివాసం చేసారు.

20 ప్రజలు రిమ్మోను పారెసు విడిచివెళ్లి, లిబ్నాలో నివాసం చేసారు.

21 ప్రజలు లిబ్నా విడిచివెళ్లి రీసాలో నివాసం చేసారు.

22 ప్రజలు రీసా విడిచి వెళ్లి కెహెలాతాలో నివాసం చేసారు.

23 ప్రజలు కెహేలాతా విడిచివెళ్లి షాపెరు కొండ దగ్గర నివాసం చేసారు.

24 ప్రజలు షాపెరు కొండ విడిచివెళ్లి హరాదాలో నివాసం చేసారు.

25 ప్రజలు హరాదా విడిచివెళ్లి మకెలోతులో నివాసం చేసారు.

26 ప్రజలు మకెలోతు విడిచివెళ్లి తాహతులో నివాసం చేసారు.

27 ప్రజలు తాహతు విడిచివెళ్లి తారహులో నివాసం చేసారు.

28 ప్రజలు తారహు విడిచివెళ్లి మిత్కాలో నివాసం చేసారు.

29 ప్రజలు మిత్కా విడిచివెళ్లి హష్మోనాలో నివాసం చేసారు.

30 ప్రజలు హష్మోనా విడిచివెళ్లి మొసెరోతులో నివాసం చేసారు.

31 ప్రజలు మొసేరోతు విడిచివెళ్లి బెనే యాకానులో నివాసం చేసారు.

32 ప్రజలు బెనేయాకాను విడిచివెళ్లి హోర్ హగ్గిద్గాదులో నివాసం చేసారు.

33 ప్రజలు హోర్ హగ్గిద్గాదు విడిచివెళ్లి యొత్బాతాలో నివాసం చేసారు.

34 ప్రజలు యొత్బాతా విడిచివెళ్లి ఎబ్రోనాలో నివాసం చేసారు.

35 ప్రజలు ఎబ్రోనా విడిచివెళ్లి ఎసోన్గెబెరులో నివాసం చేసారు.

36 ప్రజలు ఎసోన్గెబెరు విడిచివెళ్లి సీను అరణ్యంలోని కాదేషులో నివాసం చేసారు.

37 ప్రజలు కాదేషు విడిచి వెళ్లి హోరులో నివాసం చేసారు. ఇది ఎదోము సరిహద్దు దగ్గర కొండ. 38 యాజకుడు అహరోను యెహోవా మాటకు విధేయుడై హోరు కొండ మీదికి వెళ్లాడు. ఆ స్థలంలోనే అహరోను మరణించాడు. ఐదో నెల మొదటి రోజున అహరోను చనిపోయాడు. అది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన 40 వ సంవత్సరం. 39 అహరోను హోరు కొండ మీద చనిపోయినప్పుడు అతని వయస్సు 123 సంవత్సరాలు. కనాను దేశంలోని నెగెవు ప్రాంతంలో అరాదు ఒక పట్టణం.

40 ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారని అక్కడ వున్న కనానీ రాజు విన్నాడు. 41 ప్రజలు హోరు కొండ విడిచి సల్మానాలో నివాసం చేసారు.

42 ప్రజలు సల్మానా విడిచివెళ్లి పూనొనులో నివాసం చేసారు.

43 ప్రజలు పూనొను విడిచివెళ్లి ఓబోతులో నివాసం చేసారు.

44 ప్రజలు ఓబోతు విడిచివెళ్లి ఈయ్యె అబారీములో నివాసం చేసారు. ఇది మోయాబు దేశ సరిహద్దులో ఉంది.

45 ప్రజలు ఈయ్యె అబారీము విడిచివెళ్లి దీబోను గాదులో నివాసం చేసారు.

46 ప్రజలు దీబోను గాదు విడిచివెళ్లి అల్మోను దిబ్లాతాయిములో నివాసం చేసారు.

47 ప్రజలు అల్మోను దిబ్లాతాయిము విడిచివెళ్లి నెబో దగ్గర అబారీము కొండల మీద నివాసం చేసారు.

48 ప్రజలు అబారీము కొండలు విడిచి వెళ్లి యొర్దాను నది దగ్గర అర్బత్ మోయాబులో నివాసం చేసారు. ఇది యెరికో దగ్గర, యొర్దానుకు సమీపంలో వారు నివాసం చేసారు. 49 బెత్యేషిమోతు నుండి తుమ్మ పొలంవరకు వారి నివాసం ఆక్రమించుకొంది. ఇది అర్బత్ మోయాబు అనే చోట ఉంది.

50 అర్బత్ మోయాబు వద్ద మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన అన్నాడు: 51 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. వారితో ఈ విషయాలు చెప్పు: మీరు యొర్దాను నది దాటుతారు. కనాను దేశంలోనికి మీరు వెళతారు. 52 అక్కడ మీరు చూసే మనుష్యుల దగ్గరనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. చెక్కబడిన వారి ప్రతిమలను విగ్రహాలను అన్నింటినీ మీరు నాశనం చేయాలి. వారి ఉన్నత స్థలాలు అన్నింటినీ మీరు నాశనం చేయాలి. 53 ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొని, మీరు అక్కడ స్థిరపడతారు. ఎందుకనగా ఈ దేశాన్ని నేనే మీకు ఇస్తున్నాను. అది మీ కుటుంబాలకు చెందుతుంది. 54 మీ కుటుంబాలు ప్రతి ఒక్కదానికీ ఆ దేశంలో భాగం ఉంటుంది. దేశంలోని ఒక్కోభాగం ఏ కుటుంబానికి వస్తుందో తెలుసుకొనేందుకు మీరు చీట్లు వేయాలి. పెద్ద కుటుంబాలకు ఆ దేశంలో పెద్ద భాగం ఇవ్వాలి. చిన్న కుటుంబాలకు ఆ దేశంలో చిన్న భాగం ఇవ్వాలి. చీట్లు చేసిన నిర్ణయం ప్రకారమే ప్రజలకు భూమి ఇవ్వబడుతుంది. ప్రతి వంశానికి తమ వంతు భూమి ఇవ్వబడుతుంది.

55 “ఆ ఇతర మనుష్యులు దేశాన్ని వదలి పోయేటట్టుగా మీరు చేయాలి. ఆ ప్రజలను మీరు దేశంలో ఉండనిస్తే, వారు మీకు ఎన్నో కష్టాలు కలిగిస్తారు. వారు మీ కళ్లలో పొడుచుకొనే ముళ్లలా, పక్కలో ముళ్లుగాను ఉంటారు. మీరు నివసించబోయే దేశానికి వారు చాల కష్టాలు తెస్తారు. 56 నేను వారికి ఏమి చేస్తానో మీకు చూపించాను. ఆ ప్రజలను మీ దేశంలో గనుక మీరు ఉండనిస్తే దానినే నేను మీకు కూడా చేస్తాను.”

కీర్తనలు. 78:1-37

ఆసాపు ధ్యాన గీతం.

78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
    నేను చెప్పే విషయాలు వినండి.
ఈ కథ మీతో చెబుతాను.
    ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
    మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
ఈ కథను మనము మరచిపోము.
    మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
    ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.
యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు.
    దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
    మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు.
    మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు.
ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మశాస్త్రాన్ని తెలుసుకొంటారు.
    క్రొత్త తరాలు పుడతాయి. వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబుతారు.
కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు.
    దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు.
    వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.
ఒక వేళ ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు ఉపదేశిస్తే,
    అప్పుడు ఆ పిల్లలు తమ పూర్వీకుల్లా ఉండరు. వారి పూర్వీకులు దేవునికి విరోధంగా తిరిగారు.
వారు ఆయనకు విధేయులగుటకు తిరస్కరించారు.
    ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలో వారు మొండి ప్రజలు.

ఎఫ్రాయిము కుటుంబ దళంలోని పురుషులు వారి విసురు కర్రలు[a] కలిగి ఉన్నారు.
    కాని వారు యుద్ధంలో నుండి పారిపోయారు.
10 వారు యెహోవాతో తమ ఒడంబడికను నిలుపుకోలేదు.
    దేవుని ఉపదేశాలకు విధేయులగుటకు వారు నిరాకరించారు.
11 ఎఫ్రాయిముకు చెందిన ఆ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరచిపోయారు.
    ఆయన వారికి చూపించిన అద్భుతకార్యాలను వారు మరిచిపోయారు.
12 ఈజిప్టులోను, సోయను వద్దను
    దేవుడు తన మహాశక్తిని వారి తండ్రులకు చూపెట్టాడు.
13 దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు.
    వారికి రెండు వైపులా నీళ్లు బలమైన గోడల్లా నిలబడ్డాయి.
14 ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
    ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు.
15 అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు.
    భూమి అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు.
16 బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు.
    అది ఒక నదిలా ఉంది.
17 కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే పోయారు.
    అరణ్యంలో కూడ సర్వోన్నతుడైన దేవునికి వారు విరోధంగా తిరిగారు.
18 అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మానించారు.
    కేవలం వారి ఆకలిని తృప్తి పరచుటకు ఆహారం కోసం వారు దేవుని ఆడిగారు.
19 వారు దేవునికి విరోధంగా మాట్లాడారు.
    “ఎడారిలో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా?
20 దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం బయటకు వచ్చింది.
    తప్పక ఆయన మనకు కొంత రొట్టె, మాంసం ఇవ్వగలడు” అని వారన్నారు.
21 ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు.
    యాకోబు[b] మీద దేవునికి చాలా కోపం వచ్చింది.
ఇశ్రాయేలు మీద దేవునికి చాల కోపం వచ్చింది.
22     ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మకముంచలేదు.
దేవుడు వారిని రక్షించగలడని వారు విశ్వసించలేదు.
23-24 కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు.
    వారికి ఆహారంగా ఆయన మన్నాను కురిపించాడు.
అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు
    ఆకాశంలోని ధాన్యాగారంనుండి ధాన్యం పోసినట్టు ఉంది.
25 ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు.
    ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు.
26-27 అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచేలా చేశాడు.
వర్షం కురిసినట్లుగా పూరేళ్లు[c] వారిమీద వచ్చి పడ్డాయి.
    దేవుని మహా శక్తి తేమాను నుండి గాలి వీచేలా చేసింది.
    ఆ పక్షులు చాలా విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారిపోయింది.
28 ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో
    ఆ పక్షులు వచ్చి పడ్డాయి.
29 తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది.
    కాని తమ ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు.
30 వారు వారి ఆకలిని అదుపులో పెట్టుకోలేదు.
    అందుచేత ఆ పక్షుల రక్తం కార్చివేయక ముందే వారు ఆ పూరేళ్లను తినివేసారు.
31 ఆ ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది. వారిలో అనేక మందిని ఆయన చంపివేసాడు.
    ఆరోగ్యవంతులైన అనేకమంది పడుచువాళ్లు చచ్చేటట్టుగా దేవుడు చేశాడు.
32 కాని ఆ ప్రజలు యింకా పాపం చేశారు.
    దేవుడు చేయగల ఆశ్చర్యకరమైన విషయాల మీద వారు ఆధారపడలేదు.
33 కనుక దేవుడు వారి పనికిమాలిన జీవితాలను
    ఏదో విపత్తుతో అంతం చేశాడు.
34 దేవుడు వారిలో కొందరిని చంపినప్పుడల్లా మిగిలినవారు ఆయన వైపుకు మళ్లుకొన్నారు.
    వారు పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు.
35 దేవుడే తమ బండ అని ఆ ప్రజలు జ్ఞాపకం చేసుకొన్నారు.
    సర్వోన్నతుడైన దేవుడే తమని రక్షించాడని వారు జ్ఞాపకం చేసుకొన్నారు.
36 వారు ఆయన్ని ప్రేమిస్తున్నామని అన్నారు,
    కాని వారి మాట నిజంకాదు. వారు అబద్ధం చెప్పారు.
37 వారి హృదయాలు నిజంగా దేవునితో లేవు.
    వారు ఒడంబడికకు నమ్మకంగా లేరు.

యెషయా 25

దేవునికి స్తుతి గీతం

25 యెహోవా, నీవు నా దేవుడివి
నిన్ను నేను ఘనపరుస్తాను, నీ నామం స్తుతిస్తాను.
    అద్భుతమైన కార్యాలు నీవు చేసావు.
చాలాకాలం క్రిందట నీవు చెప్పిన మాటలు పూర్తిగా సత్యము.
    నీవు జరుగుతుందని చెప్పినట్టు సమస్తం జరిగింది.
పట్టణాన్ని నీవు నాశనం చేసావు. అది బలీయమైన కోటగోడలతో కాపాడబడ్డ పట్టణం.
    కానీ ఇప్పుడు అది ఒక రాళ్లకుప్ప మాత్రమే
విదేశీ భవనం నాశనం చేయబడింది.
    అది ఎన్నటికీ కట్టబడదు.
బలమైన రాజ్యాల ప్రజలు నిన్ను ఘనపరుస్తారు.
    బలమైన పట్టణాల బలాఢ్యులు నీకు భయపడతారు.
యెహోవా, అక్కరలో ఉన్న పేద ప్రజలకు నీవు క్షేమ స్థానంగా ఉన్నావు.
    అనేక సమస్యలు ఈ ప్రజల్ని ఓడించటం మొదలు పెట్టాయి. కానీ నీవు వారిని కాపాడుతావు.
    యెహోవా, నీవు వరదలనుండి, వేడి నుండి ప్రజలను కాపాడే గృహంలా ఉన్నావు.
కష్టాలు భయంకర గాలుల్లో, వర్షంలా ఉన్నాయి. వాన గోడమీద పడి జారి పోతుంది,
    కాని ఇంట్లో ఉన్న మనుష్యులకు దెబ్బ తగలదు.
శత్రువులు కేకలు వేసి శబ్దం చేస్తారు. భయంకర శత్రువులు సవాళ్లు విసరుతారు.
    అయితే దేవా, నీవు వారిని ఆపుజేస్తావు. వేడి, పొడి కాలంలో వేడి భూమిని నిస్సారం చేస్తుంది.
అదే విధంగా నీవు శత్రువులకంటె బలం ఉన్నవాడివి దట్టమైన మేఘాలు వేసవి వేడిని ఆపుజేస్తాయి.
    అదే విధంగా, భయంకర శత్రువుల కేకలు నీవు ఆపుజేస్తావు.

తన సేవకులకు, దేవుని విందు

ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలందరికీ ఈ కొండ మీద విందు చేస్తాడు. ఆ విందులో శ్రేష్ఠమైన భోజనాలు, ద్రాక్షరసాలు ఉంటాయి. మాంసం లేతగా బాగుంటుంది.

కానీ ఇప్పుడు రాజ్యాలన్నింటినీ, ప్రజలనూ కప్పి వేసే ముసుగు ఉంది. ఈ ముసుగు “మరణం” అని పిలువబడుతుంది కానీ మరణం శాశ్వతంగా నాశనం చేయబడుతుంది మరియు నా ప్రభువు యెహోవా ప్రతి ఒక్కరి చెంపల మీదా ప్రతీ కన్నీటి బొట్టునూ తుడిచి వేస్తాడు. గతంలో ఆయన ప్రజలు అందరూ విచారంగా ఉన్నారు. అయితే దేవుడు ఆ విచారాన్ని భూమి మీద నుండి తీసి వేస్తాడు. ఇలా జరుగుతుంది అని యెహోవా చెప్పాడు గనుక ఇదంతా జరుగుతుంది.

ఆ సమయంలో ప్రజలు అంటారు,
    “ఇదిగో మన దేవుడు ఇక్కడ ఉన్నాడు.
మనం కనిపెడ్తున్నవాడు ఈయనే.
    మనల్ని రక్షించటానికి ఈయన వచ్చాడు.
మనం మన యెహోవా కోసం కనిపెడుతున్నాం.
    అందుచేత యెహోవా మనలను రక్షించినప్పుడు మనం ఆనందించి, సంతోషంగా ఉందాం.”
10 యెహోవా హస్తం (శక్తి) ఈ కొండ మీద ఉంది.
    మరియు మోయాబు ఓడించబడుతుంది.
యెహోవా శత్రువును అణగ త్రొక్కుతాడు.
    చెత్త కుప్ప మీద వరిగడ్డిపై నడిచినట్టుగా అది ఉంటుంది.
11 ఈత కొట్టేవానిలా యెహోవా తన చేతులు చాపుతాడు
    అప్పుడు ప్రజలు అతిశయించే వాటన్నిటినీ యెహోవా సమకూరుస్తాడు
వారు తయారు చేసిన అందమైన వాటన్నింటినీ యెహోవా సమకూరుస్తాడు.
    యెహోవా వాటన్నింటినీ క్రింద పారవేస్తాడు
12 ప్రజల ఎత్తయిన గోడల, భద్రతా స్థలాలు అన్నింటిని యెహోవా నాశనం చేస్తాడు.
    యెహోవా వాటిని నేల ధూళిలో పార వేస్తాడు.

1 యోహాను 3

మనం దేవుని బిడ్డలం

మనం దేవుని సంతానంగా పరిగణింపబడాలని తండ్రి మనపై ఎంత ప్రేమను కురిపించాడో చూడండి. అవును, మనం దేవుని సంతానమే. ప్రపంచం ఆయన్ని తెలుసుకోలేదు కనుక మనల్ని కూడా తెలుసుకోవటం లేదు. ప్రియ మిత్రులారా! మనం ప్రస్తుతానికి దేవుని సంతానం. ఇకముందు ఏ విధంగా ఉంటామో దేవుడు మనకింకా తెలియబరచలేదు. కాని యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనెలా ఉంటాడో చూస్తాము. కనుక మనం కూడా ఆయనలాగే ఉంటామని మనకు తెలుసు. ఇలాంటి ఆశాభావాన్ని ఉంచుకొన్న ప్రతి ఒక్కడూ ఆయనలా పవిత్రమౌతాడు.

పాపాలు చేసిన ప్రతి ఒక్కడూ నీతిని ఉల్లంఘించిన వాడౌతాడు. నిజానికి, పాపమంటేనే ఆజ్ఞను ఉల్లంఘించటం. కాని, యేసు పాప పరిహారం చెయ్యటానికి వచ్చాడని మీకు తెలుసు. ఆయనలో పాపమనేది లేదు. ఆయనలో జీవించేవాడెవ్వడూ పాపం చెయ్యడు. ఆయన్ని చూడనివాడు, ఆయనెవరో తెలియనివాడు మాత్రమే పాపం చేస్తూ ఉంటాడు.

బిడ్డలారా! మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. యేసు నీతిమంతుడు. ఆయనలా నీతిని పాలించే ప్రతివ్యక్తి నీతిమంతుడు. ఆదినుండి సాతాను పాపాలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల పాపం చేసే ప్రతివ్యక్తి సాతానుకు చెందుతాడు. సాతాను చేస్తున్న పనుల్ని నాశనం చెయ్యటానికే దేవుని కుమారుడు వచ్చాడు.

దైవేచ్ఛవల్ల జన్మించిన వానిలో దేవుని బీజం ఉంటుంది. కనుక పాపం చెయ్యడు. అతడు దేవునివల్ల జన్మించాడు కనుక పాపం చెయ్యలేడు. 10 అదే విధంగా తన సోదరుణ్ణి ప్రేమించనివాడు దేవుని సంతానం కాదు. నీతిని పాటించనివాడు దేవుని సంతానం కాదు. దీన్నిబట్టి దేవుని సంతానమెవరో, సాతాను సంతానమెవరో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం.

పరస్పరం ప్రేమతో ఉండండి

11 “పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు. 12 సాతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు.

13 ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 14 మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక మరణంనుండి బ్రతికింపబడ్డాము. ఈ విషయం మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15 సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో సమానము. అలాంటివానికి నిత్యజీవం లభించదని మీకు తెలుసు.

16 యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము. 17 ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల దేవుని దయ ఎందుకు ఉంటుంది? 18 బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం.

19-20 మన హృదయాలు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడు, అన్నీ తెలిసినవాడు కనుక, మనం నోటి మాటలతో కాక క్రియారూపంగా సత్యంతో ప్రేమను చూపుదాం. అలా చేస్తే మనం సత్యానికి చెందిన వాళ్ళమని తెలుసుకొంటాం. పైగా ఆయన సమక్షంలో దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడని, మన హృదయాలకు నచ్చ చెప్పగలుగుతాం.

21 ప్రియ మిత్రులారా! మన హృదయాలు మన మీద నిందారోపణ చేయలేనిచో మనకు ఆయన సమక్షంలో ధైర్యం ఉంటుంది. 22 దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనకు ఆనందం కలిగే విధంగా నడుచుకొంటే మనం అడిగింది మనకు లభిస్తుంది. 23 ఆయన ఆజ్ఞ యిది: దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచండి. ఆయనాజ్ఞాపించిన విధంగా పరస్పరం ప్రేమతో ఉండండి. 24 దేవుని ఆజ్ఞల్ని పాటించినవాళ్ళు ఆయనలో జీవిస్తారు. ఆయన వాళ్ళలో జీవిస్తాడు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మద్వారా ఆయన మనలో జీవిస్తున్నాడని తెలుసుకోగలుగుతాం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International