Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 31

మిద్యానీయులను ఇశ్రాయేలీయులు తిప్పికొట్టడం

31 యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు: “మిద్యానీయుల విషయం తేల్చేందుకు ఇశ్రాయేలీయులకు నేను సహాయం చేస్తాను. ఆ తర్వాత నీవు మరణిస్తావు.”

కనుక మోషే ప్రజలతో మాట్లాడాడు. అతడు వారితో ఇలా చెప్పాడు: “మీ మనుష్యుల్లో కొందిరిని సైనికులుగా ఏర్పరచుకోండి. మిద్యానీయుల విషయం తేల్చేందుకు వారిని యెహోవా వాడుకొంటాడు. ఇశ్రాయేలీయుల్లో ఒక్కో వంశం నుండి 1,000 మందిని ఏర్పరచుకోండి. ఇశ్రాయేలు వంశాలన్నింటినుండి మొత్తం 12,000 మంది సైనికులు ఉంటారు.”

ఆ 12,000 మందిని మోషే యుద్ధానికి పంపించాడు. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును వారితో అతడు పంపాడు. పవిత్ర వస్తువుల్ని, కొమ్ములను, బూరలను ఎలియాజరు తనతో తీసుకుని వెళ్లాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులతో పోరాడారు. మిద్యానీ మనుష్యులందరిని వారు చంపారు వారు చంపిన వారిలో మిద్యాను రాజులు అయిదుగురు, ఎవీ, రేకెము, సూరు, హోరు, రేబ ఉన్నారు. బెయోరు కొడుకైన బిలామునుకూడ వారు ఖడ్గంతో చంపారు.

ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీ స్త్రీలను, పిల్లలను బందీలుగా పట్టుకొన్నారు. వారి గొర్రెలను, పశువులను, ఇతరమైన వాటిని అన్నింటినీ వారు తీసుకున్నారు. 10 అప్పుడు వారి గ్రామాలు, పట్టణాలన్నింటినీ వారు కాల్చివేసారు. 11 మనుష్యులందరినీ, జంతువులన్నింటినీ వారు తీసుకుని 12 మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తీసుకుని వచ్చారు. వారు తీసుకున్న వాటన్నింటిని ఇశ్రాయేలీయుల నివాసం దగ్గరకు వారు తీసుకు వెళ్లారు. మోయాబులోని అరాబోతు కొండల దగ్గర ఇశ్రాయేలీయులు నివాసంచేస్తున్నారు. ఇది యెరికో ఎదుట యొర్దాను నదికి తూర్పున ఉంది. 13 అప్పుడు ఆ సైనికులను ఎదుర్కొనేందుకు మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలు ప్రజలు వారి గుడారంనుండి బయటకు వెళ్లారు.

14 సైన్యాధిపతుల మీద మోషేకి చాల కోపం వచ్చింది. యుద్ధంనుండి తిరిగి వచ్చిన శతాధిపతుల మీద, సహస్రాధిపతులమీద అతనికి కోపం వచ్చింది. 15 మోషే వారితో అన్నాడు, “ఆ స్త్రీలను మీరెందుకు బ్రతకనిచ్చారు? 16 ఈ స్త్రీలు ఇశ్రాయేలు పురుషులకు తగరు. యెహోవానుండి ప్రజలు తిరిగి పోతారు. అది బిలాము కాలంలాగే ఉంటుంది. బయలు పెయోరు దగ్గర జరిగినట్టే జరుగుతుంది. ఆ రోగం యెహోవా ప్రజలకు మళ్లీ వస్తుంది. 17 ఇప్పుడు మిద్యానీ బాలురను అందరినీ చంపివేయండి. పురుషునితో కాపురం చేసిన ప్రతి మిద్యానీ స్త్రీని చంపివేయండి. పురుష సంయోగం ఎరిగిన మిద్యానీ స్త్రీలలో ప్రతి ఒక్కరినీ చంపేయండి. 18 ఏ పురుషునితోనూ ఎన్నడూ లైంగిక సంబంధంలేని స్త్రీలను మీరు బ్రతకనివ్వవచ్చును. 19 తర్వాత, ఇతరులను చంపిన మీరందరూ ఏడు రోజులు నివాసానికి వెలుపల ఉండాలి. మీరు ఒక మృత దేహాన్ని ముట్టినాసరే, నివాసానికి వెలుపలే ఉండాలి. మూడో రోజున మీరు, మీ బందీలు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవాలి. 20 ఏడో రోజున మళ్లీ మీరు అలాగే చేయాలి. మీ బట్టలు అన్నీ మీరు ఉదుక్కోవాలి. తోలు, ఉన్ని, కట్టెతో చేయబడిన వాటిని అన్నింటినీ మీరు కడగాలి. మీరు తప్పక పవిత్రం కావాలి.”

21 అప్పుడు యాజకుడైన ఎలియాజరు సైనికులతో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “అవి మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. యుద్ధంనుండి తిరిగి వచ్చే సైనికులకోసం ఈ ఆజ్ఞలు. 22-23 అయితే అగ్నిలో వేయాల్సిన వాటి విషయంలో ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి. బంగారం, వెండి. ఇత్తడి, ఇనుము, రేకు, సీసం, మీరు అగ్నిలో వేయాలి. తర్వాత వాటిని నీళ్లతో కడగండి, అవి పవిత్రం అవుతాయి. అగ్నిలో వేయజాలని వస్తువులైతే వాటిని కూడ నీళ్లతో మీరు కడగాలి. 24 ఏడో రోజున తప్పక మీరు మీ వస్త్రాలను ఉదుక్కోవాలి. అప్పుడు మీరు పవిత్రం అవుతారు. ఆ తర్వాత మీరు నివాసంలోకి రావచ్చు.”

25 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 26 “సైనికులు యుద్ధంలో పట్టుకొన్న బందీలను, జంతువులను, సామగ్రి అతటినీ, నీవూ, యాజకుడైన ఎలీయాజరూ, నాయకులందరూ లెక్కపెట్టాలి. 27 తర్వాత వాటిని యుద్ధానికి వెళ్లిన సైనికులు, మిగిలిన ఇశ్రాయేలు ప్రజల మధ్య పంచుకోవాలి. 28 యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర ఆ సామగ్రిలో కొంత భాగం తీసుకో. ఆ భాగం యెహోవాకు చెందుతుంది. ప్రతి 500 వస్తువుల్లో ఒక వస్తువు యెహోవా భాగం. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నింటిలోను ఇలాగే. 29 యుద్ధంలో సైనికులు తెచ్చిన వాటిలోని వారి సగభాగంనుండి వాటిని తీసుకో. అప్పుడు వాటిని యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి. ఆ భాగం యెహోవాకు చెందుతుంది. 30 ఆ తర్వాత ప్రజల సగభాగంలో ప్రతి 50 వస్తువుల్లోనుంచి ఒక వస్తువు తీసుకో. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు, ఇంకా ఏ జంతువు విషయంలో అయినా ఇలాగే. ఆ భాగం లేవీయులకు ఇవ్వాలి. (ఎందుచేతనంటే యెహోవా పవిత్ర గుడారపు బాధ్యతను లేవీయులు తీసుకొన్నారు గనుక.)”

31 కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే, ఎలియాజరు చేసారు. 32 సైనికులు 6,75,000 గొర్రెలను, 33 72,000 పశువులను 34 61,000 గాడిదలను, 35 32,000 మంది స్త్రీలను తీసుకున్నారు. (వారు ఏ పురుషునితోనూ లైంగిక సంబంధం లేని వారు మాత్రమే.) 36 యుద్ధానికి వెళ్లిన సైనికులకు 3,37,500 గొర్రెలు వచ్చాయి. 37 675 గొర్రెలను వారు యెహోవాకు ఇచ్చారు. 38 సైనికులకు 36,000 పశువులు వచ్చాయి. 72 పశువులను వారు యెహోవాకు ఇచ్చారు. 39 సైనికులకు 30,500 గాడిదలు వచ్చాయి. 61 గాడిదలను వారు యెహోవాకు ఇచ్చారు. 40 సైనికుల వంతు 16,000 మంది స్త్రీలు. 32 మంది స్త్రీలను వారు యెహోవాకు ఇచ్చారు. 41 యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఆ కానుకలన్నింటిని యెహోవా కోసం యాజకుడైన ఎలియాజరుకు మోషే ఇచ్చాడు.

42 అప్పుడు మోషే ప్రజల అర్ధ భాగాన్ని లెక్కించాడు. యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర మోషే తీసుకున్న ప్రజల భాగం ఇది. 43 3,37,500 గొర్రెలు 44 36,000 పశువులు, 45 30,500 గాడిదలు 46 16,000 మంది స్త్రీలు ప్రజల వంతు. 47 ప్రతి 50 లోంచి ఒకటి యెహోవాకోసం మోషే తీసుకున్నాడు. జంతువులు, మనుష్యుల్లో కూడ ఇలాగే. అప్పుడు అతడు వాటిని లేవీయులకు ఇచ్చాడు. ఎందుచేతనంటే వారు యెహోవా పవిత్ర గుడారం విషయమై బాధ్యత వహించారు గనుక. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే ఇలా చేసాడు.

48 అప్పుడు సైన్యాధికారులు మోషే దగ్గరకు వచ్చారు (1,000 మంది మీద అధికారులు, 100 మంది మీద అధికారులు.) 49 వారు మోషేతో చెప్పారు, “నీ సేవకులమైన మేము మా సైనికులను లెక్కించాము. వారిలో ఎవరినీ మేము విడిచిపెట్టలేదు. 50 కనుక ప్రతి సైనికుని దగ్గర్నుండీ యెహోవా కానుకను మేము తెస్తున్నాము. బంగారంతో చేయబడిన దండపతకాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు మేము తెస్తున్నాము. మా పాపాలను కప్పేందుకు ఇది యెహోవాకు కానుక.”

51 కనుక బంగారంతో చేయబడిన ఆ వస్తువులన్నిటినీ మోషే తీసుకొని యాజకుడైన ఎలియాజరుకు ఇచ్చాడు. 52 1,000 మందిపైనున్న నాయకులు, 100 మందిపైనున్న నాయకులు యెహోవాకు ఇచ్చిన మొత్తం బంగారం బరువు 420 పౌన్లు. 53 సైనికులు యుద్ధంలో తీసుకొన్న మిగిలిన వస్తువులను వారు ఉంచుకొన్నారు. 54 1,000 మందిపైనున్న, 100 మందిపైనున్న అధికారుల దగ్గర బంగారాన్ని మోషే, యాజకుడైన ఎలీయాజరూ తీసుకున్నారు. తర్వాత ఆ బంగారాన్ని సన్నిధి గుడారంలో వారు ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఎదుట ఈ కానుక ఒక జ్ఞాపక చిహ్నం.

కీర్తనలు. 75-76

సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
    మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
    నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.

దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
    న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
    దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”

4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
    కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”

తూర్పునుండిగాని పడమరనుండిగాని
    ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
    దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
    ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
    అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
    దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
    ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
    మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.

సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.

76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
    దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
    దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
    కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.

దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
    తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
    వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
    బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
    రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
దేవా, నీవు భీకరుడవు.
    నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
    దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
    భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.

11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
    ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
    తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
    భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.

యెషయా 23

తూరుకు దేవుని సందేశం

23 తూరును గూర్చి విచారకరమైన సందేశం:

తర్షీషు ఓడలారా, మీరు విచారించండి.
    మీ ఓడరేవు పాడుచేయబడింది.
    (ఈ ఓడల మీద ఉన్న ప్రజలు కిత్తీయుల దేశం నుండి ప్రయాణం చేస్తూఉండగా వారికి ఈ వార్త చెప్పబడింది).

సముద్ర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలారా ఆగండి, దుఃఖించండి.
    తూరు, “సీదోను వ్యాపారి.” సముద్రం పక్కన ఉన్న ఆ పట్టణం సముద్రాల మీదుగా వ్యాపారులను పంపింది,
    ఆ మనుష్యులు మిమ్మల్ని ఐశ్వర్యాలతో నింపారు.
ఆ మనుష్యులు ధాన్యం కోసం వెదుకుతూ సముద్రాల మీద ప్రయాణం చేశారు.
    నైలునది దగ్గర పండే ధాన్యం తూరు మనుష్యులు కొని,
    ఆ ధాన్యాన్ని ఇతర దేశాలకు విక్రయించేవారు.
సీదోనూ, నీవు చాలా దుఃఖించాలి.
    ఎందుకంటే, ఇప్పుడు సముద్రం, సముద్రపు కోట చెబుతున్నాయి.
నాకు పిల్లలు లేరు.
    నాకు ప్రసవవేదన కలగలేదు
    నేను పిల్లలను కనలేదు
    నేను బాల బాలికలను పెంచలేదు.

తూరును గూర్చిన వార్త ఈజిప్టు వింటుంది.
    ఈ వార్త ఈజిప్టును దుఃఖంతో బాధిస్తుంది.
ఓడలారా మీరు తర్షీషుకు తిరిగి రావాలి.
    సముద్రం దగ్గర్లో నివసిస్తున్న ప్రజలారా మీరు విచారించాలి.
గతకాలంలో మీరు తూరు పట్టణాన్ని అనుభవించారు. అనాది నుండీ ఆ పట్టణం పెరుగుతూనే ఉంది.
    ఆ పట్టణం ప్రజలు జీవనోపాది కోసం దూర దేశాలు తిరిగారు.
తూరు పట్టణం చాలామంది నాయకులను తయారు చేసింది.
    ఆ పట్టణపు వ్యాపారులు యువరాజుల్లా ఉన్నారు.
    క్రయ విక్రయ దారులు ఎక్కడ చూచినా గౌరవించబడ్డారు.
కనుక తూరుకు వ్యతిరేకంగా పథకాలు వేసింది ఎవరు?
సర్వశక్తిమంతుడైన యెహోవాయే.
    వాళ్లను ప్రముఖులుగా ఉండకుండా చేయాలని ఆయన నిర్ణయించాడు.
10 తర్షీషు ఓడలారా, మీరు తిరిగి మీ దేశం వెళ్లిపోండి.
    సముద్రం ఒక చిన్న నదిలా దాటండి.
    మిమ్మల్ని ఇప్పుడు ఆపు చేయడు.
11 యెహోవా సముద్రం మీద తన హస్తం చాపాడు.
    తూరుకు విరోధంగా యుద్ధం చేసేందుకు యెహోవా రాజ్యాలను సమకూరుస్తున్నాడు.
తన భద్రతా స్థలం తూరును నాశనం చేయమని
    యెహోవా కనానుకు ఆదేశిస్తున్నాడు.
12 “సీదోను కన్యా[a] నీవు పాడు చేయబడతావు
    నీవు ఇంకెంత మాత్రం ఆనందించవు” అని యెహోవా చెబుతున్నాడు.
అయితే తూరు ప్రజలు, “కిత్తీము మాకు సహాయం చేస్తుంది” అంటున్నారు.
    కానీ మీరు సముద్రం దాటి కీత్తీము వెళ్తే అక్కడ మీకు విశ్రాంతి స్థలం దొరకదు.
13 అందుచేత తూరు ప్రజలు, “బబులోను ప్రజలు మాకు సహాయం చేస్తారు” అంటున్నారు.
    కానీ కల్దీయుల దేశం చూడండి. బబులోను ఇప్పుడు ఒక దేశం కాదు.
బబులోను మీద అష్షూరు దాడి చేసి దాని చుట్టూ యుద్ధ గోపురాలు కట్టింది.
    అందమైన గృహాలనుండి సైన్యం సమస్తం దోచుకొంది.
    అష్షూరు బబులోనును అడవి మృగాలకు స్థావరంగా చేసింది బబులోనును వారు శిథిలాలుగా మార్చేశారు.
14 అందుచేత, తర్షీషు ఓడలారా, దుఃఖించండి
    మీ క్షేమ స్థానం (తూరు) నాశనం చేయబడుతుంది.

15 ప్రజలు తూరును డెబ్భయి సంవత్సరాలపాటు మరచిపోతారు. (అది ఒక రాజు పరిపాలనా కాలవ్యవధి) డెబ్భయి సంవత్సరాల తర్వాత తూరు ఈ పాటలోని వేశ్యలా ఉంటుంది.

16 ప్రజలు మరచిన ఓ ఆడదానా,
    నీ స్వర మండలం తీసుకొని పట్టణంలో నడువు.
నీ పాటను చక్కగా వాయించు నీ పాటను తరచుగా పాడు.
    అప్పుడు ప్రజలు నిన్ను జ్ఞాపకం ఉంచుకొంటారు.

17 డెబ్భయి సంవత్సరాల తర్వాత తూరు విషయం యెహోవా పునః పరిశీలిస్తాడు, ఆయన దానికి తన నిర్ణయం తెలియజేస్తాడు. తూరు మళ్లీ వ్యాపారం చేస్తుంది. భూమి మీద రాజ్యాలన్నింటికీ తూరు ఒక వేశ్యలా ఉంటుంది. 18 కాని తూరు తాను సంపాదించిన ధనం ఉంచుకోదు. తూరు తన వ్యాపారం ద్వారా సంపాదించిన ధనం యెహోవా కోసం దాచబడుతుంది. యెహోవాను సేవించే వారికి ఆ ధనాన్ని తూరు ఇస్తుంది. కనుక యెహోవా సేవకులు తృప్తి పడేంతవరకు భోజనం చేస్తారు, మంచి దుస్తులు ధరిస్తారు.

1 యోహాను 1

జీవ వాక్యం

ఏది మొదటినుండి ఉన్నదో, దాన్ని మేము విన్నాము, మా కళ్ళారా చూసాము. చూసి మా చేతుల్తో తాకాము. అదే జీవం కలిగించే వాక్యం. దాన్ని గురించే మీకు ప్రకటిస్తున్నాము. జీవం కనిపించింది. మేము దాన్ని చూసాము. చూసినట్టు సాక్ష్యం కూడా చెపుతున్నాము. ఆ జీవాన్ని గురించి మీకు ప్రకటిస్తున్నాము. ఆ జీవం తండ్రితో ఉంది. అది మాకు కనిపించింది. తండ్రితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు సహవాసం ఉంది కనుక, మీరు కూడా మాతో సహవాసం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేము చూసినదాన్ని, విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాము. మన[a] ఆనందం సంపూర్ణంగా ఉండాలని యిది మీకు వ్రాస్తున్నాను.

వెలుగులో నడుచుట

దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. మనకు ఆయనతో సహవాసముందని అంటూ చీకట్లో నడిస్తే మనము అసత్యమాడినట్లే కదా! సత్యాన్ని ఆచరించటం మానుకొన్నట్లే కదా! దేవుడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే మన మధ్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మన పాపాలన్నిటిని కడుగుతుంది.

మనలో పాపం లేదని అంటే, మనల్ని మనము మోసం చేసుకొన్న వాళ్ళమౌతాము. సత్యం మనలో ఉండదు. మనం చేసిన పాపాన్ని ఒప్పుకొంటే దేవుడు సత్యవంతుడు, సక్రమంగా న్యాయం జరిగించేవాడు కనుక మన పాపాల్ని క్షమిస్తాడు. మనలో ఉన్న అవినీతిని కడిగి వేస్తాడు. 10 మనం పాపాలు చెయ్యలేదని అంటే ఆయన్ని మనం అబద్ధమాడుతున్న వానిగా చేసినట్లౌతుంది. ఆయన సందేశానికి మన జీవితాల్లో స్థానం ఉండదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International