M’Cheyne Bible Reading Plan
ప్రత్యేక వాగ్దానాలు
30 ఇశ్రాయేలు వంశాల నాయకులతో మోషే మాట్లాడాడు. యెహోవానుండి వచ్చిన ఈ ఆజ్ఞలనుగూర్చి మోషే వారితో చెప్పాడు:
2 “ఒక వ్యక్తి దేవునితో ప్రత్యేక ప్రమాణం చేయాలని కోరినా, లేక దేవునికి ఏదైనా ప్రత్యేకంగా ఇస్తానని అతడు మ్రొక్కుకొనినా, అతడు ఆ ప్రకారం చేయాలి. అయితే అతడు ప్రమాణం ప్రకారం ఖచ్చితంగా చేసి తీరాలి.
3 “ఒక యువతి ఇంకా తన తండ్రి ఇంట్లో నివసిస్తూ ఉండొచ్చు. యెహోవాకు ప్రత్యేకంగా ఏదో ఇస్తానని ఆ యువతి ప్రమాణం చేసి ఉండొచ్చు. 4 ఆ ప్రమాణం గూర్చి ఆమె తండ్రి విని, ఒప్పుకొంటే, ఆ యువతి ప్రమాణం ప్రకారం చేసి తీరాలి. 5 అయితే ఆమె తండ్రి ఆ ప్రమాణం గూర్చి విని, ఒప్పుకొనకపోతే, అప్పుడు ఆ యువతి తన ప్రమాణానికి బాధ్యురాలు కాదు. ఆమె చేసిన ప్రమాణం ప్రకారం ఆమె నెరవేర్చాల్సిన పనిలేదు. ఆమె తండ్రి ఆమెను వారించాడు గనుక యెహోవా ఆమెను క్షమిస్తాడు.
6 “మరియు ఒకని భార్య యెహోవాకు ఏదో ఇస్తానని ఒక ప్రత్యేక ప్రమాణం చేసి ఉండొచ్చు. 7 భర్త ఆ ప్రమాణంగూర్చి విని, ఒప్పుకొంటే, ఆమె చేసిన ప్రమాణాన్ని ఆమె నెరవేర్చి తీరాలి. 8 కానీ ఆ ప్రమాణం గూర్చి భర్త విని, ఒప్పుకొనకపోతే, ఆ భార్య తన ప్రమాణం ప్రకారం చేయనవసరం లేదు. ఆమె భర్త ప్రమాణాన్ని భంగం చేసి, ఆమె చెప్పినట్టు ఆమెను చేయనివ్వలేదు. కనుక యెహోవా ఆమెను క్షమిస్తాడు.
9 “ఒక విధవ లేక విడువబడ్డ ఒక స్త్రీ ఒక ప్రత్యేక ప్రమాణం చేయవచ్చు. ఆమె అన్న ప్రకారం తన ప్రమాణాన్ని నెరవేర్చవలసిందే.
10 “ఒక వివాహిత స్త్రీ యెహోవాకు ఏదో ఇస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు. 11 ఆ ప్రమాణం గూర్చి ఆమె భర్త విని, ఆమె మ్రొక్కుబడిని చెల్లింపనిస్తే, ఆమె తన ప్రమాణం ప్రకారం ఖచ్చితంగా చేసి తీరాలి. ఆమె ప్రమాణం ప్రకారం సమస్తం చెల్లించాలి. 12 కానీ ఆమె భర్త ఆ ప్రమాణం గూర్చి విని, ఆమె ప్రమాణం నిలుపు కొనేందుకు నిరాకరిస్తే, ఆమె తన ప్రమాణం ప్రకారం చేయనక్కర్లేదు. ఆమె ఏమి ప్రమాణం చేసినా సరే ఫర్వాలేదు, ఆమె భర్త ఆ ప్రమాణాన్ని భంగం చేయవచ్చు. ఒకవేళ ఆమె భర్త ఆ ప్రమాణాన్ని భంగం చేస్తే యెహోవా ఆమెను క్షమిస్తాడు. 13 ఒక వివాహిత స్త్రీ యెహోవాకు ఏదైనా ఇస్తానని ప్రమాణం చేయవచ్చు, లేక తనకు ఏదైనా పరిత్యజించు కొంటానని ప్రమాణం చేయవచ్చు, లేక మరేదో ప్రత్యేక ప్రమాణాన్ని యెహోవాకు ఆమె చేసి ఉండొచ్చు. ఆ ప్రమాణాల్లో దేనినైనా భర్త భంగం చేయవచ్చును, లేదా ఆ ప్రమాణాలలో దేనినైనా ఆ భర్త ఆమెను నెరవేర్చనీయవచ్చును. 14 భర్త ఏ విధంగా తన భార్యను ఆమె ప్రమాణాలను నెరవేర్చనిస్తాడు? అతడు ప్రమాణాలను గూర్చి విని, వాటిని వారించకపోతే, అప్పుడు ఆ స్త్రీ, ఆమె చేసిన ప్రమాణాలను నెరవేర్చాలి. 15 కానీ భర్త ఆ ప్రమాణాలను గూర్చి విని, వాటిని వారిస్తే, అప్పుడు ఆమె ప్రమాణాలను ఉల్లంఘించినందుకు అతడు బాధ్యుడు.”
16 ఇవి మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. ఒక పురుషుడు, అతని భార్యను గూర్చి, ఒక తండ్రి, ఇంకా చిన్నదిగా ఉండి తన తండ్రి ఇంటనే ఉంటున్న కూతురును గూర్చిన ఆజ్ఞలు ఇవి.
ఆసాపు ధ్యాన గీతం.
74 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా?
నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?
2 చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో.
నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందినవాళ్లం.
నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకొనుము.
3 దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము.
శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము.
4 శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు.
యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు.
5 శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను
నరికే మనుష్యుల్లా ఉన్నారు.
6 ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా,
నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు.
7 దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు.
వారు నీ ఆలయాన్ని నేలమట్టంగా కూల్చివేశారు.
ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించబడింది.
8 శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు.
దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు.
9 మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము.
ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు.
ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు.
10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు?
నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా?
11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శిక్షించావు?
నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు.
12 దేవా, చాల కాలంగా నీవే మా రాజువు.
నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.
14 మకరపు తలను నీవు చితుకగొట్టావు.
దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు.
15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు.
మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు.
16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు.
సూర్యుని, చంద్రుని నీవే చేశావు.
17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు.
వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు.
18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను అవమానించాడని జ్ఞాపకం చేసుకో.
ఆ తెలివితక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు.
19 దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని[a] తీసుకోనివ్వకుము.
నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచిపోకుము.
20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనుము.
ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది.
వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము.
నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
22 దేవా, లేచి పోరాడుము.
ఆ తెలివితక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకొనుము.
23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము.
ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు.
యెరూషలేముకు దేవుని సందేశం
22 దర్శన లోయను గూర్చిన విచారకరమైన సందేశం:
ప్రజలారా మీకు ఏమయింది?
మీరు ఎందుకు మీ ఇంటి కప్పుల మీద దాక్కొంటున్నారు?
2 గత కాలంలో ఈ పట్టణం చాలా కలవరంతో నిండి ఉండేది. ఈ పట్టణం చాలా అల్లరిగా చాలా ఉల్లాసంగా ఉండేది.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
నీ ప్రజలు చంపి వేయబడ్డారు.
కానీ కత్తులతో కాదు.
ప్రజలు మరణించారు
కానీ యుద్ధం చేస్తూ కాదు.
3 మీ నాయకులంతా ఒక్కుమ్మడిగా పారి పోయారు
కానీ వాళ్లంతా బాణాలు లేకుండానే బంధించబడ్డారు.
నాయకులంతా కలిసి దూరంగా పారిపోయారు.
కానీ వాళ్లు బంధించబడ్డారు.
4 అందుకే నేనంటాను, “నా వైపు చూడవద్దు!
నన్ను ఏడ్వనివ్వండి.
యెరూషలేము నాశనం గూర్చి నన్ను ఆదరించాలని పరుగెత్తి రాకండి.”
5 యెహోవా ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసుకొన్నాడు. ఆనాడు తిరుగుబాట్లు, గందరగోళంగా ఉంటుంది. దర్శనపు లోయలో ప్రజలు ఒకరినొకరు తొక్కుకుంటారు. పట్టణ ప్రాకారాలు కూలగొట్ట బడతాయి. లోయలో ఉన్న ప్రజలు కొండమీద పట్టణంలో ఉన్న ప్రజలను చూచి కేకలు వేస్తారు. 6 ఏలాము గుర్రాల సైనికులు వారి బాణాల పొదిని తీసుకొని యుద్ధానికీ స్వారీ చేస్తారు. కీరుప్రజలు వారి డాళ్లతో శబ్దాలు చేస్తారు. 7 సైన్యాలు మీ ప్రత్యేక లోయలో కలుసుకొంటాయి. లోయంతా రథాలతో నిండిపోతుంది. గుర్రాల సైనికులు పట్టణ ద్వారాల ముందు ఉంటారు. 8 యూదా వారు అరణ్య భవనంలో దాచుకొన్న వారి ఆయుధాలను ఆ సమయంలో ప్రయోగించాలని కోరుకొంటారు. యూదాను కాపాడుతున్న గోడలను శత్రువు కూలగొట్టేస్తాడు.
9-11 దావీదు పట్టణపు గోడలు బీటలు వారటం మొదలవుతుంది, ఆ బీటలు మీరు చూస్తారు. కనుక మీరు ఇళ్లను లెక్కబెట్టి, ఆ ఇండ్ల రాళ్లను గోడలు బాగుచేయటానికి ఉపయోగిస్తారు. పాత కాలువ నీళ్లు నిల్వచేయటానికి రెండు గోడల మధ్య మీరు ఖాళీ ఉంచుతారు, మీరు నీటిని నిల్వచేస్తారు.
ఇదంతా మిమ్మల్ని మీరు కాపాడుకొనేందుకు చేస్తారు. కానీ వీటన్నింటినీ చేసిన దేవుణ్ణి మీరు నమ్ముకోరు. వీటన్నింటినీ చాలకాలం క్రిందట చేసిన వానిని (దేవుణ్ణి) మీరు చూడరు. 12 కనుక నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలను ఏడ్చి, చనిపోయిన వారి స్నేహితుల కోసం దుఃఖంగా ఉండమని చెబుతాడు. ప్రజలు గుండ్లు గీసికొని, విచార సూచక వస్త్రాలు ధరిస్తారు. 13 అయితే చూడండి, ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రజలు ఇలా అంటున్నారు:
మనం వేడుక చేసుకొందాం పశువుల్ని,
గొర్రెల్ని వధించండి. మీరు భోజనం తిని, ద్రాక్షరసం త్రాగండి
తినండి, త్రాగండి, ఎందుకంటె రేపు మనం చస్తాం.
14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు, నేను నా చెవులారా దానిని విన్నాను: “మీరు చెడుకార్యాలు చేసిన అపరాధులు. ఈ అపరాధం క్షమించబడక ముందే మీరు మరణిస్తారని నేను ప్రమాణం చేస్తున్నాను.” నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
షెబ్నాకు దేవుని సందేశం
15 నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు: “ఆ సేవక షెబ్నా దగ్గరకు వెళ్లు. ఆ సేవకుడు భవనం అధికారి. 16 నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నీ కుటుంబం వారు ఎవరైనా ఇక్కడ సమాధి చేయబడ్డారా? నీవెందుకు ఇక్కడ సమాధి తయారు చేస్తున్నావు?” అని ఆ సేవకుడ్ని అడుగు. యెషయా చెప్పాడు, “ఈ మనిషిని చూడండి! ఎత్తయిన స్థలంలో అతడు తన సమాధి సిద్ధం చేసుకొంటున్నాడు. తన సమాధి కోసం అతడు బండను తొలుస్తున్నాడు.
17-18 “ఓ మనిషీ, యెహోవా నిన్ను చితక గొట్టేస్తాడు. యెహోవా నిన్ను ఒక చిన్న ఉండలా చుట్టేసి, చాలా దూరంలో చేతులు చాచుకొని ఉన్న మరోదేశంలోకి నిన్ను విసరివేస్తాడు. అక్కడ నీవు చస్తావు.”
యెహోవా చెప్పాడు: “నీ రథాల మూలంగా నీకు చాలా గర్వం. కానీ ఆ దూరదేశంలో నీ క్రొత్త పాలకునికి ఇంకా మంచి రథాలు ఉంటాయి. అతని స్థలంలో నీ రథాలు ఎన్నదగినవిగా కనబడవు. 19 ఇక్కడి నీ ప్రముఖ పదవినుండి నిన్ను నేను వెళ్లగొడతాను. నీ ప్రముఖ పదవినుండి, నీ క్రొత్త పాలకుడు నిన్ను తీసుకొని వెళ్లిపోతాడు. 20 ఆ సమయంలో హిల్కీయా కుమారుడు, నా సేవకుడు ఎల్యాకీమును నేను పిలుస్తాను. 21 నేను నీ అంగీ తీసి ఆ సేవకుని మీద వేస్తాను. నీ నడికట్టు అతనికి ఇస్తాను. నీ ముఖ్య పదవి అతనికి ఇస్తాను. యెరూషలేము ప్రజలకు, యూదా వంశానికి ఈ సేవకుడు ఒక తండ్రిలా ఉంటాడు.
22 “దావీదు ఇంటి తాళపు చెవిని అతని మెడలో నేను కడతాను. అతడు ఒక ద్వారం తెరిస్తే, అది తెరచుకొనే ఉంటుంది. ఏ మనిషీ దాన్ని మూసి వేయలేడు. అతడు ఒక ద్వారం మూసివేస్తే, ఆ ద్వారం మూసికొనే ఉంటుంది. ఏ మనిషీ దానిని తెరవలేడు. ఆ సేవకుడు తన తండ్రి ఇంటిలో ఘనమైన పీఠంలా ఉంటాడు. 23 గట్టిచెక్కకు కొట్టబడిన మేకులా అతణ్ణి నేను బలంగా చేస్తాను. 24 అతని తండ్రి ఇంటిలో ఘనమైన వాటిని, గొప్పవాటిని నేను అతని మీద వేలాడదీస్తాను. పెద్దలు, పిల్లలు అందరూ అతని మీద ఆధారపడతారు. ఆ మనుష్యులు ఆయన మీద వేలాడుతోన్న చిన్న పాత్రల్లా, పెద్ద నీళ్ల చెంబుల్లా ఉంటారు.
25 “ఆ సమయంలో, ప్రస్తుతం గట్టి చెక్కకు కొట్టబడిన మేకు (షెబ్నా) బలహీనమవుతుంది, విరిగిపోతుంది. ఆ మేకు నేలమీద పడిపోతుంది, ఆ మేకుకు వేలాడుతున్న వస్తువులన్నీ నాశనం అవుతాయి. అప్పుడు, ఈ సందేశంలో నేను చెప్పిన సంగతులు అన్నీ సంభవిస్తాయి.” (యెహోవా చెప్పాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి.)
యేసు మరలా వస్తాడు
3 ప్రియమైన సోదరులారా! ఇది నా రెండవ ఉత్తరం. కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని మీకీ రెండు ఉత్తరాలు వ్రాసాను. 2 పవిత్రులైన ప్రవక్తలు చాలాకాలం క్రిందటే చెప్పిన సందేశాలను మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా యిచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం.
3 చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి: 4 “వస్తానని వాగ్దానం చేసాడే, ఎప్పుడు వస్తాడు? మా పూర్వికులు మరణించినప్పటి నుండే కాదు. ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండీ అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి” అని వాళ్ళంటారు.
5 చాలా కాలం క్రితమే దేవుడు తన మాటతో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. వాళ్ళు ఈ విషయాన్ని కావాలనే మరిచిపోతారు. ఈ భూమి నీళ్ళనుండి, నీళ్ళ ద్వారా సృష్టింపబడింది. 6 నీళ్ళ కారణంగా ప్రళయం వచ్చి ఆనాటి ప్రపంచం నాశనమై పోయింది. 7 దేవుడు ఆ మాటతోటే ఈనాటి ఆకాశాన్ని, భూమిని మంటలతో నాశనం చెయ్యటానికి దాచి ఉంచాడు. తీర్పుచెప్పే రోజుదాకా, అంటే దైవభక్తి లేనివాళ్ళను నాశనంచేసే రోజుదాకా దాచి ఉంచుతాడు.
8 కాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి[a] 9 ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు.
10 కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి. 11 అన్నీ ఈ విధంగా నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి. 12 దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగి పోతాయి. 13 దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం.
14 ప్రియ సోదరులారా! మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక మీలో ఏ దోషమూ, కళంకమూ లేకుండా ఉండేటట్లు అన్నివిధాల ప్రయత్నం చెయ్యండి. శాంతం వహించండి. 15 మన ప్రభువు యొక్క సహనము మనకు రక్షణను యిస్తుందని గ్రహించండి. దేవుడు యిచ్చిన విజ్ఞానంతో మన ప్రియమిత్రుడు పౌలు మీకు ఈ విషయాల్ని గురించి వ్రాసాడు. 16 అతడు వ్రాసిన ఉత్తరాలన్నీ యిదేవిధంగా వ్రాసాడు. వాటన్నిటిలోనూ ఈ విషయాల్ని గురించే మాట్లాడాడు. అతని ఉత్తరాల్లోని కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం లేనివాళ్ళు, చపల చిత్తం గలవాళ్ళు యితర లేఖనాలపై తప్పుడు వ్యాఖ్యానం చేసినట్లే దీనిమీద కూడ తప్పడు వ్యాఖ్యానం చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు నాశనమైపోతారు.
17 అందువల్ల ప్రియమైన సోదరులారా! ఇప్పుడీ విషయాలు మీకు తెలుసు. కనుక జాగ్రత్తగా ఉండండి. నీతికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తుల తప్పుడు మాటలకు మోసపోకండి. మీలో వున్న స్థిరత్వాన్ని వదులుకోకండి. 18 మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల మీకున్న కృతజ్ఞతను పెంచుకుంటూ, ఆయన్ని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉండండి. ఆయనకి ఇప్పుడూ, చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
© 1997 Bible League International