M’Cheyne Bible Reading Plan
బూరల పండుగ
29 “ఏడో నెల మొదటి రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. అది బూర ఊదే రోజు. 2 దహనబలులను మీరు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటాయి. ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, పుష్టిగల ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి. 3 కోడె దూడతో బాటు తూములో మూడు పదోవంతుల మంచి పిండి నూనెతో కలిపినది, పొట్టేలుకు రెండు పదోవంతులును, 4 ఏడు గొర్రెపిల్లల్లో ఒక్కోదానికి ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి. 5 మరియు పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను అర్పించండి. 6 నెలపొడుపు[a] బలులు, దాని ధాన్యార్పణం గాక బలులు అర్పించాలి. ప్రతిదిన బలులు, దాని ధాన్యార్పణం, పానార్పణలకి అదనం. అవి వాటి నియమాల ప్రకారం జరగాలి. అవి అగ్నిలో దహించబడాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.
ప్రాయశ్చిత్త దినం
7 “ఏడో నెల పదో రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏమీ భోజనం చేయకూడదు. ఏ పనీ మీరు చేయకూడదు. 8 దహనబలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. ఒక కోడె దూడ, ఒక పొట్టేలు, అంగహీనము కాని ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రె పిల్లలను మీరు అర్పించాలి. 9 ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండితూములో మూడు పదోవంతులు ఒక కోడె దూడతోను, రెండు పదోవంతులు పొట్టేలుతోను, 10 ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కోదానిలో పదోవంతును మీరు అర్పించాలి. 11 ఒక పోతు మేకను కూడ పాపపరిహారార్థ బలిగా మీరు అర్పించాలి. ప్రాయశ్చిత్త దినపు పాపపరిహారార్థ బలి అర్పణకు ఇది అదనం. ప్రతిదినం బలి, దాని ధాన్యార్పణం, పానార్పణలకు ఇది అదనం.
పర్ణశాలల పండుగ
12 “ఏడోనెల పదిహేనవ రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు ప్రత్యేక పండుగ రోజులుగా మీరు జరుపుకోవాలి. 13 దహన బలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. కోడెదూడలు 13, పొట్టేళ్లు 2, పుష్టిగల ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు 14 మీరు అర్పించాలి. 14 పధ్నాలుగు కోడె దూడల్లో ఒక్కోదానితో నూనెతో కలుపబడిన మంచి పిండి తూములో మూడు పదోవంతులు, రెండు పొట్టేళ్లలో ఒక్కోదానితో రెండు పదోవంతులు, 15 పదునాలుగు గొర్రెపిల్లల్లో ఒక్కోదానితో ఒక్కో పదోవంతు మీరు అర్పించాలి. 16 ఒక మగమేకను కూడ మీరు అర్పించాలి. ప్రతిదినపు బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.
17 “ఈ పండుగ రెండోనాడు 12 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి. 18 కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ కూడ మీరు అర్పించాలి. 19 పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను కూడా మీరు అర్పించాలి. ప్రతిదినపు బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.
20 “ఈ పండుగ మూడోనాడు 11 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి. 21 కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రె పిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి. 22 పాపపరిహారార్థ బలిగా ఒక మగమేకను మీరు అర్పించాలి. ప్రతిదినపు బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
23 “ఈ పండుగ నాలుగో రోజున 10 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి. 24 కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి. 25 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినపు బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
26 “ఈ పండుగ ఐదో రోజున 9 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి. 27 కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ మీరు అర్పించాలి. 28 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినపు బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
29 “ఈ పండుగ ఆరోనాడు 8 కోడె దూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి. 30 కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి. 31 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినపు బలి, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
32 “ఈ పండుగ ఏడోనాడు 7 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి. 33 కోడె దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి. 34 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినపుబలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
35 “ఈ పండుగ ఎనిమిదో రోజు మీకు చాల ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. 36 మీరు ఒక దహనబలి అర్పించాలి. అది హోమార్పణ. యెహోవాకు ఇష్టమైన సువాసన. ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, పుష్టిగల ఏడాది గొర్రెపిల్లలు ఏడింటిని మీరు అర్పించాలి. 37 కోడెదూడకు, పొట్టేలుకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి. 38 పాపపరిహారార్థ బలిగా మీరు ఒక మేకను అర్పించాలి. ప్రతి దినపు ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.
39 “ప్రత్యేక పండుగ రోజుల్లో మీ దహన బలులను ధాన్యార్పణలను, పానార్పణలను, సమాధాన బలులను మీరు తీసుకొని రావాలి. ఆ అర్పణలను మీరు యెహోవాకు ఇవ్వవలెను. మీరు యెహోవాకు ఇవ్వాలను కొన్న ప్రత్యేక కానుకలు, మీరు చేసిన ప్రత్యేక ప్రమాణాల్లో ఒక భాగము కాకుండా అదనంగా వీటిని అర్పించాలి.”
40 యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్పాడు.
మూడవ భాగం
(కీర్తనలు 73–89)
ఆసాపు స్తుతి కీర్తన.
73 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు.
పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు.
2 నేను దాదాపుగా జారిపోయి,
పాపం చేయటం మొదలు పెట్టాను.
3 దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను.
ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.
4 ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు.
వారు జీవించుటకు శ్రమపడరు.[a]
5 మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు.
ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.
6 కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు.
వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం.
7 ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు.
వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.
8 ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు.
వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.
9 ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు.
వారు భూమిని పాలించేవారని తలుస్తారు.
10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి
వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు.
సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.”
12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు.
మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి?
నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?
14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను.
నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.
15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను.
కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను.
కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.
17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను,
వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు.
వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.
19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును.
అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు.
భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు.
అప్పుడు వారు అంతమైపోతారు.
20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు
మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు.
మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను
నీవు కనబడకుండా చేస్తావు.
21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను.
ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను.
దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను.
తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.
దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.
24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.
ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.
మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
26 ఒకవేళ నా మనస్సు,[b] నా శరీరం నాశనం చేయబడతాయేమో.
కాని నేను ప్రేమించే బండ[c] నాకు ఉంది.
నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.
నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.
దేవుడు నా యెడల దయ చూపించాడు.
నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం.
దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.
బబులోనుకు దేవుని సందేశం
21 సముద్రతీరంలో ఉన్న అడవి ప్రాంతానికి విచారకరమైన సందేశం:
అరణ్యం నుండి ఏదో వస్తోంది? నెగెవ్‌నుండి వీచే గాలిలా అది వస్తోంది.
అది ఒక భయంకర దేశం నుండి వస్తోంది.
2 జరుగబోయే దారుణమైన ఒక సంగతి నేను చూసాను.
దేశద్రోహులు నీకు విరోధంగా లేవటం నేను చూశాను.
ప్రజలు నీ ఐశ్వర్యం తీసుకోవటం నేను చూశాను.
ఏలాము, వెళ్లి ఆ ప్రజలతో యుద్ధం చేయి.
మాద్యా, పట్టణం చుట్టూరా నీ సైన్యాలను ఉంచి, దాన్ని జయించు.
ఆ పట్టణంలో చెడు సంగతులన్నింటినీ నేను అంతం చేస్తాను.
3 ఆ భయంకర విషయాలు నేను చూశాను, ఇప్పుడు నేను భయపడ్తున్నాను.
నా భయంవల్ల నా కడుపులో దేవేస్తోంది. ఆ బాధ ప్రసవవేదనలా ఉంది.
నేను వినే విషయాలు నన్ను చాలా భయపెట్టేస్తాయి.
నేను చూచే విషయాలు నన్ను భయంతో వణకిస్తాయి.
4 నేను దిగులుగా ఉన్నాను, భయంతో వణకిపోతున్నాను.
సంతోషకరమైన నా సాయంపూట, భయం పుట్టే రాత్రిగా తయారయింది.
5 అంతా బాగానే వుందని ప్రజలు తలస్తున్నారు. ప్రజలు అంటారు:
“బల్ల సిద్ధం చేయండి!
బల్లమీద బట్ట పరచండి! తినండి! తాగండి!”
కానీ ప్రజలు, “నాయకులారా, లేవండి,
యుద్ధానికి సిద్ధపడండి” అని చెప్పాలి.
6 ఎందుకంటే నా ప్రభువు, నాతో ఈ విషయాలు చెప్పాడు: “వెళ్లి, పట్టణాన్ని కాపాడేందుకు ఒక మనిషికోసం చూడు. 7 కావలివాడు గుర్రాల మీద సైనికుల్ని, గాడిదలు, లేక ఒంటెలను చూస్తే కావలివాడు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినాలి.”
8 అప్పుడు ఆ కావలివాడు సింహం అనే హెచ్చరిక మాట గట్టిగా చెప్పాలి. కావలివాడు యెహోవాతో చెప్పాడు:
“నా ప్రభూ! ప్రతిరోజూ నేను కావలి కాస్తూ కావలి గోపురం మీద ఉన్నాను.
ప్రతిరాత్రి నేను నిలబడి కావలి కాస్తూనే ఉన్నాను, కానీ
9 అదిగో, వాళ్లు వచ్చేస్తున్నారు, బారులుతీరిన మనుష్యులు, గుర్రాల మీద సైనికులు నాకు కనబడుతున్నారు.”
అప్పుడు పురుషుల్లో ఒకడు అన్నాడు:
“బబులోను ఓడించబడింది.
బబులోను నేల మట్టంగా కూలిపోయింది.
దాని అబద్ధ దేవుళ్ల విగ్రహాలన్నీ
నేలకు కొట్టబడ్డాయి, ముక్కలు ముక్కలుగా విరిగి పోయాయి.”
10 యెషయా చెప్పాడు, “నా ప్రజలారా, ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి నేను విన్న వాటన్నింటినీ మీకు చెప్పాను. కళ్లంలో ధాన్యంలా మీరు చితుకగొట్ట బడతారు.”
ఎదోముకు దేవుని సందేశం
11 దూమాను గూర్చిన విచారకరమైన సందేశం:
శేయీరునుండి ఎవరో నన్ను పిలిచి అడుగుతున్నారు,
“కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?
కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?”
12 కావలివాడు జవాబిచ్చాడు,
“ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది.
నీవు అడగాల్సింది ఏమైనా ఉంటే
తిరిగి వచ్చి అడుగుము.”
అరేబియాకు దేవుని సందేశం
13 అరేబియాను గూర్చి విచారకరమైన సందేశం:
దెదానునుండి వచ్చిన ఒంటెల ప్రయాణీకులు
అరబి ఎడారిలో కొన్ని చెట్ల దగ్గర రాత్రి గడిపారు.
14 దాహంతో ఉన్న కొందరు ప్రయాణీకులకు వారు నీళ్లు ఇచ్చారు.
ప్రయాణం చేస్తున్న కొందరు ప్రజలకు తేమా ప్రజలు భోజనం పెట్టారు
15 చంపడానికి సిద్ధంగా ఉన్న కత్తులనుండి
ఆ ప్రజలు పారిపోతూ ఉన్నారు.
గురిపెట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్న బాణాలనుండి
వారు పారిపోతున్నారు.
కష్టతరమైన యుద్ధంనుండి
వారు పారిపోతున్నారు.
16 ఆ సంగతులు జరుగుతాయని నా ప్రభువైన యెహోవా నాతో చెప్పాడు: “ఒక్క సంవత్సరంలో (కూలివాని కాలమానం ప్రకారం) కేదారు ఘనత అంతా పోతుంది. 17 ఆ సమయంలో కేదారు మహా వీరుల్లో కొద్దిమంది విలుకాండ్రు మాత్రమే బ్రతికి ఉంటారు.” ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఈ సంగతులు నాకు చెప్పాడు.
దుర్బోధకులు
2 కాని పూర్వం ప్రజల మధ్య దొంగ ప్రవక్తలు కూడా ఉండేవాళ్ళు. అదే విధంగా మీ మధ్యకూడా దుర్బోధకులు ఉంటారు. వాళ్ళు నాశనానికి దారితీసే సిద్ధాంతాల్ని రహస్యంగా ప్రవేశపెడుతూ, తమను కొన్న ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమను తాము నాశనం చేసుకుంటారు. ఇది త్వరలోనే జరుగుతుంది. 2 అవమానకరమైన వాళ్ళ పద్దతుల్ని అనేకులు పాటించి సత్యానికే అపకీర్తి తెస్తారు. 3 ఈ దుర్బోధకులు తమలో ఉన్న అత్యాశలవల్ల తాము సృష్టించిన కథలతో తమ స్వలాభం కొరకు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. దేవుడు వాళ్ళకు విధించిన శిక్ష చాలాకాలం నుండి వాళ్ళ కోసం కాచుకొని ఉంది. రానున్న ఆ వినాశనం ఆగదు.
4 దేవుడు పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచిపెట్టకుండా నరకంలో[a] వేసాడు. తీర్పు చెప్పే రోజుదాకా అక్కడ వాళ్ళను అంధకారంలో బంధించి ఉంచుతాడు.
5 దేవుడు పురాతన ప్రపంచంపై సానుభూతి చూపలేదు. దుర్మార్గులైన ఆనాటి ప్రజలమీదికి ప్రళయం రప్పించాడు. నీతిని బోధించిన నోవహు, మిగతా ఏడుగురు తప్ప అందరూ నాశనమైపొయ్యారు.
6 దుర్మార్గులకు ఏమి సంభవిస్తుందో చూపడానికి దేవుడు సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలను భస్మం చేసి వాటిని ఉదాహరణలుగా చూపించాడు. 7 కాని దేవుడు నీతిమంతుడైన లోతును రక్షించాడు. ప్రజలు అరాచకంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంవల్ల లోతు చాలా బాధపడ్తూ ఉండేవాడు. 8 ఆ నీతిమంతుడు దుర్మార్గుల మధ్య ప్రతిరోజూ నివసిస్తూ, వాళ్ళ దుష్ప్రవర్తనల్ని చూస్తూ, వింటూ ఉండేవాడు. వాళ్ళు చేస్తున్న దుష్ట పనులు చూసి అతని హృదయం తరుక్కుపోయేది.
9 విశ్వాసుల్ని పాపాలు చేయకుండా చేసి ఎలా కాపాడుకోవాలో ఆ ప్రభువుకు తెలుసు. తీర్పు చెప్పే రోజుదాకా దుర్మార్గుల్ని ఎలా శిక్షిస్తూ ఉండాలో కూడా ఆ ప్రభువుకు తెలుసు. 10 అధికారాన్నుల్లంఘిస్తూ, అసహ్యకరమైన ఐహిక వాంఛల్ని తీర్చుకుంటూ గర్వాంధులై పరలోక నివాసుల్ని దూషించటానికి భయపడనివాళ్ళ విషయంలో యిది ముఖ్యంగా నిజమౌతుంది.
ఇలాంటి దుర్బోధకులు ధైర్యంగా గర్వంతో గొప్పవాళ్ళను దూషిస్తారు. 11 వాళ్ళకన్నా బలవంతులు, శక్తివంతులు అయినటువంటి దేవదూతలు కూడా ప్రభువు సమక్షంలో ఆ గొప్పవాళ్ళపై నేరారోపణ చేసి దూషించారు.
12 తమకు తెలియనివాటిని ఆ దుర్బోధకులు దూషిస్తారు. వాళ్ళు అడవి జంతువుల్లాంటివాళ్ళు. ఇలాంటి జంతువులు పట్టుకుని చంపబడటానికే పనికి వస్తాయి. ఆ జంతువుల్లాగే వాళ్ళు కూడా నశించిపోతారు. 13 వాళ్ళు చేసిన చెడ్డకార్యాలకు ప్రతిఫలంగా వాళ్ళకు హాని కలుగుతుంది. పట్టపగలు శారీరక వాంఛల్ని తీర్చుకోవటమే వాళ్ళకు ఆనందం.
వాళ్ళు తాము చేసిన మోసాలకు ఆనందిస్తూ మీతో కలిసి విందులు చేయటం మీకు అవమానం. అది మీకు తీరని కళంకం. 14 వాళ్ళు కళ్ళనిండా కామాన్ని నింపుకొని, పాపం చేయటం ఎన్నటికీ మానరు. వాళ్ళు మనస్సు స్థిరంలేనివాళ్ళను అడ్డదారి పట్టిస్తారు. దేవుని శాపానికి గురియైన వాళ్ళు, డబ్బు లాగటంలో నిపుణులు.
15 వాళ్ళు సక్రమ మార్గాన్ని వదిలేసి, దారితప్పి బిలాము మార్గాన్ని అనుసరిస్తారు. బిలాము, అధర్మంగా ధనార్జన చేసిన బెయోరు[b] కుమారుడు. 16 కాని ఈ బిలామును అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త పిచ్చితనాన్ని ఆపింది.
17 ఇలాంటి దుర్బోధకులు నీళ్ళు లేని బావుల్లాంటివాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొనిపోయే మేఘాల్లాంటివాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు. 18 ఆ బోధకులు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అంతేకాక, అప్పుడే మోసగాళ్ళ నుండి తప్పించుకొన్న వ్యక్తుల శారీరక వాంఛల్ని ప్రేరేపించి, అడ్డదారి పట్టిస్తూ ఉంటారు. 19 తాము స్వయంగా దుర్వ్యసనాలకు బానిసలై ఉండి, యితరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తూ ఉంటారు. తనను జయంచినదానికి మానవుడు బానిసై పోతాడు.
20 ప్రపంచంలో ఉన్న దుర్నీతి నుండి తప్పించుకోవాలంటే, మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తును తెలుసుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఆ దుర్నీతిలో చిక్కుకొని బానిసలైతే యిప్పటి స్థితి మునుపటి స్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది. 21 వాళ్ళకందివ్వబడిన పవిత్ర ఆజ్ఞను తెలుసుకుని వెనక్కి మళ్ళటం కన్నా ఆ ధర్మమార్గాన్ని తెలుసుకోకపోయినట్లయితే ఉత్తమంగా ఉండేది. 22 అలా వెనక్కు మళ్ళిన వాళ్ళ విషయంలో ఈ సామెతలు నిజమౌతాయి: “కుక్క తాను కక్కిన దాన్ని తిరిగి తింటుంది. దేహాన్ని కడిగిన పంది బురదలో పొర్లాడటానికి తిరిగి వెళ్తుంది.”
© 1997 Bible League International