M’Cheyne Bible Reading Plan
ప్రతిదిన అర్పణలు
28 అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వాలి. ప్రత్యేక కానుకలను సరైన సమయంలోనే నాకు ఇవ్వాలని వారితో చెప్పు. ధాన్యార్పణలు, దహనబలులు నాకు ఇవ్వాలని వారితో చెప్పు. ఆ దహనబలుల వాసన యెహోవాకు ఇష్టం. 3 వారు యెహోవాకు ఇవ్వవలసిన దహనబలులు ఇవే. ప్రతిరోజూ పుష్టిగల, ఒక సంవత్సరం వయసున్న రెండు మగ గొర్రె పిల్లలు. 4 ఒక గొర్రెపిల్ల ఉదయం, మరో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి. 5 మరియు ఒక పావు ఒలీవనూనెతో కలుపబడ్డ రెండుపావుల మంచి పిండి ధాన్యార్పణగా పెట్టాలి.” 6 సీనాయి కొండ దగ్గర వారు ప్రతి దినం అర్పణలు అర్పించటం మొదలుపెట్టారు. ఆ దహనబలి అర్ఫణల వాసన యెహోవాకు ఇష్టమయినది. 7 దహనబలి అర్పణతో బాటు ప్రజలు పానార్పణ కూడ అర్పించాలి. ప్రతి గొర్రె పిల్లతోబాటు వారు ముప్పావు ద్రాక్షారసం అర్పించాలి. పవిత్ర స్థలంలో బలిపీఠం మీద పానార్పణం పోయాలి. ఇది యెహోవాకు కానుక. 8 రెండో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి. సరిగ్గా ఉదయార్పణలాగే దీనిని అర్పించాలి. అలాగే అదే రకం పానార్పణం ఇవ్వాలి. ఈ దహనబలి యెహోవాకు సువాసనగా ఉంటుంది.
సబ్బాతు అర్పణలు
9 “విశ్రాంతి దినం శనివారం నాడు, ఒక సంవత్సరం వయసుగల లోపంలేని రెండు గొర్రె పిల్లల్ని, తూమెడు పిండిలో రెండు పదోవంతుల మంచి పిండి ఒలీవ నూనెలో కలిపిన పానార్పణం మీరు అర్పించాలి. 10 విశ్రాంతి దినం కోసం ఇది ప్రత్యేక అర్పణ. ప్రతి రోజూ ఇచ్చే అర్పణ, పానార్పణ గాక ఇది అదనం.
నెలసరి సమావేశాలు
11 “ప్రతి నెలా మొదటి రోజున ప్రత్యేకమైన దహనబలి మీరు యెహోవాకు అర్పించాలి. ఈ అర్పణలో లోపంలేని రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు ఏడు. 12 మరియు ఒలీవ నూనెతో కలుపబడిన తూమెడు మంచి పిండితో మూడు పదోవంతులను ధాన్యార్పణగా ప్రతి కోడె దూడతోబాటు అర్పించాలి. అలాగే, ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును పొట్టేలుతో బాటు ధాన్యార్పణగా అర్పించాలి. 13 ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును ఒక్కో గొర్రెపిల్లతోబాటు ధాన్యార్పణగా అర్పించాలి. ఇది యెహోవాకు సువాసన ఇచ్చే దహనబలి. 14 ప్రతి కోడె దూడతోబాటు పడిన్నర ద్రాక్షారసం, పొట్టేలుతోబాటు ఒక్క పడి ద్రాక్షారసం, ప్రతి గొర్రెపిల్లతోబాటు ముప్పావు ద్రాక్షారసం పానార్పణం. ఇది సంవత్సరంలో నెలనెలా అర్పించాల్సిన దహనబలి. 15 ప్రతి రోజూ అర్పించే దహనబలి, పానార్పణంగాక ఒక మగ మేకను యెహోవాకు మీరు అర్పించాలి. ఆ మేక పాప పరిహారార్థ బలి.
పస్కా పండుగ
16 “మొదటి నెల (నిసాను) పదునాలుగవ రోజున పస్కా. 17 పులియని రొట్టెల పండుగ అదే నెల పది హేనో రోజున ప్రారంభం అవుతుంది. ఆ పండుగ ఏడు రోజులపాటు ఉంటుంది. పొంగని రొట్టెలు మాత్రమే మీరు తినాలి. 18 ఈ పండుగ మొదటి రోజున మీరు ఒక ప్రత్యేక సభ జరపాలి. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. 19 మీరు యెహోవాకు దహనబలులు అర్పించాలి. దహనబలులు రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, అంగవిహీనం లేని సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు. 20-21 ఒక్కొక్క కోడె దూడతో తూములో మూడు పదివంతులును, పొట్టేలుతో రెండు పది వంతులును, ఒక్కో గొర్రెపిల్లతో, ఒక్కో పదోవంతు మంచి పిండి ఒలీవ నూనెతో కలిపి ధాన్యార్పణంగా పెట్టాలి. 22 ఒక మగ మేకను కూడ మీరు ఇవ్వాలి. ఆ మేక మీ కోసం పాప పరిహారార్థబలి అవుతుంది. అది మీ పాపాలను కప్పి పుచ్చుతుంది. 23 ప్రతి ఉదయం మీరు అర్పించే దహనబలి అర్పణ కాక ఈ అర్పణలు మీరు అర్పించాలి.
24 “అదే విధంగా ఏడు రోజులపాటు మీరు ఆహార అర్పణలు అర్పించాలి. ప్రతి రోజూ దానిని హోమాంగా మీరు అర్పించాలి. ఈ అర్పణ యెహోవాకు ఇష్టమైన సునాసన. మీరు దహనబలిని, దాని పానార్పణను క్రమంగా అర్పించాలి. ఇవిగాక ఆహారం (ప్రజలకు) మీరు అర్పించాలి.
25 “అప్పుడు పస్కా పండుగ ఏడవ రోజున మీకు ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.
వారాల పండుగ (పెంతెకొస్తు)
26 “ప్రథమ ఫలాల పండుగలో (వారాల పండుగ) కొత్త ధాన్యంలోనుంచి మీరు ధాన్యార్పణ యెహోవాకు ఇవ్వవలెను. ఆ సమయంలో కూడ మీరు ఒక ప్రత్యేక సభ ఏర్పాటు చేయాలి. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. 27 మీరు దహనబలులు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన. రెండు కోడెదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు మీరు అర్పించాలి. 28 ప్రతి కోడెదూడతోను, నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదోవంతులు, ప్రతి పొట్టేలుతో రెండు పదోవంతులు 29 ఒక్కో గొర్రె పిల్లతో ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి. 30 మీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఒక మగ మేకనుకూడ మీరు బలి ఇవ్వవలెను. 31 రోజువారీ దహనబలులు, ధాన్యార్పణాలు గాక వీటిని మీరు అర్పించాలి. జంతువులు అంగహీనము కానివిగా ఉండేటట్టు తప్పక చూడాలి. పానార్పణం పరిశుభ్రమయినదిగా ఉండాలి.
సొలొమోను కీర్తన.
72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
2 నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
3 దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
4 పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
5 సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
6 పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
7 అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
8 సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు
అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము.
9 అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము
అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిలపడనిమ్ము.
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక.
షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక.
రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు.
మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు.
రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు.
ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
15 రాజు దీర్ఘాయుష్మంతుడగును గాక.
షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక.
రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి.
ప్రతిరోజూ అతణ్ణి దీవించండి.
16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక.
కొండలు పంటలతో నిండిపోవునుగాక.
పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక.
పొలాలు గడ్డితో నిండిపోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.
17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక.
సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక.
అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక.
మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.
18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!
20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం.
ఈజిప్టుకు దేవుని సందేశం
19 చూడండి! వేగంగా పోయే మేఘం మీద యెహోవా వస్తున్నాడు. యెహోవా ఈజిప్టులో ప్రవేశిస్తాడు, అప్పుడు ఈజిప్టు అబద్ధ దేవుళ్లంతా భయంతో వణికిపోతారు. ఈజిప్టు ధైర్యంగలది కానీ ఆ ధైర్యం వేడి మైనంలా కరగిపోతుంది.
2 దేవుడు చెబుతున్నాడు: “ఈజిప్టు ప్రజలు వారికి వారే విరోధంగా పోరాడుకొనేట్టు నేను చేస్తాను. మనుష్యులు వారి సోదరులతో పోరాడుతారు. పొరుగువారు పొరుగువారికి విరోధం అవుతారు. పట్టణాలు పట్టణాలకు విరోధం అవుతాయి. రాష్ట్రాలు రాష్ట్రాలకు విరోధం అవుతాయి. 3 ఈజిప్టు ప్రజలు గందరగోళమవుతారు. వారు చేయాల్సింది ఏమిటి అని ప్రజలు వారి అబద్ధ దేవుళ్లను, జ్ఞానులను అడుగుతారు. ప్రజలు వారి మాంత్రికులను, భూత వైద్యులను అడుగుతారు. కానీ వారి సలహా నిష్ప్రయోజనం.” 4 సర్వశక్తిమంతుడైన యెహోవా, ప్రభువు చెబుతున్నాడు, “నేను (దేవుణ్ణి) ఈజిప్టును కఠినమైన యజమానికి అప్పగిస్తాను. శక్తిగల ఒక రాజు ప్రజలను పాలిస్తాడు.”
5 నైలునది ఎండిపోతుంది. 6 నదులన్నీ చెడ్డకంపు కొడ్తాయి. ఈజిప్టులో కాలువలు ఎండిపోయి, నీరు ఉండకుండా పోతుంది. నీటి మొక్కలు అన్నీ కుళ్లిపోతాయి. 7 నదీ తీరాల్లోని మొక్కలన్నీ ఎండిపోయి, కొట్టుకొని పోతాయి. నది మహా విశాలంగా ఉన్న చోటగూడా మొక్కలు చస్తాయి.
8 “నైలునదిలో చేపలుపట్టే జాలరులు అందరూ దుఃఖపడి ఏడుస్తారు. వారు తమ ఆహారంకోసం నైలు నదిమీద ఆధారపడతారు. కానీ అది ఎండిపోతుంది. 9 బట్టలు తయారు చేసే వాళ్లంతా చాలా దుఃఖపడతారు. పీచువస్త్రాలు తయారు చేయటానికి ప్రజలకు పీచు కావాలి. కానీ నది ఎండిపోయి ఈ పీచు మొక్కలు పెరగవు. 10 నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు.
11 “సోయను పట్టణ నాయకులు తెలివి తక్కువ వాళ్లు. ఫరోయొక్క ‘తెలివిగల నాయకులు’ తప్పుసలహాలు ఇస్తారు. వారు తెలివిగల వాళ్లని ఆ నాయకులు అంటారు. వారు పూర్వపు రాజుల కుటుంబాలకు చెందినవాళ్లం అంటారు. కానీ వారు, వాళ్లు అనుకొన్నంత తెలివిగలవాళ్లు కారు.” 12 ఈజిప్టూ, నీ జ్ఞానులు ఎక్కడ? సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టు కోసం వేసిన పథకం ఏమిటో ఆ జ్ఞానులు తెలుసుకోవాలి. ఏం జరుగ బోతుందో అది నీకు చెప్పాల్సినవాళ్లు వారే.
13 సోయను నాయకులు వెర్రివాళ్లుగా చేయబడ్డారు. నోపు నాయకులు దొంగ సంగతులు నమ్మేసారు. అందుచేత నాయకులు ఈజిప్టును తప్పుత్రోవను నడిపించారు. 14 ఆ నాయకులను యెహోవా గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజిప్టును తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్లాడే వాళ్లలా ఉన్నారు. 15 ఆ నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. (ఈ నాయకులే “తలలు, తోకలు.” వారే, “మొక్కల కొమ్మలు, కాండాలు.”)[a]
16 ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, వారు భయపడతారు. 17 యూదా దేశం, ఈజిప్టు ప్రజలందరికి భయం పుట్టించే దేశం అవుతుంది. ఈజిప్టులో ఎవరైనా సరే యూదా పేరు వింటే భయపడతారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టులో భయంకర సంగతులు జరగాలని పథకం వేసాడు గనుక ఇవి జరుగుతాయి. 18 ఆ కాలంలో ప్రజలు కనాను భాష (యూదుల బాష) మాట్లాడే పట్టణాలు ఈజిప్టులో అయిదు ఉంటాయి. ఈ పట్టణాల్లో ఒక దానికి “నాశన పట్టణం”[b] అని పేరు పెట్టబడుతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవాను వెంబడిస్తాం అని ప్రజలు ప్రమాణం చేస్తారు.
19 ఆ కాలంలో ఈజిప్టు కేంద్రంలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. యెహోవాకు సన్మాన సూచకంగా ఈజిప్టు సరిహద్దులో ఒక స్తంభం ఉంటుంది. 20 సర్వశక్తిమంతుడైన యెహోవా శక్తివంతమైన పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ప్రజలు మొర పెట్టినప్పుడల్లా, యెహోవా సహాయం పంపిస్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని విమోచిస్తాడు.
21 ఆ సమయంలో ఈజిప్టులోని ప్రజలు యెహోవాను వాస్తవంగా తెలుసుకొంటారు. ఈజిప్టు ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు, అనేక బలులు అర్పిస్తారు. వారు యెహోవాకు ప్రమాణాలు చేస్తారు. వారు ఆ ప్రమాణాలను నిలబెట్టుకొంటారు. 22 ఈజిప్టు ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. మరియు అప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు) వారు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. యెహోవా వారి ప్రార్థనలు వింటాడు, వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు).
23 ఆ కాలంలో ఈజిప్టు నుండి అష్షూరుకు రాజమార్గం ఉంటుంది. అప్పుడు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు వెళ్తారు, ఈజిప్టు నుండి ప్రజలు అష్షూరు వెళ్తారు. ఈజిప్టు అష్షూరుతో కలిసి పనిచేస్తుంది. 24 ఆ కాలంలో ఇశ్రాయేలు, అష్షూరు, ఈజిప్టు కలిసి దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకొంటారు. ఇది దేశానికి ఆశీర్వాదం. 25 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ దేశాలను ఆశీర్వదిస్తాడు. “ఈజిప్టూ, మీరే నా ప్రజలు అష్షూరూ, నిన్ను నేను సృష్టించాను. ఇశ్రాయేలూ, నీవు నా స్వంతం. మీరంతా ఆశీర్వదించబడిన వాళ్లు” అని ఆయన అంటాడు.
అష్షూరు ఈజిప్టును, ఇథియోపియాను ఓడిస్తుంది
20 అష్షూరు రాజు సర్గోను. అష్డోదు మీద యుద్ధం చేయటానికి సర్గోను తర్తానును ఆ పట్టణం మీదికి పంపించాడు. తర్తాను అక్కడికి వెళ్లి ఆ పట్టణాన్ని పట్టుకొన్నాడు. 2 ఆ సమయంలో ఆమోజు కుమారుడు యెషయా ద్వారా యెహోవా మాట్లాడాడు: “వెళ్లు, నీ నడుముకు కట్టిన దుఃఖవస్త్రం తీసివేయి. నీ పాదాల జోళ్లు తీసివేయి” అని యెహోవా చెప్పాడు. యెషయా యెహోవాకు విధేయుడయ్యాడు. మరియు యెషయా బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా అక్కడ అంతా తిరిగాడు. 3 అప్పుడు యెహోవా చెప్పాడు: “బట్టలు లేకుండ, చెప్పులు లేకుండా యెషయా మూడు సంవత్సరాలు తిరిగాడు. ఇది ఈజిప్టు, ఇథియోపియాకు సంకేతం. 4 అష్షూరు రాజు ఈజిప్టును, ఇథియోపియాను ఓడిస్తాడు. అష్షూరు బందీలను పట్టుకొని, వారి దేశాల నుండి తీసుకొనిపోతాడు. పెద్దవాళ్లు, యువతీ యువకులు బట్టలు చెప్పులు లేకుండానే తీసుకొని పోబడతారు. వారు సాంతం నగ్నంగా ఉంటారు. ఈజిప్టు ప్రజలు అవమానించబడతారు. 5 ప్రజలు సహాయం కోసం ఇథియోపియా వైపుచూస్తారు. ఆ ప్రజలు భగ్నమైపోతారు. ఈజిప్టు ఔన్నత్యం చూచి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి ప్రజలు అవమానించబడతారు.”
6 సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రజలు, “ఆ దేశాలు మాకు సహాయం చేస్తాయని వాటిని నమ్ముకొన్నాము. అవి మమ్మల్ని అష్షూరు రాజు నుండి విమోచిస్తాయని మేం వాటి దగ్గరకు పరుగెత్తాం. కానీ వాటిని చూడండి. ఆ దేశాలు పట్టుకోబడ్డాయి, మరి మనం ఎలా తప్పించుకోగలుగుతాం?” అని అంటారు.
1 యేసు క్రీస్తు సేవకుడును, అపొస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు, మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతినిబట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవాళ్ళకు వ్రాస్తున్నది.
2 దేవుణ్ణి గురించి, మన ప్రభువైన యేసు క్రీస్తును గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.
మనకవసరమైన ప్రతిదాన్ని దేవుడు మనకిచ్చాడు
3 మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవటానికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, ఆత్మీయ జీవితానికి కావలసినవాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు. 4 ఈ విధంగా, అమూల్యమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకోసం చేసాడు. ఆ వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ ప్రపంచంలోని పాపాలనుండి తప్పించుకొని, తన స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసాడు.
5 అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవరుచుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని, 6 జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను, 7 ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా దయతో నిండిన ప్రేమను అలవరుచుకోండి. 8 ఈ గుణాలు మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని ఫలవంతంగాను, ఉపయోగకరంగాను చేస్తాయి. 9 ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి ఉండదు. అలాంటివాడు గ్రుడ్డివానితో సమానము. అంటే ఇలాంటి వ్యక్తి, తాను యిదివరలో చేసిన పాపాల్ని దేవుడు క్షమించాడన్న విషయం మరిచిపోయాడన్నమాట.
10 సోదరులారా! దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించేటట్లు యింకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూవుంటే మీరేనాటికీ క్రిందపడరు. 11 తద్వారా మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘనస్వాగతం లభిస్తుంది.
12 వీటిని గురించి మీకిదివరకే తెలుసు. ప్రస్తుతం మీరంగీకరించిన సత్యంలో మీకు దృఢమైన విశ్వాసముంది. అయినా ఈ విషయాల్ని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 13 గుడారమనే ఈ శరీరంలో ప్రాణమున్నంతవరకు, మీకు జ్ఞాపకం చేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. 14 ఎందుకంటే, మన యేసు క్రీస్తు ప్రభువు ముందే స్పష్టం చేసినట్లు, నేను త్వరలోనే ఈ దేహాన్ని వదిలివేస్తానని నాకు తెలుసు.[a] 15 నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొనేటట్లు నేను అన్ని విధాలా పాటుపడతాను.
ప్రవచన వాక్యం
16 యేసు క్రీస్తు ప్రభువు రాకను గురించి, ఆయన శక్తిని గురించి తెలివిగా అల్లిన కథల ద్వారా మేము మీకు చెప్పలేదు. మేము ఆయన గొప్పతనాన్ని కళ్ళారా చూసాము. 17 ఆయన తన తండ్రి అయిన దేవుని నుండి కీర్తిని, మహిమను పొందుతుండగా, గొప్ప బలముగల స్వరము వినిపించింది: “ఈయన నా కుమారుడు. ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగుతోంది”[b] అని, 18 పవిత్రమైన పర్వతంపై మేము ఆయనతో ఉన్నప్పుడు పరలోకంనుండి ఈ స్వరం వినిపించటం మేము స్వయంగా విన్నాము.[c]
19 అందువల్ల, ప్రవక్తలు చెప్పిన సందేశమంటే మాకు యింకా ఎక్కువ విశ్వాసం కలిగింది. మీరు ఆ సందేశాన్ని గమనించటం మంచిది. ఆ సందేశం చీకటిలో వెలిగే వెలుగులాంటిది. సూర్యోదయమయ్యే వరకూ, వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వెలుగును మీరు గమనిస్తూ ఉండాలి. 20 అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. 21 ఎందుకంటే, “ప్రవచనం” మానవులు తమ యిష్ట ప్రకారం పలికింది కాదు. పవిత్రాత్మచే ప్రేరేపణ పొంది వాళ్ళు దేవుణ్ణుండి సందేశాన్ని పలికారు.
© 1997 Bible League International