M’Cheyne Bible Reading Plan
సెలోపెహాదు కుమార్తెలు
27 హెసెరు కుమారుడు సెలోపెహాదు. హెసెరు గిలాదు కుమారుడు. గిలాదు మాకీరు కుమారుడు. మాకీరు మనష్షే కుమారుడు. మనష్షే యోసేపు కుమారుడు. సెలోపెహాదుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 2 సన్నిధి గుడారం దగ్గర సమావేశం అవుతోన్న మోషే, యాజకుడైన ఎలియాజరు, పెద్దలు, ప్రజలు అందరి ముందరకు ఈ అయిదుగురు స్త్రీలూ వెళ్లి, సన్నిధి గుడారం ఎదుట నిలబడ్డారు.
ఈ ఐదుగురు కూతుళ్లు ఈ విధంగా చెప్పారు: 3 “మనం అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడే మా తండ్రి చనిపోయాడు. అతడు కోరహు గుంపులో చేరినవాడు కాడు. (కోరహు యెహోవానుంచి తొలగి ఎదురు తిరిగినవాడు.) మా తండ్రిది సహజ మరణం. కానీ మా తండ్రికి కుమారులు లేరు. 4 అంటే మా తండ్రి పేరు కొనసాగదు. మా తండ్రి పేరు కొనసాగక పోవటం సక్రమం కాదు. ఆయనకు కుమారులు లేరు గనుక ఆయన పేరు అంతం అవుతుంది. అందుచేత మా తండ్రి సోదరులకు వచ్చే భూమిలో మాకు కొంత ఇవ్వవలసిందిగా మేము మీకు మనవి చేస్తున్నాము.”
5 కనుక ఏమి చేయాలని యెహోవాను మోషే అడిగాడు. 6 అతనితో యెహోవా ఇలా అన్నాడు, 7 “సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది సరియైనదే. వాళ్లు వారి తండ్రి సోదరులతో పాటు భూమిని పంచుకోవలసిందే. కనుక నీవు వారి తండ్రికిచ్చిన భూమిని వారికి ఇవ్వాలి.
8 “కనుక ఇశ్రాయేలు ప్రజలకు, ఇలా చట్టం తయారు చేయి. ‘ఒకనికి కుమారులు లేకుండానే అతడు చనిపోతే, అతని ఆస్తి అంతా అతని కుమార్తెలకు ఇవ్వాలి. 9 అతనికి కుమార్తెలు లేకపోతే, అతని ఆస్తి అంతా అతని సోదరులకు ఇవ్వాలి. 10 అతనికి సోదరులు లేకపోతే అతని ఆస్తి అంతా అతని తండ్రి సోదరులకు ఇవ్వాలి. 11 అతని తండ్రికి సోదరులు లేకపోతే, అతని ఆస్తి అంతా, అతని కుటుంబంలో దగ్గర బంధువులకు ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజల్లో ఇది ఒక చట్టంగా ఉండాలి. యెహోవాయే ఈ ఆజ్ఞను మోషేకు ఇస్తున్నాడు.’”
కొత్త నాయకుడుగా యెహోషువ
12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఆ కొండమీదికి ఎక్కు. యొర్దాను నదికి తూర్పున ఉన్న కొండల్లో అది ఒకటి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు అక్కడ నుండి చూస్తావు. 13 నీవు ఈ దేశాన్ని చూశాక, నీ సోదరుడు అహరోను మరణించినట్టే నీవు మరణిస్తావు. 14 సీను అరణ్యంలో నీళ్లకోసం ప్రజలు కోపగించుకోవటం జ్ఞాపకం చేసుకో. నీవూ, అహరోనూ కూడ నా ఆజ్ఞకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. ప్రజల ముందు నీవు నన్ను ఘనపర్చలేదు, పవిత్రంగా చూడలేదు.” (ఇది సీను అరణ్యంలో కాదేషు దగ్గర మెరీబా నీళ్ల సంగతి.)
15 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: 16 “ప్రజల ఆలోచనలు తెలిసిన దేవుడు యెహోవా ప్రభువు, నీవే ఈ ప్రజలకోసం మరో నాయకుడిని ఎంచుకోమని మనవి చేస్తున్నాను. 17 ఈ దేశంలోనుండి వీరిని బయటకు నడిపించి, కొత్త దేశంలో చేర్చగల నాయకుడిని ఎంచవలసిందిగా నేను యెహోవాకు మనవి చేస్తున్నాను. అప్పుడు యెహోవా ప్రజలు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.”
18 కనుక మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నూను కుమారుడైన యెహోషువ నాయకుడుగా ఉంటాడు. యెహోషువ ఆత్మను పొందినవాడు. అతడిని కొత్త నాయకునిగా చేయి. 19 యాజకుడైన ఎలియాజరు ఎదుటా, ప్రజలందరి ఎదుటా నిలబడమని అతనితో చెప్పు. అప్పుడు అతడిని కొత్త నాయకునిగా నీవు చేయి.
20 “అతడిని నీవు నాయకునిగా చేస్తున్నావని ప్రజలకు చూపెట్టు, అప్పుడు ప్రజలంతా అతనికి లోబడతారు. 21 ఒకవేళ యెహోషువ ఒక కొత్త నిర్ణయం ఏదైనా చేయాలంటే అతడు యాజకుడైన ఎలియాజరు దగ్గరకు వెళతాడు. యెహోవా జవాబు తెలుసుకొనేందుకు ఎలియాజరు ఊరీమును ప్రయోగిస్తాడు. అప్పుడు యెహోషువ, ప్రజలందరూ దేవుడు చెప్పిన వాటిని చేస్తారు. ‘యుద్ధానికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు యుద్ధానికి వెళ్తారు. ఒకవేళ ‘ఇంటికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు ఇంటికి వెళతారు.”
22 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యాజకుడైన ఎలియాజరు ముందు, ప్రజలందరి ఎదుట నిలబడమని యెహోషువాతో చెప్పాడు. మోషే, 23 అప్పుడు అతడే కొత్త నాయకుడు అని చూపెట్టేందుకు అతనిమీద మోషే చేతులు పెట్టాడు. అతనితో యెహోవా చెప్పినట్టే అతడు చేసాడు.
సంగీత నాయకునికి: ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన.
70 దేవా, నన్ను రక్షించుము.
దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
2 మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
వారిని నిరాశపరచుము.
వారిని అవమానించుము.
మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు.
వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.
3 మనుష్యులు నన్ను హేళన చేసారు.
వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.
4 నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను.
నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.
5 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము.
దేవా, నన్ను తప్పించగలవాడవు నీవు ఒక్కడవు మాత్రమే.
ఆలస్యం చేయవద్దు!
71 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
2 నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.
నా మాట వినుము. నన్ను రక్షించుము.
3 భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.
నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము.
నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
4 నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
5 నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.
నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
6 నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.
నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు.
నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.
7 ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను.
ఎందుకంటే నీవే నా బలానికి ఆధారం.
8 నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను.
9 కనుక నేను ముసలివాడినని నన్ను త్రోసివేయకుము.
నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము.
10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు.
ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు.
11 “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి.
అతనికి ఎవరూ సహాయం చేయరు” అని నా శత్రువులు అంటున్నారు.
12 దేవా, నన్ను విడిచిపెట్టకుము.
దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము.
13 నా శత్రువులను ఓడించుము.
వారిని పూర్తిగా నాశనం చేయుము.
వారు నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్నారు.
వారు సిగ్గు, అవమానం అనుభవిస్తారని నా నిరీక్షణ.
14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను.
నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను.
15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను.
నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను.
లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.
16 యెహోవా, నా ప్రభూ, నీ గొప్పతనాన్ని గూర్చి నేను చెబుతాను.
నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను.
17 దేవా, నేను చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు.
నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబుతూనే ఉన్నాను.
18 దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు.
నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి క్రొత్త తరానికీ నేను చెబుతాను.
19 దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది.
దేవా, నీవంటి దేవుడు మరొకడు లేడు.
నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు.
20 నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు.
కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు.
భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు.
21 ఇదివరకటి కంటె గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము.
నన్ను ఆదరిస్తూనే ఉండుము.
22 స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను.
నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను.
23 నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది.
నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను.
24 అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది.
నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.
సిరియాకు దేవుని సందేశం
17 ఇది దమస్కుకు విచారకరమైన సందేశం. దమస్కుకు ఈ సంగతులు సంభవిస్తాయని యెహోవా సెలవిస్తున్నాడు:
“దమస్కు ఇప్పుడు పట్టణం. కాని దమస్కు నాశనం చేయబడుతుంది.
దమస్కులో శిథిలాలు మాత్రమే మిగుల్తాయి.
2 ప్రజలు అరోయేరు పట్టణాలు విడిచి పెట్టేస్తారు.
ఆ ఖాళీ పట్టణాల్లో గొర్రెల మందలు విచ్చలవిడిగా తిరుగుతాయి.
వాటిని పట్టించుకొనేవాడు ఎవ్వడూ ఉండడు.
3 ఎఫ్రాయిము ప్రాకార పట్టణాలు (ఇశ్రాయేలు) నాశనం చేయబడతాయి.
దమస్కులో ప్రభుత్వం అంతమవుతుంది.
ఇశ్రాయేలుకు సంభవించినదే సిరియాకు సంభవిస్తుంది. ప్రముఖులంతా తీసుకొని పోబడతారు.”
ఆ సంగతులు జరుగుతాయని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు.
4 ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఐశ్వర్యం అంతా పోతుంది.
వ్యాధి మూలంగా చాలా బరువు తగ్గిపోయిన మనిషిలా యాకోబు ఉంటాడు.
5 ఆ సమయం రెఫాయీము లోయలో ధాన్యపు కోతలా ఉంటుంది. పొలంలో పెరిగిన మొక్కలను పనివాళ్లు ఒక చోట వేస్తారు. తర్వాత మొక్కల నుండి గింజలను వారు కోస్తారు. ధాన్యం వారు కుప్పవేస్తారు.
6 ఆ సమయం, ప్రజలు ఒలీవ పండ్లు కోసే సమయంలా ఉంటుంది. ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు. అయితే సాధారణంగా చెట్లకొమ్మలకు కొన్ని ఒలీవ పండ్లు మిగిలిపోతాయి. కొన్ని పై కొమ్మలకు నాలుగైదు ఒలీవ పండ్లు మిగిలి పోతాయి. ఆ పట్టణాలకు గూడ అలానే ఉంటుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు.
7 ఆ సమయంలో ప్రజలు వారిని చేసిన దేవునివైపు చూస్తారు. వారి కన్నులు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని చూస్తాయి. 8 ప్రజలు, వారు చేసిన గొప్ప వాటిని నమ్ముకోరు. అబద్ధపు దేవుళ్ల కోసం వారు తయారు చేసిన ప్రత్యేక తోటలకు, బలిపీఠాలకు వారు వెళ్లరు. 9 ఆ కాలంలో కోటలుగల పట్టణాలన్నీ ఖాళీగా ఉంటాయి. ఆ పట్టణాలు, ఆ దేశానికి ఇశ్రాయేలు ప్రజలు రాకముందు ఉన్న కొండలు, అడవుల్లా ఉంటాయి. గతంలో ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే ప్రజలంతా పారిపోయేవారు. భవిష్యత్తులో దేశం మళ్లీ ఖాళీగా ఉంటుంది. 10 మిమ్మల్ని రక్షించే దేవుణ్ణి మీరు మరచిపోయారు గనుక ఇలా జరుగుతుంది. దేవుడే మీ భద్రతా స్థానం అని మీరు జ్ఞాపకం ఉంచుకోలేదు.
చాలా దూర స్థలాల నుండి మీరు కొన్ని మంచి ద్రాక్షా వల్లులను తెచ్చి నాటవచ్చును గాని ఆ మొక్కలు ఎదగవు. 11 ఒకనాడు మీరు మీ ద్రాక్ష వల్లులను నాటి, వాటిని పెంచటానికి ప్రయత్నం చేస్తారు. మర్నాడు మొక్కలు పెరగటం మొదలవుతుంది. అయితే కోతకాలంలో మొక్కల నుండి పండ్లు కోయటానికి మీరు వెళ్తారు గాని అవి మొత్తం చచ్చి ఉండటం మీరు చూస్తారు. ఆ మొక్కలన్నింటినీ ఒక రోగం చంపేస్తుంది.
12 ఎంతెంతో మంది ప్రజలు చెప్పేది విను.
సముద్ర ఘోషలా వారు గట్టిగా ఏడుస్తున్నారు. ఆ ఘోష విను. ఆ ఏడుపు సముద్రపు ఘోషలా ఉంది.
సముద్రంలో రెండు అలలు ఢీకొన్న ఘోషలా ఉంది.
13 ప్రజలు ఆ అలల్లా ఉంటారు.
దేవుడు ఆ ప్రజలతో కఠినంగా మాట్లాడతాడు. వారు పారిపోతారు.
ప్రజలు గాలికి కొట్టుకొని పొయ్యే పొట్టులా ఉంటారు. ప్రజలు తుఫానుకు కొట్టుకొని పొయ్యే కలుపు మొక్కల్లా ఉంటారు.
14 ఆ రాత్రి ప్రజలు చాలా భయంగా ఉంటారు.
తెల్లవారే సరికి ఏమీ మిగలదు.
కనుక మన శత్రువులకు ఏమీ లభించదు.
వారు మన దేశం వస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు.
ఇథియోపియాకు దేవుని సందేశం
18 ఇథియోపియా నదుల తీరంలో దేశాన్ని చూడు. దేశం కీటకాలతో నిండిపోయింది. నీవు వాటి రెక్కల పటపట శబ్దం వినవచ్చు. 2 ఆ దేశం సముద్రం మీద జమ్ము పడవల్లో మనుష్యులను ఆవలికి పంపిస్తుంది.
వేగంగా పోయే సందేశహరులు,
ఎత్తుగా బలంగా ఉండే మనుష్యుల దగ్గరకు వెళ్తారు.
(ఎత్తుగా బలంగా ఉండే ఈ మనుష్యులంటే అన్ని చోట్ల ప్రజలకు భయం.
వారు బలంగల రాజ్యం.
వారి రాజ్యం ఇతర రాజ్యాలను జయిస్తుంది.
నదుల మూలంగా విభజించబడిన దేశంలో వారు ఉన్నారు).
3 వారికి ఏదో కీడు జరుగుతుంది అని ఆ ప్రజలకు హెచ్చరిక చేయి.
ఆ రాజ్యానికి ఈ సంగతి సంభవించటం ప్రపంచంలోని ప్రజలంతా చూస్తారు.
ఒక కొండ మీద ఎగురవేసిన పతాకంలా ప్రజలు ఈ విషయాన్ని తేటగా చూస్తారు.
ఎత్తయిన ఈ మనుష్యులకు సంభవించే ఆ సంగతిని గూర్చి భూలోకంలో జీవించే ప్రజలంతా వింటారు.
యుద్ధానికి ముందు ఊదే శంఖంలా
వారు దీనిని తేటగా వింటారు.
4 యెహోవా చెప్పాడు: “నా కోసం సిద్ధం చేయబడిన స్థలంలో నేను ఉంటాను. ఈ సంగతులు సంభవించటం నేను మౌనంగా చూస్తాను. 5 అందమైన ఒక వేసవి రోజు, మధ్యాహ్నం ప్రజలు విశ్రాంతి తీసుకొంటూ ఉంటారు. (అది వర్షాలు లేని ఎండాకాలపు కోత సమయం, ఉదయపు మంచు మాత్రమే ఉంటుంది) అప్పుడు ఏదో జరుగుతుంది. అది పూవులు వికసించిన తరువాత సమయం క్రొత్త ద్రాక్షలు మొగ్గ తొడిగి, పెరుగుతూ ఉంటాయి. అయితే కోతకు ముందు శత్రువు వచ్చి, మొక్కలు నరికేస్తాడు. శత్రువు ద్రాక్షలను చితుకగొట్టి, పారవేస్తాడు. 6 కొండ పక్షులు, అడవి జంతువులు తినటానికి ఆ ద్రాక్ష తీగలు విడిచిపెట్టబడతాయి. వేసవిలో ఆ ద్రాక్షతీగల మీద పక్షులు నివాసం ఉంటాయి. ఆ చలికాలం అడవి జంతువులు ఆ ద్రాక్షతీగలను తింటాయి.”
7 ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవాకు ఒక అర్పణ తీసుకొని రాబడుతుంది. ఎత్తుగా బలంగా ఉండే ఆ ప్రజలు దగ్గర్నుండే ఆ కానుక వస్తుంది. (ఎత్తుగా, బలంగా ఉండే ఈ ప్రజలంటే అన్ని చోట్ల మనుష్యులందరికీ భయమే. వారు చాలా బలమైన రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను ఓడిస్తుంది. నదులచే విభజించబడిన దేశంలో వారు ఉన్నారు.) ఈ కానుక, సీయోను కొండలోని యెహోవా స్థానానికి తీసుకొని రాబడుతుంది.
దేవుని మంద
5 మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయట మేమనగా, మీలాగే నేను కూడ ఒక పెద్దను. క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసినవాణ్ణి. దేవుడు వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్థుణ్ణి. 2 సంరక్షణలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్ఛ కూడా అదే! డబ్బుకు ఆశపడి కాకుండా మీ అభీష్టంతో ఆ కార్యాన్ని చేయండి. 3 దేవుడు మీకప్పగించిన వాళ్ళపై అధికారం చూపకుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగా ఉండండి. 4 ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నిటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది.
5 అదే విధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్త్రాన్ని ధరించి యితర్ల సేవ చెయ్యండి. ఎందుకంటే లేఖనాల్లో:
“దేవుడు గర్వంతో ఉన్నవాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు,
కాని, వినయంతో ఉన్నవాళ్ళకు కృపననుగ్రహిస్తాడు.”(A)
అని వ్రాయబడి ఉంది. 6 అందువల్ల దేవుని బలమైన చేతి క్రింద వినయంతో ఉండండి. సరియైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. 7 ఆయన మీ గురించి చింతిస్తాడు. గనుక మీ చింతల్ని ఆయనపై వదలివేయండి.
8 మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి సాతాను సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని మ్రింగివేయాలని మీ చుట్టు తిరుగుతూ ఉన్నాడు. 9 ఈ ప్రపంచంలో ఉన్న మీ సోదరులు యిలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు. గనుక దృఢవిశ్వాసంతో ఉండి సాతానుకి ఎదురు తిరగండి.
10 దయామయుడైన దేవుడు, మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలనుభవించాక, ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని యిచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. 11 ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండుగాక! ఆమేన్.
చివరి వందనాలు
12 నా సోదరునిగా భావించే విశ్వాసనీయుడైన సిల్వాను సహయంతో మీకీ లేఖను పంపుచున్నాను. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఇది దేవుని నిజమైన అనుగ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దేశించి ఈ లేఖను వ్రాస్తున్నాను. ఆ అనుగ్రహాన్ని వదులుకోకండి.
13 మీతో సహా ఎన్నుకోబడి బబులోనులో ఉన్న సంఘం, నా కుమారునితో సమానమైన మార్కు, మీకు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 14 ప్రేమలో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకొని శుభాకాంక్షలు తెలుపుకోండి.
క్రీస్తులో నున్న మీ అందరికి శాంతి కలుగుగాక!
© 1997 Bible League International