Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 26

జనులు వెక్కిరించబడ్డారు

26 ఆ మహా రోగం తర్వాత మోషేతో, అహరోను కుమారుడు యాజకుడైన ఎలియాజరుతో యెహోవా మాట్లాడాడు: “ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కించండి. ప్రతి కుటుంబాన్నీ చూచి, 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న పురుషులందరిని లెక్కించండి. వీరు ఇశ్రాయేలు సైన్యంలో పని చేయటానికి సమర్థులు” అని ఆయన చెప్పాడు.

ఇప్పటికి మోయాబు మైదానంలోనే ప్రజలు నివాసం చేస్తున్నారు. ఇది యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర ఉంది. కనుక మోషే, యాజకుడైన ఎలియాజరు ప్రజలతో మాట్లాడారు. వారు “20 గాని, అంతకంటె ఎక్కువ వయసు గాని ఉన్న మగవాళ్ల సంఖ్య లెక్కించాలి. ఇది మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ అన్నారు.”

ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల జాబితా ఇది:

రూబేను సంతతి వాళ్లు వీరే. (యాకోబుకు) ఇశ్రాయేలు పెద్ద కుమారుడు రూబేను వంశాలు:

హనోకు – హనోకీల వంశం

పల్లు – పల్లువారి వంశం

హెస్రోను – హెస్రోనీల వంశం

కర్మి – కర్మీల వంశం

రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43,730 మంది పురుషులు.

పల్లు కుమారుడు ఏలీయాబు. నెమూయేలు, దాతాను, అబీరాము ముగ్గురూ ఏలీయాబు కుమారులు. మోషే, అహరోనులకు ఎదురు తిరిగిన నాయకులు దాతాను, అబీరాము అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవాకు కోరహు ఎదురు తిరిగినప్పుడు వారు కోరహును వెంబడించారు. 10 అప్పుడే భూమి తెరచుకొని, కోరహును, అతని అనుచరులు అందరినీ మింగివేసింది. చనిపోయిన వారి సంఖ్య మొత్తం 250 మంది పురుషులు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇది ఒక హెచ్చరిక, గుర్తు. 11 అయితే కోరహు కుటుంబంలోని ఇతరులు మరణించలేదు.

12 షిమ్యోను సంతతిలోని వంశాలు ఇవి:

నెమూయేలు – నెమూయేలీ వంశం

యామీను – యామీనీల వంశం

యాకీను – యాకీనీల వంశం

13 జెరహు – జెరహీల వంశం

షావూలు – షావూలీ వంశం

14 షిమ్యోను సంతతిలోని వంశాలు అవి. వారు మొత్తం 22,200 మంది.

15 గాదు సంతతిలోని వంశాలు ఇవి:

సెపోను – సెపోనీల వంశం

హగ్గి – హగ్గీల వంశం

షూనీ – షూనీల వంశం

16 ఓజని – ఓజనీల వంశం

ఏరీ – ఏరీల వంశం

17 అరోది – అరోదీల వంశం

అరేలి – అరేలీల వంశం

18 అవి గాదు సంతతిలోని వంశాలు. వారు మొత్తం 40,500 మంది పురుషులు.

19-20 యూదా సంతతిలోని వంశాలు ఇవి:

షేలా – షేలావారి వంశం

పెరెసు – పెరెసీల వంశం

జెరహు – జెరహీల వంశం

(యూదా కుమారులు ఏరు, ఓనాను అనే ఇద్దరు కనానులో చనిపోయారు.)

21 పెరెసు వంశాలు ఇవి:

హెస్రోను – హెస్రోనీల వంశం

హములు – హములీల వంశం

22 యూదా సంతతిలోని వంశాలు ఇవి. పురుషుల సంఖ్య మొత్తం 76,500.

23 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు ఇవి:

తోల – తోలాలీ వారి వంశం

పువ్వా – పువ్వీల వంశం

24 యాషూబు – యాషూబీల వంశం

షిమ్రోను – షిమ్రోనీల వంశం

25 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 64,300.

26 జెబూలూను సంతతిలోని వంశాలు:

సెరెదు – సెరెదీల వంశం

ఏలోను – ఏలోనీల వంశం

యహలేలు – యహలేల వంశం

27 జెబూలూను సంతతిలోని వంశాలు అవి. పురుషులు సంఖ్య మొత్తం 60,500.

28 యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. ఒక్కో కుమారుడు కొన్ని స్వంత వంశాలతో కూడిన ఒక్కో సంతతి అయ్యారు. 29 మనష్షే సంతతి ఏవనగా:

మాకీరు – మాకీరువారి వంశం (మాకీరు గిలాదుకు తండ్రి,)

గిలాదు – గిలాదీల వంశం

30 గిలాదు వంశాలు:

ఈజరు – ఈజరీల వంశం

హెలెకు – హెలెకీవారి వంశం

31 అశ్రీయేలు – అశ్రీయేలీల వంశం

షెకెము – షెకెమీల వంశం

32 షెమిద – షెమిదీల వంశం

హెపెరు – హెపెరీల వంశం

33 హెపెరు కుమారుడు సెలోపెహాదు. కానీ అతనికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు. అతని కుమార్తెల పేర్లు మహల, నోయా, హొగ్ల, మిల్కా, తిర్సా.

34 అవన్నీ మనష్షే సంతతిలోని వంశాలు. పురుషుల సంఖ్య మొత్తం 52,700.

35 ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు ఏవనగా:

షుతల – షుతలీల వంశం

బేకరు – బేకరీల వంశం

తహను – తహనీల వంశం

36 షుతలహు వంశం వాడు ఏరాను.

అతని వంశం ఏరానీల వంశం

37 ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 32,500.

యోసేపు సంతతికి చెందిన మొత్తం మనుష్యులు వారే.

38 బెన్యామీను సంతతిలోని వంశాలు:

బెలా – బెలాలీ వంశం

అష్బెలు – అష్బెలీ వంశం

అహీరం – అహీరమీయీల వంశం

39 షుపం – షుపామీల వంశం

హుపం – హుపామీల వంశం

40 బెలా వంశాలు ఏవనగా:

ఆర్దు – ఆర్దీల వంశం

నయమాను – నయమానీల వంశం

41 బెన్యామీను సంతతిలోని వంశాలన్నీ అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,600.

42 దాను సంతతిలోని వంశాలు:

షూషాము – షూషామీల వంశం.

అది దాను సంతతిలోని కుటుంబం. 43 షూషామీల వంశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పురుషుల సంఖ్య మొత్తం 64,400.

44 ఆషేరు సంతతిలోని వంశాలు:

ఇమ్నా – ఇమ్నా వారి వంశం

ఇష్వి – ఇష్వీల వంశం

బెరీయ – బెరీయాల వంశం

45 బెరీయా వంశాలు:

హెబెరు – హెబెరీల వంశం

మల్కీయేలు – మల్కీయేలీల వంశం.

46 (ఆషేరుకు శెరహు అనే కూతురు కూడ ఉంది.) 47 ఆషేరు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 53,400.

48 నఫ్తాలీ సంతతిలోని వంశాలు:

యహసియేలు – యహసియేలీల వంశం

గూనీ – గూనీల వంశం

49 యెసెరు – యెసెరీల వంశం

షిల్లేము – షిల్లేమీల వంశం

50 నఫ్తాలీ సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,400.

51 కనుక ఇశ్రాయేలు పురుషుల సంఖ్య మొత్తం 6,01,730.

52 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 53 “ప్రతి వంశానికి దేశం లభిస్తుంది. ఇది నేను వారికి వాగ్దానం చేసిన దేశం. లెక్కించబడిన ప్రజలందరికీ సరిపడినంత భూమి ప్రతి వంశానికి లభిస్తుంది. 54 పెద్ద వంశానికి ఎక్కువ భూమి లభిస్తుంది. చిన్న వంశానికి తక్కువ భూమి లభిస్తుంది. అయితే నేను వాగ్దానం చేసిన దేశం ప్రతి వంశానికీ లభిస్తుంది. మరియు వారికి లభించే భూమి, లెక్కించబడిన వారందరికీ సరిపోయేటంత ఉంటుంది. 55 ప్రతి వంశానికీ ఆ భూమి ఇవ్వబడుతుంది. ఏ వంశం వారి భూమికి ఆ పేరే పెట్టబడుతుంది. 56 ప్రజలకు ఇస్తానని నేనే వాగ్దానం చేసినంతగా ఉంటుంది ఆ భూమి. పెద్ద వంశాలకీ, చిన్నవాటికీ అందివ్వబడుతుంది.”

57 లేవీ సంతతి కూడ లెక్కించబడింది. లేవీ సంతతిలోని వంశాలు ఇవి:

గెర్షోను – గెర్షోనీల వంశం

కహాతు – కహాతీల వంశం

మెరారి – మెరారిల వంశం

58 ఇవి కూడ లేవీ సంతతిలోని వంశాలే:

లిబ్నీల వంశం

హెబ్రోనీల వంశం

మహ్లీల వంశం

మూషీల వంశం

కోరహీల వంశం

అమ్రాము కహాతు వంశం వాడు. 59 అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె కూడ లేవీ సంతతిలోనిదే. ఆమె ఈజిప్టులో పుట్టింది. అమ్రాము, యోకెబెదులకు అహరోను, మోషే ఇద్దరు కుమారులు. వారికి మిర్యాము అని ఒక కుమార్తె కూడ ఉంది.

60 నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులకు తండ్రి అహరోను. 61 కానీ నాదాబు, అబీహు చనిపోయారు. అంగీకారం కాని అగ్నితో దేవునికి అర్పణచేసినందువల్ల వారు చనిపోయారు.

62 లేవీ సంతతిలో పురుషుల సంఖ్య మొత్తం 23,000, అయితే ఇతర ఇశ్రాయేలు మనుష్యులతో వీరు లెక్కించబడలేదు. మిగిలినవారికి యెహూవా వాగ్దానం చేసిన భూమి మాత్రం లేదు.

63 మోషే, యాజకుడైన ఎలియాజరు ఈ ప్రజలందరినీ లెక్క వేసారు. మోయాబు మైదానాల్లో వారు ఇశ్రాయేలు ప్రజలను లెక్క తీసారు. ఇది యెరికో ఎదుట యొర్దాను నది అవతల జరిగింది. 64 చాలకాలం క్రిందట సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే, యాజకుడైన అహరోనూ లెక్కపెట్టారు. అయితే వాళ్లంతా చనిపోయారు. మోషే మోయాబు మైదానాల్లో లెక్కపెట్టిన వారు వేరు, అంతకుముందు లెక్కపెట్టిన వారు వేరు. 65 వారు అందరూ ఎడారిలోనే చస్తారు అని ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా చెప్పినందువల్ల ఇలా జరిగింది. సజీవంగా ఉన్నవాళ్లు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే.

కీర్తనలు. 69

సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.

69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
    నా నోటి వరకు నీళ్లు లేచాయి.
నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
    నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
    అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
    నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
    నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.
నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.
    ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు.
    ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.
    నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.
నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము.
    ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము.
నా ముఖం సిగ్గుతో నిండి ఉంది.
    నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను.
నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు.
    నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు.
నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది.
    నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను.
10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను.
    అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు.
11 నా విచారాన్ని చూపించేందుకు నేను దుఃఖ బట్టలు ధరిస్తున్నాను.
    ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు.
12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు.
    త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు.
13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.
    నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను.
దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
14 బురదలో నుండి నన్ను పైకి లాగుము.
    బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు.
నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
15 అలలు నన్ను ముంచివేయనీయకుము.
    లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము.
    సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.
    నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.
17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు.
    నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము.
18 వచ్చి నా ఆత్మను రక్షించుము.
    నా శత్రువులనుండి నన్ను తప్పించుము.
19 నా అవమానం నీకు తెలుసు.
    నా శత్రువులు నన్ను అవమానపరిచారని నీకు తెలుసు.
    వారు నన్ను కించపరచటం నీవు చూసావు.
20 సిగ్గు నన్ను కృంగదీసింది.
    అవమానం చేత నేను చావబోతున్నాను.
సానుభూతి కోసం నేను ఎదురు చూశాను.
    కాని ఏమీ దొరకలేదు.
ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను.
    కాని ఎవరూ రాలేదు.
21 వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు.
    ద్రాక్షారసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు.
22 వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి.
    విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక.
23 వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము.
24 నీ కోపమును వారిపై కుమ్మరించుము.
    నీ భయంకర కోపమును వారు సహించనిమ్ము.
25 వారి కుటుంబాలు, ఇండ్లు
    పూర్తిగా నాశనం చేయబడునుగాక.
26 నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు.
    అప్పుడు బాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు.
27 వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము.
    నీవు ఎంత మంచివాడవుగా ఉండగలవో వారికి చూపించవద్దు.
28 జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము.
    మంచి మనుష్యుల పేర్లతో పాటు వారి పేర్లను గ్రంథంలో వ్రాయవద్దు.
29 నేను విచారంగాను, బాధతోను ఉన్నాను.
    దేవా, నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము.
30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
    కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
    ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
    పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
    యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
    దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
    యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36     ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
    ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.

యెషయా 16

16 ఆ దేశపు రాజుకు మీరు ఒక కానుక పంపాలి. సెలానుండి అరణ్యంగుండా సీయోను కుమార్తె కొండకు (యెరూషలేము) మీరు ఒక గొర్రెపిల్లను పంపాలి.

మోయాబు స్త్రీలు అర్నోను నది దాటేందుకు ప్రయత్నిస్తారు.
    సహాయం కోసం వారు ఒకచోట నుండి మరోచోటుకు పరుగులెత్తుతారు.
    వారు, గూడు నేల కూలినప్పుడు తప్పిపోయిన చిన్న పిట్ట పిల్లలా ఉంటారు.
“మాకు సహాయం చేయండి,
    మేం ఏం చేయాలో మాకు చెప్పండి!
మధ్యాహ్నపు ఎండనుండి నీడ కాపాడినట్టు
    మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడండి.
మా శత్రువుల నుండి మేం పారిపోతున్నాం
    మమ్మల్ని దాచిపెట్టండి.
    మమ్మల్ని మా శత్రువులకు అప్పగించకండి అని వారంటారు.
ఆ మోయాబు ప్రజలు వారి ఇండ్లనుండి బలవంతంగా వెళ్లగొట్టబడ్డారు.
    కనుక వాళ్లను మీ దేశంలో నివాసం ఉండనియ్యండి.
    వారి శత్రువులనుండి వారిని కాపాడండి.”

దోచుకోవటం ఆగిపోతుంది.
    శత్రువు ఓడించబడతాడు.
ఇతరులను బాధించే పురుషులు దేశం నుండి వెళ్లిపోతారు.
అప్పుడు క్రొత్త రాజు వస్తాడు.
    ఈ రాజు దావీదు వంశంవాడు.
    ఆయన నిజాయితీ పరుడు. ఆయన ప్రేమ, దయగలవాడు.
ఈ రాజు న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
    సరియైనవి, మంచివి ఆయన చేస్తాడు.

మోయాబు ప్రజలు చాలా గర్విష్ఠులని,
    మోసగాళ్లని మేము విన్నాం.
ఈ ప్రజలు తిరుగు బాటు దారులు, గర్విష్ఠులు.
    అయితే వారి గొప్పలన్నీ వట్టి మాటలే.
ఆ గర్వం చేత మొత్తం మోయాబు దేశం శ్రమ అనుభవిస్తుంది. మోయాబు ప్రజలంతా ఏడుస్తారు.
ప్రజలు విచారిస్తారు. గతంలో వారికి ఉన్నవన్నీ మళ్లీ కావాలనుకొంటారు.
    కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు కావాలని వారు కోరుకొంటారు.
హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్ష వల్లులు, ద్రాక్ష పండ్లు ఫలించటం లేదని ప్రజలు విచారంగా ఉంటారు.
    విదేశీ పాలకులు ద్రాక్ష వల్లులను నరికివేశారు.
    శత్రుసైన్యాలు యాజరు పట్టణం వరకు చాలా దూరం, అరణ్యంలోనికి విస్తరించారు. సముద్రం వరకు వారు విస్తరించారు.
“ద్రాక్ష పండ్లు నాశనం చేయబడ్డాయి.
    కనుక యాజరు, సిబ్మా ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను.
పంట ఉండదు గనుక హెష్బోను,
    ఏలాలే ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను.
వేసవి పండ్లు ఏమీ ఉండవు.
    సంతోషపు కేకలు అక్కడ ఉండవు.
10 కర్మెలులో పాటలు పాడటం మరియు సంతోషం ఉండదు.
    పంట కోత సమయంలో సంతోషం అంతా నేను నిలిపివేస్తాను.
ద్రాక్షపండ్లు ద్రాక్షరసం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
    కానీ అవన్నీ వ్యర్థం అవుతాయి.
11 అందుచేత మోయాబు గూర్చి నాకు చాలా విచారం కీర్హరెశు గూర్చి నాకు చాలా విచారం
    ఈ పట్టణాల గూర్చి నాకు ఎంతెంతో దుఃఖం.
12 మోయాబు ప్రజలు ఎత్తయిన వారి పూజాస్థలాలకు వెళ్తారు.
ప్రజలు ప్రార్థించాలని ప్రయత్నిస్తారు.
    కానీ సంభవించిన సంగతులన్నీ వారు చూస్తారు, ప్రార్థించలేనంత బలహీనులవుతారు.”

13 మోయాబును గూర్చి ఈ విషయాలు యెహోవా ఎన్నోసార్లు చెప్పాడు. 14 ఇప్పుడు “మూడు సంవత్సరాల్లో (కూలీ వాని కాలం లెక్క ప్రకారం) ఆ ప్రజలందరూ ఉండరు, వారికి అతిశయాస్పదమైనవన్నీ పోతాయి. కొంతమంది మనుష్యులు మిగిలి ఉంటారు. కానీ వారు ఎక్కువ మంది ఉండరు” అని యెహోవా చెబుతున్నాడు.

1 పేతురు 4

మారిన జీవితాలు

క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి. ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని, మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటివానికి పాపంతో సంబంధముండదు. గతంలో మీరు యూదులుకాని వాళ్ళవలే పోకిరి చేష్టలకు, దురాశకు, త్రాగుడుకు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగని విగ్రహారాధనలకులోనై జీవించారు. వారి ఇష్టము నెరవేర్చుచుండుటకు గడచిన కాలమే చాలును.

కాని ప్రస్తుతం మీరు వాళ్ళవలె మితిమీరిన దుష్ప్రవర్తనకు లోనై వాళ్ళతో సహ పరుగెత్తనందుకు, వాళ్ళు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. అయితే చనిపోయినవాళ్ళ మీద బ్రతికియున్నవాళ్ళ మీద, తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయినవాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పుచెప్పినట్లుగానే వాళ్ళమీద కూడా తీర్పు చెపుతాడు.

దేవుని వరాలకు మంచి నిర్వాహకులుగా ఉండండి

అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మనిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించ గలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా, “ప్రేమ” పాపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి. సణగకుండా, పరస్పరం అతిథి సత్కారాలు చేసుకోండి. 10 ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని యితర్ల సేవ చేయటానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి. 11 మాట్లాడాలని అనుకున్నవాడు దైవసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచినవాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవ చెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది.

క్రీస్తు అనుచరుడిగా శ్రమపడటం

12 నా ప్రియమైన సోదరులారా! మీకు అగ్నిపరీక్ష జరుగుతోంది. తద్వారా ఏదో జరుగరానిది జరిగినట్లు ఆశ్చర్యపడకండి. 13 క్రీస్తు కష్టాల్లో మీరు పాలు పంచుకుంటున్నందుకు ఆనందించండి. అలా చేస్తే ఆయన మహిమ వ్యక్తమైనప్పుడు మీరు చాలా ఆనందిస్తారు. 14 ఒకవేళ క్రీస్తు పేరు కారణంగా మీకు అవమానం కలిగితే, మీరు ధన్యులు. అంటే దేవుని తేజోవంతమైన ఆత్మ మీలో ఉన్నాడన్నమాట. 15 హత్య చేసి కాని, దొంగతనం చేసి కాని, దుర్మార్గంగా ప్రవర్తించి గాని, లేక యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటం వలన కాని, మీరు శిక్షను అనుభవించకూడదు. 16 మీరు క్రైస్తవులైనందువలన శిక్షననుభవించవలసివస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి. 17 ఎందుకంటే, తీర్పు చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. మొదట దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళ మీద తీర్పు చెప్పబడుతుంది. మరి ఆ తీర్పు మనతో ప్రారంభమైతే దేవుని సువార్తను నిరాకరించిన వాళ్ళగతేమౌతుంది? 18 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు:

“నీతిమంతులకే రక్షణ లభించటం కష్టమైతే,
    నాస్తికుని గతి, పాపాత్ముని గతి ఏమౌతుంది?”(A)

19 అందువలన, దైవేచ్ఛ ప్రకారం కష్టాలనుభవించేవాళ్ళు, విశ్వసింప దగిన సృష్టికర్తకు తమను తాము అర్పించుకొని సన్మార్గంలో జీవించాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International