Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 25

పెయోరు దగ్గర ఇశ్రాయేలీయులు

25 ఇశ్రాయేలు ప్రజలు ఇంకా షిత్తీము దగ్గరే నివాసం చేస్తున్నారు. ఆ సమయంలో పురుషులు మోయాబీ స్త్రీలతో లైంగిక పాపం చేయటం మొదలు పెట్టారు. 2-3 మోయాబీ స్త్రీలు వారి నకిలీ దేవుళ్లకు బలులు అర్పించేటప్పుడు వచ్చి సహాయం చేయుమని ఆ పురుషులను అహ్యానించారు. యూదులు కొంతమంది ఆ దేవుళ్లను కొలిచి, అక్కడ భోజనం చేసారు. కనుక ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు పెయోరులో బయలు దేవతను కొలవటం మొదలు పెట్టారు. యెహోవాకు ఈ ప్రజలమీద చాల కోపం వచ్చింది.

“ఈ ప్రజల నాయకులందర్నీ పిలువు. ప్రజలంతా చూసేటట్టు వారిని చంపు. వారి శరీరాల్ని యెహోవా ఎదుట పడవేయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవా కోపగించడు” అని మోషేతో యెహోవా చెప్పాడు.

ఇశ్రాయేలీయుల న్యాయమూర్తులతో “పెయోరులో నకిలీ దేవుడైన బయలును కొలిచేందుకు ప్రజలను నడిపించిన మీ వంశపు నాయకులను ఒక్కొక్కరిని మీరు తెలుసుకోవాలి. తర్వాత మీరు వారిని చంపేయాలి” అని మోషే చెప్పాడు.

ఆ సమయంలో మోషే, మరియు ఇశ్రాయేలు పెద్దలు అంతా సన్నిధి గుడార ద్వారం దగ్గర చేరారు. ఇశ్రాయేలు మగవాడొకడు ఒక మిద్యానీ స్త్రీని తన ఇంటికి, తన కుటుంబం దగ్గరకు తీసుకొనివచ్చాడు. మోషే, మరియు పెద్దలు అందరు చూసేటట్టుగా వాడు ఇలా చేసాడు. మోషే, ఆ పెద్దలు చాల విచారపడ్డారు. అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు యాజకుడు ఇది చూసాడు. కనుక అతడు సమాజంనుండి వెళ్లి తన ఈటె తీసుకున్నాడు. ఇశ్రాయేలు పురుషునితోబాటు వాని గుడారంలోకి అతడు వెళ్లాడు. ఆ ఇశ్రాయేలు వానిని, మిద్యానీ స్త్రీనీ ఈటెతో అతడు చంపేసాడు. ఆ ఈటెతో అతడు వారిద్దరి శరీరాలూ పొడిచాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప రోగం పుట్టింది. అయితే వీళ్లిద్దర్నీ ఫీనెహాసు చంపగానే ఆ రోగం ఆగిపోయింది. ఈ రోగం మూలంగా 24,000 మంది చనిపోయారు.

10 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 11 “యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు ఇశ్రాయేలు ప్రజలను నా కోపం నుండి రక్షించాడు. నన్ను సంతోష పెట్టేందుకు అతడు ఎంతో కష్టపడి ప్రయత్నించాడు. అతడు నాలాగే ఉన్నాడు. ప్రజల మధ్య నా మర్యాద కాపాడటానికి అతడు ప్రయత్నం చేసాడు. అందుచేత నేను అనుకొన్న ప్రకారం ప్రజలను చంపను. 12 కనుక నేను ఫీనెహాసుతో ఒక శాంతి ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పండి. 13 అతడు, అతని తర్వాత జీవించే అతని కుటుంబీకులు అందరికీ ఒక ఒడంబడిక ఉంటుంది. వారు ఎప్పటికీ యాజకులే. ఎందుచేతనంటే అతడు తన దేవుడి మర్యాద కాపాడటానికి ఎంతో కష్టపడి ప్రయత్నించాడు. అతడు చేసినది ఇశ్రాయేలు ప్రజల తప్పులకు ప్రాయశ్చిత్తం చేసింది.”

14 మిద్యానీ స్త్రీతో బాటు చంపబడ్డ ఇశ్రాయేలు మగవాడు సాలు కుమారుడైన జిమ్రీ. షిమ్యోను వంశంలో ఒక కుటుంబానికి అతడు నాయకుడు. 15 చంపబడిన మిద్యానీ స్త్రీ పేరు కొజ్బీ. ఆమె షూరు కూమార్తె. షూరు మిద్యానీ ప్రజల్లో నాయకుడు. అతడు తన వంశానికి పెద్ద.

16 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 17 “మిద్యానీ ప్రజలు మీకు శత్రువులు. మీరు వాళ్లను చంపేయాలి. 18 ఇప్పటికే వాళ్లు మిమ్మల్ని శత్రువులుగా చేసుకున్నారు. మీరు పెయోరు నకిలీ దేవుడిని కొలిచేటట్టుగా వాళ్లు మిమ్మల్ని మోసం చేసారు. మిద్యానీ నాయకుని కుమార్తె కొజ్బీని మీ వాడొకడు దాదాపు వివాహం చేసుకునేంత పని చేసారు వారు. అదే ఇశ్రాయేలు ప్రజలకు రోగం వచ్చినప్పుడు చంపబడ్డ స్త్రీ. పెయోరులో ప్రజలు బయలు నకిలీ దేవుణ్ణి కొలిచిన కారణంగానే ఆ రోగం వచ్చింది.”

కీర్తనలు. 68

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

68 దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము.
    ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక!
గాలికి ఎగిరిపోయే పొగలా
    నీ శత్రువులు చెదరిపోవుదురుగాక.
అగ్నిలో మైనం కరిగిపోయేలా
    నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక.
కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు.
    మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు.
దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి.
    ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు.
ఆయన పేరు యాహ్.[a]
    ఆయన నామాన్ని స్తుతించండి.
ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు.
    దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.
ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు.
    దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు.
    కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.

దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు.
    ఎడారిగుండా నీవు నడిచావు.
భూమి కంపించింది.
    దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది.
దేవా, నీవు వర్షం కురిపించావు
    మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు.
10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి.
    దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచివాటిని యిచ్చావు.
11 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు.
    నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు.
12 “శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి.
    యుద్ధం నుండి సైనికులు తెచ్చే వస్తువులు ఇంటి వద్ద స్త్రీలు పంచుకొంటారు.
13 ఇంటి దగ్గర ఉండిపోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను పంచుకొంటారు.
    వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. ఆ రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ మెరిపిస్తారు.”

14 సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు.
    వారు పడిపోతున్న మంచులా ఉన్నారు.
15 బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి.
16 బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు?
    దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు.
    యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకొన్నాడు.
17 యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు.
    ఆయన వెనుక ఆయన రథాలు లక్షలాదిగా ఉన్నాయి.
18 ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు.
    ఆయన తన బంధీల బృందాలను నడిపించాడు.
ఆయన మనుష్యులనుండి అనగా ఆయనను
    వ్యతిరేకించిన ప్రజలనుండి కూడ కానుకలు తీసుకొన్నాడు[b]
19 యెహోవాను స్తుతించండి.
    మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు.
    దేవుడు మనల్ని రక్షిస్తాడు.

20 ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు.
    మన యెహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు.
21 దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు.[c]
    దేవుడు తనకు విరోధంగా పోరాడినవారిని శిక్షిస్తాడు.
22 నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను.
    సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను.
23 కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు
    కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.”

24 విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు.
    నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు.
25 గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు.
    మధ్యలో ఆడపడుచులు తంబురలు వాయిస్తారు.
26 మహా సమాజంలో దేవుని స్తుతించండి.
    ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
27 చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు.
    యూదా మహా వంశం అక్కడ ఉంది.
    జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు.

28 దేవా, నీ శక్తి మాకు చూపించుము,
    దేవా, గత కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము.
29 రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు,
    యెరూషలేములోని మందిరానికి తీసుకొని వస్తారు.
30 ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము.
    ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము
ఆ రాజ్యాలను యుద్ధంలో
    నీవు ఓడించావు.
ఇప్పుడు వారు నీ వద్దకు వెండి
    తీసుకొని వచ్చునట్లు చేయుము.
31 వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము.
    దేవా, ఇథియోపియా (కూషు) వారు వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము.
32 భూరాజులారా, దేవునికి పాడండి.
    మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి.

33 దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు.
    ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి.
34 మీ దేవుళ్లందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు.
    ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు.
35 దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు.
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తిని, బలాన్ని ఇస్తాడు.
దేవుని స్తుతించండి.

యెషయా 15

మోయాబుకు దేవుని సందేశం

15 ఇది మోయాబును గూర్చి విచారకరమైన సందేశం:

ఒక రాత్రి ఆర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది.
    ఆ రాత్రి పట్టణం నాశనం చేయబడింది.
ఒక రాత్రి కిర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది.
    ఆ రాత్రే పట్టణం నాశనం చేయబడింది.
రాజ కుటుంబం, దీబోను ప్రజలు ఉన్నతమైన పూజాస్థలాల్లో మొరపెట్టేందుకు వెళ్తున్నారు.
    నెబో కోసం, మేదెబా కోసం మోయాబు ప్రజలు మొరపెడ్తున్నారు.
    ప్రజలంతా వారి విచారం వ్యక్తం చేయటానికి తలలు బోడిగుండ్లు చేసుకొన్నారు.
మోయాబు అంతటా ఇంటి కప్పుల మీద, వీధుల్లో
    ప్రజలు నల్ల బట్టలు ధరిస్తున్నారు.
    ప్రజలు ఏడుస్తున్నారు.
హెష్బోను, ఏలాలేయు పట్టణాల ప్రజలు చాలా గట్టిగా ఏడుస్తున్నారు.
    చాలా దూరంలో ఉన్న యహసు పట్టణంలో మీరు వారి ఏడ్పులు వినవచ్చును.
చివరికి సైనికులు కూడా భయపడుతున్నారు.
    సైనికులు భయంతో వణకుచున్నారు.

మోయాబు విషయంలో దుఃఖంతో నా హృదయం ఘోషిస్తుంది.
    ప్రజలు భద్రత కోసం పారిపోతున్నారు.
    దూరంలో ఉన్న సోయరుకు వారు పారిపోతున్నారు.
ఎగ్లాతు షెలిషియాకు వారు పారిపోతున్నారు.
    ప్రజలు కొండ మార్గంగా లూహీతుకు వెళ్తున్నారు.
ప్రజలు ఏడుస్తున్నారు.
    ప్రజలు హొరొనయీము మార్గంలో వెళ్తున్నారు. ప్రజలు చాలా గట్టిగా విలపిస్తున్నారు.
కానీ నిమ్రీము యేరు ఎడారిలా ఎండిపోయింది.
    మొక్కలన్నీ చచ్చాయి.
    ఏదీ పచ్చగా లేదు.
అందుచేత ప్రజలు వారి స్వంత సామగ్రి సర్దుకొని మోయాబు విడిచిపెడ్తున్నారు.
    వారు ఆ సామగ్రిమోస్తూ నిరవంజి చెట్ల నది దగ్గర సరిహద్దు దాటుతున్నారు.

ఏడ్వటం మోయాబు అంతటా వినబడుతుంది.
    చాలా దూరంలో ఉన్న ఎగ్లయీము పట్టణంలో ప్రజలు ఏడుస్తున్నారు. బెయేరేలీము పట్టణంలో ప్రజలు ఏడుస్తున్నారు.
దీమోను పట్టణపు నీళ్లు పూర్తిగా రక్తమయం అయిపోయాయి.
    మరియు నేను (యెహోవాను) దీమోనుకు ఇంకా ఎక్కువ కష్టాలు కలిగిస్తాను.
మోయాబులో నివసిస్తున్న కొద్దిమంది శత్రువునుండి తప్పించుకొన్నారు.
    కానీ ఆ ప్రజలను తిని వేయటానికి నేను సింహాలను పంపిస్తాను.

1 పేతురు 3

భార్యభర్తలు

అదే విధంగా భార్యలు తమ భర్తలకు అణిగి ఉండాలి. అప్పుడు ఒకవేళ ఏ పురుషుడైనా దైవసందేశానుసారం నడుచుకోక పోతే ఆ సందేశాన్ని గురించి ప్రస్తావించకుండానే స్త్రీలారా, మీ నడత ద్వారా మీ పవిత్రతను, భక్తిని వాళ్ళు చూడటంవల్ల మీ భర్తలు మంచి దారికి రాగలరు. జడలు వేసి, బంగారు నగలు ధరించి, విలువైన దుస్తుల్ని కట్టుకొని శరీరాన్ని బాహ్యంగా అలంకరించటంకన్నా మీ అంతరాత్మను సాత్వికత, శాంతత అనే నశించని గుణాలతో అలంకరించుకోండి. దేవుడు యిలాంటి అలంకరణకు ఎంతో విలువనిస్తాడు.

దేవుణ్ణి విశ్వసించి పవిత్రంగా జీవించిన పూర్వకాలపు స్త్రీలు యిలాంటి గుణాలతో అలంకరించుకునేవాళ్ళు. వాళ్ళు తమ భర్తలకు అణిగిమణిగి ఉండేవాళ్ళు. శారా తన భర్త అబ్రాహాముకు అణిగిమణిగి ఉండి, అతణ్ణి “యజమాని” అని పిలిచేది. మీరు కూడా నీతిగా ప్రవర్తిస్తూ, భయపడకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని శారా కుమార్తెల్లా పరిగణిస్తాడు.

భర్తలు, తమ భార్యలు తమకన్నా శారీరకంగా తక్కువ శక్తి కలవాళ్ళని గుర్తిస్తూ కాపురం చెయ్యాలి. మీతో సహ వాళ్ళు కూడా దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని పంచుకుంటున్నారు. కనుక వాళ్ళను మీరు గౌరవించాలి. అలా చేస్తే మీ ప్రార్థనలకు ఏ ఆటంకము కలుగదు.

నీతి కోసం బాధలనుభవించటం

చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరులవలే ప్రేమించుకుంటూ, నమ్రతగలవారై జీవించండి. అపకారం చేసిన వాళ్ళకు అపకారం చెయ్యకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివుంది:

“బ్రతకాలని ఇష్టపడే వాడు,
    మంచిరోజులు చూడదలచినవాడు,
తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి.
    తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడుకోవాలి.
11 చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి.
    శాంతిని కోరి సాధించాలి.
12 నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు.
    వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతోవింటూ ఉంటాడు.
కాని దుష్టుల విషయంలో ముఖం త్రిప్పుకుంటాడు.”(A)

13 ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హాని చేస్తారు? 14 కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.” 15 క్రీస్తును మీ హృదయ మందిరంలో ప్రతిష్టించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. 16 కాని మర్యాదగా గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్మల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్ళు స్వయంగా సిగ్గుపడిపోతారు.

17 చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం.

18 క్రీస్తు మీ పాపాల నిమిత్తం
    తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు.
దేవుని సన్నిధికి మిమ్మల్ని
    తీసుకు రావాలని నీతిమంతుడైన
    క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు.
వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా,
    ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.

19 పరిశుద్ధాత్మ ద్వారా, చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బోధించాడు. 20 గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు. 21 అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడిగివేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది. 22 ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International