M’Cheyne Bible Reading Plan
బిలాము—మోయాబు రాజు
22 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాలకు ప్రయాణం చేసారు. యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర వారు నివాసాలు కట్టుకొనిరి.
2-3 ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలకు చేసిన వాటన్నిటినీ సిప్పోరు కుమారుడైన బాలాకు చూసాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలమంది ఉండటం చూచి, మోయాబు రాజు భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలంటే మోయాబువాళ్లు భయపడ్డారు.
4 మోయాబు రాజు “ఆవు పొలంలో గడ్డి అంతా తినివేసినట్టు ఈ గొప్ప ప్రజా సమూహం మన చుట్టూ ఉన్న మొత్తం నాశనం చేసేస్తుంది” అని మిద్యాను నాయకులతో చెప్పాడు.
అప్పట్లో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు. 5 బెయోరు కుమారుడు బిలామును పిలువమని అతడు మనుష్యులను పంపించాడు. బిలాము యూఫ్రటీసు నది దగ్గర పెతోరు అనే చోట ఉన్నాడు. బాలాకు ఈ విధంగా సందేశం పంపాడు:
“ఈజిప్టునుండి ఒక కొత్త జాతి ప్రజలు వచ్చారు. దేశం అంతా కమ్మేసేటంతమంది ఉన్నారు వారు. వాళ్లు నా ప్రక్కనే గుడారాలు వేసుకొన్నారు. 6 వీళ్లను ఎదుర్కోటానికి నీవు వచ్చి నాకు సహాయం చేయి. అప్పుడు ఒకవేళ వారిని ఓడించగలనేమో వారి ముందు నా బలం చాలదు. అప్పుడు వారిని నా దేశంనుండి తరిమివేయగలను. నీకు గొప్పశక్తి ఉందని నాకు తెలుసు. నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తే, వారికి మేలు జరుగుతుంది. నీవు ఎవరినైనా శపిస్తే వారికి కీడు జరుగుతుంది. అందుచేత వచ్చి ఈ ప్రజలను శపించు. అప్పుడు, నేను వారిని ఈ దేశం నుండి తోలి వేయగలను.”
7 మోయాబు, మిద్యాను నాయకులు వెళ్లిపోయారు. బిలాముతో మాట్లాడటానికి వారు వెళ్లారు. అతని సేవకోసం అతనికి చెల్లించేందుకు వారు డబ్బు తీసుకుని వెళ్లారు. బాలాకు చెప్పిన విషయం వారు అతనికి చెప్పారు.
8 బిలాము, “ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి. నేను యెహోవాతో మాట్లాడి, ఆయన నాకు ఇచ్చే జవాబు మీకు చెబుతాను” అని వారితో చెప్పాడు. అందుచేత మోయాబు ప్రజా నాయకులు ఆ రాత్రి వారితో ఉండిపోయారు.
9 దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, “నీతో ఉన్న ఈ మనుష్యులు ఎవరు?” అని అడిగాడు.
10 బిలాము దేవునితో చెప్పాడు: “మోయాబు రాజును, సిప్పోరు కుమారుడునైన బాలాకు నాకు ఒక కబురు చెప్పమని వారిని పంపాడు. 11 ఆ సందేశం ఇది: ఈజిప్టునుండి ఒక కొత్త దేశపు జనాంగం వచ్చింది. వారు భూమి అంతా నిండిపొయ్యేంత మంది ఉన్నారు. కనుక వచ్చి వీళ్లను శపించు, అప్పుడు ఒకవేళ నేను వాళ్లతో యుద్ధం చేసి నా దేశంనుండి వెళ్లగొట్ట గలుగుతానేమో.”
12 అయితే దేవుడు, “వాళ్లతో వెళ్లవద్దు. ఈ ప్రజలను నీవు శపించకూడదు. వీరు నా ప్రజలు” అని బిలాముతో చెప్పాడు.
13 మరునాటి ఉదయం బిలాము లేచి, “మీ స్వదేశానికి తిరిగి వెళ్లిపొండి. యెహోవా నన్ను మీతో వెళ్ల నివ్వడు” అన్నాడు.
14 కనుక మోయాబు నాయకులు తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లిపోయి అతనితో, “మాతో రావటానికి బిలాము నిరాకరించాడు” అని చెప్పారు.
15 కనుక బాలాకు మరికొందరు నాయకులను బిలాము దగ్గరకు పంపించాడు. మొదటి సారికంటే ఈ సారి చాల ఎక్కువ మందిని అతడు పంపించాడు. మొదటిసారి అతడు పంపిన వారికంటె వీరు ప్రముఖ నాయకులు. 16 వారు బిలాము దగ్గరకు వెళ్లి చెప్పారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు నీతోఇలా చెప్పమన్నాడు. దయచేసి నీవు రాకుండా ఏదీ నిన్ను అడ్డుపెట్టనియ్యకు. 17 నేను అడిగిన దాన్ని నీవు చేస్తే, నేను నీకు విస్తారంగా డబ్బు ఇస్తాను. నీవు వచ్చి, నా పక్షంగా ఈ ప్రజలను శపించు.”
18 కానీ బిలాము ఆ మనుష్యులకు తన జవాబిచ్చాడు. అతడు ఇలా చెప్పాడు: “నా దేవుడైన యెహోవాకు నేను విధేయుడ్ని కావాలి. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయలేను. నేను చెయ్యొచ్చు అని నా ప్రభువు చెబితేనే తప్ప లేకపోతే సామాన్యమైనదైనా గొప్పదైనా నేనేమి చేయలేను. బాలాకు రాజు అందమైన తన భవనమంతా వెండి బంగారాలతో నింపి నాకు ఇచ్చినా సరే, నా ప్రభువు ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయను. 19 అయితే ఇదివరకు వచ్చిన వారిలాగే మీరు ఈ రాత్రి ఇక్కడ వుండవచ్చు. ఈ రాత్రి యెహోవా నాతో ఏమి చెబుతాడో నేను తెలుసుకొంటాను.”
20 ఆ రాత్రి యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, “ఈ మనుష్యులు వారితో కూడ నిన్ను రమ్మని అడగటానికి మళ్లీ వచ్చారు. కనుక నీవు వారితో వెళ్లవచ్చు. అయితే నేను నీతో ఏమి చెబుతానో అలా మాత్రమే చేయాలి” అని చెప్పాడు.
బిలాము, అతని గాడిద
21 మరునాడు ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంత కట్టాడు. అప్పుడు అతడు మోయాబు నాయకులతో వెళ్లాడు. 22 బిలాము తన గాడిద మీద వెళ్తున్నాడు. అతని ఇద్దరు సేవకులు అతనితో ఉన్నారు. బిలాము ప్రయాణం చేస్తుండగా దేవునికి కోపం వచ్చింది. కనుక యెహోవా దూత మార్గంలో బిలాము ఎదుట నిలబడ్డాడు. ఆ దూత బిలామును ఆపుజేయబోతున్నాడు.
23 దారిలో యెహోవా దూత నిలబడటం బిలాము గాడిద చూచింది. ఆ దూత చేతిలో ఖడ్గం ఉంది. కనుక గాడిద దారి తొలగి పక్క పొలంలోకి వెళ్లింది. బిలాము యెహోవా దూతను చూడలేదు. అందుచేత అతనికి తన గాడిద మీద చాల కోపం వచ్చింది. అతడు గాడిదను కొట్టి, మళ్లీ దారి మీదికి వెళ్లేందుకు దాన్ని బలవంతం చేసాడు.
24 తర్వాత ఆ దారిలో ఇరుకైన చోట యెహోవా దూత నిలబడ్డాడు. ఇది రెండు ద్రాక్ష తోటల మధ్యఉంది. దారికి రెండు వైపులా గోడలు ఉన్నాయి 25 మళ్లీ ఆ గాడిద యెహోవా దూతను చూచింది. అందుచేత ఆ గాడిద గోడకు రాసుకొనే అంత దగ్గరగా వెళ్లింది. కనుక బిలాము పాదం గోడకేసి నొక్కేసింది. బిలాము తన గాడిదను మళ్లీ కొట్టాడు.
26 తర్వాత యెహోవా దూత మరో చోట నిలబడ్డాడు. ఇది కూడ ఇరుకు దారి. గాడిద వెనుకకు తిరిగే అంత చోటుకూడ అక్కడలేదు. ఆ గాడిద కుడికి ఎడమకు కూడ తిరుగలేక పోయింది. 27 యెహోవాను ఆ గాడిద మళ్లీ చూచింది. కనుక బిలాముతో సహా ఆ గాడిద కూలబడింది. బిలాముకు ఆ గాడిద మీద చాలా కోపం వచ్చింది. అందుచేత అతడు తన కర్రతో దాన్ని కొట్టాడు.
28 అప్పుడు యెహోవా ఆ గాడిద మాట్లాడేటట్టు చేసాడు. ఆ గాడిద, “నీవు నా మీద ఎందుకు కోపగించు కొంటున్నావు? నీకు నేనేమి చేసాను? నీవు నన్ను మూడుసార్లు కొట్టావు” అంది బిలాముతో.
29 “నన్ను ఒక వెర్రివాడిలా చేసావు నీవు. నా చేతిలోనే గనుక ఒక కత్తి ఉంటే, ఈ పాటికి నిన్ను నరికేసి ఉండేవాడ్ని” అన్నాడు బిలాము తన గాడిదతో.
30 అయితే ఆ గాడిద “ఎన్నేన్నో సంవత్సరాలుగా నీవు స్వారీ చేస్తున్న నీ సొంత గాడిదను నేను. ఇంతకు ముందు ఎన్నడూ నేను నీకు ఇలా చేయలేదని నీకు తెలుసు” అంది బిలాముతో.
“అది నిజమే” బిలాము అన్నాడు.
31 అప్పుడు దారి మీద నిలబడ్డ దేవదూతను బిలాము చూడగలిగేటట్టు చేసెను యెహోవా. ఆ దేవదూతను, అతని కత్తిని బిలాము చూసాడు. అప్పుడు బిలాము నేలమీద సాష్టాంగపడ్డాడు.
32 యెహోవా దూత బిలామును అడిగాడు: “నీవు నీ గాడిదను ఎందుకు మూడుసార్లు కొట్టావు? నీకు నామీద కోపం రావాలి. నిన్ను ఆపు చేయటానికే సరిగ్గా సమయానికి నేను ఇక్కడికి వచ్చాను. 33 గాడిద నన్ను చూచి మూడు సార్లు నా నుండి పక్కకు తప్పుకొంది. ఆ గాడిద కనుక తప్పుకొని ఉండకపోతే నిన్ను చంపేసి ఉండేవాడ్ని. కానీ నీ గాడిదను నేను చంపేవాడ్ని కాదు.”
34 అప్పుడు బిలాము: “నేను పాపం చేసాను. దారి మీద నీవు నిలబడ్డావని నేనెరగను. నేను చేస్తోంది తప్పు అయితే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు.
35 “లేదు! ఈ మనుష్యులతో, నీవు వెళ్లవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండు. నీవు చెప్పాలని నేను నీతో చెప్పేమాటలే నీవు చెప్పాలి” అన్నాడు బిలాముతో యెహోవా దూత. కనుక బాలాకు పంపిన మనుష్యులతో బిలాము వెళ్లాడు.
36 బిలాము వస్తున్నాడని బాలాకు విన్నాడు. కనుక అర్నోను సరిహద్దులో ఉన్న మోయాబు పట్టణం దగ్గర అతణ్ణి కలుసుకొనేందుకు బాలాకు వెళ్లాడు. ఇది అతని దేశపు పొలిమేర. 37 బాలాకు బిలామును చూడగానే “నీవు రావాలని ఇది చాలా ముఖ్యమయిందని ఇంతకు ముందే నీతో చెప్పాను. నీవు నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను నీకు ఇప్పుడు ఏమీ చెల్లించ లేకపోవచ్చును” అన్నాడు బిలాముతో.
38 అయితే బిలాము: “ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను. కానీ నీవు అడిగింది మాత్రం నేను చేయలేక పోవచ్చు. చెప్పమని యెహోవా దేవుడు నాకు చెప్పిన సంగతులు మాత్రమే నేను చెప్పగలను,” అని జవాబిచ్చాడు.
39 అప్పుడు బిలాము బాలాకుతోకూడ కిర్యాత్ హుచ్చోతుకు వెళ్లాడు. 40 బాలాకు తన బలి అర్పణగా కొన్ని ఎడ్లను, గొర్రెలను వధించాడు. ఆ మాంసం కొంత బిలాముకు, మరికొంత అతనితో ఉన్న నాయకులకు అతడు ఇచ్చాడు.
41 ఆ మర్నాటి ఉదయం బాలాకు బామోతు బయలు పట్టణానికి బిలామును తీసుకుని వెళ్లాడు. ఆ పట్టణం నుండి వారు ఇశ్రాయేలు ప్రజలు వేసుకొన్న గుడారాలను కొంత చూడగలరు.
సంగీత నాయకునికి: యెదూతూను రాగం. దావీదు కీర్తన.
62 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను.
2 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు.
3 ఇంకెంత కాలం వారు నా మీద దాడి చేస్తూ ఉంటారు?
నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను.
పడిపోతున్న కంచెలా ఉన్నాను.
4 ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి
పథకాలు వేస్తున్నారు.
వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబుతారు,
కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు.
5 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను.
దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.
6 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు.
పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే.
7 నా కీర్తి, విజయం దేవుని నుండి వస్తాయి.
ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం
8 ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి.
మీ సమస్యలు దేవునితో చెప్పండి.
దేవుడే మన క్షేమ స్థానం.
9 మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు.
నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు.
వారు గాలిబుడగల్లా వట్టి ఊపిరియైయున్నారు.
10 బలవంతంగా విషయాలను చేజిక్కించుకొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు.
దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలంచవద్దు.
నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం
ధనాన్ని నమ్ముకొనవద్దు.
11 నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబుతున్నాడు,
“బలము దేవుని నుండే వస్తుంది.”
12 నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది.
ఒకడు చేసినవాటినిబట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
9 కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.
సమాధాన ప్రభువు వస్తున్నాడు
11 యెష్షయి మొద్దునుండి (వంశం నుండి) ఒక చిగురు (శిశువు) పుడుతుంది. యెష్షయి వేరులనుండి అంకురం ఎదుగుతుంది. 2 ఆ శిశువులో యెహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహోవాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం ఉంటుంది. 3 ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు.
ఈ శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు. 4-5 బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి.
6 ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు. 7 ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు. 8 ఒక చిన్నబిడ్డ నాగుపాముపుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒకచిన్న పాప చేయి పెట్టగలుగుతుంది.
9 అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.
10 ఆ సమయంలో యెష్షయి కుటుంబంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఒక పతాకంలా ఉంటాడు. రాజ్యాలన్నీ తన చుట్టూ సమావేశం కావాలని ఈ “పతాకం” చూపిస్తుంది. తాము చేయాల్సిన వాటిని గూర్చి రాజ్యాలు అతణ్ణి అడుగుతాయి. అతడు ఉండే స్థలం మహిమతో నిండిపోతుంది.
11 ఆ సమయంలో నా ప్రభువు (దేవుడు) మరల తన చేయిచాచి, మిగిలిన తన ప్రజలను తీసుకొంటాడు. దేవుడు ఇలా చేయటం రెండోసారి. (అష్షూరు, ఉత్తర ఈజిప్టు, దక్షిణ ఈజిప్టు, ఇథియోపియ, ఏలాము, బబులోను, హమాతు ప్రపంచంలోని దూర దేశాలన్నింటిలో మిగిలి ఉన్న దేవుని ప్రజలు వీరు.) 12 దేవుడు ఈ “పతాకాన్ని” మనుష్యులందరికీ ఒక సంకేతంగా నిలబెడతాడు. ఇశ్రాయేలు, యూదా ప్రజలు బలవంతంగా వారి దేశంనుండి వెళ్ల గొట్టబడ్డారు. ఆ ప్రజలు భూమిమీద దూర దేశాలన్నింటికీ చెదర గొట్టబడ్డారు. అయితే దేవుడు వాళ్లందరినీ మళ్లీ ఒక చోట సమావేశపరుస్తాడు.
13 ఆ సమయంలో ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) యూదాపై అసూయపడదు. యూదాకు శత్రువులు ఎవ్వరూ మిగిలి ఉండరు. మరియు యూదా, ఎఫ్రాయిముకు కష్టం కలిగించదు. 14 అయితే ఎఫ్రాయిము, యూదా కలిసి ఫిలిష్తీయుల మీద దాడిచేస్తారు. ఈ రెండు రాజ్యాలు భూమి మీద ఒక చిన్న జంతువును పట్టుకొనేందుకు, క్రిందగా ఎగిరే రెండు పక్షుల్లా ఉంటారు. వారిద్దరూ కలిసి తూర్పు ప్రజల ఐశ్వర్యాలు దోచుకొంటారు. ఎదోము, మోయాబు, అమ్మోను ప్రజలను ఎఫ్రాయిము, యూదా తమ ఆధీనంలో ఉంచుకొంటారు.
15 యెహోవా కోపగించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అదే విధంగా యూఫ్రటీసు నదిమీద యెహోవా తన చేయి ఊపుతాడు. ఆయన నదిని కొడ్తాడు. ఆ నది ఏడు చిన్న నదులుగా విభజించబడుతుంది. ఆ చిన్న నదులు లోతుగా ఉండవు. ప్రజలు చెప్పులతోనే ఆ నదులు దాటగలుగుతారు. 16 దేవుని శేషజనం అష్షూరును విడిచి వెళ్లటానికి వారికి దారి ఉంటుంది. అది, ఇశ్రాయేలీయులను దేవుడు ఈజిప్టు నుండి బయటకు నడిపించినప్పటిలా ఉంటుంది.
దేవునికి ఒక స్తుతిపాట
12 ఆ సమయంలో మీరంటారు:
“యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
నీకు నామీద కోపం వచ్చింది.
కానీ ఇప్పుడు నామీద కోపగించకుము.
నీ ప్రేమ నాకు చూపించు.”
2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు.
యెహోవా, యెహోవాయే నా బలం.[a]
ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి.
అప్పుడు మీరు సంతోషిస్తారు.
4 “యెహోవాకు స్తోత్రాలు!
ఆయన నామం ఆరాధించండి!
ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి”
అని అప్పుడు మీరు అంటారు.
5 యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి.
ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక.
దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి.
పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి.
6 సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి కేకలు వేయండి.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు.
అందుచేత, సంతోషంగా ఉండండి!
ధనికులకు హెచ్చరిక
5 ధనికులారా! వినండి. మీకు కష్టాలు కలుగనున్నవి. కనుక దుఃఖించండి. శోకిస్తూ కేకలు వేయండి. 2 మీ ధనం చెడిపోతుంది. మీ దుస్తులకు చెదలుపడ్తాయి. 3 మీ దగ్గరున్న వెండి బంగారాలకు త్రుప్పు పడుతుంది. వాటి త్రుప్పు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మీ శరీరాల్ని నిప్పులా కాల్చి వేస్తుంది. చివరి దినాలకు మీరు ధనాన్ని దాచుకొన్నారు. 4 మీ పొలాల్ని సాగుచేసిన పనివాళ్ళకు మీరు కూలి యివ్వలేదు. వాళ్ళు ఏడుస్తూ మీపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆ కూలివాళ్ళ ఏడ్పులు సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు చెవిలోపడ్డాయి.
5 మీరు ఐశ్వర్యంతో విలాసాలు చేసుకొంటూ ఈ ప్రపంచంలో జీవించారు. మీరు మీ హృదయాల్ని కొవ్వెక్క చేసి చివరి రోజు వధింపబడటానికి సిద్ధపరుస్తున్నారు. 6 తప్పు చేయని వాళ్ళపై మీరు శిక్ష విధించారు. వాళ్ళను చంపారు. అయినా వాళ్ళు మిమ్మల్ని ఎదిరించటం లేదు.
సహనము
7 అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు. 8 ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. 9 సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు.
10 సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి. 11 కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసినదాన్ని చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి.
మీరేమంటున్నారో జాగ్రత్త
12 నా సోదరులారా! అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, పరలోకం పేరిట గాని, భూమి పేరిట గాని, మరేదానిపై గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు “ఔను” అని అనాలనుకొంటె “ఔను” అనండి. “కాదు” అని అనాలనుకొంటె “కాదు” అని అనండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షించడు.
ప్రార్థనాశక్తి
13 మీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే అలాంటి వాడు ప్రార్థించాలి. ఆనందంగా ఉన్నవాడు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడాలి. 14 అనారోగ్యంగా ఉన్నవాడు సంఘ పెద్దల్ని పిలవాలి. ఆ పెద్దలు వచ్చి, ప్రార్థించి ప్రభువు పేరిట అతనికి నూనె రాయాలి. 15 విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆ రోగికి ఆరోగ్యం కలుగచేస్తుంది. ప్రభువు అతనికి ఆరోగ్యం కలుగచేస్తాడు పాపం చేసి ఉంటె అతన్ని క్షమిస్తాడు.
16 అందువల్ల చేసిన తప్పుల్ని పరస్పరం ఒప్పుకోండి. ఒకరికొకరు ప్రార్థించండి. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. నీతిమంతుని ప్రార్థన బహు బలముగలది. కనుక ఎంతో మేలు చేయగలదు. 17 ఏలీయా మనలాంటి మనిషే. ఒకప్పుడు వర్షాలు కురియరాదని అతడు ఆసక్తితో ప్రార్థించాడు. మూడున్నర సంవత్సరాల దాకా వర్షాలు కురియలేదు. 18 ఆ తర్వాత మళ్ళీ ప్రార్థించాడు. ఆకాశం నుండి వర్షాలు కురిసాయి. భూమి నుండి పంటలు పండాయి.
పాపిని నీతికి మళ్ళించటం
19 నా సోదరులారా! మీలో ఎవరైనా నీతిమార్గానికి దూరంగా పోయిన వాణ్ణి వెనక్కు పిలుచుకు వస్తే యిది గమనించండి. 20 పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించినవాడు అతని ఆత్మను పాపాలన్నిటి నుండి రక్షించినవాడౌతాడు. అదీగాక అతన్ని చావు నుండి తప్పించినవాడౌతాడు.
© 1997 Bible League International