Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 20

మిర్యాము మరణము

20 మొదటి నెల ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యానికి వచ్చారు. ప్రజలు కాదేషులో నివాసం చేసారు. మిర్యాము చనిపోయి, అక్కడే పాతి పెట్టబడింది.

మోషే పొరబాటు

ఆ స్థలంలో ప్రజలకు చాలినంతగా నీళ్లు లేవు. కనుక ప్రజలు మోషే, అహరోనులతో ఫిర్యాదు చేయటానికి సమావేశమయ్యారు. ప్రజలు మోషేతో వాదించారు. వారు ఇలా అన్నారు: “ఒక వేళ మా సోదరుల్లా మేము కూడా యెహోవా ఎదుట మరణించి ఉంటేబాగుండేది. యెహోవా ప్రజలను నీవు ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావు? మేమూ, మా పశువులూ ఇక్కడే చావాలని కోరుతున్నావా? ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ పనికిమాలిన చోటుకు మమ్మల్ని నీవెందుకు తీసుకువచ్చావు? ఇక్కడ ధాన్యం లేదు. అంజూరపు పండ్లు, ద్రాక్షాపండ్లు, దానిమ్మ పండ్లు ఏమీ లేవు. కనీసం తాగటానికి నీళ్లు కూడ లేవు.”

కనుక మోషే, అహరోను ఆ జనాన్ని విడిచి, సన్నిధి గుడార ద్వారం దగ్గరకు వెళ్లారు. వారు సాష్టాంగపడగా యెహోవా మహిమ ప్రత్యక్షమయింది.

యెహోవా మోషేతో మాట్లాడాడు: “నీ సోదరుడు అహరోనును, ఈ జనాన్ని తీసుకుని ఆ బండ దగ్గరకు వెళ్లు నీ కర్ర కూడా తీసుకుని వెళ్లు. ఆ బండ ఎదుట ప్రజలతో మాట్లాడు. అప్పుడు ఆ బండనుండి నీళ్లు ప్రవహిస్తాయి. అప్పుడు ప్రజలకు, పశువులకు నీవు ఆ నీళ్లు ఇవ్వవచ్చును” అన్నాడు ఆయన.

కనుక యెహోవా చెప్పిన ప్రకారం మోషే ఆయన ఎదుటనుండి కర్ర తీసుకున్నాడు. 10 అప్పుడు ప్రజలంతా ఆ బండ ముందు సమావేశం కావాలని మోషే, అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే, “మీరు ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాటవినండి. ఈ బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము చేస్తాము” అన్నాడు. 11 మోషే తన చేయి పై కెత్తి రెండుసార్లు ఆ బండను కొట్టాడు. బండనుండి నీళ్లు ప్రవహించటం మొదలయ్యింది. ప్రజలు, పశువులు ఆ నీళ్లు త్రాగారు.

12 అయితే మోషే, అహరోనులతో యెహోవా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా చుట్టూచేరారు. కానీ మీరు నాకు ఘనత చూపలేదు. నీళ్లను ప్రవహింప జేసిన శక్తి నా దగ్గరనుండి వచ్చిందని ఇశ్రాయేలు ప్రజలకు మీరు చూపించలేదు. మీరు నన్ను నమ్ముకొన్నట్లుగా మీరు ప్రజలకు చూపించలేదు. ఆ ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని వారికి ఇస్తాను. అయితే వాళ్లను ఆ దేశంలోనికి నడిపించేవాళ్లు మాత్రం మీరు కారు.”

13 ఈ స్థలం మెరీబా[a] జలాలు అని పిలువబడింది. ఇక్కడనే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో వాదించారు. ఆయన పవిత్రుడని యెహోవా ఇక్కడనే వారికి చూపించాడు.!

ఇశ్రాయేలీయులను ఎదోము ఆటంకపర్చుట

14 మోషే కాదేషులో ఉన్నప్పుడు, కొందరు మనుష్యులను ఎదోము రాజు దగ్గరకి పంపి ఈలాగు చెప్పమన్నాడు. ఆ సందేశం ఇది:

“మీ సోదరులైన ఇశ్రాయేలీయులు మీతో చెప్పేది ఏమంటే: మాకు కలిగిన కష్టాలన్నీ నీకు తెలుసు. 15 చాల సంవత్సరాల క్రిందట మా పూర్వీకులు ఈజిప్టు వెళ్లారు. చాల సంవత్సరాలు మేము అక్కడ జీవించాము. ఈజిప్టు ప్రజలు మా యెడల కృ-రంగా ఉండిరి. 16 అయితే మేము యెహోవాను సహాయం అడిగాము. యెహోవా మా మొర విని, మాకు సహాయం చేసేందుకు ఒక దేవదూతను పంపించాడు. యెహోవా మమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.

“ఇదిగో ఇప్పుడు మేము నీ దేశ సరిహద్దు అయిన కాదేషులో ఉన్నాము. 17 దయచేసి నీ దేశంలో నుంచి మమ్మల్ని ప్రయాణం చేయనివ్వు. పొలాల్లోనుంచి, ద్రాక్షా తోటల్లోనుంచి మేము నడువము. మీ బావుల్లో దేనినుండి మేము నీళ్లు తాగము. రాజమార్గంలో మాత్రమే మేము ప్రయాణం చేస్తాము. ఆ మార్గంనుండి కుడికి గాని ఎడమకు గాని మేము తొలగము. మీ దేశం దాటిపోయేంత వరకు మేము రాజ మార్గాననే వెళ్తాము.”

18 అయితే ఎదోము రాజు, “మీరు మా దేశంలోనుండి ప్రయాణం చేయగూడదు. మా దేశంలోనుండి ప్రయాణం చేయటానికి మీరు ప్రయత్నిస్తే, మేము వచ్చి కత్తులతో మీతో పోరాడుతాము” అని జవాబిచ్చాడు.

19 ఇశ్రాయేలు ప్రజలు, “మేము రహదారి వెంబడే ప్రయాణం చేస్తాము. మా పశువులు మీ నీళ్లు ఏమైనా తాగితే, దానికి మేము వెల చెల్లిస్తాము. మేము మీ దేశంలోనుంచి నడుస్తాము, అంతే. అంతేగాని, దాన్ని మేము తీసుకోము” అని జవాబిచ్చారు.

20 అయితే, “మేము మిమ్మల్ని మా దేశంలోంచి పోనియ్యము” అని ఎదోము జవాబిచ్చాడు.

అప్పుడు ఎదోము రాజు బలంగల విస్తార సైన్యాన్ని సమకూర్చుకొని, ఇశ్రాయేలు ప్రజలతో పోరాడటానికి వారి మీదికి వెళ్లాడు. 21 ఇశ్రాయేలు ప్రజలను తన దేశంగుండా వెళ్లనిచ్చేందుకు ఎదోము రాజు నిరాకరించాడు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కు తిరిగి మరో మార్గంగుండా వెళ్లిపోయారు.

అహరోను మరణం

22 ఇశ్రాయేలు ప్రజలంతా కాదేషు నుండి హోరు కొండకు ప్రయాణం చేసారు. 23 హోరు కొండ ఎదోము సరిహద్దుకు దగ్గర్లో ఉంది. మోషే, అహరోనులతో యెహోవా చెప్పాడు, 24 “అహరోను తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశంలో అతడు ప్రవేశించడు. మోషే, అహరోనూ, మీరు మెరీబా జలాల దగ్గర నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు పూర్తిగా విధేయులు కాలేదుగనుక నేను మీతో ఇలా చెబుతున్నాను:

25 “అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు కొండమీదికి తీసుకుని రా. 26 అహరోను ప్రత్యేక దుస్తులు అతని దగ్గరనుండి తీసుకుని, అతని కుమారుడైన ఎలియాజరుకు వాటిని తొడిగించు. అహరోను కొండమీద మరణిస్తాడు. అతడు తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు.”

27 యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. మోషే, అహరోను, ఎలియాజరు హోరు కొండ శిఖరం మీదికు వెళ్లారు. వారు వెళ్లటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు. 28 అహరోను వస్త్రాలన్నీ తీసి అతని కుమారుడైన ఎలియాజరు మీద వేసాడు మోషే. అప్పుడు అహరోను ఆ కొండ శిఖరం మీద చనిపోయాడు. మోషే, ఎలియాజరు కొండ దిగి క్రిందికి వచ్చారు. 29 అప్పుడు అహరోను చనిపోయినట్టు ప్రజలంతా తెలుసుకొన్నారు. కనుక ఇశ్రాయేలులో ప్రతి వ్యక్తి 30 రోజులపాటు సంతాపపడ్డాడు.

కీర్తనలు. 58-59

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం.

58 న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు.
    మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు.
లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు.
    ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు.
    పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.
వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు.
    వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.
త్రాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు.
    ఆ దుర్మార్గులు అలా ఉన్నారు.

యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు.
    కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.
ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక.
    బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక.
మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక.
    చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.
కుండక్రింద ఉన్న నిప్పువేడిలో అతిత్వరగా
    కాలిపోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.

10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం
    వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు.
ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.
11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది.
    లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. దావీదును చంపేందుకు అతని యింటిని చూచి రమ్మని సౌలు తన మనుష్యులను పంపిన సందర్భం.

59 దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము
    నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చే మనుష్యులను జయించేందుకు నాకు సహాయం చేయుము.
కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము.
చూడు, బలాఢ్యులు నా కోసం కనిపెట్టి ఉన్నారు.
    నన్ను చంపేందుకు వారు కనిపెట్టుకున్నారు.
    నేను పాపం చేసినందువలన లేక ఏదో నేరం చేసినందువలన కాదు.
వారు నన్ను తరుముతున్నారు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు.
    యెహోవా, వచ్చి నీ మట్టుకు నీవే చూడు!
నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఇశ్రాయేలీయుల దేవుడవు.
    లేచి జనాంగములన్నిటినీ శిక్షించుము.
ఆ దుర్మార్గపు ద్రోహులకు ఎలాంటి దయా చూపించకుము.

ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి వస్తారు.
    వారు మొరిగే కుక్కల్లా పట్టణమంతా తిరుగుతారు.
వారి బెదరింపులు, అవమానపు మాటలు వినుము.
    వారు అలాంటి క్రూరమైన సంగతులు చెబుతారు.
    వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం.

యెహోవా, వారిని చూసి నవ్వుము.
    ఆ జనాలను గూర్చి ఎగతాళి చేయుము.
దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను.
    దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా క్షేమస్థానం.
10 దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
    నా శత్రువులను జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
11 దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును.
    నా ప్రభువా, నా సంరక్షకుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని ఓడించుము.
12 ఆ దుర్మార్గులు శపించి అబద్ధాలు చెబుతారు.
    వారు చెప్పిన విషయాలను బట్టి వారిని శిక్షించుము.
    వారి గర్వం వారిని పట్టుకొనేలా చేయుము.
13 నీ కోపంతో వారిని నాశనం చేయుము.
    వారిని పూర్తిగా నాశనం చేయుము.
అప్పుడు యాకోబు ప్రజలనూ, సర్వప్రపంచాన్నీ
    దేవుడు పాలిస్తున్నాడని మనుష్యులు తెలుసుకొంటారు.

14 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణంలోకి వచ్చి
    మొరుగుతూ పట్టణం అంతా తిరుగే కుక్కల్లాంటివారు.
15 వారు తినుటకు ఏమైనా దొరుకుతుందని వెదకుతూ పోతారు.
    వారికి ఆహారం దొరకదు. నిద్రించుటకంత స్థలం దొరకదు.
16 మరి నేనైతే,,,,,,,,,, నీకు స్తుతి గీతాలు పాడుతాను.
    ఉదయాలలో నీ ప్రేమయందు ఆనందిస్తాను.
ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమ స్థానం,
    కష్టాలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు పరుగెత్తగలను.
17 నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను.
    ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం.
    నీవు నన్ను ప్రేమించే దేవుడవు.

యెషయా 9:8-10:4

దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు

యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలకు విరోధంగా నా ప్రభువు ఒక ఆదేశం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఇవ్వబడిన ఆదేశానికి విధేయత చూపబడుతుంది. అప్పుడు ఎఫ్రాయింము (ఇశ్రాయేలు)లో ప్రతి వ్యక్తి, చివరికి సమరయ నాయకులు కూడా దేవుడు తమని శిక్షించాడని తెలుసుకొంటారు.

ఇప్పుడు ఆ ప్రజలు చాలా గర్వంగా, అతిశయంగా ఉన్నారు. 10 “ఈ ఇటుకలు పడిపోవచ్చు గాని మేము మళ్లీ నిర్మిస్తాం. ఇంకా గట్టి రాయితో మేము నిర్మిస్తాం. ఈ చిన్న చెట్లు నరికి వేయబడవచ్చును. కానీ మేము అక్కడ క్రొత్త చెట్లు వేస్తాము. ఆ క్రొత్త చెట్లు ఇంకా పెద్దగా, గట్టిగా ఉంటాయి.” అని ఆ ప్రజలు అంటారు.

11 అందుచేత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేందుకు యెహోవా మనుష్యుల్ని చూస్తాడు. వారి మీదికి రెజీను శత్రువులను యెహోవా తీసుకొని వస్తాడు. 12 తూర్పు నుండి సిరియన్లను, పడమటినుండి ఫిలిష్తీయులను యెహోవా తీసుకొని వస్తాడు. ఆ శత్రువులు తమ సైన్యాలతో ఇశ్రాయేలును ఓడిస్తారు. కానీ యెహోవా మాత్రం ఇంకా ఇశ్రాయేలు మీద కోపంగానే ఉంటాడు. యెహోవా ఆ ప్రజలను శిక్షించటానికి ఇంకా సిద్ధంగానే ఉంటాడు.

13 దేవుడు ప్రజలను శిక్షిస్తాడు గాని వాళ్లు మాత్రం పాపం చేయటం మానరు. వాళ్లు ఆయన దగ్గరకు మళ్లుకోరు. సర్వశక్తిమంతుడైన యెహోవాను వారు అనుసరించరు. 14 అందుచేత యెహోవా ఇశ్రాయేలీయుల తల, తోక కత్తిరించి వేస్తాడు. కాండాన్ని కొమ్మను కూడ ఒక్క రోజునే యెహోవా నరికి వేస్తాడు. 15 (తల అంటే పెద్దలు ప్రముఖ నాయకులు తోక అంటె అబద్ధాలు చెప్పే ప్రవక్తలు.)

16 ప్రజలను నడిపించే మనుష్యులు వారిని తప్పు త్రోవన నడిపిస్తున్నారు. కనుక వారిని అనుసరించే ప్రజలు నాశనం చేయబడతారు. 17 మనుష్యులు అంతా చెడ్డవాళ్లే. అందుచేత యువకుల విషయం యెహోవాకు సంతోషం లేదు. వారి విధవలకు, అనాధలకు యెహోవా దయ చూపించడు. ఎందుకంటే, ప్రజలంతా చెడ్డవాళ్లే గనుక. దేవునికి విరోధమైన వాటిని మనుష్యులు చేస్తారు. మనుష్యులు అబద్ధాలు చెబుతారు.

అందుచేత దేవుడు మనుష్యులమీద కోపంగానే ఉంటాడు. దేవుడు మనుష్యుల్ని శిక్షిస్తూనే ఉంటాడు.

18 చెడు అనేది చిన్న నిప్పులాంటిది. ఆ నిప్పుమొదట పొదలను, ముళ్లకంపల్ని తగలెడుతుంది: తర్వాత అరణ్యంలో ఉండే పెద్ద పొదలను ఆ నిప్పు తగలెడుతుంది. చివరికి అది పెద్ద అగ్నిగా మారుతుంది. అంతా పొగలో కలిసిపోతుంది.

19 సర్వశక్తిమంతుడైన యెహోవా కోపంగా ఉన్నాడు, కనుక దేశం కాల్చి వేయబడుతుంది. మనుష్యులంతా ఆ అగ్నిలో కాల్చి వేయబడతారు. ఎవ్వడూ తన సోదరుణ్ణి రక్షించే వ్రయత్నం చేయడు. 20 ప్రజలు కుడిపక్క ఏదో కొంత చేజిక్కించుకున్నా ఆకలిగానే ఉంటారు. ఎడమ పక్కన వాళ్లు ఏదో తింటారు, అయినా వాళ్లకు కడుపు నిండదు. అప్పుడు ప్రతివాడూ తిరిగి, తన స్వంత శరీరాన్నే తింటాడు. 21 (అంటే ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా మనష్షే యుద్ధం చేస్తాడు. మనష్షేకు వ్యతిరేకంగా ఎఫ్రాయిము యుద్ధం చేస్తాడు. తర్వాత వాళ్లిద్దరు యూదా మీద తిరగబడతారు అని అర్థం.)

యెహోవా ఇశ్రాయేలు మీద ఇంకా కోపంగానే ఉన్నాడు. యెహోవా ఇంకా తన ప్రజల్ని శిక్షించటానికి సిద్ధంగానే ఉన్నాడు.

10 చెడు చట్టం వ్రాసే చట్టాల నిర్మాతలను చూడండి. ప్రజలకు జీవితాన్ని దుర్బరం చేసే చట్టాలు ఆ నిర్మాతలు రాస్తారు. ఆ చట్ట నిర్మాతలు పేద ప్రజలకు న్యాయం చేకూర్చలేదు. పేద ప్రజల హక్కులను వారు తీసి వేస్తారు. వారు విధవల వద్ద, అనాధల వద్ద ప్రజలను దొంగిలించనిస్తారు.

చట్ట నిర్మాతలారా, మీరు చేసిన పనులను మీరు వివరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరేమి చేస్తారు? దూరదేశంనుండి మీ నాశనం వస్తుంది. సహాయం కోసం మీరు ఎక్కడికి పరుగెత్తుకు వెళ్తారు? మీ ధనం, మీ ఐశ్వర్యాలు మీకేం సాయం చేయవు. ఒక ఖైదీలా మీరు శిరస్సు వంచాలి. చచ్చిన వాడిలా మీరు పడిపోతారు. కాని దానివల్ల మీకు సహాయం జరగదు. దేవుడు ఇంకా కోపంగానే ఉంటాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని శిక్షించటానికి సిద్ధంగానే ఉంటాడు.

యాకోబు 3

నాలుకను మచ్చిక చేసుకొండి

నా సోదరులారా! దేవుడు మిగతావాళ్ళకన్నా, బోధించే మనల్ని కఠినంగా శిక్షస్తాడని మీకు తెలుసు. కనుక అందరూ బోధకులు కావాలని ఆశించకండి.

మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాము. తాను ఆడే మాటల్లో ఏ తప్పూ చేయనివాడు పరిపూర్ణుడు. అలాంటివాడు కళ్ళెం వేసి తన శరీరాన్ని అదుపులో పెట్టుకోగలడు. చెప్పినట్లు వినాలనే ఉద్దేశ్యంతో మనం గుఱ్ఱం నోటికి కళ్ళెం వేస్తాం. అలా చేస్తేనే మనం దాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోగలము. ఓడను ఉదాహరణగా తీసుకొండి. అది చాలా పెద్దగా ఉంటుంది. బలమైన గాలివల్ల అది నడుస్తుంటుంది. కాని దాన్ని నావికుడు చిన్న చుక్కానితో తన యిష్టం వచ్చిన చోటికి తీసుకు వెళ్ళగలడు. అదేవిధంగా నాలుక శరీరంలో చిన్న భాగమైనా గొప్పలు పలుకుతుంది.

చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని ఏ విధంగా కాలుస్తుందో గమనించండి. నాలుక నిప్పులాంటిది. అది చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో ఉంది. అది మన శరీరంలో ఒక భాగంగా ఉండి శరీరమంతా చెడును వ్యాపింపచేస్తుంది. మనిషి యొక్క జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ఈ నిప్పును నరకం నుండి పొందుతుంది.

మానవుడు అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని, ప్రాకే జీవుల్ని, సముద్రంలోని ప్రాణుల్ని మచ్చిక చేసుకొంటున్నాడు; ఇదివరకే మచ్చిక చేసుకొన్నాడు. కాని నాలుకను ఎవ్వరూ మచ్చిక చేసుకోలేదు. అది ప్రాణాంతకమైన విషంతో కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. విరామం లేకుండా ఉంటుంది. మనం, మన నాలుకతో ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము. 10 స్తుతి, శాపము ఒకే నోటినుండి సంభవిస్తున్నాయి. నా సోదరులారా! ఇది తప్పు. 11 ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు ఒకే ఊట నుండి పారుతున్నాయా? 12 నా సోదరులారా! అంజూరపు చెట్టుకు ఒలీవ పండ్లు, లేక ద్రాక్షతీగకు అంజూరపు పండ్లు కాస్తాయా? అలాగే ఉప్పునీటి ఊటనుండి మంచి నీళ్ళు ఊరవు.

తెలివిగల వాళ్ళు

13 జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్‌ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి. 14 ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకొన్న కోపము, స్వార్ధంతో కూడుకొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లౌతుంది. 15 మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సాతానుకు చెందింది. 16 ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి. 17 కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది. సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది. 18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International