Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 19

ఎర్ర ఆవు బూడిద

19 మోషేతో, అహరోనుతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే ఆజ్ఞలు, ప్రబోధాలు ఇవే. వారు బలంగా ఉన్న ఒక ఎర్ర ఆవును నీ దగ్గరకు తీసుకుని రావాలి. ఆ ఆవుకు ఎలాంటి గాయాలు ఉండకూడదు. ఆ ఆవు ఎన్నడూ కాడి మోసి ఉండకూడదు. ఆ ఆవును యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి. ఎలియాజరు ఆవును నివాసం యొక్క వెలుపలికి తీసుకునిపోయి, అక్కడ దాన్ని వధించాలి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంత తన వేలిమీద వేసుకొవాలి. తర్వాత అతడు ఆ రక్తంలో కొంత పవిత్ర గుడారం వైపు చల్లాలి. అతడు ఇలా ఏడు సార్లు చేయాలి. అప్పుడు మొత్తం ఆవు అతని ఎదుట దహించబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, ప్రేగులు అన్నీ దహించాలి. అప్పుడు యాజకుడు ఒక దేవదారు కర్రను, హిస్సోపు కొమ్మను, ఎర్ర నూలును తీసుకుని, ఆవు దహించబడుతున్న అగ్నిలో వేయాలి. అప్పుడు యాజకుడు స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. అతడు తిరిగి నివాసానికి రావాలి. యాజకుడు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు. ఆ ఆవును దహించే వ్యక్తి స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. సాయంత్రం వరకు అతడు అపవిత్రంగానే ఉంటాడు.

“అప్పుడు పవిత్రుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేయాలి. అతడు నివాసానికి బయట పరిశుభ్రమైన స్థలంలో ఆ బూడిదను ఉంచుతాడు ప్రజలు పవిత్రులయ్యేందు కోసం ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటించేటప్పుడు ఈ బూడిద ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి పాపాలను తొలగించేందుకు కూడా ఈ బూడిద ఉపయోగించబడుతుంది.

10 “ఆవు బూడిదను పోగుచేసే వ్యక్తి తన బట్టలు ఉదుక్కోవాలి. అతను సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.

“ఈ నియమం శాశ్వతంగా కొనసాగుతుంది. ఇశ్రాయేలు పౌరులకు, మీతో కలసి నివసిస్తున్న విధేశీయులకు ఈ నియమం వర్తిస్తుంది. 11 ఎవరైనా ఒకరు ఒక శవాన్ని తాకితే, అప్పుడు అతడు ఏడు రోజులు అపవిత్రంగా ఉంటాడు. 12 ప్రత్యేక జలంతో మూడోరోజున, మళ్లీ ఏడో రోజున అతడు తనను తాను కడుక్కోవాలి. అతడు ఇలా చేయకపోతే అపవిత్రంగానే ఉంటాడు. 13 ఒకడు ఒక శవాన్ని తాకితే అతడు అపవిత్రుడు. అతడు అపవిత్రుడుగానే ఉండి, పవిత్ర గుడారానికి వెళ్తే, అప్పుడు ఆ పవిత్ర గుడారం అపవిత్రం అవుతుంది. కనుక అతనిని ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి తొలగించి వేయాలి. ఒక అపవిత్రునిమీద ప్రత్యేకజలం చల్లకపోతే అతడు అపవిత్రంగానే ఉండిపోతాడు.

14 “తమ గుడారాల్లోనే మరణించే వారిని గూర్చిన నియమం ఇది. ఒకడు తన గుడారంలో మరణిస్తే, ఆ గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరూ అపవిత్రులే. ఏడు రోజులపాటు వారు అపవిత్రం అవుతారు. 15 మూతలేని ప్రతి పాత్ర అపవిత్రం అవుతుంది. 16 ఏ మనిషిగాని శవాన్నిగాని ముట్టుకొంటే, ఆ మనిషి అపవిత్రుడుగా ఏడు రోజులు ఉంటాడు. శవం బయట పొలంలో ఉన్నా, లేక యుద్ధంలో చచ్చిన వానిదైనా సరే ఇదే వర్తిస్తుంది. మరియు చచ్చిన మనిషి ఎముకను ఒక దాన్ని ఎవరైనా ముట్టుకుంటే అప్పుడు అతడు అపవిత్రుడౌతాడు.

17 “కనుక అతనిని మరల పవిత్రం చేయటానికి దహించబడ్డ ఆవు బూడిదను నీవు ప్రయోగించాలి. పాత్రలో బూడిద మీద స్వచ్ఛమైన నీళ్లు పోయాలి. 18 పవిత్రుడు ఒకడు హిస్సోపు కొమ్మను తీసుకుని, దానిని ఆ నీళ్లలో ముంచాలి. అప్పుడు అతడు గుడారంమీదా, గిన్నెలమీదా, గుడారంలోని మనుష్యులందరి మీదా దానిని చల్లాలి. శవాన్ని ముట్టు కొన్న ఎవరికైనా నీవు ఇలాగే చేయాలి. యుద్ధంలో చంపబడిన ఒకరి శవాన్ని ముట్టుకొనిన ఎవరికైనా సరే, చచ్చిన మనిషి ఎముకను తాకిన ఎవరికైనా సరే నీవు ఇలాగే చేయాలి.

19 “అప్పుడు పవిత్రంగా ఉన్న ఒక మనిషి అపవిత్రంగా ఉన్న వానిమీద మూడో రోజున, మరల ఏడో రోజున ఈ నీళ్లు చల్లాలి. ఏడో రోజున అతడు పవిత్రం అవుతాడు. అతడు తన వస్త్రాలను నీళ్లలో ఉతుక్కోవాలి. ఆ సాయంకాలం అతడు పవిత్రుడవుతాడు.

20 “ఒక వ్యక్తి అపవిత్రుడై, పవిత్రుడుగా చేయబడకపోతే, అతడు ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి వేరు చేయబడాలి. అతనిమీద ప్రత్యేక జలం చల్లబడలేదు. అతడు పవిత్రుడు కాలేదు. కనుక అతడు పవిత్ర గుడారాన్ని అపవిత్రం చేస్తాడేమో. 21 ఇది మీకు శాశ్వత నియమం. ఒక వ్యక్తిమీద ప్రత్యేక జలం చల్లబడితే అతడు తన బట్టలను కూడ ఉదుక్కోవాలి. ఆ ప్రత్యేకజలాన్ని ముట్టినవాడు ఆ సాయంకాలంవరకు మాత్రం అపవిత్రంగానే ఉంటాడు. 22 అపవిత్రుడు ఒకడు ఇంకో వ్యక్తిని ముట్టుకుంటే అతడుకూడా అపవిత్రుడవుతాడు. అతడు ఆ సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.”

కీర్తనలు. 56-57

సంగీత నాయకునికి: “దూరపు సింధూర మ్రానులోని పావురము” రాగం. ఫిలిప్తీయులు దావీదును గాతులో పట్టుకొన్నప్పుడు అతడు రచించిన అనుపదగీతం.

56 దేవా, ప్రజలు నా మీద దాడి చేసారు గనుక నాకు దయ చూపించుము.
    రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు.
నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు.
    నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు.
నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ముకొంటాను.
నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.
    దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు.
    వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు.
వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు.
    నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు.
దేవా, వారిని తప్పించుకోనియ్యకుము,
    వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము.
నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు.
    నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు
నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.

కనుక సహాయం కోసం నేను నీకు మొర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు.
దేవుడు నాతో ఉన్నాడు ఇది నాకు తెలుసు.

10 దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
    యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
11 నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను.
    మనుష్యులు నన్ను బాధించలేరు.

12 దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను.
    నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను.
13 ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు.
    నేను ఓడిపోకుండా నీవు కాపాడావు.
కనుక బ్రతికి ఉన్న మనుష్యులు మాత్రమే
    చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.

57 దేవా, నన్ను కరుణించు
    నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము.
కష్టం దాటిపోయేవరకు
    నేను నీ శరణు జొచ్చియున్నాను.
మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను.
    దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.
    నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన శిక్షిస్తాడు.
దేవుడు తన నిజమైన ప్రేమను
    నాకు చూపిస్తాడు.

నా జీవితం ప్రమాదంలో ఉంది.
    నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు.
ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు,
    మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.

దేవా, నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.
    నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.
    వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు.
నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు.
    కాని వారే దానిలో పడ్డారు.

దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.
    నేను నీకు స్తుతులు పాడుతాను.
నా ఆత్మా, మేలుకొనుము!
    స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము
నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.
    ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.
    ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.

యెషయా 8:1-9:7

అష్షూరు త్వరలో వస్తుంది

యెహోవా నాతో చెప్పాడు, “వ్రాయటానికి ఒక పెద్ద పలక తీసుకో. ఘంటంతో (పెన్నుతో) ఈ మాటలు వ్రాయి: ‘మహేరు, షాలాల్, హాష్ బజ్.’ (అంటే ‘త్వరలోనే దోపిడి, దొంగతనం జరుగుతుంది’ అని అర్థం.)”

సాక్షులుగా నమ్మదగిన కొందరు మనుష్యుల్ని నేను సమావేశపర్చాను. (వీళ్లు ఊరియా, యెబెరెక్యా, జెకర్యా) నేను ఈ విషయాలు వ్రాయటం ఈ మనుష్యులు గమనించారు. తర్వాత నేను ప్రవక్త్రి దగ్గరకు వెళ్లాను. నేను ఆమెతో ఉన్న తర్వాత ఆమె గర్భవతియై, ఒక కుమారుని కన్నది. అప్పుడు యెహోవా నాతో చెప్పాడు, “పిల్లవాడికి మహేరు షాలాల్ హాష్‌బజ్” అని పేరు పెట్టు. ఎందుకంటే ఆ పిల్లవాడు “అమ్మా” “నాన్నా” అనటం నేర్చుకొనక ముందే దమస్కు, షోమ్రోనుల ధనం, ఐశ్వర్యాలు దేవుడు తీసుకొని, వాటిని దేవుడు అష్షూరు రాజుకు ఇచ్చివేస్తాడు.

దేవుడు మళ్లీ నాతో మాట్లాడాడు. నా ప్రభువు చెప్పాడు: “ఈ ప్రజలు నిదానంగా ప్రవహించే షిలోహు[a] జలాలను స్వీకరించేందుకు నిరాకరించారు. రెజీను, రెమల్యా కుమారునితో (పెకహు) వీళ్లు సంతోషపడి పోతున్నారు. అందుచేత చూడు, నా యెహోవా మహా గొప్ప యూఫ్రటీసు నదీ ప్రవాహంలాగా అష్షూరును దాని శక్తి అంతటిని తీసుకొని వస్తున్నాడు. వారు ఒక నది పొంగి పొర్లేలా, ప్రవాహంలా మీ దేశంలోనికి వస్తారు. ఆ నదిలోంచి నీళ్లు పొంగి యూదాలోకి ప్రవహిస్తాయి. యూదా గొంతుల వరకు నీళ్లు పొంగి, యూదాను దాదాపుగా ముంచేస్తాయి.

“ఇమ్మానుయేలూ, నీ దేశం అంతటినీ ముంచివేసేంతగా ఈ వరద విస్తరిస్తుంది.”

సర్వ దేశాల్లారా, యుద్ధానికి సిద్ధపడండి.
    కాని మీరు ఓడిపోతారు.
దూర దేశాలన్నీ ఆలకించండి.
    యుద్ధానికి సిద్ధపడండి.
    కానీ మీరు ఓడిపోతారు
10 యుద్ధానికి మీ వ్యూహాలు పన్నండి.
    కానీ మీ వ్యూహాలు అన్నీ ఓడిపోతాయి.
మీ సైన్యాలకు ఆజ్ఞాపించండి.
    కానీ మీ ఆజ్ఞలు నిష్ప్రయోజనమే. ఎందుకంటే, దేవుడు మాతో ఉన్నాడు[b] గనుక.

యెషయాకు హెచ్చరికలు

11 యెహోవా తన మహా శక్తితో నాతో మాట్లాడాడు. ఈ ఇతర మనుష్యుల్లా ఉండొద్దని యెహోవా నన్ను హెచ్చరించాడు. 12 “ప్రతివారూ ఇతరులు తమకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నట్టు చెబుతున్నారు. నీవు ఆ విషయాలు నమ్మవద్దు. ఆ ప్రజలు భయపడే వాటికి నీవు భయపడవద్దు. వాటిగూర్చి నీవు భయపడవద్దు” అని యెహోవా నాతో చెప్పాడు.

13 సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక్కడికే మీరు భయపడాలి. మీరు గౌరవించాల్సిన వాడు ఆయనే. మీరు భయపడాల్సింది ఆయనకే. 14 మీరు యెహోవాను గౌరవించి, ఆయనను పవిత్రునిగా ఎంచుకొంటే, అప్పుడు ఆయనే మీకు క్షేమస్థానంగా ఉంటాడు. కానీ మీరు ఆయనను గౌరవించరు. కనుక మీరు పడిపోయేట్టు చేసే బండ ఆయనే. ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబాలను తొట్రిల్లేలా చేసే బండ ఆయనే. యెరూషలేము ప్రజలందరినీ పట్టుకొనే బోను యెహోవాయే. 15 (అనేకమంది మనుష్యులు ఈ బండ తగిలి పడిపోతారు. వాళ్లు పడిపోయి, విరిగిపోతారు. వారు బోనులో పట్టుబడతారు.)

16 యెషయా చెప్పాడు, “ఒక ఒడంబడిక చేసి, దాన్ని ముద్రించండి. నా ఉపదేశాలను భవిష్యత్తు కోసం భద్రపర్చండి. నన్ను అనుసరించే వాళ్లు చూస్తూ ఉండగా దీనిని చేయండి.”

17 ఆ ఒడంబడిక ఇదేః యెహోవా మాకు సహాయం చేసేవరకు నేను వేచి ఉంటాను.
యాకోబు (ఇశ్రాయేలు) వంశం విషయం యెహోవా సిగ్గు పడుతున్నాడు. ఆయన వాళ్లను చూచేందుకు నిరాకరిస్తున్నాడు.
కానీ నేను యెహోవా కోసం నిరీక్షిస్తాను.
ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు.

18 “ఇశ్రాయేలు ప్రజలకు నేనూ, నా పిల్లలే సూచనగా రుజువుగా ఉన్నాము. సీయోను కొండమీద నివాసం చేసే సర్వశక్తిమంతుడైన యెహోవా మమ్మల్ని పంపించాడు.”

19 కొంతమంది, “జ్యోతిష్కుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో తెలుసుకోండి” అంటున్నారు. (ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు పిట్టల్లా కిచకిచలాడి తమకి చాలా తెలివిగల తలపులు ఉన్నట్టు మనుష్యులు తలచాలని గుసగుసలాడుతారు.) అయితే వాళ్లు వాళ్ల దేవుణ్ణి సహాయం అడుక్కోవాలి అని నేను చెబుతున్నాను. ఆ జ్యోతిష్కులు, మాంత్రికులు వారు ఏమి చేయాలి అనేది చచ్చిపోయిన వాళ్లను అడుగుతారు. బ్రతికి ఉన్న వాళ్లు చచ్చిన వాళ్లను ఏదైనా ఎందుకు అడగాలి? 20 మీరు ఉపదేశాలను, ఒడంబడికను అనుసరించాలి. ఈ ఆదేశాలు మీరు అనుసరించకపోతే, మీరు తప్పు ఆదేశాలను పాటించవచ్చు. (తప్పు ఆదేశాలు అంటే జ్యోతిష్కులు, మాంత్రికులు దగ్గర్నుండి వచ్చేవి. అవి ఎందుకూ పనికి రాని ఆదేశాలు. ఆ ఆదేశాలను పాటించటం వల్ల మీకేమీ లాభం ఉండదు.) 21 ఆ తప్పు ఆదేశాలను మీరు పాటిస్తే దేశంలో కష్టాలు, ఆకలి ఉంటాయి. ప్రజలు ఆకలితో ఉంటారు. అప్పుడు వాళ్లకు కోపం వచ్చి రాజును, అతని దేవుళ్లను తిడతారు. అప్పుడు వాళ్లు సహాయం కోసం దేవునివైపు చూస్తారు. 22 వారు వారి దేశంలో చుట్టూరా చూస్తే, కష్టం కృంగదీసే చీకటి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల దుఃఖపు చీకటి మాత్రమే వారికి కనబడుతుంది. మరియు ఆ చీకట్లో పట్టుబడిన మనుష్యులు తమను తాము విడిపించుకోలేరు.

ఒక క్రొత్త రోజు వస్తుంది

గతంలో జెబూలూను దేశం, నఫ్తాలి దేశం ముఖ్యంకాదు అనుకొన్నారు. కానీ ఉత్తరార్థంలో దేవుడు ఆ దేశాన్ని గొప్ప చేస్తాడు. సముద్రం దగ్గర దేశం, యొర్దాను నది అవతల దేశం, యూదులు కానివారు నివసించే గలిలయ. ఇప్పుడు ఆ ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. కానీ వారు గొప్ప వెలుగు చూస్తారు. మరణంలాంటి చీకటిచోట ఆ ప్రజలు జీవిస్తున్నారు. కానీ “గొప్ప వెలుగు” వారిమీద ప్రకాశిస్తుంది.

దేవా, నీవే రాజ్యాన్ని పెద్ద చేస్తావు. ప్రజల్ని నీవు సంతోషపరుస్తావు. ఆ ప్రజలు వారి సంతోషాన్ని నీకు తెలియజేస్తారు. అది కోతకాలపు సంతోషంలా ఉంటుంది. ప్రజలు యుద్ధంలో గెలిచిన సామగ్రిని పంచుకొన్నప్పుడు కలిగిన సంతోషంలా ఉంటుంది. ఎందుకంటే, భారాన్ని నీవు తొలగించేస్తావు కనుక. ప్రజల వీపుల మీద నుండి భారమైన కాడిని నీవు తొలగించేస్తావు గనుక. నీ ప్రజలను శిక్షించేందుకు శత్రువు వినియోగించే కొరడాను నీవు తొలగించేస్తావు. అది నీవు మిద్యాను ఓడించిన సమయంలా ఉంటుంది.

యుద్ధంలో కదం తొక్కిన ప్రతి కాలిజోడు నాశనం చేయబడుతుంది. రక్తపు మరకలైన యుద్ధ వస్త్రం ప్రతీది నాశనం చేయబడుతుంది. అవన్నీ అగ్నిలో పడద్రోయబడతాయి. మనకు ఒక బాలుడు పుట్టియున్నాడు. మనకు ఒక కుమారుడు ఇవ్వబడియున్నాడు. ఆయన భుజం మీద ప్రభుత్వమున్నది. “ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, శక్తిగల దేవుడు, నిత్యం జీవించే తండ్రి, సమాధాన రాజు” అనేది ఆయన పేరు. ఆయన రాజ్యంలో శాంతి, శక్తి ఉంటాయి. దావీదు వంశపు ఈ రాజుకు అది కొనసాగుతుంది. ఈ రాజు మంచితనం, న్యాయపు తీర్పు ప్రయోగించి, రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ పాలిస్తాడు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు తన ప్రజల మీద బలీయమైన ప్రేమ ఉంది. ఈ బలీయమైన ప్రేమ ఆయనను ఈ పనులు చేసేటట్టుగా చేస్తుంది.

యాకోబు 2

పక్షపాతం చూపరాదు

నా సోదరులారా! తేజోవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మీరు పక్షపాతం చూపకూడదు. బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకొన్నవాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్నవాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి. అప్పుడు మీరు మంచి దుస్తులు వేసుకొన్నవాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ, “రండి! ఈ మంచి స్థానంలో కూర్చోండి” అని అంటూ, పేదవానితో, “నీవక్కడ నిలబడు!” అనిగాని, “నా కాళ్ళ దగ్గర కూర్చో” అనిగాని అంటే, మీరు వ్యత్యాసము చూపుతున్నట్లే కదా! దుర్బుద్ధితో తీర్పు చెప్పినట్లే కదా!

నా ప్రియమైన సోదరులారా! ప్రపంచం దృష్టిలో పేదవాళ్ళు విశ్వాసంలో ధనికులు కావాలనీ, వాళ్ళు తన రాజ్యానికి వారసులు కావాలనీ దేవుడు వాళ్ళను ఎన్నుకోలేదా? తనను ప్రేమించినవాళ్ళకు రాజ్యాన్నిస్తానని దేవుడు యింతకు క్రితమే వాగ్దానం చేసాడు. మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. మిమ్మల్ని దోచుకొనే వాళ్ళు ధనికులే కదా! వాళ్ళేకదా మిమ్ములను న్యాయస్థానానికి ఈడ్చేది? మీరు ఎవరికి చెందారో గౌరవప్రదమైన ఆయన పేరును దూషిస్తున్నది వాళ్ళే కాదా?

“నీ పొరుగింటివాణ్ణి నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా ప్రేమించు”(A) అని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞను మీరు నిజంగా పాటిస్తే మీలో సత్‌ప్రవర్తన ఉన్నట్లే. కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం చేసినవాళ్ళౌతారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిని ఉల్లంఘించినవాళ్ళౌతారు.

10 ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటిస్తూ ఒకే ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే అలాంటివాడు ధర్మశాస్త్రాన్నంతా ఉల్లంఘించినవాడౌతాడు. 11 ఎందుకంటే, “వ్యభిచారం చేయరాదు”(B) అని అన్నవాడే “హత్యచేయరాదు” అని కూడా అన్నాడు. మీరు వ్యభిచారం చేసివుండక పోవచ్చు. కాని హత్య చేసి ఉంటే! అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా!

12 స్వేచ్ఛను కలిగించే క్రొత్త ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందనున్న వాళ్ళలా ప్రవర్తించండి. అదేవిధంగా మాట్లాడండి. 13 దేవుడు తీర్పు చెప్పేటప్పుడు దయాహీనులపై దయ చూపడు. కాని దయచూపిన వాళ్ళు తీర్పు చెప్పే సమయంలో ఆనందిస్తారు.

విశ్వాసము, క్రియ

14 నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది” అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా? 15 ఒక సోదరుడో లేక సోదరియో కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి. 16 అప్పుడు మీరు అతనితో, “క్షేమంగా వెళ్ళిరా! కడుపునిండా తిని, ఒంటి నిండా దుస్తులు వేసుకో!” అని అంటూ వాళ్ళ అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి? 17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది.

18 కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!” అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను. 19 ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడ్తూ ఉంటాయి.

20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న[a] దానికి నీకు ఋజువు కావాలా? 21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి, అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా? 22 అతనిలో ఉన్న విశ్వాసము క్రియతో కలిసి పని చెయ్యటం మీరు గమనించారు. అతడు చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”(C) అని లేఖనాల్లో చెప్పిన విషయం నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు. 24 మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూసారు.

25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా?

26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International