Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 16

మోషే మీద కొందరి నాయకుల తిరుగుబాటు

16 కోరహు, దాతాను, అబీరాము, ఓను అనువారు మోషేకు ఎదురు తిరిగారు. (కోరహు ఇస్హారు కుమారుడు. ఇస్హారు కహాతు కుమారుడు, కహాతు లేవీ కుమారుడు. దాతాను, అబీరాములు సోదరులు, ఎలీయాబు కుమారులు. ఓను పెలెతు కుమారుడు). దాతాను, అబీరాము, ఓను రూబేను వంశస్థులు. ఈ నలుగురు ఇశ్రాయేలీయులలో మరో 250 మందిని పోగుజేసి మోషే మీదికి వచ్చారు. ఈ 250 మంది ఇశ్రాయేలీయులలో పేరున్న పెద్ద మనుష్యులు. వారు సభా సభ్యులుగా ఎన్నుకోబడినవారు. వారు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి గుంపుగా వచ్చి. “మీరు చేసింది మేము ఒప్పుకోవటం లేదు. ఇశ్రాయేలీయుల నివాసంలో ఉన్న వాళ్లంతా పవిత్రులు. వారిలో ప్రతి ఒక్కరూ మంచివారు. పైగా యెహోవా వారితో ఉన్నాడు. అలాంటప్పుడు మేము ఆ దేశంలో ప్రవేశించం అని చెబుతావేమి? నిన్ను నీవే అందరికంటె గొప్ప చేసుకొంటున్నావు” అని వాళ్లు మోషే, అహరోనులతో అన్నారు.

మోషే ఈ సంగతులు వినగానే, వినయంతో సాష్టాంగపడ్డాడు (తాను గర్విష్ఠిని కానని చూపించటానికి). అప్పుడు కోరహుతో, అతనితో ఉన్న వాళ్లందరితో మోషే ఇలా అన్నాడు: “వాస్తవానికి ఎవరు యెహోవాకు చెందినవారో రేపు ఉదయం ఆయన తెలియజేస్తాడు. అలాంటివాడిని ఆయన తన దగ్గరకు రానిస్తాడు. ఆ మనిషిని యెహోవా ఎన్నిక చేసి, యెహోవాయే అతడ్ని తన దగ్గరకు తీసుకొస్తాడు. అందుచేత కోరహు, నీవూ, నీ అనుచరులంతా ఇలా చేయాలి. రేపు ధూపార్తుల్లో నిప్పు, సాంబ్రాణి వెయ్యండి. అప్పుడు వాటిని యెహోవా సన్నిధికి తీసుకొనిరండి. నిజంగా పవిత్రుడ్ని యెహోవా ఎంచుకొంటాడు. కానీ, నీవూ, నీ లేవీ సోదరులు తప్పుచేసి మితిమీరిపోయారు.”

కోరహుతో మోషే ఇంకా ఇలా అన్నాడు: “లేవీయులారా, నా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచినందుకు మీరు సంతోషించాలి. మిగతా ఇశ్రాయేలు ప్రజలందరి కంటె మీరు ప్రత్యేకం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఆరాధించేందుకు సహాయకరంగా యెహోవా పవిత్ర గుడారంలో ప్రత్యేక పని చేయటానికి యెహోవా మిమ్మల్ని తనకు దగ్గరగా తెచ్చుకొన్నాడు. అది చాలదా? 10 యెహోవా తానే నిన్ను, లేవీ ప్రజలందర్నీ తన దగ్గరకు చేర్చుకొన్నాడు. కానీ ఇప్పుడు మీరే యాజకులు అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. 11 నీవూ, నీ అనుచరులూ యెహోవా మీదికి రావటానికి ఏకమయ్యారు. మీరు అహరోను మీదికివచ్చి, అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం తప్పు.”

12 అప్పుడు ఎలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను మోషే పిల్చాడు. కానీ వాళ్లిద్దరు ఇలా చెప్పారు: “మేము రాము. 13 పాలు తేనెలు ప్రవహించే మంచి ధనిక దేశంనుండి నీవు మమ్మల్ని బయటకు తీసుకుచ్చావు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికి నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చావు. పైగా నీకు మామీద చాల అధికారం ఉన్నట్టు చూపించాలనుకొంటున్నావు. 14 మేము నిన్నెందుకు వెంబండించాలి? పాలు తేనెలు ప్రవహించే ఒక కొత్త ధనిక దేశానికి మమ్మల్ని నీవు తీసుకొని రాలేదు. దేవుడు వాగ్దానం చేసిన దేశం నీవు మాకు ఇవ్వలేదు. పొలాలు, ద్రాక్షాతోటలు ఏవి నీవు మాకు ఇవ్వలేదు. ఈ మనుష్యుల్ని నీ బానిసలుగా చేస్తావా? లేదు, మేము రాము.”

15 అందుచేత మోషేకు చాల కోపం వచ్చింది. అతడు యెహోవాతో “వారి కానుకలు స్వీకరించకు. వారి దగ్గరనుండి నేనేమి తీసుకోలేదు, కనీసం ఒక గాడిదను కూడా తీసుకోలేదు. పైగా వారిలో ఎవ్వరికీ నేనేమి కీడు చేయలేదు” అని చెప్పాడు.

16 అప్పుడు మోషే కోరహుతో అన్నాడు: “నీవూ, నీ అనుచరులంతా రేపు యెహోవా ఎదుట నిలబడాలి. మీతోబాటు అహరోనుకూడ యెహోవా ఎదుట నిలబడతాడు. 17 మీలో ప్రతి ఒక్కరూ ఒక ధూపార్తి తీసుకుని, అందులో సాంబ్రాణి వేసి దానిని యెహోవాకు అర్పించాలి. నాయకులకు 250 ధూపార్తులు, నీకు ఒక ధూపార్తి, అహరోనుకు ఒక ధూపార్తి ఉండాలి.”

18 కనుక ప్రతి ఒక్కరూ ఒక్కో ధూపార్తిని సాంబ్రాణితో నింపారు. అప్పుడు వారు సన్నిధి గుడారపు ప్రవేశం దగ్గర నిలబడ్డారు. మోషే, అహరోను కూడ అక్కడ నిలబడ్డారు. 19 కోరహు తన అనుచరులందరినీ సమావేశపర్చాడు (వీళ్లే మోషే, అహరోనులను ఎదిరించినవారు). సన్నిధి గుడార ప్రవేశం దగ్గర వీళ్లందర్నీ కోరహు సమావేశ పర్చాడు. అప్పుడు అక్కడ ప్రతి ఒక్కరికీ యెహోవా మహిమ ప్రత్యక్షం అయింది.

20 మోషే, అహరోనులతో యెహోవా 21 “ఈ మనుష్యులకు దూరంగా వెళ్లిపోండి, నేను వాళ్లను ఇప్పుడే నాశనం చేసేస్తాను” అన్నాడు.

22 అయితే మోషే, అహరోనూ సాష్టాంగపడిపోయి “ఓ దేవా, మనుష్యులందరి ఆత్మలను ఎరిగిన యెహోవా నీవు. మొత్తం ఈ గుంపు అంతటి మీద కోపగించకు. నిజానికి పాపం చేసింది ఒక్కడే” అంటూ మొరపెట్టారు.

23 అప్పుడు యెహోవా మోషేతో 24 “కోరహు, దాతాను, అబీరాము గుడారాల దగ్గరనుండి అందర్నీ దూరంగా వెళ్లిపొమ్మని చెప్పు” అన్నాడు.

25 మోషే లేచి దాతాను, అబీరాము దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలంతా అతన్ని వెంబడించారు. 26 మోషే ప్రజలను ఈ రీతిగా హెచ్చరించాడు: “ఈ దుర్మార్గుల గుడారాల నుండి దూరంగా వెళ్లిపొండి. వారి వాటిని ఏవీ తాకకండి. మీరు తాకితే వారి పాపాలవల్ల మీరుకూడ నాశనం చేయబడతారు.”

27 కనుక వాళ్లంతా కోరహు, దాతాను, అబీరాము గుడారాలనుండి దూరంగా వెళ్లిపోయారు. దాతాను, అబీరాము వారి భార్యలు, పిల్లలు, శిశువులతోబాటు వారి గుడారాల బయట నిలబడి ఉన్నారు.

28 అప్పుడు మోషే చెప్పాడు: “నేను మీతో చెప్పిన విషయాలన్నీ చేసేందుకు యెహోవా నన్ను పంపించాడని నేను మీకు రుజువు చూపిస్తాను. అవన్నీ నా స్వంత తలంపులు కావని నేను మీకు చూపిస్తాను. 29 ఈ మనుష్యులు ఇక్కడే చస్తారు. కానీ సాధారణంగా మనుష్యులు చనిపోయే సామాన్య విధానంలోనే గనుక వీరు మరణిస్తే, నన్ను నిజంగా యెహోవా పంపించలేదని అర్థం. 30 కానీ ఈ మనుష్యులు వేరే విధంగా, మరో క్రొత్తరకంగా మరణించేటట్టు యెహోవా గనుక చేస్తే అప్పుడు వీళ్లు నిజంగా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసారని మీకు తెలుస్తుంది. భూమి తెరచుకొని వీళ్లను మింగేస్తుంది. వారు సజీవ సమాధి అయిపోతారు. వీరికి చెందినది అంతా వీరితోబాటే లోపలికి వెళ్లిపోతుంది.”

31 మోషే ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆ మనుష్యుల కాళ్ల క్రింద భూమి తెరచుకొంది. 32 అది భూమి తన నోరు తెరచి వారిని మింగివేసినట్టుగా ఉంది. వారి కుటుంబాలన్నీ, కోరహు మనుష్యులంతా, వారికి ఉన్నదంతా భూమిలోకి వెళ్లిపోయింది. 33 వారు సజీవంగానే సమాధిలోనికి వెళ్లిపోయారు. వారికి ఉన్నదంతా వారితో బాటే లోపలికి వెళ్లిపోయింది. అప్పుడు వారిమీద భూమి కప్పివేసింది. వారు నాశనమైపోయి, పాళెములో లేకుండా పోయారు.

34 నాశనం చేయబడుతోన్న మనుష్యుల అరుపులు ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. అందుచేత వాళ్లంతా “భూమి మనల్నికూడ మ్రింగివేస్తుంది” అంటూ అటు ఇటు పరుగులెత్తారు.

35 తర్వాత యెహోవా దగ్గర్నుండి అగ్ని దిగి వచ్చి, ధూపం వేస్తున్న ఆ 250 మందిని నాశనం చేసింది.

36 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 37-38 “చచ్చిన ఆ మనుష్యుల మధ్య ఉన్న ధూపార్తులన్నింటినీ వెదకమని యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో చెప్పు. ఆ నిప్పుకణికలను నివాసానికి దూరంగా చల్లండి. ధూపార్తులు ఇంకా పవిత్రమైనవే. ఇవి నాకు వ్యతిరేకంగా పాపం చేసిన మనుష్యులు ఉపయోగించిన ధూపార్తులు. వారి పాపం వారి ప్రాణాలు తీసింది. ధూపార్తులను రేకులుగా కొట్టండి. బలిపీఠం కప్పటానికి ఈ రేకులు వాడండి. అవి యెహోవా ఎదుట అర్పించబడినవి గనుక అవి పవిత్రం. రేకులు చేయబడ్డ ఆ ధూపార్తులు ఇశ్రాయేలు ప్రజలందరకు హెచ్చరికగా ఉండుగాక!”

39 కనుక ఆ మనుష్యుల ఇత్తడి ధూపార్తులను అన్నింటినీ ఎలియాజరు పోగుచేసాడు. వాళ్లంతా కాల్చివేయబడ్డారు గాని ధూపార్తులు మాత్రం అక్కడ ఉన్నాయి. ఆ ధూపార్తులను వెడల్పు రేకులుగా కొట్టమని కొందరితో చెప్పాడు ఎలియాజరు. అప్పుడు ఆ వెడల్పు రేకులను అతడు బలిపీఠం చుట్టూ పెట్టాడు. 40 మోషే ద్వారా యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఇలా చేసాడు. అహరోను కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే యెహోవా ఎదుట ధూపం వేయాలని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఇది సహాయకరమైన సూచన. ఇంకొక వ్యక్తి గనుక యెహోవా ఎదుట ధూపం వేస్తే, అతడు కోరహు, అతని అనుచరుల్లా అవుతాడు.

అహరోను ప్రజల్ని రక్షించటం

41 మరునాడు ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేసారు. వారు, “యెహోవా ప్రజలను మీరు చంపారు” అన్నారు.

42 మోషే, అహరోనులు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర నిలబడి ఉన్నారు. మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేయటానికి ప్రజలు ఆచోట చేరారు. అయితే వారు సన్నిధి గుడారం వైపు చూచినప్పుడు, మేఘం దానిని అవరించి, యెహోవా మహిమ అక్కడ ప్రత్యక్షమయింది. 43 అప్పుడు మోషే. అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వెళ్లారు.

44 అప్పుడు యెహోవా మోషేతో 45 “ఇప్పుడు నేను వీళ్లను నాశనం చేస్తాను గనుక మీరు దూరంగా తొలగిపొండి” అని చెప్పాడు. కనుక మోషే, అహరోనులు సాష్టాంగపడ్డారు.

46 అప్పుడు మోషే “నీ ధూపార్తిని బలిపీఠపు నిప్పులతో నింపు. దానిమీద సాంబ్రాణి వేయి. త్వరపడి ప్రజల సమాజం దగ్గరకు వెళ్లి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయి. యెహోవా వారి మీద కోపంగా ఉన్నాడు. కష్టాలు అప్పుడే మొదలయ్యాయి” అని అహరోనుతో చెప్పాడు.

47 కనుక మోషే చెప్పినట్టు అహరోను చేసాడు. అతడు నిప్పులు, సాంబ్రాణి తీసుకొని ప్రజలందరి మధ్యకు పరుగెత్తాడు, అయితే అప్పుటకే ప్రజల్లో రోగం మొదలయింది. ప్రజలకోసం ప్రాయశ్చిత్తంగా అహరోను ధూపం వేసాడు. 48 బ్రతికి ఉన్నవాళ్లకు, చచ్చిన వాళ్లకు మధ్య నిలబడ్డాడు అహరోను. అంతటితో ఆ రోగం ఆగిపోయింది. 49 అయితే వారి పాపం నిమత్తం అహరోను ప్రాయశ్చిత్తం చేయకముందే ఆ రోగంవల్ల కోరహు మూలంగా చచ్చినవాళ్లు కాక ఇంకా 14,700 మంది చనిపోయారు. 50 అప్పుడు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర ఉన్న మోషే వద్దకు అహరోను తిరిగి వెళ్లాడు. ప్రజల్లో ఆ భయంకర రోగం నిలిచిపోయింది.

కీర్తనలు. 52-54

సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.

52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
    నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
    సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.

నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
    ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.

మంచి వాళ్లు ఇది చూచి,
    దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
    “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
    ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”

అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
    నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
    నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.

సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.

53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
    అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
    సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
    దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
    కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
    ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
    ఒక్కడూ లేడు.

దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
    కాని వారు నన్ను ప్రార్థించరు.
    ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”

కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
    భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
    కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.

ఇశ్రాయేలు ప్రజలారా,
    సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
    యాకోబు సంతోషిస్తాడు.
    ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.

సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.

54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
    నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
దేవా, నా ప్రార్థనను,
    నేను చెప్పే సంగతులను ఆలకించుము.
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
    బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.

చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
    నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
    దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.

దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
    యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
    మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.

యెషయా 6

దేవుడు యెషయాను ప్రవక్తగా ఉండమని పిలుచుట

ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరం నా ప్రభువును నేను చూశాను. మహా ఎత్తయిన సింహాసనంమీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అంగీతో దేవాలయం నిండిపోయింది. సెరాపులనే దేవదూతలు ఆయన పైగా నిలబడ్డారు. ఒక్కొక్క సెరాపు దేవదూతకు ఆరు రెక్కలు ఉన్నాయి. ఆ దేవదూతలు వారి ముఖాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు, పాదాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు మరియు ఎగిరేందుకు రెండేసి రెక్కలు ఉపయోగించారు. దేవదూతలు ఒకరితో ఒకరు, “ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన మహిమ భూలోకమంతా నిండిపోయింది” అని ఘనంగా స్తుతిస్తున్నారు. వారి స్వరాలు గడప కమ్ముల్ని కదలించి వేశాయి. అంతలో దేవాలయం ధూమంతో నిండిపోవటం మొదలయింది.

“అయ్యో! నాకు శ్రమ, నేను నాశనమయ్యాను. నేను అశుద్ధమైన పెదవులున్న వాడను, నేను అపరిశుద్ధమైన పెదవులున్న జనుల మధ్య నివసిస్తున్నాను. సైన్యములకధిపతియైన యెహోవాను నేను చూశాను.”

బలిపీఠం మీద అగ్ని ఉంది. సెరాపు దేవదూతల్లో ఒకరు ఆ అగ్నిలో నుండి మండుచున్న ఒక నిప్పుకణాన్ని తీయటానికి ఒక పట్టకారు ఉపయోగించారు. మండుతున్న ఆ నిప్పుకణం చేతపట్టుకొని ఆ దేవదూత నా దగ్గరకు ఎగిరి వచ్చాడు. ఆ సెరాపు దేవదూత ఆ వేడి నిప్పుకణంతో నా నోటిని తాకాడు. అప్పుడు ఆ దూత, “చూడు, ఈ వేడి నిప్పుకణం నీ పెదాలను తాకింది గనుక నీవు చేసిన తప్పులన్నీనీలో నుండి పోయాయి. ఇప్పుడు నీ పాపాలు తుడిచివేయబడ్డాయి.” అని చెప్పాడు.

అప్పుడు నా ప్రభువు స్వరం నేను విన్నాను. “నేను ఎవర్ని పంపగలను? మా కోసం ఎవరు వెళ్తారు?” అన్నాడు యెహోవా.

కనుక నేను “ఇదుగో నేను ఉన్నాను, నన్ను పంపించు” అన్నాను.

అప్పుడు యెహోవా చెప్పాడు, “వెళ్లి, ప్రజలతో ఇది చెప్పు: ‘మీరు దగ్గరగా వచ్చి వింటారు గాని గ్రహించరు! దగ్గరగా వచ్చి చూస్తారు గాని నేర్చుకోరు.’ 10 ప్రజల్ని గందరగోళం చేయి. ప్రజలు విని, చూచే విషయాలు వారు గ్రహించకుండా ఉండేటట్టు చేయి. నీవు ఇలా చేయకపోతే, ప్రజలు వారి చెవులతో వినే విషయాలను నిజంగానే గ్రహించవచ్చు. ప్రజలు వారి మనస్సుల్లో నిజంగానే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వారు అలా కనుక చేస్తే, ఆ ప్రజలు మళ్లీ నా దగ్గరకు తిరిగి వచ్చి, స్వస్థత పొందుతారేమో (క్షమాపణ)!”

11 అప్పుడు నేను “ప్రభూ, ఎన్నాళ్లు నేను ఇలా చేయాలి?” అని అడిగాను.

యెహోవా జవాబిచ్చాడు, “పట్టణాలు నాశనం చేయబడి, ప్రజలు వెళ్లిపోయేంత వరకు ఇలా చేయి. ఇళ్లలో మనుష్యులు ఎవ్వరూ నివసించకుండా ఉండే అంతవరకు ఇలా చేయి. దేశం నాశనం చేయబడి, నిర్జనం అయ్యేంతవరకు ఇలా చేయుము.”

12 ప్రజలు దూరంగా వెళ్లిపోయేట్టు యెహోవా చేస్తాడు. దేశంలో విస్తారమైన ప్రదేశాలు నిర్జనంగా ఉంటాయి. 13 అయితే పదోవంతు ప్రజలు దేశంలో ఉండేందుకు అనుమతించబడతారు. ఈ ప్రజలు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు గనుక వీరు నాశనం చేయబడరు. ఈ ప్రజలు సింధూర వృక్షంలాంటి వారు. చెట్టు నరికి వేయబడినప్పుడు, దాని మొద్దు విడువబడుతుంది. ఈ మొద్దు (మిగిలిన ప్రజలు) చాలా ప్రత్యేకమైన విత్తనం.

హెబ్రీయులకు 13

చివరి మాటలు

13 పరస్పరం సోదరుల్లా జీవించండి. తెలియనివాళ్ళకు ఆతిథ్యమివ్వండి. కొందరు యిలా చేసి తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు. చెరసాలల్లో ఉన్నవాళ్ళను, మీరు వాళ్ళతో సహా ఉన్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి. అదేవిధంగా కష్టాలనుభవిస్తున్న వాళ్ళను, మీరు వాళ్ళతో సహా కష్టాలనుభవిస్తున్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి.

వివాహాన్ని అందరూ గౌరవించాలి. వివాహపాన్పును నిష్కళంకంగా ఉంచాలి. వ్యభిచారుల్ని, వివాహితులతో లైంగిక సంబంధాలను పెట్టుకొన్నవాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. ధనాశ లేకుండా జీవితాలు గడపండి. మీ దగ్గరున్నదానితో సంతృప్తి చెందండి. ఎందుకంటే దేవుడు ఈ విధంగా అన్నాడు:

“నేను నిన్ను ఎన్నటికీ విడువను
నిన్నెన్నటికీ ఒంటరివాణ్ణి చెయ్యను.”(A)

అందువల్ల మనం దృఢ విశ్వాసంతో,

“ప్రభువు నా రక్షకుడు,
    నాకే భయంలేదు.
మానవుడు నన్నేమి చెయ్యగలడు?”(B)

అని అంటున్నాము.

మీకు దైవసందేశాన్ని ఉపదేశించిన గురువుల్ని జ్ఞాపకముంచుకోండి. వాళ్ళ జీవిత విధానం వలన కలిగిన మంచిని గమనించండి. వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి. నిన్న, నేడు, నిరంతరం యేసు క్రీస్తు ఒకే విధంగా ఉంటాడు. ఎన్నో రకాల విచిత్రమైన బోధలు ఉన్నాయి. వాటివల్ల మోసపోకండి. దైవానుగ్రహంతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారంతో కాదు. ఆహార నియమాలవల్ల వాళ్ళకు లాభం కలుగదు.

10 యూదుల గుడారంలో సేవచేసే యాజకులకు మన బలిపీఠం మీద బలి ఇచ్చినదాన్ని తినే అధికారంలేదు. 11 పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించటానికి ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పవిత్రస్థానంలోకి తీసుకు వెళ్ళేవాడు. ఆ జంతువుల దేహాల్ని శిబిరానికి ఆవలి వైపు కాల్చేవాడు. 12 మనుష్యుల్ని తన రక్తంతో పవిత్రం చెయ్యాలని యేసు నగరపు సింహద్వారానికి ఆవల మరణించాడు. 13 అందువల్ల శిబిరం వెలుపలనున్న ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అవమానాన్ని పంచుకుందాం. 14 మనకు స్థిరమైన పట్టణం లేదు. కాని మున్ముందు రానున్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. 15 అందువల్లే మనం యేసు ద్వారా దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించుదాం. మన నోటి ద్వారా కలిగే స్తుతిని ఆయనకు బలిగా అర్పించి, ఆయన పేరులో ఉన్న కీర్తిని పంచుకుందాం. 16 ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్నదాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం.

17 మీ నాయకుల పట్ల విధేయతగా ఉంటూ, వాళ్ళు చెప్పినట్లు చెయ్యండి. మీ ఆత్మల్ని కాపాడవలసిన పని వాళ్ళది. వాళ్ళు దేవుని ముందు లెక్క చెప్పవలసివుంటుంది. వాళ్ళకు మీరు విధేయులైవుంటే, వాళ్ళు తాము చేయవలసిన పనిని ఆనందంగా చేయగలుగుతారు. అది వాళ్ళకు భారంగా వుండదు. వాళ్ళకు భారం కలగటం మీకు మంచిది కాదు.

18 మా కోసం ప్రార్థించండి. మా అంతరాత్మలు నిర్మలమైనవనే విశ్వాసం మాకు ఉంది. మేము అన్ని విధాలా గౌరవప్రదంగా జీవించాలనుకొంటున్నాము. 19 నేను ముఖ్యంగా వేడుకునేదేమిటంటే, నేను త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించండి.

20 శాంతిని స్థాపించే దేవుడు, గొఱ్ఱెల గొప్ప కాపరి అయిన మన యేసు ప్రభువును తిరిగి బ్రతికించాడు. ఈ కార్యాన్ని దేవుడు శాశ్వతమైన ఒడంబడిక రక్తం ద్వారా జరిగించాడు. 21 ఆ దేవుడు మీరు ఆయన యిష్టానుసారం నడుచుకునేటట్లు మీకు కావలసినవి సమకూర్చు గాక! ఆయన మనలో ఉండి, యేసు క్రీస్తు ద్వారా తన యిష్టాన్ని నెరవేర్చుగాక! ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.

22 సోదరులారా! నేనీ లేఖను క్లుప్తంగా వ్రాసాను. ప్రోత్సాహం కలుగ చేసే ఈ సందేశాన్ని సహృదయంతో చదవమని వేడుకుంటున్నాను. 23 మన సోదరుడైన తిమోతిని విడుదల చేసినట్లు మీకు తెలియజేస్తున్నాను. అతడు నా వద్దకు త్వరలో వస్తే అతనితో కలిసి మిమ్మల్ని చూడటానికి వస్తాను.

24 మీలోవున్న పెద్దలకు, దేవుని ప్రజలకు వందనాలు తెలుపండి. ఇటలీ దేశానికి చెందిన విశ్వాసులు మీకు వందనాలు తెలుపుతున్నారు.

25 మీ అందరికి దేవుని ప్రేమానుగ్రహము తోడుగా వుండునుగాక!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International