M’Cheyne Bible Reading Plan
బలుల నియమాలు
15 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి చెప్పు: మీకు నివాసంగా నేను ఇస్తున్న ఒక దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ దేశంలో ప్రవేశించగానే మీరు యెహోవాకు బలులు అర్పించాలి. 3 ఈ అర్పణల్లో కొన్నింటిని మీరు అగ్నితో దహించాలి. మీ పశువుల మందల్లోనుండి, గొర్రెలమందల్లోనుండి మీరు అర్పణలు ఇవ్వాలి. ఇది యెహోవాకు ప్రీతిని కలిగిస్తుంది. దహనబలులు, బలి అర్పణలు, ప్రత్యేక ప్రమాణాలు, ప్రత్యేక కానుకలు, సమాధాన బలులు, ప్రత్యేక సెలవు దినాలు ఇవన్నీ యెహోవాకు చాల ఇష్టం.
4 “ఆ సమయంలో తన అర్పణను తెచ్చేవాడు యెహోవాకు ధాన్యార్పణ కూడ పెట్టాలి. ఆ ధాన్యార్పణ ముప్పావు ఒలీవ నూనెతో కలపబడ్డ రెండు పడుల పిండి. 5 ఒక గొర్రెపిల్లను దహనబలిగా నీవు అర్పించిన ప్రతిసారీ ముప్పావు ద్రాక్షారసం పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి.
6 “మీరు ఒక పొట్టేలును అర్పిస్తుంటే కూడ ధాన్యార్పణ సిద్ధం చేయాలి. ఆ ధాన్యార్పణ ఒక పడి ఒలీవ నూనెతో కలుపబడ్డ నాలుగు పడుల పిండి. 7 ఒక పడి ద్రాక్షారసాన్ని పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి. దాన్ని యెహోవాకు అర్పించు. అది ఆయన్ని సంతోషపెడుతుంది.
8 “అర్పణగా, బలిగా, సమాధాన బలిగా, లేక యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానంగా నీవు ఒక కోడెదూడను సిద్ధం చేయవచ్చు. 9 కనుక ఆ కోడెదూడతోబాటు ధాన్యార్పణ కూడ నీవు తీసుకొనిరావాలి. ఆ ధాన్యార్పణ పడిన్నర ఒలీవ నూనెతో కలుపబడిన ఆరు పడుల గోధుమ పిండి. 10 మరియు పడిన్నర ద్రాక్షారసం పానార్పణంగా తేవాలి. ఈ అర్పణ హోమంలో దహించబడటం యెహోవాకు ఎంతో సంతోషం. 11 నీవు యెహోవాకు అర్పించే ప్రతి కోడెదూడ, పోట్టేలు, గొర్రెపిల్ల, మేక పిల్ల ఈ విధంగా సిద్ధం చేయబడాలి. 12 నీవు అర్పించే ప్రతి జంతువుకూ నీవు ఇలా చేయాలి.
13 “ప్రజలు ఇలా దహన బలులు అర్పించినప్పుడు వారు యెహోవాను సంతోషపెడతారు. అయితే ఇశ్రాయేలీయుల్లో ప్రతి పౌరుడూ వీటన్నింటినీ నేను నీతో చెప్పినట్టే చేయాలి. 14 మరియు రాబోయే కాలమంతటిలో ఇశ్రాయేలు కుటుంబంలో జన్మించనివాడు మీ మధ్య నివసిస్తుంటే, అతడు కూడా వీటన్నింటికీ విధేయుడు కావాలి. నేను నీకు చెప్పిన విధంగానే అతడు ఇవన్నీ చేయాలి. 15 ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతరులకు ఒకే రకమైన నియమాలు ఉండాలి. ఈ ఆజ్ఞ ఇప్పటినుండి భవిష్యత్తు వరకు కొనసాగుతుంది. మీరు, మీ మధ్య ఉండే ఇతరులు అంతా ఒకటే యెహోవా ఎదుట. 16 అంటే మీరు ఒకే ఆజ్ఞలు, నియమాలు పాటించాలని దీని భావం. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతర ప్రజలందరికి ఇవే ఆజ్ఞలు, నియమాలు.”
17 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 18 “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: నేను మిమ్మల్ని మరో దేశానికి తీసుకొని వెళ్తున్నాను. 19 ఆ దేశంలో పండే ఆహారం మీరు తినేటప్పుడు దానిలో భాగం యెహోవాకు అర్పణగా మీరు ఇవ్వాలి. 20 మీరు ధాన్యం విసిరి, ముద్దగా చేయాలి. దాన్ని రొట్టెలుగా చేయాలి. ఆ రొట్టెల్లో మొదటిది యెహోవాకు ఇవ్వాలి. అది కళ్లం నుండి వచ్చే ధాన్యార్పణ. 21 ఇప్పుడు, రాబోయే కాలమంతా ఈ అర్పణను మీరు యెహోవాకు ఇవ్వాలి. అనగా మీరు ఆహారంగా విసరుకొనే ధాన్యంలో మొదటిది యెహోవాకు ఇవ్వాలని అర్థం.
22 “మోషేకు యెహోవా ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనికైనా విధేయులవటం మీరు మరచిపోతే మీరేమిచేయాలి? 23 ఇవి మోషే ద్వారా మీకివ్వబడిన ఆజ్ఞలు. వీటిని యెహోవా మీకు ఇచ్చిన రోజే ఈ ఆజ్ఞలు ప్రారంభం అయ్యాయి. ఈ ఆజ్ఞలు రాబోయే కాలమంతా కొనసాగుతాయి. 24 అయితే వీటిలో ఏదైనా ఒక ఆజ్ఞకు మీరు విధేయులు కాకపోవటం జరుగవచ్చు. మీరు ఒక ఆజ్ఞకు విధేయులవటం మరచిపోయినా, ప్రజలంతా ఆ ఆజ్ఞ మరచిపోయి దోషులైనా, ప్రజలంతా ఒక కోడెదూడను యెహోవాకు అర్పణగా ఇవ్వాలి. ఇది దహనబలి, ఇది యెహోవాను సంతోషపెడుతుంది. కోడె దూడతో బాటు ధాన్యార్పణ, పానార్పణం కూడ ఇవ్వాలని జ్ఞాపకం ఉంచుకోండి. మరియు పాప పరిహర బలిగా ఒక మగ మేకనుకూడ మీరు ఇవ్వాలి.
25 “కనుక ఆ పాపం నిమిత్తం ఆ చెల్లింపును యాజకుడు అర్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరి కోసం అతడు ఇలా చేస్తాడు. వారు పాపం చేస్తున్నట్టు ప్రజలకు తెలియదు. అయితే దాన్నిగూర్చి వారు తెలుసుకొన్నప్పుడు, వారి తప్పిదం నిమిత్తం యెహోవాకు అర్పించేందుకు వారు ఒక అర్పణం తెచ్చారు. అది హోమంలో దహించబడిన పాప పరిహారార్థ అర్పణ. 26 ఇశ్రాయేలు ప్రజలందరు, వారి మధ్య నివసిస్తున్న ఇతర ప్రజలంతా క్షమించబడతారు. వారు చేస్తోంది తప్పు అని వారికి తెలియదు గనుక వారు క్షమించబడతారు.
27 “అయితే ఒక వ్యక్తి మాత్రమే ఒక ఆజ్ఞను పాటించటం మరచిపోతే, అతడు ఒక సంవత్సరపు ఆడ మేకను పాపపరిహారార్థ బలిగా తీసుకుని రావాలి. 28 ఆ పాపం నిమిత్తం యెహోవా ఎదుట యాజకుడు ఆ చెల్లింపును అర్పిస్తాడు. అతని నిమిత్తం యాజకుడు చెల్లింపును అర్పించాడు గనుక అతడు క్షమించ బడతాడు. 29 పాపం చేసినప్పటికి తాను తప్పు చేస్తున్నానని ఎరుగని ప్రతి వ్యక్తికి ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వారికి, మీ మధ్యలో నివసిస్తున్న ఇతర ప్రజలకు కూడా ఇదే ఆజ్ఞ.
30 “కానీ ఎవరైనా సరే తాను చేస్తోంది తప్పు అని తెలిసికూడ పాపం చేస్తే, అలాంటివాడు యెహోవాకు విరోధంగా జీవిస్తున్నాడు. అతడిని తన ప్రజలనుండి పంపించి వేయాలి. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వానికి, మీ మధ్య నివసించే వానికి ఇది సమానం. 31 అతడు యెహోవా మాటకు అడ్డం తిరిగాడు. అతడు యెహోవా ఆజ్ఞలకు విధేయుడు కాలేదు. అతడు తప్పకుండ మీ మధ్యనుండి వెళ్లగొట్టబడాలి. అతడు దోషిగానే ఉంటాడు.”
విశ్రాంతి రోజున ఒకడు పని చేయటం
32 ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అరణ్యంలోనే ఉన్నారు. ఒకడు వంట కట్టెలు చూడటం తటస్థించింది. కనుక అతడు ఆ కట్టెలు ప్రోగుచేస్తున్నాడు కాని అది సబ్బాతు. అతడు ఇలా చేయటం మరికొందరు చూసారు. 33 అతడు కట్టెలు ఏరటం చూచిన వాళ్లు అతన్ని, మోషే, అహరోను దగ్గరకు తీసుకుని వచ్చారు. ప్రజలంతా వాడ్ని చుట్టేసారు. 34 ఆ మనిషిని ఎలా శిక్షించాలో వారికి తెలియదు గనుక వారు అతణ్ణి అక్కడే ఉంచారు.
35 అప్పుడు యెహోవా, “ఆ మనిషిచావాలి. నివాస స్థలపు వెలుపల, ప్రజలంతా వానిమీద రాళ్లు విసరాలి” అని మోషేతో చెప్పాడు. 36 కనుక ప్రజలు అతణ్ణి నివాస స్థలమునుండి వెలుపలకు తీసు కుని వెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విధంగానే వారు ఇలా చేసారు.
దేవుని ఆజ్ఞలు జ్ఞాపకముంచుకొను పద్ధతి
37 మోషేతో యెహోవా అన్నాడు: 38 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు: మీరు నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు నేను మీకు ఒకటి ఇస్తాను. దారం ముక్కలు కొన్ని తీసుకొని వాటిని పేని, మీ బట్టల అంచులకు వాటిని కట్టాలి. ఆ కుచ్చుల్లో ఒక్కొక్క దాని మధ్య ఒక నీలం దారం ఉంచాలి. ఇప్పుడూ, ఇక ముందుకూ ఎప్పటికీ మీరు వాటిని ధరించాలి. 39 మీరు ఈ కుచ్చులను చూచి, యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నింటిని జ్ఞాపకం ఉంచుకో గలుగుతారు. అప్పుడు మీరు ఆ ఆజ్ఞలకు విధేయులవుతారు. ఆజ్ఞలను మరచిపోయి, మీ శరీరాలు, కండ్లు కోరిన ప్రకారం చేయరు. 40 మీరు నా ఆజ్ఞలు అన్నింటికి విధేయులు కావాలని జ్ఞాపకం ఉంచుకొంటారు. అప్పుడు మీరు దేవుని ప్రత్యక ప్రజలుగా ఉంటారు. 41 నేను యెహోవాను, మీ దేవుడ్ని. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చింది నేనే. నేను మీ దేవునిగా ఉండటానికి ఇలా చేసాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”
సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.
51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
నా పాపాలన్నీ తుడిచివేయుము.
2 దేవా, నా దోషం అంతా తీసివేయుము.
నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
3 నేను పాపం చేశానని నాకు తెలుసు.
నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
5 నేను పాపంలో పుట్టాను.
పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
9 నా పాపాలను చూడకుము!
వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15 నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.
18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.
యూదా, దేవుని ద్రాక్షాతోట
5 ఇప్పుడు నేను నా స్నేహితునికి (దేవుడు) ఒక పాట పాడుతాను. నా స్నేహితునికి తన ద్రాక్షావనం మీద (ఇశ్రాయేలు) ఉన్న ప్రేమను గూర్చిన పాట ఇది.
మంచి సారవంతమైన భూమిలో
నా స్నేహితునికి ఒక ద్రాక్షతోట ఉంది.
2 నా స్నేహితుడు పొలం దున్ని, చదును చేశాడు.
అక్కడ మంచి ద్రాక్ష మొక్కల్ని అతడు నాటాడు.
ఆ పొలం మధ్యలో అతడు ఒక గోపురం కట్టాడు.
అక్కడ మంచి ద్రాక్షలు పండుతాయని
నా స్నేహితుడు ఎదురు చూశాడు.
కాని అక్కడ కారు ద్రాక్షలే పండాయి.
3 కనుక దేవుడు చెప్పాడు: “యెరూషలేములో నివసిస్తున్న ప్రజలారా, ఓ యూదా మనిషి,
నన్ను గూర్చి, నా ద్రాక్షాతోట గూర్చి ఆలోచించు.
4 నా ద్రాక్షా తోటకు సహాయపడుటకు ఇంతకంటె ఎక్కువ నేనేం చేయాలి?
నేను చేయగలిగింది అంతా చేశాను.
మంచి ద్రాక్షలు పండుతాయని నేను ఎదురు చూశాను.
కానీ కారు ద్రాక్షాలే ఉన్నాయి
ఎందుకు అలా జరిగింది?
5 “నా ద్రాక్షాతోటకు నేను ఏమి చేస్తానో ఇప్పుడు నేను మీతో చెబుతాను.
తోటను కాపాడుతోన్న ముళ్ల కంచెను
నేను లాగివేసి, దాన్ని కాల్చేస్తాను.
దాని రాతి గోడను నేను కూలగొట్టేస్తాను.
ఆ రాళ్లు కాళ్ల క్రింద తొక్కబడతాయి.
6 నా ద్రాక్షా తోటను నేను బీడు భూమిగా చేస్తాను.
దాని మొక్కల్ని ఎవరూ లెక్క చేయరు. ఆ పొలంలో ఎవ్వరూ పని చేయరు.
కలుపు మొక్కలు, ముళ్లపొదలు అక్కడ పెరుగుతాయి.
ఆ పొలం మీద వర్షించ వద్దని మేఘాలకు నేను ఆజ్ఞాపిస్తాను.”
7 సర్వశక్తిమంతుడైన యెహోవాకు చెందిన ద్రాక్షాతోట ఇశ్రాయేలు రాజ్యం. యెహోవాకు ప్రియమైన ద్రాక్షావల్లి యూదా మనిషి.[a]
యెహోవా న్యాయం కోసం నిరీక్షించాడు.
కాని అక్కడ చంపటం మాత్రమే ఉంది.
అంతా లక్షణంగా ఉంటుంది అని యెహోవా నిరీక్షించాడు.
కానీ అక్కడ బాధించబడిన ప్రజల ఆర్త ధ్వనులే ఉన్నాయి.
8 మీరు చాలా కిక్కిరిసి నివసిస్తారు. ఇంక దేనికి స్థలంలేనంతగా మీరు ఇళ్లు నిర్మించేస్తారు. కానీ యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. మీరు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దేశం మొత్తంలో మీరు మాత్రమే ఉంటారు. 9 సర్వశక్తిమంతుడైన యెహోవా నాతో ఇలా చెప్పాడు, నేను అది విన్నాను, “ఇప్పుడు చాలా ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్లన్నీ నాశనం చేయబడుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు అందమైన పెద్ద భవనాలు ఉన్నాయి. కానీ ఆ ఇళ్లు ఖాళీ అయిపోతాయి. 10 ఆ సమయంలో ఒక పదెకరాల ద్రాక్షాతోట కొంచెం మాత్రమే ద్రాక్షారసం ఇస్తుంది. చాలా బస్తాల గింజలతో కొద్దిపాటి ధాన్యం మాత్రం దిగుబడి అవుతుంది.”
11 మీరు ఉదయాన్నే లేచి మద్యం తాగాలని చూస్తుంటారు. ద్రాక్షామద్యంతో మత్తెక్కి రాత్రి చాలాసేపు మెళకువగా ఉంటారు. 12 మీరు ద్రాక్షామద్యంతో, సితారాలు, డప్పులు, పిల్లన గ్రోవులు, ఇతర సంగీత వాయిద్యాలతో మీరు విందులు చేసుకొంటారు. యెహోవా చేసిన కార్యాలు మీరు చూడరు. యెహోవా హస్తాలు ఎన్నెన్నో కార్యాలు చేశాయి. కాని మీరు వాటిని గమనించరు. అందుచేత అది మీకు చాలా కీడు.
13 యెహోవా చెబుతున్నాడు: “నా ప్రజలు బంధించబడి తీసుకొని పోబడతారు. ఎందుకంటే వారు నిజంగా నన్నెరుగరు. ఇశ్రాయేలులో నివసిస్తున్న మనుష్యులు ఇప్పుడు చాలా ప్రముఖలు. వారి సుఖ జీవనాలతో వారు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ గొప్ప వాళ్లంతా దప్పిగొంటారు, ఆకలితో ఉంటారు. 14 అప్పుడు వారు చనిపోతారు, పాతాళం మరింత మంది మనుష్యులతో నిండిపోతుంది. ఆ మరణ స్థానం అపరిమితంగా దాని నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ మనుష్యులంతా ఆ పాతాళంలోకి వెళ్లిపోతారు.”
15 ఆ మనుష్యులు తగ్గించబడతారు. ఆ గొప్పవాళ్లంతా తలలు వంచి నేలమీదికి చూస్తారు. 16 సర్వశక్తిమంతుడైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు, ఆయన గొప్పవాడని ప్రజలు తెలుసుకొంటారు. పవిత్ర దేవుడు సరైన వాటినే చేస్తాడు, ప్రజలు ఆయనను గౌరవిస్తారు. 17 ఇశ్రాయేలు ప్రజలు వారి దేశం విడిచి వెళ్లిపోయేట్టుగా దేవుడు చేస్తాడు, దేశం శూన్యం అవుతుంది. గొర్రెలు వాటికి ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తాయి. ఒకప్పుడు ధనికులదైన భూమిమీద గొర్రె పిల్లలు నడుస్తాయి.
18 ఆ మనుష్యుల్ని చూడండి. మనుష్యులు తాళ్లతో బండ్లను లాగినట్టు, వాళ్లు తమ పాపాల్ని దోషాన్ని వారి వెనుక లాగుతున్నారు. 19 వాళ్లు అంటారు: “దేవుడు చేయాలనుకొనే పనులు ఆయన త్వరగా చేస్తే బాగుండును. అప్పుడు జరిగేది ఏమిటో మాకు తెలుస్తుంది. యెహోవా పథకం త్వరగా జరిగిపోతే బాగుండును. ఆయన పథకం ఏమిటో అప్పుడు మాకు తెలుస్తుంది.”
20 ఆ మనుష్యులు మంచివాటిని చెడ్డవి అంటారు, చెడ్డవాటిని మంచివి అంటారు. వెలుగును చీకటి అని, చీకటిని వెలుగు అని వాళ్లు అనుకొంటారు. వాళ్లు చేదును తీపి, తీపిని చేదు అనుకొంటారు. 21 వాళ్లు చాలా తెలివిగల వాళ్లు అని ఆ మనుష్యులు తలస్తారు. వాళ్లు చాలా జ్ఞానంగలవాళ్లు అని తలస్తారు. 22 ద్రాక్షామద్యం తాగటంలో ఆ మనుష్యులు చాలా ప్రసిద్ది. మద్యము కలపటంలో వారు ప్రముఖులు. 23 మీరు వారికి డబ్బు చెల్లిస్తే, వారు నేరస్థుల్ని క్షమించేస్తారు. కానీ వారు మంచి వాళ్లకు న్యాయం జరుగనివ్వరు. 24 ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. గడ్డి, ఆకులు అగ్నితో కాల్చివేయబడినట్టు, వారి సంతతివారు పూర్తిగా నాశనం చేయబడతారు. చచ్చి, ధూళిగా తయారయ్యే వేరులా వారి సంతానంవారు పూర్తిగా నాశనం చేయబడతారు. అగ్ని నాశనం చేసిన ఒక పువ్వులా వారి సంతతివారు నాశనం చేయబడతారు. దాని బూడిద గాలితో కొట్టుకొని పోతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని ఉపదేశాలకు విధేయులయ్యేందుకు వారు నిరాకరించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) సందేశాన్ని ఆ ప్రజలు అసహ్యించుకొన్నారు. 25 అందుచేత యెహోవా తన ప్రజల మీద చాలా కోపగించాడు. యెహోవా తన చేయి పైకెత్తి, వాళ్లను శిక్షిస్తాడు. పర్వతాలు సహా భయపడి పోతాయి. చచ్చిన శవాలు చెత్తలా వీధుల్లో పడి ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన హస్తం ఇంకా పైకెత్తబడిఉంటుంది.
ఇశ్రాయేలును శిక్షించటానికి దేవుడు సైన్యాలను రప్పిస్తాడు
26 చూడండి! చాలా దూరంలో ఉన్న దేశాలకు దేవుడు ఒక సంకేతం ఇస్తున్నాడు. దేవుడు ఒక పతాకాన్ని ఎగుర వేస్తున్నాడు, మరియు ఆ ప్రజలను పిలిచేందుకు ఆయన ఈల వేస్తున్నాడు.
శత్రువు దూరదేశం నుండి వస్తున్నాడు. త్వరలోనే శత్రువు దేశంలో ప్రవేశిస్తాడు. వారు చాలా వేగంగా కదలుతున్నారు. 27 శత్రువు ఎన్నటికీ అలసిపోడు, పడిపోడు. వారెన్నటికీ నిద్రబోతులుగా నిద్రపోరు. వారి ఆయుధ పట్టాలు ఎల్లప్పుడూ సిద్దమే. వారి చెప్పుల తాళ్లు ఎప్పటికి తెగిపోవు. 28 శత్రువుల బాణాలు చాలా పదునుగా ఉంటాయి. వారి బాణాలన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉంటాయి. గుర్రాల డెక్కలు బండలా గట్టిగా ఉంటాయి. వాటి రథాల వెనుక ధూళి మేఘాలుగా లేస్తుంది.
29 శత్రువు గట్టిగా అరిస్తే, అది సింహగర్జనలా ఉంటుంది. అది కొదమ సింహపు గర్జన అంత గట్టిగా ఉంటుంది. శత్రువు తాను పోరాడుతున్న ప్రజలను ఎదురులేకుండా పట్టి లాగుకొని పోతాడు. ప్రజలు కొట్టుమిట్టాడి, తప్పించుకొనేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లను రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. 30 కనుక “సింహం” గట్టిగా సముద్ర ఘోషలా గర్జిస్తుంది. బంధించబడిన ప్రజలు నేలమీదికే చూస్తుంటారు, అప్పుడు చీకటి మాత్రమే ఉంటుంది. దట్టమైన ఈ మేఘంలో వెలుగంతా చీకటిగానే ఉంటుంది.
కుమారులు, క్రమశిక్షణ
12 అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొంటున్న పాపాల్ని వదిలించుకొందాం. మనం పరుగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగెడదాం. 2 మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్యలేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు. 3 పాపాత్ములు తనపట్ల కనబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు.
దేవుడు తండ్రిలాంటివాడు
4 మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం యింతవరకు కలుగలేదు. 5 మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు:
“నా కుమారుడా! ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు!
నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు!
6 ఎందుకంటే, ప్రభువు తనను ప్రేమించిన వాళ్ళనే శిక్షిస్తాడు.
అంతేకాక తన కుమారునిగా అంగీకరించిన ప్రతి ఒక్కణ్ణి శిక్షిస్తాడు.”(A)
7 కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూసుకొంటాడు. తండ్రి నుండి శిక్షణ పొందని కుమారుడెవడున్నాడు? 8 మీకు శిక్షణ లభించకపోతే మీరు దేవుని నిజమైన కుమారులు కారన్న మాట. ప్రతి ఒక్కడూ క్రమశిక్షణ పొందుతాడు. 9 మన తండ్రులు మనకు శిక్షణనిచ్చారు. ఆ కారణంగా వాళ్ళను మనం గౌరవించాము. మరి అలాంటప్పుడు మన ఆత్మలకు తండ్రి అయిన వానికి యింకెంత గౌరవమివ్వాలో ఆలోచించండి. 10 మన తల్లిదండ్రులు వాళ్ళకు తోచిన విధంగా కొద్దికాలం పాటు మనకు క్రమశిక్షణ నిచ్చారు. కాని దేవుడు మన మంచికోసం, ఆయన పవిత్రతలో మనం భాగం పంచుకోవాలని మనకు శిక్షణనిచ్చాడు. 11 శిక్షణ పొందేటప్పుడు బాధగానే వుంటుంది. ఆనందంగా ఉండదు. కాని ఆ తర్వత శిక్షణ పొందినవాళ్ళు నీతి, శాంతి అనే ఫలం పొందుతారు.
నీవు ఎలా జీవిస్తున్నావో జాగ్రత్తగావుండు
12 అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి. 13 మీరు నడిచే దారుల్ని[a] సమంగా చేసుకోండి. అప్పుడు ఆ దారులు కుంటివాళ్ళకు అటంకం కలిగించటానికి మారుగా సహాయపడ్తాయి.
14 అందరిపట్ల శాంతి కనబరుస్తూ జీవించటానికి ప్రయత్నించండి. పవిత్రంగా జీవించండి. పవిత్రత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడలేరు. 15 ఒక్కరు కూడా దైవానుగ్రహానికి దూరం కాకుండా జాగ్రత్తపడండి. 16 వ్యభిచారం చెయ్యకండి. ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠపుత్రునిగా తన హక్కుల్ని అమ్మివేసిన ఏశావువలె భక్తిహీనులై జీవించకండి. 17 ఏశావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదం పొందాలని కోరినప్పుడు దేవుడు నిరాకరించిన విషయం మీకు తెలుసు. అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్ళు పెట్టుకొన్నాడు. కాని లాభం కలుగలేదు.
18 తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్నిజ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకొన్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. 19 ఆ పర్వతం నుండి బూర ధ్వని, మాట్లాడుతున్న కంఠ ధ్వని వినటానికి రాలేదు. ఆ కంఠం విన్నవాళ్ళు భయపడి వినడానికి నిరాకరించారు. 20 ఎందుకంటే, “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా ఆ జంతువును రాళ్ళతో కొట్టాలి”(B) అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్ళు భరించలేకపొయ్యారు. 21 ఆ దృశ్యము ఎంత భయంకరంగా ఉందంటే, మోషే “నేను భయంతో వణికి పోతున్నాను”(C) అని అన్నాడు.
22 కాని మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము! సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేలకొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు. 23 మొట్టమొదట జన్మించిన వాళ్ళ సంఘానికి మీరు వచ్చారు. వీళ్ళ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి. మానవుల న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. దేవుడు పరిపూర్ణత కలిగించిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. 24 క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు రక్తానికన్నా ఉత్తమసందేశాన్నిచ్చే “ప్రోక్షింపబడే రక్తం” దగ్గరకు మీరు వచ్చారు.
25 జాగ్రత్త! మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్ళు నిరాకరించారు. తద్వారా ఆయన ఆగ్రహంనుండి తప్పించుకోలేకపోయారు. మరి ఆయన పరలోకంనుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహంనుండి ఎలా తప్పించుకొనగలము? 26 ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది. కాని యిప్పుడు ఆయన, “నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా మరొక్కసారి కదిలిస్తాను”(D) అని వాగ్దానం చేసాడు. 27 “మరొక్కసారి” అన్న పదాలు, కదిలే వాటిని, అంటే సృష్టింపబడ్డవాటిని నాశనం చేస్తాడని సూచిస్తున్నాయి. కదలనివి అలాగే ఉండిపోతాయి.
28 ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞులమై ఉందాం. ఆయన్ని భయభక్తులతో, ఆయనకు యిష్టమైన విధంగా ఆరాధించుదాము. 29 ఎందుకంటే, మన దేవుడు “మండుచున్న అగ్నిలాంటివాడు.”(E)
© 1997 Bible League International