M’Cheyne Bible Reading Plan
మళ్లీ ప్రజల ఫిర్యాదు
14 ఆ రాత్రి గుడారాలలో ఉన్న ప్రజలంతా గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టారు. 2 ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. ప్రజలంతా కూడి వచ్చి మోషే, అహరోనులతో ఇలా చెప్పారు, “ఈజిప్టులోనో లేక అరణ్యంలోనో మేము చావాల్సింది. మన కొత్త దేశంలో కత్తిచేత చావటంకంటె అదే బాగుండేది. 3 మమ్మల్ని ఈ కొత్త దేశానికి చావటానికి తీసుకొచ్చాడా? మా భార్యల్ని, మా పిల్లల్ని మా దగ్గరనుండి తీసుకుపోయి మమ్మల్ని కత్తులతో చంపేస్తారు. మేము మళ్లీ ఈజిప్టు వెళ్లి పోవటమే మాకు క్షేమం.”
4 అప్పుడు వాళ్లు, “మనం ఇంకో నాయకుడ్ని ఏర్పాటు చేసుకొని, తిరిగి ఈజిప్టు వెళ్లిపోదాము” అని ఒకళ్లతో ఒకరు చెప్పుకొన్నారు.
5 అప్పుడు అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరి ముందు మోషే, అహరోను సాష్టాంగపడ్డారు. 6 ఆ దేశాన్ని కనుక్కొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు నూను కుమారుడైన యెహోషువ యెపున్నె కుమారుడైన కాలేబు బట్టలు చించుకున్నారు. 7 ఈ ఇద్దరు మనుష్యులూ అక్కడ సమావేశమైన ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పారు: “మేము చూచిన దేశం చాలబాగుంది. 8 మనమీద దేవునికి ఇష్టం ఉంటే, ఆయనే మనల్ని ఆ దేశంలోనికి నడిపిస్తాడు. ఆ దేశం పాలు తేనెలు ప్రవహిస్తున్నంత సౌభాగ్యమయినది. ఆ దేశాన్ని మనకు ఇచ్చేందుకు యెహోవా తన శక్తి ప్రయోగిస్తాడు. 9 అంతేగాని మనం యెహోవాకు ఎదురు తిరుగకూడదు. ఆ దేశంలో ప్రజలకు కూడ మనం భయపడకూడదు. మనం వాళ్లను తేలికగా జయించేస్తాం. వాళ్లకు ఎలాంటి భద్రతా లేదు, వాళ్లను క్షేమంగా ఉంచగలిగింది ఏమి లేదు. కానీ మనకు యెహోవా ఉన్నాడు. అందుచేత ఆ మనుష్యుల్ని గూర్చి భయపడకండి!”
10 అప్పుడు అక్కడ చేరిన ఇశ్రాయేలు ప్రజలంతా వీళ్లిద్దర్నీ రాళ్లతో కొట్టి చంపేయాలని మాట్లాడుకొన్నారు. అయితే యెహోవా మహిమ సన్నిధి గుడారం మీదికి దిగివచ్చింది. ఇశ్రాయేలు ప్రజలంతా అది చూడగలిగారు. 11 అప్పుడు మోషేతో, యెహోవా: “ఇంకా ఎన్నాళ్లు ఈ ప్రజలు ఇలా చేస్తారు? వాళ్లు నన్ను నమ్మటంలేదనే వ్యక్తం చేస్తున్నారు. నా శక్తి మీద వాళ్లకు నమ్మకంలేనట్టే కనబడుతోంది. శక్తివంతమైన ఎన్నో సూచనలు నేను వాళ్లకు చూపించిన తర్వాతకూడ వాళ్లు నన్ను నమ్మటానికి నిరాకరిస్తున్నారు. వాళ్లమధ్య నేను ఎన్నో మహాకార్యాలు చేసాను. 12 ఒక భయంకర రోగంతో వాళ్లందరినీ నేను చంపేస్తాను. వాళ్లను నేను నాశనం చేస్తాను. మరో జనాంగాన్ని తయారు చేసేందుకు నిన్ను నేను వాడు కొంటాను. ఆ జనాంగం ఈ ప్రజలకంటె గొప్పదిగా, బలమైనదిగా ఉంటుంది.” అని అన్నాడు.
13 అప్పుడు యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “నీవు అలాగనుక చేస్తే, నీ ప్రజలందరినీ నీవే చంపేసావని ఈజిప్టు ప్రజలు వింటారు. ఈ ప్రజలను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చేందుకు నీవు నీ గొప్ప శక్తిని ప్రయోగించావు. 14 ఈ గొప్ప శక్తినిగూర్చి ఈ దేశ నివాసులందరికీ ఈజిప్టు ప్రజలు చెప్పారు. యెహోవా, వాళ్లు ఇప్పటికే నిన్నుగూర్చి విన్నారు. నీవు నీ ప్రజలకు తోడుగా ఉన్నావనీ ప్రతి ఒక్కరూ నిన్ను చూసారనీ వారికి తెలుసు. నీ ప్రజలమీద నిలిచే మేఘాన్ని గూర్చి కూడ ఈ దేశవాసులకు తెలుస్తుంది. పగలు నీ ప్రజలను నడిపించేందుకు నీవు ఆ మేఘాన్ని వాడుకొన్నావు. రాత్రిపూట నీ ప్రజలకు నడిపించటానికి తిరిగి ఆ మేఘం అగ్నిగా మారుతుంది. 15 అందుచేత ఇప్పుడు నీవు ఈ ప్రజలను చంపకూడదు. ఒకవేళ నీవు వారిని చంపితే, నీ శక్తిని గూర్చి విన్న దేశాలన్నీ ఏమంటాయంటే 16 ‘యెహోవా ఈ ప్రజలకు వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకుని రాలేకపోయాడు. అందుకని వాళ్లను అరణ్యంలోనే చంపేసాడు అంటారు.’
17 “కనుక యెహోవా, ఇప్పుడు నీ బలం చూపెట్టాలి. నీవు చూపిస్తానని ప్రకటించిన విధానంలో నీవు చూపించాలి. 18 ‘యెహోవా త్వరగా కోపపడడు. ఆయన మహా ప్రేమమూర్తి. యెహోవా పాపాన్ని, దోషాన్ని తీసివేస్తాడు. అయితే నేరస్థులను యెహోవా ఎప్పుడూ శిక్షిస్తాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలకుకూడా యెహోవా పిల్లల్ని శిక్షిస్తాడు. వారి తాత ముత్తాతల పాపాలకు యెహోవా పిల్లల్నికూడ శిక్షిస్తాడు’ అని నీవు చెప్పావు. 19 కనుక నీ మహా ప్రేమను ఈ ప్రజలకు చూపించు. వారి పాపం క్షమించు. వారు ఈజిప్టు విడిచినప్పటినుండి నీవు వారిని క్షమించినట్టే ఇప్పుడు కూడా క్షమించు.”
20 యెహోవా ఇలా జవాబిచ్చాడు: “నీవు అడిగినట్టే నేను ఈ ప్రజలను క్షమించాను. 21 అయితే సత్యం ఏమిటో నీతో చెబుతాను. నేను జీవిస్తున్నంత నిశ్చయంగా, నా శక్తి ఈ భూమి అంతటా ఆవరించినంత నిశ్చయంగా, నేను నీకు ఆ వాగ్దానం చేస్తున్నాను. 22 ఈజిప్టు నుండి నేను బయటకు నడిపించిన ప్రజల్లో ఏ ఒక్కరూ ఆ కనాను దేశాన్ని చూడరు. ఈజిప్టులో నేను చేసిన మహా సూచనలను, నా మహిమను చూసారు ఆ ప్రజలు. అరణ్యంలో నేను చేసిన మహా కార్యాలు వారు చూసారు. అయినా వారు నాకు అవిధేయులై, పదిసార్లు నన్ను శోధించారు. 23 వారి పూర్వీకులకు ఆ గొప్ప దేశాన్ని ఇస్తానని నేను వాగ్ధానం చేసాను. అయితే నాకు ఇలాంటి కీడు చేసిన ఏ వ్యక్తి ఎన్నటికీ ఆ దేశంలో ప్రవేశించడు. 24 కానీ నా సేవకుడైన కాలేబు విషయం వేరు. అతడు పూర్తిగా నన్ను వెంబడిస్తాడు. కనుక అతడు ఇప్పుడు చూసిన ఆ దేశంలోకి అతడ్ని తీసుకెళ్తాను. అతని మనుష్యులకు ఆ దేశం దొరుకుతుంది. 25 అమాలేకీ, కనానీ ప్రజలు లోయలో నివసిస్తున్నారు. రేపు ఈ చోటు విడిచి, తిరిగి ఎర్ర సముద్రం మార్గంగా అరణ్యానికి వెళ్లండి.”
ప్రజలను యెహోవా శిక్షించాడు
26 మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: 27 “ఈ దుర్మార్గులు ఇంకెన్నాళ్లు ఇలా నా మీద ఫిర్యాదు చేస్తుంటారు? వారి ఫిర్యాదులు, సణుగుడు నేను విన్నాను. 28 కనుక వారితో ఇలా చెప్పు, మీరు ఫిర్యాదు చేసిన విషయాలన్నింటినీ యెహోవా తప్పక జరిగిస్తాడు. మీకు ఏమి సంభవిస్తుందంటే, 29 ఈ అరణ్యంలోనే మీ శరీరాలు చచ్చిపడతాయి. మీలో 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లంతా మన ప్రజల్లో సభ్యులుగా లెక్కించబడ్డారు. మీలో ప్రతి ఒక్కరూ, యెహోవానైన నా మీద ఫిర్యాదు చేసారు. కనుక మీలో ప్రతి ఒక్కరు అరణ్యంలోనే చస్తారు. 30 మీకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశంలో మీరు ఒక్కరుకూడా ప్రవేశించరు. యెపున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే ఆ దేశంలోనికి ప్రవేశిస్తారు. 31 మీరు భయపడి, ఆ కొత్త దేశంలో మీ శత్రువులు మీ పిల్లలను మీ దగ్గరనుండి తీసుకుని పోతారని ఫిర్యాదు చేసారు. అయితే ఆ పిల్లల్నే ఆ దేశంలోకి నేను తీసుకొని వెళ్తానని నేను మీతో చెబుతున్నాను. మీరు అంగీకరించకుండా నిరాకరించిన వాటిని వారు అనుభవిస్తారు. 32 మీ విషయానికొస్తే, మీ శరీరాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి.
33 “మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 సంవత్సరాలపాటు కాపరులుగా ఉంటారు. మీకు విశ్వాసం లేదు గనుక వారు శ్రమపడుతారు. మీరంతా చచ్ఛేంతవరకు వారు ఈ అరణ్యంలోనే ఉండాలి. అప్పుడు మీ అందరి శరీరాలు ఈ అరణ్యంలోనే పడి పోతాయి. 34 మీ పాపాలకోసం 40 సంవత్సరాలు మీరు శ్రమ అనుభవిస్తారు. (ఆ దేశాన్ని కనుగొన్న 40 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో సంవత్సరం చొప్పున.) నేను మీకు వ్యతిరేకంగా ఉండటం ఎంతో దారుణంగా ఉంటుందని మీరు తెలుసుకుంటారు.”
35 “నేను యెహోవాను, నేనే మాట్లాడాను. ఈ దుర్మార్గులందరికీ ఇవన్నీ నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వీరంతా కలిసి నామీదికి వచ్చారు. అందుచేత వీళ్లంతా ఇక్కడే అరణ్యంలోనే చస్తారు.”
36 ఆ కొత్త దేశాన్ని కనుగొనేందుకు మోషే పంపించిన మనుష్యులు తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో ఫిర్యాదులు వ్యాపింప చేసారు. ఆ దేశంలో ప్రవేశించటానికి సరిపడినంత బలంగల వాళ్లం కాదు అని వారే చెప్పారు. 37 ఇశ్రాయేలు ప్రజల్లో కష్టాలు వ్యాపించటానికి వాళ్లే బాధ్యులు. అందుకని వాళ్లందర్నీ చంపేయటానికి ఒక రోగాన్ని రప్పించాడు యెహోవా. 38 అయతే ఆ దేశాన్ని పరిశీలించటానికి పంపబడ్డవాళ్లలో నూను కుమారుడైన యెహోషువ, యెపున్నె కుమారుడైన కాలేబు కూడ ఉన్నారు. యెహోవా వాళ్లిద్దర్నీ రక్షించాడు. మిగతా పదిమందిని చని పోవునట్లు చేసిన రోగం వారికి రాలేదు.
కనానులో ప్రవేశించటానికి ప్రజలు ప్రయత్నించటం
39 ఈ సంగతులన్నీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ప్రజలు చాలా, చాలా విచారించారు. 40 మర్నాడు ఉదయాన్నే ప్రజలు కొండల దేశానికి బయల్దేరారు. ఆ ప్రజలు, “మేము పాపము చేసాము. మేము యెహోవా మీద నమ్మకం ఉంచనందుకు మేము విచారిస్తున్నాము. యెహోవా వాగ్దానం చేసిన దేశానికి మేము వెళ్తాము” అన్నారు.
41 కానీ మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఆజ్ఞకు మీరెందుకు విధేయులవటం లేదు? మీకు జయం కలుగదు. 42 మీరు ఆ దేశం వెళ్లవద్దు. యెహోవా మీకు తోడుగా లేడు. మీ శత్రువులు మిమ్మల్ని తేలికగా ఓడించేస్తారు. 43 అక్కడ అమాలేకీయులు, కనానీయులు మీతో పొరాడుతారు. మీరు యెహోవానుండి వేరైపోయారు. అందుచేత మీరు వాళ్లతో యుద్ధం చేసేటప్పుడు ఆయన మీకు తోడుగా ఉండడు. మీరంతా వారి ఖడ్గాలతో చంపబడతారు.”
44 కానీ ప్రజలు మోషేను నమ్మలేదు. వారు అలానే ఆ కొండల దేశంవైపు వెళ్లారు. అయితే మోషేగాని, యెహోవా ఒడంబడిక పెట్టెగాని వారితో వెళ్లలేదు. 45 అప్పుడు ఆ కొండల దేశంలో నివసిస్తున్న అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజలమీద దాడిచేసారు. అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు తేలికగా వీరిని ఓడించి, హోర్మా వరకు వారిని తరిమికొట్టారు.
ఆసాపు కీర్తనలలో ఒకటి.
50 దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు.
సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
2 సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
3 మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
ఆయన యెదుట అగ్ని మండుతుంది.
ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
5 “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.
6 అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.
7 దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.
నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
8 నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.
9 మీ ఇంటినుండి ఎద్దులను తీసుకోను.
మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.
10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
11 కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు.
పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం
12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు
ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.
13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం త్రాగను.”
14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి,
దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.
15 “ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి!
నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”
16 దుర్మార్గులతో దేవుడు చెబుతున్నాడు,
“నా న్యాయ విధులను చదువుటకు,
నా ఒడంబడికకు బద్ధులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?[a]
17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు.
నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.
18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడతారు.
వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.
19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు.
20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబుతారు.
మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.
21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను
నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు.
కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను.
మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.
22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
దేవుని మరచిన జనాంగమైన మీరు,
ఈ విషయమును గూర్చి ఆలోచించాలి.
అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
23 ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”
3 నేను మీకు చెబుతున్న ఈ విషయాలు గ్రహించండి. యెరూషలేము, యూదాలు ఆధారపడే వాటన్నింటిని, ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా తొలగించి వేస్తాడు. భోజనం, నీళ్లు మొత్తం దేవుడు తీసివేస్తాడు. 2 వీరులందరిని, శూర సైనికులందరిని దేవుడు తొలగించి వేస్తాడు. న్యాయమూర్తులను, మాంత్రికులను, పెద్దలను అందరిని దేవుడు తొలగించి వేస్తాడు. 3 సైనిక అధికారులను, ప్రభుత్వ అధికారులను దేవుడు తొలగించివేస్తాడు. నైపుణ్యంగల సలహాదార్లను, మంత్రాలు వేస్తూ, జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించే తెలివిగల వాళ్లందరిని దేవుడు తొలగించి వేస్తాడు.
4 దేవుడు చెబుతున్నాడు: “యువకులు మీకు నాయకులయ్యేట్టు నేను చేస్తాను. 5 ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు విరోధం అవుతారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించరు. సామాన్యులు ప్రముఖులను లెక్కచేయరు.”
6 ఆ సమయంలో ఒకడు తన స్వంత కుటుంబంలోంచి తన సోదరుణ్ణి ఒకణ్ణి పట్టుకొచ్చి, “నీకు రాజ వస్త్రము ఉంది గనుక నీవే మాకు నాయకుడివి. ఈ శిథిలాలు అన్నింటి మీద నీవే నాయకుడివి” అని అతనితో చెబుతాడు.
7 అయితే ఆ సోదరుడు లేచి, “నేను నీకు సహాయం చేయలేను. సరిపడినంత ఆహారంగాని బట్టలుగాని నా ఇంట్లో లేవు. నన్ను మీ నాయకుడిని చేయవద్దు” అని చెబుతాడు.
8 యెరూషలేము తొట్రిల్లి, తప్పు చేసింది గనుక ఇలా జరుగుతుంది. యూదా పతనమై, యెహోవాను వెంబడించటం మానివేసింది. వారు చెప్పేవి, చేసేవి యెహోవాకు విరుద్ధం. యెహోవా మహిమ నేత్రాలు వీటన్నింటిని తేటగా చూస్తాయి.
9 మనుష్యులు తప్పు చేసిన దోషులని వారి ముఖాలు చెబుతున్నాయి. పైగా వారు వారి పాపము గూర్చి అతిశయిస్తున్నారు. వారు సొదొమ పట్టణ ప్రజల్లా ఉన్నారు. వారి పాపాన్ని ఎవరు చూసినా లెక్క చేయరు. అది వారికి ఎంతో కీడు. వాళ్లకు వాళ్లే చాలా కష్టం తెచ్చుకొన్నారు.
10 మంచి వారికి మంచి సంగతులు జరుగుతాయని మంచి వారితో చెప్పుము. వారు చేసే మంచి పనులకు వారికి బహుమానం లభిస్తుంది. 11 కానీ చెడ్డ వాళ్లకు అది చాలా చెడుగా ఉంటుంది. వారికి చాలా కష్టం వస్తుంది. వారు చేసిన చెడు పనులన్నింటి కోసం వారు శిక్షించబడతారు. 12 చిన్న పిల్లలు నా ప్రజలను ఓడించేస్తారు. స్త్రీలు నా ప్రజల మీద ఏలుబడి చేస్తారు.
నా ప్రజలారా మీ మార్గ దర్శకులు మిమ్మల్ని తప్పు దారిలో నడిపిస్తున్నారు. సరియైన దారినుండి వారు మిమ్మల్ని తప్పించేస్తున్నారు.
తన ప్రజల గురించి దేవుని నిర్ణయం
13 ప్రజలకు తీర్పు తీర్చేందుకు యెహోవా నిలుస్తాడు. 14 పెద్దలు, నాయకులు చేసిన పనుల మూలంగా యెహోవా వారికి తీర్పు తీరుస్తాడు.
యెహోవా చెబుతున్నాడు, “మీరు ద్రాక్ష తోటలను తగులబెట్టేశారు (యూదా) పేద ప్రజల దగ్గర్నుండి మీరు తీసుకొన్న వస్తువులు ఇంకా మీ ఇండ్లలో ఉన్నాయి. 15 నా ప్రజలను బాధించుటకు మీకు హక్కు ఎక్కడిది? పేద ప్రజల ముఖాలను కృంగదీయుటకు మీకు హక్కు ఎక్కడిది?” నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
16 యెహోవా అంటున్నాడు: “సీయోను స్త్రీలు చాలా గర్విష్ఠులయ్యారు. వారు ఇతరుల కంటె మంచి వాళ్లము అన్నట్టు తలలు పైకెత్తి నడుస్తున్నారు. ఆ స్త్రీలు ఓర చూపులు చూస్తారు. కాళ్ల గజ్జెలు మోగిస్తూ వయ్యారంగా కులుకుతూ నడుస్తారు.”
17 సీయోనులో ఆ స్త్రీల తలలమీద నా ప్రభువు పుండ్లు పుట్టిస్తాడు. ఆ స్త్రీలు వారి తలలు విరబోసుకొనేట్టుగా యెహోవా చేస్తాడు. 18 ఆ సమయంలో, వారు గర్వించే వస్తువులన్నింటినీ యెహోవా తొలగించి వేస్తాడు, అందమైన కాలి గజ్జలు, సూర్యహారాలు, చంద్రహారాలు, 19 చెవులదుద్దులు, కడియాలు, మేలి ముసుగులు, 20 రుమాళ్లు, పట్టా గొలుసులు, నడుముకు ధరించే వడ్డాణాలు, పరిమళాల బరిణెలు, హారాల మీద అలంకారాలు, 21 ముద్ర ఉంగరాలు, ముక్కు కమ్ములు, 22 శ్రేష్ఠమైన వస్త్రాలు, ఉత్తరీయాలు, దుప్పట్లు సంచులు, 23 అద్దాలు, మేలిమి వస్త్రాలు, తలపాగాలు, శాలువాలు.
24 ఇప్పుడు ఆ స్త్రీలకు సువాసనల పరిమళాలు ఉన్నాయి కానీ ఆ సమయంలో వారి పరిమళాలు కుళ్లుగాను మురుగుడుగాను అవుతాయి. ఇప్పుడు వాళ్లు వడ్డాణాలు పెట్టుకొంటున్నారు. కానీ ఆ సమయంలో వారు కట్టుకొనేందుకు తాళ్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు వారి తల వెంట్రుకలు అలంకారంగా అల్లబడుతున్నాయి. కానీ ఆ సమయంలో వారి తలలు గుండ్లు గీయబడతాయి. వారికి శిరోజాలు ఉండవు. ఇప్పుడు వారికి విందు వస్త్రాలు ఉన్నాయి. కాని అప్పుడు విచారం వ్యక్తం చేసే వస్త్రాలే వారికి ఉంటాయి. ఇప్పుడు వారి ముఖాల మీద సౌందర్య చిహ్నాలు ఉన్నాయి. కానీ అప్పుడు వారి ముఖాల మీద వాతలు ఉంటాయి.
25 ఆ సమయంలో మీ పురుషులు ఖడ్గాలతో చంపబడతారు. మీ వీరులు యుద్ధంలో చస్తారు. 26 పట్టణ ద్వారాల దగ్గర సమావేశ స్థలాల్లో ఏడ్పు, దుఃఖం ఉంటుంది. దొంగలు, బందిపోటులు సర్వం దోచుకొన్న స్త్రీలాగ యెరూషలేము శూన్యంగా కూర్చుని ఉంటుంది. ఆమె నేల మీద కూర్చుని ఏడుస్తుంది.
4 ఆ కాలంలో ఏడుగురు స్త్రీలు ఒక్క మగవాణ్ణి పట్టుకొని, “మా స్వంత భోజనం మేము తింటాము, మా స్వంత బట్టలు మేము కట్టుకొంటాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి, మా అవమానం తొలగించుము” అని చెబుతారు.
2 ఆ సమయంలో యెహోవా మొక్క (యూదా) చాలా అందంగా, గొప్పగా ఉంటుంది. అప్పటికి ఇంకా ఇశ్రాయేలులో జీవించి ఉండే ప్రజలు ఆ దేశంలో పండే వాటిని చూచి ఎంతో గర్విస్తారు. 3 ఆ సమయంలో ఇంకా సీయోనులో, యెరూషలేములో జీవిస్తున్న ప్రజలు పరిశుద్ధ (ప్రత్యేక) ప్రజలు అని పిలువ బడతారు. ఒక ప్రత్యేక జాబితాలో పేర్లు ఉన్న ప్రజలందరికీ ఇలా జరుగుతుంది. బ్రతికేందుకు అనుమతించబడిన ప్రజల జాబితా అది.
4 సీయోను స్త్రీల కల్మషాన్ని యెహోవా కడిగి వేస్తాడు. యెరూషలేములోని రక్తమంతా యెహోవా కడిగివేస్తాడు. దేవుడు న్యాయ ఆత్మను ప్రయోగించి, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మరియు ఆయన దహించే ఆత్మను ప్రయోగించి, సమస్తాన్నీ శుద్ధి చేస్తాడు. 5 ఆయన తన ప్రజలతో ఉన్నట్టు ఆ సమయంలో దేవుడు రుజువు చేస్తాడు. పగలు పొగల మేఘాన్ని, దేవుడు చేస్తాడు. రాత్రి ప్రకాశించే అగ్ని జ్వాలను దేవుడు చేస్తాడు. ఇవి ప్రతి ఇంటిమీద, ఆకాశంలోను, సీయోను కొండమీద, ప్రజల ప్రతి సమావేశం మీద నిలిచి ఉంటాయి. ప్రతి వ్యక్తి మీద కాపుదల ఉంటుంది. 6 ఆ కాపుదల ఒక భద్రతా స్థలం. ఆ కాపుదల సూర్యుని వేడినుండి ప్రజలను కాపాడుతుంది. అన్ని రకాల వర్షాలు వరదల నుండి దాగుకొనేందుకు ఆ కాపుదల క్షేమ స్థానంగా ఉంటుంది.
విశ్వాసము
11 ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించనివాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం. 2 మన పూర్వికుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు.
3 దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే, కనిపించనివాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట.
4 హేబెలుకు దేవుని పట్ల విశ్వాసముంది గనుకనే అతడు కయీను అర్పించిన బలికన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబెలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబెలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా యింకా మాట్లాడుతునే ఉన్నాడు.
5 హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతణ్ణి సజీవంగా పరలోకానికి తీసుకు వెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళకముందు అతడు దేవుణ్ణి సంతోషపరచినందుకు దేవుడు అతణ్ణి మెచ్చుకొన్నాడు. 6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలనుకొన్నవాడు ఆయనున్నాడని, అడిగినవాళ్ళకు ప్రతిఫలం యిస్తాడని విశ్వసించాలి.
7 నోవహు దేవుణ్ణి విశ్వసించినందువల్ల దేవుడతనికి, “ప్రళయం రాబోతున్నది” అని ముందే చెప్పాడు. అతనిలో భయభక్తులుండటం వల్ల అతడు దేవుని మాట విని, తన కుటుంబాన్ని రక్షించటానికి ఒక ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు.
8 అబ్రాహాములో విశ్వాసముంది కనుక అతడు దేవుడు చెప్పిన దేశానికి, తానెక్కడికి వెళ్తున్నది తనకు తెలియక పోయినా విధేయతతో వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడతనికి ఆ దేశాన్ని అతని పేరిట యిచ్చాడు. 9 విశ్వాసముంది కనుకనే అతడు దేవుడు చూపిన దేశంలో ఒక పరదేశీయునిగా నివసించాడు. దేవుడు వాగ్దానం చేసినవాటిల్లో తనతో సహవారసులైన ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారాల్లో నివసించాడు. 10 దేవుడు తన నమూన ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉండేవాడు.
11 శారా వృద్ధురాలు, పైగా గొడ్రాలు. అబ్రాహాము వృద్ధుడయినా, దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించినందువల్ల అబ్రాహాము తండ్రి కాగలిగాడు. 12 చనిపోవటానికి సిద్ధంగా ఉన్న అబ్రాహాముకు ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లా, సముద్ర తీరానవుండే యిసుక రేణువల్లా లెక్కలేనంత మంది వారసులు కలిగారు.
13 వీళ్ళందరు దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి, మరణించారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్ళకు లభించలేదు. వాళ్ళు అవి రావటం దూరం నుండి చూసి ఆహ్వానించారు. ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవిస్తున్నట్లు వాళ్ళు అంగీకరించారు. 14 వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశానికోసం వెతుకుతూండేవాళ్ళని అనిపిస్తుంది. 15 ఒక వేళ వాళ్ళు తాము వదిలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండింది. 16 కాని వాళ్ళు యింకా గొప్ప దేశానికి, అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశించారు. అందువల్ల దేవుడు యితర్లు తనను “వాళ్ళ దేవుడు” అని పిలిచినందుకు సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణం నిర్మించాడు.
17-18 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసముండటంవల్ల ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది(A) అని యింతకు పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు. 19 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు.
20 ఇస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి, యాకోబును, ఏశావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం దీవించాడు. 21 దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించగలిగాడు. అంతేకాక తన చేతి కఱ్ఱపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు.
22 యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతే కాక, అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో వాళ్ళకు చెప్పాడు.
23 మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు నెలల దాకా దాచివుంచారు.
24 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు. 25 పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు. 26 అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు.
27 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది. 28 అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు.
29 దేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎఱ్ఱ సముద్రంలో ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు. కాని ఈజిప్టు దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో మునిగిపొయ్యారు.
30 ప్రజలు యెరికో కోట చుట్టు ఏడు రోజులు విశ్వాసంతో తిరగటం వల్ల ఆ కోట గోడలు పడిపొయ్యాయి.
31 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే, వేశ్య అయినటువంటి రాహాబు యెహోషువ పంపిన గూఢచారులకు తన యింట్లో ఆతిథ్యమిచ్చింది. ఆ కారణంగానే, అవిశ్వాసులతోసహా ఆమె మరణించలేదు.
32 ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, బారాకును గురించి, సమ్సోనును గురించి, యెఫ్తాను గురించి, దావీదును గురించి, సమూయేలును గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవధి లేదు. 33 వీళ్ళు దేవుణ్ణి విశ్వసించటంవల్ల రాజ్యాలు జయించారు. న్యాయాన్ని స్థాపించారు. దేవుడు వాగ్దానం చేసినదాన్ని పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. 34 భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు. కత్తి పోట్లనుండి తమను తాము రక్షించుకొన్నారు. వాళ్ళ బలహీనత బలంగా మారిపోయింది. వాళ్ళు యుద్ధాలలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశ సైన్యాలను ఓడించారు. 35 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే కొందరు స్త్రీలు చనిపోయిన తమవాళ్ళను తిరిగి సజీవంగా పొందారు. కొందరు చావునుండి బ్రతికి వచ్చాక ఉత్తమ జీవితం గడపాలనే ఉద్దేశ్యముతో చిత్రహింసలనుండి విడుదల కోరలేదు. 36 భక్తిహీనులు వీళ్ళలో కొందర్ని పరిహాసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందర్ని సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు. 37 కొందర్ని రాళ్ళతో కొట్టారు; రంపంతో కోసారు; కత్తితో పొడిచి చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొఱ్ఱెల చర్మాలను ధరించి అనాధలై తిరిగారు. అంతేకాక హింసను, దుష్ప్రవర్తనను సహించారు. 38 ఎడారుల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సొరంగాల్లో నివసించారు. ఈ ప్రపంచం వాళ్ళకు తగిందికాదు.
39 వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొన్నాడు. కాని దేవుడు వాగ్దానం చేసింది వాళ్ళకు యింకా లభించలేదు. 40 దేవుడు మనకివ్వటానికి ఉత్తమమైనదాన్ని దాచి ఉంచాడు. మనతో కలిసి మాత్రమే వాళ్ళకు పరిపూర్ణత కలగాలని యిలా చేసాడు.
© 1997 Bible League International