M’Cheyne Bible Reading Plan
వెండి బూరలు
10 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “రెండు వెండి బూరలు చేయించు. వెండిని ఉపయోగించి, బూరలు చేసేందుకు దానిని సాగగొట్టాలి. ఆ బూరలు ప్రజలందర్నీ సమావేశపర్చి సేనలను ఎప్పుడు బయలుదేరదీయాలో చెప్పటానికి ఉండవలెను. ప్రజలు ఎక్కడ నివాసం చేయాలి అనేది వారికి చెప్పటానికి ఇది నీకు సహాయకరంగా ఉంటుంది. 3 ఆ రెండు బూరలు ఒక ప్రకటనగా ఉంటాయి. ప్రజలంతా అది విని, సన్నిధి గుడార ప్రవేశం దగ్గర నీ ఎదుట కూడుకొంటారు. 4 నీవు ఒకే బూర ఊదితే నాయకులు (ఇశ్రాయేలు పన్నెండు కుటుంబాల నాయకులు) నీ ఎదుట కూడుకొంటారు.
5 “నీవు ఒక బూరను పదే పదే ఊదితే, తూర్పు వైపున నివాసం చేస్తున్న వంశాలు బయల్దేరాలి. 6 ఒక బూరను నీవు రెండోసారి కూడా అలాగే ఊదితే దక్షిణాన నివాసం చేస్తున్నవారు బయల్దేరాలి. బూర శబ్దం ప్రజలు బయల్దేరాలని చెప్పే ఒక ప్రకటన. 7 ప్రజలందరినీ ఒక్కచోట నీవు సమకూర్చాలంటే, బూరలను మరో విధంగా అంటే ఏకధాటిగా ఒకే శృతిలో ఊదాలి. 8 అహరోను కుమారులు, యాజకులు బూరలు ఊదాలి. ఇది మీకు భవిష్యత్తులో కూడ కొనసాగే ఆజ్ఞ.
9 “మీ స్వంత స్థలంలో మీరు శత్రువుతో యుద్ధం చేయాల్సివస్తే, మీరు వారిమీదికి వెళ్లక ముందు బూరలను గట్టిగా ఊదాలి. అప్పుడు మీ యెహోవా దేవుడు వింటాడు, మీ శత్రువులనుండి ఆయన మిమ్ములను రక్షిస్తాడు. 10 అలాగే మీ ప్రత్యేక సంతోష సమయాల్లోకూడ మీరు బూరలు ఊదాలి. మీ ప్రత్యేక పండుగ దినాల్లోను, నెలల ఆరంభ దినాల్లోను మీ బూరలు ఊదండి. మీ దహన బలులు, మీ సమాధాన బలులు అర్పించేటప్పుడు మీ బూరలు ఊదండి. అది మీరు మీ దేవుని జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరమైన ఒక ప్రత్యేక విషయం. మీరు ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”
ఇశ్రాయేలు ప్రజల నివాసం మార్పు
11 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన తర్వాత రెండో సంవత్సరం, రెండో నెలలో (20వ రోజు) సన్నిధి గుడారం మీదనుండి మేఘం పైకి లేచింది. 12 అందుచేత ఇశ్రాయేలు ప్రజలంతా సీనాయి అరణ్యంనుండి బయల్దేరి ప్రయాణం మొదలుబెట్టారు. పారాను అరణ్యంలో ఆ మేఘం నిలిచిపోయేంత వరకు, వారు ప్రయాణం చేసారు. 13 మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆ ప్రజలు వారి స్థలాన్ని మార్చటం ఇది మొదటి సారి.
14 యూదా గుడారంలో మూడు విభాగాలు ముందుగా వెళ్లాయి. వారు వారి ధ్వజం క్రిందనే ప్రయాణం చేసారు. మొదటి విభాగం యూదా వంశం. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ విభాగానికి సైన్యాధిపతి. 15 తర్వాత ఇశ్శాఖారు విభాగం. సూయారు కుమారుడైన నెతనేలు ఆ కుటుంబ విభాగానికి సైన్యాధిపతి. 16 ఆ తర్వాత జెబూలూను విభాగం. హెలోను కుమారుడైన ఏలీయాబు ఆ విభాగానికి సైన్యాధిపతి.
17 అప్పుడు సన్నిధి గుడారం దించబడింది. గెర్షోను, మెరారి కుటుంబ పురుషులు పవిత్ర గుడారం మోసారు. కనుక తర్వాత ఈ కుటుంబాల ప్రజలు వరుసలో ఉన్నారు.
18 తర్వాత రూబేను నివాసము నుండి మూడు భాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం క్రింద ప్రయాణం చేసారు. మొదటిది రూబేను వంశం. షెదెయూరు కుమారుడైన ఏలీసూరు ఆ విభాగానికి సైన్యాధిపతి. 19 తర్వాత షిమ్యోను వంశం. సూరిషదాయి కుమారుడైన షెలుమీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. 20 తర్వాత గాదు వంశం. దెయువేలు కుమారుడు ఎలీయాసాపు ఆ విభాగానికి సైన్యాధిపతి. 21 తర్వాత కహాతు కుటుంబ ప్రజలు. పవిత్ర గుడారం లోపల ఉండే పవిత్ర పరికరాలను వారు మోసారు. ఈ ప్రజలంతా వచ్చేయకముందే పవిత్ర గుడారం నిలబెట్టేందుకు వీలుగా వీరు ఈ సమయంలో వచ్చారు. ప్రజలు కూడా వచ్చారు.
22 తర్వాత ఎఫ్రాయిము నివాసంనుండి మూడు విభాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం క్రిందనే ప్రయాణం చేసారు. మొట్టమొదటి విభాగాం ఎఫ్రాయిము వంశం. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఆ భాగానికి సైన్యాధిపతి. 23 తర్వాత మనష్షే వంశం. పెదాసూరు కుమారుడైన గమలీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. 24 తర్వాత బెన్యామీను వంశం. గిద్యోనీ కుమారుడైన అబీదాను ఆ విభాగానికి సైన్యాధిపతి.
25 వరుసలో చివరి మూడు వంశాలు మిగిలిన విభాగాలన్నిటికీ వెనుక కాపుగా ఉన్నాయి. ఇవి దాను నివాసానికి చెందినవి. వారు వారి ధ్వజం క్రింద ప్రయాణం చేసారు. మొదటి విభాగం దాను వంశం. అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ విభాగానికి సైన్యాధిపతి. 26 తర్వాత ఆషేరు వంశం. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. 27 తర్వాత నఫ్తాలి వంశం. ఏనాను కుమారుడైన అహీరా ఆ విభాగానికి సైన్యాధిపతి. 28 ఇశ్రాయేలు ప్రజలు ఒక చోటు నుండి మరో చోటకు బయల్దేరినప్పుడు, వారు వెళ్లిన విధానం అది.
29 మిద్యానీ వాడగు రెవూయేలు కుమారుడు హోబాబు. (రెవూయేలు మోషేకు మామ.) “దేవుడు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి మేము ప్రయాణం చేస్తున్నాము. కనుక మాతో రమ్ము. మేము నీకు మేలు చేస్తాము. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా మంచివాటిని వాగ్దానం చేసాడు” అని హోబాబుతో మోషే చెప్పాడు.
30 “నేను మీతో రాను, నేను నా సొంతదేశానికి, నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లిపోతాను” అని హోబాబు జవాబిచ్చాడు.
31 అప్పుడు మోషే, “దయచేసి మమ్మల్ని విడువకు. అరణ్యంగూర్చి మాకంటె నీకే ఎక్కువ తెలుసు. నీవు మాకు మార్గదర్శిగా ఉండొచ్చు. 32 నీవు మాతో వస్తే, యెహోవా మాకు ఇచ్చే మంచివాటన్నింటిలో మేము నీకు భాగం ఇస్తాము” అని చెప్పాడు.
33 కనుక హోబాబు ఒప్పుకొన్నాడు. యెహోవా పర్వతం దగ్గరనుండి వారు ప్రయాణం మొదలు బెట్టారు. పురుషులు యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను పట్టుకొని ప్రజల ముందు నడిచారు. వారు స్థలం కోసం వెదుకుతూ, మూడు రోజులపాటు పవిత్ర పెట్టెను మోసారు. 34 యెహోవా మేఘం ప్రతిరోజూ వారిమీద ఉంది. ప్రతి ఉదయం వారు తమ స్థలం విడిచిపెట్టినప్పుడు, వారిని నడిపించేందుకు మేఘం అక్కడ ఉండేది:
35 ప్రజలు ప్రయాణం మొదలు బెట్టి, పవిత్రపెట్టె వారితో పాటు వెడలగానే, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు:
“యెహోవా, లెమ్ము
నీ శత్రువులు అన్ని దిక్కుల్లో పారిపోదురు గాక:
నీకు వ్యతిరేకంగా ఉన్న మనుష్యులు నీ ఎదుట నుండి పారిపోదురుగాక,”
36 పవిత్ర పెట్టెను, దాని స్థలంలో దాన్ని ఉంచి నప్పుడు, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు,
“యెహోవా, లక్షలాదిమంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రమ్ము.”
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.
47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
భూలోకమంతటికీ ఆయన రాజు.
3 ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
4 దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.
5 బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
యెహోవా దేవుడు లేచాడు.
6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
7 దేవుడు సర్వలోకానికి రాజు.
స్తుతిగీతాలు పాడండి.
8 దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
9 రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
దేవుడు మహోన్నతుడు.
8 నీవు నా తల్లి పాలు త్రాగిన నా సహోదరుడివైయుంటే,
నీవు నాకు బయట అగుపిస్తే,
నిన్ను నేను ముద్దాడగలిగి ఉండేదాన్ని.
అప్పుడు నన్నెవరూ తప్పు పట్టేవారు కారు!
2 నేను నిన్ను నాకు అన్నీ నేర్పిన మా తల్లి
ఇంటి గదిలోనికి తీసుకుపోయి ఉండేదాన్ని.
దానిమ్మ పళ్లరసంతో చేసిన సురభిళ మధువును
నీకు ఇచ్చి ఉండేదాన్ని.
ఆమె స్త్రీలతో అంటుంది
3 అతను తన ఎడమ చేతిని నా తల క్రింద ఉంచి
తన కుడిచేతితో నన్ను కౌగలించుకొంటాడు.
4 యెరూషలేము స్త్రీలారా మీరు నాకొక వాగ్దానం చేయండి
నా ప్రేమ స్వయం ప్రేరితమయ్యేదాకా,
ప్రేమను జాగృతం చేయకండి ప్రేమను పురిగొల్పకండి.
యెరూషలేము స్త్రీలు అంటారు
5 ఎడారి మార్గంలో, తన ప్రియుని ఆనుకొని
వస్తున్న ఈ స్త్రీ ఎవరు?
ఆమె అతనితో అంటుంది
జల్దరు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను.
అచ్చటే నిన్ను మోసిన నీ తల్లి నిన్ను కన్నది.
6 నీ హృదయ పీఠం మీద నా రూపం ముద్రించు,
నీ వేలికి ముద్రికలా ధరించు.
మృత్యువంత బలమైనది ప్రేమ
పాతాళమంత కఠనమైంది ఈర్శ్య.
అగ్ని జ్వాలల్లాంటివి దాని మంటలు
అవి పెచ్చు మీరి మహాజ్వాల[a] అవుతాయి.
7 ఉప్పెన కూడా ప్రేమజ్వాలను ఆర్పజాలదు.
నదీ జలాలూ ప్రేమను ముంచెత్తజాలవు.
ఒకడు ప్రేమ కోసం తన సర్వస్వం ధారపోస్తే,
అతణ్ణి ప్రజలు మూర్ఖుడిగా పరిగణించరు. ఎవడూ తప్పు పట్ట జాలడు!
ఆమె సోదరులు అంటారు
8 మాకు ఉన్నదొక చిన్న చెల్లెలు
ఆమెకింకా యుక్త వయస్సు రాలేదు.
ఆమెను వివాహం చేసుకొనుటకు ఒక పురుషుడు వస్తే,
మా చెల్లెలి విషయంలో మేమేమి చెయ్యాలి?
9 అది ప్రాకారమైతే,
దాని చుట్టూ వెండి నగిషీ[b] చేస్తాము
అది తలుపైతే, దాని చుట్టూ దేవదారు
పలకలతో అంచులు అలంకరిస్తాము.
ఆమె తన సోదరులతో అంటుంది
10 నేను ప్రాకారం వంటిదాన్ని
నా వక్షోజాలు గోపుర ప్రాయాలు
అతనికి నేనంటే తనివి, తృప్తి![c]
అతను అంటాడు
11 బయలు హామోనులో సొలొమోనుకొక ద్రాక్షాతోట ఉంది.
ఆ తోటనాతడు కొందరు రైతులకు కౌలుకిచ్చాడు.
వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి వెండి షెకెళ్లు[d] ఇచ్చాడు.
12 సొలొమోనూ, ఆ వెయ్యి షెకెళ్లూ నీవే ఉంచుకో,
వాటిలో యిన్నూరేసి ఒక్కొక్క రైతుకు
అతడు తెచ్చిన ద్రాక్షాలకోసం యివ్వు.
నా ద్రాక్షాతోట నా స్వంతంగా ఉంటుంది!
అతను ఆమెతో అంటాడు
13 ద్రాక్షాతోటలో కూర్చున్న ఓ సఖీ,
నీ చెలికత్తెలు నీ స్వరం వింటున్నారు,
నీ మధుర స్వరాన్ని నన్నూ విననీయి.
ఆమె అతనితో
14 నా ప్రాణ స్నేహితుడా, వేగిరం వచ్చెయ్యి.
జింకల్లా, లేడి పిల్లల్లా పరిమళవృక్ష సముదాయం పెరిగిన పర్వతాలపై నుంచి చెంగుచెంగున వచ్చెయ్యి.
క్రొత్త ఒడంబడిక
8 మేము చెబుతున్న దానిలో ముఖ్య అంశం ఏమిటంటే: పరలోకంలో మహోన్నతుని సింహాసనానికి కుడివైపు కూర్చోగల అధికారమున్న ప్రధాన యాజకుడు మనకున్నాడు. 2 అంతేకాక ఆయన నిజమైన గుడారంలో, అంటే ప్రభువు నిర్మించిన పరిశుద్ధాలయములో సేవ చేస్తున్నాడు. ఈ గుడారం మానవుడు నిర్మించింది కాదు.
3 కానుకల్ని, బలుల్ని అర్పించటానికి ప్రధాన యాజకుడు నియమించబడతాడు. అందువల్ల ఈయన దగ్గర కూడా అర్పించటానికి ఏదైనా ఉండవలసిన అవసరం ఏర్పడింది. 4 ఈయన భూలోకంలో ఉండినట్లయితే యాజకుడుగా పని చేసేవాడు కాదు. ఎందుకంటే, ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా కానుకలు అర్పించే యాజకులు యిదివరకే భూలోకంలో ఉన్నారు. 5 వాళ్ళు భూమ్మీదనున్న పరిశుద్ధ స్థలములో సేవచేస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న ఈ పరిశుద్ధ స్థలము పరలోకంలో ఉన్న దానికి నీడ లాంటిది, అంటే ప్రతిబింబం. ఈ కారణంగానే, మోషే గుడారాన్ని నిర్మించటానికి మొదలు పెట్టినప్పుడు దేవుడు అతనితో, “నేను నీకు కొండమీద చూపించిన విధంగా దాన్ని నిర్మించు!”(A) అని హెచ్చరించాడు. 6 యేసు మధ్యవర్తిగా ఉండి నియమించిన ఒడంబడిక పాత దానికన్నా ఉత్తమమైనది. అందులో ఉత్తమ వాగ్దానాలున్నాయి. అందువల్ల దేవుడు యేసుకిచ్చిన యాజకత్వము వాళ్ళు చేసే యాజకత్వం పనికన్నా ఉత్తమమైనది.
7 ఎందుకంటే ఒకవేళ మొదటి ఒడంబడికలో ఏ తప్పూ లేక పోయినట్లయితే యింకొక ఒడంబడిక యొక్క అవసరం ఉండక పోయేది. 8 కాని ప్రభువు ప్రజల పొరపాట్లను కనిపెట్టి వాళ్ళతో ఈ విధంగా అన్నాడు:
“ఇశ్రాయేలు, యూదా,
ప్రజలతో క్రొత్త ఒడంబడిక చేయవలసిన సమయం వస్తుంది!
9 వాళ్ళ ముత్తాతల్ని ఈజిప్టు దేశంనుండి, చేయి పట్టుకొని వెలుపలికి పిలుచుకొని వచ్చాను.
ఆనాడు వాళ్ళతో ఒక ఒడంబడిక చేసాను. నేను మీతో చేయబోతున్న ఒడంబడిక ఆనాటి ఒడంబడికలా ఉండదు.
వాళ్ళు నా ఒడంబడిక ప్రకారం నడుచుకోలేదు
గనుక వాళ్ళను నేను లెక్క చెయ్యలేదు.
10 ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా ఒడంబడిక చేస్తాను:
నా నియమాల్ని వాళ్ళ మనస్సుల్లో ఉంచుతాను.
వాటిని వాళ్ళ హృదయాలపై వ్రాస్తాను.
నేను వాళ్ళ దేవునిగా ఉంటాను.
వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.
11 అప్పుడు ప్రభువుని తెలుసుకోమని ప్రక్కింటివానికి గాని, తన సోదరునికి గాని బోధించవలసిన అవసరం ఉండదు.
ఎందుకంటే ఆ రోజుల్లో అధముడు, గొప్పవాడు, అందరు నన్ను తెలుసుకొంటారు.
12 నేను వాళ్ళ దోషాల్ని క్షమిస్తాను.
వాళ్ళ పాపాల్ని మరచిపోతాను.(B)
13 ఈ ఒడంబడికను “క్రొత్త ఒడంబడిక” అని పిలవటం వల్ల మొదటిది పాత ఒడంబడిక అయిపోయింది. పురాతనమైనది, శిథిలమైనది, త్వరలోనే అదృశ్యమైపోతుంది.
© 1997 Bible League International