M’Cheyne Bible Reading Plan
పస్కా పండుగ ఆచరణ
9 సీనాయి అరణ్యంలో మోషేతో యెహోవా మాట్లాడాడు: ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం, ఒక నెల నాటి మాట ఇది. మోషేతో యెహోవా అన్నాడు: 2 “నిర్ణీత సమయంలో పస్కా భోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. 3 ఈ నెల పద్నాల్గవ రోజు ఆ నిర్ణీత సమయం. మసక చీకటి వేళ వారు ఆ భోజనం చేయాలి. మరియు భోజనంనుగూర్చి నేను ఇచ్చిన నియమాలన్నింటినీ వారు జ్ఞాపకం ఉంచుకోవాలి.”
4 కనుక పస్కా భోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోమని ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్పాడు. 5 పద్నాల్గవ రోజున మసక చీకటివేళ సీనాయి అరణ్యంలో ప్రజలు ఇది చేసారు. ఇది మొదటి నెలలో. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయేలీయులు జరిగించారు.
6 అయితే ఆ రోజున కొందరు ప్రజలు పస్కా భోజనం చేయలేకపోయారు. ఒక శవంమూలంగా వారు అపవిత్రులయ్యారు. కనుక ఆ రోజున మోషే అహరోనుల దగ్గరకు వారు వెళ్లారు. 7 “ఒక శవం మూలంగా మేము ‘అపవిత్రులమయ్యాము’. అయితే ఇశ్రాయేలీయుల్లోని ఇతరులతో కలిసి మేము కూడ యెహోవాకు ఈ నిర్ణీత సమయంలో కానుకలు అర్పించటంలోను పస్కా ఆచరించుటలోను యాజకులు అడ్డుకొన్నారు” అని ఆ ప్రజలు మోషేతో చెప్పారు.
8 “దీన్ని గూర్చి యెహోవా ఏమంటాడో నేను అడుగుతాను” అన్నాడు మోషే వారితో.
9 అప్పుడు మోషేతో యెహోవా: 10 “ఇశ్రాయేలీయులతో ఈ విషయాలు చెప్పు, ఒకవేళ సరైన సమయంలో మీరు పస్కాను ఆచరించలేకపోతున్నారేమో. మీరో లేక మీ సంతానంలోవారెవరైనా ఒక శవాన్ని ముట్టినందువల్ల అపవిత్రంగా ఉన్నారేమో. లేదా మీరు ప్రయాణంలో ఉన్నారేమో. 11 అయితే మీరు కూడ పస్కాను ఆచరించగలరు గాని నిర్ణీత సమయంలో కాదు. రెండవ నెల పద్నాలుగో రోజు సందెవేళ మీరు పస్కాను ఆచరించాలి. ఆ సమయంలో మీరు గొర్రెపిల్లను, పులియని రొట్టెలను, చేదు ఆకుకూరలను తినాలి. 12 ఆ భోజనంలో ఏమీ మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు. మరియు ఎముకలు ఏవీ మీరు విరుగగొట్టకూడదు. మీరు పస్కావిందు భోజనం చేసేటప్పుడు నియమాలన్నింటినీ మీరు పాటించాలి. 13 అయితే ఆచరించగల ప్రతి మనిషి పస్కావిందును నిర్ణీత సమయంలో తినాలి. అతడు పవిత్రుడై, ప్రయాణంలో లేకుండా ఉండి పస్కాను ఆచరించకపోతే, అతనికి క్షమాపణ లేదు. అతుడు నిర్ణీత సమయంలో పస్కా విందుభోజనం చేయకపోతే, అప్పుడు అతడ్ని తన ప్రజల్లోనుంచి వెళ్లగొట్టి వేయాలి. ఎందుచేతనంటే నిర్ణీత సమయంలో అతడు తన అర్పణను యెహోవాకు అర్పించలేదు గనుక అతడు దోషి.
14 “ఇశ్రాయేలీయులకు చెందని ఒకడు మీతో నివసిస్తుంటే, అతడు మీతో కలిసి యెహోవా పస్కాలో పాలు పుచ్చుకోవాలనుకోవచ్చు. ఇది అంగీకారమే గాని మీకు ఇవ్వబడిన నియమాలన్నిటినీ అతడు పాటించాలి. మీకోసం ఉన్న నియమాలే మీరు ఇతరులకోసం కూడ పెట్టాలి.”
మేఘం—అగ్ని స్థంబాలు
15 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) నిలబెట్టిన రోజున ఒక మేఘం దానిమీద నిలిచింది. రాత్రి పూట ఆ మేఘం అగ్నిలా కనబడింది. 16 ఆ మేఘం రాత్రి అంతా పవిత్ర గుడారం మీదే నిలిచి ఉంది. 17 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నుండి కదలినప్పుడు ఇశ్రాయేలీయులు దానిని వెంబడించారు. ఆ మేఘం ఆగిపోయినప్పుడు, అక్కడే ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకొన్నారు. 18 ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా సాగిపొమ్మని యెహోవా ఆజ్ఞాపించాడు అలాగే వారు గుడారాలు వేసే స్థలం విషయంకూడా. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మేఘం పవిత్రగుడారం మీద నిలిచి ఉండగా, ప్రజలు ఆ చోటనే నివాసం కొనసాగించారు. 19 కొన్నిసార్లు చాలకాలంగా పవిత్ర గుడారంమీదనే ఆ మేఘం నిలిచిపోయేది. ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయులై ముందుకు కదల్లేదు. 20 కొన్నిసార్లు కొద్ది రోజులవరకు మాత్రమే మేఘం పవిత్ర గుడారంమీద నిలిచేది. ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. మేఘం కదిలినప్పుడు వారు ఆ మేఘాన్ని వెంబడించారు. 21 కొన్నిసార్లు ఆ మేఘము రాత్రి మాత్రమే నిలిచి ఉండేది. ఆ మర్నాడు మేఘము కదలగానే, ప్రజలుకూడా వారి సామగ్రి కూర్చుకొని వెంబడించారు. పగలుకాని రాత్రికాని మేఘము కదిలితే అప్పుడు ప్రజలుకూడా బయల్దేరారు. 22 రెండు రోజులుకానీ, ఒక నెలకానీ, ఒక సంవత్సరంకానీ ఆ మేఘము పవిత్ర గుడారంమీద నిలిచిన ప్రజలు యెహోవాకు విధేయులవుతూనే ఉన్నారు. తర్వాత మేఘము తన స్థానంనుండి లేచి బయల్దేరితే, ప్రజలు కూడ బయల్దేరారు. 23 కనుక ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. యెహోవా వారికి చూపించిన చోట వారు గుడారాలు వేసారు. మరల బయల్దేరమని యెహోవా ఆజ్ఞాపించగానే వారు బయల్దేరారు, మేఘాన్ని వెంబడించారు. యెహోవా ఆజ్ఞకు ప్రజలు లోబడ్డారు. ఇది మోషే ద్వారా ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ.
సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.
45 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.
2 నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
3 నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము.
4 నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.
అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
5 నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి
అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
6 దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
నీ నీతి రాజదండము.
7 నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
నీ దేవుడు కోరుకొన్నాడు.
8 నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
9 నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.
10 కుమారీ, నా మాట వినుము.
నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11 రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.
13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.
16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
అతను ఆమె అందాన్ని ప్రశంసిస్తాడు
7 రాకుమారీ,[a] నీ పాదరక్షల్లో నీ అడుగులెంతో అందంగా ఉన్నాయి
నీ తొడల వంపులు శిల్పి మలిచిన ఆభరణాల్లా ఉన్నాయి.
2 నీ నాభి గుండ్రటి కలశం (జాడి)లా ఉంది
దానికెన్నడూ ద్రాక్షారసం కొరత లేకుండుగాక.
నీ ఉదరం (కడుపు) పద్మ వలయితమైన
గోధుమ రాశిలా ఉంది.
3 నీ స్తనాలు తామరలో మేసే ఒక
కవల జింక పిల్లల్లా ఉన్నాయి.
4 నీ మెడ దంతపు గోపురంలా ఉంది
నీ నేత్రాలు బాత్ రబ్బీన్ సరసన ఉన్న
హెష్బోనులోని రెండు తటాకాల్లా ఉన్నాయి.
నీ నాసిక దమస్కు దిక్కుకి చూచే
లెబానోను శిఖరంలా ఉంది.
5 నీ తల కర్మెలు పర్వతంలా,
నీ తల నీలాలు పట్టుకుచ్చుల్లా వున్నాయి.
నీ సుదీర్ఘ కేశాలు చూసిన రాజు కూడా
నీ వశం అవుతాడు.
6 నీవు అతీత సుందరివి! అత్యంత మనోహరివి!
అందమైన, ఆహ్లాదకరమైన యువతివి!
7 నీవు తాళవృక్షంలా పొడుగరివి.
నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి.
8 నాకు ఆ చెట్టుపైకి ఎక్కాలని,
దాని మట్టలు పట్టాలని ఉంది.
నీ స్తనాలు ద్రాక్షా గుత్తుల్లా, నీ ఊపిరి
జల్దరు సువాసనలా ఉన్నాయి.
9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా,
అది నిద్రించే వారి ప్రేమ పెదవులకు జాలువారేదిలా ఉంది.
ఆమె అతనితో అంటుంది
10 నేను నా ప్రియునిదానను
నాయందు అతనికి వాంఛ ఉంది!
11 ఓ నా ప్రియుడా రమ్ము,
పొలానికి వెళదాము రమ్ము,
పల్లెల్లో రేయి గడుపుదాము రమ్ము,
12 పెందలకడ లేచి ద్రాక్షాతోటలకు పోదాము
ద్రాక్షా తీగలు మొగ్గ తొడిగాయో లేదో
ఆ మొగ్గలు విచ్చుకున్నాయో లేదో
దానిమ్మ చెట్లు విరబూశాయో లేదో తనివితీరా చూద్దాము, రమ్ము.
అక్కడ నేనిచ్చునా ప్రేమ అందుకొన రమ్ము.
13 ప్రేమ వర్ధక మండ్రేక ఔషధుల్నీ
మా గుమ్మాన వేలాడే పరిమళభరితమైన పువ్వుల్నీ చూడు!
ఓ నా ప్రియుడా, నీకై దాచి ఉంచాను ఎన్నెన్నో పండువీ,
దోరవీ పండ్లు, తిని చూడు!
మెల్కీసెదెకు
7 ఈ మెల్కీసెదెకు షాలేము రాజు, మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. 2 అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు.
మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము రాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. 3 మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వికులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.
4 మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించినదానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. 5 ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించినదానిలో పదవవంతు సేకరించాలని ఉంది. 6 మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. 7 ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు.
8 ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. 9 ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. 10 ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు.
11 మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది? 12 దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు, 13 ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్పబడ్డాయో, ఆయన వేరొక గోత్రపువాడు. ఆ గోత్రానికి చెందినవాళ్ళెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయ లేదు. 14 మన ప్రభువు యూదా వంశానికి చెందినవాడనే విషయం మనకు స్పష్టమే! ఈ గోత్రపువాళ్ళు యాజకులౌతారని మోషే అనలేదు.
యేసు మెల్కీసెదెకులాంటి యాజకుడు
15 పైగా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు. 16 మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు. 17 ఎందుకంటే, “నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు”(A) అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి.
18 పాత నియమం సత్తువ లేనిది, నిరుపయోగమైనది. కనుక, అది రద్దు చేయబడింది. 19 ఆ ధర్మశాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేక పోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది.
20 దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతావాళ్ళు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చెయ్యలేదు. 21 కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు:
“ప్రభువు ప్రమాణం చేశాడు.
తన మనస్సును మార్చుకోడు.
‘నీవు చిరకాలం యాజకుడుగావుంటావు.’”(B)
22 ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్ఠమైన క్రొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు.
23 ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. 24 కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. 25 అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు.
26 పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధానయాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. 27 ఆయన, ఇతర ప్రధానయాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే! 28 ధర్మశాస్త్రం బలహీనులైనవాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధానయాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.
© 1997 Bible League International