M’Cheyne Bible Reading Plan
పరిశుభ్రత నియమాలు
5 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలు వ్యాధులు, రోగములు లేకుండ వారి నివాసమును కాపాడుకోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. కుష్ఠురోగం ఉన్న ఏ మనిషినైనా సరే వారి నివాసములో నుండి పంపించి వేయాలని ప్రజలతో చెప్పు. స్రావంగల ప్రతి మనిషిని వారి నివాసంలోనుండి పంపివేయాలని వారితో చెప్పు. శవాన్ని ముట్టిన ప్రతి మనిషినీ వారి నివాసమునుండి పంపివేయాలని వారితో చెప్పు. 3 అతడు స్త్రీగాని, పురుషుడుగాని గొప్పేమీ కాలేదు. రోగాన్ని వ్యాధిని వారు మీ నివాసములో వ్యాపింపజేయకుండునట్లు వారిని మీ నివాసమునుండి బయటకు పంపించివేయండి. మీ నివాసములో మీ మధ్య నేను నివసిస్తున్నాను.”
4 కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞకు విధేయులయ్యారు. అలాంటి వారిని నివాసము వెలుపలకు వారు పంపించివేసారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు ఇలా చేసారు.
తప్పు చేస్తే చెల్లించాలి
5 మోషేతో యెహోవా ఈలాగు చెప్పాడు: 6 “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు: ఒకడు మరొక వ్యక్తికి కీడు చేస్తాడు. (ఒకడు ఇతరులకు కీడు చేస్తే వాడు నిజానికి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.) అతడు దోషి. 7 కనుక అతడు తాను చేసిన పాపం గూర్చి ప్రజలతో చెప్పాలి. తర్వాత అతడు చేసిన తప్పుకు పూర్తిగా విలువ చెల్లించాలి. అతడు ఎవరికి నష్టం కలిగించాడో ఆ మనిషికి చెల్లించాల్సిన దానికి ఇంకా ఐదో వంతు కలిపి చెల్లించాలి. 8 కానీ ఒక వేళ ఎవరికైతే అతడు నష్టం కలిగించాడో అతడు చనిపోయినయెడల, ఒక వేళ నష్టపరిహారం పుచ్చుకొనేందుకు చనిపోయిన వ్యక్తికి నావాళ్లు అనుటకు ఎవరు లేనియెడల, అలాంటప్పుడు తప్పు చేసినవాడు ఆ విలువను యెహోవాకు చెల్లించాలి. అతడు పూర్తి మొత్తాన్ని యాజకునికి చెల్లించాలి. యాజకుడు ప్రాయశ్చిత్తార్థపు పొట్టేలును బలిగా అర్పించాలి. తప్పు చేసిన ఆ మనిషి పాపాలు క్షమింపబడుటకు బలిగా పొట్టేలు అర్పించబడాలి. మిగిలిన విలువను యాజకుడు ఉంచు కోవచ్చును.
9 “ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు దేవునికి ఒక ప్రత్యేక కానుక ఇస్తే, దానిని స్వీకరించే యాజకుడు దానిని ఉంచుకోవచ్చును. అది అతనిదే. 10 ఈ ప్రత్యేక కానుకలు అర్పించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. కాని ఎవరైనా అలా ఇస్తే, అవి యాజకునికే చెందుతాయి.”
అనుమానం భర్తలు
11 అప్పుడు మోషేతో యెహోవా ఈలాగున చెప్పాడు: 12 “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: ఒకని భార్య అతనికి అపనమ్మకంగా ఉంటుంది. 13 ఆమె మరొకనితో శయనించి, తన భర్తకు తెలియకుండా ఈ విషయం దాచిపెడుతుంది. ఆమె చేసిన తప్పునుగూర్చి ఆమె భర్తకు ఎప్పటికి తెలియకపోవచ్చు. ఆమె ఆ పాపం చేసిందని అతనితో చెప్పేవారు ఎవరూ ఉండక పోవచ్చు. మరియు ఆ స్త్రీ తన పాపం విషయం తన భర్తకు చెప్పకపోవచ్చు. 14 కానీ, తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని ఆ భర్త అనుమానించటం ప్రారంభం కావచ్చు. అతనిలో కోపం కలుగుతూ వుండవచ్చు. ఆమె పవిత్రంగా లేదని, తనకు నమ్మకంగా లేదని అతనిలో అనుమానం ఏర్పడుతూ ఉండవచ్చు. 15 అలా జరిగితే, అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకునిపోవాలి. ఆ భర్త ఒక అర్పణకూడ తీసుకొని వెళ్లాలి. ఆ అర్పణ తూమెడు యవలపిండిలో పదోవంతు. యవలపిండిలో నూనెగాని సాంబ్రాణిగాని వేయకూడదు. ఈ యవల పిండి యెహోవాకు ధాన్యార్పణ. భర్త రోషం మూలంగా అది అర్పించబడింది. అతని భార్య అతనికి అపనమ్మకంగా ఉందని అతడు నమ్ముతున్నట్టు ఈ అర్పణ సూచిస్తుంది.
16 “యాజకుడు ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలువబెడ్తాడు. 17 అప్పుడు యాజకుడు మట్టి పాత్రలో పవిత్ర జలం పోస్తాడు. పవిత్ర గుడారంలోని నేల మీద మట్టి కొంత తీసుకుని, దానిని ఆ నీళ్లలో వేస్తాడు యాజకుడు. 18 ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలచివుండమని యాజకుడు ఆమెను బలవంతం చేస్తాడు. అప్పుడతడు ఆమె తల వెంట్రుకలను వదులుగా విడిచి, ధాన్యార్పణను ఆమె చేతిలో పెడతాడు. ఇది తన భర్త రోషం విషయం అర్పించే యవల పిండి. అదే సమయంలో పవిత్ర జలం ఉన్న మట్టి పాత్రను అతడు పట్టుకొంటాడు. ఇది ఆ స్త్రీకి చిక్కుతెచ్చిపెట్టే పవిత్ర జలం.
19 “అప్పుడు అబద్ధం చెప్పకూడదని యాజకుడు ఆ స్త్రీతో చెబుతాడు. సత్యం చెబుతానని ఆమె వాగ్ధానం చేయాలి. యాజకుడు ఆమెతో ఇలా అంటాడు, ‘నీవు ఇంకో మగవాడితో శయనించి ఉండకపోతే, నీ భర్తను పెళ్లాడిన నీవు, అతనికి వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, కష్టం కలిగించే ఆ జలం నీకు హాని చేయదు. 20 కానీ నీవు నీ భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, నీవు మరో మగవాడితో శయనించి ఉంటే నీకు ఏదో కీడు జరుగుతుంది. నీవు పవిత్రురాలివి కాదు. ఎందుచేతనంటే నీ భర్తకాని వాడైన పర పురుషుడు నీతో శయనించి నిన్ను అపవిత్రం చేసాడు. 21 కనుక నీవు ప్రత్యేక జలం తాగినప్పుడు నీకు గొప్ప కీడు సంభవిస్తుంది. నీ కడుపు ఉబ్బిపోతుంది, ఇంక నీకు పిల్లలు పుట్టరు. నీవు గర్భవతివి అయితే నీ శిశువు చనిపోతుంది. అప్పుడు నీ వాళ్లంతా నిన్ను విడిచిపెట్టేసి, నిన్నుగూర్చి చెడుగా చెప్పుకొంటారు.’
“ఆ స్త్రీ యెహోవాకు ప్రత్యేక ప్రమాణం చేయాలని యాజకుడు ఆమెతో చెప్పాలి. ఆ స్త్రీ అబద్ధం గనుక చెబితే ఈ కీడు తనకు జరుగుతుందని ఒప్పుకోవాలి. 22 ‘నీ శరీరంలో హాని కలిగించే ఈ నీళ్లు నీవు తాగాలి. నీవు పాపం చేసి ఉంటే నీకు పిల్లలు పుట్టరు, నీకు కలిగే ఏ శిశువైనా సరే పుట్టక ముందే చనిపోతుంది’ అని యాజకుడు చెప్పాలి. అప్పుడు ఆ స్త్రీ ‘నీవు చెప్పినట్టు చేయటానికి నేను ఒప్పుకుంటున్నాను’ అని చెప్పాలి.
23 “యాజకుడు ఈ హెచ్చరికలను ఒక పత్రంమీద వ్రాయాలి. అప్పుడు అతడు ఆ మాటలను నీళ్లలోనికి తుడిచివేయాలి. 24 అప్పుడు హాని కలిగించే ఆ నీళ్లను ఆ స్త్రీ తాగుతుంది. ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, ఆమె దోషి అయితే, ఆమెకు చాల శ్రమ కలిగిస్తాయి.
25 “అప్పుడు యాజకుడు ఆమె దగ్గరనుండి ధాన్యార్పణ తీసుకుని (రోషమునకు అర్పించు అర్పణ) దానిని యెహోవా ఎదుట పైకి ఎత్తుతాడు. తర్వాత బలిపీఠం దగ్గరకు దానిని తెస్తాడు. 26 ఆ తర్వాత యాజకుడు తన చేతినిండా ధాన్యార్పణ పట్టుకొని బలిపీఠం మీద ఉంచుతాడు. అప్పుడు అతడు దానిని దహిస్తాడు. ఆ తర్వాత ఆ నీళ్లు త్రాగమని అతడు ఆ స్త్రీతో చెబుతాడు. 27 ఆ స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం గనుక చేసి ఉంటే, ఆ నీళ్లు ఆమెకు హాని కలిగిస్తాయి. ఆ నీళ్లు ఆమె శరీరంలోనికి పోయి, ఆమెకు చాలా శ్రమ కలిగిస్తాయి. ఆమెలో ఏదైనా శిశువు ఉంటే అది పుట్టక ముందే మరణిస్తుంది, ఆమె ఎన్నటికీ పిల్లలను కనదు. ప్రజలంతా ఆమెకు వ్యతిరేకం అవుతారు. 28 కానీ ఆస్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, ఆమె పవిత్రంగా ఉంటే అప్పుడు ఆమె నిర్దోషి అని యాజకుడు చెబుతాడు. అప్పుడు ఆమె మామూలుగా ఉండి పిల్లలను కనగల్గుతుంది.
29 “అందుచేత రోషమునుగూర్చిన ఆజ్ఞ ఇది. తన భర్తతో వివాహం జరిగిన ఒక స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నీవు చేయాల్సింది ఇది. 30 లేక ఒకడు తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని అనుమానించినప్పుడు అతడు చేయాల్సింది ఇది. ఆ స్త్రీని యెహోవా యెదుట నిలువమని యాజకుడు చెప్పాలి. అప్పుడు యాజకుడు ఇవన్నీ చేయాలి. ఇది ఆజ్ఞ. 31 ఇలా చేసినందువల్ల భర్త తప్పు చేసినట్టు కాదు. కానీ ఆ స్త్రీ మాత్రం పాపం చేసి ఉంటే శ్రమ అనుభవిస్తుంది.”
సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.
39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]
2 మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
నేనేమి చెప్పలేదు.
కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
3 నాకు కోపం వచ్చింది.
దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
కనుక నేను ఏదో అన్నాను.
4 యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
5 యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.
6 మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.
7 కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
నీవే నా ఆశ.
8 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
9 నేను నా నోరు తెరవను.
నేను ఏమీ చెప్పను.
యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.
12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.
ఆమె అంటుంది
3 రాత్రి నా పరుపు మీద,
నేను ప్రేమించిన వానికోసం వెదికాను.
అతని కోసం చూశాను,
కాని అతణ్ణి కనుగొనలేకపోయాను!
2 ఇప్పుడు లేచి,
నగరమంతా తిరుగుతాను.
వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ
నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను.
అతని కోసం చూశాను,
కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను!
3 నగరంలో పాహరా తిరిగే కావలివాళ్లు నన్ను చూశారు.
వారినడిగాను, “నేను ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారా?” అని.
4 కావలివాళ్లను దాటిన వెంటనే
నేను ప్రేమించిన వ్యక్తిని కనుక్కున్నాను!
అతణ్ణి పట్టుకున్నాను.
అతణ్ణి పోనివ్వలేదు,
నా తల్లి ఇంటికి అతణ్ణి తీసుకొని వచ్చాను.
నన్ను కన్న తల్లి గదికి తీసుకొని వచ్చాను.
ఆమె స్త్రీలతో అంటుంది
5 యెరూషలేము స్త్రీలారా, దుప్పులమీద, అడవి లేళ్లమీద ఒట్టు పెట్టి, నాకు వాగ్దానం చెయ్యండి, నేను సిద్ధపడేవరకూ
ప్రేమను లేపవద్దు,
ప్రేమను పురికొల్పవద్దు.
యెరూషలేము స్త్రీలు మాట్లాడుట
6 పెద్ద జనం గుంపుతో
ఎడారినుండి వస్తున్న[a] ఈ స్త్రీ ఎవరు?
కాలుతున్న గోపరసం, సాంబ్రాణి[b] ఇతర సుగంధ ద్రవ్యాల[c] సువాసనలతో
పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.
7 చూడు, సొలొమోను ప్రయాణపు పడక![d]
అరవైమంది సైనికులు దానిని కాపలా కాస్తున్నారు.
వారు బలశాలురైన ఇశ్రాయేలు సైనికులు!
8 వారందరూ సుశిక్షుతులైన పోరాటగాండ్రు,
వారి పక్కనున్న కత్తులు,
ఏ రాత్రి ప్రమాదానికైనా సిద్ధం!
9 రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు పడక చేయించాడు,
దాని కొయ్య లెబానోనునుండి వచ్చింది.
10 దాని స్తంభాలు వెండితో చేయబడ్డాయి,
ఆధారాలు (కోళ్ళు) బంగారంతో చేయబడ్డాయి,
పడుకొనే భాగం ధూమ్ర వర్ణం వస్త్రంతో కప్పబడింది.
యెరూషలేము స్త్రీల ప్రేమతో అది పొదగబడింది.
11 సీయోను స్త్రీలారా, బయటకు రండి
రాజు సొలొమోనును చూడండి
అతని పెండ్లి రోజున అతడు చాలా సంతోషంగా ఉన్న రోజున
అతని తల్లి పెట్టిన కిరీటాన్ని[e] చూడండి!
యేసు మోషే కన్నా గొప్పవాడు
3 పరలోక దేవుని పిలుపులో పాలివారైన సోదరులారా! మీరు పవిత్రత గలవాళ్ళు. మనం బహిరంగంగా విశ్వసిస్తున్న ప్రధాన యాజకుడు, దేవుని అపొస్తలుడు అయినటువంటి యేసు పట్ల మీ మనస్సు లగ్నం చెయ్యండి. 2 మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగే యేసు కూడా తనను నియమించిన దేవునియందు నమ్మకస్తుడుగా ఉండెను. 3 ఇంటికంటే, ఇల్లు కట్టిన వానికి ఎక్కువ గౌరవముంటుంది. అలాగే మోషే కన్నా యేసు ఎక్కువ గౌరవవానికి అర్హుడనిపించుకొన్నాడు. 4 ఎందుకంటే, ప్రతి ఇంటిని ఎవరో ఒకడు కడతాడు, కాని దేవుడు అన్నిటినీ నిర్మించాడు. 5 దేవుని ఇల్లంతటిలో మోషే సేవకునిగా విశ్వాసంతో పని చేసాడు. ఆ కారణంగా, చాలా కాలం తర్వాత మోషే జరుగబోవువాటికి సాక్షిగా ఉండెను. 6 కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడైన కుమారుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా పట్టుకొన్నవారమైతే మనం ఆయన ఇల్లౌతాం. అందువల్ల మనం అశిస్తున్న దానికోసం, విశ్వాసంతో ధైర్యంగా ఉంటే ఆ యింటికి చెందినవాళ్ళమౌతాము.
దేవుని ప్రజలకు విశ్రాంతి
7-8 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు:
“ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు.
ఆయన సహనాన్ని పరీక్షించారు.
కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.
9 నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా
మీ పూర్వికులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు.
10 ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది,
‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి,
నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను.
11 అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని
కోపంతో ప్రమాణం చేశాను.’”(A)
12 సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. 13 ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు. 14 మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం. 15 ఇంతకు ముందు చెప్పబడినట్లు:
“ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు
కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.”(B)
16 వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా! 17 నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయినవాళ్ళమీదనే కదా! 18 “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించినవాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా? 19 వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము.
© 1997 Bible League International