M’Cheyne Bible Reading Plan
కహాతు కుటుంబ బాధ్యతలు
4 మోషే అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “కహాతు వంశంలోని కుటుంబాలకు చెందిన పురుషులను లెక్కించండి. (కహాతు వంశం లేవీ వంశంలోని ఒక భాగం.) 3 సైన్యంలో పని చేసిన వారిలో 30 నుండి 50 సంవత్సరాల వరకు వయసుగల పురుషులందరినీ లెక్కించండి. ఈ పురుషులు సన్నిధి గుడారంలో పని చేస్తారు. 4 సన్నధి గుడారంలో అత్యంత పవిత్ర స్థలాన్ని జాగ్రత్తగా చూసుకోవటం వారి పని.
5 “ఇశ్రాయేలు ప్రజలు ఒక కొత్త స్థలానికి ప్రయాణం చేసినప్పుడు, అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారంలోనికి వెళ్లి, తెరను దించి, దానితో పవిత్ర ఒడంబడిక పెట్టెను కప్పాలి. 6 తర్వాత దీనంతటినీ శ్రేష్ఠమైన తోలుతో కప్పాలి. అప్పుడు దానంతటి మీద నీలం రంగు బట్ట పరచి, దాని మోత కర్రలను పవిత్ర పెట్టె ఉంగరాలలో దూర్చాలి.
7 “తర్వతా పవిత్ర బల్ల మీద ఒక నీలం బట్టను వారు పర్చాలి. అప్పుడు గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, పానము చేయు పాత్రలను వారు ఆ బల్ల మీద పెట్టాలి. ప్రత్యేక రొట్టెలను కూడ ఆ బల్ల మీద పెట్టాలి. 8 అప్పుడు వీటన్నింటిమీద ఒక ఎర్రబట్టను మీరు వేయాలి. తర్వాత శ్రేష్ఠమైన తోలుతో అన్నింటినీ కప్పాలి. అప్పుడు బల్ల ఉంగరాల్లో దండెలను పెట్టాలి.
9 “తర్వాత దీపస్తంభాన్ని, దాని దీపాలను నీలం బట్టతో కప్పాలి. దీపాలను ప్రకాశింప చేసేందుకు వినియోగించిన వస్తువులన్నింటినీ, దీపాలకు ఉపయోగించిన నూనె పాత్రలను కప్పాలి. 10 అప్పుడు ప్రతి దానిని శ్రేష్ఠమైన తోలుతో చుట్టి, వీటిని మోసేందుకు ఉపయోగించే దండెలమీద వీటిని ఉంచాలి.
11 “బంగారు బలిపీఠం మీద నీలం బట్టను పరచాలి. దానిని శ్రేష్ఠమైన తోలుతో కప్పాలి. అప్పుడు బలిపీఠపు ఉంగరాలలో దాని, మోత కర్రలను ఉంచాలి.
12 “తర్వాత పవిత్ర స్థలంలో ఆరాధనకు ఉపయోగించే ప్రత్యేక వస్తువులన్నింటినీ సమకూర్చాలి. ఆ వస్తువులను ఒక్క చోట సమకూర్చి, నీలం బట్టతో వాటిని చుట్టి పెట్టాలి. అప్పుడు దాన్ని శ్రేష్ఠమైన తోలుతో కప్పాలి. వీటిని మోసేందుకు ఒక చట్రంమీద వాటిని ఉంచాలి.
13 “ఇత్తడి బలిపీఠపు బూడిదను తీసివేసి, ధూమ్రవర్ణంగల బట్టను దానిమీద పరచాలి. 14 తర్వాత బలిపీఠందగ్గర ఆరాధనకు ఉపయోగించే వస్తువులన్నింటినీ సమకూర్చాలి. అవి ఏవనగా, ధూపార్తి, ముండ్ల గరిటెలు, గిన్నెలు, ఇతర పరికరాలు. వీటన్నింటినీ యిత్తడి బలిపీఠం మీద ఉంచాలి. తర్వాత బలిపీఠం మీద శ్రేష్ఠమైన తోలు కప్పాలి. బలిపీఠపు ఉంగరాల్లో దానిమోత కర్రలు ఉంచాలి.
15 “అహరోను, అతని కుమారులు పవిత్ర స్థలంలో పవిత్ర వస్తువులన్నింటినీ కప్పటం అయిన తర్వాత, కహాతు కుటుంబపు పురుషులు లోనికి వెళ్లి, ఆ వస్తువులను మోయటం మొదలు పెట్టవచ్చు. ఈ విధంగా వారు చావకుండా ఉండేలా పవిత్ర స్థలాన్ని తాకరు.
16 “యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు పవిత్ర గుడారానికి బాధ్యుడు. పవిత్ర స్థలానికి, దానిలోని సమస్తానికి అతడు బాధ్యుడు. దీపాల నూనె, పరిమళ ధూపద్రవ్యాలు, నిత్యార్పణ, అభిషేక తైలం, వీటన్నింటికీ అతడు బాధ్యుడు.”
17 మోషే అహరోనులతో యెహోవా ఈలాగు అన్నాడు: 18 “జాగ్రత్తగా ఉండండి, ఆ కహాతీ మనుష్యుల్ని నాశనం కానివ్వకండి. 19 కహాతీ మనుష్యులు అతి పవిత్ర స్థలాన్ని సమీపించికూడ మరణించకుండా ఉండేటట్టుగా మీరు వీటిని చేయాలి. అహరోను, అతని కుమారులు లోనికి వెళ్లి, కహాతీ మనుష్యులు ఒక్కొక్కరు ఏమేమి చేయాల్సిందీ చూపెట్టాలి. ఒక్కొక్కడు మోయవలసిన వాటిని వారు ఒక్కొక్కనికి ఇవ్వాలి. 20 మీరు ఇలా చేయకపోతే, కహాతీ మనుష్యులు లోనికి వెళ్లి, పవిత్ర వస్తువులను చూచి, అవి ముఖ్యమైనవి కానట్టుగా ఎంచవచ్చును. వారు గనుక అలా ఒక క్షణంపాటుచేస్తే, వారు మరణిస్తారు.”
గెర్షోను కుటుంబం పనులు
21 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 22 “గెర్షోను సంతతిలో మనుష్యులందరినీ లెక్కించు. వంశాలుగా, కుటుంబాలుగా వారి జాబితా తయారుచేయి. 23 30 నుండి 50 సంవత్సరాల వయస్సుగలిగి, యుద్ధంలో పనిచేసిన పురుషులందరినీ లెక్కించు. వీరంతా సన్నిధి గుడారాన్ని జాగ్రత్తగా చూసుకునే పని చేస్తారు.
24 “గెర్షోను కుటుంబమువారు చేయాల్సినవి, మోయాల్సినవి ఇవి: 25 పవిత్ర గుడారపు తెరలు, సన్నిధి గుడారం, దాని కప్పు, శ్రేష్ఠమైన తోలుతో చేయబడ్డ కప్పు వారు మోయాలి. సన్నిధి గుడార ప్రవేశం దగ్గర తెరను కూడా వారు మోయాలి. 26 పవిత్ర గుడారం చుట్టూ బలిపీఠం చుట్టూ ఉండే ఆవరణ తెరలన్నీ వారు మోయాలి. మరియు ఆవరణ ప్రవేశానికి ఉండే తెరను కూడా వారు మోయాలి. తెరలకు ఉపయోగించే వస్తువులన్నింటినీ, తాళ్లన్నింటినీ వారే మోయాలి. వీటి విషయంలో ఏది చేయాల్సి వచ్చినా గెర్షోను కుటుంబము వాళ్లే బాధ్యులు. 27 జరుగుతున్న పని అంతటినీ అహరోను, అతని కుమారులు గమనిస్తూ ఉంటారు. గెర్షోను ప్రజలు మోసేవాటిని, చేసేవాటినీ అన్నింటినీ అహరోను, అతని కుమారులు గమనిస్తుంటారు. వారు ఏ వస్తువులు మోయుటకు బాధ్యులో వాటన్నింటిని గూర్చి నీవు వారితో చెప్పాలి. 28 గెర్షోను కుటుంబమువారు సన్నిధి గుడారం కోసం చేయాల్సిన పని ఇది. యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు వారి పనికి బాధ్యుడు.”
మెరారి కుటుంబం వారి పనులు
29 “మెరారీయులలోని వంశాలు, కుటుంబాలలో ఉన్న పురుషులందరినీ లెక్కించు. 30 30 నుండి 50 సంవత్సరాల వయసు కలిగి యుద్ధంలో పని చేసిన పురుషులందరినీ లెక్కించు. వీరు సన్నిధి గుడారం కోసం ఒక ప్రత్యేక పని చేస్తారు. 31 మీరు ప్రయాణం చేసేటప్పుడు సన్నిధి గుడారపు పలకలు మోయటం వారి పని. అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలను వారు మోయాలి. 32 ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలు కూడ వారు మోయాలి. దిమ్మలను, గుడారపు మేకులను, తాళ్లను, ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలకు ఉపయోగించే సమస్తం వారు మోయాలి. పేర్ల జాబితా చేసి, సరిగ్గా ఒక్కో మనిషి ఏమి మోయాలో వారికి చెప్పు. 33 సన్నిధి గుడారపు పనిలో సేవ చేసేందుకు మెరారి ప్రజలు చేయాల్సిన పనులు ఇవి. యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు వారి పనికి బాధ్యుడు.”
లేవీ కుటుంబాలు
34 మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజా నాయకులు కహాతీ ప్రజలను లెక్కించారు. వంశాలుగా, కుటుంబాలుగా వారు వారిని లెక్కించారు. 35 30 నుండి 50 సంవత్సరాల వయసు గలిగి యుద్ధంలో పని చేసిన పురుషులందరిని వారు లెక్కించారు. సన్నిధి గుడారంకోసం చేయాల్సిన ప్రత్యేక పని వీరికి అప్పగించబడింది.
36 ఈ పని చేసేందుకు అర్హులు 2,750 మంది పురుషులు కహాతు వంశంలో ఉన్నారు. 37 కనుక కహాతు వంశంలోని ఈ పురుషులకు సన్నిధి గుడారం కోసం చేయాల్సిన ప్రత్యేక పని అప్పగించబడింది. మోషేతో యెహోవా చెప్పిన ప్రకారం మోషే, అహరోను యిలా చేసారు. 38 మరియు, గెర్షోను కుటుంబం కూడ లెక్కించబడింది. 39 30 నుండి 50 సంవత్సరాల వయసు ఉండి సైన్యంలో పని చేసిన పురుషులంతా లెక్కించబడ్డారు. సన్నిధి గుడారం కోసం వారు చేయాల్సిన ప్రత్యేక పని ఈ మనుష్యులకు అప్పగించటం జరిగింది. 40 గెర్షోను వంశాల్లో అర్హులైన పురుషులు 2,630 మంది ఉన్నారు. 41 కనుక గెర్షోను వంశంలోని ఈ మనుష్యులకు సన్నిధి గుడారం కోసం చేయాల్సిన ప్రత్యేక పని అప్పగించటం జరిగింది. మోషేకు యెహోవా చెప్పిన ప్రకారం మోషే, అహరోను ఇలా చేసారు.
42 మరియు మెరారి వంశంలోని పురుషులు లెక్కించబడ్డారు. 43 30 నుండి 50 సంవత్సరాల వయసు ఉండి సైన్యంలో పని చేసిన పురుషులంతా లెక్కించబడ్డారు. సన్నిధి గుడారం కోసం వీరు చేయాల్సిన ప్రత్యేక పని వీరికి అప్పగించబడింది. 44 మెరారి వంశాల్లో అర్హులైన పురుషులు 3,200 మంది ఉన్నారు. 45 కనుక మెరారి వంశంలోని ఈ పురుషులకు వారి ప్రత్యేక పని అప్పగించబడింది. మోషేతో యెహోవా చెప్పిన ప్రకారం మోషే అహరోనులు ఇలా చేసారు.
46 కనుక మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజా నాయకులు లేవీయులలోని పురుషులందరినీ లెక్కించారు. ప్రతి వంశాన్ని, ప్రతి కుటుంబాన్ని వారు లెక్కించారు. 47 30 నుండి 50 సంవత్సరాల వయసువుండి సైన్యంలో పని చేసిన పురుషులందరూ లెక్కించబడ్డారు. సన్నిధి గుడారం కోసం చేయాల్సిన ప్రత్యేక పని వీరికి అప్పగించబడింది. వారు ప్రయాణం చేసినప్పుడు సన్నిధి గుడారాన్ని మోసే పనిని వారు చేసారు. 48 వారి మొత్తం సంఖ్య 8,500. 49 మోషేకు ఈ ఆజ్ఞను యెహోవా ఇచ్చాడు. ఒక్కో మనిషికి ఒక్కో పని ఇవ్వబడింది. ఏ మనిషి ఏమి మోయాలో ఆ మనిషికి చెప్పబడింది. కనుక యెహోవా ఆజ్ఞ ప్రకారం చేయబడింది. పురుషులంతా లెక్కించబడ్డారు.
జ్ఞాపకార్థ దినం[a] కోసం దావీదు కీర్తన.
38 యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు.
నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.
2 యెహోవా, నీవు నన్ను బాధించావు.
నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.
3 నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది.
నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.
4 నేను చెడు కార్యాలు చేసిన దోషిని,
ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.
5 నేను తెలివితక్కువగా ఉన్నాను.
ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.
6 నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను.
రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.
7 నా నడుము వేడిగా కాలిపోతోంది.
నా శరీరం అంతా బాధగా ఉంది.
8 నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను.
నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
9 ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు.
నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.
10 నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది.
నా చూపు దాదాపు పోయింది.
11 నా రోగం మూలంగా నా స్నేహితులు,
నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు.
నా కుటుంబం నా దగ్గరకు రాదు.
12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు.
నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు.
వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.
13 అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను.
మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.
14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను.
నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను.
నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము.
16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు.
నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.
17 నేను పడిపోయేటట్టు ఉన్నాను.
నేను నా బాధను మరచిపోలేను.
18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను.
నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.
19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు,
వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.
20 నా శత్రువులు నాకు కీడు చేశారు,
నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను.
మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను.
కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.
21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు.
నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.
22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
నా దేవా, నన్ను రక్షించుము.
2 నేను షారోనులోని గులాబి పువ్వును. లోయలలోని సుగంధ పుష్పాన్ని[a].
అతడు అంటున్నాడు
2 నా ప్రియురాలా, ఇతర స్త్రీలలో నీవు
ముళ్ల మధ్య గులాబి పుష్పంలా ఉన్నావు!
ఆమె అంటుంది
3 నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య నీవు
అడవిచెట్ల మధ్య జల్దరు చెట్టులా ఉన్నావు!
ఆమె స్త్రీలతో అంటుంది
ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటాను!
నా ప్రియుని నీడలో కూర్చుని నేను ఆనందిస్తాను, అతని ఫలం నాకెంతో రుచికరంగా వుంది.
4 నా ప్రియుడు నన్ను ద్రాక్షారసశాలకు తీసుకుని వచ్చాడు,
నా మీద అతని ఉద్దేశం ప్రేమ.
5 ఎండు ద్రాక్షాలతో[b] నాకు బలాన్నివ్వండి,
జల్దరు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను.[c]
6 నా ప్రియుని ఎడమ చేయి నా తల క్రింద ఉంది,
అతని కుడి చేయి నన్ను కౌగలించుకొంది.
7 యెరూషలేము స్త్రీలారా, దుప్పులమీద, అడవి లేళ్ల మీద ఒట్టేసి నాకు వాగ్దానం చెయ్యండి, నేను సిద్ధపడేవరకూ.[d]
ప్రేమను లేపవద్దు,
ప్రేమను పురికొల్పవద్దు.
ఆమె మళ్లీ అంటుంది
8 నా ప్రియుని గొంతు వింటున్నాను.
అదిగో అతడు వస్తున్నాడు.
పర్వతాల మీది నుంచి దూకుతూ
కొండల మీది నుంచి వస్తున్నాడు.
9 నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు
లేదా లేడి పిల్లలా ఉన్నాడు.
మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు,
కిటికీలోనుంచి తేరి పార చూస్తూ,
అల్లిక కిటికీలోనుంచి[e] చూస్తూ
10 నా ప్రియుడు నాతో అంటున్నాడు,
“నా ప్రియురాలా, లెమ్ము,
నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం!
11 చూడు, శీతాకాలం వెళ్లిపోయింది,
వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి.
12 పొలాల్లో పూలు వికసిస్తున్నాయి
ఇది పాడే సమయం![f]
విను, పావురాలు తిరిగి వచ్చాయి.
13 అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి.
పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు.
నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా,
మనం వెళ్లిపోదాం!”
అతడు అంటున్నాడు
14 కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా!
నిన్ను చూడనిమ్ము,
నీ గొంతు విననిమ్ము,
నీ గొంతు ఎంతో మధురం,
నువ్వెంతో సుందరం!
ఆమె స్త్రీలతో అంటుంది
15 మాకోసం గుంటనక్కల్ని
ద్రాక్షాతోటల్ని పాడుచేసే చిన్న గుంటనక్కల్ని పట్టుకోండి!
మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది.
16 నా ప్రియుడు నావాడు,
నేను అతని దానను!
అతడు సుగంధ పుష్పాల పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు!
17 నా ప్రియుడా, సూర్యాస్తమయమై, ఇక నీడలు మాయమయ్యే వేళలో
చీలిన పర్వతాల[g] మీద దుప్పిలా, లేడిపిల్లలా తిరుగు!
జాగ్రత్తపడమని హెచ్చరిక
2 అందువల్ల, మనం విన్న సత్యాలను మనం ముందు కన్నా యింకా ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మనం వాటికి దూరమైపోము. 2 దేవదూతలు చెప్పిన సందేశంలో సత్యం ఉందని రుజువైంది.[a] ఆ సందేశాన్ని అనుసరించనివానికి, దాన్ని విననివానికి తగిన శిక్ష లభించింది. 3 మరి, అటువంటి మహత్తరమైన రక్షణను మనం గమనించకపోతే శిక్షనుండి ఏ విధంగా తప్పించుకోగలం? ఈ రక్షణను గురించి మొట్ట మొదట మన ప్రభువు ప్రకటించాడు. ఆ సందేశాన్ని విన్నవాళ్ళు అందులోవున్న సత్యాన్ని మనకు వెల్లడిచేసారు. 4 దేవుడు ఎన్నో సూచనల్ని, అద్భుతాల్ని, మహిమల్ని చూపాడు. తన యిష్టానుసారం పరిశుద్ధాత్మ యొక్క వరాల్ని పంచి పెట్టాడు. తద్వారా ఆ సందేశంలో ఉన్న సత్యాన్ని మనకు రుజువు చేసాడు.
యేసు మానవజన్మనెత్తటం
5 మనం మాట్లాడుతున్న ప్రపంచాన్ని, అంటే రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చ లేదు. 6 ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది:
“మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అతడెంతటివాడు?
మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అతడెంతటివాడు?
7 నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని యిచ్చావు!
మహిమ, గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి,
8 అన్నిటినీ అతని పాదాల క్రింద ఉంచావు.”(A)
దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు. 9 యేసు, దేవదూతల కన్నా కొంత తక్కువవానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటంవలన “మహిమ, గౌరవము” అనే కిరీటాన్ని ధరించగలిగాడు.
10 దేవుడు తన కుమారుల్లో చాలామంది తన మహిమలో భాగం పంచుకొనేటట్లు చెయ్యాలని, వాళ్ళ రక్షణకు కారకుడైనటువంటి యేసును కష్టాలనుభవింపజేసి, ఆయనలో పరిపూర్ణత కలుగ చేసాడు. ఎవరికోసం, ఎవరిద్వారా, ఈ ప్రపంచం సృష్టింపబడిందో ఆ దేవుడు ఈ విధంగా చేయటం ధర్మమే! యేసు మానవుల్ని పవిత్రం చేస్తాడు.
11 ఆయన పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు. అందువలనే, వాళ్ళు తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటంలేదు. 12 ఆయన ఈ విధంగా అన్నాడు:
“నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను.
సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!”(B)
13 మరొక చోట
“నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!”(C)
అంతేకాక ఇలా కూడా అన్నాడు:
“నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!”(D)
14 ఆయన “సంతానమని” పిలువబడినవాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి వాళ్ళ మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సాతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు. 15 తద్వారా జీవితాంతం మరణానికి భయపడి జీవించే వాళ్ళకు స్వేచ్ఛకలిగించాడు. 16 నిజానికి, ఆయన దేవదూతలకు సహయం చెయ్యాలని రాలేదు. అబ్రాహాము సంతానానికి సహయం చెయ్యాలని వచ్చాడు. 17 ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడయ్యాడు. 18 శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు.
© 1997 Bible League International