M’Cheyne Bible Reading Plan
అహరోను కుటుంబం, యాజకులు
3 సీనాయి పర్వతం మీద మోషేతో యెహోవా మాట్లాడిన సమయంలో అహరోను, మోషేల కుటుంబ చరిత్ర ఇది.
2 అహరోనుకు కుమారులు నలుగురు. నాదాబు మొదటి కుమారుడు. ఆ తర్వాత అబీహు, ఎలియాజరు, ఈతామారు. 3 ఈ కుమారులు అభిషేకించబడిన యాజకులు. యాజకులుగా యెహోవాను సేవించే ప్రత్యేక పని ఈ కుమారులుకు ఇవ్వబడింది. 4 అయితే నాదాబు, అబీహు యెహోవాను సేవిస్తూనే పాపంచేసారు గనుక వారు చనిపోయారు. వారు యెహోవాకు ఒక అర్పణ తయారు చేసారు కాని, యెహోవా అనుమతించని అగ్నిని వారు ఉపయోగించారు. ఇది సీనాయి అరణ్యంలో సంభవించింది. కనుక నాదాబు, అబీహు అక్కడే చనిపోయారు. వారికి కుమారులు లేనందుచేత ఎలియాజరు, ఈతామారు యాజకులై యెహోవాను సేవించారు. వారి తండ్రి అహరోను జీవించి ఉండగానే వారు ఇలా చేసారు.
లేవీయులు—యాజకుల సహాయకులు
5 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 6 “లేవీ కుటుంబంలోని వాళ్లందర్నీ తీసుకురా, అహరోను యాజకుని దగ్గరకు వాళ్లను తీసుకొనిరా. వారు అహరోనుకు సహాయకులు. 7 అహరోను సన్నిధి గుడారంలో పరిచర్య చేసేటప్పుడు లేవీయులు అహరోనుకు సహాయం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు పవిత్ర గుడారంలో ఆరాధించటానికి వచ్చినప్పుడు వాళ్లందరికి లేవీయులు సహాయం చేస్తారు. 8 సన్నిధి గుడారంలో సామగ్రి అంతటినీ ఇశ్రాయేలు ప్రజలు కాపాడాలి. అది వారి బాధ్యత. కానీ లేవీయులు వీటి విషయం జాగ్రత్త పుచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలందరికీ సేవచేస్తారు. పవిత్ర గుడారంలో ఆరాధించటంలో ఇది వారి విధానం.
9 “లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరిలో నుండి ఏర్పాటు చేసుకోబడ్డారు. ఈ లేవీయులు అహరోనుకు, అతని కుమారులకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేయబడ్డారు.”
10 “అహరోనును, అతని కుమారులను యాజకులుగా నీవు నియమించు. వారు, వారి బాధ్యతను నిర్వహిస్తూ యాజకులుగా సేవ చేయాలి, పవిత్ర వస్తువులను సమీపించేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా చంపివేయబడాలి.”
11 ఇంకా మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 12 “ఇశ్రాయేలీయులు ప్రతి కుటుంబంలోను పెద్దకుమారుణ్ణి నాకు ఇవ్వాలని, నేను నీతో చెప్పాను, కానీ నన్ను సేవించేందుకు ఇప్పుడు లేవీయులను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. వారు నా వారై ఉంటారు. అందుచేత మిగిలిన ఇశ్రాయేలు ప్రజలంతా వారి పెద్ద కుమారులను నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. 13 మీరు ఈజిప్టులో ఉన్నప్పుడు, ఈజిప్టు ప్రజల పెద్ద కుమారులందర్ని నేను చంపాను. ఆ సమయంలో ఇశ్రాయేలు పెద్ద కుమారులందరిని నా వాళ్లుగా నేను అంగీకరించాను. పెద్ద కుమారులందరు నా వారు, పశువులలో ప్రథమంగా పుట్టినవన్నీ నావే. కానీ మీ పెద్దలందరినీ నేను మీకు తిరిగి ఇచ్చివేస్తున్నాను, మరియు లేవీయులను నా వారిగా చేసుకుంటున్నాను. నేను యెహోవాను.”
14 సీనాయి అరణ్యంలో మోషేతో మరోసారి యెహోవా మాట్లాడాడు: యెహోవా ఇలా చెప్పాడు, 15 “లేవీ వంశంలో ఉన్న లేవీయులను, కుటుంబాలను అన్నింటినీ లెక్కించు. ప్రతి పురుషుని, ఒక నెలగాని అంతకంటె ఎక్కువగాని వయస్సు ఉన్న ప్రతి బాలుని లెక్కించు.” 16 కనుక మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. అతడు వాళ్లందర్నీ లెక్కించాడు.
17 లేవీకి ముగ్గురు కుమారులు. వారి పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి.
18 ఒక్కో కుమారుడు ఎన్నో వంశాలకు నాయకుడు.
గెర్షోను కుటుంబంలో, లిబ్నీ, షిమీ.
19 కహాతు కుటుంబంలో, అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు,
20 మెరారి కుటుంబంలో, మహలి, ముషి.
ఇవి లేవీ వంశానకి చెందిన కుటుంబాలు.
21 లిబ్ని, షిమివంశాలు గెర్షోము కుటుంబానికి చెందినవి. అవి గెర్షోనీ వంశాలు. 22 ఈ రెండు కుటుంబాలలోను ఒక నెల వయసు దాటిన బాలురు, పురుషులు 7,500 మంది ఉన్నారు. 23 గెర్షోని కుటుంబాలు పశ్చిమాన నివాసం చేయాలని చెప్పబడింది. పవిత్ర గుడారం వెనుకవైపు వారు నివాసము చేసారు. 24 లాయెలు కుమారుడు ఎలీయా సావు గెర్షోనీ ప్రజల కుటుంబాలకు నాయకుడు. 25 పవిత్ర గుడారం, దాని కప్పు, వెలుపలి గుడారం కాపాడుట పవిత్ర గుడారంలో గెర్షోనీ ప్రజల బాధ్యత. సన్నిధి గుడారం ప్రవేశంలో ఉన్న తెర బాధ్యత కూడా వారే తీసుకున్నారు. 26 ఆవరణలో తెర బాధ్యత కూడా వారే వహించారు. ఆవరణానికి గల ప్రవేశం యొక్కతెర విషయం కూడా వారే శ్రద్ధ పుచ్చుకున్నారు. పవిత్ర గుడారానికి, బలి పీఠానికి చుట్టూ ఉంది ఈ ఆవరణ. తాళ్ల విషయం, తెరలకు సంబంధించిన వాటన్నింటి విషయం వారే జాగ్రత్త తీసుకున్నారు.
27 అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు వంశాలు కహాతు కుటుంబానికి చెందినవి. వారు కహాతీ వంశపువారు. 28 పురుషులు ఒక నెల వయసు దాటిన బాలురు, 8,600 [a] మంది ఈ కుటుంబంలో ఉన్నారు. పవిత్ర స్థలంలోని వాటిని కాపాడే బాధ్యత కహాతు ప్రజలకు ఇవ్వబడింది. 29 పవిత్ర గుడారం దక్షిణ దిశ కహాతీ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం. 30 ఉజ్జీయేలు కుమారుడు ఎలీషాపాను కహాతీ వంశాల నాయకుడు. 31 పవిత్ర పెట్టె, బల్ల, దీపస్తంభం, పవిత్ర స్థలంలోని పాత్రలను కాపాడటం వారి బాధ్యత. తెర విషయం, దానితోబాటు ఉపయోగించిన వస్తువులన్నింటి విషయంకూడా వారు శ్రద్ధ తీసుకున్నారు.
32 అహరోను కుమారుడును యాజకుడైన ఎలియాజరు లేవీ ప్రజానాయకులకు నాయకుడు. పవిత్ర పరికరాలను కాపాడే వారందరిపై ఎలియాజరు పరీశీలకుడు.
33-34 మహలీ, మూషి కుటుంబాలు మెరారి వంశానికి చెందినవి. ఒక నెల దాటిన బాలురు, పురుషులు మహలీ కుటుంబంలో 6,200 మంది ఉన్నారు. 35 అబీహాయిలు కుమారుడైన సూరీయేలు మెరారి వంశానికి నాయకుడు. పవిత్ర గుడారం ఉత్తర ప్రదేశం ఈ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం. 36 పవిత్ర గుడారపు చట్రాలను కాపాడే బాధ్యత మెరారి ప్రజలకు ఇవ్వబడింది. పవిత్ర గుడారపు చట్రాలతో బాటు వాటి పలకలను, అడ్డకర్రలను, స్తంభాలను. దిమ్మలను, పరికరాలను, దానికి సంబంధించిన వాటన్నింటినీ వారు కాపాడారు. 37 పవిత్ర గుడారం చుట్టు ప్రక్కల స్తంభాలన్నింటినీ వారు కాపాడారు. వాటి దిమ్మలు, మేకులు, తాళ్లు కూడ ఇందులో ఉన్నాయి.
38 సన్నిధి గుడారం ఎదుట పవిత్ర గుడారానికి తూర్పున మోషే, అహరోను, అతని కుమారులు విడిదిచేసారు. పవిత్ర స్థలాన్ని కాపాడే బాధ్యత వారికి ఇవ్వబడింది. ఇది ఇశ్రాయేలీయులందరి పక్షంగా వారు చేసారు. వేరే వారెవరైనా పవిత్ర స్థలం దగ్గరగా వస్తే చంపేయాల్సిందే.
39 లేవీ వంశంలో ఒక నెలగాని, అంతకు మించిగాని వయస్సున్న బాలురను పురుషులను లెక్కించమని మోషే, అహరోనులకు యెహోవా ఆజ్ఞాపించాడు. మొత్తం సంఖ్య 22,000.
లేవీయులు పెద్ద కుమారుల స్థానం వహించుట
40 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులలో ఒక నెలగాని అంతకంటె ఎక్కువగాని వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను అందరినీ లెక్కించు, వారి పేర్ల జాబితా ఒకటి తయారుచేయి. 41 ఇప్పుడు ఇశ్రాయేలీయుల పెద్ద కుమారులను నేను తీసుకోను. ఇప్పుడు యెహోవానగు నేను లేవీయులను స్వీకరిస్తాను. ఇశ్రాయేలీయులలో ఇతరుల పశువులలో మొదటి ఫలమంతటినీ తీసుకొనే బదులు లేవీయుల పశువుల మొదటి ఫలాన్ని నేను తీసుకుంటాను.”
42 కనుక యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే చేసాడు. ఇశ్రాయేలు ప్రజల పిల్లల్లో పెద్దవారినందరినీ మోషే లెక్కించాడు. 43 ఒక నెల, అంతకంటె ఎక్కువ వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను మోషే జాబితా చేసాడు. ఆ జాబితాలో 22,273 మంది ఉన్నారు.
44 మోషేతో యెహోవా ఇంకా ఇలా అన్నాడు: 45 “నేనే, యెహోవాను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను: ‘ఇశ్రాయేలీయుల ఇతర కుటుంబాల్లోని మొదట పుట్టిన వారందరి బదులు లేవీయులను తీసుకో. మిగిలిన ప్రజల పశువులకు బదులు లేవీయుల పశువులను నేను తీసుకుంటాను. లేవీయులు నా వారు. 46 లేవీయులు 22,000 మంది ఉన్నారు కానీ, ఇతర కుటుంబాల్లోని పెద్ద కుమారులు 22,273 మంది ఉన్నారు. అనగా లేవీయులకంటె 273 మంది పెద్ద కుమారులు ఎక్కువగా ఉన్నారు. 47 కనుక ఆ 273 మందిలో ప్రతి ఒక్కరి వద్ద అధికారిక కొలతనుపయోగించి అయిదు తులాల వెండి తీసుకో. (ఇది 20 చిన్నములు బరువుగల అధికారిక కొలత.) ఇశ్రాయేలు ప్రజలవద్ద ఆ వెండి వసూలు చేయి. 48 ఆ వెండిని అహరోనుకు అతని కుమారులకు ఇవ్వు. అది 273 మంది ఇశ్రాయేలీయులకు విమోచనా ధనం.’”
49 కనుక 273 మంది కొరకు ఈ ధనాన్ని మోషే వసూలు చేసాడు. ఈ 273 మంది స్థానాన్ని లేవీ వంశం వహించలేకపోయింది. 50 ఇశ్రాయేలు ప్రజలలో మొదట పుట్టినవారినుండి వెండిని మోషే వసూలు చేసాడు. అధికారిక కొలత ప్రకారం 1,365 వెండి తులాలను అతడు వసూలు చేసాడు. 51 యెహోవాకు మోషే విధేయుడయ్యాడు. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అహరోనుకు, అతని కుమారులకు ఆ వెండిని మోషే ఇచ్చాడు.
దావీదు కీర్తన.
37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
2 గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
3 నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
4 యెహోవాను సేవించటంలో ఆనందించుము.
ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
5 యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
6 నీ మంచితనం, న్యాయం
మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
7 యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
8 కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
9 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
వాళ్లు శాంతిని అనుభవిస్తారు.
12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.
ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,
వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.
మంచివాళ్లను, నిజాయితీపరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15 కాని వారి విల్లులు విరిగిపోతాయి.
వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16 దుష్టుల ఐశ్వర్యంకంటే
మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.
వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు.
కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
20 కాని దుర్మార్గులు యెహోవాకు శత్రువులు,
ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు.
వారు పొగవలె కనబడకుండా పోతారు.
21 దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు.
కాని మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
22 ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే, అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు.
కాని ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే, అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.
23 ఒకడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు.
వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
24 అతడు తొట్రుపడినా పడిపోడు,
ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
25 నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను.
మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు.
మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
26 మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు.
మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
27 నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే
అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
28 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.
ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు.
యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు.
కాని దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది.
వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
30 మంచి మనిషి మంచి సలహా యిస్తాడు.
అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి.
అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.
32 కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు.
మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
33 యెహోవా దుష్టుల శక్తికి మంచివారిని వదిలి వేయడు.
మంచివారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
34 యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము.
దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు,
మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.
35 శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను.
వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
36 కాని తర్వాత వారు లేకుండా పోయారు.
నేను వారికోసం చూశాను, కాని వారు నాకు కనబడలేదు.
37 నీతి, నిజాయితీ కలిగి ఉండి,
సమాధానపరచువారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.
1 సొలొమోను గీతాలలో ఉన్నత గీతం
వరునితో వధువు
2 తన నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొననిమ్ము
ఎందుకంటే ద్రాక్షా రసంకన్నా మధురమయింది నీ ప్రేమ.
3 నీ పరిమళ ద్రవ్యం అద్భుతమైన సువాసననిస్తుంది,
కాని మిక్కిలి ఉత్తమ పరిమళ ద్రవ్యం కన్నా నీ పేరు[a] తియ్యనైనది.
అందుకే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
4 నన్ను ఆకర్షించుకొనుము!
మేము నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాము!
రాజు తన రాజ గృహానికి నన్ను తీసుకు వెళ్ళాడు.
యెరూషలేము స్త్రీలు వరునితో
మేము ఆనందిస్తాం. నీకోసం సంతోషంగా ఉంటాం.
నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా బాగుంటుందని జ్ఞాపకముంచుకొనుము.
మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
వధువు స్త్రీలతో అంటుంది
5 యెరూషలేము పుత్రికలారా,
కేదారు, సల్మా[b] గుడారముల నలుపువలె
నేను నల్లగా అందంగా ఉన్నాను.
6 నేనెంత నల్లగా ఉన్నానో చూడవద్దు,
సూర్యుడు నన్నెంత నల్లగా చేశాడో చూడవద్దు.
నా సోదరులు నా మీద కోపగించారు.
వాళ్ల ద్రాక్షా తోటలకు కాపలా కాయుమని నన్ను బలవంత పెట్టారు.
అందువల్ల నన్ను గురించి నేను శ్రద్ధ తీసుకోలేక పోయాను.[c]
ఆమె అతనితో అంటుంది
7 నా ప్రాణం అంతటితో నిన్ను ప్రేమిస్తాను!
నీ గొర్రెల్ని ఎక్కడ మేపుతావో,
మధ్యాహ్నం వాటిని ఎక్కడ పడుకో బెడతావో నాకు చెప్పు.
నీతో ఉండటానికి నేను రావాలి లేకపోతే నీ మిత్రుల గొర్రెల కోసం పాటుపడే అద్దెకు తీసుకున్న స్త్రీని[d] అవుతాను!
అతను ఆమెతో అంటున్నాడు
8 నీవు అంత అందమైనదానవు! కనుక
నిజంగా నీకు తెలుసు ఏమి చెయ్యాలో.
వెళ్లు, గొర్రెలను వెంబడించు.
నీ చిన్న మేకల్ని కాపరుల గుడారాల వద్ద మేపు.
9 నా ప్రియురాలా, ఫరో రథాలు[e] లాగుతున్న నా ఆడ గుర్రాలతో నిన్నుపోల్చియున్నాను.
10-11 నీకోసం చేసిన అలంకరణలివిగో,
బంగారు తలకట్టు[f], వెండి గొలుసు.
నీ చెక్కిళ్లు ఎంతో అందంగా ఉన్నాయి
బంగారు అలంకరణలతో,
నీ మెడ ఎంతో అందంగా ఉంది వెండి అల్లికలతో.
ఆమె అంటుంది
12 నా పరిమళ ద్రవ్యపు సువాసన తన మంచంమీద పడుకున్న రాజును చేరింది.
13 నా స్తనాల మధ్య పడివున్న
నా మెడలో వున్న చిన్న గోపరసం[g] సంచిలాంటి వాడు నా ప్రియుడు.
14 ఏన్గెదీ ద్రాక్షాతోటల దగ్గరున్న గోరంటు[h] పూల
గుత్తిలాంటివాడు నా ప్రియుడు.
అతడు అంటున్నాడు
15 నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు!
ఓహో! నువ్వు సుందరంగా ఉన్నావు!
నీ కళ్లు పావురపు కళ్లలా వున్నాయి.
ఆమె అంటుంది
16 నా ప్రియుడా, నువ్వెంతో సొగసుగా ఉన్నావు!
అవును, అత్యంత మనోహరంగా ఉన్నావు!
మన శయ్య ఆకుపచ్చగా ఆహ్లాదంగా ఉంది[i]
17 మన యింటి దూలాలు దేవదారువి
అడ్డకర్రలు సరళమ్రానువి.
1 దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు, ఎన్నోవిధాలుగా మన పూర్వికులతో మాట్లాడాడు. 2 అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు. 3 కుమారుడు దేవుని మహిమ యొక్క ప్రకాశం. తండ్రి యొక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ పోషించి సంరక్షిస్తున్నాడు. పాపపరిహారం చేసాక ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ, మహా తేజస్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు. 4 ఆయన దేవదూతలకన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన గొప్ప పేరు కూడా వారసత్వంగా పొందాడు. దేవదూతలకన్నా కుమారుడు గొప్పవాడు.
5 ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు:
“నీవు నా కుమారుడవు,
నేడు నేను నీ తండ్రినయ్యాను.”(A)
మరొక చోట:
“నేనతనికి తండ్రి నౌతాను.
అతడు నా కుమారుడౌతాడు.”(B)
6 మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు:
“దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!”(C)
7 దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ:
“దేవుడు తన దూతల్ని ఆత్నలుగాను
తన సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!”(D)
8 కాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు:
“ఓ దేవా! నీ సింహాసనం చిరకాలం ఉంటుంది.
నీతి నీ రాజ్యానికి రాజదండంగా ఉంటుంది.
9 నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు.
అందువల్ల దేవుడు, నీ దేవుడు ఆనందమనే నూనెతో నిన్ను
అభిషేకించి నీ స్నేహితులందరి కన్నా నిన్ను అధికంగా గౌరవించాడు.”(E)
10 ఆయనింకా ఈ విధంగా అన్నాడు:
“ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు.
ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు.
11 అవి నశించి పోతాయి ఒక వస్త్రంలా పాత బడతాయి.
కాని, నీవు చిరకాలం ఉంటావు.
12 వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు.
వాటిని నీవు దుస్తులు మార్చినట్లు మారుస్తావు.
కాని నీవు మాత్రం అలాగే ఉంటావు!
నీ సంవత్సరములకు అంతంలేదు!”(F)
13 దేవుడు ఏ దేవదూతతోనైనా:
“నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసేవరకు
నా కుడివైపు కూర్చో,”(G)
అని ఎన్నడైనా అన్నాడా? 14 ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్ళను పంపింది?
© 1997 Bible League International