Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 2

నివాసం ఏర్పాటు

మోషే, అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలు వారి డేరాను సన్నిది గుడారం చుట్టూ వేసుకోవాలి. ఒక్కోవంశానికి దాని స్వంత ధ్వజం ఉంటుంది, ఎవరి వంశ ధ్వజం దగ్గర వారు నివాసం చేయాలి.

“యూదా డేరా పతాకం తూర్పుపక్క అంటే సూర్యోదయ దిశన ఉంటుంది. యూదా ప్రజలకు అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను నాయకుడు. ఈ విభాగములో 74,600 మంది పురుషులు ఉన్నారు.

“యూదావారి పక్కన ఇశ్శాఖారు వంశంవారి డేరా ఉంటుంది. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు వంశానికి నాయకుడు. ఈ విభాగములో 54,400 మంది ఉన్నారు.

“జెబూలూను వంశం కూడ యూదా వంశం పక్కగానే ఉంటారు. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూను వారికి నాయకుడు. ఈ విభాగములో 57,400 మంది ఉన్నారు.

“యూదా సంతతిలో 1,86,400 మంది పురుషులు ఉన్నారు. వీరంతా వారివారి వంశాల ప్రకారముగా విభజించబడ్డారు. ప్రజలు ఒక చోటనుండి మరో చోటకు తరలి వెళ్లేటప్పుడు యూదా వంశం వారు ముందుగా నడుస్తారు.

10 “పవిత్ర గుడారానికి దక్షిణాన రూబేను డేరా ధ్వజం ఉంటుంది. ఒక్కో వంశం దాని ధ్వజం దగ్గర నివాసం చేస్తారు. షెదేయూరు కుమారుడు ఏలీసూరు రూబేను వారికి నాయకుడు. 11 ఈ విభాగములో 46,500 మంది ఉన్నారు.

12 “రూబేను వంశానికి పక్కగా షిమ్యోను వంశంవారు నివాసం చేస్తారు. సూరీషద్దాయి కుమారుడు షెలుమీయేలు, షిమ్యోను వారికి నాయకుడు. 13 ఈ విభాగములో 59,300 మంది ఉన్నారు.

14 “గాదు వంశంకూడ రూబేను వారి పక్కగా నివాసంచేస్తారు. రగూయేలు కుమారుడైన ఎలీయాసావు గాదు వారికి నాయకుడు. 15 ఈ విభాగములో 45,650 మంది ఉన్నారు.

16 “మొత్తం రూబేను నివాసంలో ఉన్న విభాగములన్నిటిలో కలిసి 1,51,450 మంది పురుషులు ఉన్నారు. ప్రజలు ఒక చోటనుండి మరోచోటికి తరలి వెళ్లేటప్పుడు రూబేను వంశం రెండో విభాగముగా బయల్దేరుతుంది.

17 “ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు లేవీ వంశంవారు తర్వాత బయల్దేరతారు. సన్నిధి గుడారం వారితో బాటు ఇతర వంశాలవారి మధ్య ఉంటుంది. వారు బయల్దేరి వెళ్లే క్రమంలోనే వారి నివాసం ఏర్పాటు చేసుకొంటారు. ప్రతి వ్యక్తి తన వంశ ధ్వజం దగ్గర ఉంటాడు.

18 “ఎఫ్రాయిము వారి గుడారపు ధ్వజం పడమటి దిక్కున ఉంటుంది. ఎఫ్రాయిము విభాగములు అక్కడ నివసిస్తాయి. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము ప్రజలకు నాయకుడు. 19 ఈ విభాగములో 40,500 మంది ప్రజలు ఉన్నారు.

20 “ఎఫ్రాయిము కుటుంబానికి పక్కగా మనష్షే వంశం నివసిస్తుంది. పెదాసూరు కుమారుడు గమలీయేలు మనష్షే మనుష్యులకు నాయకుడు. 21 ఈ విభాగములో 32,200 మంది మనుష్యులు ఉన్నారు.

22 “బెన్యామీను వంశం కూడ ఎఫ్రాయిము కుటుంబానికి పక్కగా నివాసం చేస్తారు. గిద్యోనీ కుమారుడు అబీదాను బెన్యామీను ప్రజలకు నాయకుడు. 23 ఈ విభాగములో 35,400 మంది మనుష్యులు ఉన్నారు.

24 “ఎఫ్రాయిము నివాసములో మొత్తం 1,08,100 పురుషులు ఉన్నారు. ప్రజలు ఒక చోటునుండి మరోచోటికి తరలి వెళ్లినప్పుడు వారు మూడో కుటుంబంగా బయల్దేరతారు.

25 “దాను వారి గుడారపు ధ్వజం ఉత్తర దిశన ఉంటుంది. దాను కుటుంబ విభాగాలు అక్కడ నివసిస్తాయి. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను వారికి నాయకుడు. 26 ఈ విభాగములో 62,700 మంది ప్రజలు ఉన్నారు.

27 “ఆషేరు వంశాల వారు దాను కుటుంబ విభాగము పక్కగా నివాసం చేస్తారు. ఒక్రాను కుమారుడు పగీయేలు, ఆషేరు ప్రజల నాయకుడు. 28 ఈ వంశలో 41,500 మంది ప్రజలు ఉన్నారు.

29 “నఫ్తాలి వంశంకూడ దాను వంశానికి పక్కగా నివాసం చేస్తారు. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి ప్రజల నాయకుడు. 30 ఈ విభాగంలో 53,400 మంది ఉన్నారు.

31 “దాను నివాసంలో మొత్తం 1,57,600 మంది పురుషులు ఉన్నారు. ప్రజలు ఒక చోట నుండి మరోచోటికి తరలినప్పుడు, వీరు చివరి కుటుంబముగా బయల్దేరతారు. వారు తమ స్వంత ధ్వజం క్రిందనే నివాసం చేస్తారు.”

32 అన్ని నివాసాలలోను ఉన్న మొత్తం వంశాలన్నింటిలో కలిపి 6,03,550 మంది పురుషులు ఉన్నారు. 33 మోషే ఇశ్రాయేలు ప్రజలందరితో కలిపి లేవీయులను లెక్కించలేదు. ఇది యెహోవా ఇచ్చిన ఆజ్ఞ.

34 కనుక మోషేతో యెహోవా చెప్పిన వాటన్నింటికి ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు. యెహోవా వారితో చెప్పినట్టే ఇశ్రాయేలు ప్రజలు వారివారి పతాకాలదగ్గర నివాసం చేసారు. యెహోవా వారితో చెప్పిన విధానంలోనే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసారు. ప్రతి వ్యక్తి తన కుటుంబంతో, వంశంతోనే ఉన్నాడు.

కీర్తనలు. 36

సంగీత నాయకునికి: యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.

36 “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు
    అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.
    ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు.
    కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్ధాలే.
    అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.
    అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు.
    ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.

యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
    నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
    నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
    కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
    అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
    నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
    నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
    దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.

12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.
    “ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు.
    వారు చితుకగొట్టబడ్డారు.
    వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”

ప్రసంగి 12

వృద్దాప్యంలో ఎదురయ్యే సమస్యలు

12 చెడ్డకాలం దాపురించక ముందు (నీవు ముసలి వాడవు కాకముందు), “నా జీవితం వృథా చేసు కున్నాను”[a] అని నీవు వాపోయే వయస్సు రాక ముందు, నీవింకా యౌవ్వనావస్థలో వుండగానే నీ సృష్టికర్తని నీవు గుర్తుచేసుకో.

సూర్య చంద్రులూ, నక్షత్రాలూ నీ కంటి దృష్టికి ఆనని కాలం దాపురించక పూర్వం, (నీవింకా యౌవన ప్రాయంలో ఉండగానే, నీ సృష్టికర్తని నీవు జ్ఞాపకం చేసుకో). ఒక తుఫాను తర్వాత మరొక తుఫాను వచ్చినట్లే, (కష్టాలు పదే పదే వస్తాయి).

ఆ వయస్సులో నీ చేతులు శక్తి కోల్పోతాయి. నీ కాళ్లు బలము లేక వంగుతాయి. నీ పళ్లు ఊడిపోతాయి, నీవు నీ ఆహారం నమలలేవు. నీ కళ్లు మసకబారతాయి. నీ వినికిడి శక్తి మందగిస్తుంది. వీధుల్లోని శబ్దాలు నీకు వినిపించవు. నీ గోధుమలు విసిరే తిరగలి శబ్దం కూడా నీకు వినిపించదు. స్త్రీలు పాడే పాటలు కూడా నీవు వినలేవు. అయితే, పక్షి చేసే కిలకిలారావానికే నీకు వేకువజామున మెలుకువ వచ్చేస్తుంది. (మరెందుకో కాదు, నీకు నిద్రరాదు, అందుకు.)

ఎత్తయిన ప్రదేశాలంటే నీకు భయం వేస్తుంది. నీ దోవలో ఏ చిన్న వస్తువు ఉన్నా, దానిమీద కాలువేస్తే ఎక్కడ బోల్తాపడిపోతానో అని నీకు బెదురు కలుగుతుంది. నీ జుట్టు నెరిసి, బాదం చెట్టు పూతలా కనిపిస్తుంది. నీవు కాళ్లీడ్చుకుంటూ మిడతలా నడుస్తావు. నీవు నీ కోరికను కోల్పోతావు (జీవించటానికి). అప్పుడిక నీవు నీ శాశ్వత నివాసానికి (సమాధిలోకి) పోతావు. (నీ శవాన్ని సమాధికి మోసుకెళ్తూ) విలాపకులు[b] వీధుల్లో గుమిగూడి శోకనాలు పెడతారు.

మరణం

    నీ వెండి మొలతాడు తెగక ముందే,
    బంగారు గిన్నె నలగక ముందే.
    బావి దగ్గర పగిలిన మట్టి కుండలా,
    (నీ జీవితం వృథా కాక ముందే) పగిలి బావిలో పడిపోయిన రాతి మూతలా నీ జీవితం వృథా కాకముందే
నీ యౌవనకాలంలోనే నీవు నీ సృష్టికర్తను స్మరించుకో.
మట్టిలో నుంచి పుట్టిన నీ శరీరం
    నీవు మరణించినప్పుడు తిరిగి ఆ మట్టిలోనే కలిసి పోతుంది.
కానీ, దేవుని దగ్గర్నుంచి వచ్చిన నీ ఆత్మ
    నీవు మరణించినప్పుడు తిరిగి ఆ దేవుడి దగ్గరకే పోతుంది.

అంతా వ్యర్థం, శుద్ధ అర్థరహితం. ఇదంతా కాలాన్ని వ్యర్థం చెయ్యడం అంటాడీ ప్రసంగి!

ముగింపు సలహాలు

ప్రసంగి గొప్ప జ్ఞాని. అతడు తన జ్ఞానాన్ని జనానికి బోధ చేసేందుకు వినియోగించాడు. అనేక వివేకవంతమైన బోధనలను అతడు ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేసి, జాగ్రత్తగా విభజించాడు.[c] 10 ప్రసంగి సరైన పదాలు ఎంచుకునేందుకు చాలా శ్రమించాడు. అతడు యధార్థమైన, ఆధారపడదగిన ఉపదేశాలు రచించాడు.

11 జ్ఞానుల మాటలు, జనం తమ పశువులను సరైన బాటలో నడిపేందుకు ఉపయోగించే ముల్లు కర్రల వంటివి. ఆ ఉపదేశాలు విరగని గట్టి గూటాల వంటివి. (నీకు సరైన జీవన మార్గాన్ని చూపే సరైన మార్గదర్శులుగా నీవా బోధనల పైన ఆధారపడవచ్చు) ఆ జ్ఞానోపదేశాలన్నీ ఒకే కాపరి (దేవుని) నోట నుండి వచ్చినవి. 12 అందుకని కుమారుడా, (ఆ ఉపదేశాలను అధ్యయనం చెయ్యి) అయితే ఇతర గ్రంథాలను గురించి ఒక హెచ్చరిక. రచయితలు గ్రంథాలు ఎప్పుడూ వ్రాస్తూనే ఉన్నారు. అతిగా అధ్యయనం చేయడం నీకు చాలా అలసట కలిగిస్తుంది.

13-14 సరే, ఈ గ్రంథంలోని విషయాలన్నీ చదివి మనం నేర్చుకోవలసింది ఏమిటి? మనిషి చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పనేమిటంటే, దేవుని పట్ల భయ భక్తులు కలిగివుండటం, దేవుని ఆజ్ఞలు పాటించడం. ఎందుకంటే, మనుష్యులు చేసే పనులన్నీ గుప్త కార్యాలతో బాటు దేవునికి తెలుసు. ఆయనకి మనుష్యుల మంచి పనులను గురించీ చెడ్డ పనులను గురించీ సర్వం తెలుసు. మనుష్యుల పనులేవీ దేవుని విచారణకు రాకుండా పోవు.

ఫిలేమోనుకు

యేసు క్రీస్తు కోసం ఖైదీనైన పౌలును మరియు మన సోదరుడైన తిమోతియు, మా ప్రియ జతపనివాడైన ఫిలేమోనుకు, మరియు మన సోదరి అప్ఫియకు, మనతో సహా పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ యింట్లో సమావేశమయ్యే సంఘానికి వ్రాస్తున్న సంగతులు:

మన తండ్రియైన దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని అనుగ్రహించి మీకు శాంతి ప్రసాదించు గాక!

ప్రార్థన, కృతజ్ఞత

కాబట్టి నేను ప్రార్థనలను చేసినప్పుడెల్లా నిన్ను జ్ఞాపకం పెట్టుకొని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. యేసు ప్రభువు పట్ల నీకున్న భక్తిని గురించి, భక్తులపట్ల నీకున్న ప్రేమను గురించి నేను విన్నాను. క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్గాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సోదరా! నీవు భక్తులకు సహాయం చేసి వాళ్ళను ఆనందపరిచావు. కనుక నీ ప్రేమ నాకు చాలా ఆనందమును, తృప్తిని కల్గించింది.

ఒనేసిము కొరకు విజ్ఞప్తి

క్రీస్తు పేరిట నీవు చేయవలసిన కర్తవ్యాలను ఆజ్ఞాపించగల అధికారం నాకున్నా, నేను ప్రేమతో నీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలను నేను, వయస్సు మళ్ళిన వాణ్ణిగా, యేసు క్రీస్తు ఖైదీని. 10 నా కుమారునితో సమానమైన ఒనేసిము విషయంలో నిన్ను ఒకటి వేడుకొంటున్నాను. నేను ఖైదీగా ఉన్నప్పుడు అతడు నా కుమారుడయ్యాడు. 11 గతంలో అతనివలన నీకు ఉపయోగం లేదు. కాని యిప్పుడు అతనివలన నీకూ, నాకూ, యిద్దరికీ ఉపయోగం ఉంది.

12 నా గుండెలాంటివాడైన అతణ్ణి తిరిగి నీ దగ్గరకు పంపుతున్నాను. 13 నేను సువార్త కారణంగా ఖైదీగా ఉన్నాను. ఈ సమయంలో నీ స్థానంలో అతడు నాకు సహాయం చేయాలని నా అభిలాష, కనుక అతణ్ణి నా దగ్గరే ఉంచుకోవాలనుకొన్నాను. 14 కాని నీ అనుమతి లేకుండా నేనిది చేయదలచుకోలేదు. నీవు చేసే ఈ సహాయం నా ఒత్తిడివల్ల కాకుండా నీ యిష్ట ప్రకారం చెయ్యాలని నా ఉద్దేశ్యం.

15 ఒనేసిము నీ నుండి కొంతకాలం దూరం అయ్యాడు. చిరకాలం నీ దగ్గర ఉండాలని యిలా జరిగిందేమో. 16 అతడు యిప్పుడు దాసుడు మాత్రమే కాదు. క్రీస్తును నమ్మిన మన ప్రియ సోదరుడు. అతడు నాకు చాలా దగ్గరి వాడు. తోటి మనిషిగా, ప్రభువువల్ల కలిగిన బంధంలో ఒక సోదరునిగా, అతన్ని నీవు యింకా దగ్గరివానిగా భావిస్తావు.

17 నీవు నన్ను నీ భాగస్వామిగా భావిస్తూన్నట్లయితే నాకు స్వాగతం చెప్పినట్లే, అతనికి కూడా స్వాగతం చెప్పు. 18 అతడు నీ పట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేక అతడు నీకు ఏదైనా అప్పు ఉంటే అది నా లెక్కలో వ్రాయి. 19 నేను ఆ అప్పును తీరుస్తానని పౌలు అను నేను నా స్వహస్తంతో వ్రాస్తున్నాను. కాని నీవు నీ జీవితంతో సహా నాకు బాకీ ఉన్నావని చెప్పనవసరం లేదు. 20 కనుక నా సోదరా! ప్రభువు కోసం దయచేసి నాకీ సహాయం చేయి. క్రీస్తు కారణంగా మనం సోదరులం కనుక నాకీ తృప్తి కలిగించు. 21 నీ విధేయతపై నాకు నమ్మకం ఉంది. నేను అడిగిన దానికన్నా ఎక్కువే చేస్తావని నాకు తెలుసు. అందుకే నీకు వ్రాస్తున్నాను.

22 మరొక విషయం. అతిథుల కోసం ఉంచిన గదిని నా కోసం సిద్ధంగా ఉంచు. నీ ప్రార్థలను విని దేవుడు నన్ను నీ దగ్గరకు పంపుతాడని ఆశిస్తున్నాను.

చివరి వందనాలు

23 యేసు క్రీస్తు నిమిత్తం నాతో సహా కారాగారంలో ఉన్న ఎపఫ్రా నీకు వందనాలు తెలుపమన్నాడు. 24 నాతో పని చేస్తున్న మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా కూడా నీకు వందనాలు తెలుపుతున్నారు.

25 యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International