M’Cheyne Bible Reading Plan
ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కించుట
1 సన్నిధి గుడారంలో మోషేతో యెహోవా ఇలా మాట్లాడాడు. ఇది సీనాయి అరణ్యంలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి రోజు అది, మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలందరి సంఖ్యను లెక్కించు. ప్రతి పురుషుని పేరు అతని వంశం, కుటుంబంతో పాటు జాబితా చేయి 3 ఇశ్రాయేలు పురుషులందరినీ, నీవు, అహరోను లెక్కించాలి. 20 సంవత్సరాలు, అంతకు ఎక్కువ వయస్సు ఉన్న వారిని మీరు లెక్కించాలి. (వారు ఇశ్రాయేలు సైన్యంలో ఉండదగిన వాళ్లు.) వారి వంశాల ప్రకారం వారి జాబితా చేయి. 4 ప్రతి కుటుంబము నుండి ఒక మనిషి మీకు సహాయం చేస్తాడు, ఈ మనిషి తన వంశానికి నాయకుడుగా ఉంటాడు, 5 మీతో ఉండి మీకు సహాయం చేసే పురుషుల పేర్లు ఇవి,
రూబేను వంశంనుండి – షెదేయూరు కుమారుడు ఎలీసూరు
6 షిమ్యోను వంశంనుండి – సూరీషద్దాయి కుమారుడు షెలుమీయేలు
7 యూదా వంశంనుండి అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.
8 ఇశ్శాఖారు వంశంనుండి సూయారు కుమారుడు నెతనేలు.
9 జెబూలూను వంశంనుండి హెలోను కుమారుడు ఎలీయాబు.
10 యోసేపు సంతానమందు ఎఫ్రాయిము వంశంనుండి
అమిహూదు కుమారుడు ఎలీషామాయు మనష్షే వంశంనుండి
పెదాసూరు కుమారుడు గమలీయేలు.
11 బెన్యామీను వంశంనుండి గిద్యోనీ కుమారుడు అబీదాను.
12 దాను వంశంనుండి అమీషద్దాయి కుమారుడు అహీయెజెరు.
13 ఆషెరు వంశంనుండి ఒక్రాను కుమారుడు పగీయేలు.
14 గాదు వంశంనుండి దెయూవేలు కుమారుడు ఎలాసాపు;
15 నఫ్తాలి వంశంనుండి ఏనాను కుమారుడు అహీర.”
16 ఈ పురుషులు వారి కుటుంబాలకు నాయకులు, వారి వంశాలకు నాయకులుగా కూడా, ప్రజలు ఈ పురుషులను ఏర్పటు చేసుకొన్నారు. 17-18 పేరు పేరునా ఈ పురుషులు ఏర్పరచుకోబడ్డారు. కనుక రెండవ నెల మొదటి రోజున ఈ పురుషులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే అహరోనులు పిలిచారు. అప్పుడు ప్రజలు వారి కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం జాబితా చేయబడ్డారు. 20 సంవత్సరాలు, అంతకు పై బడిన పురుషులు అంతా జాబితాలో ఉన్నారు. 19 సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్లే మోషే చేసాడు. ప్రజలు సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడే మోషే వారిని లెక్కించాడు.
20 ఇశ్రాయేలు జ్యేష్ఠకుమారుడు రూబేను యొక్క సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు లేక అంతకు ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగలిగిన పురుషులందరి పేర్లు వ్రాయబడ్డాయి. వారు వారి కుటుంబాలు, వంశాలతో కూడ జాబితాలో చేర్చబడ్డారు. 21 రూబేను సంతతినుండి లెక్కించబడిన పురుషుల సంఖ్య మొత్తం 46,500.
22 షిమ్యోను సంతతి లెక్కించబడ్డారు. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. 23 షిమ్యోను సంతతినుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 59,300.
24 గాదు సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు అంతకంటె, ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 25 గాదు సంతతి నుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 45,650.
26 యూదా సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగలిగిన పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. 27 యూదా సంతతి నుండి లెక్కించబడ్డ పురుషులు మొత్తం 74,600.
28 ఇశ్శాఖారు సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు కలిగి ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. 29 ఇశ్శాఖారు సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 54,400.
30 జెబులూను సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు వారి కుటుంబాలు, వంశాలతోబాటు జాబితాలో చేర్చబడ్డారు. 31 జెబులూను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 57,400.
32 యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. 33 ఎఫ్రాయిము సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 40,500.
34 యోసేపు కుమారుడైన మనష్షే సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 35 మనష్షే సంతతినుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 32,200.
36 బెన్యామీను సంతతి లెక్కించబడింది, 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 37 బెన్యామీను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 35,400.
38 దాను సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 39 దాను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 62,700.
40 ఆషేరు సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 41 ఆషేరు సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 41,500.
42 నఫ్తాలి సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 43 నఫ్తాలి సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 53,400.
44 ఈ పురుషులందర్నీ మోషే, అహరోను, ఇశ్రాయేలు పెద్దలు లెక్కించారు. (పన్నెండుమంది నాయకులు, ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉన్నాడు.) 45 ఇశ్రాయేలీయులలో 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగల ప్రతి పురుషుడు లెక్కించబడ్డాడు. అ పురుషులు వారి వంశాలతో బాటు లెక్కించబడ్డారు. 46 పురుషుల సంఖ్య మొత్తం 6,03,550.
47 లేవీ వంశపు కుటుంబాలు ఇశ్రాయేలీయులలో ఇతరులతో బాటు జాబితాలో లెక్కించబడలేదు. 48 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, 49 “లేవీ వంశంలోని పురుషులను నీవు లెక్కించకూడదు. ఇశ్రాయేలు ప్రజలలో ఇతరులతో భాగంగా వీరిని చేర్చకు. 50 ఒడంబడిక పవిత్ర గుడారానికి వారు బాధ్యులని లేవీ మనుష్యులతో చెప్పు. దాని విషయం, దానితోబాటు ఉండే వాటన్నింటి విషయం, వారు జాగ్రత్త తీసుకోవాలి. పవిత్ర గుడారాన్ని, దానిలో ఉండే వాటన్నింటినీ వారు మోయాలి. వారి నివాసం దాని చుట్టు ఏర్పరచుకొని, దానినిగూర్చి జాగ్రత్త తీసుకోవాలి. 51 పవిత్ర గుడారం ఎప్పుడైనా ముందుకు తీసుకుని పోదలిస్తే లేవీ మనుష్యులే అది చేయాలి. ఎప్పుడైనా సరే ఒకచోట పవిత్రగుడారం వేయబడితే, అది లేవీ మనుష్యులే వేయాలి. పవిత్ర గుడారం విషయం జాగ్రత్త తీసుకునేవారు వాళ్లే. లేవీ కుటుంబానికి చెందనివారు ఇంకెవరయినా గుడారాన్ని గూర్చి శ్రద్ధ తీసుకునేందుకు ప్రయత్నిస్తే, అతడు చంపివేయబడతాడు. 52 ఇశ్రాయేలు ప్రజలు వేరు వేరు వంశాలుగా వారి నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మనిషీ తన కుటుంబ ధ్వజానికి దగ్గరగా డేరాలు వేయాలి. 53 అయితే లేవీ ప్రజలు పవిత్ర గుడారం చుట్టూ డేరాలు వేయాలి. ఒడంబడిక పవిత్ర గుడారాన్ని లేవీ ప్రజలు కాపాడుతారు. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి కీడూ జరుగకుండా వారు పవిత్ర గుడారాన్ని కాపాడుతారు.”
54 కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విషయాలన్నింటిలో ఇశ్రాయేలీయులు విధేయులయ్యారు.
దావీదు కీర్తన.
35 యెహోవా, నా పోరాటాలు పోరాడుము
నా యుద్ధాలు పోరాడుము.
2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని,
లేచి, నాకు సహాయం చేయుము.
3 ఈటె, బరిసె తీసుకొని
నన్ను తరుముతున్న వారితో పోరాడుము.
“నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,
4 కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు.
ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము.
వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు.
వారిని ఇబ్బంది పెట్టుము.
5 ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము.
యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
6 యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము.
యెహోవా దూత వారిని తరుమును గాక!
7 నేనేమీ తప్పు చేయలేదు. కాని ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు.
నేను తప్పు ఏమీ చేయలేదు. కాని వారు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు.
8 కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము.
వారి స్వంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము.
తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
9 అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను.
ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
10 “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు.
యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు.
దోచుకొనువారినుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు”
అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబుతాను.
11 ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది.
ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు.
12 నేను మంచి పనులు మాత్రమే చేశాను.
కాని ఆ మనుష్యులు నాకు చెడ్డవాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు.
13 ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను.
ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను.
నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది.
14 ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను.
ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను.
15 అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు.
ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు.
కొందరు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు.
వాళ్లను నేను కనీసం ఎరుగను.
16 వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు.
ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.
17 నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు?
ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము.
ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.
18 యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను.
19 అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు.
నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు.
20 నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు.
శాంతియుతంగా ఉన్న ప్రజలకు చెడుపు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు.
21 నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబుతున్నారు.
వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీవేమి చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.”
22 యెహోవా, జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు.
కనుక మౌనంగా ఉండవద్దు.
నన్ను విడిచిపెట్ట వద్దు.
23 యెహోవా, మేలుకో! లెమ్ము!
నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము.
24 యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము.
ఆ మనుష్యులను నన్ను చూచి నవ్వనీయ వద్దు.
25 “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము.
“యెహోవా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము.
26 నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము.
నాకు కీడు జరిగినప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు.
తాము నాకంటె మేలైనవారము అని వారు తలంచారు.
కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను, సిగ్గుతోను నింపి వేయుము.
27 నీతిని ప్రేమించే మనుష్యులారా,
మీరు సంతోషించండి.
ఎల్లప్పుడూ ఈ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు.”
28 యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబుతాను.
నేను ప్రతి దినము స్తుతిస్తాను.
భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కో
11 నీవెక్కడకి వెళ్లినా అక్కడ మంచి పనులు చెయ్యి. కొంతకాలం గడిచాక నీ మంచి పనులనే విత్తనాలు మొలకలెత్తి పంట రూపంలో నీకు తిరిగి వస్తాయి.[a]
2 నీకున్నది వేర్వేరు వాటిమీద పొదుపు చెయ్యి.[b] ప్రపంచంలో ఏమి చెడుగులు సంభవించనున్నాయో నీకు తెలియదు.
3 (నీవు ఖచ్చితంగా తెలుసుకోగలిగిన విషయాలు కొన్ని వున్నాయి.) మేఘాలు నీళ్లతో నిండివుంటే, అవి నేలపై వర్షిస్తాయి. చెట్టు నేలపైన కూలితే కూలినది ఉత్తరానికైనా, దక్షిణానికైనా అది పడ్డచోటునే వుంటుంది.
4 (అయితే, కొన్ని విషయాలు నీవు ఖచ్చితంగా తెలుసుకోలేవు. అలాంటప్పుడు, నీవు సాహసించి ఏదో ఒకటి చెయ్యాలి.) మంచి వాతావరణం పరిస్థితులకోసం ఎదురు చూసేవాడు ఎన్నడూ తన విత్తనాలు చల్లలేడు. ప్రతి మేఘమూ వర్షించేస్తుందని భయపడేవాడు తన పంట కుప్పలు ఎన్నడూ నూర్చుకోలేడు.
5 గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన తల్లి గర్భంలో ఎలా పెరుగుతుందో నీకు తెలియదు. అలాగే, దేవుడు యేమి చేస్తాడో నీకు తెలియదు, కాని, అన్నీ జరిపించేది ఆయనే.
6 అందుకని, ప్రొద్దుటే నాట్లు వెయ్యడం మొదలెట్టు. సాయంత్రమయ్యేదాకా పని చాలించకు. ఎందుకంటే, ఏవి నిన్ను సంపన్నుని చేస్తాయో నీకు తెలియదు. ఏమో, నీ పనులు అన్నీ జయప్రదమవుతాయేమో.
7 బ్రతికి ఉండటం మంచిది! సూర్యకాంతి కళ్లకి యింపు గొలుపుతుంది. 8 నీవు ఎంత కాలం జీవించినా, నీ జీవితంలో ప్రతి ఒక్క రోజునూ అనుభవించు. అయితే, ఏదో ఒక రోజున నీవు మరణించక తప్పదని గుర్తుంచుకో. నీ జీవిత కాలంకంటె, నీ మరణానంతర కాలం చాలా ఎక్కువ. నీవు మరణించాక, నీవు చెయ్యగలిగినది శూన్యం, ఏమీ ఉండదు.
నీయౌవ్వన కాలంలోనే దేవుని సేవచెయ్యి
9 అందుకని, యువజనులారా, మీ యౌవ్వన కాలంలోనే మీరు సుఖాలు అనుభవించండి. ఆనందంగా ఉండండి! మీ మనస్సుకి ఏది తోస్తే, మీరు ఏది కోరుకుంటే అది చెయ్యండి. అయితే, మీరు చేసే పనులన్నింటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తాడని మాత్రం మరిచిపోకండి. 10 మీ కోపానికి మీరు లొంగిపోకండి. మీ శరీరం మిమ్మల్ని పాప మార్గాన నడపకుండా చూసుకోండి.[c] ప్రజలు జీవిత ప్రారంభ దశలో తాము యౌవనస్థులుగా ఉన్నప్పుడు తెలివిలేని పనులు చేస్తారు.
విశ్వాసులు చేయవలసిన విధులు
3 పాలకులు, అధికారులు ఆజ్ఞాపించినట్లు నడుచుకోమని ప్రజలకు జ్ఞాపకం చేయి. విధేయతగా ఉండమని, సత్కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉండమని బోధించు. 2 ఇతర్లను దూషించకుండా శాంతిని, మంచితనాన్ని అలవర్చుకోమని, అందరిపట్ల దయ చూపమని బోధించు.
3 గతంలో మనం కూడా మూర్ఖంగా, అవిధేయంగా ఉంటిమి. తప్పులు చేస్తూ, మానసిక వాంఛలకు, సుఖాలకు లోనై, అసూయతో యితర్ల చెడును కోరుతూ, ద్వేషిస్తూ, ద్వేషింపబడుతూ జీవించాము. 4 అలాంటి సమయంలో మన రక్షకుడైనటువంటి దేవుని దయ, ప్రేమ మనకు కనిపించాయి. 5 మనం నీతికార్యాలు చేసినందుకు ఆయన మనలను రక్షించలేదు కాని తన కృప ద్వారానే మనల్ని పవిత్రపరచి, మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ పునర్జన్మ కల్గించాడు. క్రొత్త జీవితాన్నిచ్చి, మనల్ని రక్షించాడు. 6 పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ధారాళంగా మనపై కురిపించాడు. 7 ఆయన అనుగ్రహం వల్ల మనం నీతిమంతులంగా వారసులం కావాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విధంగా మనమాశిస్తున్న అనంత జీవితం పొందగలుగుతాము. 8 ఇది నిజం. నీవు ఈ విషయాన్ని నొక్కి చెప్పాలి.
అలా చేస్తే దేవుణ్ణి విశ్వసించినవాళ్ళు జాగ్రత్తగా ఉండి, మంచి చేయటంలో నిమగ్నులౌతారు. ఇది మంచిది. దాని వలన ప్రజలకు లాభం కలుగుతుంది.
9 కాని మూర్ఖంగా వాదించేవాళ్ళకు, వంశ చరిత్రల్ని చర్చించేవాళ్ళకు, ధర్మశాస్త్రాన్ని గురించి వాదించేవాళ్ళకు, పోట్లాడేవాళ్ళకు దూరంగా ఉండు. అలాంటి చర్చలవల్ల ఉపయోగమేమీ ఉండదు. వాటివల్ల లాభం కలుగదు. 10 చీలికలు కలిగించేవాణ్ణి ఒకటి రెండు సార్లు గద్దించు. ఆ తర్వాత అతనితో సంబంధం తెంపుకో. 11 అలాంటివాడు దుర్మార్గుడని, పాపి అని నీకు బాగా తెలుసు. అతడు తనకు తాను శిక్ష విధించుకొన్నాడు.
చివరి మాట
12 అర్తెమానును, తుకికును నీ దగ్గరకు పంపిన తక్షణం నీవు నికొపొలికి వచ్చి నన్ను కలుసుకో. ఈ చలికాలం నేనక్కడ గడపదలిచాను. 13 న్యాయవాది జేనా, అపొల్లోల ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళకు సహాయం చెయ్యి. 14 మనవాళ్ళు సత్కార్యాలు చేయటానికి నేర్చుకొని వాటిలో నిమగ్నులై ఉండాలి. తమ నిత్యావసరాలకు కావలిసినవి సంపాదించుకోవాలి. వ్యర్థంగా జీవించకూడదు.
15 నాతో ఉన్నవాళ్ళు నీకు వందనాలు తెలుపుతున్నారు. విశ్వాసం మూలంగా మన స్నేహితులైనవాళ్ళకు నా శుభాకాంక్షలను తెలుపుము.
మీ అందరిపై దేవుని కృప ఉండునుగాక!
© 1997 Bible League International