M’Cheyne Bible Reading Plan
దేవుని పట్ల విధేయులకు బహుమానాలు
26 “మీకోసం మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు. విగ్రహాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని నిలబెట్టవద్దు. మీరు మొక్కేందుకు మీ దేశంలో రాతి విగ్రహాలను నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే, నేను మీ దేవుణ్ణి, యెహోవాను.
2 “నా ప్రత్యేక విశ్రాంతి రోజుల్ని జ్ఞాపకం ఉంచు కొని, నా పవిత్ర స్థలాన్ని గౌరవించండి. నేను యెహోవాను.
3 “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులు అవ్వండి. 4 వాటిని మీరు జరిగిస్తే, నేను మీకు సకాలంలో వర్షాలు కురిపిస్తాను. భూమి పంటను యిస్తుంది, పొలంలో చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి. 5 ద్రాక్షాపండ్ల కోతకాలం వచ్చేంతవరకు మీరు గానుగ పట్టడం కొనసాగుతుంది. మీరు మళ్ళీ మొక్కలు నాటడం మొదలు పెట్టేంతవరకు మీరు ద్రాక్షాపండ్లు కూర్చుకోవటం కొనసాగుతుంది. అప్పుడు మీరు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మరియు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు. 6 నేను మీ దేశానికి శాంతిని ప్రసాదిస్తున్నాను. మీరు ప్రశాంతంగా పండుకొంటారు. ఎవరూ మిమ్మల్ని భయపెట్టేందుకు రారు. హానికరమైన జంతువులను నేను మీ దేశానికి దూరంగా ఉంచుతాను. మరియు సైన్యాలు మీ దేశం గుండా వెళ్లజాలవు.
7 “మీరు మీ శత్రువులను తరిమి, వారిని ఓడిస్తారు. మీరు మీ ఖడ్గంతో వారిని చంపుతారు. 8 మీలో అయిదుగురు 100 మందిని తరుముతారు, మీలో 100 మంది 10,000 మందిని తరుముతారు. మీరు మీ శత్రువులను ఓడించి, మీ ఖడ్గంతో వారిని చంపేస్తారు.
9 “అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. మీకు అధికంగా సంతానం కలుగనిస్తాను. మీతో నా ఒడంబడికను నేను నిలబెడతాను. 10 ఒక సంవత్సరం కంటె ఎక్కువ కాలానికి సరిపోయేంత పంట మీకు ఉంటుంది. మీరు కొత్త పంట కోసుకొంటారు. అయితే కొత్త పంట నిల్వ చేయటానికి స్థలం కావాలి గనుక పాత పంటను పారవేయాల్సి ఉంటుంది. 11 నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను. 12 నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు. 13 నేను యెహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారుగాని నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాను. బానిసలుగా భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. అయితే మీ భుజాలమీద కాడిని నేను విరుగగొట్టేస్తాను. నేను మిమ్మల్ని మరల తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తాను!
అవిధేయతకు దేవుని శిక్ష
14 “అయితే మీరు నాకు విధేయులు కాకుండా, నా ఆజ్ఞలన్నింటినీ పాటించకుండా ఉంటే, అప్పుడు మీకు ఈ కీడులన్నీ జరుగుతాయి. 15 నా ఆజ్ఞలు, నియమాలు పాటించడానికి మీరు నిరాకరిస్తే, మీరు నా ఒడంబడికను ఉల్లంఘించినట్టే. 16 మీరు గనుక అలా చేస్తే అప్పుడు భయంకరమైన సంగతుల్ని మీకు సంభవింపజేస్తాను. నేను మీకు రోగం, జ్వరం వచ్చేటట్టు చేస్తాను. అవి మీ కళ్లను పాడుచేసి, మీ ప్రాణాల్ని తీస్తాయి. మీరు విత్తనాలు జల్లినప్పుడు ఫలితం ఉండదు. మీ శత్రువులు మీ పంటను తినివేస్తారు. 17 నేను మీకు విరోధంగా ఉంటాను గనుక మీ శత్రువులు మిమ్మల్ని ఓడిస్తారు. ఆ శత్రువులు మిమ్మల్ని ద్వేషించి, మీ మీద అధికారం చేస్తారు. ఎవరూ మిమ్మల్ని తరమకుండానే మీరు పారిపోతారు.
18 “ఇవన్నీ జరిగినా మీరు నాకు విధేయులు కాకపోతే, మీ పాపాలకోసం నేను మిమ్మల్ని ఏడంతలుగా శిక్షిస్తాను. 19 మీకు అతిశయ కారణమైన మీ గొప్ప పట్టణాలను నేను కూలగొట్టేస్తాను. ఆకాశం వర్షాన్ని ఇవ్వదు, భూమి పంటనివ్వదు. 20 మీరు కష్టపడి పనిచేస్తారు, కాని దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ భూమి పంటలేమీ ఇవ్వదు, మీ చెట్లు వాటి ఫలాలను ఇవ్వవు.
21 “మీరు ఇంకా నాకు వ్యతిరేకంగా తిరిగి, నాకు విధేయులయ్యేందుకు తిరస్కరిస్తే, అప్పుడు ఇంకా ఏడు రెట్లు కఠినంగా నేను మిమ్మల్ని కొడతాను. మీరు ఎక్కువ పాపం చేసినకొద్దీ, మరింత ఎక్కువగా శిక్షించబడతారు. 22 నేను మీ మీదికి అడవి మృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను మీ దగ్గరనుండి లాక్కొనిపోతాయి. అవి మీ పశువుల్ని నాశనం చేస్తాయి. అవి మీ సంఖ్యను క్షీణింప చేస్తాయి. రహదారులు ఖాళీగా ఉంటాయి గనుక ప్రయాణం చేయటానికి ప్రజలు భయపడతారు.
23 “అన్ని జరిగినా మీరు పాఠం నేర్చుకోకపోతే, ఇంకా అప్పటికీ నాకు మీరు విరుద్ధంగా తిరిగితే, 24 అప్పుడు నేను కూడా మీకు విరుద్ధంగా తిరుగుతాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను. 25 మీరు నా ఒడంబడికను ఉల్లంఘించారు కనుక నేను మిమ్మల్ని శిక్షిస్తాను. సైన్యాలను నేను మీమీదికి రప్పిస్తాను. భద్రతకోసం మీరు మీ పట్టణాల్లోకి పారిపోతారు. కాని నేను మీ మధ్య వ్యాధుల్ని వ్యాపింప జేస్తాను. అప్పుడు మీ శత్రువు మిమ్మల్ని ఓడించేస్తాడు. 26 ఆ పట్టణంలో మిగిలిపోయిన ధాన్యంలో కొంత భాగం నేను మీకు ఇస్తాను. కానీ తినేందుకు బహుకొంచెం మాత్రమే ఆహారం ఉంటుంది. వారి భోజనాన్ని అంతా ఒక్క పాత్రలో పదిమంది ఆడవాళ్లు వండగలుగుతారు. ఆ భోజనం ముద్దలు ఒక్కొక్కదాన్ని వారు లెక్కబెట్టగలుగుతారు. మీరు తింటారు గాని మీ ఆకలి తీరదు.
27 “మీరు ఇంకా నా మాట వినకపోతే, ఇంకా నాకు విరోధంగా ఉంటే 28 అప్పుడు నేను నిజంగా నా కోపం చూపిస్తాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను. 29 మీ కుమారులు, కుమార్తెల శరీరాల్ని మీరు తింటారు. 30 మీ ఉన్నత స్థలాలను నేను నాశనం చేస్తాను. మీ ధూప వేధికలను నేను పడగొట్టేస్తాను. మీ శవాలను మీ విగ్రహాల శవాల మీద నేను పడవేస్తాను. మీరు నాకు చాలా అసహ్యంగా ఉంటారు. 31 మీ పట్టణాలను నేను నాశనం చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాన్ని నేను శూన్యం చేస్తాను. మీ అర్పణల సువాసన నేను ఆఘ్రాణించను. 32 మీ పట్టణాల్లో నివసించేందుకు వచ్చే మీ శత్రువులు చూచి అదిరి పోయేంతగా మీ దేశాన్ని నేను ఖాళీ చేస్తాను. 33 ఇంకా నేను మిమ్మల్ని రాజ్యాల్లో చెదరగొట్టేస్తాను. నేను నా ఖడ్గం దూసి, మిమ్మల్ని నాశనం చేస్తాను. మీ దేశం శూన్యంగాను, మీ పట్టణాలు చెత్తగాను ఉంటాయి.
34 “మిమ్మల్ని మీ శత్రువులు తమ దేశానికి తీసుకొని పోతారు. మీ దేశం ఖాళీ అయిపోతుంది. అందుచేత మీ భూమికి చివరికి విశ్రాంతి లభిస్తుంది. భూమి దాని విశ్రాంతిని అనుభవిస్తుంది. 35 ఏడేండ్లకు ఒకసారి ఒక సంవత్సరం పాటు భూమికి విశ్రాంతి ఉండాలని ఆజ్ఞ ప్రబోధిస్తుంది. మీరు దానిలో నివసించినప్పుడు దానికి మీరు ఇవ్వని విశ్రాంతిని, భూమి ఖాళీగా ఉన్న ఆ సమయంలో అది పొందుతుంది. 36 శేషించిన ప్రజలు వారి శత్రు దేశంలో ధైర్యం కోల్పోతారు. ప్రతిదానికీ వారు భయపడిపోతారు. గాలికి కొట్టుకొని పోయే ఆకులా వారు అటుఇటు పరుగులెత్తుతారు. ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టు వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమక ముందే వారు పడిపోతారు. 37 ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టుగా వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమకుండానే వారు ఒకరిమీద ఒకరు కూలిపోతారు.
“మీరు మీ శత్రువులను ఎదిరించి నిలిచే అంతటి బలం మీకు ఉండదు. 38 ఇతర దేశాల్లో తప్పిపోతారు. మీ శత్రుదేశాల్లోనికి మీరు అదృశ్యమవుతారు. 39 కనుక మిగిలిన వాళ్లు వారి పాపంవలన వారి శత్రుదేశంలో క్షీణించిపోతారు. వారు కూడా వారి పూర్వీకులవలెనే, వారి పాపంవలన క్షీణించిపోతారు.
నిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది
40 “అయితే ఒకవేళ ప్రజలు వారి పాపాలు ఒప్పుకొంటారేమో. వారు, వారి పూర్వీకుల పాపాలు ఒప్పు కొంటారేమో. ఒకవేళ వారు నాకు విరోధంగా తిరిగినట్టు ఒప్పుకోవచ్చు. ఒకవేళ వారు నాకు విరోధంగా పాపం చేసినట్టు ఒప్పుకోవచ్చు. 41 ఒకవేళ నేను వారికి విరోధంగా తిరిగి వారి శత్రుదేశంలోనికి నేనే వాళ్ళను తీసుకొని పోయినట్టు వారు ఒప్పుకోవచ్చు. ఆ ప్రజలు నన్ను ఎరుగని వాళ్లలా ప్రవర్తించారు. వాళ్లు తగ్గించు కొని, వారి పాపపు శిక్షను స్వీకరిస్తే 42 అప్పుడు యాకోబుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఇస్సాకుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. అబ్రాహాముతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ దేశాన్ని నేను జ్ఞాపకం చేసుకొంటాను.
43 “ఈ దేశం ఖాళీ అవుతుంది. భూమి దాని విశ్రాంతి సమయాన్ని అనుభవిస్తుంది. అప్పుడు మిలిగిన వాళ్లు వారి పాపపు శిక్షను అంగీకరిస్తారు. వారు నా ఆజ్ఞలను ద్వేషించి, నా నియమాలను విధేయులయ్యేందుకు నిరాకరించినందువల్లే వారు శిక్ష పొందినట్టు వారు గ్రహిస్తారు. 44 వాస్తవంగా వారు పాపం చేసారు. అయితే సహాయంకోసం వారు నా దగ్గరకు వస్తే, నేను వారినుండి తిరిగిపోను. వారు వారి శత్రువుల దేశంలో ఉన్నప్పుటికీ నేను వారి మొర అలకిస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చెయ్యను. వారితో నా ఒడంబడికను తెగతెంపులు చేయను. నేను యెహోవాను, వారి దేవుణ్ణి. 45 వారి పూర్వీకులతో నాకుగల ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నేను వారికి దేవునిగా ఉండేందుకు నేను వారి పూర్వీకుల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. ఇతర రాజ్యాలు వాటన్నింటినీ చూసాయి. నేను యెహోవాను!”
46 అవి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన చట్టాలు, నియమాలు, ప్రబోధాలు. యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఆ ఆజ్ఞలే ఒక ఒడంబడిక. సీనాయి పర్వతం దగ్గర ఆ ఆజ్ఞలను యెహోవా ఇచ్చాడు. ఆయన వాటిని మోషేకు ఇవ్వగా, మోషే వాటిని ప్రజలకు యిచ్చాడు.
33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
3 ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
4 దేవుని మాట సత్యం!
ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
5 నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
చావు న్యాయమైనదేనా?
9 నేనీ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించాను. సజ్జనులు, వివేకవంతులు చేసేవాటినీ, వాళ్లకు సంభవించేవాటినీ దేవుడు అదుపుచేస్తాడన్న విషయం నేను గమనించాను. తాము ప్రేమించబడతారో లేక ద్వేషింప బడతారో మనుష్యులకి తెలియదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనుష్యులకి తెలియదు.
2 అయితే, మనుష్యులందరికీ ఉమ్మడి అంశం ఒకటుంది మనుష్యులందరూ మరణించడమే అది! మంచివాళ్లూ మరణిస్తారు, చెడ్డవాళ్లూ మరణిస్తారు. చావు పరిశుద్ధులకీ వస్తుంది అపరిశుద్ధులకీ వస్తుంది. చావు బలులు ఇచ్చేవాళ్లకీ వస్తుంది, ఇవ్వనివాళ్లకీ వస్తుంది. పాపి ఎలా చనిపోతాడో, మంచివాడూ సరిగ్గా అలాగే చనిపోతాడు. దేవునికి ప్రత్యేకమైన ప్రమాణాలు చేసేవాళ్లూ ఆ ప్రమాణాలు చెయ్యనివాళ్ల మాదిరిగానే చనిపోతారు.
3 ఈ జీవితంలో సంభవించే వాటన్నింట్లోనూ పరమ దౌర్భాగ్యమైనదేమిటంటే, అందరూ ఒకేలాగ గతించడమే. అయితే, మనుష్యులు ఎల్లప్పుడూ పాపపు ఆలోచనలూ, మూర్ఖపు ఆలోచనలూ చేస్తూ వుంటారు, ఇది చాలా చెడ్డది. ఆ ఆలోచనలు మరణానికి దారితీస్తాయి. 4 మనిషి ఇంకా బ్రతికివుంటే, అతను ఎవరైనా సరే,, అతనికి ఆశ ఉంటుంది. అయితే, ఈ నానుడి నిజం!
చచ్చిన సింహం కంటె, బతికివున్న కుక్క మేలు.
5 బ్రతికివున్న మనుష్యులకి తాము చనిపోతామన్న విషయం తెలుసు. అయితే చనిపోయిన మనుష్యులకి యేమీ తెలియదు. చనిపోయినవాళ్లకి యిక యే ప్రతిఫలము ఉండదు. జనం వాళ్లని త్వరలోనే మరచిపోతారు. 6 ఒక వ్యక్తి చనిపోయాక, అతని ప్రేమ, ద్వేషం, ఈర్ష్య అన్నీ అంతరించిపోతాయి. చనిపోయినవాళ్లు భూమిమీద జరిగే వేటిలోనూ ఏమీ, ఎన్నడు ఇక పాలుపంచుకోలేరు.
నీకు సాధ్యమైనప్పుడే జీవితాన్ని అనుభవించు
7 అందుకని, పో, పోయి తిండి తిను, దాంట్లోని ఉల్లాసాన్ని అనుభవించు. నీ ద్రాక్షారసం సేవించి, ఆనందం పొందు. ఈ పనులు దేవుని దృష్టిలో తప్పేమీ కావు. 8 చక్కటి దుస్తులు ధరించి, నిన్ను నీవు బాగా కనిపించేలా చూసుకో. 9 నీవు ప్రేమించే భార్యతో సుఖం అనుభవించు. నీ స్వల్పకాలిక జీవితంలో ప్రతి ఒక్క రోజునూ సుఖంగా గడుపు. దేవుడు నీకీ భూమిమీద ఈ స్వల్ప జీవితాన్ని ఇచ్చాడు, నీకున్నదంతా ఇంతే. అందుకని, నీవు ఈ జీవితంలో చేయవలసిన పనిని సరగాదా చెయ్యి. 10 నీకు పని దొరికిన ప్రతి సారి, నీవు దాన్ని నీ శాయశక్తులా అత్యుత్తమంగా చెయ్యి. సమాధిలో పనేమీ ఉండదు. అక్కడ ఆలోచన, జ్ఞానం, వివేకం ఏ ఒక్కటి ఉండదు. మనందరి గమ్యమూ ఆ మృత్యు స్థానమే.
ఈ జీవన పోరాటం అగమ్య గోచరం
11 ఈ ప్రపంచంలో నేను చూసిన సక్రమం కాని విషయాలు ఇంకా ఉన్నాయి: అతి వేగంగా పరిగెత్తేవాడు పరుగు పోటీలో ఎల్లప్పుడూ గెలవలేడు. అత్యంత బలీయమైన సైన్యమైనా యుద్ధంలో ఎల్లప్పుడూ గెలవలేదు. మిక్కిలి వివేకవంతుడు కూడా తాను సంపాదించిన ఆహారాన్ని ఎల్లప్పుడూ పొందలేడు. మిక్కిలి చురుకైనవాడు కూడా సంపదను ఎల్లప్పుడూ సాధించుకోలేడు. విద్యావంతుడికైనా ఎల్లప్పుడూ తనికి యోగ్యమైన ప్రశంస లభ్యంకాదు. చెడు కాలము దాపురించినప్పుడు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి.
12 తనకు మరు క్షణంలో ఏమి జరగనున్నదో మనిషికి ఎన్నడూ తెలియదు. మనిషి వలలో చిక్కిన చేపలాంటివాడు. ముందేమి జరగబోతున్నదీ ఆ చేపకి తెలియదు. అతను పంజరంలో చిక్కిన పక్షిలాంటివాడు, ఆ పక్షికి ముందేమి జరగనున్నది తెలియదు. అదే విధంగా, మనిషి కూడా తనకి ఆకస్మికంగా సంభవించే కీడుల బోనులో చిక్కుకుంటాడు.
జ్ఞాన శక్తి
13 ఈ భూమిమీద ఒక వ్యక్తి వివేకవంతమైన ఒక పని చెయ్యడం కూడా నేను చూశాను. అది చాలా ముఖ్యమైన పని అని నాకు అనిపించింది. 14 స్వల్ప జనాభా కలిగిన ఒక చిన్న పట్టణం వుంది. ఒక గొప్ప రాజు ఆ పట్టణం మీదకి దండెత్తి, దాని చుట్టూ తన సేనలను నిలిపాడు. 15 కాని, ఆ పట్టణంలో ఒక జ్ఞాని వున్నాడు. ఆ జ్ఞాని పేదవాడు. అయితే, అతను తన జ్ఞానాన్ని తన పట్టణాన్ని కాపాడేందుకు వినియోగించాడు. అన్నీ ముగిసిపోయాక, జనం అతన్ని గురించి మరచిపోయారు. 16 అయినప్పటికీ, ఆ జ్ఞానం ఆ బలం కంటె మెరుగైనదని నేనంటాను. ఆ జనం ఆ పేదవాని జ్ఞానం గురించి మరిచిపోయారు. అతని మాటలను ఆ జనం పట్టించుకోవడం మానేశారు. (అయినా కూడా ఆ జ్ఞానం మెరుగైనదని నేను నమ్ముతాను.)
1 దేవుని సేవకుడును, యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడును అయినటువంటి పౌలు వ్రాయుచున్న పత్రిక. దేవుడు తానెన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని దృఢపరచడానికి, వాళ్ళను భక్తి కల్గించే మన సత్యం వైపు మళ్ళించటానికి నన్ను ఎన్నుకొన్నాడు. 2 ఈ సత్యం, అనంత జీవితం లభిస్తుందని విశ్వసించటంపై ఆధారపడి ఉంది. అబద్ధం ఆడని దేవుడు మనకీ జీవితం యిస్తానని కాలానికి ముందే వాగ్దానం చేసాడు. 3 సరియైన సమయానికి దాన్ని తన సందేశం ద్వారా మనకు తెలియచేసాడు. ఈ సందేశం నాకప్పగింపబడింది. మన రక్షకుడైనటువంటి దేవుడు దాన్ని మీకు ప్రకటించమని ఆజ్ఞాపించాడు. కనుక దాన్ని మీకు ప్రకటిస్తున్నాను.
4 మనలో ఉన్న విశ్వాసం మూలంగా నా ప్రియ కుమారునిగా భావిస్తున్న తీతుకు వ్రాయటమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన రక్షకుడైన యేసు క్రీస్తునుండి నీకు శాంతి, కృప లభించుగాక!
క్రేతులో తీతు చేయవలసిన పని
5 అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను. 6 క్రీస్తు సంఘంలోనున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక, అవినీతిగా ఉండక, చెడ్డపేరు లేకుండా, విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి. 7 సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు. 8 అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి. 9 తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించనివాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.
10 తాము అవిధేయతగా ఉంటూ, అధికంగా మాట్లాడి నమ్మించాలని ప్రయత్నించే మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సున్నతి అవసరమని వాదించే యూదులు ఈ విధంగా చేస్తున్నారు. 11 అన్యాయంగా లాభం గడించటానికి బోధించరాని విషయాలు బోధించి కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఆపటం అవసరం. 12 “క్రేతీయులు అబద్ధాలాడుతున్నారనీ, క్రూర మృగాల్లాంటివాళ్ళనీ, సోమరిపోతులనీ, తిండి పోతులనీ” క్రేతీయులలో ప్రవక్తలలో ఒకడు అన్నాడు. 13 ఈ సాక్ష్యము నిజము. వాళ్ళను గట్టిగా వారించటం అవసరం. అలా చేస్తే, వాళ్ళ విశ్వాసం దృఢమౌతుంది. 14 అప్పుడు వాళ్ళు యూదుల కల్పిత కథలను మరిచిపోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను లెక్క చెయ్యరు.
15 పవిత్రంగా ఉన్నవాళ్ళకు అన్నీ పవిత్రంగా కనిపిస్తాయి. కాని దుష్టులకు, విశ్వాసం లేనివాళ్ళకు ఏదీ పవిత్రంగా కనిపించదు. వాళ్ళ బుద్ధులు, మనస్సులు చెడుతో నిండి ఉంటాయి. 16 వాళ్ళు తమకు దేవుని గురించి తెలుసునంటారు కాని, వాళ్ళ ప్రవర్తన ఆ దేవుణ్ణి నిరాకరిస్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళు ద్వేషంతో, అవిధేయతతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పని చేయటానికి అంగీకరించరు.
© 1997 Bible League International