M’Cheyne Bible Reading Plan
భూమికి విశ్రాంతి సమయం
25 సీనాయి కొండ దగ్గర యెహోవా మోషేతో మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. ఆ సమయంలో మీరు భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయాన్ని కేటాయించాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ఒక ప్రత్యేక సమయంగా ఉంటుంది. 3 ఆరు సంవత్సరాలు మీరు మీ భూమిలో విత్తనాలు చల్లుకోవాలి. మీ ద్రాక్షా తోటల్లోని తీగెలను ఆరు సంవత్సరాలు మీరు కత్తిరించుకొంటూ, దాని ఫలాన్ని కూర్చుకోవాలి. 4 అయితే ఏడో సంవత్సరం మీరు భూమిని విశ్రాంతి తీసుకోనివ్వాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉంటుంది. మీరు మీ పొలాల్లో విత్తనాలు చల్లకూడదు లేక మీ ద్రాక్షాతోటల్లో తీగలను కత్తిరించకూడదు. 5 మీ పంట కోత అయిపోయిన తర్వాత వాటంతట అవే పెరిగే పంటను మీరు కోయకూడదు. కత్తిరించ బడని ద్రాక్షాతీగెలనుండి ద్రాక్షా పండ్లను మీరు కూర్చగూడదు. భూమికి అది విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది.
6 “భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది గాని మీకు మాత్రం యింకా సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ ఆడ, మగ సేవకులందరికీ సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ కూలి వాళ్లకు, మీ దేశంలో నివసించే విదేశీయులకు ఆహారం ఉంటుంది. 7 మీ పశువులు, ఇతర జంతువులు తినేందుకు సరిపడినంత ఆహారం ఉంటుంది.
ఉత్సవ కాలము-విమోచన సంవత్సరం (50వ సంవత్సర పండుగ కాలం)
8 “ఏడేసి సంవత్సరాల చొప్పున ఏడు ఏడుల సంవత్సరాలనుకూడ మీరు లెక్కించాలి. అది 49 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో దేశంలో ఏడు సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది. 9 ప్రాయశ్చిత్తం రోజున పొట్టేలు కొమ్మును మీరు ఊదాలి. అది ఏడో నెల పదోరోజు. పొట్టేలు కొమ్మును మీరు దేశ వ్యాప్తంగా ఊదాలి. 10 50వ సంత్సరాన్ని మీరు ఒక ప్రత్యేక సంవత్సరంగా చేయాలి. మీ దేశంలో నివసించే మనుష్యులందరికీ మీరు స్వతంత్రం ప్రకటించాలి. ఇది బూరధ్వని చేసే మహోత్సవ కాలం అని పిలువబడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. మరియు మీలో ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి తిరిగి వెళ్లాలి. 11 50వ సంవత్సరం మీకు ప్రత్యేక సంబరంగా వుంటుంది. ఆ సంవత్సరములో విత్తనాలు చల్లవద్దు. వాటంతట అవే మొలిచే మొక్కల్ని కోయవద్దు. కత్తిరించబడని ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపండ్లు కూర్చవద్దు. 12 అది బూరధ్వని చేసే 50వ సంవత్సర పండుగ మహోత్సవ కాలం. అది మీకు పవిత్ర సమయంగా ఉంటుంది. పొలంనుండి వచ్చే పంటలను మీరు తినాలి. 13 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ప్రతి వ్యక్తీ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి.
14 “నీ పొరుగువానికి మీ భూమిని అమ్మినప్పుడు నీవు అతనికి మోసం చేయవద్దు. మరియు నీవు అతని వద్ద భూమిని కొన్నప్పుడు అతడ్ని నిన్ను మోసం చేయనీయకు. 15 నీ పొరుగువాని భూమిని నీవు కొనాలనుకొన్నప్పుడు, గడచిన బూరధ్వని చేసే మహోత్సవ కాలంనుండి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కచూచి, దాన్ని బట్టి ధర నిర్ణయం చేయాలి. ఒకవేళ నీవు భూమి అమ్మితే, పంటలు కోసిన సంవత్సరాలు లెక్కించి, ఆ లెక్క ప్రకారం ధర నిర్ణయించాలి. 16 చాలా సంవత్సరాలు ఉంటే, ఖరీదు ఎక్కువ ఉంటుంది. సంవత్సరాలు తక్కువ ఉంటే ఖరీదు తగ్గించాలి. ఎందుచేతనంటే నీ పొరుగువాడు నిజానికి కొన్ని పంటలు మాత్రమే నీకు అమ్ముతున్నాడు. వచ్చే ఉత్సవంలో ఆ భూమి తిరిగి అతని కుటుంబ పరం అవుతుంది. 17 మీరు ఒకరికి ఒకరు మోసం చేయకూడదు. మీ దేవుణ్ణి మీరు ఘనపర్చాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి.
18 “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు. 19 మరియు భూమి మీకు మంచి పంటను ఇస్తుంది. అప్పుడు మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు దేశంలో క్షేమంగా ఉంటారు.
20 “కానీ ఒకవేళ మీరు, ‘మేము విత్తనాలు చల్లి, పంట కూర్చుకొనకపోతే ఏడో సంవత్సరం తినేందుకు మాకు ఏమీ ఉండదు అనవచ్చు.’ 21 చింతపడకండి. ఆరవ సంవత్సరంలో నా ఆశీర్వాదాలు మీకు లభించేటట్టుగా నేను ఆజ్ఞాపిస్తాను. భూమి మూడు సంవత్సరాల పాటు పంట ఇస్తూనే ఉంటుంది. 22 ఎనిమిదో సంవత్సరంలో మీరు నాట్లు వేసినప్పుడు, మీరు యింకా పాత పంటనే తింటూ ఉంటారు. ఎనిమిదో సంవత్సరంలో మీరు నాటిన పంట చేతికి అందేవరకు, అంటే తొమ్మిదో సంవత్సరం వరకు పాత పంటనే తింటూ ఉంటారు.
ఆస్తి నియమాలు
23 “వాస్తవానికి భూమి నాది. అందుచేత మీరు దాన్ని శాశ్వతంగా అమ్మజాలరు. మీరు కేవలం నాతో, నా భూమి మీద నివసిస్తున్న యాత్రికులు, విదేశీయులు. 24 మనుష్యులు వారి భూమిని అమ్మివేయ వచ్చును కానీ ఎల్లప్పుడూ ఆ భూమి తిరిగి ఆ కుటుంబానిదేఅవుతుంది. 25 మీ దేశంలో ఒక వ్యక్తి చాల నిరుపేద కావచ్చును. అతడు తన ఆస్తి అమ్ముకోవాల్సినంత పేదవాడై పోవచ్చును. కనుక అతని రక్తసంబంధీకులు వచ్చి తమ బంధువుకోసం ఆ ఆస్తిని కొనాలి. 26 తన భూమిని తిరిగి తనకోసం కొనేందుకు ఒకనికి రక్తసంబంధి ఎవరూ లేక పోవచ్చును. అయితే తన భూమిని తనకోసం కొనేందుకు కావలసినంత డబ్బు సంపాదించవచ్చు. 27 అప్పుడు అతడు భూమి అమ్మివేసి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్క పెట్టాలి. ఆ లెక్కను ఉపయోగించి ఆ భూమి ధర నిర్ణయం చేయాలి. అప్పుడు అతడు ఆ భూమిని తిరిగి కొనుక్కోవాలి. ఆ భూమి మరల అతని ఆస్తి అవుతుంది. 28 అయితే ఈ వ్యక్తి ఆ భూమిని తిరిగి తనకోసం కొనేందుకు సరిపడినంత డబ్బు అతని వద్ద లేకపోతే, అతడు అమ్మి వేసిన భూమి, వచ్చే బూరధ్వని చేసే మహోత్సవకాలం వరకు దానిని కొన్న వారి స్వాధీనంలోనే ఉంటుంది. అప్పుడు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో ఆ భూమి దాని మొదటి స్వంతదారుల పరం అవుతుంది. కనుక ఆ ఆస్తి తిరిగి దాని అసలైన కుటుంబానికి చెందుతుంది.
29 “ప్రాకారంగల పట్టణంలో ఒకడు తన ఇల్లు అమ్మినట్టయితే, ఆ తర్వాత ఒక పూర్తి సంవత్సరం పాటు ఆ ఇల్లును తిరిగి పొందే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది. ఇంటిని తిరిగి పొందే హక్కు ఒక సంవత్సరంవరకు కొనసాగుతుంది. 30 అయితే ఒక సంవత్సరం పూర్తయ్యేలోపల ఆ ఇంటి స్వంతదారుడు కొనక పోయినట్టయితే, అప్పుడు ప్రాకారంగల పట్టణంలోని ఆ ఇల్లు, దానిని కొన్నవానికి, అతని సంతానానికి స్వంతం అవుతుంది. బూరధ్యని చేసే మహోత్సవ సమయంలో ఆ యిల్లు తిరిగి దాని ప్రథమ స్వంత దారుని వశం కాదు. 31 ప్రాకారాలు లేని పట్టణాలు బహిరంగ పొలాల్లా గుర్తించ బడతాయి. కనుక అలాంటి పట్టణాల్లో నిర్మించబడిన ఇళ్లు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో తిరిగి వాటి ప్రథమ స్వంత దారులపరం అవుతాయి.
32 “అయితే లేవీయుల పట్టణాల విషయం. లేవీయులు వారికి చెందిన పట్టణాల్లోని వారి ఇళ్లను ఎప్పుడైనా సరే తిరిగి కొనవచ్చును. 33 ఒక వ్యక్తి ఒక లేవీయుని దగ్గర ఒక ఇల్లు కొంటే, లేవీయుల పట్టణంలోని ఆ ఇల్లు బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో తిరిగి లేవీయులకే చెందుతుంది. ఎందుచేతనంటే లేవీయుల పట్టణాలు లేవీ వంశపు ప్రజలకు చెందినవి. ఆ పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలే లేవీయులకు ఇచ్చారు. 34 అలానే, లేవీయుల పట్టణాల చుట్టు ప్రక్కల పొలాలు, పచ్చికబయళ్లు అమ్మేందుకు వీల్లేదు. ఆ పొలాలు శాశ్వతంగా లేవీయులకే చెందుతాయి.
బానిసల యజమానులకు నియమాలు
35 “ఒకవేళ మీ దేశ ప్రజల్లో ఒకడు పోషణ సాగనంత పేదరికంలో పడవచ్చు. మీరు అతణ్ణి అతిథిలా మీతో జీవింపనియ్యాలి. 36 మీరు అతనికి అప్పుగా యిచ్చే మొత్తంమీద వడ్డీ కట్టవద్దు. ఆ సోదరుణ్ణి నీతో నివసింపనిచ్చి, నీ దేవుణ్ణి ఘనపరచు. 37 అతనికి వడ్డీకి అప్పు ఇవ్వవద్దు. అతడు భోజనం చేసే ఆహారం మీద లాభాలు గడించేందుకు ప్రయత్నించవద్దు. 38 నేను మీ దేవుడైన యెహోవాను. కనాను దేశాన్ని మీకు ఇచ్చి, మీకు దేవుణ్ణిగా ఉండేందుకు నేనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చాను.
39 “ఒకవేళ నీ సోదరుల్లో ఒకడు మరీ దరిద్రుడై, నీకు బానిసగా అమ్ముడుపోవచ్చును. నీవు అతణ్ణి ఒక బానిసలా పని చేయించకూడదు. 40 అతడు ఒక కిరాయి పనివానిలా, అతిధిలా బూరధ్వని చేసే మహోత్సవ కాలం వరకు నీతో ఉంటాడు. 41 తర్వాత అతడు నిన్ను విడిచి పెట్టవచ్చును. అతడు తన పిల్లలను తీసుకొని తిరిగి తన కుటుంబంలోనికి వెళ్ళిపోవచ్చును. అతడు తన పూర్వీకుల ఆస్తులను తిరిగి పొందవచ్చును. 42 ఎందుచేతనంటే, వాళ్లు నా సేవకులు, ఈజిప్టు బానిసత్వంలో నుండి నేను వాళ్లను తీసుకొనివచ్చాను. వాళ్లు మరల బానిసలు కాకూడదు. 43 ఇలాంటి వ్యక్తిని నీవు కఠినంగా పాలించగూడదు. నీ దేవుణ్ణి నీవు ఘనపర్చాలి.
44 “నీ స్త్రీ, పురుష బానిసల విషయం: మీ చుట్టు పక్కల దేశాలనుండి ఆడ, మగ బానిసలను మీరు తెచ్చుకోవచ్చును. 45 మరియు, మీ దేశంలో నివసిస్తున్న విదేశీయుల పిల్లలు వస్తానంటే వారిని కూడ మీరు బానిసలుగా తీసుకోవచ్చును. ఆ పిల్ల బానిసలు మీకు చెందుతారు. 46 ఈ విదేశీ బానిసలు మీ పిల్లల వశం అయ్యేటట్టు, మీ మరణానంతరం మీరు వారిని మీ పిల్లలకు అప్పగించవచ్చును. వాళ్లు శాశ్వతంగా మీకు బానిసలు. ఈ విదేశీయుల్ని మీరు బానిసలుగా చేసుకోవచ్చును. కానీ మీ స్వంత సోదరులైన ఇశ్రాయేలు ప్రజలను మాత్రం కఠినంగా పాలించగూడదు.
47 “ఒకవేళ ఒక విదేశీయుడు లేక అతిథి మీ మధ్యధనికుడు కావచ్చు, ఒకవేళ మీ దేశంలో ఒకడు దరిద్రుడై మీ మధ్య నివసిస్తున్న ఒక విదేశీయునికి బానిసగా లేక అతని కుటుంబంలో సభ్యునిగా అమ్ముడు పోయాడనుకోండి. 48 ఆ వ్యక్తి తిరిగి కొనబడి, స్వంతంత్రుడు అయ్యేందుకు అతనికి హక్కు ఉంటుంది. అతని సోదరుల్లో ఒకరు అతణ్ణి తిరిగి కొనవచ్చును. 49 అతని పినతండ్రిగాని, పిన తండ్రి కుమారుడు గాని అతణ్ణి కొనవచ్చును. లేక అతని వంశంలో అతని రక్తసంబంధి ఎవరైనా అతణ్ణి కొనవచ్చును. లేక ఒకవేళ ఆ వ్యక్తి తానే సరిపడినంత ధనం సంపాయించు కొంటే, తానే డబ్బు చెల్లించి మరల స్వతంత్రుడు కావచ్చును.
50 “వెల మీరెలా నిర్ణయిస్తారు? అతడు విదేశీయునికి తనను తాను అమ్ముకొన్న సమయంనుండి వచ్చే బూరధ్వని చేసే మహోత్సవ కాలంవరకు ఎన్ని సంవత్సరాలో మీరు లెక్కగట్టాలి. వెల నిర్ణయం చేయటానికి ఆ లెక్కను ఉపయోగించాలి. ఎందుచేతనంటే అవతలి వ్యక్తి యితణ్ణి వాస్తవానికి కొన్ని సంవత్సరాలకోసమే ‘కిరాయికి’ పెట్టుకొన్నాడు. 51 బూరధ్వని చేసే మహోత్సవ కాలానికి ఇంకా చాల సంవత్సరాలు కావాల్సిఉంటే, ఆ వ్యక్తి వెలలో అధిక భాగం తిరిగి చెల్లించాలి. అదంతా సంవత్సరాల సంఖ్యమీద ఆధారపడి ఉంటుంది. 52 ఉత్సవ సంవత్సరానికి మరికొన్ని యేండ్లు మాత్రమే మిగిలి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అసలు వెలలో కొద్ది మాత్రమే చెల్లించాలి. 53 అయితే ఆ వ్యక్తి కిరాయి పని వాడిలాగానే ఆ విదేశీయుని దగ్గర ప్రతి సంవత్సరం నివసిస్తాడు. ఆ విదేశీయుడు ఆ వ్యక్తి మీద కఠినంగా ప్రవర్తించకుండును గాక.
54 “ఆ వ్యక్తిని ఎవకూ కొనకపోయినప్పటికి, అతడు స్వతంత్రుడు అవుతాడు. బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో అతడు, అతని పిల్లలు స్వతంత్రులవుతారు. 55 ఎందుచేతనంటే, ఇశ్రాయేలు ప్రజలు నా సేవకులు. వాళ్లు నా సేవకులు. ఈజిప్టు బానిసత్వం నుండి నేను వాళ్లను తీసుకొని వచ్చాను. నేను మీ దేవుడైన యెహోవాను!
దావీదు దైవధ్యాన కీర్తన.
32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
మరియు నీవు నా పాపాలను క్షమించావు.
6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
7 దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
8 యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
9 కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”
10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.
జ్ఞానం మరియు అధికారం
8 ఆయా విషయాలను ఒక జ్ఞాని అర్థం చేసుకుని, వివరించి చెప్పగలిగినట్లు మరొకరెవరూ చెయ్యలేరు. అతని జ్ఞానం అతనికి ఆనందాన్నిస్తుంది. జ్ఞానంవల్ల ముఖంలో విచారం తొలగి, ఆనందం చోటు చేసుకుంటుంది.
2 నేను చెప్పేదేమిటంటే, నీవు ఎల్లప్పుడూ రాజాజ్ఞను పాటింలించాలి. నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కనుక నీవీ పని చెయ్యాలి. 3 రాజుకు సలహాలు ఇచ్చేందుకు భయపడకు. చెడ్డదాన్ని దేన్ని సమర్థించకు. కాని ఒక విషయం గుర్తుంచుకో: రాజు తనకు సంతోషం కలిగించే ఆజ్ఞలు ఇస్తాడు. 4 రాజుకు ఆజ్ఞలు ఇచ్చే అధికారం ఉంది. రాజు ఏమి చెయ్యాలో అతనికి ఎవరూ చెప్పలేరు. 5 రాజాజ్ఞను పాటించే వ్యక్తి క్షేమంగా వుంటాడు. అయితే, వివేకవంతుడికి ఈ పని చేయవలసిన సరైన తరుణం ఏదో, ఆ సరైన పని ఎప్పుడు చెయ్యాలో తెలుస్తుంది.
6 మనిషి ఏ పనైనా చెయ్యవలసినప్పుడు, దానికి సరైన సమయం, సరైన మార్గం వుంటాయి. (ప్రతి వ్యక్తీ ప్రయత్నించి, తాను చెయ్యవలసింది ఏమిటో నిర్ణయించుకోవాలి.) తనకి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా అతనీ పని చెయ్యాలి. 7 ఎందుకంటే, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఏ ఒక్కరూ చెప్పలేరు గనుక.
8 తన ఆత్మ తొలగిపోకుండా నిలుపుకోగల శక్తి ఏ ఒక్కరికి లేదు. తన మృత్యువును ఆపు చేయగల శక్తి ఏ ఒక్కరికీ లేదు. యుద్ధ సమయంలో తన ఇష్టంవచ్చిన చోటికి పోగల స్వేచ్ఛ సైనికుడికి ఎలా వుండదో, అలాగే ఒక వ్యక్తి పాపం చేస్తే, ఆ పాపం అతన్ని స్వేచ్ఛగా వుండనివ్వదు.
9 నేనీ విషయాలన్నీ గమనించాను. ఈ ప్రపంచంలో జరిగే విషయాలను గురించి నేను తీవ్రంగా ఆలోచించాను. మనుష్యులు ఎప్పుడూ యితరుల మీద అధికారం చలాయించే శక్తిని సంపాదించుకునేందుకు తంటాలు పడుతూ ఉంటారన్న విషయం నేను గమనించాను. ఇది వాళ్లకి చెరుపు చేస్తుంది.
10 దుర్మార్గులకు ఘనంగా అంత్యక్రియలు జరగడం కూడా నేను చూశాను. అంత్యక్రియలు ముగించి, మనుష్యులు ఇళ్లకి తిరిగివెళ్లేటప్పుడు, చనిపోయిన దుర్మార్గుణ్ణి గురించి మంచి మాటలు చెప్పడం నేను విన్నాను. ఆ దుర్మార్గులు అనేకానేకమైన చెడ్డ పనులు చేసిన పట్టణాల్లో కూడా అర్థరహితమైన పని జరిగింది. అది అర్థరహితమైనది.
న్యాయం, బహుమతులు, దండన
11 కొన్ని సందర్భాల్లో, మనుష్యులు చేసిన చెడ్డ పనులకుగాను, వాళ్లు వెంటనే శిక్షింపబడరు. శిక్ష తాపీగా వస్తుంది. దానితో, యితరులకు కూడా చెడ్డ పనులు చెయ్యాలన్న కోర్కె కలుగుతుంది.
12 ఒకానొక పాపి నూరు చెడు పనులు చేసియుండవచ్చు, అతను దీర్ఘాయుష్షు కలిగియుండవచ్చు. అయినప్పటికీ, దేవుడిపట్ల విధేయత, గౌరవం కలిగివుండటం మేలన్న విషయం నాకు తెలుసు. 13 దుర్మార్గులు దేవుణ్ణి గౌరవించరు. అందుకని, నిజంగానే వాళ్లకి మంచి ఫలితాలు లభించవు. ఆ దుర్మార్గులు దీర్గకాలం జీవించరు. (సూర్యుడు క్రిందకి వాలిన కొద్ది) పొడుగయ్యే నీడల్లాగా వాళ్ల జీవితాలు దీర్ఘంకావు.
14 న్యాయంగా కనిపించని మరొకటి కూడా భూమి మీద సంభవిస్తూ ఉంటుంది. చెడ్డవాళ్లకి చెడు, మంచి వాళ్లకి మంచి జరగాలి. కాని, కొన్ని సందర్భాల్లో మంచి వాళ్లకి చెడు, చెడ్డవాళ్లకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇది సరైనది కాదు. 15 అందుకని, జీవితాన్ని హాయిగా అనుభవించడం మరింత మెరుగైనదని నేను తీర్మానించుకున్నాను. ఈ ప్రపంచంలో మనుష్యులు చెయ్యగలిగిన అత్యుత్తమమైన పనేమిటంటే, తినడం, తాగడం, జీవితాన్ని హాయిగా అనుభవించడమే. కనీసం అలా చేస్తేనైనా, తమ జీవితకాలంలో దేవుడు తమకిచ్చిన కఠిన శ్రమని మనుష్యులు సరదాగా సంతోషంగా చేసేందుకు అది తోడ్పడుతుంది.
దేవుడు చేసేవన్ని మనకు బోధపడవు
16 ఈ ప్రపంచంలో మనుష్యులు చేసే పనులను నేను శ్రద్ధగా పరిశీలించాను. మనుష్యులు ఎంత హడావుడిగా ఉంటారో నేను చూశాను. వాళ్లు రాత్రింబగళ్లు శ్రమిస్తారు. వాళ్లు దాదాపు నిద్రేపోరు. 17 దేవుడు చేసేవాటిలో అనేకం కూడా నేను చూశాను. ఈ భూమిమీద దేవుడు చేసేదాన్నంతటినీ మనుష్యులు అర్థంచేసుకోలేరు. మనిషి వాటిని అర్థం చేసుకునేందుకు ఎంతైనా ప్రయత్నించవచ్చు. కాని, అతను అర్థంచేసుకోలేడు. దేవుడు చేసినదాన్ని తాను అర్థం చేసుకున్నానని ఒక జ్ఞాని అనవచ్చు. కాని, అది నిజంకాదు. వాటన్నింటినీ ఏ ఒక్కడూ అర్థం చేసుకోలేడు.
4 చనిపోయినవాళ్ళపై, బతికివున్నవాళ్ళపై తీర్పు చెప్పే దేవుని సమక్షంలో యేసు క్రీస్తు సమక్షంలో నీకొక ఆజ్ఞ యిస్తున్నాను. ఆయన ప్రత్యక్షం కానున్నాడు కనుక, ఆయన రాజ్యం రానున్నది కనుక, నీకీ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను. 2 దైవసందేశాన్ని ప్రకటించు. అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండు. తప్పులు సరిదిద్దుతూ, అవసరమైతే గద్దిస్తూ, ప్రోత్సాహమిస్తూ, సహనంతో బోధిస్తూ ఉండు.
3 ప్రజలు మంచి ఉపదేశాలు వినటం మానివేసే సమయం వస్తుంది. వాళ్ళు తమ యిష్టం వచ్చినట్లు చేస్తారు. తాము వినదల్చిన లౌకికమైన వాటిని చెప్పగలిగే పండితుల్ని తమ చుట్టూ ప్రోగుచేసుకొంటారు. 4 సత్యం వినటం మాని, కల్పిత సంగతులు వింటారు. 5 కాని అన్ని విషయాల్లో నిగ్రహంగా ఉండు. కష్టాలు ఓర్చుకో. సువార్త ప్రచారం చెయ్యటానికి కష్టించి పనిచెయ్యి. నీ సేవా సంబంధంలో చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తిగా నిర్వర్తించు.
6 నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చింది. 7 ఈ పోటీలో నేను బాగా పరుగెత్తాను. విశ్వాసాన్ని వదులుకోకుండా పందెం ముగించాను. 8 ఇప్పుడు “నీతి” అనే కీరీటం నా కోసం కాచుకొని ఉంది. నీతిగా తీర్పు చెప్పే ప్రభువు “ఆ రానున్న రోజు” దాన్ని నాకు బహుమతిగా యిస్తాడు. నాకే కాక, ఆయన రాక కోసం నిరీక్షిస్తున్నవాళ్ళందరికీ ఆ బహుమతి లభిస్తుంది.
వ్యక్తిగత సలహాలు
9 నా దగ్గరకు త్వరలో రావటానికి సాధ్యమైనంత ప్రయత్నం చెయ్యి. 10 ఎందుకంటే, “దేమా” ప్రపంచం మీద వ్యామోహం వల్ల నన్ను వదిలి థెస్సలొనీకకు వెళ్ళిపొయ్యాడు. క్రేస్కే గలతీయకు వెళ్ళిపొయ్యాడు. తీతు దల్మతియకు వెళ్ళిపొయ్యాడు. 11 లూకా మాత్రము నాతో ఉన్నాడు. మార్కు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నీ వెంట పిలుచుకొని రా. నా ఈ సేవా కార్యక్రమంలో అతని సహాయం నాకు ఉపయోగపడుతుంది. 12 తుకికును ఎఫెసుకు పంపాను.
13 నేను త్రోయలో ఉన్నప్పుడు కర్పు ఇంట్లో నా అంగీ మరిచిపొయ్యాను. దాన్ని, గ్రంథాలను, ముఖ్యంగా తోలు కాగితాల గ్రంథాలను తీసుకొని రా.
14 కంచరి అలెక్సంద్రు నాకు చాలా అపకారం చేసాడు. అతడు చేసిన దానికి ప్రభువు అతనికి తగిన శిక్ష విధిస్తాడు. 15 అతడు మన సందేశాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తాడు కనుక, అతని విషయంలో నీవు కూడా జాగ్రత్తగా ఉండు.
16 నా విషయంలో మొదటి సారి విచారణ జరిగినప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. అందరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపొయ్యారు. దేవుడు వాళ్ళను క్షమించు గాక! 17 నా ద్వారా సువార్త ప్రకటింపబడాలని యూదులు కానివాళ్ళందరు వినాలని ప్రభువు నా ప్రక్కన నిలబడి నాకు శక్తినిచ్చాడు. సింహాల నోటినుండి నన్ను కాపాడాడు. 18 ప్రభువు నాకు ఏ విధమైన కీడు సంభవించకుండా నన్ను కాపాడి, క్షేమంగా పరలోకంలో ఉన్న తన రాజ్యానికి పిలుచుకు వెళ్తాడు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
19 ప్రిస్కిల్లను, అకులను, ఒనేసిఫోరు కుటుంబం వాళ్ళకు నా వందనాలు చెప్పు. 20 ఎరస్తు కొరింథులోనే ఉండిపొయ్యాడు. త్రోఫిము జబ్బుతో ఉండటం వల్ల అతణ్ణి మిలేతులో వదలవలసి వచ్చింది. 21 చలి కాలానికి ముందే నీవిక్కడికి రావటానికి గట్టిగా ప్రయత్నించు.
యుబూలు, పుదే, లిను, క్లౌదియ మరియు మిగతా సోదరులందరు నీకు వందనాలు చెప్పుచున్నారు.
22 ప్రభువు నీ ఆత్మకు తోడైయుండునుగాక! దైవానుగ్రహం నీపై ఉండుగాక!
© 1997 Bible League International