Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 24

దీపస్తంభం, పవిత్ర రొట్టెలు

24 మోషేతో యెహోవా చెప్పాడు: “గానుగ ఆడిన ఒలీవలనుండి పవిత్ర తైలం తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ఆ నూనె దీపాల కోసం. ఆ దీపాలు ఆరిపోకుండా వెలగాలి. సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట సాయంత్రం నుండి ఉదయం వరకు దీపం వెలిగేటట్లు అహరోను చూసుకొంటాడు. ఇది సాక్ష్యపు తెర ఎదుట ఉంటుంది. అతి పవిత్రస్థలంలో ఈ తెర వెనుకనే ఒడంబడిక పెట్టె ఉంటుంది. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. యెహోవా ఎదుట స్వచ్ఛమైన బంగారపు దీపస్తంభం మీద దీపాలను అహరోను ఎల్లప్పుడూ వెలగనిస్తూఉండాలి.

“మంచి రకం గోధుమ పిండి తీసుకొని, దానితో పన్నెండు రొట్టెలు చేయాలి. ఒక్కో రొట్టెకు నాలుగు పావుల గోధుమపిండి ఉపయోగించాలి. యెహోవా ఎదుట బంగారు బల్లమీద ఆ రొట్టెలను రెండు వరుసలుగా పెట్టాలి. ఒక్కో వరుసలో ఆరు రొట్టెలు ఉండాలి. ఒక్కో వరుసమీద స్వచ్ఛమైన సాంబ్రాణి వేయాలి. ఇది యెహోవాకు అర్పించబడిన హోమాన్ని ఆయనను జ్ఞాపకం చేసుకొనేట్టు చేస్తుంది. ప్రతి సబ్బాతు నాడు అహరోను ఈ రొట్టెలను యెహోవా ఎదుట క్రమంలో ఉంచాలి. శాశ్వతంగా ఇలా చేయాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఈ ఒడంబడిక ఎప్పటికీ కొనసాగుతుంది. ఆ రొట్టె అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. వారు ఈ రొట్టెను పరిశుద్ధ స్థలంలో తినాలి. ఎందుచేతనంటే యెహోవాకు హోమంగా అర్పించబడిన అర్పణల్లో అది ఒకటి. ఆ రొట్టె ఎప్పటికీ అహరోను భాగం అవుతుంది.”

దేవుణ్ణి శపించిన మనిషి

10 ఒక ఇశ్రాయేలు స్త్రీకి కుమారుడు ఒకడు ఉన్నాడు. వాని తండ్రి ఈజిప్టువాడు. ఈ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు ఇశ్రాయేలువాడే. అతడు ఇశ్రాయేలు ప్రజల మధ్య తిరుగుతూ, బసలో పోరాడటం మొదలుపెట్టాడు. 11 ఆ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని శపిస్తూ, దూషణ మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడు కనుక ప్రజలు అతణ్ణి మోషే దగ్గరకు తీసుకొని వచ్చారు. (అతని తల్లి పేరు షెలోమితు, దాను కుటుంబ వంశానికి చెందిన దిబ్రీ కుమార్తె) 12 ప్రజలు వాణ్ణి బందీగా పట్టి, యెహోవా ఆజ్ఞ వివరంగా తెలియటం కోసం కనిపెట్టారు.

13 అప్పుడు మోషేతో యెహోవా చెప్పాడు: 14 “ఆ శపించినవాణ్ణి బసవెలుపలికి తీసుకొని రండి. తర్వాత అతడు శపిస్తూండగా విన్న ప్రజలందర్నీ సమావేశ పరచండి. వాళ్లు అతని తలమీద చేతులు వేయాలి. తర్వాత ప్రజలంతా వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. 15 ఇశ్రాయేలు ప్రజలతో నీవు చెప్పు: ఎవడైనా తన దేవుణ్ణి శపిస్తే వాడు ఈ విధంగా శిక్షించబడాలి. 16 యెహోవా నామానికి వ్యతిరేకంగా ఎవరైనా దూషణచేస్తే, వాణ్ణి చంపివేయాలి, ప్రజలంతా వాణ్ణి రాళ్ళతో కొట్టాలి. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడిలాగానే, విదేశీయులు కూడా శిక్షించబడాలి. ఏ వ్యక్తిగాని యెహోవా నామాన్ని శపిస్తే ఆ వ్యక్తిని చంపివేయాలి.

17 “ఇంకా, ఒకడు మరొక వ్యక్తిని చంపేస్తే, అలాంటివాణ్ణి చంపివేయాలి. 18 మరొకరికి చెందిన జంతువును చంపినవాడు ఆ జంతువుకు బదులుగా మరొక జంతువును ఇవ్వాలి.

19 “ఒకడు తన పొరుగువానికి గాయం చేస్తే, వానికి కూడా అలానే చేయాలి. 20 విరిగిన ఎముకకు విరిగిన ఎముక, కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకనికి ఎలాంటి దెబ్బలు తగిలితే, వాటి కారకునికి గూడా అలాంటి దెబ్బలే. 21 కనుక ఒకని జంతువును చంపినవాడు దాని స్థానంలో మరో జంతువును ఇవ్వాలి. అయితే మరొకడ్ని చంపినవాణ్ణి మాత్రం చంపివేయాలి.

22 “మీకు ఒకే రకం న్యాయం ఉంటుంది. మీ స్వంత దేశంలో ఉండే విదేశీయునికి కూడా అదే న్యాయం ఉంటుంది. ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక.”

23 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడగా, శపించిన వ్యక్తిని బసవెలుపలకు వారు తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్లు రాళ్లతో కొట్టి అతణ్ణి చంపివేసారు. కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు చేసారు.

కీర్తనలు. 31

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

31 యెహోవా, నీవే నా కాపుదల.
    నన్ను నిరాశపరచవద్దు.
    నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
    దేవా, నా మాట ఆలకించుము.
    వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
    నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
దేవా, నీవే నా బండవు, కోటవు
    కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
    వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
    నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
    నన్ను రక్షించుము.
వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం.
    యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను.
దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది.
    నా కష్టాలు నీవు చూశావు.
    నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు.
నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు.
    వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.
యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉంచుము.
    నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి.
    నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి.
10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది.
    నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి.
నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నాయి.
    నా బలం తొలగిపోతూ ఉంది.[a]
11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు.
    నా పొరుగు వాళ్లంతా కూడా నన్ను ద్వేషిస్తారు.
నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు.
    వారు నానుండి దూరంగా ఉంటారు.
12 నేను పాడైపోయిన పనిముట్టులా ఉన్నాను.
    నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.
13 ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను.
    ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.

14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
    నీవే నా దేవుడవు.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
    నన్ను రక్షించుము.
17 యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను.
    కనుక నేను నిరాశచెందను.
చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు,
    మౌనంగా వారు సమాధికి వెళ్తారు.
18 ఆ చెడ్డవాళ్లు గర్వించి,
    మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబుతారు.
ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు.
    కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి.

19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు.
    నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు.
    ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు.
    కాని ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు.
    ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను.
    కాని దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.

23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి.
    యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు.
కాని తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.

ప్రసంగి 7

జ్ఞాన బోధల సేకరణ

మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు.
    జన్మ దినం కంటె మరణ దినం మేలు.
విందుకి పోవడంకంటె, మరణించినవారి అంత్య క్రియలకి హాజరవడం మేలు.
    ఎందుకంటే, పుట్టిన వాళ్లెవరూ గిట్టకమానరు, బ్రతికున్న ప్రతివాడు ఈ విషయం గుర్తుంచుకోవాలి.
నవ్వుకంటె దుఃఖం మరింత మేలు,
    ఎందుకంటే, మన ముఖం విచారగ్రస్తమైనప్పుడు, మన మనస్సు మెరుగవుతుంది.
అవివేకి సరదాగా హాయిగా గడపాలని మాత్రమే ఆలోచిస్తాడు,
    కాని, వివేకి మృత్యువు గురించి ఆలోచిస్తాడు.
మూర్ఖుడి పొగడ్త పొందడం కంటె,
    వివేకిచే విమర్శింప బడటం మేలు.
మూర్ఖుల నవ్వులాటలు
    కుండ కింద చిటపట మండే ముళ్లలా ఉంటాయి.
(కుండ వేడైనా ఎక్కకముందే, ఆ ముళ్లు చురచుర మండి పోతాయి.)
    ఇది కూడా నిష్ర్పయోజనమే.
ఎవడైనా తగినంత డబ్బు ముట్టచెప్పితే
    వివేక వంతుడైనా తన వివేకాన్ని విస్మరిస్తాడు.
ఆ డబ్బు అతని విచక్షణను నాశనం చేస్తుంది.
ఏదైనా మొదలెట్టడం కంటె
    దాన్ని ముగించడం మేలు.
అహంభావం, అసహనం కంటె
    సాధుత్వం, సహనము మేలు.
తొందరపడి కోపం తెచ్చుకోకు
    ఎందుకంటే అది అవివేకం (మూర్ఖులు అవి చేస్తారు)
10 “గడిచి పోయిన రోజులే మేలు” అనబోకు.
    “అప్పుడు జరిగినదేమిటి?”
ఇది అవివేకమైన ప్రశ్న.

11 నీకు ఆస్తితో బాటు జ్ఞానం కూడా ఉంటే మరింత మంచిది. నిజానికి, వివేకవంతులు కావలసిన దానికంటే అధికంగానే ఐశ్వర్యాన్ని పొందుతారు. 12 వివేకవంతుడు సంపన్నుడవగలడు. ధనం అండ అయినట్టే వివేకం అండ అవుతుంది. కాని జ్ఞానంయొక్క ప్రయోజనం ఏమంటే, వివేకం తన యజమానికి అండ అవుతుంది.

13 దేవుడు చేసినవాటిని పరిశీలించి చూడండి. వాటిలో ఏదైనా ఒకటి పొరపాటైనదని నీవు అనుకున్నా వాటిలో ఏ ఒక్కదాన్ని నీవు మార్చలేవు! 14 రోజులు బాగున్నప్పుడు, నీవు దాన్ని అనుభవించు. కాని, రోజులు బాగుండనప్పుడు, దేవుడు మనకి మంచి రోజులు, చెడ్డ రోజులు వ్రాసి పెట్టాడన్న విషయం మరచిపోకు. ముందేమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదు.

మంచివాళ్లుగా ఉండటం నిజంగా అసాధ్యం

15 నా స్వల్ప జీవిత కాలంలో నేను అన్ని చూశాను. మంచివాళ్లు చిన్న వయస్సులోనే మరణించడం చూశాను. చెడ్డవాళ్లు సుదీర్ఘకాలం జీవించడం చూశాను. 16-17 అందుకని అకాలంగా నిన్ను నీవు చంపుకోవడం దేనికి? అతి మంచిగా కాని, అతి చెడ్డగా కాని ఉండకు. అతి తెలివిగా కాని అతి మూర్ఖంగా కాని ఉండకు. నీ ఆయువు తీరక ముందే నువ్వెందుకు చనిపోవాలి?

18 దీనిని పట్టుకో గాని దానిని చేయి విడువకుండా ఉండటం మేలు. దేవునికి భయపడేవారు కూడా కొన్ని మంచికార్యాలు, కొన్ని చెడ్డకార్యాలు చేస్తారు. 19-20 ఎప్పుడు మంచి పనులే చేసి, ఎన్నడూ పాపాలు చేయని మంచివాడంటూ లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్ఞానం మనిషికి శక్తిని చేకూరుస్తుంది. నగరంలో పదిమంది (మూర్ఖులైన) నాయకులకంటె ఒక్క వివేకవంతుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు.

21 జనం చెప్పే మాటలన్ని చెవిని చొరనీయకు. నీ స్వంత నౌకరే నీ గురించి చెడ్డ మాటలు చెప్పడం నీవు వినవచ్చు. 22 నీవు కూడా అనేకసార్లు యితరులను గురించి చెడ్డ మాటలు చెప్పియుండ వచ్చునని నీకు తెలుసు.

23 నేను నా వివేకాన్ని వినియోగించి, ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచించాను. నేను సరైన వివేకిగా వుండాలని కోరుకున్నాను. కాని అది దుస్సాధ్యం. 24 విషయాలెందుకిలా ఉన్నాయో నేను అర్థం చేసుకోలేను. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టమే. 25 నేను అధ్యయనం చేసి, సరైన జ్ఞానాన్ని అన్వేషించేందుకు చాలా గట్టి ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కదానికి హేతువును కనుక్కునేందుకు నేను ప్రయత్నించాను. (నేనేమి తెలుసుకున్నాను?)

చెడ్డగా ఉండటం మూర్ఖత్వమనీ, మూర్ఖంగా వ్యవహరించడం పిచ్చితనమనీ నేను తెలుసుకున్నాను. 26 (కొందరు) స్త్రీలు వలల మాదిరిగా ప్రమాద కారులు అన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ల హృదయాలు వలల్లాంటివి, వాళ్ల చేతులు గొలుసుల్లాంటివి. ఆ స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటె హీనం. దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అలాంటి స్త్రీలనుండి పారిపోతాడు. అయితే, పాపులు సరిగ్గా వాళ్లకే చిక్కుతారు.

27-28 ప్రసంగి ననే నేను చెప్పేదేమిటంటే, “వీటన్నింటికీ సమాధానాలు కనుగొనగలనేమోనని నేను పై విషయాలన్నీ మొత్తంగా పరిశీలించాను. సమాధానాల కోసం నేనిప్పటికీ అన్వేషిస్తూనే వున్నాను. అయితే, నేను కనుగొన్నది ఇది: నాకు వెయ్యి మందిలో ఒక్క మంచి మగాడు కనిపించగా, వెయ్యి మందిలో ఒక్క మంచి స్త్రీ కూడా కనిపించలేదు.

29 “నేను తెలుసుకున్న మరో విషయం: దేవుడు మనుష్యుల్ని నిజాయితీగల (మంచి) వాళ్లుగా సృష్టించాడు. కాని, మనుష్యులు చెడ్డగా ఉండేందుకు అనేక మార్గాలు కనుగొన్నారు.”

2 తిమోతికి 3

చివరి కాలపు సంగతులు

ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి రోజులు ఘోరంగా ఉంటాయి. మనుష్యుల్లో స్వార్థం, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవటం, గర్వం, దూషణ, తల్లితండ్రుల పట్ల అవిధేయత, కృతఘ్నత, అపవిత్రత, ప్రేమలేని తనం, క్షమించలేని గుణం, దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని ప్రేమించకుండటం, ద్రోహబుద్ధి, దురుసుతనం, అహంభావం, దేవునికంటె సుఖాన్ని ప్రేమించటం. పైకి భక్తిపరుల్లా ఉండి దాని శక్తిని అంగీకరించకుండటం ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండు.

వాళ్ళు ఇళ్ళల్లోకి చొరబడి, దురాశల్లో చిక్కుకు పోయి, పాపాలతో జీవిస్తున్న బలహీనమైన మనస్సుగల స్త్రీలను లోబరచుకొంటారు. ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చుకొంటారు. కాని, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. యన్నే మరియు యంబ్రే అనువారు మోషేను ఎదిరించిన విధంగా వీళ్ళ బుద్ధులు పాడై సత్యాన్ని ఎదిరిస్తున్నారు. మనం నమ్ముతున్న సత్యాన్ని వీళ్ళు నమ్మలేకపోతున్నారు. వీళ్ళు ముందుకు పోలేరు. మోషేను ఎదిరించినవాళ్ళలాగే వీళ్ళ అవివేకం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.

చివరి సలహాలు

10 కాని, నీకు నా ఉపదేశాలు, నా జీవితం, నా ఉద్దేశ్యం, నా విశ్వాసం, నా శాంతం, నా ప్రేమ, నా సహనం, 11 అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర పట్టణాల్లో నేను అనుభవించిన హింసలు, నా బాధలు, ఇవన్ని పూర్తిగా తెలుసు. ఇన్ని జరిగినా దేవుడు నన్ను వీటినుండి రక్షించాడు. 12 యేసు క్రీస్తులో ఆధ్యాత్మికంగా జీవించాలనుకొన్న ప్రతీ ఒక్కడూ హింసింపబడతాడు. 13 దుష్టులు, వేషధారులు, మోసంచేస్తూ, మోసపోతూ ఉంటారు. ఇది రోజు రోజుకూ అధికమవుతుంది.

14 కాని, నీవు ఎవరినుండి నేర్చుకొన్నావో తెలుసు. కనుక, నీవు నేర్చుకొన్నవాటిని, విశ్వసించినవాటిని పాటిస్తూ ఉండు. 15 అంతే కాక, నీవు నీ చిన్ననాటినుండి పవిత్ర గ్రంథాలు తెలిసినవాడవు. అవి నీలో జ్ఞానం కలిగించి యేసు క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా రక్షణను ప్రసాదించాయి. 16 లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి, నీతి విషయం తర్బీదు చేయటానికి ఉపయోగపడతాయి. 17 వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణంగా తయారుకాగలడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International