M’Cheyne Bible Reading Plan
ప్రత్యేక పండుగలు
23 మోషేతో యెహోవా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: యెహోవా ఏర్పాటు చేసిన పండుగలను పవిత్ర సమావేశాలుగా మీరు ప్రకటించాలి. నా ప్రత్యేక దినాలు ఏవంటే:
సబ్బాతు
3 “ఆరు రోజులు పని చేయండి. అయితే ఏడో రోజు సబ్బాతు, అది పవిత్ర సమావేశం జరిగే రోజు. మీరేమీ పని చేయకూడదు. మీ అందరి గృహాల్లోను ఆది యెహోవా నియమించిన సబ్బాతు.
పస్కా
4 “ఇవి యెహోవా ఏర్పాటు చేసిన పండుగ రోజులు. నిర్ణీత సమాయాల్లో పవిత్ర సమావేశాల్ని గూర్చి మీరు ప్రకటించాలి. 5 మొదటి నెల 14వ రోజు సాయంకాలం యెహోవా పస్కాపండుగ.
పులియని రొట్టెల పండుగ
6 “అదే నెల 15వ రోజు పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలను ఏడు రోజులు మీరు తినాలి. 7 ఈ సెలవుల్లో మొదటి రోజున మీకు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. 8 ఏడు రోజులవరకు మీరు యెహోవాకు బలి అర్పించాలి. ఏడవ రోజున ఒక పవిత్ర సమావేశం జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.”
ప్రథమ ఫలాల పండుగ
9 మోషేతో యెహోవా చెప్పాడు: 10 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇచ్చే దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు అక్కడ పంటలు కోస్తారు. ఆ సమయంలో మీ పంటలోని ప్రథమ పనను యాజకుని దగ్గరకు మీరు తీసుకొని రావాలి. 11 ఆ పనను యాజకుడు యెహోవా ఎదుట అల్లాడిస్తాడు. అప్పుడు మీరు స్వీకరించబడతారు. యాజకుడు ఆదివారం ఉదయం ఆ పనను అల్లాడిస్తాడు.
12 “మీరు పనను అల్లాడించే రోజున, ఒక సంవత్సరపు పోతు గొర్రె పిల్లను మీరు అర్పించాలి. ఆ గొర్రె పిల్లకు ఏ దోషం ఉండకూడదు. ఆ గొర్రెపిల్ల యెహోవాకు దహనబలి. 13 ఒలీవ నూనెతో కలిపిన రెండు పదోవంతుల పిండిని ధాన్యార్పణగా మీరు అర్పించాలి. ముప్పావు ద్రాక్షారసమును కూడా మీరు అర్పించాలి. ఆ అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన. 14 దేవునికి ఆ అర్పణలు చెల్లించేవరకు, కొత్త ధాన్యంగాని, ఫలాలుగాని, లేక కొత్త ధాన్యంతో చేయబడిన రొట్టెగాని మీరు తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా సరే మీ తరాలన్నింటికీ ఈ ఆజ్ఞ కొన సాగుతుంది.
పెంతెకొస్తు పండుగ
15 “ఆ ఆదివారం మొదలు కొని (నైవేద్యం కోసం మీరు పన తీసుకొని వచ్చిన రోజునుండి) ఏడు వారాలు లెక్కించండి. 16 ఏడు వారాల తర్వాత ఆదివారం నాడు (అంటే యాభైయవ రోజు) యెహోవాకు మీరు కొత్త ధాన్యార్పణను తీసుకొని రావాలి. 17 ఆ రోజున అనగా ఆదివారంనాడు మీ యిండ్ల నుండి రెండు రొట్టెలు తీసుకొని రండి. ఆ రొట్టె నైవేద్యంకోసం. 4 పావులు గోధుమ పిండిలో, పులిసిన పదార్థం ఉపయోగించి ఆ రొట్టెలు తయారుచేయాలి. అది మీ ప్రథమ పంటల్లోనుంచి మీరు యెహోవాకు అర్పించే కానుక.
18 “ప్రజలు ధాన్యార్పణతో బాటు ఒక దూడను ఒక పొట్టేలును, ఏడాది పోతును, ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. వాటిలో ఏ దోషమూ ఉండకూడదు. అవి యెహోవాకు దహనబలి అర్పణ. అవి హోమంగా అర్పించబడి, యెహోవాకు కమ్మని సువాసనగా ఉంటాయి. 19 పాపపరిహారార్థ బలిగా ఒక మేకపోతును, సమాధాన బలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.
20 “నైవేద్యంగా ప్రథమ ఫలంలోని రొట్టెతో పాటు వాటిని, రెండు గొర్రెపిల్లలను యెహోవా ఎదుట యాజకుడు అల్లాడించాలి. అవి యెహోవాకు పవిత్రమైనది. అవి యాజకునికి చెందుతాయి. 21 అదే రోజున మీరు ఒక పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రోజున మీరేమి పని చేయకూడదు. మీ గృహాలన్నింటిలో ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
22 “మరియు, మీరు మీ పొలంలో పంట కోసేటప్పుడు పొలం అంచులమట్టుకు కోసి వేయవద్దు. నేలమీద పడే కంకులు ఏరుకోవద్దు. పేదవారికోసమూ, మీ దేశం గుండా ప్రయాణించే విదేశీయుల కోసమూ వాటిని విడిచిపెట్టండి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి!”
బూరల పండుగ
23 మరల మోషేతో యెహోవా చెప్పాడు: 24 “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. ఏడవ నెల మొదటి రోజున మీకు ప్రత్యేకమైన విశ్రాంతి రోజు ఉండాలి. అప్పుడు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ప్రత్యేక జ్ఞాపకార్థ సమయంగా మీరు బూర ఊదాలి. 25 ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీరు యెహోవాకు హోమ అర్పణలు అర్పించాలి.”
ప్రాయశ్చిత్త దినం
26 మోషేతో యెహోవా చెప్పాడు, 27 “ఏడవ నెల పదవరోజు ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు భోజనం చేయకూడదు, యెహోవాకు మీరు హోమ అర్పణ తీసుకొని రావాలి. 28 ఆ రోజున మీరు ఏ పని చేయకూడదు. ఎందుచేతనంటే అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజు, యాజకులు యెహోవా ఎదుటికి వెళ్లి, మిమ్మల్ని పవిత్రం చేసే ఆచారక్రమాన్ని జరిగిస్తారు.
29 “ఆ రోజున భోజనం చేయకుండా ఉండేందుకు ఎవరైనా తిరస్కరిస్తే, ఆ వ్యక్తిని తన ప్రజలనుండి వేరు చేయాలి. 30 ఆ రోజున ఎవరైనా పని చేస్తే ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను నాశనం చేస్తాను. 31 మీరు అసలు ఏమీ పని చేయాకూడదు. మీరు ఎక్కడ నివసించినా ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. 32 అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”
పర్ణశాలల పండుగ
33 మరల మోషేతో యెహోవా చెప్పాడు, 34 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఏడవ నెల పదిహేనవ తేదీన పర్ణశాలల పండుగ. యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులపాటు కొనసాగుతుంది. 35 మొదటి రోజున పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు. 36 ఏడు రోజులు యెహోవాకు హోమార్పణలు మీరు అర్పించాలి. ఎనిమిదో రోజున మీకు మరో పవిత్ర సమావేశం జరుగుతుంది. మీరు యెహోవాకు హోమార్పణలు అర్పించాలి. ఇది పవిత్ర సమావేశంగా ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు.
37 “అవి యెహోవా ప్రత్యేక పండుగలు. ఆ పండుగల్లో పవిత్ర సమావేశాలు జరుగుతాయి. అర్పణలు, బలిఅర్పణలు, పానార్పణలు, దహనబలులు, ధాన్యార్పణలు మీరు యెహోవాకు తీసుకొని రావాల్సిన హోమార్పణలు. ఆ కానుకలు తగిన సమయంలో మీరు తీసుకొని రావాలి. 38 యెహోవా సబ్బాతు రోజులు జ్ఞాపకం చేసుకోవటంతోబాటు ఈ పండుగలన్నీ మీరు ఆచరించాలి. యెహోవాకు మీరు అర్పించే మీ ఇతర అర్పణలుగాక ఈ కానుకలు అర్పించాలి. మీ ప్రత్యేక వాగ్దానాల చెల్లింపుగా మీరు అర్పించే అర్పణలు గాక వీటిని మీరు అర్పించాలి. మీరు యెహోవాకు ఇవ్వాలనుకొన్న ప్రత్యేక అర్పణలుకాక ఇవి మీరు ఇవ్వాలి.
39 “ఏడవ నెల పదిహేనవ రోజున, దేశంలో మీరు పంటలు కూర్చుకొన్నప్పుడు, యెహోవా పండుగను ఏడు రోజుల పాటు మీరు ఆచరించాలి. మొదటి రోజున, ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి. 40 మొదటి రోజు పండ్ల చెట్లనుండి మంచి పండ్లు మీరు కూర్చాలి. ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలువల దగ్గరి నిరవంజి చెట్లు మీరు తీసుకోవాలి. మీ యెహోవా దేవుని ఎదుట ఏడు రోజులు మీరు పండుగ ఆచరించాలి. 41 ప్రతి సంవత్సరం ఏడు రోజులు యెహోవాకు పండుగగా మీరు దీనిని ఆచరించాలి. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ఏడవ నెలలో మీరు ఈ పండుగను ఆచరించాలి. 42 ఏడు రోజులు తాత్కాలిక పర్ణశాలల్లో మీరు నివసించాలి. ఇశ్రాయేలీయులలో పుట్టిన వాళ్ళంతా ఆ పర్ణశాలల్లోనే నివసించాలి. 43 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి నేను బయటకు తీసుకొని వచ్చినప్పుడు, తాత్కాలిక గుడారాల్లో నేను వారిని నివసింపజేశానని మీ సంతానం అంతా తెలుసుకోవాలి. నేను మీ దేవుడనైన యెహోవాను!”
44 కనుక యెహోవా పండుగ రోజులు అన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే చెప్పాడు.
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఐశ్వర్యం సంతోషాన్ని ఇవ్వదు
6 నేను ఈ ప్రపంచంలో అసమంజసమైన మరో విషయాన్ని గమనించాను. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. 2 దేవుడు ఒక మనిషికి గొప్ప సంపద, ఆస్తి మరియు గౌరవమూ ప్రసాదిస్తాడు. అతనికి కావలసినవన్నీ, అతను కోరుకోగలిగిన సమస్తం వుంటాయి. అయితే, ఆ వ్యక్తి వాటిని అనుభవించకుండా చేస్తాడు దేవుడు. ఒక అపరిచితుడు వస్తాడు, వాటన్నింటినీ చేజిక్కించుకుంటాడు. ఇది కూడా అర్థరహితమైన చాలా చెడ్డ విషయమే.
3 ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవించవచ్చు. అతనికి వంద మంది సంతానం ఉండవచ్చు. అయితే, ఈ మంచి విషయాలు అతనికి తృప్తి కలిగించలేదనీ, అతని మరణానంతరం[a] ఏ ఒక్కరూ అతన్ని జ్ఞాపకం ఉంచుకోరనీ అనుకోండి, అప్పుడు అతనికంటె పురిట్లోనే చనిపోయే శిశువు మెరుగని నేనంటాను. 4 మృత శిశువుగా పుట్టడం నిజంగానే అర్థరహితం. పేరైనా లేని ఆ శిశువుని వెంటనే తీసుకుపోయి సూర్యరశ్మి చొరని చీకటి సమాధిలో పూడ్చేస్తారు. 5 సూర్యరశ్మినైనా చూడని ఆ శిశువుకి బొత్తిగా ఏది ఏమాత్రం తెలియదు. కాని, దేవుడు తనకిచ్చిన మంచివాటిని అనుభవించని ఆ మనిషికంటె ఆ శిశువు ఎక్కువ ప్రశాంతిని అనుభవిస్తుంది. 6 ఆ మనిషి రెండు వేల సంవత్సరాలు బతకవచ్చు. అయినా అతను తనకు ఇచ్చిన జీవితాన్ని అనుభవించక పోతే అతనికంటె గర్భంలో చనిపోయిన శిశువు సులభమయిన మార్గంలో ఆ అంత్యదశను పొందిందనవచ్చు.
7 తిండి కోసం మనిషి చచ్చేలా పాటుపడతాడు. అయితే, అతను ఎన్నడూ తృప్తి చెందడు. 8 వివేకవంతుడు అవివేకికంటె విశేషమైనవాడు కాడు. అంతకంటె, ఉన్నవి ఉన్నట్లు జీవితాన్ని స్వీకరించడం తెలిసిన బీదవాడు మేలు. 9 ఎప్పుడూ ఇంకా ఇంకా ఏదో కావాలని ఆశించడంకంటె, ఉన్నదానితో తృప్తి చెంది సంతోషంగా ఉండటంమేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకోవడం వృధా ప్రయాసం. అది గాలిని పట్టుకొనేందుకు చేసే ప్రయత్నమే.
10-11 మనిషి ఎందుకు సృష్టింపబడ్డాడు? మనిషిగా ఉండేందుకు మాత్రమే. దీన్ని గురించి చర్చించడం వృధా ప్రయాసమే. దీన్ని గురించి మనిషి దేవునితో చర్చించలేడు. ఎందుకంటే, మనిషికంటె దేవుడు శక్తిమంతుడు. సుదీర్ఘంగా వాదించినంత మాత్రాన ఈ వాస్తవం మారిపోదు.
12 భూమిమీద స్వల్ప కాలం జీవించే మనిషికి, ఆ స్వల్ప కాలంలో అతనికి ఏది అత్యుత్తమమైనదో ఎవరికి తెలుస్తుంది? అతని జీవితం నీడలా గడిచిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో ఎవరూ అతనికి చెప్పలేరు.
క్రీస్తు యేసు యొక్క విధేయ సైనికుడు
2 నా కుమారుడా! యేసు క్రీస్తులోనున్న కృప ద్వారా బలవంతుడుగా నుండు. 2 నేను బోధించిన వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగలవాళ్ళకు, యితరులకు బోధించగల సామర్థ్యము ఉన్నవాళ్ళకు అప్పగించు. 3 యేసు క్రీస్తుకు మంచి సైనికునివలే, మాతో కలిసి విశ్వాసంతో కష్టాలు సహించు. 4 సైనికునిగా పని చేసేవాడు సామాన్య ప్రజల విషయాల్లో తలదూర్చడు. గాని అతడు, తన సైన్యాధిపతిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు. 5 అదే విధంగా ఆట పందెంలో పాల్గొనేవాడు ఆ ఆట నియమాల్ని పాటిస్తే కాని విజయం సాధించలేడు. 6 కష్టించి పని చేసే రైతుకు, వచ్చిన పంటలో భాగము అందరికన్నా ముందు లభిస్తుంది. 7 నేను చెప్పేవాటిని గురించి ఆలోచించు. ప్రభువు నీకు వీటన్నిటిని గురించి తెలుసుకొనే జ్ఞానం కల్గిస్తాడు.
8 దావీదు వంశానికి చెందిన యేసు క్రీస్తు బ్రతికింపబడ్డాడన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను బోధించే సువార్త. 9 ఈ సువార్త బోధించటం వల్ల నేను సంకెళ్ళతో నేరస్తునివలె కష్టాలు అనుభవిస్తున్నాను. కాని దేవుని సందేశానికి సంకెళ్ళు లేవు. 10 కనుకనే, దేవుడు ఎన్నుకొన్నవాళ్ళ కోసం ఈ కష్టాలు సహిస్తున్నాను. యేసుక్రీస్తు వల్ల లభించే రక్షణ, శాశ్వతమైన మహిమ, వాళ్ళకు కూడా లభించాలని నా అభిలాష.
11 ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది:
మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం.
12 మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం చేస్తాం!
మనం ఆయన్ని కాదంటే ఆయన మనల్ని కాదంటాడు.
13 మనం నమ్మతగనివాళ్ళమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు.
తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు.
దేవుడు సమ్మతించిన పనివాడు
14 వాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను హెచ్చరించు. అలాంటి వాదనవల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది. 15 దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు.
16 విశ్వాసహీనమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. అలాంటివాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు. 17 వీళ్ళ బోధ పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమెనై, ఫిలేతు ఈ గుంపుకు చెందినవాళ్ళు. 18 వీళ్ళు సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్థానం జరిగిపోయిందని చెప్పి కొందరి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు.
19 అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తనవాళ్ళెవరో ప్రభువుకు తెలుసు.(A) ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలివెయ్యాలి” అని వ్రాయబడి ఉంది.
20 గొప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక, చెక్కతో, మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి. 21 దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు.
22 యౌవనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచేవాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని అనుసరించు. 23 కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు. 24 అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి. 25 తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి. 26 అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చి సాతాను వేసిన వలనుండి తప్పించుకోగల్గుతారు. ఎందుకంటే సాతాను వాళ్ళను తన యిచ్ఛ నెరవేర్చటానికి బంధించి పెట్టాడు.
© 1997 Bible League International