Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 22

22 యెహోవా దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: “అహరోనుతో, అతని కుమారులతో చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు నాకు వస్తువులను అర్పిస్తారు. ఆ వస్తువులు పవిత్రం అవుతాయి. అవి నావి. అందుచేత యాజకులైన మీరు వాటిని తీసుకోగూడదు. పవిత్రమైన ఆ వస్తువుల్ని మీరు ఉపయోగిస్తే, నా పవిత్రనామం అంటే మీకు గౌరవం లేదని మీరు వ్యక్తం చేస్తారు. నేను యెహోవాను. మీ సంతానమంతటిలో ఎవరైనా వాటిని తాకితే ఆ వ్యక్తి అపవిత్రం అవుతాడు. ఆ వ్యక్తి నానుండి వేరు చేయబడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ వస్తువుల్ని నాకు ఇచ్చారు. నేను యెహోవాను.

“అహరోను సంతానంలో ఎవరికైనా దారుణమైన చర్మవ్యాధి ఉంటే, లేక స్రావరోగం ఉంటే అతడు పవిత్రం అయ్యేంతవరకు పవిత్రభోజనం చేసేందుకు వీల్లేదు. అపవిత్రుడైన ఏ యాజకునికైనా ఆ నియమం వర్తిస్తుంది. అలాంటి యాజకుడు ఒక శవం మూలంగా కానీ, లేక తన ఇంద్రియం మూలంగా కానీ అపవిత్రుడు కావచ్చు. అపవిత్రమైన, పాకే జంతువుల్లో దేన్ని తాకినా అతడు అపవిత్రుడు అవుతాడు. మరియు అపవిత్రమైన మరో మనిషిని తాకుట వల్ల అతడు అపవిత్రుడు అవుతాడు. దేని మూలంగా అతడు అపవిత్రమైనా సరే ఒక వ్యక్తి వాటిలో దేనిని తాకినా అతడు సాయంత్రంవరకు అపవిత్రుడవుతాడు. ఆ వ్యక్తి పవిత్ర భోజనాన్ని తినకూడదు. అతడు నీళ్లతో స్నానము చేసినా సరే అతడు పవిత్ర భోజనం తినకూడదు. సూర్యాస్తమయం తర్వాతనే అతడు పవిత్రుడవుతాడు. అప్పడు అతడు పవిత్ర భోజనం తినవచ్చును. ఎందుచేతనంటే ఆ భోజనం అతనికి చెందుతుంది గనుక.

“ఒక జంతువు దానంతట అదేచచ్చినా, లేక మరో జంతువుచే చంపబడినా, చచ్చిన ఆ జంతువును యాజకుడు తినకూడదు. ఆ వ్యక్తి ఆ జంతువును తింటే అతడు అపవిత్రుడవుతాడు. నేను యెహోవాను.

“యాజకులు నన్ను సేవించేందుకు నిర్ణీత సమయాలు ఉన్నాయి. ఆ సమయాల్లో వాళ్లు జాగ్రాత్తగా ఉండాలి. పవిత్రమైన వాటిని అపవిత్రం చేయకుండా వారు జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు గనుక జాగ్రత్తగా ఉంటే వాళ్లు చావరు. నేనే యెహోవాను. వాళ్లను ఈ ప్రత్యేక పనికోసం ప్రత్యేకించాను. 10 యాజక కుటుంబంలోని వాళ్లు మాత్రమే పవిత్ర భోజనం తినవచ్చు. యాజకునితో ఉంటున్న అతిధి లేక యాజకుని కూలివాడు పవిత్ర భోజనం తినకూడదు. 11 అయితే యాజకుడు తన స్వంత డబ్బుతో ఒక వ్యక్తిని బానిసగా కొనివుంటే ఆ వ్యక్తి పవిత్రమైన వాటిలో కొంత తినవచ్చును. యాజకుని ఇంట పుట్టిన బానిసలు కూడ యాజకుని భోజనంలో కొంత తినవచ్చును. 12 యాజకుని కుమార్తె, యాజకుడు కాని వాణ్ణి వివాహం చేసుకోవచ్చు. ఆమె గనుక అలా చేస్తే, అప్పుడు ఆమె పవిత్ర అర్పణల్లోనివి ఏవీ తినకూడదు. 13 ఒక యాజకుని కుమార్తె విధవరాలు కావచ్చును, లేదా విడాకులు పొందవచ్చును. ఆమెను పోషించే పిల్లలు ఆమెకు లేని కారణంగా ఆమె బాల్యంలో నివసించిన తన తండ్రి ఇంటికి తిరిగి వేళ్తే, అప్పుడు ఆమె తన తండ్రి భోజనంలో కొంత తినవచ్చును. అయితే యాజక కుటుంబంలోని వారు మాత్రమే ఈ భోజనాన్ని తినవచ్చును.

14 “ఒక వ్యక్తి పవిత్ర భోజనంలో కొంత పోరబాటున తిన్నట్లయితే ఆ వ్యక్తి అంత పవిత్ర భోజనాన్ని యాజకునికి ఇచ్చివేయాలి. అయిదింట ఒకటి వంతున ఆ భోజనం ఖరీదు గూడ అతడు చెల్లించాలి.

15 “ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు కానుకలుయిస్తారు. ఆ కానుకలు పవిత్రం అవుతాయి. కనుక ఆ పవిత్ర వస్తువుల్ని యాజకుడు అపవిత్రం చేయకూడదు. 16 ఒక వేళ యాజకులు గనుక ఆ వస్తువులు పవిత్రం కావు అన్నట్టు వాటిని చూస్తే, పవిత్ర భోజనం తిన్నప్పుడు వారు వారి పాపాన్ని అధికం చేసుకొన్న వాళ్లవుతారు. యెహోవాను నేనే వాటిని పవిత్రం చేస్తాను!”

17 యెహోవా దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: 18 “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలు ప్రజలు అందరితో ఇలా చెప్పు: ఒకవేళ ఒక ఇశ్రాయేలు పౌరుడు, లేక ఒక విదేశీయుడు ఒక అర్పణ తీసుకొని రావాలను కొంటాడు. ఒకవేళ అది ఆ వ్యక్తి చేసుకొన్న ఏదో ఒక ప్రత్యేక వాగ్దానంగా కావచ్చు లేక ఒకవేళ ఆ వ్యక్తి ఇవ్వాలనుకొన్న ఒక ప్రత్యేక బలి కావచ్చు. 19-20 ఆ ప్రజలు నిజంగా దేవునికి కానుకలు ఇవ్వాలని కోరుకొన్నందుచేత వారు తెచ్చే కానుకలు అవి. దోష భూయిష్టమైన ఏ అర్పణా నీవు అంగీకరించగూడదు. అలాంటి అర్పణవల్ల నాకు సంతోషం కలుగదు. కనుక ఒక కోడెదూడ, గొర్రె, మేక అయితే అది మగదైఉండాలి. ఆపైన దానిలో ఏ దోషమూ ఉండకూడదు.

21 “ఒక వ్యక్తి సమాధాన బలి యెహోవాకు తీసుకొని రావచ్చును. ఆ సమాధాన బలి ఆ వ్యక్తి చేసుకొన్న ఏదో ప్రత్యేక వాగ్దానానికి చెల్లింపు కావచ్చును. లేక అది ఆ వ్యక్తి యెహోవాకు అర్పించాలనుకొన్న ఒక ప్రత్యేక కానుక కావచ్చును. అది ఇక కోడెదూడ కావచ్చును లేక గొర్రె కావచ్చును. కానీ అది ఆరోగ్యంగా ఉండాలి. ఆ జంతువులో ఏ దోషమూ ఉండకూడదు. 22 గుడ్డిది, ఎముకలు విరిగింది, కుంటిది లేక స్రావరోగం ఉన్నది, లేక దారుణమైన చర్మవ్యాధి ఉన్నది, ఏ జంతువును మీరు యెహోవాకు అర్పించకూడదు. యెహోవా బలిపీఠపు అగ్నిమీద రోగగ్రస్థమైన జంతువులను మీరు అర్పించకూడదు.

23 “కొన్నిసార్లు ఒక కాలు మరీ పొడవుగానో లేక సరిగ్గా పెరగని ఒక పాదమో ఉన్న ఒక కోడెదూడగాని గొర్రెగాని ఉండవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి అలాంటి జంతువును యెహోవాకు ప్రత్యేక కానుకగా అర్పించాలనుకొంటే, అది అంగీకారం అవుతుంది. అయితే ఆ వ్యక్తి చేసిన ప్రత్యేక వాగ్దానానికి చెల్లింపుగా మాత్రం అది అంగీకరించబడదు.

24 “ఒక జంతువుకు గాయపడ్డ, లేక అణగగొట్టబడిన లేక చినిగిన వృషణాలు ఉంటే అలాంటి జంతువును మీరు యెహోవాకు అర్పించకూడదు.

25 “విదేశీయుల దగ్గర్నుండి జంతువుల్ని యెహోవాకు బలిగా మీరు తీసుకోగూడదు. ఎందుచేతనంటే ఆ జంతువులు ఏ విధంగానైనా దెబ్బతిన్నాయేమో, లేదా వాటిలో ఏదైనా లోపం ఉండొచ్చు అందుచేత అవి అంగీకరించబడవు!”

26 మోషేతో యెహోవా చెప్పాడు: 27 “ఒక కోడెదూడ, లేక ఒక గొర్రె, లేక ఒక మేక పుట్టినప్పుడు ఏడు రోజులు అది తన తల్లితో ఉండాలి, అప్పుడు ఎనిమిదో రోజునగాని ఆ తర్వాతగాని యెహోవాకు హోమంగా అర్పించే బలిగా అది అంగీకరించ బడుతుంది. 28 కానీ ఆ జంతువును, దాని తల్లిని ఒకే రోజున మీరు చంపకూడదు. పశువులకు, గొర్రెలకు యిదే నియమం వర్తిస్తుంది.

29 “ఏదైనా ప్రత్యేక కృతజ్ఞత అర్పణ మీరు యెహోవాకు అర్పించాలని కోరితే, మీరు స్వేచ్ఛగా ఆ కానుకను అర్పించవచ్చును. అయితే అది దేవుణ్ణి సంతోషపెట్టే విధానంలో మీరు చేయాలి. 30 మొత్తం జంతువును ఆ రోజే మీరు తినాలి. దాని మాంసంలో ఏమీ మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు. నేను యెహోవాను.

31 “నా ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులవ్వండి. నేను యెహోవాను. 32 నా పవిత్ర నామానికి గౌరవం చూపించండి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. నేను, యెహోవాను, మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకొన్నాను. 33 నేనే మిమ్మల్ని ఈజిప్టునుండి తీసుకొని వచ్చాను. నేను మీకు దేవుణ్ణి అయ్యాను. నేను యెహోవాను!”

కీర్తనలు. 28-29

దావీదు కీర్తన.

28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
    నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
    అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
    నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
    నా మీద దయ చూపించుము.
యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
    ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
    కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
    ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
    ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
    వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.

యెహోవాను స్తుతించండి.
    కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
    నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
    మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
    ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.

దేవా, నీ ప్రజలను రక్షించుము.
    నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
    కాపరిలా వారిని నిత్యం నడిపించుము.

దావీదు కీర్తన.

29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
    ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
    మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
    మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
    ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
    లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
    షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
    యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
    ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.

10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
    మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
    యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.

ప్రసంగి 5

వాగ్దానం చేయుటలో జాగ్రత్తగా వుండండి

దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మూఢ జనం మాదిరిగా బలులు ఇవ్వడం కంటె (దైవవాణిని) వినడం మేలు. మూఢులు తరచు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకి తమ పనులు చెడ్డవని కూడా తెలియదు. దేవునికి మీరు మొక్కులు మొక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా వహించండి. దేవునికి మీ సమర్పణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో తొందరపడి నోరుజారకండి. దేవుడు పైన పరలోకంలో ఉన్నాడు, మీరు క్రింద భూమిమీద వున్నారు. అందుకని దేవునికి వేడుకొనుట కొద్దిగా మాత్రమే మీరు చెయ్యండి. (ఈ కింది లోకోక్తి లోని వాస్తవాన్ని గమనించండి)

అధిక వ్యాకుల మనస్కులు పీడకలలు కంటారు,
    బుద్ధిహీనులు అతిగా వాగుతారు.

దేవునికి నీవేదైనా మొక్కకుంటే, దాన్ని చెల్లించు. నీవు మొక్కుకున్నదాన్ని చెల్లించడంలో ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల విషయంలో దేవుడు ప్రసన్నుడు కాడు. దేవునికి ఇస్తానన్నదాన్ని నీవాయనకు ఇవ్వు. ఏదైనా వాగ్దానం చేసి దాన్ని చేయలేక పోవడం కంటె, అసలేమి మొక్కుకోక పోవడమే మేలు. అందుకని, నీ మాటలు పాపకారణం కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు.[a] నీవాపని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, నీవు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం చెయ్యవచ్చు. నీ పనికిమాలిన స్వప్నాలు, బింకాలు (నీకు హాని కలిగించకుండా) చూసుకో. నీవు దేవుని పట్ల భక్తి కలిగి ఉండు.

ప్రతి అధికారిపైన మరొక అధికారి ఉంటాడు

ఏ దేశమైనా తీసుకో. బీదవాళ్లు బలవంతముగా కఠిన పని చేయడం నీవు చూడవచ్చు. బీదల విషయంలో ఇది అన్యాయ వర్తన అని, బీదల హక్కులకు ఇది విరుద్ధమని నీవు చూడగలుగుతావు. అయితే, నీవు యిందుకు ఆశ్చర్యపడబోకు! వాళ్లచేత అలా బలవంతాన పనిచేయించే అధికారి పైన, మరో అధికారి ఉంటాడు. ఈ ఇద్దరు అధికారులపైనా పెత్తనం చలాయించి పనిచేయించే మరో పై అధికారి వుంటాడు. రాజు కూడా బానిసే. అతని రాజ్యం అతనికి యజమాని.

ధనం సంతోషమును కొనలేదు

10 డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు తనకు ఉన్న డబ్బుతో ఎన్నడూ తృప్తి చెందడు. ఐశ్వర్యాన్ని ప్రేమించేవాడు తనికు ఇంకా ఇంకా వచ్చి పడినా తృప్తి చెందడు. ధన వ్యామోహం కూడా అర్థరహిత మైనదే.

11 ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే, దాన్ని ఖర్చు పెట్టడంలో తోడ్పడే “మిత్రులు” అంత ఎక్కువ మంది ఉంటారు. దానితో, వాస్తవంలో ఆ ధనికుడు పొందే లాభమేమీ ఉండదు. అతను తన సంపదని చూసుకుని మురిసిపోగలడు. అంత మాత్రమే.

12 రోజంతా చెమటోర్చి కష్టపడేవాడు యింటికి తిరిగి వచ్చి తక్కువగా తిన్నా లేక ఎక్కువగా తిన్నా నిశ్చింతగా నిద్రపోతాడు. శ్రమజీవికి తినేందుకు కొంచెమే వున్నా, ఎక్కువ వున్నా అతనికి అదేమంత ముఖ్యంకాదు. కాని, ధనికుడికి తన సంపద విషయంలో దిగులుతో నిద్రపట్టదు.

13 ఈ ప్రపంచంలో చాలా విచారకరమైన విషయం ఒకటి నేను గమనించాను. ఒకడు భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేస్తాడు. 14 తర్వాత ఏదో విపత్తు వచ్చి, తన ఆస్తి సర్వస్వం కోల్పోతాడు. అప్పుడిక తన కొడుక్కి ఇచ్చేందుకు అతని దగ్గర చిల్లి గవ్వకూడా మిగలదు.

15 తల్లి గర్భం నుంచి వ్యక్తి పుట్టినప్పుడు అతని దగ్గర ఏమీ ఉండదు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తనతో తీసుకెళ్లేది ఏమీ ఉండదు. అతను ఆయా వస్తువుల కోసం చచ్చేలా శ్రమిస్తాడు. కాని, తాను చనిపోయినప్పుడు అతను తన వెంట తీసుకువెళ్లగలిగింది ఏమీ ఉండదు. 16 ఇది చాలా విచారకరమైన విషయం. తను ఈ లోకంలోకి ఎలా వస్తాడో అలాగే పోతాడు. కాగా, “గాలిని పట్టుకొనేందుకు చేసే ప్రయత్నం” వల్ల మనిషికి ఒరిగేదేమిటి? 17 దుఃఖంతో, విచారంతో నిండిన రోజులు. నిరాశా నిస్పృహలు అనారోగ్యాలు, చికాకులు చివరికి అతనికి మిగిలేవి ఇవే!

మీ జీవిత కృషి ఫలితాన్ని అనుభవించండి

18 ఈ భూమిమీద ఉత్తమమైనది ఏమనగా, తనకున్న స్వల్ప జీవితకాల వ్యవధిలో మనిషి అన్న పానాలు తృప్తిగా సేవించాలి, తన పని ఫలితాన్ని సుఖంగా అనుభవించాలి. దేవుడు అతనికి ఇచ్చినది ఈ కొద్ది రోజులు మాత్రమే అన్న విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి ఇదే మనిషి చేయగలిగినదన్న విషయాన్ని నేను గమనించాను.

19 దేవుడు ఒక వ్యక్తికి సంపదని, ఆస్తిని హాయిగా అనుభవించే శక్తిని ఇస్తే, ఆ వ్యక్తి వాటిని అనుభవించాలి. ఆ వ్యక్తి తనకున్న వాటిని స్వీకరించాలి. దేవుని వరమైన తన పనిని సంతోషంగా చెయ్యాలి. 20 మనిషి ఆయుష్షు సుదీర్ఘమైనది కాదు కనుక, అతని విషయాలన్నీ తన జీవితం పొడుగునా గుర్తుంచు కోవాలి. ఆ మనిషి ఇష్టంగా చేసే పనిలో దేవుడు అతన్ని నిమగ్నుణ్ణి చేస్తాడు.[b]

2 తిమోతికి 1

పౌలు నుండి నా ప్రియమైన కుమారుడు తిమోతికి వ్రాయడమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి నీకు కృప, దయ, శాంతి లభించుగాక!

నేను దైవేచ్ఛానుసారం యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.

దేవుడు వాగ్దానము చేసిన అనంతజీవితము యేసు క్రీస్తు వలన సంభవిస్తుంది. దాని కారణముగా నేను అపొస్తలుడనయ్యాను.

విశ్వాసంలో ఉండండి

నేను నిష్కల్మష హృదయంతో నా పూర్వికుల దేవునికి సేవచేస్తూ కృతజ్ఞుడనై యున్నాను. రాత్రింబగళ్ళు నిన్ను జ్ఞాపకము పెట్టుకొని నీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను. నీలాంటివాణ్ణి నాకు యిచ్చినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. నీ కన్నీళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూసాక నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది. నీలో ఉన్న నిజమైన విశ్వాసం నాకు జ్ఞాపకము ఉంది. అటువంటి విశ్వాసం మీ అమ్మమ్మ లోయిలోనూ ఉంది. నీ తల్లి యునీకేలో కూడా ఉంది. నీలో కూడా అలాంటిది ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అందుకోసం, నా చేతులు నీ తలపై ఉంచడం వల్ల నీకు దేవుడు యిచ్చిన వరాన్ని ఉపయోగిస్తూ ఉండమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, స్వయం క్రమశిక్షణ గల ఆత్మనిచ్చాడు.

కనుక ప్రభువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గాని, అతని ఖైదీనైన నా విషయము చెప్పవలసి వచ్చినప్పుడు గాని సిగ్గుపడకు. దానికి మారుగా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం నాతో కలిసి కష్టాలు అనుభవించు.

దేవుడు మనల్ని రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. కాని ఇది కేవలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ఉద్దేశానుసారం చేసాడు. దేవుడు కాలానికి ముందే యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు. 10 కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేసాడు. ఈయన తన సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవితాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు.

11 ఈ సువార్తను ప్రకటించటానికి నన్ను వార్తాహరునిగానూ, అపొస్తలునిగానూ, ఉపాధ్యాయునిగానూ నియమించాడు. 12 ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే, నేను విశ్వసించినవాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించినదాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది.

13 నేను నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. యేసు క్రీస్తులో విశ్వాసంతో, ప్రేమతో వాటిని మార్గదర్శంగా ఉంచుకో. 14 దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడు.

15 ఆసియ ప్రాంతములో ఉన్నవాళ్ళంతా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపొయ్యారని నీకు తెలుసు. “పుగెల్లు” “హెర్మొగెనే” కూడా నన్ను వదిలి వెళ్ళిపొయ్యారు. 16 నా చేతికి సంకెళ్ళు ఉన్నాయని సంకోచించక “ఒనేసిఫోరు” ఎన్నోసార్లు వచ్చాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడు గాక! 17 అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు. 18 ఆ “రానున్న రోజున” కనికరము పొందేటట్లు ప్రభువు అతనికి కృప అనుగ్రహించుగాక! నేను ఎఫెసులో ఉన్నప్పుడు అతడు నాకు ఎన్ని విధాల సహాయం చేసాడో నీకు బాగా తెలుసు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International