M’Cheyne Bible Reading Plan
యాజకుల నియమాలు
21 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “యాజకులైన అహరోను కుమారులతో ఈ విషయాలు చెప్పు: అహరోను కుమారులు, యాజకులు. చనిపోయినవారి శవాల్ని తాకి యాజకుడు అపవిత్రుడు కాకూడదు. 3 అయితే చనిపోయిన వ్యక్తి గనుక తన రక్త సంబంధీకుడైతే. అప్పుడు అతడు ఆ శవాన్ని తాకవచ్చు. చనిపోయిన వ్యక్తి యాజకుని తల్లి లేక తండ్రి, కుమారుడు లేక కుమార్తె, సోదరుడు లేక అవివాహిత సోదరి అయితే యాజకుడు అపవిత్రం కావచ్చు. (ఈ సోదరికి భర్త లేడు గనుక ఆమె అతనికి చాలా దగ్గర అవుతుంది. కనుక ఆమె మరణిస్తే, ఆమెకోసం యాజకుడు మైల పడవచ్చు). 4 కానీ చనిపోయిన వ్యక్తి యాజకుని బానిసల్లో ఒక వ్యక్తి అయితే మాత్రం యాజకుడు మైలపడకూడదు.
5 “యాజకులు వారి తలలు గుండు గీసికోగూడదు. యాజకులు వారి గడ్డాల కొనలు కత్తిరించగూడదు. యాజకులు వారి దేహాల్లో ఎక్కడా కోసుకోగూడదు. 6 యాజకులు వారి దేవుని కోసం పవిత్రంగా ఉండాలి. దేవుని పేరంటే వారు భక్తి చూపించాలి. ఎందుచేతనంటే వారు నైవేద్యం, హోమం దేవునికి అర్పించువారు. కనుక వారు పవిత్రంగా ఉండాలి.
7 “యాజకుడు దేవుణ్ణి ప్రత్యేకంగా సేవించేవాడు. అందుచేత మరో మగవాడితో లైంగిక సంబంధం ఉన్న స్త్రీని యాజకుడు వివాహం చేసుకోగూడదు. వేశ్యనుగాని, విడువబడిన స్త్రీనిగాని యాజకుడు వివాహం చేసుకోగూడదు. 8 యాజకుడు ప్రత్యేక విధానంలో దేవుణ్ణి సేవించేవాడు. కనుక మీరు అతణ్ణి ప్రత్యేక విధానంలో చూసుకోవాలి. ఎందుచేతనంటే అతడు పవిత్ర వస్తువుల్ని మోసేవాడు, పవిత్ర రొట్టెల్ని అతడు దేవునికి తీసుకొనివస్తాడు గనుక. నేను పరిశుద్ధుడను. నేను యెహోవాను, మరియు నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను.
9 “ఒక యాజకుని కుమార్తె వేశ్య అయితే ఆమె తన పేరును నాశనం చేసికొంటుంది, తన తండ్రికి అవమానం కలిగిస్తుంది. కనుక ఆమెను కాల్చివేయాలి.
10 “ప్రధాన యాజకుడు తన సోదరుల్లోనుంచి ఎంపిక చేయబడినవాడు. అతని తలమీద అభిషేకతైలం పోయబడింది. ఈ విధంగా అతడు ప్రధాన యాజకునిగా ప్రత్యేక పనికి నియమించబడ్డాడు. ప్రత్యేక వస్త్రాలు ధరించేందుకు అతడు ఏర్పాటు చేయబడ్డాడు. కనుక అతడు తన విచారాన్ని బాహాటంగా చూపించే పనులు చేయకూడదు. అతడు తన తల వెంట్రుకలను చింపిరిజుట్టుగా పెరగ నివ్వకూడదు. అతడు తన బట్టలు చింపుకోగూడదు. 11 మృత దేహాన్ని తాకి అతడు అపవిత్రుడు కాకూడదు. అతని స్వంత తండ్రి, తల్లి చనిపోయినా సరే అతడు ఆ శవాన్ని తాకగూడదు. 12 ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంనుండి బయటకు వెళ్లగూడదు. అతడు అలా గనుకచేస్తే, అతడు అపవిత్రుడై, తర్వాత దేవుని పరిశుద్ధ స్థలాన్ని అతడు అపవిత్రం చేయవచ్చు. ప్రధాన యాజకుని తలమీద ప్రత్యేక తైలం పోయబడింది. ఇదే అతణ్ణి మిగిలిన ప్రజలకంటే ప్రత్యేకం చేసింది. నేను పరిశుద్ధుడైన యెహోవాను.
13 “ప్రధాన యాజకుడు కన్యగా ఉన్న స్త్రీని వివాహం చేసుకోవాలి. 14 ఇదివరకే మరొకనితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న స్త్రీని ప్రధాన యాజకుడు వివాహం చేసుకోగూడదు. ఒక వేశ్యనుగాని, విడువబడిన స్త్రీనిగాని, లేక విధవరాలిని గాని ప్రధాన యాజకుడు వివాహం చేసుకోగూడదు. ప్రధాన యాజకుడు తన స్వంత ప్రజల్లోనే ఒక కన్యను వివాహం చేసుకోవాలి. 15 ఈ విధంగా ప్రజలు అతని పిల్లలకు మర్యాదనిస్తారు. ప్రధాన యాజకుణ్ణి అతని ప్రత్యేక పని నిమిత్తం యెహోవానగు నేనే ప్రత్యేకించాను.”
16 మోషేతో యెహోవా చెప్పాడు: 17 “అహరోనుతో చెప్పు: నీ సంతానంలోని పిల్లలు ఎవరైనాసరే ఏదైనా శారీరక లోపం గలవారైతే వారు దేవునికి ప్రత్యేక రొట్టెలు తీసుకొని వెళ్లకూడదు. 18 అంగవిహీనం ఉన్న ఏ మనిషికూడ యాజకునిగా నాకు సేవ చేయకూడదు, నాకు బలులు అర్పించకూడదు. ఎలాంటివారు యాజకులుగా నన్ను సేవించగూడదు అంటే: గుడ్డి వాళ్లు, కుంటివాళ్లు, పాడైపోయిన ముఖం ఉన్నవాళ్లు, చేతులుగాని కాళ్లుగాని విపరీతంగా పొడవు ఉన్నవాళ్లు, 19 కాలైనా, చేయైనా విరిగినవాళ్లు, 20 గూనివాళ్లు, మరుగుజ్జువాళ్లు, కంటిలో లోపాలు ఉన్నవాళ్లు, దురద లేక చర్మ వ్యాధి ఉన్నవాళ్లు, అణగగొట్టబడిన వృషణాలు ఉన్నవాళ్లు.
21 “అహరోను సంతానంలో ఎవరిలోనైనా ఏదోషమైనా ఉంటే అలాంటి వ్యక్తి యెహోవాకు హోమ అర్పణలు అర్పంచకూడదు. ఆ వ్యక్తి ప్రత్యేక రొట్టెల్ని కూడా దేవునికి తీసుకొని వెళ్ల కూడదు. 22 ఆ వ్యక్తి యాజక కుటుంబంలోని వాడు గనుక అతడు పవిత్ర రొట్టెల్ని తినవచ్చును. అతి పవిత్రమైన రొట్టెల్ని కూడా అతడు తినవచ్చును. 23 కానీ అతడు మాత్రం తెరలోపలి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు గూడ అతడు వెళ్లగూడదు. ఎందుచేతనంటే అతనిలో ఏదో తప్పు ఉంది. అతడు నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేయకూడదు. నేను యెహోవాను ఆ స్థలాల్ని పరిశుద్ధం చేస్తాను!”
24 కనుక అహరోనుతో, అతని కుమారులతో, ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఈ సంగతులు చెప్పాడు.
దావీదు కీర్తన.
26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
2 యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
3 నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
4 పనికిమాలిన ఆ మనుష్యుల్లో
నేను ఒకడ్ని కాను.
5 ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.
6 యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
7 యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
8 యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.
9 యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
వారు కాలు తప్పి పడిపోదురు.
3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
నా మీద దయ చూపించుము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
బలంగా, ధైర్యంగా ఉండుము.
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
చనిపోవడం మెరుగా?
4 నేను చూసిన మరో విషయం ఏమిటంటే, చాలా మంది సరిగ్గా చూడరు. వాళ్లు కన్నీళ్లు పెట్టు కోవడం నేను చూశాను. ఆ విచారగ్రస్తుల్ని ఓదార్చే వాళ్లు ఎవరూ లేరన్న విషయం, క్రూరులైనవాళ్ల చేతుల్లోనే అధికారమంతా ఉందన్న విషయం కూడా నేను గమనించాను. ఆ క్రూరుల చేతుల్లో బాధలుపడేవాళ్లకు ఉపశమనం కలిగించే వాడెవడూ లేడని నేను గమనించాను. 2 ఇంకా బ్రతికున్నవాళ్ల కంటె చనిపోయిన వాళ్ల పరిస్థితులే మెరుగ్గా ఉన్నాయని నేను తీర్మానించుకున్నాను. 3 (పురింట్లోనే చనిపోయే వాళ్ల) పరిస్థితి అంతకంటే కూడా మెరుగ్గా ఉంది! ఎందుకంటే, ఈ ప్రపంచంలో జరిగే ఏ చెడుగునూ వాళ్లెన్నడూ చూడరు.
మరీ కష్టపడి పనిచెయ్యడం ఎందుకు?
4 తర్వాత నేనిలా అనుకున్నాను, “మనుష్యులు మరింత కష్టపడి పనిచేస్తారెందుకు?” కొందరు విజయం సాధించి ఇతరులకంటె మెరుగవాలని ప్రయత్నించడం నేను చూశాను. ఎందుకంటే, వాళ్లలో ఈర్ష్య ఉంది. తమకి ఉన్నదానికంటె ఇతరులు అధికంగా కలిగివుండటం వాళ్లకి ఇష్టం లేదు. ఇది కూడా బుధ్ది హీనత. ఇది గాలిని పట్టుకొనే ప్రయత్నం.
5 కొందరు ఇలా అంటారు: “ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం మూర్ఖత్వం. మీరు పనిచెయ్యకపోతే పస్తులుండి చస్తారు.” 6 బహుశాః ఈ మాట నిజమే కావచ్చు. మరికొన్ని సంపాదించు కోవాలని సదా తంటాలు పడటం కంటె, ఉన్న కొద్దివాటితో తృప్తి చెందడం మెరుగని నా ఉద్దేశం.
7 మతిమాలిన మరో విషయం నేను గమనించాను, 8 ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి కుటుంబం ఉండకపోవచ్చు. ఒక కొడుకో, ఒక సోదరుడో ఉండక పోవచ్చు. అయితేనేమి, అతను రెక్కలు విరుచుకొని అతిగా పని చేస్తూనే ఉంటాడు. తనకి ఉన్నదానితో అతను ఎన్నడూ తృప్తిచెందడు. అతను నిర్విరామంగా కష్టించి పనిచేసి, “నేనిలా ఎందుకు రెక్కలు విరుచుకొని పనిచేస్తున్నట్లు? నేను నా జీవితాన్ని హాయిగా ఎందుకు గడపకూడదు?” అని అనుకో. ఇది కూడా చెడ్డదే అర్థరహితమైనదే.
మిత్రులు, కుటుంబం బలం యిస్తారు
9 ఒకరికంటె ఇద్దరు మెరుగు. ఇద్దరు కలిసి పనిచేస్తే, తాము చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం పొందుతారు.
10 ఒకడు పడిపోతే రెండోవాడు అతనికి సహాయం చెయ్యగలుగుతాడు. ఒంటరిగాడు పడి పోయినప్పుడు అతను నిస్సహాయుడవుతాడు. అక్కడ అతనికి సాయపడేవాడు ఎవడూ వుండడు.
11 ఇద్దరు జంటగా పడుకుంటే, వాళ్లకి వెచ్చగా ఉంటుంది. ఒంటిగా నిద్రించేవాడికి వెచ్చదనం ఉండదు.
12 ఒంటరి వ్యక్తిని శత్రువు ఓడించగలుగుతాడు. అయితే, అదే శత్రువు ఇద్దర్ని ఓడించలేడు. అదే ముగ్గురుంటే, ఇంకా ఎక్కువ బలం కలిగివుంటారు. ముప్పేట తాడును తెంచలేనట్లే, వాళ్లని దెబ్బతియ్యడం చాలా కష్టసాధ్యమవుతుంది.
జనం, రాజకీయాలు, పలుకుబడి
13 వృద్ధుడే అయినా బుద్ధిహీనుడైన రాజుకంటె, బీదవాడే అయినా బుద్ధిశాలి అయిన యువ నాయకుడు మేలు. ఆ ముసలి రాజు హెచ్చరికలను చెవిన పెట్టడు. 14 ఆ యువ రాజు రాజ్యంలో పేదవాడై పుట్టి ఉండవచ్చు. బహుశాః అతను చెరనుండి బయటకు వచ్చిన రాజు అవ్వొచ్చు. 15 నేనీ ప్రపంచంలో మనుష్యుల్ని పరిశీలించాను. నాకీ విషయం తెలుసు: జనం ఆ యువకుణ్ణే అనుసరిస్తారు. అతనే కొత్త రాజు అవుతాడు. 16 తండోపతండాలుగా జనం అ యువకుణ్ణి అనుసరిస్తారు. అయితే, దరిమిలా, ఆ జనమే అతనంటే ఇష్టపడరు. ఇది అర్థరహితమే. ఇది గాలిని పట్టుకొన ప్రయత్నించడం లాంటిదే.
బానిసలకు ప్రత్యేక నియమాలు
6 బానిసత్వంలో ఉన్నవాళ్ళు తమ యజమానులను పూర్తిగా గౌరవించాలి. అప్పుడే దేవునికి, మా బోధనకు చెడ్డపేరు రాకుండా ఉంటుంది. 2 యజమానులు దేవుని కుటుంబానికి చెందినంత మాత్రాన బానిసలు వారిని గౌరవించటం మానుకోరాదు. అలా కాక వాళ్ళకు యింకా ఎక్కువ సేవ చేయాలి. ఎందుకంటే ఈ సేవ పొందే వాళ్ళు భక్తులు. వీరు ప్రేమ చూపుతున్న వాళ్ళు.
ఈ విధంగా నీవు వీటిని ఉపదేశించి ఆచరణలో పెట్టుమని వాళ్ళకు చెప్పు.
ధన ఆశ
3 మన యేసు క్రీస్తు ప్రభువు బోధించిన చక్కటి ఉపదేశాలను, మన దేవుని సేవకు సంబంధించిన సక్రమ మార్గాలను వదిలి యితర మార్గాలను బోధించువాడు 4 మోసగాడు అన్నమాట. అలాంటి వానికి ఏమీ తెలియదన్నమాట. అలాంటి వానిలో వివాదాస్పదమైన విషయాలను అనవసరంగా తర్కించాలనే అనారోగ్యకరమైన ఆసక్తి ఉంటుంది. అది ద్వేషానికి, పోరాటానికి, దూషణలకు, దుష్టత్వంతో నిండిన అనుమానాలకు దారి తీస్తుంది. 5 అంతేకాక, సత్యాన్ని గ్రహించక దైవభక్తి, ధనార్జనకు ఒక సాధనమని భావించే దుష్టబుద్ధి గలవాళ్ళ మధ్య నిరంతరమైన ఘర్షణలు కలుగుతాయి.
6 కాని సంతృప్తితో ఉండి, భక్తిని అవలంభిస్తే అదే ఒక గొప్ప ధనము. 7 ఈ లోకంలోకి మనమేమీ తీసుకురాలేదు. ఈ లోకంనుండి ఏమీ తీసుకుపోలేము. 8 మనకు తిండి, బట్ట ఉంటే చాలు. దానితో తృప్తి పొందుదాము. 9 కాని ధనవంతులు కావాలనుకొనేవారు, ఆశలకులోనై మూర్ఖత్వంతో హానికరమైన ఆశల్లో చిక్కుకుపోతారు. అవి వాళ్ళను అధోగతి పట్టించి పూర్తిగా నాశనం చేస్తాయి. 10 ధనాశ అన్ని రకాల దుష్టత్వానికి మూలకారణం. కొందరు, ధనాన్ని ప్రేమించి, క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసానికి దూరమైపోయారు. తద్వారా దుఃఖాల్లో చిక్కుకుపోయారు.
తిమోతికి చెప్పిన ఉపదేశము
11 కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో. 12 నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు. 13 అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట, పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 14 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తీ రానివ్వకుండా చూడు. 15 “మన పాలకుడు,” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసు క్రీస్తును పంపుతాడు. 16 మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన శక్తి తరగకుండా ఉండుగాక! అమేన్.
17 ధనవంతులు గర్వించరాదనీ, క్షణికమైన ధనాన్ని నమ్మకూడదనీ, వాళ్ళతో చెప్పుదానికి మారుగా మన ఆనందానికి అన్నీ సమకూర్చే దేవుణ్ణి నమ్ముమని ఆజ్ఞాపించు. 18 సత్కార్యాలు చేస్తూ సత్ ప్రవర్తన కలిగి అవసరమైనవాటిని యితర్లతో ఔదార్యముగా పంచుకుంటూ ఉండుమని ఆజ్ఞాపించు. 19 ఈ విధంగా ఆత్మీయతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం పొందకల్గుతారు.
20 తిమోతీ, నీకు అప్పగింపబడిన సత్యాన్ని జాగ్రత్తగా కాపాడు. ఆత్మీయతలేని చర్చలకు దూరంగా ఉండు. జ్ఞానంగా చెప్పబడే వ్యతిరేక సిద్ధాంతాలకు దూరంగా ఉండు. 21 కొందరు ఈ వ్యతిరేక సిద్ధాంతాలు బోధించారు. ఇలా చేసిన వాళ్ళు, మనము విశ్వసిస్తున్న సత్యాలను వదిలి తప్పు దారి పట్టారు.
దైవానుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!
© 1997 Bible League International