Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 20

విగ్రహారాధనగూర్చి హెచ్చరిక

20 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు కూడా నీవు చెప్పాలి: మీ దేశంలో ఒక వ్యక్తి తన పిల్లలలో ఒకరిని దొంగదేవత మోలెకునకు అర్పించడం జరగవచ్చు, అప్పుడు ఆ వ్యక్తిని చంపెయ్యాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడైనా లేక ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయుడైనా సరే, ఆ వ్యక్తిమీద మీరు రాళ్లు విసిరి చంపివేయాలి. నేను ఆ వ్యక్తికి విముఖుడ్ని. అతణ్ణి అతని ప్రజల్లోనుంచి నేను వేరుచేస్తాను. ఎందుచేతనంటే అతడు తన పిల్లల్ని మోలెకునకు ఇచ్చాడు. నా పవిత్ర నామం అంటే అతనికి గౌరవం లేదని అతడు వ్యక్తం చేసాడు. నా పవిత్ర స్థలాన్ని అతడు అపవిత్రం చేసాడు. ఒకవేళ సామాన్యులు అతణ్ణి పట్టించుకోక పోవచ్చు, ఒకవేళ తన పిల్లల్ని మోలెకునకు అర్పించినవాణ్ణి వారు పట్టించు కొనక పోవచ్చును, కానీ నేను మాత్రం అతనికి, అతని కుటుంబానికి విరోధంగా ఉంటాను. అతణ్ణి తన ప్రజల్లోనుంచి నేను వేరుచేసేస్తాను. నాకు అపనమ్మకంగా ఉండి, మోలెకును వెంబడించే ఏ వ్యక్తినైనా సరే నేను వేరు చేసేస్తాను.

“సలహాకోసం కర్ణపిశాచుల దగ్గరకు, సోదె చెప్పేవారి దగ్గరకు వెళ్ళే ఏ వ్యక్తికైనా సరే నేను విరోధంగా ఉంటాను. అలాంటి వ్యక్తి నాకు అపనమ్మకంగా ఉన్నాడు. కనుక అలాంటి వాణ్ణి తన ప్రజల్లోనుంచి నేను వేరు చేసేస్తాను.

“ప్రత్యేకంగా ఉండండి. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. ఎందుచేతనంటే నేను పవిత్రుడను గనుక. నేను యెహోవాను మీ దేవుణ్ణి. నా ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని విధేయులుగా ఉండండి. నేను యెహోవాను మరియు నా ప్రత్యేక ప్రజలుగా నేను మిమ్మల్ని చేసాను.

“ఏ వ్యక్తిగాని తన తండ్రిని లేక తల్లిని శపించినట్లయితే ఆ వ్యక్తిని చంపేయాలి. అతడు తన తండ్రిని లేక తల్లిని శపించాడు గనుక అతణ్ణి చెంపేయాల్సిందే.

లైంగిక పాపాలకు శిక్ష

10 “మగవాడు ఒకడు తన పొరుగువాని భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకొంటే ఆ మగవాడు ఆడది ఇద్దరూ వ్యభిచార అపరాధులే. అందుచేత మగవాడు, ఆడది ఇద్దరూ చంపబడాల్సిందే. 11 ఒక మగవాడు తన తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకొంటే ఆ మగవాణ్ణి చంపివేయాలి. ఆ మగవాణ్ణి, అతని తండ్రి భార్యను, ఇద్దర్నీ చంపివేయాలి. వాడు తన తండ్రికి విరుద్ధంగా పాపం చేసాడు.

12 “ఒక మగవాడు తన కోడలితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, వాళ్ళిద్దర్నీ చంపివేయాలి. వాళ్లు చాలా దారుణమైన లైంగిక పాపం చేసారు. వాళ్లు శిక్షించబడాల్సిందే.

13 “ఒక మగవాడు ఒక స్త్రీతో కలిగి ఉన్నట్టుగా మరో మగవాడితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, వీళ్ళిద్దరు మగవాళ్లూ చాలా దారుణ పాపం చేసినట్టే. వాళ్ళను చంపివేయాల్సిందే. వాళ్ళ శిక్షకు వాళ్లే కారకులు.

14 “ఒక మగవాడు ఒక స్త్రీతో, ఆమె తల్లితో కూడా లైంగిక సంబంధాలు కలిగి ఉంటే అది లైంగిక పాపం. ఆ మగవాడ్ని, ఆడవాళ్లు ఇద్దర్నీ ప్రజలు కాల్చి వేయాలి. మీ ప్రజల మధ్య ఇలాంటి లైంగిక పరమైన పాపం జరగనివ్వకండి.

15 “ఒక మగావాడు ఒక జంతువుతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే అతణ్ణి చంపివేయాల్సిందే. మరియు మీరు ఆ జంతువును గూడ చంపివేయాలి. 16 ఒక స్త్రీ గనుక ఒక జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకొంటే, ఆ స్త్రీని, జంతువును కూడ మీరు చంపివేయాలి. వారిని చంపేయాలి, వాళ్ళ శిక్షకు వాళ్లే కారకులు.

17 “ఒక సోదరుడు అతని సోదరి అనగా తండ్రి కుమార్తెగాని, తల్లి కుమార్తెగాని ఒకరితో ఒకరు లైంగిక సంబంధం పెట్టుకోవటం[a] చాలా సిగ్గుచేటు. వాళ్లను బహిరంగంగా శిక్షించాలి. వాళ్ల ప్రజల్లోనుంచి వాళ్లను వేరు చేయాలి. తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మగవాడు అతని పాపం నిమిత్తం శిక్షపొందాలి.

18 “ఒక స్త్రీ నెలసరి రక్తస్రావ సమయంలో ఒక మగవాడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకొంటే ఆ స్త్రీ పురుషులు ఇద్దర్నీ వాళ్ల ప్రజల్లోనుంచి వేరు చేయాలి. ఆమె రక్తస్రావ స్థానాన్ని వారు బహిర్గతం చేసారు గనుక వాళ్లు పాపం చేసారు.

19 “మీ తల్లి సోదరితో గాని, తండ్రి సోదరితో గాని లైంగిక సంబంధాలు పెట్టుకో గూడదు. అది రక్తసంబంధికుల పాపం. వాళ్ల పాపం మూలంగా వాళ్లు శిక్ష పొందాలి.

20 “ఒకడు తన పినతల్లితో శయనించగూడదు. అతడు, అతని పినతల్లికూడ వారు చేసిన పాపం మూలంగా శిక్ష పొందుతారు. వాళ్లు పిల్లలు లేకుండా చస్తారు.

21 “ఎవడైనా తన సోదరుని భార్యను చేర్చుకోవడం తప్పు. వాడు తన సోదరునికి విరోధంగా పాపం చేసాడు. వాళ్లకూ పిల్లలు ఉండరు.

22 “నా ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను మిమ్మల్ని మీ దేశానికి నడిపిస్తున్నాను. ఆ దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులైతే ఆ దేశం మిమ్మల్ని వెళ్లగొట్టదు. 23 ఇతర ప్రజల్ని ఆ దేశంలో నుండి నేను వెళ్ల గొట్టేస్తున్నాను. ఎందుచేతనంటే వాళ్లు అలాంటి పాపాలన్నీ చేసారు. ఆ పాపాలంటే నాకు అసహ్యం. కనుక వాళ్లు జీవించినట్టు మీరు జీవించకండి. 24 వాళ్ల దేశం మీది అవుతుంది. అని నేను మీతో చెప్పాను. వాళ్ల దేశాన్ని నేను మీకు యిస్తాను. అది మీ దేశం అవుతుంది. ఆ దేశం చాలా మంచి దేశం. పాలు, తేనెలు ప్రవహించే దేశం అది. నేను మీ దేవుడైన యెహోవాను.

“నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకొన్నాను. ఇతరులకంటే మిమ్మల్ని నేను వేరుగా చూసుకొన్నాను. 25 కనుక పవిత్ర జంతువుల్ని అపవిత్ర జంతువులకంటె వేరుగా మీరు చూసుకోవాలి. పవిత్ర పక్షుల్ని అపవిత్ర పక్షుల కంటే వేరుగా మీరు చూసుకోవాలి. అపవిత్ర పక్షులు, జంతువులు, నేలమీద ప్రాకే వాటిలో దేన్నీ మీరు తినవద్దు. నేను వాటిని అపవిత్రంగా చేసాను. 26 నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసాను. అందుచేత మీరు నా కోసం పవిత్రంగా ఉండాలి. ఎందుచేతనంటే నేను యెహోవాను, నేను పవిత్రుణ్ణి.

27 “కర్ణపిశాచి, సోదెచెప్పేవారు, మగవాడు గాని, స్త్రీగాని చంపబడాల్సిందే. రాళ్లతో ప్రజలు వారిని చంపివేయాలి. వాళ్లు శిక్షించబడాలి.”

కీర్తనలు. 25

దావీదు కీర్తన.

25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
    నేను నిరాశచెందను.
    నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
    కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
    వారికి ఏమీ దొరకదు.

యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
    నీ మార్గాలను ఉపదేశించుము.
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
    నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
    రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
    నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
    యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.

యెహోవా నిజంగా మంచివాడు.
    జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
    న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
    ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.

11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను.
    కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు.

12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే
    అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు.
13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు.
    అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు.
14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు.
    ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు.
15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి.
    ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.

16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను.
    నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము.
17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము.
    నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.
18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము.
    నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము.
19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము,
    నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు.
20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు.
21 దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను.
    కనుక నన్ను కాపాడుము.
22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.

ప్రసంగి 3

ప్రతిదానికి ఒక తరుణం

ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి మీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది.

పుట్టేందుకొక సమయం వుంది,
    చనిపోయేందుకొక సమయం వుంది.
మొక్కలు నాటేందుకొక సమయం వుంది,
    మొక్కలు పెరికేందుకొక సమయం వుంది.
చంపేందుకొక సమయం వుంది,
    గాయం మాన్పేందుకొక సమయం వుంది.
నిర్మూలించేందుకొక సమయం వుంది,
    నిర్మించేందుకొక సమయం వుంది.
ఏడ్చేందుకొక సమయం వుంది,
    నవ్వేందుకొక సమయం వుంది.
దుఃఖించేందుకొక సమయం వుంది.
    సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది.
ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది,
    వాటిని తిరిగి చేపట్టేందుకొక సమయం వుంది.
ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది,
    ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది.[a]
దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది,
    అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది.
వస్తువులు పదిలపర్చు కొనే సమయం వుంది,
    వాటిని పారవేసే సమయం వుంది.
వస్త్రం చింపేందుకొక సమయం వుంది,
    దాన్ని కుట్టేందుకొక సమయం వుంది.
మౌనానికొక సమయం వుంది.
    మాట్లాడేందు కొక సమయం వుంది.
ప్రేమించేందుకొక సమయం వుంది,
    ద్వేషించేందుకొక సమయం వుంది.
సమరానికొక సమయం వుంది,
    శాంతికొక సమయం వుంది.

దేవుడు తన జగత్తుని అదుపు చేస్తాడు

మనిషి చేసే కష్ట భూయిష్టమైన పనికిగాను అతనికి నిజంగా ఏమైనా లభిస్తుందా? (లేదు!) 10 చేసేందుకు దేవుడు మనకిచ్చే కష్ట భూయిష్టమైన పనులన్నీ ఏమిటో నేను గుర్తించాను. 11 తన జగత్తును గురించి ఆలోచించే సామర్థ్యాన్ని దేవుడు మనకి యిచ్చాడు.[b] అయితే దేవుడు చేసే వాటన్నింటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసు కోలేము. అయితేనేమి, దేవుడు అన్ని పనుల్నీ సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు.

12 తాము బతికినంత కాలము సంతోషంగా ఉండటం, తనివితీరా సుఖాలు అనుభవించడం ఇవి మనుష్యులు చేయవలసిన అత్యుత్తమమైన పని అన్న విషయం నేను గ్రహించాను. 13 ప్రతి మనిషి తినాలి, తాగాలి, తాను చేసే పనిని ఆహ్లాదంగా చెయ్యాలి ఇది దేవుడు కోరుకునేది. ఇవి దేవుడిచ్చిన వరాలు.

14 దేవుడు చేసేది ప్రతీది శాశ్వతంగా కొనసాగుతుందని నేను తెలుసుకున్నాను. దేవుడు చేసినదానికి మనుష్యులు దేన్నీ ఎంతమాత్రం జోడించలేరు మరియు దేవుడు చేసే పనినుండి దేనినీ తీసుకొనలేరు. మనుష్యులు తనని గౌరవించేందుకే దేవుడు ఇదంతా చేశాడు. 15 గతంలో జరిగినవేవో జరిగాయి, (మరి మనం వాటిని మార్చలేము.) భవిష్యత్తులో జరగ బోయేవేవో జరుగుతాయి. (మనం వాటిని మార్చలేము) అయితే, ఎవరైతే చెడ్డగా చూడబడ్డారో, వారికి దేవుడు మంచి చెయ్యాలని కోరుకుంటాడు.[c]

16 ఈ ప్రపంచములో యీ విషయాలన్నీ నేను చూశాను. న్యాయ స్థానాల్లో మంచితనము, న్యాయము నిండుగా ఉండాలి, అయితే అక్కడ మనం కనుగొంటుంది చెడుగు. 17 అందుకని, నాలో నేను ఇలా అనుకున్నాను: “దేవుడు ప్రతి పనికి ఒక కాలాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు, మనుష్యులు చేసే పనులన్నింటిని విచారించేందుకు దేవుడు ఒక ప్రత్యేక కాలాన్ని ఎంచుకున్నాడు. దేవుడు మంచివాళ్లని విచారిస్తాడు, చెడ్డవాళ్లని విచారిస్తాడు.”

మనుష్యులకి జంతువులకి భేదమే లేదా?

18 మనుష్యులు ఒకరిపట్ల మరొకరు వ్యవహరించే తీరును గమనించిన నేను నాలో నేనిలా అనుకున్నాను, “తాము జంతువుల మాదిరిగా వున్నామన్న విషయాన్ని మనుష్యులు గమనించాలని దేవుడు కోరుకున్నాడు. 19 మనిషి జంతువుకంటే మెరుగైనవాడా? (కాడు) ఎందుకని? ఎందుకంటే, అన్ని నిష్ర్పయోజనం కనుక. మనుష్యులూ మరణిస్తారు. జంతువులూ మరణిస్తాయి. ఒకే ‘ఊపిరి’[d] మనుష్యుల్లోనూ, జంతువుల్లోనూ ఉన్నది. చనిపోయిన జంతువుకి, మనిషికి మధ్య తేడా ఏమైనా ఉందా? 20 అన్ని ఒక్క చోటుకే పోతాయి. అవి ఏ మట్టినుంచి పుట్టాయో చివరికి ఆ మట్టిలోకే పోతాయి. 21 మనిషి ఆత్మకి ఏమి జరుగుతుందో ఎవరికెరుక? జంతువు ఆత్మ పాతాళానికి పోతే, మనిషి ఆత్మ పైకి దేవుని దగ్గరికి వెళ్తుందేమో ఎవరికి తెలుసు?”

22 అందుకని, మనిషి తాను చేసే పనిలో ఆనందం పొందడమే అత్యుత్తమమైనదని నేను గ్రహించాను. అదే వాళ్ల భాగ్యం. (మరో విషయంయేమంటే, భవిష్యత్తు గురించి మనిషి దిగులు పెట్టుకోకూడదు.) ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు మనిషికి ఎవ్వరూ తోడ్పడలేరు.

1 తిమోతికి 5

వృద్ధులతో కఠినంగా మాట్లాడవద్దు. వాళ్ళను తండ్రులుగా భావించి సలహాలు చెప్పు. చిన్నవాళ్ళను నీ తమ్ముళ్ళుగా భావించు. వయస్సు మళ్ళిన స్త్రీని నీ తల్లిగా, చిన్న వయస్సుగల స్త్రీని పవిత్ర హృదయంతో నీ సోదరిగా భావించు.

వితంతువులను జాగ్రత్తగా చూడు

అవసరంలో ఉన్న వితంతువులకు సహాయం చేయి. వితంతువులకు పిల్లలు గాని, పిల్లల పిల్లలు గాని ఉన్నట్లైతే, వాళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకోవటం ముఖ్యంగా నేర్చుకోవాలి. ఆ విధంగా తమ సంఘానికి సంబంధించి కర్తవ్యాలను నిర్వర్తించాలి. అలా చేస్తే తమ తల్లిదండ్రుల రుణం, తాత ముత్తాతల రుణం తీర్చుకొన్నట్లవుతుంది. అది దేవునికి సంతృప్తి కలుగ చేస్తుంది. ఒంటరిగా దీనావస్థలో ఉన్న వితంతువు తన ఆశల్ని దేవునిలో పెట్టుకొని, సహాయం కోసం రాత్రింబగళ్ళు ప్రార్థిస్తుంది. కాని భోగాలకొరకు జీవించే వితంతువు జీవిస్తున్నా మరణించినట్లే. ఈ ఉపదేశాలను ప్రజలకు బోధించు. అప్పుడు వాళ్ళలో ఎవ్వరూ నీలో తప్పు పట్టలేరు. తన స్వంతవారిని ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేనివాడు మనం నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయినవానితో సమానం. అతడు దేవుణ్ణి నమ్మనివానికన్నా అధ్వాన్నం.

ఒకే పురుషుణ్ణి పెండ్లాడి అరవై ఏండ్లు దాటి ఉంటే తప్ప ఆమె పేరు వితంతువుల జాబితాలో చేర్చరాదు. 10 అంతేకాక, సత్కార్యాలు చేసే స్త్రీయని ఆమెకు మంచి పేరుండాలి. పిల్లల్ని సక్రమంగా పెంచటం, అతిథి సత్కారాలు చెయ్యటం, పవిత్రుల కాళ్ళు కడగటం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చెయ్యటంలాంటి గుణాలు ఆమెలో ఉండాలి. తన జీవితాన్ని యిలాంటి మంచి పనులు చెయ్యటానికి అంకితం చేసిన స్త్రీగా ఉండాలి.

11 చిన్న వయస్సుగల వితంతువుల్ని ఈ జాబితాలో చేర్చవద్దు. వాళ్ళ వాంఛలు క్రీస్తు పట్ల వాళ్ళకున్న భక్తిని మించిపోయినప్పుడు, వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకొంటారు. 12 తద్వారా తమ మొదటి ప్రమాణాన్ని ఉల్లంఘిస్తారు. ఇలా చెయ్యటంవల్ల వాళ్ళకు శిక్ష లభిస్తుంది. 13 పైగా వాళ్ళు వ్యర్థంగా కాలయాపన చెయ్యటానికి, ఇంటింటికి తిరగటానికి అలవాటు పడిపోతారు. వాళ్ళిలా కాలయాపన చెయ్యటమే కాకుండా, యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి అలవాటుపడ్తారు. వాళ్ళకు మౌనంగా ఉండటం చేతకాదు. 14 అందువల్ల చిన్న వయస్సులో ఉన్న వితంతువులు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని, తమ యిండ్లను చూసుకోవాలి. ఇది నా సలహా. అప్పుడు వాళ్ళను నిందించడానికి యితర్లకు ఆస్కారము ఉండదు. 15 నిజానికి కొందరు సాతాన్ను అనుసరించటానికి యిదివరకే తిరిగి వెళ్ళారు.

16 క్రీస్తును విశ్వసించే స్త్రీ,[a] తన కుటుంబంలో వితంతువులున్నట్లైతే, వాళ్ళకు సహాయం చేయాలి. సంఘంపై ఆ భారం వేయరాదు. అప్పుడు క్రీస్తు సంఘం నిజంగా ఆసరాలేని వితంతువులకు సహాయం చేయకల్గుతుంది.

పెద్దలూ, తదితర సంగతుల్నిగూర్చి

17 క్రీస్తు సంఘం యొక్క కార్యక్రమాలు నడిపించే పెద్దలు, ముఖ్యంగా ఉపదేశించటానికి, బోధించటానికి కష్టపడి పని చేస్తున్న పెద్దలు రెట్టింపు గౌరవానికి అర్హులు. 18 ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “ధాన్యము తొక్కే ఎద్దు మూతి కట్టరాదు” మరియు “పని చేసే వానికి కూలి దొరకాలి” అని వ్రాయబడి ఉంది.

19 ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉంటే తప్ప సంఘం పెద్దల మీద మోపిన నేరాన్ని పరిశీలించవద్దు. 20 తప్పు చేసినవాళ్ళను బహిరంగంగా ఖండించు. అలా చేస్తే అది చూసి మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు.

21 నేను దేవుని సమక్షంలో, యేసు క్రీస్తు సమక్షంలో, దేవుడు ఎన్నుకొన్న దేవదూతల సమక్షంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఒకని పక్షం వహించి మరొకని పట్ల వ్యతిరేకంగా ఉండవద్దు. నిష్పక్షపాతంగా ఈ ఆజ్ఞల్ని అమలులో పెట్టు. ఏది పక్షపాతంతో చెయ్యవద్దు.

22 నీవు తొందరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయవద్దు. ఇతర్ల పాపాల్లో భాగస్తుడవు కావద్దు. నిన్ను నీవు పవిత్రంగా చూచుకో.

23 నీళ్ళు మాత్రమే త్రాగవద్దు. నీ కడుపు బాగు కావటానికి కొద్దిగా ద్రాక్షారసము త్రాగు. అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు.

24 కొందరు చేసిన పాపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వాళ్ళకన్నా ముందు తీర్పుకై పరుగెత్తుచున్నాయి. మరి కొందరి పాపాలు ఆలస్యంగా కనిపిస్తాయి. 25 అదే విధంగా మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. రహస్యంగానుండే మంచి పనులు కూడా బయలు పరచబడును.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International