Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 19

ఇశ్రాయేలు దేవుని సొత్తు

19 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీ దేవుడైన యెహోవాను నేను పవిత్రుణ్ణి కనుక మీరునూ పవిత్రంగా ఉండాలి!

“మీలో ప్రతి ఒక్కరూ తన తల్లిని, తండ్రిని గౌరవించాలి, నా ప్రత్యేక విశ్రాంతి దినాలను పాటించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.

“విగ్రహాలను పూజించకండి. మీకోసం అచ్చు వేసిన విగ్రహ దేవతలను చేసుకోవద్దు. నేనే మీ దేవుడైన యెహోవాను.

“మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించేటప్పుడు, మీరు స్వీకరించబడేందుకు దానిని అర్పించాలి. మీరు దాన్ని అర్పించిన రోజున, ఆ మరునాడు దాన్ని తినవచ్చును. కానీ ఆ బలిలో ఏమైనా మూడో నాటికి మిగిలి ఉంటే దాన్ని మీరు అగ్నితో కాల్చివేయాలి. బలిలోనిది ఏదైనా మూడో రోజున తింటే అది దారుణ పాపం. అది స్వీకరించబడదు. అలా చేసే వ్యక్తి పాపం చేసిన అపరాధి అవుతాడు. ఎందుచేతనంటే యెహోవాకు చెందిన పవిత్ర విషయాలను అతడు గౌరవించలేదు కనుక ఆ వ్యక్తి తన ప్రజల్లోనుంచి వేరు చేయబడాలి.

“కోతకాలంలో మీరు మీ పంటకోసేప్పుడు, మొత్తం మీ పొలాల మూలవరకు కోసెయ్యకండి. ఒకవేళ గింజలు ఏమైనా నేలమీద పడితే ఆ గింజలు మీరు ఏరుకోగూడదు. 10 మీ ద్రాక్షా తోటల్లో ద్రాక్షాపండ్లన్నీ ఏరుకోవద్దు. నేలమీద పడిన ద్రాక్షపండ్లను ఏరుకోవద్దు. ఎందుచేతనంటే, పేదవాళ్ళ కోసం, మీ దేశంగుండా ప్రయాణం చేసే వాళ్ళకోసమూ మీరు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడైన యెహోవాను.

11 “మీరు దొంగతనం చేయకూడదు. మీరు ప్రజల్ని మోసం చేయకూడదు. మీరు ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు. 12 నా నామాన్ని ప్రయోగించి దొంగ వాగ్దానాలు చేయకూడదు. మీరు అలా చేస్తే, మీ దేవుని పేరుమీద మీకు భక్తి లేదని మీరు వ్యక్తంచేస్తారు. నేను యెహోవాను.

13 “మీ పొరుగువారికి మీరు కీడు చేయకూడదు. మీరు అతని దగ్గర దోచు కోగూడదు. కూలివాని కూలి మర్నాటి ఉదయం వరకు మీరు బిగబట్టి ఉంచకూడదు.

14 “మీరు చెవిటివారిని శపించకూడదు. గుడ్డివారి యెదుట ఏదీ అడ్డముంచి వారిని పడిపోయే విధంగా చేయకూడదు. కాని నీవు దేవునికి భయపడాలి. నేను యెహోవాను.

15 “తీర్పు విషయంలో మీరు న్యాయంగా ఉండాలి. పేదవాళ్ళకి ప్రత్యేకంగా పక్షపాతం చూపెట్టకూడదు. ప్రముఖులనీ పక్షపాతం చూపెట్ట కూడదు. మీ పొరుగు వారికి తీర్పు చెప్పేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి. 16 మీరు ఇతరులను గూర్చి తప్పడు కథలు వ్యాపింపజేస్తూ తిరగకూడదు. నీ పొరుగువాని ప్రాణానికి అపాయం కలిగించేది ఏదీ చేయవద్దు. నేను యెహోవాను.

17 “నీ సోదరుణ్ణి నీ హృదయంలో కూడా నీవు ద్యేషించకూడదు. ఒకవేళ నీ పొరుగువాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని గూర్చి అతనితో మాట్లాడు. అయితే అతణ్ణి క్షమించు. 18 మనుష్యులు నీకు చేసిన కీడును మరచిపో. వారికి తిరిగి కీడు చేయాలని ప్రయత్నించకు. నిన్ను నీవు ప్రేమించుకొన్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. నేను యెహోవాను.

19 “నా ఆజ్ఞలకు నీవు విధేయత చూపాలి. రెండురకాల పశువులను కలిసి సంతానోత్సత్తి చేయకూడదు. రెండు రకాల విత్తనాలు నీ పొలంలో నీవు చల్లకూడదు. రెండు రకాల మిశ్రమ దారాలతో నేయబడిన బట్టలు నీవు తొడగకూడదు.

20 “మరొకని బానిస స్త్రీతో ఒకడు లైంగిక సంబంధాలు పెట్టుకోవటం సంభవించవచ్చు. అయితే ఈ బానిస స్త్రీ డబ్బుతో ఖరీదు చేయబడలేదు, లేక స్వతంత్రమూ పొందలేదు. ఇలా గనుక జరిగితే వారికి శిక్ష విధించాలి. కానీ వారికి మరణ శిక్ష లేదు. ఎందుచేతనంటే ఆ స్త్రీ స్వతంత్రురాలు కాదు. 21 ఆ మగవాడు సన్నిధి గుడార ద్వారం దగ్గరకు అపరాధపరిహారార్థ బలి అర్పణను తీసుకొని రావాలి. అపరాధపరిహారార్థ బలిగా ఒక గొర్రెపొట్టేలును అతడు తీసుకొని రావాలి. 22 అతణ్ణి పవిత్రం చేసే కార్యాన్ని యాజకుడు జరిగిస్తాడు. ఆ పొట్టేలును అతడు చేసిన పాపం కోసం అపరాధపరిహారార్థ బలిగా యెహోవా ఎదుట యాజకుడు అర్పించాలి. అప్పుడు అతడు చేసిన పాపం విషయంలో అతడు క్షమాపణ పొందుతాడు.

23 “ముందుకు మీరు మీ దేశంలో ప్రవేశిస్తారు. ఆ సమయంలో ఆహారంకోసం మీరు ఎన్నో రకాల చెట్లు నాటుతారు. ఒక చెట్టును నాటిన తర్వాత మూడు సంవత్సరాలవరకు ఆ చెట్టు ఫలం ఏదీ మీరు తినకూడదు. ఆ ఫలాన్ని మీరు ఉపయోగించకూడదు. 24 నాలుగో సంవత్సరం ఆ చెట్టు ఫలం యెహోవాదే అవుతుంది. అది యెహోవాకు పవిత్ర స్తుతి అర్పణ. 25 అప్పుడు అయిదో సంవత్సరం ఆ చెట్టు ఫలం మీరు తినవచ్చు. మరియు ఆ చెట్టు మీకు విస్తార ఫలాన్ని యిస్తుంది. నేను మీ దేవుడైన యెహోవాను.

26 “ఇంకా, రక్తం ఉన్నది. ఏదీ మీరు తినకూడదు.

“భవిష్యత్తుగూర్చి ముందుగా చెప్పటానికి మంత్ర తంత్రాలు ఏవీ మీరు ఉపయోగించకూడదు.

27 “మీ తల చుట్టూ పెరిగే వెంట్రుకలను గుండ్రంగా క్షౌరం చేయకూడదు. మీ గడ్డం కొనలు కత్తిరించి వేయకూడదు. 28 చనిపోయిన వాళ్ల జ్ఞాపకార్థం మీరు మీ దేహాలను కోసుకోగూడదు. మీరు మీ ఒంటి మీద పచ్చలు పొడిపించుకోగూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.

29 “మీ కుమార్తెను వేశ్యగా మార్చవద్దు. అలా చేయటం ఆమెపై మీకు గౌరవం లేదని వ్యక్తం చేస్తుంది. మీ దేశంలో ప్రజల్ని వేశ్యలు కానీయవద్దు. అలాంటి పాపంతో మీ దేశాన్ని నిండనీయవద్దు.

30 “నా ప్రత్యేక విశ్రాంతి దినాల్లో మీరు పని చేయకూడదు. నా పవిత్రస్థలాన్ని మీరు ఘనంగా చూడాలి. నేను యెహోవాను.

31 “సలహాకోసం కర్ణపిశాచులు, సోదెగాళ్ల దగ్గరకు వెళ్లకూడదు. వాళ్ల దగ్గరకు వెళ్ళొద్దు, వారు మిమ్మల్ని అపవిత్రం చేస్తారు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.

32 “వృద్ధులను గౌరవించండి. వారు గదిలోనికి వచ్చినప్పుడు లేచి నిలబడండి. మీ దేవునికి గౌరవం చూపెట్టండి. నేను యెహోవాను.

33 “మీ దేశంలో నివసిస్తున్న విదేశీయులకు కీడు చేయకండి. 34 మీ స్వంత పౌరులను గౌరవించినట్టే, విదేశీయుల్ని కూడా మీరు గౌరవించాలి. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకొంటారో విదేశీయుల్ని కూడా అలా ప్రేమించాలి. ఎందుచేతనంటే ఒకప్పుడు మీరూ ఈజిప్టులో విదేశీయులే. నేను మీ దేవుడైన యెహోవాను.

35 “ప్రజలు తీర్పు తీర్చేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి. అలానే వస్తువుల్ని తూచేటప్పుడు, కొలిచేటప్పుడ మీరు న్యాయంగా ఉండాలి. 36 మీ తక్కెడలు సమానంగా ఉండాలి. మీ మొగ్గులు ద్రావకాలను సరిగ్గా నింపేవిగా ఉండాలి. మీ త్రాసులు, తూనికరాళ్లు వస్తువుల్ని సరిగ్గా తూచేవిగా ఉండాలి. నేను మీ దేవుడైన యెహోవాను. నేనే మిమ్మన్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చాను!

37 “నా ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను యెహోవాను!”

కీర్తనలు. 23-24

దావీదు కీర్తన.

23 యెహోవా నా కాపరి
    నాకు కొరత ఉండదు
పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
    ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
    ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
    నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
    నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
    నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
    నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
    మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.

దావీదు కీర్తన.

24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
    ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
    ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.

యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
    యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
అక్కడ ఎవరు ఆరాధించగలరు?
    చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
    అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
    అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
    అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.

మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
    ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
    సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.

గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
    పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
    మహిమగల రాజు లోనికి వస్తాడు.
ఈ మహిమగల రాజు ఎవరు?
    ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
    యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.

గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
    పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
    మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
    ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.

ప్రసంగి 2

సరదాలు సుఖాన్నిస్తాయా?

నాలో నేను, “నేను సరదాగా గడపాలి. నేను నా శాయశక్తులా సమస్త సుఖాలూ అనుభవించాలి” అనుకున్నాను. కాని, అది కూడా నిష్ప్రయోజనమైన పనే అని గ్రహించాను. (ఎల్లప్పుడు) సరదాగా నవ్వుతూ గడపడం మూర్ఖత్వం. సరదాగా గడిపేయడం ద్వారా కలిగే మేలేమీ లేదు.

అందుకని, కడుపునిండా ద్రాక్షారసం తాగుతూ మనస్సును జ్ఞానంతో నింపుదామని అనుకున్నాను. సంతోషంగా వుండాలన్న ప్రయత్నంలో నేనీ మూర్ఖత్వానికి చోటిచ్చాను. తమ స్వల్పకాల జీవితంలో జనానికి ఏది మంచిదో కనుక్కోవాలనుకున్నాను.

కఠిన శ్రమ సుఖాన్నిస్తుందా?

అప్పుడిక నేను పెద్ద పెద్ద పనులు చెయ్య నారంభించాను. నేను నాకోసం భవనాలు కట్టించాను. ద్రాక్షాతోటలు నాటించాను. తోటలు వేయించాను, ఉద్యానవనాలు నెలకొల్పాను. నేను రకరకాల పండ్ల చెట్లు నాటించాను. నేను నాకోసం నీటి మడుగులు తవ్వించి, వాటిలోని నీటిని పెరుగుతున్న చెట్లకు పోసేందుకు వినియోగించాను. నేను మగ, ఆడ బానిసలను ఖరీదు చేశాను. నా భవనంలోనే కొందరు బానిసలు పుట్టారు. నాకు చాల గొప్ప వస్తువులు ఉన్నాయి. నాకు పశువుల మందలు, గొర్రెల మందలు ఉన్నాయి. యెరూషలేములో ఏ ఒక్కనికన్న నాకు ఎక్కువ వస్తువులు ఉన్నాయి.

నేను దండిగా వెండి బంగారాలు కూడబెట్టాను. ఆయా రాజుల, రాజ్యాల సంపదలను సంపాదించాను. నా ఆస్థానంలో గాయనీ, గాయకులు ఉన్నారు. నేను ఎవరు కోరినదైనా కలిగియుంటిని.

నేను బాగా ధనవంతుణ్ణీ, కీర్తిమంతుణ్ణీ అయ్యాను. యెరూషలేములో నా వెనుకటి వారందరికంటె నేను గొప్పవాడినయ్యాను. నా జ్ఞానం వివేకం నాకు సహాయం చేశాయి. 10 నేను చూసి, కోరుకున్నదల్లా నేను పొందాను. నేను చేసినవన్నీ నా మనస్సుకి తృప్తిని కలిగించాయి. నేను చేసిన శ్రమ అంతటికీ ప్రతిఫలం ఈ ఆనందమే.

11 అయితే, అటు తర్వాత నేను చేసినవాటన్నింటినీ నేనొకసారి సమీక్షించుకున్నాను. నేను పడ్డ శ్రమ అంతటినీ బేరీజు వేసుకున్నాను. అదంతా వృథా శ్రమ అన్న నిర్ణయానికి వచ్చాను! అది గాలిని మూట కట్టుకొనే ప్రయత్నంలాంటిది.[a] ఈ జీవితంలో మనం చేసే పనులన్నింటి వల్లా మనం పొందే లాభం ఏమీ లేదు.

జ్ఞానమే వీటన్నింటికీ పరిష్కారమేమో

12 ఒక రాజు చేయగలినదానికంటె ఎక్కువ మరొకడెవడూ చేయలేడు. నీవీనాడు చేయాలని కోరుకో గలవాటన్నింటినీ ఏదో ఒక రాజు ఎన్నడో చేసేవున్నాడు.[b] (రాజు చేసేపనులు కూడా వ్యర్థమేనని నేను గ్రహించాను.) అందుకని జ్ఞానార్జన గురించీ, మూర్ఖపు పనులు, మతిలేని పనులు చేయడం గురించీ నేను మరోసారి ఆలోచించ నారంభించాను. 13 చీకటి కంటే వెలుగు మెరుగైనట్లే, మూర్ఖత్వంకంటె జ్ఞానం మెరుగైనదని నేను గ్రహించాను. 14 అదెలాగంటే: తెలివైనవాడు తానెక్కడికి వెళ్తున్నది గ్రహించేందుకు తన మనస్సును కళ్లలా ఉపయోగించుకుంటాడు. కాగా, ఒక మూర్ఖుడు అంధకారంలో నడుస్తున్న వ్యక్తి వంటివాడు.

అయితే, బుద్ధిమంతుడిది, బుద్ధిహీనుడిది కూడా ఒకటే గతి అని నేను గ్రహించాను. (ఇద్దరూ మరణిస్తారు) 15 నాలో నేను ఇలా అనుకున్నాను, “ఒక బుద్ధిహీనుడికి పట్టే గతే నాకూ పడుతుంది. మరి జ్ఞానార్జన కోసం నేనెందుకు అంతగా తంటాలు పడినట్లు?” నేనింకా ఇలా అనుకున్నాను: “జ్ఞానార్జనకూడా ప్రయోజనం లేనిదే.” 16 జ్ఞానవంతుడూ, అజ్ఞానీ ఇద్దరూ మరణిస్తారు! మరి జనం వివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు, అవివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు. భవిష్యత్తులో, వాళ్లు చేసిన పనులన్నింటినీ మరచిపోతారు. కాగా వాస్తవంలో వివేకికీ, అవివేకికీ మధ్య తేడా యేమీ లేదు.

జీవితంలో అసలైన ఆనందమంటూ ఉందా?

17 దీనితో నాకు జీవితం పట్ల ద్వేషం కలిగింది. ఈ జీవితంలో అన్నీ వ్యర్థమైనవే, గాలిని పట్టుకొన ప్రయత్నించడం వంటివే అనిపించి, నాకు విచారం కలిగింది.

18 దానితో, నేను వెనక చేసిన గట్టి శ్రమ అంతటినీ ద్వేషించనారంభించాను. నేను గట్టి కృషిచేశాను. అయితే, నా కృషిఫలితాలను నా తర్వాత తరాలవాళ్లు అనుభవిస్తారని గ్రహించాను. నేను వాటిని నాతో తీసుకుపోలేను. 19 నేను వేటికోసం అధ్యయనం చేశానో, వేటి కోసం పాటుపడ్డానో, వాటన్నింటిపైనా మరొకడెవడో అదుపు కలిగివుంటాడు. అతడు వివేకి అవుతాడో, అవివేకి అవుతాడో నాకు తెలియదు. ఇది కూడ తెలివి లేనిది.

20 అందుకని, నేను చేసిన శ్రమ అంతా నాకు విచారమే కలిగించింది. 21 తన వివేకం, జ్ఞానం, నైపుణ్యం వీటన్నింటినీ వినియోగించి ఒకడు బాగా కష్టించి పని చేయవచ్చు. కాని, అతను మరణిస్తాడు, అతని శ్రమ ఫలితాలన్నింటిని ఇతరులు పొందుతారు. వాళ్లు ఏ శ్రమా చెయ్యలేదు. కాని, వాళ్లకి అన్నీ లభ్యమవుతాయి. ఇది నాకు చాలా విచారం కలిగిస్తుంది. ఇది అన్యాయమే కాదు, అర్థరహితం కూడా.

22 ఒక మనిషి ఈ జీవితంలో నానా తంటాలూపడి, ఎంతో శ్రమ చేస్తాడు. చివరికి అతని చేతికి చిక్కేదేమిటి? 23 చచ్చేదాకా అతను అనుభవించేది బాధలు, నిరాశా నిస్పృహలు, చేసేది (గొడ్డు) చాకిరీ. రాత్రి పూటకూడా మనిషి మనస్సు విశ్రాంతికి నోచు కోదు. ఇది కూడా అర్థరహితమైనదే.

24-25 జీవితంలో సుఖాలు అనుభవించేందుకు నాకంటె ఎక్కువగా ప్రయత్నించిన మనషి మరొకడెవడైనా ఉన్నాడా? లేడు! నేను గ్రహించిన దేమిటంటే: మనిషి చెయ్యగలిగిన అత్యుత్తమమైన పని యేమిటంటే, తినడం, తాగడం, తాను చేసి తీరవలసిన పనిని సరదాగా చెయ్యడం. దేవుని ఆదేశం కూడా ఇదేనని నేను గ్రహించాను. 26 మనిషి మంచి చేసి, దేవుణ్ణి సంతృప్తి పరిస్తే, అప్పుడిక దేవుడు ఆ మనిషికి వివేకాన్నీ, జ్ఞానాన్నీ, సుఖసంతోషాలనీ అనుగ్రహిస్తాడు. అయితే, పాపాలు చేసేవాడికి దేవుడు ప్రయాసపడే పని, పోగు చేసే పని, కుప్పలుగా పోసే పని మాత్రమే ఇస్తాడు. దేవుడు చెడ్డవానినుంచి తీసుకొని మంచివానికి ఇస్తాడు. అయితే, ఈ పని అంతా వ్యర్థమైనదిగానూ, గాలిని పట్టుకొనే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.

1 తిమోతికి 4

దొంగ బోధకులు

చివరిదినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దయ్యాల బోధనల్ని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెపుతున్నాడు. దొంగ మాటలు చెప్పేవాళ్ళు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ అంతరాత్మలు మొద్దుబారాయి. అలాంటివాళ్ళు వివాహం చేసుకోవటం తప్పని, కొన్ని రకాల ఆహారాలు తినకూడదని బోధిస్తారు. కాని దేవుడు ఆ ఆహారాలు తినటానికే సృష్టించాడు. విశ్వాసులు, సత్యాన్ని తెలుసుకొన్నవాళ్ళు దేవునికి కృతజ్ఞతలర్పించి ఆ ఆహారాల్ని భుజించాలి. దేవుడు తినటానికి సృష్టించినవన్నీ మంచివే కనుక మనం దేన్నీ నిరాకరించకూడదు. అన్నిటినీ దేవునికి కృతజ్ఞతలర్పించి భుజించాలి. అవి దేవుని వాక్యం వల్లను, ప్రార్థన ద్వారాను పవిత్రం చేయబడినాయి.

మంచి సేవకునిగా ఉండుము

నీవీ బోధలు సోదరులకు చెబితే యేసు క్రీస్తు యొక్క మంచి సేవకునిగా పరిగణింపబడతావు. నీవు విశ్వసించిన సత్యాలను, సుబోధలను నీవు అనుసరిస్తున్నావు కనుక నీకు అభివృద్ధి కల్గుతుంది. ఆత్మీయత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు దూరంగా ఉండు. భక్తితో ఉండటానికి అభ్యాసం చెయ్యి. శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తివల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మంచి కల్గుతుంది. కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. ఇది నమ్మదగిన విషయం. సంపూర్ణంగా అంగీకరించదగినది. 10 మానవ జాతి రక్షకుడైన దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మినవాళ్ళను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వసించాము. కనుకనే మనము సహనంతో కష్టించి పని చేస్తున్నాము.

11 ఈ విషయాలు మిగతావాళ్ళకు బోధించి, వాటిని ఆచరించుని ఆజ్ఞాపించు. 12 నీవు వయస్సులో చిన్నవాడైనందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్యకుండా జాగ్రత్త పడు. క్రీస్తును విశ్వసించేవాళ్ళకు మాటల్లో, జీవిత విధానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.

13 నేను వచ్చేవరకు నీ కాలాన్ని దైవవాక్యాలు బహిరంగంగా చదవటానికి, వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింప చేయి. 14 పెద్దలు తమ చేతుల్ని నీపై ఉంచినప్పుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించింది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. 15 నేను చెప్పిన విషయాలపై నీ మనస్సు లగ్నం చేయి. అప్పుడు అందరూ నీ అభివృద్ధిని గమనిస్తారు. 16 నీ వ్యక్తిగత జీవితాన్నీ, నీవు బోధించే వాటినీ జాగ్రత్తగా గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే నిన్ను నీవు రక్షించుకొన్నవాడవౌతావు. నీ బోధన విన్నవాళ్ళను రక్షించినవాడవౌతావు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International