Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 17

జంతువులను చంపి తినటాన్ని గూర్చిన నియమాలు

17 మోషేతో యెహోవా చెప్పాడు: “అహరోనుతో, అతని కుమారులతో, ప్రజలందరితో ఇలా చెప్పు. ఇదే యెహోవా ఆజ్ఞ అని వారితో చెప్పు: ఇశ్రాయేలు మనిషి ఒకడు ఒక కోడెదూడను లేక గొర్రెపిల్లను, లేక ఒక మేకను బసలోగాని బస వెలుపలగానీ చంపవచ్చును. ఆ వ్యక్తి ఆ జంతువును సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. ఆ జంతువుయొక్క ఒక భాగాన్ని యెహోవాకు కానుకగా అతడు అర్పించాలి. ఆ వ్యక్తి దాని రక్తాన్ని చిందించాడు. కనుక అతడు తన కానుకను యెహోవా పవిత్ర గుడారానికి తీసుకొని వెళ్లాలి. ఆ జంతువులో ఒక భాగాన్ని యెహోవాకు కానుకగా అతడు తీసుకొని వెళ్లకపోతే, ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి. ప్రజలు వారి సమాధాన బలిని యెహోవాకు అర్పించేందుకే ఈ నియమం. ఇశ్రాయేలు ప్రజలు పొలాల్లో చంపే జంతువులను కూడా తీసుకొని రావాలి. ఆ జంతువులను సన్నిధి గుడార ద్వారం దగ్గర వారు యెహోవాకు అర్పించాలి. ఆ జంతువులను వారు యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. అప్పుడు ఆ జంతువుల రక్తాన్ని సన్నిధి గుడారం దగ్గర యెహోవా బలిపీఠం మీద యాజకుడు చల్లుతాడు. మరియు ఆ జంతువుల కొవ్వును బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన. వారు వారి ‘మేక పోతు విగ్రహాలకు’ ఇంక ఎలాంటి బలులూ అర్పించకూడదు. ఆ ఇతర దేవుళ్ళను వారు వెంబడిస్తూ వచ్చారు. అలా వారు వ్యభిచారిణుల్లా ప్రవర్తించారు. ఈ నియమాలు ఎప్పటికీ కొనసాగుతాయి.

“ప్రజలతో చెప్పు: ఒక ఇశ్రాయేలు పౌరుడు లేక ఒక యాత్రికుడు, లేక మీ మధ్య నివసిస్తున్న ఒక విదేశీయుడు దహన బలిగాని ప్రాయశ్చిత్త బలిగాని అర్పించవచ్చు. ఆ వ్యక్తి తన బలిని సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లి అక్కడ దానిని యెహోవాకు అర్పించాలి. ఆ వ్యక్తి యిలా చేయకపోతే, అతడు తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి.

10 “రక్తాన్ని తినే వాళ్లకు నేను విరోధిని. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చు లేక మీ మధ్య నివసించే విదేశీయుడు కావచ్చు. ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను వేరు చేస్తాను. 11 ఎందుచేతనంటే దేహానికి ప్రాణం రక్తంలోనే ఉంది. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించే నియమాలు నేను మీకు ఇచ్చాను. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకొనేందుకు మీరిలా చేయాలి. మీరు తీసిన ప్రాణానికి విలువ చెల్లింపుగా ఆ రక్తాన్ని మీరు నాకు యివ్వాలి. 12 కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను చెప్పేది ఇదే: మీలో ఎవ్వరూ రక్తం తినవద్దు. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడూ రక్తం తినకూడదు.

13 “తినదగిన జంతువును లేక పక్షిని ఎవరైనా పట్టుకొంటే, ఆ వ్యక్తి దాని రక్తాన్ని నేలమీద పోసి మట్టితో కప్పివేయాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చు లేక మీ మధ్య నివసించే విదేశీయుడు కావచ్చు. 14 మీరెందుకు ఇలా చేయాలి? ఎందుచేతనంటే దాని మాంసంలో ఇంకా రక్తం గనుక ఉంటే, ఆ జంతువు ప్రాణం దాని మాంసంలో ఉంటుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. ఇంకా రక్తంతో ఉన్న మాంసం తినవద్దు. రక్తం తినే ఏవ్యక్తి అయినాసరే తన ప్రజలనుండి వేరు చేయబడాల్సిందే.

15 “మరియు దానంతట అదే చచ్చిన జంతువును తిన్నవాడుగాని, లేక మరో జంతువుచే చంపబడ్డ జంతువును తిన్నవాడుగాని ఆ సాయంత్రం వరకు అపవిత్రుడుగా వుంటాడు. ఆవ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్లతో పూర్తి స్నానం చేయాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చును, లేక మీ మధ్య నివసిస్తున్న విదేశీయుడు కావచ్చును. 16 ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోక పోయినా, స్నానం చేయకపోయినా అతడు పాపం చేత దోషిగా ఉంటాడు.”

కీర్తనలు. 20-21

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

20 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
    యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.[a]
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
    సీయోను[b] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
    నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
    నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక.
    దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక.
నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.

ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు.
    దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు.
    ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
    కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
    కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!

దేవుడు రాజును రక్షించును గాక!
    మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

21 యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది.
    నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు.
రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు.
    మరియు యెహోవా, రాజు అడిగినవాటిని నీవు అతనికిచ్చావు.

యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచివాటిని రాజుకిచ్చావు.
    బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.
దేవా, జీవంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు.
    నీవు రాజుకు నిరంతరం సాగే దీర్ఘాయువు నిచ్చావు.
రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి వచ్చింది.
    నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.
దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు.
    నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.
రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు.
    సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు.
రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు.
    నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది.
నీవు కనబడినప్పుడు
    ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు.
యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది.
    మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు.
10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి.
    వారు భూమి మీద నుండి తొలగిపోతారు.
11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు.
    చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు.
12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు.
    ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు.

13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి
    మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.

సామెతలు 31

లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు

31 లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి. ఈ విషయాలను అతని తల్లి అతనికి నేర్పించింది.

నీవు నా కుమారుడవు. నేను ప్రేమించే నా కుమారుడివి. నాకు కావాలని నేను ప్రార్థించిన కుమారుడివి నీవు. స్త్రీలకోసం నీ బలం వ్యర్థం చేయవద్దు. స్త్రీలే రాజులను నాశనం చేసేవాళ్లు. వారికోసం నిన్ను నీవు వ్యర్థం చేసుకోవద్దు. లెమూయేలూ, రాజులు ద్రాక్షారసం త్రాగటం జ్ఞానముగల పనికాదు. మద్యము కోరుట పరిపాలకులకు జ్ఞానముగల పనికాదు. వారు విపరీతంగా తాగేసి న్యాయచట్టం చెప్పేదానిని మరచి పోవచ్చు. అప్పుడు వారు పేద ప్రజల హక్కులు అన్నీ తీసివేస్తారు. మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము. అప్పుడు వారు అది తాగి, వారు పేదవాళ్లు అనే మాట మరచిపోతారు. వాళ్లు తాగేసి వారి కష్టాలన్నీ మరచిపోతారు.

ఒకడు తనకు తానే సహాయం చేసికోలేకపోతే అప్పుడు నీవు అతనికి సహాయం చేయాలి. కష్టంలో ఉన్న ప్రజలందరికీ నీవు సహాయం చేయాలి. సరైనవి అని నీకు తెలిసిన విషయాల కోసం నీవు నిలబడు. మనుష్యులందరికీ న్యాయంగా తీర్పు తీర్చు. పేద ప్రజల, నీ అవసరం ఉన్న ప్రజల హక్కులను కాపాడు.

పరిపూర్ణమైన భార్య

10 “పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం.
    కాని ఆమె నగలకంటె ఎంతో ఎక్కువ అమూల్యం.
11 ఆమె భర్త ఆమెను నమ్మగలడు.
    అతడు ఎన్నడూ దరిద్రునిగా ఉండడు.
12 మంచి భార్య తన జీవితకాలం అంతా తన భర్తకు మంచినే చేస్తుంది.
    ఆమె ఎన్నడూ అతనికి చిక్కు కలిగించదు.
13 ఆమె ఉన్నిబట్ట తయారు చేస్తూ
    ఎల్లప్పుడూ పనిలో నిమగ్నమవుతుంది.
14 ఆమె దూరము నుండి వచ్చిన ఓడలా ఉంటుంది.
    అన్ని చోట్ల నుండీ ఆమె ఆహారం తీసుకొని వస్తుంది.
15 ఆమె అతి వేకువనే మేలుకొంటుంది.
    తన కుటుంబానికి భోజనం, తన పని వారికి భోజనం ఆమె వండుతుంది.
16 ఆమె పొలాన్ని చూస్తుంది. దాన్నికొంటుంది.
    ఆమె ద్రాక్షతోట నాటేందుకు ఆమె దాచుకొన్న డబ్బు ఉపయోగిస్తుంది.
17 ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది.
    ఆమె బలంగా ఉండి తన పని అంతా చేసుకోగలుగుతుంది.
18 ఆమె తయారు చేసిన వాటిని అమ్మినప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాదిస్తుంది.
    మరియు రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఆమె పని చేస్తుంది.
19 ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని
    తన స్వంత బట్ట నేస్తుంది.
20 ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది.
    అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది!
21 చలిగా ఉన్నప్పుడు ఆమె తన కుటుంబం విషయం దిగులు పడదు.
    ఆమె వారందరికి మంచి వెచ్చని దుస్తులు ఇస్తుంది.
22 ఆమె దుప్పట్లు నేసి పడకలమీద పరుస్తుంది.
    సన్నని నారతో చేయబడ్డ వస్త్రాలు ఆమె ధరిస్తుంది.
23 ఆమె భర్తను ప్రజలు గౌరవిస్తారు.
    అతడు దేశ నాయకులలో ఒకడు.
24 ఆమె మంచి వ్యాపార దక్షతగల స్త్రీ. ఆమె బట్టలు, నడికట్లు తయారు చేసి
    వాటిని వ్యాపారస్థులకు అమ్ముతుంది.
25 ఆమె బలంగా ఉంటుంది. మరియు, ప్రజలు ఆమెను గౌరవిస్తారు.
    ఆమె స్థానము బలంగాను మరియు సురక్షితంగాను ఉంటుంది.
    భవిష్యత్తును గురించి సంతోషిస్తుంది.
26 ఆమె మాట్లాడినప్పుడు జ్ఞానముగా ఉంటుంది.
    ఆమె జ్ఞానం ఉపదేశముతోనిండి ఉంటుంది.
27 ఆమె ఎన్నడూ బద్ధకంగా ఉండదు.
    కాని ఆమె తన ఇంటి విషయాలను గూర్చి జాగ్రత్త తీసుకొంటుంది.
28 ఆమె పిల్లలు పెద్దవారై ఆమెను ఘనపరుస్తారు.
    మరియు ఆమె భర్త ఆమెను గూర్చి ఎన్నో మంచి విషయాలు చెబుతాడు.
29 “ఎంతో మంది స్త్రీలు మంచి భార్యలు అవుతారు.
    కాని నీవు శ్రేష్ఠమైన దానివి” అని ఆమె భర్త చెబుతాడు.
30 సౌందర్యము, అందము నిన్ను మోసగించవచ్చు.
    అయితే యెహోవాను గౌరవించే స్త్రీ పొగడబడాలి.
31 ఆమెకు అర్హమైన ప్రతిఫలం రావాలి.
    ఆమె చేసిన విషయాల కోసం ప్రజలు ఆమెను బహిరంగంగా ఘనపర్చాలి.

1 తిమోతికి 2

ప్రార్థన

నేను మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే, మొదట విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతలు ప్రజలందరి పక్షాన చెయ్యండి. ముఖ్యంగా రాజుల పక్షాన, అధికారుల పక్షాన దేవునికి విజ్ఞాపన చెయ్యండి. అప్పుడు మనము నిశ్చింతగా, శాంతంగా సత్ప్రవర్తనతో, ఆత్మీయతతో జీవించగల్గుతాము. ఇలా చెయ్యటం ఉత్తమం. మరియు మన రక్షకుడైన దేవునికి అది సంతృప్తి కలిగిస్తుంది.

మానవులందరూ రక్షింపబడాలనీ, సత్యాన్ని గ్రహించాలనీ దేవుని ఇష్టం. ఎందుకంటే ఒకే ఒక దేవుడున్నాడు. దేవునికి, మానవులకు మధ్య సంధి కుదుర్చటానికి ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే మానవునిగా జన్మించిన యేసు క్రీస్తు. ఆయన మానవులకు విమోచన కలిగించాలని సరియైన సమయానికి తనను తాను ఒక వెలగా అర్పించుకొన్నాడు. మానవులందరూ రక్షింపబడటమే దేవుని ఉద్దేశ్యమన్నదానికి యిది నిదర్శనము. అందువలన దేవుడు నన్ను ఒక దూతగా, అపొస్తలునిగా నియమించి యూదులు కానివాళ్ళకు నిజమైన విశ్వాసాన్ని బోధించటానికి పంపాడు. ఇది సత్యం. అబద్ధం కాదు.

స్త్రీ పురుషులకు ప్రత్యేక నియమాలు

అన్ని స్థలాల్లో పురుషులు ఆగ్రహం చెందకుండా, వాదనలు పెట్టుకోకుండా తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని నా అభిలాష. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నా ఈ విధంగా ప్రార్థించాలి.

స్త్రీలు గౌరవం కలిగించే దుస్తులు ధరించి, వినయంగా, మర్యాదగా ఉండాలి. బంగారు నగలు, ముత్యాలు, ఖరీదైన దుస్తులు, తలవెంట్రుకలతో నానా విధపు ముడులు వేయటం వారికి అలంకారముగా అనుకొనక, 10 దైవభక్తులమని చెప్పుకొనుటకు తగినట్లుగా సత్కార్యములనే ఆభరణాలను అలంకారంగా ధరించాలి.

11 స్త్రీలు నెమ్మదిగా ఉంటూ సంపూర్ణమైన వినయంతో ఉండటం నేర్చుకోవాలి. 12 స్త్రీలు బోధించటంగాని, పురుషులపై అధికారం చెయ్యటంగాని నేను ఒప్పుకోను. వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు. 13 దేవుడు ఆదామును మొదట సృష్టించాడు. ఆ తర్వాత హవ్వను సృష్టించాడు. 14 మోసపోయింది ఆదాము కాదు. స్త్రీ మోసపోయి పాపియైనది. 15 దేవుని పట్ల విశ్వాసము, పవిత్రత, ప్రేమ, మర్యాద అనే గుణాలు అలవర్చుకొంటె సంతానం కలుగుట ద్వారా స్త్రీలు రక్షింపబడతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International