M’Cheyne Bible Reading Plan
ప్రాయశ్చిత్త దినం
16 యెహోవాకు ధూపం వేస్తూ అహరోను ఇద్దరు కుమారులూ చనిపోయారు. అది జరిగిన తర్వాత మోషేతో యెహోవా మాట్లాడాడు. 2 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడు.” పవిత్ర స్థలంలో తెర వెనుకకు అతడు వెళ్లజాలని కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయని అతనితో చెప్పు. ఆ తెర వెనుక గదిలో ఒడంబడిక పెట్టె ఉన్నది. ఆ పవిత్ర పెట్టెమీద కరుణాపీఠం ఉంది. ఆ పెట్టెకు పైగా మేఘంలో నేను ప్రత్యక్ష మవుతాను. అందుచేత యాజకుడు ఎల్లప్పుడూ ఆ గదిలోనికి వెళ్లజాలడు. అతడు ఆ గదిలోనికి వెళ్తే, అతడు మరణించవచ్చు!
3 “ప్రాయశ్చిత్తపు రోజున అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించక ముందు, పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును అతడు అర్పించాలి. 4 అహరోను నీళ్లతో పూర్తిగా స్నానంచేయాలి. అప్పుడు అహరోను ఈ బట్టలు ధరించాలి. అహరోను పవిత్రమైన చొక్కా ధరించాలి. లోపల వేసుకొనే బట్టలు శరీరాన్ని అంటిపెట్టుకొనేవిగా ఉండాలి. మేలురకం దట్టిని నడుంకు కట్టుకోవాలి. మేలురకం బట్టతో తలపాగా చుట్టుకోవాలి. ఇవి పవిత్ర వస్త్రాలు.
5 “మరియు పాపపరిహారార్థ బలికోసం రెండు మగ మేకలను, దహనబలికోసం ఒక పొట్టేలును ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి అహరోను తీసుకోవాలి. 6 అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. ఈ పాపపరిహారార్థ బలి తనకోసమే. అప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని పవిత్రంచేసే ఆచారాన్ని అహరోను జరిగించాలి.
7 “తర్వాత, అహరోను ఆ రెండు మేకలను సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. 8 ఆ రెండు మేకలకు అహరోను చీట్లు వేయాలి. ఒకచీటి యెహోవాకు, ఇంకొకటి విడిచిపెట్టే అజాజేలుకు.[a]
9 “అప్పుడు అహరోను చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను యెహోవాకు అర్పించాలి. ఈ మేకను అహరోను పాపపరిహారార్థ బలిగా చేయాలి. 10 అయితే విడిచి పెట్టేందుకు చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను ప్రాణంతోనే యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. దాన్ని పవిత్రం చేసే క్రమాన్ని యాజకుడు జరిగించాలి. తర్వాత ఈ మేక అర్యణంలో విడిచిపెట్టబడాలి.
11 “తర్వాత అహరోను తన కోసం ఒక కోడెదూడను పాపపరిహారార్థ బలిగా అర్పించాలి. తనను, తన కుటుంబాన్ని అహరోను పవిత్రం చేసుకోవాలి. అహరోను అతని కోసమే పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను వధించాలి. 12 అప్పుడు యెహోవా సన్నిధిలోని ధూపపీఠంనుండి ధూపార్తి నిండా నిప్పులు తీసుకోవాలి. చూర్ణం చేయబడిన పరిమళ ధూపాన్ని రెండు గుప్పెళ్ల నిండా అహరోను తీసుకోవాలి. తెర వెనుక నున్న గదిలోనికి అహరోను ఆ పరిమళ ధూపాన్ని తీసుకొని రావాలి. 13 యెహోవా సన్నిధిలో అహరోను ఆ ధూపాన్ని నిప్పుల మీద వేయాలి. అప్పుడు ఒడంబడిక పెట్టె మీద ఉన్న కరుణా పీఠాన్ని ఆ ధూపపొగ ఆవరిస్తుంది. ఈ విధంగా చేస్తే అహరోను మరణించడు. 14 అహరోను ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకొని, తన వేలితో తూర్పుకు కరుణాపీఠం మీదికి చిలకరించాలి. కరుణాపీఠం ముందర అతడు తన వేలితో ఏడుసార్లు రక్తాన్ని చిలకరించాలి.
15 “తర్వాత అహరోను ప్రజలకోసం పాప పరిహారార్థ బలి మేకను వధించాలి. తెరవెనుక ఉన్న గదిలోనికి ఈ మేక రక్తాన్ని అహరోను తీసుకొని రావాలి. కోడెదూడ రక్తంతో ఏమైతేచేసాడో అలాగే మేక రక్తంతోకూడ అహరోను చేయాలి. కరుణాపీఠం మీద, కరుణాపీఠం ఎదుట ఆ మేక రక్తాన్ని అహరోను చిలకరించాలి. 16 ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమయిన సందర్భాలెన్నో ఉన్నాయి కనుక ఇశ్రాయేలు ప్రజల పాపాలు, నేరాలనుండి ఆ అతిపరిశుద్ధ స్థలాన్ని పవిత్రం చేసేందుకు జరగాల్సిన ప్రాయశ్చిత్తాన్ని అహరోను చేయాలి. అహరోను ఎందుకు ఇవన్నీ చేయాలి? సన్నిధిగుడారం అపవిత్ర ప్రజల మధ్య ఉంటుందిగనుక.
17 “అతి పరిశుద్ధ స్థలాన్ని అహరోను పవిత్రం చేసే సమయంలో సన్నిధిగుడారంలో ఎవ్వరూ ఉండకూడదు. అహరోను బయటకు వచ్చేంతవరకు ఏ వ్యక్తీ లోకిని వెళ్లకూడదు. కనుక అహరోను తనను, తన కుటుంబాన్ని పవిత్రం చేసుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి. 18 తర్వాత యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠం దగ్గరకు అహరోను వెళ్లాలి. అహరోను బలిపీఠాన్ని పవిత్రం చేస్తాడు. కోడెదూడ రక్తంలో కొంచెం, మేక రక్తంలో కొంచెం తీసుకొని బలిపీఠం అన్ని వైపులా ఉన్న దాని కొమ్ములకు అహరోను పూయాలి. 19 తర్వాత అహరోను తన వేలితో కొంత రక్తాన్ని బలి పీఠం మీద ఏడుసార్లు చిలకరించాలి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నింటి నుండి బలిపీఠాన్ని అహరోను పరిశుద్ధంగా, పవిత్రంగా చేయాలి.
20 “అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని, అహరోను పవిత్రం చేస్తాడు. అలా జరిగిన తర్వాత ఆ మేకను ప్రాణంతోనే యెహోవా సన్నిధికి అహరోను తీసుకొని వస్తాడు. 21 బతికే ఉన్న ఆ మేక తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచుతాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పాపాలను, నేరాలను ఆ మేకమీద అహరోను ఒప్పుకొంటాడు. ఈ విధంగా అహరోను ప్రజల పాపాలను మేక నెత్తిమీద మోపుతాడు. అప్పుడు ఆ మేకను అరణ్యంలోకి వదిలి పెట్టేస్తాడు. ఈ మేకను అతను తోలివేయటానికి పక్కనే ఒక మనిషి సిద్ధంగా నిలబడి ఉంటాడు. 22 కనుక ప్రజలందరి పాపాలను ఆ మేక తనమీద మోసుకొని ఖాళీ అరణ్యంలోనికి తీసుకొనిపోతుంది. ఆ మేకను తోలు కొనిపోయిన వాడు అరణ్యంలో దానిని విడిచి పెట్టివేయాలి.
23 “అప్పుడు అహరోను సన్నిధి గుడారంలో ప్రవేశించాలి. పవిత్రస్థలంలోనికి వెళ్లినప్పుడు తాను ధరించిన వస్త్రాలను అతడు తీసివేయాలి. వాటిని అక్కడే వదిలివేయాలి. 24 పవిత్ర స్థలంలో అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు తన ఇతర ప్రత్యేక వస్త్రాలు ధరించాలి. అతడు బయటకు వచ్చి తనకోసం దహన బలిని, ప్రజలకోసం దహనబలిని అర్పించాలి. అతని కోసం, ప్రజలకోసం అతడు తనను పవిత్రంచేసుకోవాలి. 25 అప్పుడు పాపపరిహారార్థ బలి పశువు యొక్క కొవ్వును అతడు బలిపీఠం మీద దహించాలి.
26 “విడిచిపెట్టే మేకను అరణ్యంలో విడిచి పెట్టిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.
27 “పాపపరిహారార్థ బలిపశువులైన కోడెదూడను, మేకలను బస వెలుపలికి తీసుకొనిపోవాలి. ఈ జంతువుల రక్తం పవిత్ర వస్తువులను పవిత్రం చేసేందుకు పవిత్ర స్థలానికి తీసుకొని రాబడింది. ఆ జంతువుల చర్మాలను శవాలను, వాటి మలమును యాజకులు అగ్నితో కాల్చివేయాలి. 28 తర్వాత వాటిని కాల్చిన వ్యక్తి తన వస్త్రాలను ఉతుక్కొని, నీళ్లలో స్నానంచేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.
29 “ఆ ఆజ్ఞ మీకు శాశ్వతంగా ఉంటుంది. ఏడవ నెల పదో రోజున మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీరేమీపని చేయకూడదు. మీ మధ్య నివసిస్తున్న విదేశీ యాత్రికులు ఎవరూ పని చేయకూడదు. 30 ఎందుచేతనంటే ఆ రోజు యాజకుడు మిమ్మల్ని పవిత్రంచేసి, మీ పాపాలను కడిగివేస్తాడు. అప్పుడు మీరు యెహోవాకు పవిత్రం చేయబడిన వారవుతారు. 31 ఇది మీకు చాల ముఖ్యమైన విశ్రాంతి రోజు. మీరు భోజనం చేయకూడదు. ఈ ఆజ్ఞ ఎప్పటికీ కొన సాగుతుంది.
32 “కనుక నియమించబడిన ప్రధాన యాజకుడు, అంటే యాజకత్వం చేసేందుకు నియమించబడ్డ మనిషి. అతడు అన్నింటినీ పవిత్రం చేసే కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఆ యాజకుడు పవిత్ర నార వస్త్రాలు ధరించాలి. 33 అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని అతడు పవిత్రం చేయాలి. యాజకులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి. 34 ఇశ్రాయేలు ప్రజలను పవిత్రం చేసేందుకు ఇవ్వబడ్డ ఆ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరంలో ఒక సారి మీరు వాటిని జరిగించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల పాపాల మూలంగా వీటిని చేయవలెను.”
కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ వారు జరిగించారు.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
యాకె కుమారుడు ఆగూరు జ్ఞాన సూక్తులు
30 యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం:
2 భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను గ్రహించాల్సిన విధంగా గ్రహించటంలేదు. 3 జ్ఞానము కలిగి ఉండటం నేను నేర్చుకోలేదు. మరియు దేవుని గురించి నాకు ఏమీ తెలియదు. 4 ఏ మనిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను గూర్చి నేర్చుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ గాలిని తన చేతిలో పట్టుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ నీటిని ఒక గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. ఏ మనిషీ ఎన్నడూ భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. ఈ సంగతులను తెలిసికో గలిగిన మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది?
5 దేవుడు చెప్పే ప్రతి మాటా పరిపూర్ణం. దేవుని దగ్గరకు వెళ్లే మనుష్యులకు ఆయన ఒక క్షేమస్థానం 6 కనుక దేవుడు చెప్పే విషయాలను మార్చేందుకు ప్రయత్నించకు. నీవు అలా చేస్తే ఆయన నిన్ను శిక్షించి, నీవు అబద్ధాలు చెబుతున్నట్టు రుజువు చేస్తాడు.
7 యెహోవా, నేను చనిపోక ముందు నా కోసం రెండు పనులు చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను. 8 అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు నాకు సహాయం చేయి. నన్ను మరీ ధనికునిగా లేక మరీ దరిద్రునిగా చేయవద్దు. ప్రతిరోజూ నాకు అవసరమైన వాటిని మాత్రమే అనుగ్రహించు. 9 నాకు అవసరమైన దానికంటే నాకు ఎక్కువగా ఉంటే, అప్పుడు నీతో నాకు అవసరం లేదని నేను తలస్తాను. కాని నేను దరిద్రుడనైతే ఒకవేళ నేను దొంగతనం చేస్తానేమో. అప్పుడు నేను యెహోవా నామానికి అవమానం తెస్తాను.
10 ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే ఆ యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు.
11 కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను గౌరవించరు.
12 కొందరు చాలా మంచివాళ్లం అనుకొంటారుగాని వారు చాలా చెడ్డవాళ్లు.
13 కొంతమంది చాలా మంచివాళ్లం అనుకొంటారు. వారు యితరులకంటే చాలా మంచివాళ్లు అనుకొంటారు.
14 ఖడ్గాల్లాంటి పళ్లు ఉన్నవారు కొందరు ఉంటారు. వారి దవడలు కత్తుల్లా ఉంటాయి. వారు పేద ప్రజలనుండి సమస్తం దోచుకోవటానికి వారి సమయం అంతా ఉపయోగిస్తారు.
15 కొంతమంది వారికి చేతనైనంత మట్టుకు అంతా తీసికోవాలి అనుకొంటారు. “నాకివ్వు, నాకివ్వు, నాకివ్వు” అనటం మాత్రమే వారు చెప్పేది అంతాను. ఎన్నటికీ తృప్తిపడనివి మూడు ఉన్నాయి వాస్తవానికీ సరిపడినంతగా ఎన్నడూ లేనివి నాలుగు ఉన్నాయి. 16 చావు స్థలం, పిల్లలు లేని స్త్రీ, వర్షం కావాల్సిన బీడుభూమి, వారించజాలని వేడి నిప్పు.
17 తన తండ్రిని ఎగతాళి చేసే మనిషీ, తన తల్లికి లోబడని మనిషీ ఎవరైనా సరే శి క్షిచబడుతారు. అది అతని కళ్లు రాబందులు, లేక కృ-రపక్షులు తినివేసినట్టు ఉంటుంది.
18 నేను గ్రహించేందుకు కష్టతరమైనవి మూడు సంగతులు ఉన్నాయి వాస్తవానికి నేను గ్రహించనివి నాలుగు సంగతులు ఉన్నాయి. 19 ఆకాశంలో ఎగిరే పక్షిరాజు, ఒక బండ మీద పాకుచున్న ఒక పాము, మహా సముద్రంలో తిరిగే ఓడ, ఒక స్త్రీతో ప్రేమలోవున్న మగవాడు.
20 తన భర్తకు నమ్మకంగా లేని ఒక భార్య తాను ఏమీ తప్పు చేయనట్టు నటిస్తుంది. ఆమె భోంచేస్తుంది, స్నానం చేస్తుంది, నేను ఏమీ తప్పు చేయలేదు అంటుంది.
21 భూమి మీద చిక్కు కలిగించేవి మూడు సంగతులు ఉన్నాయి. వాస్తవానికి భూమి భరించలేనివి నాలుగు ఉన్నాయి. 22 రాజైన ఒక సేవకుడు, తనకు కావాల్సినవి అన్నీ కలిగి ఉన్న ఒక బుద్ధిహీనుడు, 23 ద్వేషంతో పూర్తిగా నిండిపోయినా, ఒక భర్తను పొంద గలిగిన స్త్రీ, ఏ స్త్రీ దగ్గర సేవ చేస్తుందో, ఆ స్త్రీ మీద అధికారిణి అయిన దాసి.
24 భూమి మీద చిన్నవిగా ఉన్నవి నాలుగు ఉన్నాయి. అయితే ఇవి చాలా జ్ఞానము గలవి.
25 చీమలు చిన్నవి, బలహీనమైనవి. కాని అవి వేసవి కాలం అంతా ఆహారం నిల్వచేసుకొంటాయి.
26 కుందేలు చిన్న జంతువు. కాని అది బండల్లో నివాసం ఏర్పాటు చేసుకోగలుగుతుంది.
27 మిడతలకు రాజు లేడు. కాని అవన్నీ కలిసికట్టుగా పని చేయగలుగుతున్నాయి.
28 బల్లులు నీవు చేతితో పట్టుకోగలిగినంత చిన్నవి. కాని అవి రాజుల గృహాలలో నివసించటం నీవు చూడ గలవు.
29 నడుస్తున్నప్పుడు ముఖ్యమైనవిగా కనుపించేవి మూడు ఉన్నాయి. నిజానికి నాలుగు ఉన్నాయి.
30 సింహం జంతువులలోకెల్ల చాలా బలమైనది. అది దేనికీ భయపడదు.
31 చాలా గర్వంగా నడిచే కోడి పుంజు,
ఒక మేక పోతు,
తన ప్రజల మధ్య ఉన్న రాజు.
32 నీవు తెలివితక్కువవాడవై యుండి ఇతరులకంటె నీవే మంచివాడవు అని తలిస్తే, మరియు నీవు దుర్మార్గాన్ని తల డితే, నీవు ఆగిపోయి, నీవు చేస్తున్నదాన్ని గూర్చి ఆలోచించాలి.
33 ఒక మనిషి పాలను చిలికితే వెన్న వస్తుంది. ఒకడు మరొకని ముక్కు మీద కొడితే, రక్తం వస్తుంది. అదే విధంగా నీవు ప్రజలకు కోపం పుట్టిస్తే నీవు చిక్కు కలిగిస్తావు.
1 విశ్వాసంలో నా కుమారునితో సమానమైన తిమోతికి పౌలు వ్రాయడం ఏమనగా, నేను మన రక్షకుడైన దేవుని ఆజ్ఞానుసారమూ, మనకు రక్షణ లభిస్తున్న ఆశకు మూలకారకుడైన యేసు క్రీస్తు ఆజ్ఞానుసారమూ, యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.
2 తండ్రి అయినటువంటి దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు, నీపై అనుగ్రహం చూపాలనీ, నిన్ను కరుణించాలనీ, నీకు శాంతి చేకూర్చాలనీ ఆశిస్తున్నాను.
దొంగ బోధకుల విషయంలో జాగ్రత్త
3 నేను మాసిదోనియకు వెళ్ళినప్పుడు నీకు చెప్పిన విధంగా నీవు ఎఫెసులో ఉండుము. అక్కడ కొందరు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వాళ్ళతో ఆ విధంగా చెయ్యవద్దని చెప్పు. 4 అంతేకాక, వాళ్ళు కల్పితగాథలు చెప్పకూడదనీ, అంతు పొంతులేని వంశావళులతో సమయం వ్యర్థం చేయవద్దని కూడా ఆజ్ఞాపించు. ఇలాంటివి దైవకార్యానికి తోడ్పడడానికి బదులుగా చీలికలు కల్గిస్తాయి. దైవకార్యం విశ్వాసంతో కూడుకొన్నపని. 5 ఇందులోని ఉద్దేశ్యం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండీ, స్వచ్ఛమైన అంతరాత్మ నుండీ, నిజమైన విశ్వాసం నుండీ ఉద్భవించే ప్రేమను కలిగియుండటమే. 6 కొందరు వ్యక్తులు నిజమైన ధ్యేయం మరిచిపోయి, వ్యర్థంగా తిరిగిపోయారు. 7 తాము ధర్మశాస్త్ర పండితులు కావాలనుకొంటారు. కాని వాళ్ళకు వాళ్ళు చెప్పే మాటలే తెలియదు. నమ్మకంతో మాట్లాడుతున్న విషయాలను గురించి వాళ్ళకు తెలియదు.
8 ధర్మశాస్త్రాన్ని మానవుడు సక్రమంగా ఉపయోగిస్తే మంచిదని మనకు తెలుసు. 9 మంచివాళ్ళ కోసం ధర్మశాస్త్రం వ్రాయబడలేదని మనకు తెలుసు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళకోసం, తిరుగుబాటు చేసేవాళ్ళ కోసం, దేవుణ్ణి నమ్మనివాళ్ళకోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, అపవిత్రమైనవాళ్ళకోసం, తల్లిదండ్రులను గౌరవపరచనివాళ్ళకోసం, హంతకుల కోసం, 10 వ్యభిచారుల కోసం, కామంతో అసహజంగా ప్రవర్తించేవాళ్ళకోసం, బానిస వ్యాపారం చేసేవాళ్ళకోసం, అసత్యాలాడేవాళ్ళకోసం, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళ కోసం, నిజమైన బోధనకు వ్యతిరేకంగా నడుచుకొనేవాళ్ళకోసం, అది వ్రాయబడింది. 11 నాకందించిన దివ్యమైన ఆ సువార్తలో ఈ ఉపదేశం ఉంది. దాన్ని తేజోవంతుడైన దేవుడు నాకందించాడు.
దేవుని దయకు నేను కృతజ్ఞుణ్ణి
12 నాకు శక్తినిచ్చి, నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి, ఈ సేవకోసం నన్ను నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 13 ఒకనాడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనికరించాడు. 14 మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసు క్రీస్తులో ఉన్న విశ్వాస గుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు.
15 పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి. 16 నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయ చూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయేవాళ్ళకు, తనవల్ల విముక్తి పొందబోయేవాళ్ళకు అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు. 17 చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక! ఆమేన్.
18 తిమోతీ, నా కుమారుడా! గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. 19 విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకొన్నారు. 20 హుమెనై, అలెక్సంద్రు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు దైవదూషణ చెయ్యకుండా ఉండటం నేర్చుకోవాలని వాళ్ళను సాతానుకు అప్పగించాను.
© 1997 Bible League International