M’Cheyne Bible Reading Plan
చర్మరోగాలను గూర్చిన నియమాలు
13 మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు: 2 “ఒక వ్యక్తి చర్మం మీద వాపు ఉండవచ్చును, లేక అది పొక్కుగాని, నిగనిగలాడు మచ్చగాని కావచ్చును. ఆ మచ్చ కుష్ఠురోగంలా కనబడితే, యాజకుడగు అహరోను దగ్గరకు గాని, యాజకులైన అతని కుమారుల దగ్గరకుగాని ఆ వ్యక్తిని తీసుకొనిరావాలి. 3 ఆ వ్యక్తి చర్మంమీది మచ్చను యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబడినా, ఆ మచ్చ అతని చర్మంకంటె లోతుకు ఉన్నా అది కుష్ఠురోగమే. యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించటం ముగించగానే ఆ వ్యక్తి కుష్ఠురోగి అని యాజకుడు ప్రకటించాలి.
4 “కొన్నిసార్లు ఒక వ్యక్తి చర్మంమీద ఒక తెల్లమచ్చ ఉంటుంది. కానీ ఆ మచ్చ చర్మంలోపలికి ఉండదు. అదే నిజమైతే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ఇతరులనుండి యాజకుడు వేరు చేయాలి. 5 ఏడో రోజున యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ మచ్చలో మార్పు లేకుండా, అది చర్మంమీద విస్తరించకుండా ఉన్నట్టు యాజకునికి కనబడితే, అప్పుడు ఆ వ్యక్తిని మరో ఏడు రోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి. 6 ఏడు రోజుల తర్వాత మరల ఆ వ్యక్తిని యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చ మానిపోయి, చర్మంమీద విస్తరించకుండా ఉంటే, ఆ వ్యక్తి పరిశుద్ధుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ కేవలం పొక్కే. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, మళ్లీ పవిత్రుడు కావాలి.
7 “అయితే ఆ వ్యక్తి మరల శుద్ధి చేయబడేందుకు తనను తాను యాజకునికి కనబరచుకొన్న తర్వాత, ఆ పొక్కు చర్మంమీద మరలా విస్తరిస్తే, అప్పుడు ఆ వ్యక్తి మరల యాజకుని దగ్గరకు రావాలి. 8 యాజకుడు తప్పక పరిశీలించాలి. ఒకవేళ ఆ పొక్కు చర్మం మీద విస్తరిస్తే, ఆవ్యక్తి అపవిత్రుడని యాజకుడు తప్పక ప్రకటించాలి. అది కుష్ఠురోగం.
9 “ఒక వ్యక్తికి కుష్ఠురోగం ఉంటే అతణ్ణి యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. 10 యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. చర్మంలో తెల్లని వాపుఉండి, వెంట్రుకలు తెల్లబడి ఉండి, వాపులో చర్మంతెల్లగా కనబడితే 11 అప్పుడు అది ఆ వ్యక్తి చర్మంమీద చాలకాలంగా ఉన్న కుష్ఠురోగం. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి. కొద్దికాలం ఆ వ్యక్తిని మిగిలిన ప్రజలనుండి యాజకుడు ప్రత్యేకించాలి. ఎందుచేతనంటే ఆ వ్యక్తి అపవిత్రుడు అని అతనికి తెలుసు.
12 “కొన్నిసార్లు చర్మరోగం ఒక వ్యక్తి శరీరమంతటా వ్యాపిస్తుంది. ఆ వ్యక్తి తలనుండి పాదంవరకు చర్మంమీద అంతటా చర్మరోగం ఆవరిస్తుంది. యాజకుడు ఆ వ్యక్తి శరీరమంతా తప్పక చూడాలి. 13 చర్మరోగం శరీరమంతా వ్యాపించినట్టు, అది ఆ వ్యక్తి చర్మాన్ని పూర్తిగా తెలుపు చేసినట్టు యాజకుడు చూస్తే, అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. 14 అయితే ఆ వ్యక్తి చర్మం పచ్చిగా ఉంటే అతడు పవిత్రుడుకాడు. 15 యాజకుడు చర్మం పచ్చిగా ఉండటం చూసినప్పుడు, ఆ వ్యక్తి అపవిత్రుడని అతడు ప్రకటించాలి. పచ్చి చర్మం పవిత్రం కాదు. అది కుష్ఠురోగం.
16 “చర్మం మరల పచ్చిగా తయారై తెల్లగా మారితే, అప్పుడు ఆ వ్యక్తి తప్పక యాజకుని దగ్గరకు రావాలి. 17 యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ తెల్లబారితే ఆ పొడగల ఆ వ్యక్తి పవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి పవిత్రుడు.
18 “ఒకవేళ దేహపు చర్మంమీద మానిపోయిన పుండు ఉండవచ్చును. 19 కాని ఆ పుండు స్థానంలో తెల్లటి వాపుగాని, తెలుపు ఎరుపు కలిసి నిగనిగలాడే మచ్చగానీ ఉండవచ్చును. అప్పుడు దేహం మీది ఈ చోటును యాజకునికి చూపెట్టాలి. 20 యాజకుడు పరిశీలించాలి. వాపు చర్మంకంటె లోతుగా ఉండి, దాని మీది వెంట్రుకలు తెల్లబడి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ కుష్ఠురోగం పుండులోపలనుండి కుష్ఠురోగం బయటపడింది. 21 కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా దానిమీద వెంట్రుకలు తెల్లబడక, ఆ మచ్చ చర్మంకంటె లోతుగా ఉండక మానుతున్నట్టు కనబడితే అప్పుడు యాజకుడు, ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ప్రత్యేకంగా ఉంచాలి. 22 ఒకవేళ ఆ మచ్చయింకా ఎక్కువగా చర్మంమీద విస్తరిస్తే, ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠుపొడ. 23 అయితే నిగనిగలాడే ఆ మచ్చ విస్తరించక, ఉన్నచోటనే ఉంటే, అది పాతపుండుకు సంబంధించిన దద్దురు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి.
24-25 “ఒక వ్యక్తి చర్మంమీద కాలి వాత కావచ్చును. ఒకవేళ ఆ పచ్చి చర్మం తెల్లగా గాని, తెలుపు ఎరుపురంగు మచ్చలా కానీ మారితే యాజకుడు తప్పక దాన్ని పరిశీలించాలి. ఆ తెల్ల మచ్చ చర్మంకంటె లోతుగా ఉన్నట్టుగానీ, ఆ మచ్చ మీది వెంట్రుకలు తెల్లబడినా అది కుష్ఠురోగం. ఆ వాతలోనుంచి కుష్ఠురోగం బయటపడింది. అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం. 26 కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా నిగనిగలాడే మచ్చమీద వెంట్రుకలు లేకుండా ఆ మచ్చ చర్మంకంటె లోతుగా లేకుండ అది మానుతున్నట్టు ఉంటే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు యాజకుడు వేరుచేయాలి. 27 ఏడవ రోజున యాజకుడు ఆ వ్యక్తిని మరల పరిశీలించాలి. ఆ మచ్చ చర్మంమీద విస్తరిస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం. 28 అయితే నిగనిగలాడే ఆ మచ్చ చర్మంమీద విస్తరించక మానుతుంటే, అది వాత మీది వాపు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కేవలం వాత మచ్చ మాత్రమే.
29 “ఒక వ్యక్తి తలమీదగాని గెడ్డంమీద గాని పొడరావచ్చును. 30 ఒక యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడినా, దానిచుట్టూ వెంట్రుకలు పలుచగాను, పసుపుగాను ఉన్నా, ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది చెడ్డ చర్మరోగం. 31 ఒక వేళ ఆ పొడ చర్మంకంటె లోతుగా లేకపోయినా, దానిలో నల్ల వెంట్రుకలు లేకపోతే ఆ వ్యక్తిని ఏడురోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి. 32 ఏడవ రోజున ఆ పొడను యాజకుడు పరిశీలించాలి. ఆ పొడ విస్తరించకపోయినా, దానిలో పసుపు వెంట్రుకలు పెరగకపోయినా, ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా, 33 ఆ వ్యక్తి క్షౌరం చేసుకోవాలి. కానీ అతడు ఆ పొడను కత్తిరించకూడదు. ఆ వ్యక్తిని యింకో ఏడు రోజుల వరకు యాజకుడు ప్రత్యేకించాలి. 34 ఏడవ రోజున యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంలోనికి విస్తరించక, అది చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా, ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుకుకొని శుద్ధుడు కావాలి. 35 కానీ ఆ వ్యక్తి పవిత్రుడయిన తర్వాత ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే, 36 యాజకుడు మరల ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే, పసుపు వెంట్రుకల కోసం యాజకుడు చూడక్కర్లేదు. ఆ వ్యక్తి అపవిత్రుడు. 37 అయితే ఆ వ్యాధి మానిపోయినట్టు యాజకుడు తలిస్తే, దానిలో నల్ల వెంట్రుకలు పెరుగుతుంటే ఆ రోగం మాని పోయింది. ఆ వ్యక్తి పవిత్రుడు. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
38 “ఒక వ్యక్తి చర్మంమీద తెల్ల మచ్చలు ఉంటే, 39 ఒక యాజకుడు ఆ మచ్చలను పరిశీలించాలి. ఒకవేళ ఆ వ్యక్తి చర్మంమీది మచ్చలు వాడిపోయి తెలుపుగా ఉంటే అది హానికరము కాని పొక్కులు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు.
40 “ఒక వ్యక్తి తలమీద వెంట్రుకలు ఊడి పోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం బట్టతల 41 ఒకని తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం మరో రకం బట్టతల. 42 కానీ అతని తలమీద ఎరుపు తెలుపు పొడ ఉంటే అది చర్మవ్యాధి. 43 ఒక యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ వాపు ఎరుపు తెలుపుగా ఉండి, శరీరంలోని ఇతర భాగాల్లో కుష్ఠు రోగంలా కనబడితే, 44 ఆ వ్యక్తి తలమీద కుష్ఠు రోగం ఉంది. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
45 “ఒక వ్యక్తికి కుష్ఠు రోగం ఉంటే అతడు ఇతరులను హెచ్చరించాలి. అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి అని కేకలు వేయాలి. అతడు తన బట్టలను చింపివేయాలి, తన తల వెంట్రుకలు విరబోసుకోవాలి, తన నోరు కప్పుకోవాలి. 46 ఆ వ్యాధి ఉన్న కాలమంతా అతను అపవిత్రుడే. ఆ వ్యక్తి అపవిత్రుడు. అతడు ఒంటరిగా బతకాలి. అతని నివాసం బసకు వెలుపల ఉండాలి.
47 “కొన్ని బట్టల మీద బూజుపొడ ఉండవచ్చును. ఆ బట్ట నారబట్ట లేక ఉన్నిది కావచ్చు. 48 బట్ట అల్లినది కావచ్చు, కుట్టినది కావచ్చు, లేదా ఒక తోలు మీద కాని, తోలుతో చేయబడిన మరి దేనిమీద కాని ఆ బూజుపొడ ఉండవచ్చును. 49 ఆ బూజుపొడ పచ్చగా కానీ ఎర్రగా కానీ ఉంటే దాన్ని యాజకునికి చూపించాలి. 50 ఆ బూజుపొడను యాజకుడు పరిశీలించాలి. దానిని ఏడు రోజుల వరకు ఒక ప్రత్యేక స్థలంలో అతడు ఉంచాలి. 51-52 ఏడవ రోజున ఆ బూజుపొడను యాజకుడు పరిశీలించాలి. ఆ బూజుపొడ తోలు మీద ఉన్నా బట్టమీద ఉన్నా ఒకటే. ఆ బట్ట కుట్టిందైనా అల్లినదైనా ఒకటే. ఆ తోలు ఉపయోగించబడింది దేని కొరకైనా ఒకటే. బూజుపొడ వ్యాపిస్తే అది నాశన కరమైనది. ఆ బట్ట లేక తోలు అపవిత్రం. ఆ పొడ అపవిత్రం. ఆ బట్ట లేక తోలును యాజకుడు కాల్చి వేయాలి.
53 “ఆ బూజుపొడ వ్యాపించినట్టు యాజకునికి కనబడకపోతే, ఆ తోలును లేక ఆ బట్టను ఉతకాలి. అది తోలుగాని, బట్టగాని లేక బట్ట అల్లికగాని, కుట్టింది గాని, దాన్ని ఉతకాల్సిందే. 54 ఆ బట్టను లేక తోలును ఉతకమని ఆ మనుష్యులకు యాజకుడు ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు ఆ బట్టలను ఇంకా ఏడు రోజుల వరకు వేరుపరచాలి. 55 ఆ సమయం తీరగానే యాజకుడు మళ్లీ పరిశీలించాలి. ఆ బూజుపొడ ఇంకా అలానే కనబడితే అది అపవిత్రం. ఆ పొడ వ్యాపించకపోయినా సరే ఆ బట్టను లేక ఆ తోలును మీరు కాల్చివేయాలి.
56 “కానీ ఒక వేళ, ఆ తోలు ముక్కను లేక ఆ బట్టను యాజకుడు చూచినప్పుడు, బూజుపొడ వాడిపోయి ఉంటే, ఆ బట్ట మీద లేక తోలు మీద ఉన్న ఆ పొడను యాజకుడు చింపివేయాలి. ఆ బట్ట అల్లికది గాని, నేసినది కానీ ఫర్వాలేదు. 57 లేదా ఆ బట్టమీద లేక ఆ తోలుమీద బూజుపొడ తిరిగి రావచ్చును. అలా జరిగితే ఆ బూజుపొడ వ్యాపిస్తుంది. ఆ చించిన బట్ట ముక్కను లేక తోలు ముక్కను కాల్చివేయాలి. 58 అయితే ఉతికిన తర్వాత బూజుపొడ మళ్లీ రాకపోతే అప్పుడు ఆ బట్ట ముక్క లేక తోలు ముక్క పవిత్రం. ఆ బట్ట కుట్టిందిగానీ అల్లిందిగానీ ఏదైనా ఫర్వాలేదు. ఆ బట్ట పవిత్రం.”
59 తోలు ముక్కలు లేక బట్టముక్కల మీద బూజుపొడకు సంబంధించిన నియమాలు అవి. బట్ట కుట్టింది గాని అల్లిందిగాని ఫర్వాలేదు.
దావీదు కీర్తన.
15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
2 ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
3 అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
4 ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
5 ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.
దావీదుకు అభిమాన కావ్యము.
16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
2 “యెహోవా, నీవు నా యజమానివి
నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
అని నేను యెహోవాతో చెప్పాను.
3 మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
“వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”
4 కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
5 నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
యెహోవా, నీవే నన్ను బలపరచావు.
యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
6 నా వంతు చాలా అద్భుతమయింది.
నా స్వాస్థ్యము చాలా అందమయింది.
7 యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.
8 నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
9 కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.
27 భవిష్యత్తులో జరిగే దానిని గూర్చి అతిశయించవద్దు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు.
2 నిన్ను నీవే ఎన్నడూ పొగడుకోవద్దు. ఆ పని ఇతరులను చేయనివ్వు.
3 మోయుటకు ఒక బండ బరువుగాను యిసుక గట్టిగాను ఉంటాయి. కాని ఒక బుద్ధిహీనుని కోపము మూలంగా కలిగిన కష్టాన్ని మోయటం ఆ రెండింటి కంటే సహించడం కష్టం.
4 కోపం క్రూరమైంది. నీచమైంది. అది నాశనం కలిగిస్తుంది. కాని అసూయ మరీ దౌర్భాగ్యం.
5 దాచబడిన ప్రేమకంటె బహిరంగ విమర్శ మేలు.
6 ఒక స్నేహితుడు అప్పుడప్పుడు నిన్ను బాధించవచ్చు. కాని ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని అతడు కోరుకోడు. ఒక శత్రువు విషయం వేరుగా ఉంటుంది. ఒక శత్రువు నీ మీద దయగా ఉన్నప్పటికీ అతడు నిన్ను బాధించగోరుతాడు.
7 నీకు ఆకలి లేకపోతే అప్పుడు నీవు తేనె కూడా తినలేవు. కాని ఆకలిగా ఉంటే ఏదైనా తినేస్తావు దాని రుచి బాగులేకున్నా సరే.
8 తన ఇంటికి దూరంగా ఉన్న మనిషి తన గూటికి దూరంగా ఉన్న పక్షిలాంటివాడు.
9 పరిమళాలు, సువాసన వస్తువులు నిన్ను సంతోష పెడ్తాయి. కాని ఆపత్తు నీ మనశ్శాంతిని భంగం చేస్తుంది. అదే రీతిగా స్నేహితుని హృదయం నుండి వచ్చే మధురమైన హితవు వుంటుంది.
10 నీ స్నేహితులను, నీ తండ్రి స్నేహితులను మరువకు. మరియు నీకు కష్టం వస్తే సహాయం కోసం చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లవద్దు. చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లడం కంటే నీ దగ్గరలో ఉన్న నీ పొరుగువారిని అడగటం మంచిది.
11 నా కుమారుడా జ్ఞానము కలిగివుండు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుడు నన్ను విమర్శించే వారికి ఎవరికైనా సరే నేను జవాబు చెప్పగలను.
12 జ్ఞానముగల వారు కష్టం రావడం గమనించి, దాని దారిలో నుండి తప్పుకుంటారు. కాని బుద్ధిహీనుడు సూటిగా చిక్కులోకి వెళ్లి దాని మూలంగా శ్రమపడతాడు.
13 మరో మనిషి అప్పుల కోసం నీవు బాధ్యత వహిస్తే, నీవు నీ చొక్కా పోగొట్టుకుంటావు.
14 “శుభోదయం” అని గట్టిగా అరుస్తూ తెల్లవారకట్లనే నీ పొరుగు వారిని మేలుకొలుపవద్దు. అది అతనికి ఒక శాపం అనుకుంటాడే కాని దీవెన అనుకోడు.
15 ఎప్పుడూ వివాదం పెట్టుకోవాలని చూచే భార్య వర్షపు రోజున ఆగకుండా కురిసే చినుకుల్లాంటిది. 16 ఆ స్త్రీని వారించటం పెను గాలిని వారించ ప్రయత్నించినట్టే ఉంటుంది. అది నీ చేతితో నూనె పిండేందుకు ప్రయత్నించినట్టు ఉంటుంది.
17 ఇనుప కత్తులను పదును చేసేందుకు ఇనుప ముక్కలను మనుష్యులు వాడుతారు. అదే విధంగా మనుష్యులు ఒకరి నుండి ఒకరు నేర్చుకొని ఒకరిని ఒకరు పదును చేస్తారు.
18 అంజూరపు చెట్ల విషయం శ్రద్ధగలవాడు దాని ఫలాలు తినగలుగుతాడు. అదే విధంగా తన యజమానుని విషయమై శ్రద్ధగలవాడు ప్రతిఫలం పొందుతాడు. అతని యజమాని అతని గూర్చి శ్రద్ధ పుచ్చుకుంటాడు.
19 ఒక మనిషి నీళ్లలోనికి చూసినప్పుడు అతడు తన స్వంత ముఖాన్నే చూడగలుగుతాడు. అదే విధంగా ఒక మనిషి హృదయం నిజానికి అతడు ఎలాంటివాడో తెలియచేస్తుంది.
20 మరణస్థానం మరియు నాశన స్థలము ఎన్నటికీ తృప్తిపడవు. మానవుని కన్నులు కూడ ఎన్నటికీ తృప్తినొందవు.
21 బంగారాన్ని, వెండిని శుద్ధి చేయటానికి మనుష్యులు అగ్నిని ఉపయోగిస్తారు. అదే విధంగా ఒక మనిషికి ప్రజలు ఇచ్చే మెప్పుద్వారా అతడు పరీక్షించబడతాడు.
22 ఒక బుద్ధిహీనుని నీవు పొడుంగా నూర్చినా అతనిలోని తెలివి తక్కువ తనాన్ని నీవు బయటకు నెట్టివేయలేవు.
23 నీ గొర్రెలను, పశువులను జాగ్రత్తగా చూసుకో, నీకు చేతనైనంత బాగా వాటిని గూర్చి శ్రద్ధ తీసికో. 24 ఐశ్వర్యం శాశ్వతంగా ఉండదు. రాజ్యాలు కూడా శాశ్వతంగా ఉండవు. 25 మనుష్యులు ఎండుగడ్డి కోస్తే కొత్త గడ్డి పెరగటం మొదలవుతుంది. తరువాత కొండల మీద వెరుగుతున్న ఆ గడ్డిని వారు కోస్తారు. 26 (అందుచేత నీకు ఉన్న దానితో సంతృప్తిగా ఉండు.) నీ గొర్రెపిల్లల బొచ్చు నుండి నీవు బట్టలు చేసికోవచ్చు. నీ మేకలు అమ్మగా వచ్చిన డబ్బుతో నీవు భూమి కొనవచ్చును. 27 మిగిలిన నీ మేకలు సమృద్ధిగా పాలు ఇస్తాయి. కనుక నీకు, నీ కుటుంబానికి కూడా సరిపడినంత ఆహారం ఉంటుంది. నీ దాసీలను ఆరోగ్యవంతులుగా చేస్తుంది.
1 పౌలు, సిల్వాను మరియు తిమోతిల నుండి మన తండ్రియైన దేవునికి మరియు యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి:
2 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహము, శాంతి ప్రసాదించు గాక!
3 సోదరులారా! మీ విశ్వాసం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. మీ మధ్య ఉన్న ప్రేమ వర్ధిల్లుతోంది. కనుక మీ విషయంలో మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతగా ఉండాలి. 4 మీరు ఓర్పుతో సహిస్తున్న హింసలను గురించి, కష్టాలను గురించి విశ్వాసాన్ని గురించి మేము పొగడుతూ దేవుని ఇతర సంఘాలకు చెపుతూ ఉంటాము.
దేవుని తీర్పు గూర్చి పౌలు చెప్పటం
5 దేవుడు న్యాయంగా తీర్పు చెబుతాడన్నదానికి ఇది సాక్ష్యం. మీరు దేనికొరకు వీటిని అనుభవిస్తున్నారో ఆ రాజ్యానికి దేవుడు మిమ్మల్ని అర్హులుగా చేస్తాడు. 6 దేవుడు నీతిమంతుడు. మిమ్మల్ని కష్టపెట్టినవాళ్ళకు కష్టం కలిగిస్తాడు. 7 ఆయన మనందరి కష్టాలు తొలిగిస్తాడు. ఇది యేసు ప్రభువు పరలోకం నుండి శక్తిగల దేవదూతలతో, అగ్నిజ్వాలలతో వచ్చినప్పుడు సంభవిస్తుంది. 8 దేవుడు అంటే ఎవరో తెలియనివాళ్ళను, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించనివాళ్ళను ఆయన శిక్షిస్తాడు. 9 వాళ్ళు ప్రభువు సమక్షంలో నుండి, ఆయన గొప్పశక్తి నుండి దూరమై శాశ్వతంగా నాశనమై పోతారు. 10 ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసులు ఆయనతో సహా మహిమను పొందుతారు. అప్పుడు ఆయనయందు విశ్వసించినవాళ్ళు ఆయన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతారు. మేము చెప్పిన సందేశాన్ని మీరు కూడా విశ్వసించారు కనుక మహిమను పొందేవాళ్ళలో మీరు కూడా ఉన్నారు.
11 ఇది మనస్సులో పెట్టుకొని తాను పిలిచిన పిలుపుకు తగినట్లు మీ జీవితాలను నడపమని మేము దేవుణ్ణి ప్రతిరోజూ ప్రార్థిస్తూ ఉంటాము. అంతేకాక, మీరు మంచి చేయాలని ఆశిస్తూ కోరుకొన్న ప్రతి కోరికను, విశ్వాసంవల్ల మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు తన శక్తి ద్వారా పూర్తి చేయాలనీ ప్రార్థిస్తూ ఉంటాము. 12 మీ ద్వారా మన యేసు క్రీస్తు ప్రభువు మహిమ పొందాలని, మీకు ఆయన ద్వారా తన మహిమలో భాగం కలగాలని మేము ప్రార్థిస్తూ ఉంటాము. ఇది మన దేవుని అనుగ్రహంవల్ల, యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృప వల్ల సంభవిస్తుంది.
© 1997 Bible League International