M’Cheyne Bible Reading Plan
మాంసం తినేందుకు నియమాలు
11 మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పండి: మీరు తినదగిన జంతువులు ఏవంటే: 3 ఏ జంతువు డెక్కలు చీలి ఉండి, నెమరు వేస్తుందో దాని మాంసం మీరు తినవచ్చును.
4-6 “కొన్ని జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి డెక్కలు చీలి ఉండవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. ఒంటెలు, సిరాయారకపు పొట్టికుందేలు, కుందేలు అలాంటివే కనుక అవి మీకు అపవిత్రం. 7 మరికొన్ని జంతువులకు డెక్కలు చీలి ఉంటాయి గాని అవి నెమరు వేయవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. పందులు కూడా మీకు అపవిత్రం. 8 ఆ జంతువుల (పందుల) మాంసం తినవద్దు. వాటి శవాలను కనీసం తాకవద్దు అవి మీకు అపవిత్రం.
సముద్ర ఆహార నియమాలు
9 “సముద్రంలోగాని, నదిలోగాని ఉండే జలచరాలకు రెక్కలు, పొలుసు ఉంటే, మీరు వాటిని తినవచ్చును. 10-11 అయితే సముద్రంలోగాని నదిలో గాని ఉండే జలచరం దేనికైనా రెక్కలు, పొలుసు లేకపోతే, వాటిని మీరు తినకూడదు. అలాంటిది అసహ్యమయినది. దాని మాంసం తినవద్దు. కనీసం దాని శవాన్ని కూడా తాకవద్దు. 12 సముద్రంలోనూ, నదిలోనూ ఉండే ఏ జలచరానికైనా రెక్కలు, పొలుసులు లేకపోతే అది అసహ్యమయిందిగానే మీరు ఎంచుకోవాలి.
తినకూడని పక్షులు
13 “అలానే మీరు తినకూడని పక్షులు ఇవి. ఈ పక్షుల్లో దేనినీ తినవద్దు: పక్షిరాజులు, రాబందులు, క్రౌంచ పక్షులు, 14 గద్ద, అన్నిరకాల గద్దలు, 15 అన్ని రకాల నల్ల పక్షులు, 16 నిప్పుకోళ్లు, కపిరిగాళ్లు, అన్ని రకాల డేగలు, 17 గుడ్లగూబలు, పగిడికంటెలు, పెద్దగుడ్ల గూబలు, 18 నీటి కాకులు, కొంగలు, నల్లబోరువలు, 19 గూడ బాతులు, సంకుబుడి కొంగలు, అన్నిరకాల కొంగలు, కుకుడుగువ్వలు, గబ్బిలాలు.
పురుగుల్ని తినటాన్ని గూర్చిన విధులు
20 “రెక్కలు ఉండి మొత్తం నాలుగు కాళ్లతో నడిచే జీవులన్నీ అసహ్యమైనవే. రెక్కలు ఉండి, నాలుగు కాళ్లతో నడిచే కీటకాలన్నీ అసహ్యమైనవే. ఆ కీటకాలను తినవద్దు. 21 అయితే కీటకాలకు రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో నడిస్తే, వాటికి కనుక పాదాలకు పైగా కీళ్లు ఉండి అవి ఎగురగలిగినవైతే, అలాంటి కీటకాలను మీరు తినవచ్చును. 22 ఏ కీటకాలను మీరు తినవచ్చునంటే: అన్ని రకాల మిడతలు, రెక్కలున్న అన్నిరకాల మిడతలు, అన్ని రకాల పెద్ద మిడతలు, అన్నిరకాల ఆకు మిడతలు.
23 “అయితే రెక్కలు, నాలుగు పాదాలు ఉన్న మిగిలిన కీటకాలు అన్నీ మీకు అసహ్యం. 24 ఆ కీటకాలు మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. ఈ కీటకాల శవాలను తాకిన ఏ వ్యక్తి అయినా సరే సాయంత్రంవరకు అపవిత్రం అవుతాడు. 25 ఒక వ్యక్తి చచ్చిన కీటకాల్లో ఒకదాన్ని గనుక పట్టుకొంటే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు.
తువుల్ని గూర్చి మరికొన్ని నియమాలు
26-27 “కొన్ని జంతువులకు డెక్కలు చీలి ఉంటాయిగాని డెక్కలు సమానంగా చీలి ఉండవు. కొన్ని జంతువులు నెమరు వేయవు. కొన్ని జంతువులకు డెక్కలు ఉండవు, అవి వాటి పాదాలమీద నడుస్తాయి. ఆ జంతువులన్నీ మీకు అపవిత్రం. వాటిని ఎవరైనా తాకితే వారు అపవిత్రం అవుతారు. ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు 28 వాటి శవాలను ఎవరైనా ఎత్తితే, ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతువులు మీకు అపవిత్రము.
ప్రాకే జంతువులను గూర్చిన నియమాలు
29 “ప్రాకే ఈ జంతువులు మీకు అపవిత్రం: ముంగిసలు, పందికొక్కులు అన్ని రకాల పెద్ద బల్లులు. 30 అడవి ఎలుకలు, మొసళ్లు, తొండలు, సరటాలు, ఊసరవెల్లులు. 31 ప్రాకే ఈ జంతువులు మీకు అపవిత్రం. వాటిలో చచ్చిన వాటిని ఎవరైనా తాకితే అలాంటివారు సాయంత్రం వరకు అపవిత్రులవుతారు.
అపవిత్ర జంతువులను గూర్చిన నియమాలు
32 “అపవిత్రమైన ఆ జంతువుల్లో ఏదైనా చచ్చి దేనిమీదైనా పడితే, అది అపవిత్రం అవుతుంది. అది చెక్కతో, బట్టతో, తోలుతో చేయబడిన వస్తువులు కానీ, లేక ఏదైనా పనిముట్టుగానీ కావచ్చును. అది ఏదైనాసరే దాన్ని నీళ్లతో కడగాలి. సాయంత్రం వరకు అది అపవిత్రం. తర్వాత అది మరల పవిత్రం అవుతుంది. 33 అపవిత్రమైన ఆ జంతువుల శవం ఏదైనా మట్టి పాత్రలో పడితే, ఆ ప్రాతలో ఉన్నది ఏదైనా సరే అది అపవిత్రం అవుతుంది. నీవు ఆ పాత్రను పగులగొట్టి తీరాలి. 34 అపవిత్రమైన మట్టి పాత్రలోని నీళ్లు ఏ ఆహారపదార్థం మీద పడినా, అందులోని ఆహారం అపవిత్రం అవుతుంది. అపవిత్రమైన పాత్రలోని పానీయం ఏదైనా అపవిత్రం అవుతుంది. 35 అపవిత్రమై చచ్చిన జంతువుయొక్క అవయవం ఒకటి దేనిమీద పడినా అది అపవిత్రం. అది మట్టి పొయ్యికావచ్చును, మట్టి కుంపటి కావచ్చును. దాన్ని ముక్కలుగా పగులగొట్టాలి. అవి ఇంకెంత మాత్రం పరిశుద్ధంగా ఉండవు. అవి మీకు ఎప్పటికీ అపవిత్రంగానే ఉంటాయి.
36 “నీళ్లు ఊరుతూండే ఊటగాని, బావిగాని, పరిశుద్ధంగా ఉంటుంది. అయితే అపవిత్రమైన ఏ జంతువు శవాన్నీ, తాకిన ఏ వ్యక్తి అయినాసరే అపవిత్రుడు. 37 అపవిత్ర జంతువుల్లోని ఏ శవమైనా, నాట్లువేసే ఏ విత్తనంమీద పడినా, ఆ విత్తనం ఇంకా పరిశుద్ధంగానే ఉంటుంది. 38 అయితే ఆ విత్తనాలమీద నీళ్లు పోసిన తర్వాత అపవిత్ర జంతువుయొక్క శవంలోని ఏ భాగమైనా ఆ విత్తనాలమీద మరల పడితే, అప్పుడు మీకు ఆ విత్తనాలు అపవిత్రం.
39 “మీరు ఆహారానికి ఉపయోగించే జంతువు ఏదైనా చస్తే, దాని శవాన్ని తాకిన వ్యక్తి ఆ సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. 40 మరియు ఈ జంతువు మాంసం తిన్న వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతువు శవాన్ని ఎత్తే మనిషి తప్పక తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.
41 “నేలమీద ప్రాకే ప్రతి జంతువు అసహ్యమయిందే. దాన్ని తినకూడదు. 42 పొట్టతో ప్రాకే జంతువుల్లో దేనిని గాని లేక నాలుగు పాదాలతో నడిచే ఏ జంతువునుగాని లేక చాలా పాదాలుగల జంతువును గాని మీరు తినకూడదు. అవి మీకు అసహ్యమైనవి. 43 అసహ్యమైన ఆ జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు హేయం చేసుకోవద్దు. వాటితో మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. 44 ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక. నేను పరిశుద్ధుడ్ని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. అసహ్యమైన ఆ ప్రాకే జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. 45 మిమ్మల్ని ఈజిప్టునుండి నేను తీసుకొచ్చాను. మీరు నాకు ప్రత్యేకమైన ప్రజలుగా ఉండేందుకు నేను ఇలా చేసాను. మీకు నేను దేవుడిగా ఉండాలని నేను ఇలా చేసాను. నేను పరిశుద్ధుడ్ని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి!”
46 భూమిమీద ఉండే పశువులు, పక్షులు, ఇతర జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి. సముద్రంలో ఉండే జలచరాలు, నేలమీద ప్రాకే జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి. 47 పవిత్ర జంతువులు ఏవో అపవిత్ర జంతువులు ఏవో ప్రజలు తేలుసుకోగలిగేందుకే ఆ ప్రబోధాలు. అందుచేత ఏ జంతువుల్ని తినవచ్చో, ఏ జంతువుల్ని తినకూడదో ప్రజలకు తెలుస్తుంది.
ప్రసవించిన తల్లులకు నియమాలు
12 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు:
“ఒక స్త్రీ మగ శిశువుకు జన్మనిస్తే ఆ స్త్రీ ఏడు రోజుల వరకు అపవిత్రంగావుంటుంది. ఇది ఆమె నెలసరి రక్తస్రావం విషయంలో అపవిత్రంగా ఉన్నట్టే. 3 ఎనిమిదో రోజున ఆ మగ శిశువుకు సున్నతి చేయాలి. 4 అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు ముప్పయిమూడు రోజులు పడుతుంది. పరిశుద్ధమయింది దేన్నీ ఆమె తాకగూడదు. ఆమె పవిత్రపరచబడటం పూర్తి అయ్యేంతవరకు పరిశుద్ధ స్థలంలో ఆమె ప్రవేశించకూడదు. 5 కానీ ఆ స్త్రీ ఒక ఆడ శిశువుకు జన్మనిస్తే నెలసరి రక్తస్రావ సమయంలో ఉన్నట్టే రెండు వారాలు ఆమె అపవిత్రంగా ఉంటుంది. ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు అరవై ఆరు రోజులు అవుతుంది.
6 “ప్రసవించిన తల్లి పవిత్రం అయ్యేందుకు ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. పవిత్రపర్చబడే ఆ ప్రత్యేక సమయం అయిపోగానే ఆడపిల్ల తల్లియైనా, మగపిల్ల తల్లియైనా, ఆ తల్లి ప్రత్యేకమైన బలి అర్పణలను సన్నిధి గుడారానికి తీసుకొనిరావాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ బలి అర్పణలను ఒక యాజకునికి ఇవ్వాలి. దహన బలికోసం ఒక సంవత్సరం వయస్సుగల ఒక గొర్రెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురం పిల్లను లేక ఒక గువ్వను ఆమె తీసుకొనిరావాలి. 7-8 ఒకవేళ ఆ స్త్రీ గొర్రెపిల్లను ఇవ్వలేక పోతే, రెండు పావురపు పిల్లల్నిగాని రెండుగువ్వలనుగాని ఆమె తీసుకొని రావచ్చును. అందులో ఒకటి దహనబలి కోసం, మరొకటి పాప పరిహారార్థ బలికోసం. వాటిని యాజకుడు యెహోవా ఎదుట అర్పిస్తాడు. ఈ విధంగా ఆమెకోసం అతడు ఆమె పాపాలను తుడిచి వేస్తాడు. అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అవుతుంది. ఒక మగశిశువుకు లేదా ఆడశిశువుకు జన్మనిచ్చే స్త్రీకి అవి నియమాలు.”
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
2 నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?
3 నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
4 అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.
5 యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
6 యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.
2 పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
(వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
3 కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
మంచి పనులు చేయలేదు.
4 దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.
7 సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.
బుద్ధిహీనులను గూర్చిన జ్ఞాన సూక్తులు
26 తెలివి తక్కువ వానిని గౌరవించటం వ్యర్థం. అది వేసవిలో మంచులా, కోతకాలంలో వర్షంలా ఉంటుంది.
2 నీకు చెడు సంగతులు సంభవించాలని ఒక మనిషి కోరుకొంటే చింతపడవద్దు. నీవు తప్పు ఏమీ చేయక పోతే నీకేమీ చెడు సంభవించదు. ఆ మనిషి మాటలు నీ పక్కగా ఎగురుతూ, ఎన్నడూ ఆగని పక్షుల్లా ఉంటాయి.
3 గుర్రాన్ని చబుకుతో కొట్టాలి. గాడిదకు కళ్లెం పెట్టాలి. బుద్ధిహీనుణ్ణి బెత్తంతో కొట్టాలి.
4 ఇక్కడ ఒక కష్టతరమైన పరిస్థితి ఉంది. ఒక బుద్ధి హీనుడు ఒక మూర్ఖ ప్రశ్న నిన్ను అడిగితే, నీవు మూర్ఖ జవాబు ఇవ్వవద్దు, అలా ఇస్తే నీవుకూడ బుద్ధిహీనునిలా కనబడతావు. 5 కాని ఒక బుద్ధిహీనుడు ఒక మూర్ఖ ప్రశ్న అడిగితే, అప్పుడు నీవు తగిన మూర్ఖపు జవాబు ఇవ్వాలి, లేకపోతే అతడు తాను చాలా తేలివిగలవాడిని అనుకొంటాడు.
6 తెలివి తక్కువ వాణ్ణి ఎన్నడూ నీ సందేశం తీసికొని వెళ్లనివ్వకు. నీవు అలా చేస్తే, నీ స్వంత కాళ్లు కోసి కొన్నట్టు ఉంటుంది. నీవు కష్టం అడిగి తెచ్చుకొంటావు.
7 బుద్ధిహీనుడు జ్ఞానముగలది చెప్పటానికి ప్రయత్నించినప్పుడు, అది ఒక కుంటివాడు నడవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.
8 బుద్ధిహీనునికి గౌరవం చూపించటం వడిసెలలో బండను కట్టడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.
9 ఒక బుద్ధిహీనుడు జ్ఞానముగల మాట చెప్పటానికి ప్రయత్నిస్తే, అది ఒక తాగుబోతువాడు తన చేతిలోని ముల్లు తీసికోవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.
10 ఒక బుద్ధిహీనుణ్ణి లేక దారిన పోయే వాళ్లను ఎవరినంటే వారిని కూలికి పెట్టుకోవటం ప్రమాదకరం. ఎవరికి హాని జరుగుతుందో నీకు తెలియదు.
11 ఒక కుక్క ఆహారం తింటుంది. తరువాత దానికి జబ్బుచేసి, వాంతి చేసికొంటుంది. తర్వాత ఆ కుక్క ఆ ఆహారాన్ని మళ్లీ తింటుంది. ఒక బుద్ధిహీనుని విషయం కూడ అలానే ఉంటుంది. అతడు బుద్ధిహీనమైన అదే పనిని మరల మరల చేస్తాడు.
12 ఒక మనిషి జ్ఞానము లేకుండానే జ్ఞానిని అని తలిస్తే అతడు బుద్ధిహీనునికంటె దౌర్భాగ్యుడు.
13 “నేను ఇల్లు విడిచి వెళ్లలేను. వీధిలో సింహంఉంది” అంటాడు ఒక సోమరి.
14 ఒక సోమరి ఒక తలుపులాంటివాడు. ఒక తలుపు దాని బందుల మీద తిరిగినట్టు తన పడక మీద అటు ఇటు తిరగటమే అతడు చేసేది అంతాను. అతడు ఎన్నడూ ఎక్కడికి వెళ్లడు.
15 ఒక సోమరి మనిషి తన పళ్లెంలో నుండి తన భోజనాన్ని తన నోటి వరకు గూడ ఎత్తని మరీ బద్ధకస్తుడు.
16 ఒక సోమరి మనిషి తాను చాలా జ్ఞానము గలవాడను అనుకుంటాడు. వారి తలంపులకు మంచి కారణాలు ఇవ్వగలిగిన ఏడుగురు మనుష్యులకంటే తాను చాలా ఎక్కువ తెలివిగల వాడనని అతడు తలస్తాడు.
17 ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో పాల్గొనడం ప్రమాదకరం. అది దారిన పోతూ ఒక కుక్క చెవులు పట్టి లాగినట్టు ఉంటుంది.
18-19 మరో మనిషిని మాయచేసి, ఊరకనే సరదాగా అలా చేసాను అనేవాడు, అగ్ని బాణాలు గాలిలోకి కొట్టి, ప్రమాదవశాత్తు ఎవరినో చంపిన పిచ్చివాడిలా ఉంటాడు.
20 మంటకు కట్టెలు లేకపోతే మంట చల్లారి పోతుంది. అదే విధంగా చెప్పుడు మాటలు లేకపోతే వివాదం సమసిపోతుంది.
21 బొగ్గులు బూడిదను మండింపచేస్తూ ఉంటాయి. కట్టెలు మంటను మండిస్తూ ఉంటాయి. అదే విధంగా చిక్కులు పెట్టే మనుష్యులు వివాదాన్ని బ్రతకనిస్తారు.
22 మనుష్యులు చెప్పుడు మాటలను ప్రేమిస్తారు. అది మంచి ఆహారాన్ని భోంచేసినట్టు ఉంటుంది.
23 ఒక దుర్మార్గపు పథకాన్ని దాచిపెట్టే మంచి మాటలు ఒక చవకబారు మట్టి కుండ మీద వెండి పూతలా ఉంటాయి. 24 ఒక దుర్మార్గుడు తాను చెప్పే విషయాల ద్వారా తాను మంచివానిలా చూపెట్టు కుంటాడు. కాని అతడు తన దుర్మార్గపు పథకాలను తన హృదయంలో దాచి పెడతాడు. 25 అతడు చెప్పే విషయాలు మంచివిగా కనబడవచ్చు. కాని అతణ్ణి నమ్మవద్దు. అతని హృదయం దురాలోచనలతో నిండిపోయింది. 26 అతడు తన దుర్మార్గపు పథకాలను చక్కని మాటలతో దాచిపెడతాడు. కాని అతడు నీచుడు. చివరికి అతడు చేసే దుర్మార్గవు విషయాలను మనుష్యులందరు చూస్తారు.
27 ఒక మనిషి ఇతరులను ఇక్కట్టులో పెట్టాలని ప్రయత్నించి, గొయ్యి తవ్వితే అతడు తానే ఆ గోతిలో పడతాడు. మరో మనిషి మీదకు ఒక బండను దొర్లించాలని ప్రయత్నిస్తే అతడు తనను తానే చితుక గొట్టుకుంటాడు.
28 అబద్ధాలు చెప్పే మనిషి తనకు భోధించే వారిని ద్వేషిస్తాడు. మరియు ఒక మనిషి చెప్పే విషయాలు అర్థవంతంగా చెప్పకపోతే అతడు తనను తానే బాధించుకొంటాడు.
ప్రభువు రాకకు సిద్ధంగా ఉండండి
5 సోదరులారా! ఇవి ఎప్పుడు జరుగనున్నాయో, వాటి సమయాలను గురించి, కాలాలను గురించి మేము వ్రాయనవసరం లేదు. 2 ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లు వస్తుందని మీకు బాగా తెలుసు. 3 ప్రజలు, “మేము శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు గర్భిణీయైన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు.
4 కాని సోదరులారా! మీరు చీకట్లో లేరు. కనుక ఆ దినం మిమ్మల్ని దొంగల్లా ఆశ్చర్యపరచదు. 5 మనం వెలుగుకు, పగటి వేళకు సంబంధించినవాళ్ళము. రాత్రికి, చీకటివేళకు సంబంధించినవాళ్ళము కాము. 6 మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము. 7 ఎందుకంటే, నిద్రపొయ్యే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు. త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు. 8 మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, ప్రేమను కవచంగాను, రక్షణ, నిరీక్షణలను శిరస్త్రాణంగాను ధరించుదాము.
9 ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపటానికి మనల్ని ఎన్నుకోలేదు. మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఇవ్వటానికి ఎన్నుకొన్నాడు. 10 మనం మరణించినా, లేక బ్రతికి ఉన్నా తాను వచ్చినప్పుడు తనతో కలిసి జీవించాలని క్రీస్తు మనకోసం మరణించాడు. 11 మీరు ఎప్పటిలాగే పరస్పరం ఉత్సాహపరుచుకుంటూ, యితర్ల అభివృద్ధికి తోడ్పడుతూ ఉండండి.
చివరి మాట
12 సోదరులారా! మేము ప్రస్తుతం కోరేదేమిటంటే, కష్టపడి పని చేస్తూ ప్రభువు సేవలో మీకు దారి చూపుతూ మీకు బోధిస్తున్న వాళ్ళను గౌరవించండి. 13 వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు కనుక వాళ్ళను అందరికన్నా ఎక్కువగా ప్రేమించి గౌరవించండి.
శాంతంగా జీవించండి. 14 సోదరులారా! సోమరులను వారించండి. పిరికి వాళ్ళకు ధైర్యం చెప్పండి. అందరి పట్ల శాంతంగా ఉండండి. బలహీనుల్ని బలపర్చండి. ఇది మా విజ్ఞాపన. 15 కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు చేసే వాళ్ళను గమనిస్తూ వాళ్ళను అలా చేయనీయకుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి యితర్ల పట్ల దయచూపుతూ ఉండండి.
16 ఎప్పుడూ ఆనందంగా వుండండి. విడువకుండా ప్రార్థించండి. 17 దైవ నియమాన్ని తప్పక పాటించండి. 18 అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక.
19 ఆత్మ వెలిగించిన జ్యోతిని ఆర్పివేయకండి. 20 ప్రవక్తలు చెప్పినవాటిని తూలనాడకండి. 21 అన్నిటినీ పరీక్షించండి. మంచిని విడువకండి. 22 చెడుకు దూరంగా ఉండండి.
23 శాంతిని ప్రసాదించే ఆ దేవుడు మిమ్మల్ని పూర్తిగా పవిత్రం చెయ్యనీయండి. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేరోజు, మీ అంతరాత్మ, ప్రాణం, దేహం ఏ అపకీర్తి లేకుండా ఉండుగాక! 24 మిమ్మల్ని పిలిచేవాడు విశ్వసింపదగ్గవాడు. ఆయన మేము కోరింది తప్పక చేస్తాడు.
25 సోదరులారా! మా కోసం ప్రార్థించండి. 26 సోదరులందరినీ ప్రేమతో హృదయాలకు హత్తుకోండి. 27 ప్రభువు సమక్షంలో ఈ లేఖను సోదరులందరికీ చదివి వినిపించమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. 28 మన యేసు ప్రభువు అనుగ్రహం మీపై ఉండుగాక!
© 1997 Bible League International