Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 10

దేవుని అగ్ని నాదాబు, అబీహులను నాశనం చేయుట

10 అప్పుడు అహరోను కుమారులైన నాదాబు, అబీహులు పాపం చేసారు. ధూపం వేసేందుకు ఒక్కో కుమారుడు ఒక్కో ధూపార్తిని తీసుకొన్నాడు. వారు వేరే నిప్పు తీసుకొని ధూపం అంటించారు. వారు ఉపయోగించాలని దేవుడు ఆజ్ఞాపించిన నిప్పును వారు ఉపయోగించలేదు. కనుక యెహోవా నుండి అగ్ని వచ్చి నాదాబు, అబీహులను నాశనం చేసింది. యెహోవా ఎదుట వారు మరణించారు.

అప్పుడు అహరోనుతో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ‘నా దగ్గరకు వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజలందరికీ నేను పరిశుద్ధుడుగా ఉండాలి.’” కనుక అహరోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు.

అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలుకు ఇద్దరు కుమారులుండిరి. వారు మిషాయేలు, ఎల్సాఫాను. “పరిశుద్ధ స్థలం ముందునకు వెళ్లండి. మీ సోదరుల శవాలను బస వెలుపలకు తీసుకొని పొండి” అని మోషే వారిద్దరితో చెప్పాడు.

కనుక మిషాయేలు, ఎల్సాఫాను మోషేకు విధేయులయ్యారు. నాదాబు, అబీహు శవాలను బస వెలుపలకు వారు మోసుకొని పోయారు. నాదాబు, అబీహు అప్పటికి ఇంకా వారి ప్రత్యేక చొక్కాలు ధరించే ఉన్నారు.

అప్పుడు అహరోనుతోను, అతని ఇతర కుమారులు ఎలీయాజరు, ఈతామారులతో మోషే ఇలా మాట్లాడాడు. “ఏమి విచారపడకండి. మీబట్టలు చింపుకోవద్దు, జుట్టు చిందరవందర చేసుకోవద్దు. మీరు అలాంటివి చేయకుండా ఉంటే మీరు చావకుండా ఉంటారు. అలానే యెహోవా తన ప్రజలందరి మీద కోపగించకుండా ఉంటాడు. ఇశ్రాయేలు జాతి మొత్తం మీ బంధువులే. నాదాబు, అబీహులను యెహోవా కాల్చివేసినందుకు వారంతా ఏడుస్తారు. కాని మీరు మాత్రం సన్నిధి గుడారం వదిలి వెళ్లకూడదు. ఆ ద్వారం నుండి కనుక మీరు బయటకు వెళ్తే మీరు చనిపోతారు. ఎందుచేతనంటే యెహోవా ప్రత్యేక తైలం మీమీద ఉంది.” గనుక అహరోను, ఎలీయాజరు, ఈతామారు మోషేకు విధేయులయ్యారు.

అప్పుడు అహరోనుతో యెహోవా అన్నాడు: “మీరు సన్నిధి గుడారంలోనికి వచ్చేటప్పుడు నీవుగాని నీ కుమారులుగాని ద్రాక్షారసం, మద్యం తాగకూడదు. మీరు అలాంటివి చేస్తే చనిపోతారు. మీతరాలన్నింటికీ ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. 10 పవిత్రం, అపవిత్రం అనే నిర్దిష్టమైన వ్యత్యాసాన్ని మీరు పాటించాలి. 11 యెహోవా తన ఆజ్ఞలను మోషేకు ఇచ్చాడు, వాటిని మోషే ప్రజలకు ఇచ్చాడు. అహరోనూ, నీవు ఆ ఆజ్ఞలు అన్నింటి విషయమై ప్రజలకు ప్రబోధించాలి.”

12 అహరోనుకు ఎలీయాజరు, ఈతామారు అనే ఇద్దరు కుమారులు ఇంకా బ్రతికి ఉన్నారు. అహరోనుతో, అతని ఇద్దరు కుమారులతో మోషే ఇలా అన్నాడు: “అగ్నిచే దహించబడిన బలులలో ధాన్యార్పణ కొంత మిగిలిపోయింది. ధాన్యార్పణంలోని ఆ భాగాన్ని మీరు తినాలి. అయితే అందులో పొంగే పదార్థం కలుపకుండా మీరు తినాలి. బలిపీఠం దగ్గరే దాన్ని తినాలి. ఎందుచేతనంటే ఆ అర్పణ అతి పరిశుద్ధం. 13 అది యెహోవా కోసం అగ్నిమీద దహించబడిన అర్పణలలో భాగమైయున్నది. ఆ భాగం నీకు నీ కుమారులకు చెందుతుంది అని నీకు నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రబోధిస్తుంది. అయితే పరిశుద్ద స్థలంలోనే మీరు దాన్ని తినాలి.

14 “మరియు నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నైవేద్యంల్లోనుంచి బోరను తినవచ్చును. మీరు వాటిని పవిత్ర స్థలంలో తినాల్సిన అవసరం లేదు గాని పరిశుభ్రమైన స్థలంలో తినాలి. ఎందుచేతనంటే అవి సమాధాన బలిలోనివి. ఆ కానుకలను ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇస్తారు. ఆ జంతువుల్లో కొంత భాగాన్ని ప్రజలు తింటారు కాని బోర మాత్రం మీ వంతు అవుతుంది. 15 నిప్పుమీద దహించబడిన బలిలో భాగంగా ప్రజలు వారు అర్పించే జంతువుల కొవ్వును తీసుకొని రావాలి. సమాధాన బలిలోని తొడను, నైవేద్యంలోని బోరనుకూడా వారు తీసుకుని రావాలి. అది యెహోవా ఎదుట అల్లాడించబడుతుంది. ఆ తర్వాత అది ఆ అర్పణలో మీ భాగం అవుతుంది. బలి అర్పణల్లోని ఆ భాగం యెహోవా ఆజ్ఞాపించినట్టు శాశ్వతంగా మీ వంతు అవుతుంది.”

16 పాప పరిహారార్థబలి మేక కోసం మోషే చూశాడు. అయితే అప్పటికే అది దహించివేయబడింది. అహరోను కుమారుల్లో మిగిలిన వారి మీద (ఎలీయాజరు, ఈతామారు) మోషేకు చాలా కోపం వచ్చింది. 17 మోషే, “ఆ మేకను మీరు పరిశుద్ధ స్థలంలోనే తినాల్సిఉంది. అది చాలా పరిశుద్ధం. దాన్ని యెహోవా ఎదుట మీరెందుకు తినలేదు? ప్రజల దోషాన్ని తీసివేసేందుకు దాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. ఆ మేక బలి ప్రజల పాపాలను తుడిచి వేసేందుకు ఉద్దేశించబడింది. 18 చూడండి, ఆ మేక రక్తాన్ని పవిత్ర స్థలం లోపలకు మీరు తీసుకొని రాలేదు. నేను ఆజ్ఞాపించిన ప్రకారం మీరు దాన్ని పరిశుద్ధ స్థలంలోనే తినాల్సి ఉంది”! అని అన్నాడు.

19 కాని, మోషేతో అహరోను చెప్పాడు: “చూడు, ఈవేళ వారు తమ పాపపరిహారార్థ బలిని, దహన బలి అర్పణను యెహోవా ఎదుటికి తెచ్చారు. అయితే ఈవేళ నాకు ఏమి జరిగిందో నీకు తెలుసు. పాపపరిహారార్థ బలిని ఈ వేళ నేను తింటే యెహోవా ఆనందిస్తాడని నీవు అనుకొంటావా? లేదు!”

20 మోషే ఇది విన్నప్పుడు ఒప్పుకొన్నాడు.

కీర్తనలు. 11-12

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

11 నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు?
    “పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!

వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు.
    వారి బాణాలను వారు గురి చూస్తారు.
    మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది?
    అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?

యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు.
    యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు.
మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు.
    మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశితంగా చూస్తాయి.
యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు.
    కృ-రమైన ఆ మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు.
    ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు.
    మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.

సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.

12 యెహోవా, నన్ను రక్షించుము!
    మంచి మనుష్యులంతా పోయారు.
    భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
    ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
    పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
“మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
    అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.

కాని యెహోవా చెబుతున్నాడు,
    “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
    కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”

యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
    నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
    కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.

యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
    ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
    ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.

సామెతలు 25

సొలొమోను చెప్పిన మరికొన్ని జ్ఞానసూక్తులు

25 ఇవి సొలొమోను చెప్పిన మరికొన్ని జ్ఞానసూక్తులు: యూదా రాజు హిజ్కియా సేవకులు నకలు చేసిన మాటలు ఇవి:

మనం తెలిసికోగూడదని దేవుడు కోరే విషయాలను దాచి పెట్టేందుకు ఆయనకు అధికారం ఉంది. కాని ఒక రాజు విషయమును పరిశోధించుట మూలంగానే ఘనపర్చబడతాడు.

ఆకాశం మనకు పైన చాలా ఎత్తుగాను, భూమి మన క్రింద చాలా లోతువరకును ఉన్నాయి. రాజుల మనస్సులు కూడ అదే విధంగా ఉంటాయి. మనం వాటిని గ్రహించలేం.

వెండి నుండి పనికిమాలిన పదార్థాలను నీవు తీసివేసినట్లయితే అప్పుడు పనివాడు దానితో అందమైన వస్తువులు చేయగలడు. అదే విధంగా ఒక రాజు సమక్షం నుండి దుర్మార్గపు సలహాదారులను నీవు తొలగించి వేస్తే అప్పుడు మంచితనం అతని రాజ్యాన్ని బలమైనదిగా చేస్తుంది.

ఒక రాజు ఎదుట నిన్ను గూర్చి నీవు అతిశయించవద్దు. నీవు చాలా ప్రఖ్యాత వ్యక్తివి అని చెప్పుకోవద్దు. రాజుగారే నిన్ను ఆహ్వానించటం చాలా మంచిది. కాని నిన్ను నీవే ఆహ్వానించుకొంటే అప్పుడు నీవు ఇతరుల ఎదుట ఇబ్బంది పడవచ్చును.

నీవు చూచిన దానిని గూర్చి న్యాయమూర్తికి చెప్పుటకు త్వరపడవద్దు. నీవు చెప్పింది తప్పు అని మరో వ్యక్తి గనుక చెబితే అప్పుడు నీవు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

నీవూ మరో వ్యక్తి ఏకీభవించలేకపోతే ఏమి చేయాలి? అనే విషయం, మీ మధ్యనే నిర్ణయం కావాలి. మరో వ్యక్తి రహస్యాన్ని చెప్పవద్దు. 10 నీవలా చేస్తే నీకు అవమానం కలుగుతుంది. ఆ చెడ్డ పేరు నీకు ఎప్పటికీ పోదు.

11 సమయానికి తగిన రీతిగా పలికిన మంచిమాటలు వెండి పళ్లెంలో ఉంచిన బంగారు పండులా ఉంటవి. 12 జ్ఞానముగల ఒక మనిషి నీకు ఒక హెచ్చరిక ఇస్తే బంగారు ఉంగరాలకంటే లేక మేలిమి బంగారు నగలకంటే అది ఎక్కువ విలువగలది.

13 నమ్మదగిన వార్తాహరుడు అతనిని పంపిన వారికి ఎంతో విలువగలవాడు. అతడు కోతకాలపు ఎండ రోజుల్లో చల్లటి నీళ్లలాంటివాడు.

14 కానుకలు ఇస్తామని వాగ్దానం చేసి, వాటిని ఎన్నడూ ఇవ్వని వారు వర్షం కురిపించని మేఘాలు, గాలిలాంటివారు.

15 సహనంగా మాట్లాడటం ఏ వ్యక్తినేగాని, చివరికి ఒక అధికారి ఆలోచననేగాని మార్చుతుంది. నిదానంగా మాట్లాడటం చాలా శక్తివంతమైనది.

16 తేనె మంచిది. కాని దానిని మరీ ఎక్కువగా తినవద్దు. నీవలా చేస్తే నీకు జబ్బు వస్తుంది. 17 అదే విధంగా నీ పొరుగు వాని ఇంటికి మరీ తరచుగా వెళ్లవద్దు. నీవలా చేస్తే అప్పుడు అతడు నిన్ను అసహ్యించు కోవటం మొదలు పెడతాడు.

18 సత్యం చెప్పని మనిషి ప్రమాదకరమైనవాడు. అతడు ఒక గునపం, లేక ఖడ్గం లేక వాడిగల బాణం లాంటివాడు. 19 కష్టకాలంలో అబద్ధీకుని మీద ఎన్నడూ ఆధారపడవద్దు. ఆ మనిషి నొప్పెడుతున్న పన్నులా లేక కుంటిపాదంలా ఉంటాడు. నీకు అతడు ఎంతో అవసరమైనప్పుడే అతడు నిన్ను బాధపెడతాడు.

20 ధు ఖంలో ఉన్న మనిషి దగ్గర ఆనంద గీతాలు పాడటం అతనికి చలిపెడుతున్నప్పుడు అతని గుడ్డలు తీసివేయటంలా ఉంటుంది. అది సోడా, చిరకా మిళితం చేసినట్టు ఉంటుంది.

21 నీ శత్రువు ఆకలితో ఉన్నప్పుడు తినేందుకు అతనికి భోజనం పెట్టు. నీ శత్రువు దాహంతో ఉంటే తాగేందుకు అతనికి నీళ్లు యివ్వు. 22 నీవు ఇలా చేస్తే నీవు అతనిని సిగ్గుపడేలా చేస్తావు. అది మండుతున్న నిప్పులు అతని తల మీద ఉంచినట్టు ఉంటుంది. మరియు నీ శత్రువుకు నీవు మంచి చేశావు గనుక యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు.

23 ఉత్తరం నుండి వీచే గాలి వర్షాన్ని తెస్తుంది. అదే విధంగా చెప్పుడు మాటలు కోపం రప్పిస్తాయి.

24 వివాదం కోరుకొనే భార్యతో కలిసి ఇంటిలో ఉండటంకంటె, ఇంటికప్పు మీద బ్రతకటం మేలు.

25 దూరస్థలం నుండి వచ్చిన శుభవార్త నీకు వేడిగా, దాహంగా ఉన్నప్పుడు చల్లటి నీళ్లు తాగినట్టు ఉంటుంది.

26 ఒక మంచి మనిషి బలహీనుడై ఒక దుర్మార్గుని వెంబడిస్తే, అది మంచి నీళ్లు బురద నీళ్లు అయినట్టుగా ఉంటుంది.

27 నీవు చాలా ఎక్కువ తేనెను తింటే అది నీకు మంచిది కాదు. అదే విధంగా నీకోసం మరీ ఎక్కువ ఘనత తెచ్చుకోవాలని ప్రయత్నించకు.

28 ఒక మనిషి తనను తాను అదుపులో ఉంచుకోలేకపోతే, అప్పుడు అతడు కూలిపోయిన గోడలుగల పట్టణంలా ఉంటాడు.

1 థెస్సలొనీకయులకు 4

దేవునికి నచ్చిన జీవితం

సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే దేవుని మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తున్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి. యేసు ప్రభువు యిచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదేశాలు మీకు తెలుసు. మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్ఛ. మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి.[a] పవిత్రులు కానివాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు. ఈ విషయంలో ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసినవాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి ముందే చెప్పి వారించాము. దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా ఉండేందుకు కాదు. పవిత్రంగా జీవించేందుకు పిలిచాడు. అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరించినవాడు మానవుణ్ణి కాదు, తన పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణి తృణీకరించినవాడౌతాడు.

సోదర ప్రేమను గురించి మేము వ్రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరస్పరం ప్రేమించుకొనమని దేవుడే మీకు బోధించాడు. 10 నిజానికి మాసిదోనియ ప్రాంతంలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. కాని సోదరులారా! మీరు యింకా ఎక్కువ ప్రేమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

11 మేమిదివరకే చెప్పిన విధంగా శాంతితో జీవించాలని ఆశించండి. మీ స్వహస్తాలతో పని చేస్తూ యితర్ల జోలికి పోకుండా జీవించండి. 12 అలా చేస్తే మీ నిత్య జీవితాన్ని చూసి యితర్లు మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడు మీరు యితర్లపై ఆధారపడనవసరం ఉండదు.

ప్రభువు రాకడ

13 సోదరులారా! చనిపోయినవాళ్ళను గురించి మీకు తెలియాలని మా కోరిక. బ్రతుకుపై ఆశలేని వాళ్ళవలే దుఃఖించరాదని మా కోరిక. 14 యేసు చనిపోయి తిరిగి బ్రతికివచ్చాడని మనం నమ్ముతాము. అందుకే యేసును విశ్వసించినవాళ్ళు మరణించినప్పుడు దేవుడు వాళ్ళను ఆయనతో సహా బ్రతికిస్తాడని కూడా మనం విశ్వసిస్తాము.

15 ప్రభువు వచ్చేవరకు మనం బ్రతికి ఉంటే, యింతకు క్రితము చనిపోయినవాళ్ళకంటే ముందు వెళ్ళము. ఇది ప్రభువు స్వయంగా చెప్పాడు. 16 ప్రభువు పరలోకం నుండి దిగివచ్చినప్పుడు ప్రధాన దూతతో అధికార పూర్వకంగా వస్తాడు. అప్పుడు ప్రధాన దూత శబ్దము, దేవుని బూర శబ్దం వినిపిస్తాయి. అప్పుడు క్రీస్తులో చనిపోయినవాళ్ళు మొదటలేస్తారు. 17 ఆ తర్వాత యింకా బ్రతికి ఉన్న మనల్ని ప్రభువు వాళ్ళతో సహా ఆకాశంలో ఉన్న మేఘాల్లోకి తీసుకువెళ్తాడు. అప్పటినుండి మనం ఆయనతో చిరకాలం ఉండిపోతాము. 18 అందువల్ల వీటిని గురించి మాట్లాడుకొని పరస్పరం ధైర్యం చెప్పుకోండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International