M’Cheyne Bible Reading Plan
దేవుడు యాజకులను అంగీకరించుట
9 ఎనిమిదో రోజున అహరోనును, అతని కుమారులను మోషే పిలిచాడు. ఇశ్రాయేలు పెద్దలను కూడా అతడు పిలిచాడు. 2 అహరోనుతో మోషే ఇలా చెప్పాడు, “ఒక కోడెదూడను, పొట్టేలును తీసుకొని రండి. వాటిలో ఏ దోషం ఉండకూడదు. కోడెదూడను పాపపరిహారార్థబలిగాను, పొట్టేలును దహనబలిగాను యెహోవాకు అర్పించండి. 3 ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి, ‘పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను తీసుకోండి. దహన బలికోసం ఒక కోడెదూడను, ఒక గొర్రెపిల్లను తీసుకోండి. కోడెదూడ, గొర్రెపిల్ల ఒక్క సంవత్సరం వయస్సుగలవి కావాలి. ఆ జంతువుల్లో ఏ దోషమూ ఉండకూడదు. 4 సమాధాన బలుల కోసం ఒక కోడెదూడను, ఒక పొట్టేలును తీసుకోండి. ఆ జంతువులను, నూనెతో కలుపబడ్డ నైవేద్యాన్ని తీసుకొని, వాటిని యెహోవాకు అర్పించండి. ఎందుకంటే ఈవేళ యెహోవా మీకు ప్రత్యక్ష మవుతాడు.’”
5 కనుక ప్రజలంతా సన్నిధి గుడారం దగ్గరకు వచ్చారు. మోషే ఆజ్ఞాపించిన వాటన్నింటినీ వారంతా తీసుకొచ్చారు. ప్రజలంతా యెహోవా ఎదుట నిలబడ్డారు. 6 “యెహోవా ఆజ్ఞప్రకారం మీరు చేసారు కనుక యెహోవా మహిమను మీరు చూస్తారు” అన్నాడు మోషే.
7 అప్పుడు అహరోనుతో మోషే ఈ సంగతులు చెప్పాడు: “వెళ్లి, యెహోవా ఆజ్ఞాపించిన వాటిని జరిగించు. బలిపీఠం దగ్గరకు వెళ్లి, పాపపరిహారార్థ బలులు, దహనబలి అర్పణలు అర్పించు. మీ పాపాలు, ప్రజల పాపాలు తుడిచివేయబడేందుకు వాటిని జరిగించు. ప్రజల బలులను నీవు తీసుకొని, వారి పాపాలను పరిహరించే వాటిని జరిగించు.”
8 కనుక అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్లాడు. పాపపరిహారార్థ బలికోసం కోడె దూడను అతడు వధించాడు. ఈ పాపపరిహారార్థ బలి అతని కోసమే. 9 అప్పుడు అహరోను కుమారులు ఆ రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. అహరోను తన వేలు ఆ రక్తంలో ముంచి, బలిపీఠం కొమ్ములమీద దాన్ని చల్లాడు. తర్వాత అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం అడుగున పోసాడు. 10 పాపపరిహారార్థ బలిలోనుంచి కొవ్వును, మూత్రగ్రంథులను, కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని అహరోను తీసుకొని, బలిపీఠం మీద అతడు వాటిని దహించాడు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లే అతడు అలా చేసాడు. 11 తర్వాత మాంసాన్ని, చర్మాన్ని పాళెము వెలుపల అగ్నితో అహరోను కాల్చివేసాడు.
12 తర్వాత, దహనబలి పశువును అహరోను వధించాడు. అది ముక్కలుగా కోయబడింది. దాని రక్తాన్ని అహరోను కుమారులు అహరోను దగ్గరకు తీసుకొని వచ్చారు. అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాడు. 13 దహనబలి పశువు యొక్క ముక్కలను, దాని తలను అహరోను కుమారులు అహరోనుకు అందించారు. అప్పుడు అహరోను వాటిని బలిపీఠం మీద దహించాడు. 14 దహన బలి పశువు లోపలి భాగాలను, కాళ్లను కూడా అహరోను కడిగాడు. వాటిని బలిపీఠం మీద అతడు కాల్చివేసాడు.
15 తర్వాత ప్రజల అర్పణను అహరోను తీసుకొచ్చాడు. ప్రజల పాప పరిహారార్థ బలిగా మేకను వధించాడు. మొదటిదాని వలెనే అతడు పాప పరిహారార్థంగా ఆ మేకను అర్పించాడు. 16 అహరోను దహనబలి తీసుకొనివచ్చి అర్పించాడు. యెహోవా ఆజ్ఞప్రకారం అహరోను చేసాడు. 17 అహరోను బలిపీఠం దగ్గరకు ధాన్యార్పణను తీసుకువచ్చాడు. అతడు గుప్పెడు ధాన్యార్పణ తీసుకొని, బలిపీఠం మీద ఆనాటి అనుదిన బలిని పక్కగా పెట్టాడు.
18 ప్రజల సమాధాన బలి అర్పణలుగా కోడెదూడను, పొట్టేలును కూడ అహరోను వధించాడు. అహరోను కుమారులు రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. ఈ రక్తాన్ని అహరోను బలిపీఠం చుట్టూ చిలకరించాడు. 19 కోడెదూడ, పొట్టేలు కొవ్వునుకూడ అహరోను కుమారులు అహరోను దగ్గరకు తెచ్చారు. కొవ్విన తోకను లోపలి భాగాలమీది కొవ్వును మూతగ్రంథులను, కాలేయము యొక్క కొవ్విన భాగాన్ని వారు తీసుకొచ్చారు. 20 కొవ్విన ఈ భాగాలను కోడెదూడ, పొట్టేలు బోరలమీద అహరోను కుమారులు ఉంచారు. కొవ్విన ఈ భాగాలను బలిపీఠం మీద అహరోను కాల్చివేసాడు. 21 మోషే ఆజ్ఞాపించిన ప్రకారం నైవేద్యంగా బోరలను, కుడితొడను యెహోవా ఎదుట అహరోను అల్లాడించాడు.
22 అప్పుడు అహరోను ప్రజల వైపుగా తన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడు. అహరోను పాపపరిహారార్థ బలి అర్పణను, దహనబలి అర్పణను, సమాధాన బలి అర్పణ, అర్పించటం ముగించిన తర్వాత అతడు బలిపీఠం నుండి దిగి వచ్చాడు.
23 మోషే, అహరోనులు సన్నిధి గుడారం లోపలకు వెళ్లారు. వారు బయటకు వచ్చి ప్రజలను ఆశీర్వదించారు. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. 24 యెహోవా నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీది దహన బలిని, కొవ్వును దహించి వేసింది. ప్రజలంతా ఇది చూచినప్పుడు ఉత్సాహధ్వనిచేసి సాష్టాంగపడ్డారు.
10 యెహోవా, నీవెందుకు అంత దూరంగా ఉంటావు?
కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు.
2 గర్విష్ఠులు, దుష్టులు వారి దుష్ట పథకాలు వేస్తారు.
మరియు పేద ప్రజలను వారు బాధిస్తారు.
3 దుష్టులు వారికి కావలసిన వాటిని గూర్చి అతిశయపడతారు.
లోభులు యెహోవాను దూషిస్తారు. ఈ విధంగా దుష్టులు యెహోవాను ద్వేషిస్తున్నట్టు వ్యక్తం చేస్తారు.
4 ఆ దుర్మార్గులు చాలా గర్విష్ఠులు కనుక దేవున్ని అనుసరించరు.
వాళ్లు తమ పాపిష్టి పథకాలన్నీ తయారు చేస్తారు. పైగా దేవుడే లేడు అన్నట్టు వారు ప్రవర్తిస్తారు.
5 ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుంటారు.
కనీసం నీ చట్టాలను, వివేకవంతమైన నీ ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు.
దేవుని శత్రువులు ఆయన బోధనలను నిర్లక్ష్యం చేస్తారు.
6 వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుష్యులు తలుస్తారు.
“మాకు ఎన్నడూ కష్ట సమయాలు ఉండవు” అని వారు అంటారు.
7 ఆ మనుష్యులు ఎల్లప్పుడూ దూషిస్తారు. ఇతరుల విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే చెబుతారు.
దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్లప్పుడూ పథకం వేస్తుంటారు.
8 ఆ మనుష్యులు రహస్య స్థలాల్లో దాగుకొని ప్రజలను పట్టుకొనేందుకు కనిపెడతారు.
ప్రజలను బాధించుటకు వారికోసం చూస్తూ దాగుకుంటారు.
నిర్దోషులను వారు చంపుతారు.
9 తినవలసిన జంతువులను పట్టుకోవటానికి ప్రయత్నించే సింహాలవలె వారుంటారు.
ఆ దుర్మార్గులు, పేదల మీద దాడిచేస్తారు. దుష్టులు వేసే ఉచ్చులలో పేదలు చిక్కుకొంటారు.
10 పేదలను, బాధపడేవారిని,
ఆ దుష్టులు మరల, మరల బాధిస్తారు.
11 అందుచేత ఆ పేదలు ఈ సంగతులను ఇలా ఆలోచించటం మొదలు పెడ్తారు: “దేవుడు మమ్ముల్ని మరచిపోయాడు!
దేవుడు మానుండి శాశ్వతంగా విముఖుడయ్యాడు!
మాకు ఏమి జరుగుతుందో దేవుడు చూడటం లేదు!”
12 యెహోవా, లేచి ఏదైనా చేయుము!
దేవా, దుష్టులను శిక్షించుము!
పేదలను మాత్రం మరువకుము!
13 దుష్టులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు?
ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడు అనుకొంటారు గనుక.
14 యెహోవా, దుర్మార్గులు చేసే కృ-రమైన చెడ్డ సంగతులను నీవు నిజంగా చూస్తున్నావు.
నీవు వాటిని చూచి వాటి విషయమై ఏదో ఒకటి చేయుము.
ఎన్నో కష్టాలతో ప్రజలు నీ దగ్గరకు సహాయం కోసం వస్తారు.
యెహోవా, తల్లి దండ్రులు లేని పిల్లలకు సహాయం చేసే వాడివి నీవే. కనుక వారికి సహాయం చేయుము.
15 యెహోవా, దుర్మార్గులను నాశనం చేయుము.
16 యెహోవా నిరంతరం రాజైయున్నాడు.
ఆ ప్రజలు ఆయన దేశంలోనుండి నశించెదరు గాక!
17 యెహోవా, పేదలు కోరుకొనే వాటిని గూర్చి నీవు విన్నావు.
నీవు వారిని ప్రోత్సాహ పరచెదవు. వారి ప్రార్థనలు ఆలకించెదవు.
18 యెహోవా, అనాథ పిల్లలను కాపాడుము. దుఃఖంలో ఉన్న వారిని ఇంకా ఎక్కువ కష్టాలు పడనీయకుము.
దుర్మార్గులు ఇక్కడ ఉండకుండుటకు చాలా భయపడేటట్టుగా చేయుము.
—19—
24 దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు. 2 కీడు చేయాలని వారు వారి హృదయాల్లో పథకం వేస్తారు. వారు మాట్లాడేది అంతా కష్టం కలిగించాలని మాత్రమే.
—20—
3 మంచి గృహాలు జ్ఞానము, వివేకము మీద కట్టబడతాయి. 4 జ్ఞానంవల్ల గదులు అన్నీ ప్రశస్తమైన మరియు సంతోషకరమైన సంపదలతో నింపబడతాయి.
—21—
5 జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి ఒక మనిషికి బలం ఇస్తుంది. 6 నీవు యుద్ధం ప్రారంభించక ముందు జాగ్రత్తగా పథకాలు వేయాలి. నీవు విజయం కావాలి అని అనుకొంటే నీకు మంచి సలహాదారులు చాలా మంది ఉండాలి.
—22—
7 బుద్ధిహీనులు జ్ఞానమును గ్రహించలేరు. మనుష్యులు ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు బుద్దిహీనులు ఏమీ చెప్పలేరు.
—23—
8 నీవు కష్టాలు కలిగించాలని ఎల్లప్పుడూ తలుస్తూంటే, నీవు కష్టాలు పెట్టే మనిషివి అని ప్రజలు తెలుసుకొంటారు. మరియు వారు నీ మాట వినరు. 9 బుద్ధిహీనుడు చేయాలని తలపెట్టే విషయాలు పాపం. ఇతరుల కంటే తానే మంచి వాడిని అనుకోనే మనిషిని ప్రజలు అసహ్యించుకొంటారు.
—24—
10 కష్ట సమయాలలో నీవు బలహీనంగా ఉంటే అప్పుడు నీవు నిజంగా బలహీనుడివే.
—25—
11 మనుష్యులు ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్నిస్తూంటే నీవు వానిని రక్షించుటకు ప్రయత్నించాలి. 12 “ఇది నా పని కాదు” అని నీవు చెప్పకూడదు. యెహోవాకు అంతా తెలుసు. నీవు వాటిని ఎందుకు చేస్తావో ఆయనకు తెలుసు. యెహోవా నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు. నీవు చేసే పనులకు యెహోవా నీకు బహుమానం ఇస్తాడు.
—26—
13 నా కుమారుడా, తేనె తాగు. అది మంచిది. తేనెపట్టులోని తేనె తియ్యగా ఉంటుంది. 14 అదే విధంగా జ్ఞానము నీ ఆత్మకు మంచిది. నీకు జ్ఞానము ఉంటే, అప్పుడు నీకు ఆశ ఉంటుంది. నీ ఆశకు అంతం ఉండదు.
—27—
15 మంచిమనిషి దగ్గర దొంగతనం చేయాలని లేక వాని ఇల్లు తీసివేసుకోవాలని కోరుకొనే దొంగలా ఉండవద్దు. 16 ఒక మంచి వాడు ఏడుసార్లు పడిపోయినా సరే, అతడు ఎల్లప్పుడూ మరల నిలబడతాడు. కాని దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టంచేత ఓడించబడతారు.
—28—
17 నీ శత్రువుకు కష్టాలు వచ్చినప్పుడు సంతోషపడకు. అతడు పడిపోయినప్పుడు సంతోషపడకు. 18 నీవు అలా చేస్తే, అది యెహోవా చూస్తాడు. నీ విషయంలో యెహోవా సంతోషించడు. అప్పుడు యెహోవా ఒకవేళ నీ శత్రువుకు సహాయం చేయవచ్చు.
—29—
19 దుర్మార్గులను చూచి నీవు చింత పడకు. దుర్మార్గుల విషయమై అసూయపడకు. 20 ఆ దుర్మార్గులకు ఆశ లేదు. వారి వెలుగు చీకటి అవుతుంది.
—30—
21 నా కుమారుడా, యెహోవాను మరియు రాజును గౌరవించు. వారికి విరోధంగా ఉండేవారితో చేరవద్దు. 22 ఎందుకంటే, అలాంటి వాళ్లు త్వరగా నాశనం చేయబడవచ్చు. దేవుడు, రాజుకూడ వారి శత్రువులకు ఎంత కష్టం కలిగించగలరో నీకు తెలియదు.
మరిన్ని జ్ఞాన సూక్తులు
23 ఇవి జ్ఞానుల మాటలు:
ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. ఒకడు తనకు తెలిసినవాడైనంత మాత్రాన అతడుఆయన అతనిని బలపరచకూడదు. 24 ఒక నేరస్థుడు స్వేచ్చగా వెళ్లిపోవచ్చని గనుక న్యాయమూర్తి చెబితే, అప్పుడు ప్రజలు అతనికి విరోధంగా ఉంటారు. అతని గూర్చి దేశాలే చెడుగా చెప్పుకుంటాయి. 25 అయితే ఒక న్యాయమూర్తి ఒక నేరస్తుని శిక్షిస్తే, అప్పుడు ప్రజలంతా అతనితో కలిసి ఆనందిస్తారు.
26 నిజాయితీగల జవాబు ప్రజలందరికీ సంతోషం కలిగిస్తుంది అది పెదాలమీద ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది.
27 నీ పొలంలో నాట్లు వేయక ముందు నీ ఇల్లు కట్టుకోవద్దు. నీవు నివసించేందుకు ఒక గృహం కట్టు కొనకముందే, నీవు ఆహారం పండించటానికి సిద్ధంగా ఉన్నట్టు గట్టిగా తెలుసుకో.
28 గట్టి కారణం లేకుండా ఎవరికీ విరోధంగా మాట్లాడవద్దు. మరియు అబద్దాలు మాట్లాడకు,
29 “అతడు నాకు హాని చేశాడు, గనుక నేను అతనికి అలానే చేస్తాను. అతడు నాకు చేసిన వాటిని బట్టి నేను అతణ్ణి శిక్షిస్తాను” అని చెప్పవద్దు.
30 ఒక సోమరివాని పొలం ప్రక్కగానే నేను నడిచాను. జ్ఞానములేని ఒక మనిషి ద్రాక్షాతోట పక్కగా నేను నడిచాను. 31 ఆ పొలాల నిండా కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. నేలమీద పనికిమాలిన మొక్కలు పెరుగుతున్నాయి. పొలాల చుట్టూ గోడ విరిగిపోయి పడిపోతుంది. 32 నేను అది చూచి, దాని గూర్చి ఆలోచించాను. అప్పుడు ఈ విషయాల నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను. 33 కొంచెం నిద్ర, కొంచెం విశ్రాంతి, నీ చేతులు ముడుచుకొని, ఒక నిద్ర తియ్యటం. 34 ఈ విషయాలు నిన్ను త్వరగా దరిద్రుని చేస్తాయి. నీకు ఏమీ ఉండదు. ఒక దొంగ అకస్మాత్తుగా వచ్చి అంతా దోచుకొని పోయినట్టుగా అది ఉంటుంది.
3 మేము మీ దగ్గరకు రావాలని ఎంతో ప్రయత్నించి రాలేకపోయాము. 2 అందుచేత తిమోతిని పంపించి మేము ఏథెన్సులో ఉండిపొయ్యాము. కనుక దేవుని సేవ చేయటంలో మరియు క్రీస్తును గురించి సువార్త ప్రచారం చేయటంలో మాతో కలిసి పనిచేసిన మా సోదరుడు తిమోతిని ప్రోత్సాహ బలం కోసం మీ దగ్గరకు పంపాము. 3 ఈ హింసల కారణంగా మీలో ఎవ్వరూ వెనుకంజ వేయరాదని మా ఉద్దేశ్యము. ఈ హింసలను అనుభవించటం మన విధి అని మీకు బాగా తెలుసు. 4 నిజానికి, మేము మీతో ఉన్నప్పుడే మనము ఈ హింసల్ని అనుభవించవలసి వస్తుందని మీకు చెప్పాము. మేము అన్నట్టుగానే జరిగింది. మీరు గమనించే ఉంటారు. 5 ఆ కారణంగా నేనిక ఓపికతో ఉండలేక మీ విశ్వాసాన్ని గురించి తెలుసుకోవటానికి అతణ్ణి పంపాను. ఏదో ఒక విధంగా సాతాను మిమ్మల్ని శోధిస్తాడని, నా శ్రమ వృధా అయిపోయిందని భయపడ్డాను.
6 కాని తిమోతి మీ దగ్గర నుండి యిప్పుడే వచ్చాడు. మీ విశ్వాసాన్ని గురించి, మీ ప్రేమను గురించి మంచి వార్త తీసుకొని వచ్చాడు. మమ్మల్ని గురించి అన్ని వేళలా మీరు మంచిగా భావిస్తున్నారని తెలిసింది. మేము మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నట్లే, మీరు కూడా మమ్మల్ని చూడటానికి ఆశిస్తున్నారని అతడు మాకు చెప్పాడు. 7 సోదరులారా! మేము దుఃఖంతో ఉన్నప్పుడు, హింసలను అనుభవిస్తున్నప్పుడు మీ విశ్వాసం చూసి ఆనందించాము. 8 మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసాన్ని మీరు విడువకుండా ఉంటే మా జీవితం సార్థకమౌతుంది. 9 మేము దేవుని సమక్షంలో ఉన్నప్పుడు మీ విషయంలో చాలా కృతజ్ఞులము. మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అవి తక్కువే! 10 మిమ్మల్ని చూసే అవకాశం కలగాలని, మీ విశ్వాసం దృఢపడాలని, దానికి కావలసినవి దేవుడు ఇవ్వాలని, రాత్రింబగళ్ళు మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము.
11 మన తండ్రియైన దేవుడు, మన ప్రభువైన యేసు మేము మీ దగ్గరకు రావటానికి మాకు దారి చూపుగాక! 12 మీపై ఉన్న మా ప్రేమ అభివృద్ధి చెందుతున్నట్లే, మీలో పరస్పరం ప్రేమ అభివృద్ధి చెందేటట్లు, యితరుల పట్ల కూడా మీ ప్రేమ అభివృద్ధి చెందేటట్లు ప్రభువు అనుగ్రహించుగాక. 13 మన యేసు ప్రభువు భక్తులతో వచ్చినప్పుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు ఏ అపకీర్తి లేకుండా పవిత్రంగా ఉండేటట్లు దేవుడు మీకు శక్తి ననుగ్రహించు గాక!
© 1997 Bible League International