M’Cheyne Bible Reading Plan
మోషే యాజకుల్ని నియమించుట
8 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 2 “అహరోనును, అతని కుమారులను, వారి వస్త్రాలు, అభిషేకించే తైలాన్ని, పాపపరిహారార్థపు కోడెదూడ, రెండు పొట్టేళ్ళను, ఒక గంపెడు పులియని రొట్టెలను నీతో తీసుకొని, 3 ప్రజలందరినీ సన్నిధి గుడారం యొక్క ద్వారం దగ్గర సమావేశపర్చు.”
4 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేసాడు. ప్రజలు సన్నిధి గుడారం దగ్గర సమావేశం అయ్యారు. 5 అప్పుడు మోషే, “చేయవలసినదానిని యెహోవా సెలవిచ్చాడు.”
6 అప్పుడు అహరోనును, అతని కుమారులను మోషే తీసుకొని వచ్చాడు. అతడు వారికి నీళ్లతో స్నానం చేయించాడు. 7 అప్పుడు అహరోనుకు మోషే చొక్కా తొడిగించాడు. అహరోనుకు నడికట్టును మోషే చుట్టాడు. అంతట ఒక నిలువుపాటి అంగీని మోషే అహరోనుకు తొడిగించాడు. తర్వాత మోషే ఏఫోదును అహరోనుకు ధరింపజేసాడు. నైపుణ్యంగా అల్లిక చేయబడిన నడికట్టును మోషే అహరోను నడుముకు బిగించాడు. ఆ విధంగా ఏఫోదును అహరోనుకు మోషే ధరింపజేసాడు. 8 తర్వాత మోషే, న్యాయతీర్పు పైవస్త్రంలో ఊరీము, తుమ్మీములను ఉంచాడు. 9 అహరోను తలమీద తలపాగాను కూడా మోషే పెట్టాడు. ఈ తలపాగా ముందర భాగంలో బంగారు బద్దను మోషే పెట్టాడు. ఈ బంగారు బద్ద పరిశుద్ధ కిరీటం. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇలా చేసాడు.
10 తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకొని పవిత్ర గుడారాన్నీ, దానిలోని వస్తువులన్నిటినీ ప్రతిష్ఠించాడు. ఈ విధంగా వాటిని మోషే పరిశుద్ధం చేసాడు. 11 ఆ అభిషేక తైలంలో కొంత బలిపీఠం మీద ఏడుసార్లు మోషే చిలకరించాడు. బలిపీఠం, దాని పరికరాలు, పాత్రలు అన్నింటినీ మోషే ప్రతిష్ఠించాడు. గంగాళాన్ని, దాని పీటను కూడా మోషే ప్రతిష్ఠించాడు. ఈవిధంగా మోషే వాటిని పరిశుద్ధం చేశాడు. 12 అప్పుడు అభిషేక తైలంలో కొంత అహరోను తలమీద మోషే పోసాడు, ఈ విధంగా అహరోనును అతడు పరిశుద్ధం చేశాడు. 13 అప్పుడు మోషే అహరోను కుమారులను తీసుకొనివచ్చి, వారికి ప్రత్యేకమైన చొక్కాలను తొడిగించాడు. అతడు వారికి ప్రత్యేకమైన చొక్కాలను తొడిగించాడు. అతడు వారికి దట్టీలు కట్టాడు. తర్వాత వారి తలలమీద పాగాలను అతడు చుట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే మోషే ఇవన్నీ చేసాడు.
14 అప్పుడు పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను మోషే తీసుకొనివచ్చాడు. పాపపరిహారార్థ బలికొరకైన కోడె దూడ తలమీద అహరోను, అతని కుమారులు వారి చేతులు ఉంచారు. 15 అప్పుడు మోషే ఆ కోడె దూడను వధించి, దాని రక్తాన్ని తీసాడు. మోషే కొంచెం రక్తం తీసుకొని, తన వ్రేలితో దానిని బలిపీఠపు కొమ్ములన్నింటి మీద చల్లాడు. ఈ విధంగా బలిపీఠాన్ని బలులకోసం మోషే సిద్ధం చేసాడు, తర్వాత ఆ రక్తాన్ని బలిపీఠపు అడుగున మోషే పోసాడు. ఈ విధంగా ప్రజల పాపాలను పరిహారం చేసే బలుల కోసం బలిపీఠాన్ని మోషే సిద్ధం చేసాడు. 16 ఆ కోడెదూడ లోపలి భాగాలనుండి కొవ్వు అంతటినీ మోషే తీసాడు. కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని, రెండు మూత్ర పిండాలను, వాటిమీద కొవ్వును మోషే తీసి బలిపీఠం మీద వాటిని దహించాడు. 17 అయితే ఆ కోడెదూడ చర్మాని దాన్ని మాంసాన్ని, దాని పేడను వారి బస వెలుపలకు మోషే తీసుకుపోయాడు. నివాసానికి వెలుపల మంట వేసి అందులో వాటిని మోషే కాల్చివేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే అవన్నీ చేసాడు.
18 తర్వాత మోషే దహనబలి పొట్టేలును తీసుకొచ్చాడు. అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు తలమీద వారి చేతులు ఉంచారు. 19 అప్పుడు మోషే ఆ పొట్టేలును వధించి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు. 20 పొట్టేలును మోషే ముక్కలుగా కోసాడు. లోపలి భాగాలను, కాళ్లను, నీళ్ళతో మోషే కడిగాడు. 21 తర్వాత మొత్తం పొట్టేలును బలిపీఠం మీద మోషే దహించాడు. తలను, భాగాలను, కొవ్వును మోషే దహించాడు. అది హోమంగా అర్పించబడిన దహనబలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. యెహోవా ఆజ్ఞాపించినట్లే మోషే వాటిని చేసాడు.
22 అప్పుడు మోషే మరొక పొట్టేలును తీసుకొచ్చాడు. అహరోనును, అతని కుమారులను యాజకులుగా నియమించుటకు ఈ పొట్టేలు ఉపయోగించబడింది. అహరోను, అతని కుమారులు ఆ పోట్టేలు తలమీద వారి చేతులు ఉంచారు. 23 అప్పుడు మోషే ఈ పోట్టేలును వధించాడు. దాని రక్తంలో కొంత అతడు తీసుకొని, అహరోను చెవి కొనమీద, కుడిచేతి బొటన వేలిమీద, అహరోను కుడికాలి బొటనవేలి మీద వేసాడు. 24 తర్వాత అహరోను కమారులను బలిపీఠం దగ్గరకు మోషే తీసుకొని వచ్చాడు. ఆ రక్తంలో కొంత వారి కుడి చెవుల కొనలమీద, కుడి చేతుల బొటనవేళ్ళమీద, వారి కుడి కాళ్ల బొటనవ్రేళ్ల మీద మోషే వేసాడు. తర్వాత బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని మోషే చిలకరించాడు. 25 కొవ్వును, కొవ్విన తోకను, లోపలి భాగాలమీది కొవ్వు అంతటినీ, కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని రెండు మూత్ర పిండాలను, వాటి కొవ్వును, కుడి తొడను మోషే తీసాడు. 26 ఒక గంపెడు పులియని రొట్టెలు ప్రతిరోజూ యెహోవా ముందు ఉంచబడ్డాయి. ఆ రొట్టెల్లో నూనె కలిపి చేయబడ్డ రొట్టె ఒకటి, పులియని రొట్టెల్లోనుంచి ఒక రొట్టెను మోషే తీసుకొని, పొట్టేలు కుడి తొడమీద, కొవ్వుమీద ఆ రొట్టె ముక్కల్ని ఉంచాడు. 27 తర్వాత మోషే వాటన్నింటినీ అహరోను, అతని కుమారుల చేతుల్లో పెట్టాడు. నైవేద్యంగా ఆ ముక్కలను యెహోవా ఎదుట మోషే అల్లాడించాడు. 28 అప్పుడు అహరోను అతని కుమారుల చేతుల్లోనుండి మోషే వాటిని తీసుకొన్నాడు. బలిపీఠం మీద దహనబలిగా వాటిని దహించాడు. కాబట్టి అహరోనును, అతని కుమారులను యాజకులుగా నియమించుటకు అర్పణ అది. అది అగ్నితో అర్పించబడిన అర్పణ. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. 29 దాని బోరను మోషే తీసుకొని, యెహోవా ఎదుట అర్పణగా దానిని అల్లాడించాడు. యాజకులను నియమించుటలో పొట్టేలు యొక్క ఆ భాగం మోషేకు చెందుతుంది. ఇది యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు జరిగింది.
30 బలిపీఠం మీద ఉన్న అభిషేకతైలం కొంత, రక్తం కొంత మోషే తీసుకొన్నాడు. అందులో కొంచెం అహరోను మీద, అతని వస్త్రాల మీద, మరియు అహరోనుతో ఉన్న అతని కుమారుల మీద, వారి వస్త్రాల మీద కొంచెం చల్లాడు. ఈ విధంగా అహరోనును అతని వస్త్రాలను, అతని కుమారులను వారి వస్త్రాలను మోషే పవిత్రం చేసాడు.
31 అప్పుడు అహరోనుతో, అతని కుమారులతో మోషే ఇలా చెప్పాడు: “మీకు నా ఆజ్ఞ జ్ఞాపకం ఉందా? ‘అహరోను, అతని కుమారులు వీటిని తినాలి’ అని నేను చెప్పాను. కనుక నియామక కార్యక్రమంనుండి రొట్టెలు, మాంసం ఉన్న గంప తీసుకోండి. సన్నిధి దగ్గర ఆ మాంసాన్ని ఉడకబెట్టండి. ఆ రొట్టెను ఆ మాంసాన్ని అక్కడే మీరు తినాలి. 32 రొట్టెగాని, మాంసంగాని ఏమైనా మిగిలిపోతే, దాన్ని కాల్చివేయాలి. 33 నియామక క్రమం ఏడు రోజులపాటు ఉంటుంది. మీ అభిషేకం పూర్తి అయ్యేంతవరకు మీరు సన్నిధి గుడారంనుండి బయటకు వెళ్ల కూడదు. 34 ఈ వేళ మనం చేసిన వాటన్నింటినీ చేయుమని యెహోవా ఆజ్ఞాపించాడు. మీ పాపాలను తుడిచివేసేందుకు ఆయన వీటిని ఆజ్ఞాపించాడు. 35 ఏడు రోజుల పాటు రాత్రింబవళ్లు సన్నిధి గుడారం దగ్గరే మీరు నిలిచి ఉండాలి. యెహోవా ఆజ్ఞలకు మీరు విధేయులు కాకాపోతే మీరు చనిపోతారు. ఈ ఆజ్ఞలు నాకు యెహోవా ఇచ్చాడు.”
36 కనుక యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ అహరోను, అతని కుమారులు జరిగించారు.
సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన.
9 పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.
యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
2 నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.
మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
3 నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు.
కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.
4 నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.
యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
5 యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.
యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు.
బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
6 శత్రువు పని అంతం అయిపోయింది.
యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు.
ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.
7 అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
8 భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
9 అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.
10 నీ నామం తెలిసిన ప్రజలు
నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.
11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
మరి యెహోవా వారిని మరచిపోలేదు.
13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”
15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.
కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు.
ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు.
కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.
యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్[a]
17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.
ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.
కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.
19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.
వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము.
20 ప్రజలకు పాఠం నేర్పించు.
వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.
—6—
23 నీవు ఒక ప్రముఖునితో భోజనానికి కూర్చున్నప్పుడు, నీవు ఎవరితో ఉన్నావో జ్ఞాపకం ఉంచుకో. 2 నీకు చాలా ఆకలిగా ఉన్నాసరే, ఎప్పుడూ మరీ ఎక్కువ తినవద్దు. 3 అతడు వడ్డించే శ్రేష్ఠమైం భోజనం మరీ ఎక్కువ తినవద్దు. అది ఒక ఎత్తుగడకావచ్చు.
—7—
4 ధనవంతుడు అవ్వాలనుకొని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీవు బుద్ధిమంతుడవైతే ఓర్పుతో ఉండు. 5 పక్షులు రెక్కలెలా విచ్చుకొని ఎగురుతాయో అదే విధంగా డబ్బు చాలా తొందరగా వెళ్లిపోతుంది.
—8—
6 స్వార్థపరునితో కలిసి భోజనం చేయవద్దు. అతనికి వచ్చిన ప్రత్యేక భోజన పదార్థాలకు దూరంగా ఉండు. 7 అతడు ఎంతసేపూ ఖర్చు గూర్చి ఆలోచించే రకం. “తినుము, త్రాగుము” అని అతడు నీతో చెప్పవచ్చు. కాని అతడు నిజంగా కోరుకునేది అదికాదు. 8 అతని భోజనం నీవు తింటే, నీవు రోగివి కావచ్చు. నీవు యిబ్బంది పడిపోతావు.
—9—
9 తెలివి తక్కువ వానికి నేర్పించేందుకు ప్రయత్నించకు. జ్ఞానముగల నీ మాటలను అతడు ఎగతాళి చేస్తాడు.
—10—
10 ఆస్తి పాత సరిహద్దు గీతను ఎన్నడూ జరపవద్దు. మరియు అనాధలకు చెందిన భూమిని ఎన్నడూ తీసికొనవద్దు. 11 యెహోవా నీకు విరోధంగా ఉంటాడు. యెహోవా శక్తిగలవాడు, అనాధలను ఆయన కాపాడుతాడు.
—11—
12 నీ ఉపదేశకుని మాటలు విని నీకు చేతనైనంత నేర్చుకో.
—12—
13 ఒక బిడ్డకు శిక్ష అవసరమైనప్పుడెల్లా శిక్షించు. వానిని దెబ్బలు కొట్టడం వానికేమీ బాధ కలిగించదు. 14 నీవు వానిని కొట్టినట్లయితే నీవు వాని జీవితం కాపాడవచ్చు.
—13—
15 నా కుమారుడా, నీవు జ్ఞానముగల వాడివైతే నాకెంతో సంతోషం. 16 నీవు సరైన సంగతులు చెబుతూ ఉంటే నేను విని నా హృదయంలో ఎంతో సంతోషిస్తాను.
—14—
17 దుర్మార్గులను చూచి అసూయపడకు. అయితే యెహోవాను గౌరవించేందుకు ఎల్లప్పుడూ నీవల్ల అయినంత గట్టిగా ప్రయత్నించు. 18 ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆ ఆశ ఎన్నటికీ పోదు.
—15—
19 కనుక నా కుమారుడా ఆలకించి, జ్ఞానముగలవానిగా ఉండు. సరైన జీవితం జీవించేందుకు ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండు. 20 ద్రాక్షారసం విపరీతంగా తాగుతూ, విపరీతంగా భోజనం చేసే వారితో స్నేహంగా ఉండవద్దు. 21 విపరీతంగా తాగి, విపరీతంగా తినే మనుష్యులు దరిద్రులు అవుతారు. తిని, తాగి నిద్రపోవటమే వాళ్లు చేసేది అంతాను. కనుక త్వరలోనే వారికి ఏమీ ఉండదు.
—16—
22 నీ తండ్రి నీతో చెప్పే విషయాలు విను. నీ తండ్రి లేకుండా నీవు ఎన్నడూ పుట్టి ఉండేవాడివి కావు. నీ తల్లి వృద్ధురాలైనప్పుడు కూడా ఆమెను గౌరవించు. 23 సత్యము, జ్ఞానము, అభ్యాసము, వివేకము, ఇవి డబ్బు చెల్లించదగినంత విలువగలవి. అవి అమ్మేందుకు మరీ విపరీతమైన విలువగలవి. 24 ఒక మంచి మనిషి యొక్క తండ్రి చాలా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషికి జ్ఞానముగల బిడ్డ ఉంటే, ఆ బిడ్డ ఆనందం కలిగిస్తుంది. 25 అందుచేత నీ విషయంలో నీ తల్లిదండ్రులను సంతోషించనివ్వు. నీ తల్లిని ఆనందించనిమ్ము.
—17—
26 నా కుమారుడా, నేను చెప్పే దానిని జాగ్రత్తగా వినుము. నా జీవితం నీకు ఒక ఉదాహరణగా ఉంచుకో. 27 వేశ్యలు, చెడు స్త్రీలు ఒక ఉచ్చులాంటివారు. నీవు బయట పడలేనంత లోతైన బావిలాంటివారు. 28 ఒక చెడు స్త్రీ, ఒక దొంగలా నీ కోసం పొంచి ఉంటుంది. అనేక మందిని పాపులు అయ్యేటట్టుగా ఆమె చేస్తుంది.
—18—
29-30 ద్రాక్షారసం, ఘాటు పానీయాలు విపరీతంగా తాగే మనుష్యులకు అవి చాలా చెడు చేస్తాయి. ఆ మనుష్యులకు చాలా కొట్లాటలు, వివాదాలు ఉంటాయి. వారి కళ్లు ఎర్రగా ఉండి వారు తూలిపోతూ, వాళ్లను వాళ్లే బాధ పెట్టుకుంటారు. వారు ఈ కష్టాలను తప్పించుకొని ఉండగలిగేవారే.
31 అందుచేత ద్రాక్షారసం విషయం జాగ్రత్తగా ఉండు. అది అందంగా, ఎర్రగా ఉంటుంది. పాత్రలో అది మెరుస్తుంది. నీవు దానిని తాగినప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది. 32 కాని అంతలో అది ఒక సర్పంలా కాటువేస్తుంది.
33 ద్రాక్షారసం నీవు వింత విషయాలను చూచేటట్టుగా చేస్తుంది. నీ మనస్సు గందరగోళం అవుతుంది. 34 నీవు పండుకొన్నప్పుడు నీవు ఉప్పొంగుతున్న సముద్రంమీద ఉన్నట్టుగా నీవు అనుకొంటావు. నీవు ఒక ఓడమీద పండుకొన్నట్టుగా నీకు అనిపిస్తుంది. 35 “వారు నన్ను కొట్టారు. కాని నాకేమీ అనిపించలేదు. వారు నన్ను కొట్టారు. కాని అది నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు నేను లేవలేను. నేను మరోసారి తాగాలి” అని నీవు చెబుతావు.
థెస్సలొనీకలో పౌలు సేవ
2 సోదరులారా! మేము మీ దగ్గరకు రావటంవల్ల లాభం కలుగకపోలేదు. ఇది మీకు తెలుసు. 2 మేము యిదివరలో కష్టాలు అనుభవించిన విషయము, ఫిలిప్పీలో అవమానాలు భరించిన విషయము మీకు తెలుసు. మాకు అనేక ఆటంకాలు కలిగినా మేము మా దేవుని సహాయంతో యేసు సువార్తను మీకు బోధించటానికి ధైర్యం చేసాము. 3 మేము తప్పుగా బోధించలేదు. లేక దురుద్దేశ్యాలతో బోధించలేదు. మేము మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయటంలేదు. 4 దేవుడు మా యోగ్యతను గమనించి మాకు సువార్తను అప్పగించాడు. మా హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నాము కాని, మానవుల్ని కాదు.
5 మేము పొగడ్తలు ఉపయోగించలేదని మీకు తెలుసు. స్వార్థానికోసం మేము దొంగవేషాలు వేయలేదు. దీనికి దేవుడే సాక్షి. 6 మీ పొగడ్తలు కాని, లేక ఇతర్ల పొగడ్తలు కాని మాకు అవసరం లేదు.
7 క్రీస్తు అపొస్తలులముగా మేము మా భారం మీపై మోపగల్గినా అలా చేయలేదు. తల్లి తన పిల్లల్ని చూసుకొన్నట్టు మిమ్మల్ని చూసుకొని మీ పట్ల దయతో ఉండినాము.[a] 8 మేము మిమ్మల్ని మనసారా ప్రేమించాము. తద్వారా మీరు మాకు సన్నిహితులయ్యారు. దానితో సువార్తే కాకుండా, మా జీవితాలను కూడా మీతో పంచుకొన్నాము. 9 సోదరులారా! మా శ్రమ, కష్టము మీకు తప్పక జ్ఞాపకం ఉండి ఉండవచ్చును. మేము దేవుని సువార్తను మీకు ప్రకటించినప్పుడు మేము మీకు భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు పని చేసాము.
10 విశ్వాసులైన మీ మధ్య మేము ఎంతో పవిత్రంగా, నీతిగా, అపకీర్తి లేకుండా జీవించాము. దీనికి మీరే సాక్షులు. దేవుడు కూడా దీనికి సాక్షి. 11 మేము మీ అందరితో, తండ్రి తన పిల్లలతో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నాము. 12 మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తూ, మిమ్మల్ని ఓదారుస్తూ, తన రాజ్యంలోకి ఆహ్వానించి, తన మహిమలో మీకు భాగం యిచ్చే దేవుని మెప్పు పొందేటట్లు మిమ్మల్ని జీవించమని చెప్పాము.
13 దైవసందేశాన్ని మీరు మా నుండి విని, దాన్ని మానవుల సందేశంలా కాకుండా, దైవసందేశంలా అంగీకరించారు. ఇలా జరిగినందుకు మేము దేవునికి సర్వదా కృతజ్ఞులము. అది నిజంగా దైవసందేశము. అది భక్తులైన మీలో పని చేస్తోంది. 14 సోదరులారా! యేసు క్రీస్తులో ఐక్యత పొందిన యూదయలోని దేవుని సంఘాలవలే మీరు కూడా కష్టాలు అనుభవించారు. యూదుల వల్ల ఆ సంఘాలు అనుభవించిన కష్టాలే మీరు మీ ప్రజలవల్ల అనుభవించారు. 15 ఆ యూదులు యేసు ప్రభువును, ప్రవక్తలను చంపారు. మిమ్మల్ని తరిమివేసారు. వాళ్ళు దేవుణ్ణి దుఃఖపెట్టారు. మానవులందరికి శత్రువులై జీవించారు. 16 రక్షణ కలిగించే సందేశాన్ని యూదులు కానివాళ్ళకు చెప్పనీయకుండా మమ్మల్ని అడ్డగించారు. ఈ విధంగా చేసి తమ పాపాలను అంతులేకుండా పెంచుకొంటూ పోయారు. చివరకు దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చింది.
థెస్సలొనీకయులను మళ్ళీ చూడాలని పౌలు వాంఛించటం
17 సోదరులారా! కొద్దికాలం మేము మీ నుండి దూరంగా ఉండవలసి వచ్చింది. మా శరీరాలు మాత్రమే మీ నుండి దూరంగా ఉన్నాయి. కాని మా మనసులు కాదు. మిమ్మల్ని చూడాలని మా మనస్సుల్లో చాలా ఉంది. కనుక మేము ఎన్నో విధాల ప్రయత్నించాము. 18 మాకు మీ దగ్గరకు రావాలని ఉంది. పౌలునైన నేను ఎన్నోసార్లు రావటానికి ప్రయత్నం చేసాను. కాని సాతాను మమ్మల్ని అడ్డగించాడు. 19 ఎందుకంటే మా ఆశలు మీ మీద పెట్టుకున్నాము. మా ఆనందం మీరే. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో గర్వించటానికి కిరీటం మీరే కదా! 20 మాకు కీర్తి లభించటానికి నిజంగా మీరే కారణం. మీరే మా ఆనందం.
© 1997 Bible League International