Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 2-3

ధాన్యార్పణలు

“ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ పెట్టేటప్పుడు అది శ్రేష్ఠమైన పిండిగా ఉండాలి. ఆ వ్యక్తి ఆ పిండిమీద నూనెపోసి, సాంబ్రాణి వేయాలి. అప్పుడు దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు అతడు తీసుకొని రావాలి. సాంబ్రాణిని, నూనె కలిపిన పిండిలో ఒక గుప్పెడు ఆ వ్యక్తి తీసుకోవాలి. అప్పుడు యాజకుడు బలిపీఠపు అగ్నితో ఆ పిండిని జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. మిగిలిపోయిన ధాన్యార్పణ అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమములు అన్నింటిలో ఇది అతి పవిత్రం.

కాల్చిన ధాన్యార్పణలు

“పొయ్యిమీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు పెట్టేటప్పుడు అది నూనె కలిపిన శ్రేష్ఠమైన పిండితో చేయబడ్డ పొంగని రొట్టెలు, లేక నూనె రాయబడ్డ పొంగని అప్పడాలు కావాలి. పెనం మీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు తెస్తే అది నూనెతో కలిపిన పొంగని మంచి పిండి కావాలి. దానిని నీవు ముక్కలు చేసి, దాని మీద నూనెపోయాలి. అది ధాన్యార్పణ. నీవు వంట గిన్నెలో వండిన ధాన్యార్పణ తెస్తే అది నూనెతో కలుపబడిన మంచి పిండికావాలి.

“ఈ పదార్థాలతో చేయబడిన ధాన్యార్పణను నీవు యెహోవాకు తీసుకొని రావాలి. నీవు వాటిని యాజకుని దగ్గరకు తీసుకొనివెళ్లాలి, అతడు వాటిని బలిపీఠం మీద ఉంచుతాడు. ఇది జ్ఞాపకార్థమైన అర్పణ. అది బలిపీఠం మీద దహించబడాలి. అగ్నిమీద అది దహించ బడుతుంది. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన. 10 మిగిలిపోయిన ధాన్యార్పణలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమాలలో ఇది అతి పవిత్రం.

11 “పులిసిన పదార్థం ఉన్న ధాన్యార్పణ ఏదీ మీరు యెహోవాకు తీసుకొని రాకూడదు. పులిసిన పదార్థంగాని, తేనెగాని యెహోవాకు అర్పణగా అగ్నిమీద దహించకూడదు. 12 మొదటి పంటలో నుండి పులిసిన పదార్థాన్ని, తేనెను యెహోవాకు అర్పణగా మీరు తీసుకొని రావచ్చును. కానీ బలిపీఠం మీద ఇష్టమైన సువాసనగా ఉండేందుకు పులిసిన పదార్థం, తేనె దహించబడకూడదు. 13 నీవు తీసుకొని వచ్చే ప్రతి ధాన్యార్పణలో ఉప్పు తప్పక వేయాలి. నీవు అర్పించు ధాన్యార్పణలో ఉప్పు వేయవలెను.

మొదటి పంటనుండి ధాన్యార్పణలు

14 “మొదటి పంటలో నుండి నీవు యెహోవాకు ధాన్యార్పణ అర్పిస్తే, వాటిని పేల్చి తీసుకురావాలి. కొత్త ధాన్యం నుండి వాటిని ఒలిచి తీసుకొని రావాలి. ఇది మొదటి పంటలోనుండి నీ కొరకైన ధాన్యార్పణ అవుతుంది. 15 దానిమీద నూనెను, సాంబ్రాణిని నీవు వేయాలి. అది ధాన్యార్పణ అవుతుంది. 16 ఒలిచిన ధాన్యాన్ని, నూనెలోనుండి కొంతభాగాన్ని, సాంబ్రాణి మొత్తాన్ని జ్ఞాపకార్థ అర్పణగా యాజకుడు దహించాలి. ఇది యెహోవాకు హోమమైయుండును.

సహవాస బలులు

“ఒక వేళ ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ సమాధాన బలి అయితే, మగ లేక ఆడ జంతువును తన పశువుల మందలోనుండి అతడు యెహోవాకు ఇస్తే ఆ పశువులో ఎలాంటి దోషం ఉండకూడదు. ఆ వ్యక్తి ఆ పశువు తలమీద తన చేతులు ఉంచాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ పశువును అతడు వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. ఈ వ్యక్తి సమాధాన బలిలోనుంచి యెహోవాకు హోమం చేయాలి. ఆంత్రములకు, లోపలి అవయవాలకు ఉండే కొవ్వు అంతటినీ అతడు అర్పించాలి. మూత్రపిండాలను ఆ రెండింటి మీద కొవ్వును, నడుం దగ్గర కొవ్వును అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జమును కప్పి ఉండే కొవ్వును అతడు తీయాలి. అప్పుడు ఆ కొవ్వును అహరోను కుమారులు బలిపీఠం మీద దహించాలి. దీనిని వారు అగ్నిలో కట్టెలమీద ఉన్న దహనబలి వేస్తారు. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనను యిచ్చే హోమం.

“ఒకవేళ ఆ వ్యక్తి, యెహోవాకు సమాధాన అర్పణగా ఒక జంతువును మందలోనుండి తెస్తే, అది ఆడదిగాని, మగదిగాని దోషం లేనిదిగా ఉండాలి. అతడు ఒక గొర్రెపిల్లను తన అర్పణగా తెస్తే, అతడు దానిని యెహోవా ఎదుటికి తేవాలి. సన్నిధి గుడారం ఎదుట అతడు దాని తలమీద చేయి పెట్టి, దానిని వధించాలి. దాని రక్తాన్ని అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ చిలకరిస్తారు. అప్పుడు అతడు సమాధాన బలిలో నుంచి కొంత యెహోవాకు హోమం చేయాలి. కొవ్వు, కొవ్విన తోకమొత్తం, దాని లోపలి అవయవాల మీద చుట్టూ ఉండే కొవ్వు అతడు తీసుకొని రావాలి. వెన్నుపూస నుండి ఉండే తోకను అతడు కోసి వేయాలి. 10 రెండు మూత్రపిండాలను, వాటిని కప్పి ఉండే కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు అర్పించాలి. కార్జానికి ఉండే కొవ్వుకూడా అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి. 11 అప్పుడు యాజకుడు ఆ జంతువును బలిపీఠం మీద దహిస్తాడు. అది యెహోవాకు ప్రజలు అగ్నితో అర్పించిన ఆహారం అవుతుంది.

12 “ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ మేక అయితే, అతడు దానిని యెహోవా ఎదుట అర్పించాలి. 13 సన్నిధి గుడార ద్వారం దగ్గర అతడు దాని తల మీద చేయి పెట్టి దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు ఆ మేక రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. 14 తర్వాత ఆ మేకలోని కొంతభాగాన్ని అతడు యెహోవాకు హోమం చేయాలి. లోపలి భాగాల్లోను, వాటి మీదను ఉండే కొవ్వును అతడు అర్పించాలి. 15 రెండు మూత్రగ్రంథుల్ని, వాటి మీద ఉండే కొవ్వును, ఆ మేక నడుం దగ్గర కొవ్వును అతడు అర్పణ చేయాలి. కార్జాన్ని కప్పి ఉండే కొవ్వును అతడు అర్పణ చేయాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి. 16 మేక అవయవాలను యాజకుడు దహనం చేయాలి. అది అగ్నితో అర్పించబడ్డ ఆహారం అవుతుంది. అది ఇష్టమైన సువాసనగా ఉంటుంది. కొవ్వు మొత్తం యెహోవాకు చెందుతుంది. 17 మీ తరాలన్నింటికి శాశ్వతంగా ఈ నియమం కొనసాగుతుంది. మీరు ఎక్కడ నివసించినా కొవ్వునుగాని రక్తాన్నిగాని మీరు తినకూడదు.”

యోహాను 21

యేసు మళ్ళీ కనిపించటం

21 ఆ తర్వాత తిబెరియ సముద్రం దగ్గర యేసు మళ్ళీ కనిపించాడు. అది ఈ విధంగా జరిగింది: సీమోను పేతురు, దిదుమ అని పిలువబడే తోమా, గలిలయలోని కానా పట్టణానికి చెందిన “నతనయేలు”, జెబెదయి కుమారులు, మరొక యిద్దరు శిష్యులు, అంతా కలిసి ఒక చోట ఉన్నారు. సీమోను పేతురు, “నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను” అని అన్నాడు.

మిగతా వాళ్ళు, “మేము కూడా వస్తున్నాము” అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కాని ఆ రాత్రి వాళ్ళకు చేపలు దొరక లేదు.

తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిలుచొని ఉన్నాడు. కాని శిష్యులు ఆయనే “యేసు” అని గ్రహించలేదు. యేసు, “మిత్రులారా! చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు.

“లేదు” అని వాళ్ళన్నారు.

ఆయన, “పడవ కుడి వైపు మీ వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని అన్నాడు. వాళ్ళు ఆయన చెప్పిన విధంగా వల వేసారు. చేపలు ఎక్కువగా వలలో పడటంవల్ల వాళ్లు ఆ వల లాగలేక పొయ్యారు.

యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “అదిగో చూడు ప్రభువు” అని అన్నాడు. సీమోను పేతురు, “అదిగో ప్రభువు!” అని అతడు అనటం విన్న వెంటనే, యిది వరకు తీసివేసిన తన పై వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని నీళ్ళలోకి దూకాడు. మిగతా శష్యులు ఒడ్డుకు వంద గజాల దూరంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు చేపలతో నిండిన వలను లాగుతూ పడవను నడుపుకుంటూ అతణ్ణి అనుసరిస్తూ ఒడ్డును చేరుకున్నారు. వాళ్ళు పడవ దిగాక కాలుతున్న బొగ్గల మీద చేపలు ఉండటం చూసారు. కొన్ని రొట్టెలు కూడా అక్కడ ఉన్నాయి. 10 యేసు వాళ్ళతో “మీరు పట్టిన కొన్ని చేపలు తీసుకురండీ” అని అన్నాడు.

11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలనిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మొత్తం నూట ఏబది మూడు చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల చినుగలేదు! 12 యేసు వాళ్ళతో, “రండి! వచ్చి భోజనం చెయ్యండి” అని అన్నాడు. “మీరెవరు” అని అడగటానికి శిష్యుల కెవ్వరికీ ధైర్యం చాలలేదు. 13 యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, రొట్టెను తీసుకొని వాళ్ళకిచ్చాడు. అదే విధంగా చేపల్ని కూడా యచ్చాడు.

14 ఆయన బ్రతికింపబడ్డాక తన శిష్యులకు కనిపించడం యిది మూడవసారి.

యేసు మరియు పేతురు

15 వాళ్ళు భోజనం చెయ్యటం ముగించాక యేసు, సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ! వీళ్ళకన్నా నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు.

“ఔను ప్రభూ! ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు.

యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు!” అని అన్నాడు.

16 యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ! నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?” అని మళ్ళీ అడిగాడు.

అతడు, “ఔను ప్రభూ! నేను ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు.

యేసు, “నా గొఱ్ఱెల్ని జాగ్రత్తగా చూసుకో!” అని అన్నాడు.

17 మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ! నన్ను ప్రేమిస్తున్నావా?” అని అన్నాడు.

మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా” అని అడిగినందుకు పేతురు మనస్సు చివుక్కుమన్నది. అతడు, “ప్రభూ! మీకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కూడా తెలుసు” అని అన్నాడు.

యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు! 18 ఇది నిజం. వయస్సులో ఉన్నప్పుడు నీ దుస్తులు నీవు వేసుకొని నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళే వాడవు. కాని వయస్సు మళ్ళిన తర్వాత నీవు చేతులు చాపితే మరొకళ్ళు నీకు దుస్తులు తొడిగించి నీకు యిష్టం లేదన్న చోటికి తీసుకు వెళ్తారు” అని అన్నాడు. 19 పేతురు ఎలాంటి మరణం పొంది దేవునికి మహిమ తెస్తాడో సూచించటానికి యేసు ఇలా అన్నాడు. ఆ తర్వాత అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు.

20 పేతురు వెనక్కు తిరిగి చూసాడు. యేసు ప్రేమించిన శిష్యుడు వెంట రావటం గమనించాడు. రాత్రి భోజనాలప్పుడు యేసుకు ఆనుకొని, “ప్రభూ! మీకు ఎవరు ద్రోహం చేస్తారు!” అని ప్రశ్నించిన వాడు యితడే. 21 పేతురు అతణ్ణి చూసి యేసుతో, “ప్రభూ! అతని సంగతి ఏమిటి?” అని అడిగాడు.

22 యేసు సమాధానంగా, “నేను తిరిగి వచ్చే వరకు అతడు బ్రతికి ఉండాలని నాకిష్టమైతే! ఆ సంగతి నీ కెందుకు. నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.

23 యేసు ఈ విధంగా అనటంవల్ల ఈ శిష్యుడు చనిపోడనే వదంతి సోదరుల్లో వ్యాపించింది. కాని యేసు అతడు చనిపోడని అనలేదు. అతడు, “నేను తిరిగి వచ్చేవరకు అతడు బ్రతికి ఉండాలని నా ఉద్దేశ్యమైతే ఆ సంగతి నీకెందుకు?” అని అన్నాడు, అంతే.

24 వీటిని గురించి సాక్ష్యం చెప్పిన వాడు, వ్రాసిన వాడు ఈ శిష్యుడే. అతని సాక్ష్యం నిజమైనదని మనకు తెలుసు.

25 యేసు యింకా ఎన్నో కార్యాలు చేసాడు. వాటన్నిటిని గురించి వ్రాస్తే ఈ గ్రంథాలకు ఈ ప్రపంచంలో ఉన్న స్థలమంతా కూడా సరిపోదని నేననుకుంటాను.

సామెతలు 18

18 ఇతరులు అంటే గిట్టనివాడు తాను చేసే వాటిలో స్వార్థపరుడుగా ఉంటాడు. ప్రజలు మంచి సలహాను ఇచ్చినప్పుడు అతడు కోపగించుకుంటాడు.

బుద్ధిహీనుడు గ్రహించటానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి ఎంతసేపూ తన స్వంత ఆలోచనలే చెప్పాలనుకొంటాడు.

ఎక్కడ పాపం ఉంటుందో, అక్కడ అవమానం ఉంటుంది. ఎక్కడ అవమానం, ఉంటుందో అక్కడ ఘనత ఉండదు.

ఒక వ్యక్తి చెప్పే విషయాలు జ్ఞానముగలవిగా ఉండవచ్చు. ఆ మాటలు లోతైన మహా సముద్రంలా లేక ప్రవహిస్తున్న ఏరులా ఉండవచ్చును.

ఒకడు నేరస్థుడైతే వానికి సహాయం చేయవద్దు. అతడు తప్పు ఏమీ చేయకపోతే అతని యెడల న్యాయంగా ఉండు.

బుద్ధిహీనుడు తాను చేప్పే మాటలవల్ల తనకు తానే కష్టం కలిగించుకొంటాడు. అతని మాటల వలన వివాదం మొదలు కావచ్చును.

బుద్ధిహీనుడు మాట్లాడినప్పుడు అతడు తనను తానే నాశనం చేసుకొంటాడు. అతని స్వంత మాటలే అతన్ని పట్టేస్తాయి.

మనుష్యులకు ఎంతసేపూ ముచ్చట్లు వినటం ఇష్టం. ఆ ముచ్చట్లు పొట్టలోనికి పోతున్న మంచి భోజనంలా ఉంటాయి.

బద్దకస్థుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు.

10 యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గంలాంటిది. మంచివాళ్లు ఆ దుర్గం దగ్గరకు పరుగెత్తి వెళ్లి, క్షేమంగా ఉంటారు.

11 ధనికులు వారి ఐశ్వర్యం వారిని కాపాడుతుంది అనుకొంటారు. అది ఒక బలమైన కోటలా ఉంది అని వారు తలుస్తారు.

12 ఒక దీనుడు గౌరవించబడతాడు. కాని గర్విష్ఠుడు పతనం అవుతాడు.

13 ఒకడు పూర్తిగా వినక ముందే జవాబిస్తే అతడు ఇబ్బంది పడిపోయి, తాను తెలివితక్కువ వాడిని అని చూపించుకొంటాడు.

14 ఒక మనిషి వ్యాధితో ఉన్నప్పుడు అతని మనస్సు అతణ్ణి బ్రతికించి ఉంచగలదు. కాని ఆ మనిషి అంతా పోయింది అనుకొంటే అప్పుడు ఆశ అంతా వదలుకొన్నట్టే!

15 జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటాడు. మరింత జ్ఞానము కోసం అతడు జాగ్రత్తగా వింటాడు.

16 ఒక ప్రముఖ వ్యక్తిని నీవు కలుసుకోవాలి అని అంటే అతనికి ఒక కానుక ఇవ్వాలి. అప్పుడు నీవు అతనిని తేలికగా కలుసుకోగలవు.

17 ఇంకో మనిషి వచ్చి ప్రశ్నించే అంత వరకు మొదలు మాట్లాడిన వానిది సరిగ్గా ఉన్నట్టే కనిపిస్తుంది.

18 ఇద్దరు శక్తిగల మనుష్యులు వాదిస్తోంటే వారి వాదాన్ని తీర్మానించటానికి చీట్లు వేయటమే శ్రేష్ఠమైన పద్ధతి.

19 నీ స్నేహితునికి నీవు సహాయం చేస్తే అతడు ఒక బలమైన పట్టణపు గోడలా నిన్ను కాపాడుతాడు. వివాదాలు కోట గుమ్మాల అడ్డగడియవలె ప్రజలను వేరుపరుస్తాయి.

20 నీవు చెప్పే విషయాలు నీ జీవితం మీద ఏదో విధంగా పనిచేస్తాయి. తన నోటి ఫలముచేత ఒక మనిషి నింపబడుతాడు.

21 జీవం, మరణం, తెచ్చే మాటలు నాలుక మాట్లాడగలదు. ప్రజలు మాట్లాడటం ఇష్టపడేవారు. అది ఏమి తెచ్చునో దాన్ని తీసుకొనుటకు సిద్దముగా ఉండ వలయును.

22 నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొందినట్టే. నీ విషయమై యెహోవాకు సంతోషం.

23 పేదవాడు సహాయము కొరకు అడుక్కుంటాడు. కాని ధనికుడు కఠినముగా సమాధానము చెప్పుతాడు.

24 ఒక మనిషికి స్నేహితులు చాలా మంది ఉంటే అది అతనిని పాడు చేయవచ్చును. కాని ఒక సోదరుని కంటే ఒక మంచి స్నేహితుడు మేలు.

కొలొస్సయులకు 1

దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు ప్రభువుయొక్క అపొస్తలుడైన పౌలు నుండి, మరియు మన సోదరుడైన తిమోతి నుండి,

విశ్వాసంతో పరిశుద్ధతలో సోదరులుగా క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న కొలొస్సయి పట్టణంలోని పవిత్రులకు, మన తండ్రియైన దేవుడు మీకు శాంతిని, కృపను ప్రసాదించుగాక!

మేము మీ గురించి విన్నందుకు మన యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి సర్వదా కృతజ్ఞులము. మేము మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. క్రీస్తు పట్ల మీకున్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసుల పట్ల మీకున్న ప్రేమను గురించి మేము విన్నాము. నిజమైన సందేశాన్ని, అంటే సువార్తను మొదటినుండి మీరు విన్నారు. అది రక్షణ కలుగజేస్తుందన్న ఆశ మీలో కలిగింది. మీ విశ్వాసము, ప్రేమ, మీ ఆశపై ఆధారపడి ఉంటాయి. దేవుడు మీ నిరీక్షణను మీకోసం పరలోకంలో భద్రంగా దాచి ఉంచాడు. దైవసందేశాన్ని విని, దేవుని అనుగ్రహాన్ని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకొన్న నాటినుండి మీరు ఫలం పొందారు. అదే విధంగా యిప్పుడు కూడా దేవుడు తన ఆశీస్సులు అందరికీ ప్రసాదిస్తాడు. సువార్త ప్రపంచమంతా వ్యాపిస్తోంది. మీరీ సువార్త “ఎపఫ్రా” ద్వారా విన్నారు. అతడు మాకు ప్రియమైనవాడు. మాతో కలిసి మా పక్షాన విశ్వాసంతో క్రీస్తు సేవ చేస్తున్నవాడు. మీకు పరిశుద్ధాత్మ యిచ్చిన ప్రేమను గురించి అతడు మాకు చెప్పాడు.

ఆత్మీయ జ్ఞానము, తనను గురించిన జ్ఞానము, మీకు ప్రసాదించమని మిమ్మల్ని గురించి విన్ననాటి నుండి విడువకుండా మీకోసం దేవుణ్ణి ప్రార్థించాము:

మీకు “దైవేచ్ఛ” ను తెలుసుకొనే జ్ఞానం కలగాలని మా అభిలాష. 10 మీరు ప్రభువు యిచ్ఛానుసారం జీవించాలనీ, అన్ని వేళలా ఆయనకు ఆనందం కలిగించే వాటిని మాత్రమే చేయాలనీ మా అభిలాష. సత్కార్యాలు చేసి ఫలం చూపించండి. దేవుణ్ణి గురించి మీకున్న జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోండి. 11 సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మీకు శక్తినిచ్చు గాక! అప్పుడు అన్నిటినీ సంతోషంతో భరించగల సహనము మీలో కలుగుతుంది.

12 దేవుడు తన వెలుగు రాజ్యంలో, అంటే తన విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ఉంచిన దానిలో మీకు భాగం లభించేటట్లు చేసాడు. దానికి మీరు తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండండి. 13 మనల్ని చీకటి రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని రాజ్యంలోకి రప్పించాడు. 14 కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా దేవుడు మనల్ని క్షమించాడు.

క్రీస్తు యొక్క గొప్పతనము

15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన
    అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు
    పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు.
    పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని,
    సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు.
అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.

17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు.
    ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు.
    ఆయనే అన్నిటికీ మూలం.
    చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.

19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
20     దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని,
    కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు.
తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.

21 మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు. 22 కాని ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం.

23 మీరు విన్న సువార్త వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. దాన్ని పోగొట్టుకోకుండా, దృఢంగా, స్థిరంగా ఆయన్ని విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింపబడింది. నేను ఈ సందేశానికి సేవకుణ్ణి అయ్యాను.

సంఘం కోసం పౌలు పడిన శ్రమ

24 మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందుకు యిప్పుడు నాకు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే క్రీస్తు సంఘం అనబడే తన శరీరం ద్వారా అనుభవించవలసిన కష్టాలు నా దేహం అనుభవించి పూర్తి చేస్తోంది. 25 తన సందేశాన్ని మీకు సంపూర్ణంగా ఉపదేశించమని దేవుడు నన్ను నియమించాడు. తత్కారణంగా నేను క్రీస్తు సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. 26 యుగయుగాలనుండి, తరతరాలనుండి రహస్యంగా దాచబడిన ఈ దైవసందేశం ప్రస్తుతం భక్తులకు చెప్పబడింది. 27 భక్తులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని తెలియచేసి, యూదులు కానివాళ్ళకు చూపాలని ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే” ఆ రహస్యం. ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ మనలో ఉంది. 28 ఆయన్ని గురించి మేము ప్రకటిస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందినవాళ్ళలా నిలబెట్టాలని మా ఉద్దేశ్యము. 29 దీన్ని సాధించటానికి నేను నా శక్తినంతా ఉపయోగించి కష్టపడి పని చేస్తున్నాను. నాలో ఉన్న ఈ బలవత్తరమైన శక్తి క్రీస్తు నాలో ఉండి పని చేయటం వల్ల కలుగుతోంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International