M’Cheyne Bible Reading Plan
దహన బలులకు పీఠం
38 తర్వాత బెసలేలు బలిపీఠం కట్టాడు. ఇది దహన బలులను దహించటానికి ఉపయోగించిన బలిపీఠం. తుమ్మ కర్రతో అతడు బలిపీఠం చేసాడు. బలిపీఠం చతురస్రం, దాని పొడువు ఏడున్నర అడుగులు, వెడల్పు ఏడున్నర అడుగులు, ఎత్తు నాలుగున్నర అడుగులు. 2 ఒక్కొక్క మూలకు ఒక కొమ్మును అతడు చేసాడు. కొమ్ములను బలిపీఠంతో ఏకభాగంగా అతడు చేసాడు. తర్వాత అతడు దాన్నంతటినీ యిత్తడితో తాపడం చేసాడు. 3 తర్వాత బలిపీఠం మీద ఉపయోగించే పరికరాలు అన్నింటినీ అతడు చేసాడు. బిందెలు, గరిటెలు, గిన్నెలు, ముల్లు గరిటెలు, నిప్పు పాత్రలు అతడు చేసాడు. 4 తర్వాత అతడు బలిపీఠం కోసం ఒక వలలాంటి ఇత్తడి జల్లెడ తయారు చేసాడు. ఈ ఇత్తడి జల్లెడ వలలా ఉంది. బలిపీఠం అడుగున అంచు కింద ఉంచబడింది. అది అడుగు భాగాన కింద నుండి బలిపీఠం లోనికి సగం వరకు వుంది. 5 తర్వాత ఇత్తడి ఉంగరాలు చేసాడు. బలిపీఠాన్ని మోసే కర్రలను పట్టి వుంచేందుకు ఈ ఉంగరాలు ఉపయోగించ బడ్డాయి. ఆ ఉంగరాలకు ఇత్తడి జల్లెడ నాలుగు మూలలను అతడు అమర్చాడు. 6 తర్వాత అతడు తుమ్మకర్రతో కర్రలు చేసి, వాటిని యిత్తడితో తాపడం చేసాడు. 7 ఆ కర్రలను ఉంగరాలలో అమర్చాడు అతడు. బలిపీఠం పక్కలో ఉన్న కర్రలు బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించబడ్డాయి. బలిపీఠం చేయడానికి అతడు తుమ్మ కర్ర పలకలను ఉపయోగించాడు. బలిపీఠం లోపల ఖాళీ గంగాళం వుంది.
8 దాని దిమ్మను అతడు ఇత్తడితో చేసాడు. స్త్రీలు ఇచ్చిన ఇత్తడి అద్దాలను అతడు ఉపయోగించాడు. సమావేశ గుడార ప్రవేశం దగ్గర పరిచర్య చేసే స్త్రీలు వీరు.
పవిత్ర గుడారం చుట్టూ ఆవరణ
9 తర్వాత ఆవరణ చుట్టూ తెరలను అతడు చేసాడు. దక్షిణం వైపు తెరల పొడవు 50 గజాలు. 10 దక్షిణం వైపు 20 స్తంభాల ఆధారంతో తెరలు నిలబడ్డాయి. ఈ తెరలు సన్నని నారతో చేయబడ్డాయి. ఆ స్తంభాలు 20 యిత్తడి దిమ్మల మీద ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి. 11 ఆవరణ ఉత్తరం వైపుకూడ దక్షిణం వైపులాగే ఉంది. 20 ఇత్తడి దిమ్మల మీద 20 స్తంభాలు ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి.
12 ఆవరణ పడమటి వైపు తెరలు 25 గజాలు పొడవు. స్తంభాలు 10, దిమ్మలు 10 ఉన్నాయి. స్తంభాలకు కొక్కెములు బిగించే తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి.
13 ఆవరణ ప్రవేశం తూర్పున ఉంది. తూర్పున 25 గజాలు వెడల్పు, 14 ప్రవేశానికి ఒక ప్రక్క ఏడున్నర గజాలు పొడవు గల ఒక తెర ఉంది. ఆ తెరకు మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 15 ప్రవేశానికి మరో పక్క ఇంకో తెర ఉంది. దాని పొడవు కూడ ఏడున్నర గజాలు. ఆ తెరకు కూడా మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 16 ఆవరణ చుట్టూ ఉన్న తెరలన్నీ నాణ్యమైన బట్టతో చేయబడ్డాయి. 17 స్తంభాలకు దిమ్మలు ఇత్తడితో చేయబడ్డాయి. కొక్కెములు, తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖరాలు కూడ వెండితో తాపడం చేయబడ్డాయి. ఆవరణలోని స్తంభాలన్నీ తెరల వెండి కడ్డీలతో కలుపబడ్డాయి.
18 నీలం, ఎరుపు ధూమ్రవర్ణం బట్ట, నాణ్యమైన సన్నని నార బట్టతో ఆవరణ ప్రవేశానికి తెర చేయబడింది. నిపుణుడు వీటన్నింటినీ కలిపి కట్టాడు. ఆ తెర 10 గజాలు పొడవు, రెండున్నర గజాలు ఎత్తు ఉంది. ఆవరణలో తెరల వలే అవి కూడ అదే ఎత్తు ఉన్నాయి. 19 ఆ తెర నాలుగు స్తంభాలు, నాలుగు ఇత్తడి దిమ్మల మీద ఆధారపడి ఉంది. 20 స్తంభాల మీద కొక్కెములు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖరాలు, బిగించే కడ్డీలు వెండితో చేయబడ్డాయి.
21 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులన్నింటినీ రాసి పెట్టమని లేవీ ప్రజలకు మోషే ఆజ్ఞాపించాడు. అహరోను కుమారుడు ఈతామారు ఈ జాబితా బాధ్యత వహించాడు.
22 దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని యూదా వంశపు హూరు కుమారుడైన ఊరు కుమారుడు బెసలేలు తయారు చేసాడు. 23 ఇంకా దాను వంశపు అహీమాసాకి కుమారుడు అహోలీయాబు అతనికి సహాయం చేసాడు. అహోలీయాబు నిపుణుడు, నమూనాలు గీయగలడు. శ్రేష్ఠమైన నారబట్టలతో నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో బుట్టా పని చేయగలవాడు అతడు.
24 పవిత్ర గుడారం కోసం రెండు టన్నులకంటే ఎక్కువ బంగారం యెహోవాకు అర్పణగా ఇవ్వబడింది. (ఆలయపు అధికారిక కొలత ప్రకారం ఇది తూచబడింది).
25 ప్రజలు మూడుముప్పావు టన్నులకు మించి వెండిని యిచ్చారు. (ఇది ఆలయపు అధికారిక కొలత ప్రకారం తూచబడింది). 26 ఇరవై సంవత్సరాలు, అంతకు పైబడ్డ మగవాళ్లందరిని లెక్కించారు. మొత్తం 6,03,550 మంది మగవారున్నారు. వారిలో ప్రతి ఒక్కడు ఒక వెండి బాకా (అరతులం వెండి) పన్ను చెల్లించాలి. (ఒక వెండి బాకా అంటే అధికారిక కొలత ప్రకారం ఒక అరతులం.) 27 అందులో మూడు ముప్పావు టన్నుల వెండి పవిత్ర గుడారపు 100 దిమ్మలు చేసేందుకు, తెరచేసేందుకు వినియోగించబడింది. ఒక్క దిమ్మకు 75 పౌన్ల వెండి వారు ఉపయోగించారు. 28 కొక్కెములు, తెరల కడ్డీలు చేయటానికి, స్తంభాలకు వెండి తాపడం చేయటానికి మరో 50 పౌన్ల వెండి ఉపయోగించబడింది.
29 ఇత్తడి ఇరవై ఆరున్నర టన్నులకు పైగా యెహోవాకు ఇవ్వబడింది. 30 సన్నిధి గుడార ప్రవేశం దగ్గర దిమ్మలు చేయటానికి ఆ ఇత్తడి ఉపయోగించబడింది. బలిపీఠం, ఇత్తడి తెర చేసేందుకు కూడా వారు ఇత్తడి ఉపయోగించారు. బలిపీఠం కోసం పరికరాలు, పాత్రలు అన్నీ చేయటానికి కూడా ఇదే ఇత్తడి వాడబడింది. 31 ఆవరణ చుట్టూ తెరల దిమ్మలు చేసేందుకు, ప్రవేశం దగ్గర తెరల దిమ్మలు చేసేందుకు కూడా ఇదే ఇత్తడి వాడబడింది. పవిత్ర గుడారానికి, ఆవరణ చుట్టూ ఉన్న తెరలకూ కావల్సిన మేకులు చేసేందుకు కూడా ఇత్తడి ఉపయోగించబడింది.
యేసు తనకోసం, తన శిష్యులకోసం ప్రార్థించటం
17 ఆ తర్వాత యేసు ఆకాశం వైపు చూసి ఈ విధంగా ప్రార్థించాడు: “తండ్రి! సమయం వచ్చింది. నీ కుమారునికి మహిమ కలిగించు. అప్పుడు కుమారుడు నీకు మహిమ కలిగిస్తాడు. 2 ప్రజలందరిపై కుమారునికి అధికారమిచ్చావు. నీవు అప్పగించిన వాళ్ళకు, ఆయన అనంత జీవితం యివ్వాలని నీ ఉద్దేశ్యం. 3 నీవు మాత్రమే నిజమైన దేవుడవు. నిన్నూ, నీవు పంపిన ‘యేసుక్రీస్తు’ను తెలుసుకోవటమే అనంత జీవితం. 4 పూర్తి చేయుమని నీవు నాకు అప్పగించిన కార్యాన్ని పూర్తిచేసి ఈ ప్రపంచంలో నీకు మహిమ కలిగించాను. 5 తండ్రీ! ఈ ప్రపంచం ఆరంభం కాక ముందు నీతో పాటు నాకు కూడా మహిమ ఉండేది. ఇప్పుడు ఆ మహిమ నీ సమక్షంలో నాకు కలిగేటట్లు చేయుము.
6 “ఈ ప్రపంచంలో నీవు నాకు అప్పగించిన వాళ్ళకు నిన్ను గురించి తెలియ చేసాను. వాళ్ళు నీ వాళ్ళు. కాని వాళ్ళను నీవు నాకు అప్పగించావు. వాళ్ళు నీ సందేశాన్ని పాటించారు. 7 నీవు నాకు ఎన్నోయిచ్చావు. అవన్నీ నాకిచ్చినావని వాళ్ళకిప్పుడు తెలిసింది. 8 ఎందుకంటే, నీవు నాకు చెప్పిన సందేశాన్ని వాళ్ళకు చెప్పాను. వాళ్ళు దాన్ని అంగీకరించారు. నేను నిజంగా నీ నుండి వచ్చానని వాళ్ళకు తెలుసు. నీవు నన్ను పంపావన్న విశ్వాసం యిప్పుడు వాళ్ళలో కలిగింది. 9 నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రపంచాని కోసం ప్రార్థించటం లేదు. నీవు నాకు అప్పగించిన వాళ్ళు నీ వాళ్ళు కావాలని ప్రార్థిస్తున్నాను. 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వాళ్ళ ద్వారా నాకు మహిమ కలుగుతోంది.
11 “నేనీ ప్రపంచంలో యిక ఉండను. కాని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నేను నీ దగ్గరకు రాబోతున్నాను. ఓ తండ్రీ! నీలో పవిత్రత ఉంది. నీవు నాకిచ్చిన, నీ నామంలో ఉన్న మహిమతో వాళ్ళను రక్షించు. అలా చేస్తే మనం ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉంటారు. 12 నేను వాళ్ళతో ఉన్నప్పుడు, నీవు నా కిచ్చిన నామంతో వాళ్ళను రక్షించి కాపాడాను. లేఖనాల్లో వ్రాసినవి నిజం కావటానికి నాశనం కావలసిన వాడు తప్ప మరెవ్వరూ నాశనం కాలేదు.
13 “నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళ హృదయాల్లో పూర్తిగా నిండి పోవాలని నేనీ ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ విషయాలు చెబుతున్నాను. 14 నీ సందేశం నా శిష్యులకు చెప్పాను. నేను ఈ ప్రపంచానికి చెందిన వాణ్ణి కాదు. అదే విధంగా నా శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు. కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది.
15 “వాళ్ళనీ ప్రపంచం నుండి తీసుకు వెళ్ళమని నేను ప్రార్థించటం లేదుగాని దుర్మార్గుని నుండి వాళ్ళను రక్షించుమని ప్రార్థిస్తున్నాను. 16 నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి చెందనో అదే విధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెందరు. 17 సత్యంలో వారిని పవిత్రపరచు, నీ వాక్యమే సత్యం. 18 నీవు నన్ను ఏ విధంగా పంపావో, అదే విధంగా వాళ్ళను నేను ఈ ప్రపంచంలోనికి పంపాను. 19 వాళ్ళ కోసం నన్ను నేను ప్రత్యేకపరచు కొన్నాను. వాళ్ళు కూడా నిజంగా ప్రత్యేకించబడాలని నా ఉద్దేశ్యం.
20 “నా ప్రార్థన వాళ్ళ కోనం మాత్రమే కాదు. వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్యసించే వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. 21 తండ్రీ! నేను నీలో, నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్ళను కూడా మనలో ఐక్యం చేయుము. 22 మనము ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉండాలని, నీవు నాకిచ్చిన మహిమను నేను వాళ్ళకిచ్చాను. 23 నేను వాళ్ళలో ఉన్నాను. నీవు నాలో ఉన్నావు. వాళ్ళలో సంపూర్ణమైన ఐక్యత కలిగేటట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపంచానికి తెలుస్తుంది.
24 “తండ్రీ! నీవు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం పుట్టక ముందు నుండి నన్ను ప్రేమించావు. నాకు మహిమను ఇచ్చావు. ఆ మహిమను వాళ్ళు చూడాలని నా అభిలాష. 25 నీతి స్వరూపుడవగు తండ్రీ! ప్రపంచానికి నీవెవరవో తెలియక పోయినా నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీళ్ళకు తెలుసు. 26 నీవెవరవో వాళ్ళకు తెలియచేసాను. తెలియచేస్తూ ఉంటాను. నాయందు నీకున్న ప్రేమ వాళ్ళయందు కూడా ఉండాలని, వాళ్ళలో నేను స్వయంగా ఉండాలని నా ఉద్దేశ్యం.”
14 జ్ఞానముగల స్త్రీ తన ఇల్లు ఎలా ఉండాలో అలా చేసుకొనేందుకు జ్ఞానము ప్రయోగిస్తుంది. కాని బుద్ధిహీనురాలు ఆమె చేసే బుద్ధిహీనమైన పనుల మూలంగా తన ఇల్లు నాశనం చేసుకొంటుంది.
2 సరిగ్గా జీవించే మనిషి యెహోవాను గౌరవిస్తాడు. కాని నిజాయితీ లేని మనిషి యెహోవాను ద్వేషిస్తాడు.
3 బుద్ధిహీనుని మాటలు అతనికి కష్టం తెచ్చిపెడతాయి. కాని జ్ఞానముగలవాని మాటలు అతణ్ణి కాపాడతాయి.
4 పని చేయటానికి ఎద్దులు లేకపోతే గాదెలో ధాన్య ముండదు ఒక గొప్ప పంట పండించటానికి మనుష్యులు ఎద్దు బలాన్ని ఉపయోగించవచ్చు.
5 సత్యవంతుడు అబద్ధం చెప్పడు. అతడు మంచి సాక్షి. కాని నమ్మదగని వ్యక్తి ఎన్నడూ సత్యం చెప్పడు. అతడు చెడ్డ సాక్షి.
6 ఇతరులకంటె తాను మంచివాడను అని తలంచే గర్విష్ఠుడు ఒకవేళ జ్ఞానిగా ఉండాలి అనుకోవచ్చు. కాని ఆ గర్విష్ఠుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు. అయితే నిజంగా జ్ఞానముగల వానికి (దేవుని నమ్మినవానికి) తెలివి సులభంగా అబ్బుతుంది.
7 తెలివి తక్కువ వానితో స్నేహం చేయవద్దు. తెలివి తక్కువ మనిషి నీకు నేర్పించగలది ఏమీ లేదు.
8 తెలివిగల మనుష్యులు వారు చేసే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తారు, గనుక వారు జ్ఞానము గలవారు. కాని బుద్ధిహీనులు మోసం చేసి జీవించవచ్చు. అనుకొంటారు గనుక వారు తెలివితక్కువ వారు.
9 తెలివి తక్కువ వాడు, తాను చేసిన చెడు విషయాలకు శిక్ష పొందాలి అనే మాటను గూర్చి నవ్వేస్తాడు. కాని మంచి మనుష్యులు క్షమాపణ పొందటానికి చాలా కష్టపడి ప్రయత్నిస్తారు.
10 ఒక మనిషి విచారంగా ఉంటే దాని ప్రభావం అతను ఒక్కడే అనుభవిస్తాడు. అదే విధంగా ఒక మనిషి సంతోషంగా ఉంటే అతను ఒక్కడు మాత్రమే ఆ ఆనందం అనుభవిస్తాడు.
11 దుర్మార్గుని ఇల్లు నాశనం చేయబడుతుంది. కాని మంచివాని ఇల్లు శాశ్వతంగా ఉంటుంది.
12 సరిగ్గా ఉంది అని మనుష్యులు తలంచే ఒక మార్గం ఉంది. కాని ఆ మార్గం మరణానికి మాత్రమే దారి తీస్తుంది.
13 ఒక మనిషి నవ్వుతూ ఉన్నా, అతడు విచారంగానే ఉండవచ్చు. నవ్వటం అయిపొయ్యాకగూడ ఆ విచారం అలాగే ఉంటుంది.
14 దుర్మార్గులు చేసే చెడుపనులకు వారికి పూర్తిగా చెల్లించబడుతుంది (శిక్షించబడుతారు). మరియు మంచివాళ్లు చేసే మంచి పనులకు పూర్తిగా బహుమానం పొందుతారు.
15 బుద్ధిహీనుడు ఏది వింటే అది నమ్ముతాడు. కాని జ్ఞానము గలవాడు ప్రతిదాని గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తాడు.
16 జ్ఞానముగలవాడు యెహోవాను గౌరవిస్తాడు, దుర్మార్గానికి దూరంగా ఉంటాడు. కాని బుద్ధిహీనుడు ఆలోచన లేకుండా పనులు చేస్తాడు జాగ్రత్తగా ఉండడు.
17 త్వరగా కోపగించుకొనేవాడు బుద్ధిహీనమైన పనులు చేస్తాడు. కాని జ్ఞానముగలవాడు ఓర్పు కలిగి ఉంటాడు.
18 తెలివితక్కువ వారు తమ తెలివితక్కువ తనాన్ని బట్టి శిక్షించబడుతారు. కాని జ్ఞానముగలవారికి తెలివి బహుమానంగా ఇవ్వబడుతుంది.
19 చివరికి చెడ్డవారిమీద మంచి వాళ్లు గెలుస్తారు. చెడ్డవాళ్లు మంచివాళ్లకు నేవ చేయుటకు బలవంతం చేయబడుతారు.
20 పేదవానికి స్నేహితులు ఎవ్వరూ ఉండరు. అతనికి పొరుగువారు కూడ ఉండరు. కాని ధనికులకు చాలా మంది స్నేహితులు ఉంటారు.
21 ఇతరులకంటే నీవే మంచివాడవని తలచటం తప్పు. నీవు సంతోషంగా ఉండాలంటే పేదవారి యెడల దయ కలిగి ఉండు.
22 దుర్మార్గం చేయాలనే వ్యక్తి ఎవరైనా సరే అతడు తప్పు చేస్తున్నాడు. అయితే మంచి జరిగించడానికి ప్రయత్నించే వ్యక్తికి, అతన్ని ప్రేమించి అతన్ని నమ్ముకొనే స్నేహితులు ఉంటారు.
23 నీవు కష్టపడి పని చేస్తే, అప్పుడు నీవు కోరుకొనేవి నీకు ఉంటాయి. కాని నీవు మాట్లాడటం తప్ప పని ఏమి చేయకపోతే నీవు పేదవానివిగా ఉంటావు.
24 జ్ఞానముగలవారు ఐశ్వర్యాన్ని బహుమానంగా పొందుతారు. కాని బుద్ధిహీనులు తెలివితక్కువ తనాన్ని బహుమానంగా పొందుతారు.
25 సత్యం పలికే మనిషి ఇతరులకు సహాయం చేస్తాడు. అబద్ధాలు చెప్పే మనిషి ఇతరులకు హాని చేస్తాడు.
26 యెహోవాను గౌరవించే మనిషి క్షేమంగా ఉంటాడు. మరియు అతని పిల్లలు క్షేమంగా జీవిస్తారు.
27 యెహోవా యెడల భక్తి నిజమైన జీవాన్ని ప్రసాదిస్తుంది. అది ఒక వ్యక్తిని మరణవు ఉచ్చునుండి రక్షిస్తుంది.
28 ఒక రాజు అనేకమంది ప్రజలను పాలిస్తే అతడు గొప్పవాడు. కాని ప్రజలు ఎవ్వరూ లేకపోతే అప్పుడు ఆ రాజు యొక్క విలువ శూన్యం.
29 సహనంగల మనిషి చాలా తెలివిగలవాడు. త్వరగా కోపపడు మనిషి బుద్ధిహీనుడని కనపరచుకుంటాడు.
30 ఒక మనిషి మనస్సులో శాంతి ఉంటే అతని శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాని అసూయ శరీరంలో వ్యాధి కలిగిస్తుంది.
31 పేద ప్రజలకు కష్టాలు కలిగించే మనిషి దేవుణ్ణి గౌరవించటం లేదని చూపెడతాడు. ఇద్దరినీ దేవుడే చేశాడు. కాని ఒక మనిషి పేద ప్రజల యెడల దయ కలిగి ఉంటే, అప్పుడు అతడు దేవుణ్ణి గౌరవిస్తాడు.
32 కష్టకాలంలో దుర్మార్గులు ఓడించబడతారు. కాని మంచివాళ్లు మరణ సమయంలో కూడా విజయం పొందుతారు.
33 జ్ఞానముగల మనిషి ఎల్లప్పుడూ జ్ఞానముగల విషయాలే తలుస్తాడు. కాని బుద్ధిహీనునికి జ్ఞానమును గూర్చి అసలు ఏమీ తెలియదు.
34 మంచితనం ఒక దేశాన్ని గొప్పగా చేస్తుంది. కాని పాపం వలన ఏ ప్రజలకైనా అవమానమే కలుగుతుంది.
35 ఒక రాజుకు జ్ఞానముగల నాయకులు ఉంటే అతడు సంతోషిస్తాడు. కాని తెలివితక్కువ నాయకుల విషయమై రాజుకు కోపం.
1 యేసు క్రీస్తు సేవకులైన పౌలు మరియు తిమోతియు, యేసు క్రీస్తులో ఐక్యమై, ఫిలిప్పీ పట్టణంలో నివసిస్తున్న పవిత్రులకు, పెద్దలకు, పరిచారకులకు వ్రాయునది ఏమనగా:
2 మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించును గాక!
కృతజ్ఞత, ప్రార్థన
3 నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. 4 కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను. 5 దైవసందేశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు. 6 ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించినవాడు అది పూర్తి అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది.
7 మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు. 8 మీ పట్ల నాకున్న ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దైవసాక్షిగా చెపుతున్నాను.
9 ఇదే నా ప్రార్థన:
మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి. 10 అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు. 11 మీరు నీతిగా జీవించటంవల్ల ఫలం పొందుతారు. ఆ ఫలం యేసు క్రీస్తు నుండి వచ్చి మీలో నిండిపోతుంది. తద్వారా దేవునికి కీర్తి, స్తుతి కలుగుతుంది.
పౌలు సంకెళ్ళు, సువార్త
12 సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవసందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్పడతాయని మీరు గమనించాలి. 13 ఈ సంఘటనలు సంభవించటం వల్ల క్రీస్తు కోసం సంకెళ్ళలో బంధింపబడ్డానని అందరికీ తెలిసిందే. ఇది రాజభవనంలో ఉన్న రక్షకభటులకు కూడా తెలిసిందే. 14 ఈ సంకెళ్ళ మూలంగా, ప్రభువు కారణంగా నా సోదరులైన అనేకులకు దైవసందేశం బోధించటానికి ప్రోత్సాహం కలిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ ధైర్యంతో భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారు.
15 కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు. 16 వీళ్ళు, దైవసందేశాన్ని ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి ప్రేమతో బోధిస్తున్నారు. 17 మొదట పేర్కొనబడ్డవాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 18 దాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సదుద్దేశాలతో అయితేనేమిటి, దురుద్దేశాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడుతోంది. కనుక నాకు ఆనందంగా ఉంది.
ఔను, నేను యిదే విధంగా ఆనందిస్తూ ఉంటాను. 19 ఎందుకంటే మీ ప్రార్థనవల్ల యేసు క్రీస్తు యొక్క ఆత్మ చేసిన సహాయం వల్ల నేను అనుభవిస్తున్న ఈ కష్టాలే నా విడుదలకు దారితీస్తాయని నాకు తెలుసు. 20 నాకు ఎలాంటి అవమానం కలుగరాదని, నాకు ధైర్యం కలగాలని మనసారా కోరుకొంటున్నాను. ఎప్పటిలాగే యిప్పుడు కూడా క్రీస్తు, నా దేహంలో మహిమ పొందాలని ఆశిస్తున్నాను. ఇది నేను జీవించటంవల్ల సంభవించినా, లేక మరణంవల్ల సంభవించినా నాకు చింత లేదు. 21 ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే. 22 నేను ఈ దేహంతో జీవిస్తే దానివల్ల నా శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. అయినా నేను ఏది కోరుకోవాలో నాకే తెలియదు. 23 ఈ రెంటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఒక విధంగా చూస్తే ఈ దేహాన్ని వదిలి క్రీస్తు సమక్షంలో ఉండాలని అనిపిస్తోంది. ఇది అన్నిటికన్నా ఉత్తమం. 24 కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. 25 ఇది నాకు బాగా తెలుసు. అందువల్ల నేను బ్రతికి ఉండి అందరితో కలిసి విశ్వాసం ద్వారా సంభవిస్తున్న మీ అభివృద్ధి కోసం, ఆనందం కోసం పని చేస్తాను. 26 నేను మళ్ళీ మీతో కలిసి జీవించునప్పుడు మీకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత కారణంగా యింకా ఎక్కువ గర్విస్తాను.
27 ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగిన విధంగా జీవించండి. అప్పుడు నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీరు ఒక ఆత్మగా, ఒక మనిషిగా సువార్తవల్ల సంభవించే విశ్వాసంకోసం పని చేస్తున్నారని నేను వినాలి. 28 మీ శత్రువులకు ఏ మాత్రం భయపడకండి. అన్ని వేళలా ధైర్యంగా ఉండండి. అప్పుడు మీరు గెలుస్తారని, తాము ఓడిపోతామని వాళ్ళకు తెలుస్తుంది. ఇది దేవుడు చేసాడు. 29 ఎందుకంటే, క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం మీకు కూడా దేవుడు కలిగించాడు. 30 గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని సాగిస్తున్నారు.
© 1997 Bible League International