M’Cheyne Bible Reading Plan
ఒడంబడిక పెట్టె (మందసము)
37 తుమ్మ కర్రతో పవిత్ర పెట్టెను బెసెలేలు చేసాడు. ఆ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. ఎత్తు 27 అంగుళాలు, 2 పెట్టె లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో అతడు తాపడం చేసాడు. తర్వాత పెట్టె చుట్టూ బంగారు నగిషీబద్ద కట్టాడు. 3 బంగారు ఉంగరాలు నాలుగు చేసి నాలుగు మూలలా వాటిని అమర్చాడు. పెట్టె మోయటానికి ఈ ఉంగరాలు ఉపయోగించబడ్డాయి. ఒక్కో ప్రక్క రెండేసి ఉంగరాలు ఉన్నాయి. 4 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్రతో చేసి ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారం తాపడం చేసాడు. 5 పెట్టెకు ఒక్కో ప్రక్క ఉంగరాల గుండా కర్రలను దూర్చిపెట్టాడు. 6 తర్వాత స్వచ్ఛమైన బంగారంతో అతడు మూత చేసాడు. దాని పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. 7 తర్వాత బెసలేలు కొట్టబడ్డ బంగారంతో రెండు కెరూబులను చేసాడు. ఆ కెరూబులను మూత కొనల మీద ఉంచాడు. 8 ఒక కొనమీద ఒక కెరూబును, మరో కొనమీద మరో కెరూబును ఉంచాడు. అంతా ఒకే భాగంలో ఉండేటట్టు ఆ కెరూబులు మూతతో కలిపి చేయబడ్డాయి. 9 కెరూబుల రెక్కలు ఆకాశంవైపు విప్పబడ్డాయి. ఆ కెరూబుల రెక్కలు పెట్టెను కప్పి ఉంచాయి. కెరూబులు ఎదురెదురుగా మూతను చూస్తూ ఉన్నాయి.
ప్రత్యేక బల్ల
10 తర్వాత అతడు తుమ్మ కర్రతో బల్లను చేసాడు. ఆ బల్ల పొడవు 36 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు. 11 అతడు ఆ బల్లను బంగారంతో తాపడం చేసాడు. బల్ల నాలుగు ప్రక్కల బంగారు నగిషీబద్ద చేసాడు. 12 అప్పుడు అతడు ఆ బల్ల చుట్టూ మూడు అంగుళాల చట్రం చేసాడు. ఆ చట్రం మీద బంగారు నగిషీబద్దను అతడు ఉంచాడు. 13 అప్పుడు అతడు ఆ బల్లకు నాలుగు బంగారు ఉంగరాలు చేసాడు. నాలుగు మూలలా నాలుగు బంగారు ఉంగరాలు అతడు అమర్చాడు. అక్కడే నాలుగు కాళ్లు ఉన్నాయి. 14 ఉంగరాలను బల్ల పైభాగంలో చట్రానికి దగ్గరగా అతడు పెట్టాడు. బల్లను మోసేందుకు ఉపయోగించే కర్రలను ఉంగరాలు పట్టి ఉంచుతాయి. 15 తర్వాత బల్లలను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్ర ఉపయోగించి చేసిన, ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారు పూత పూసాడు. 16 అప్పుడు బల్ల మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ తయారు చేసాడు. పానార్పణము పోసేందుకు పళ్లెములు, గరిటెలు, గిన్నెలు, పాత్రలు అతడు తయారు చేసాడు. ఇవన్నీ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడ్డాయి.
దీప స్తంభం
17 తర్వాత అతడు దీపస్తంభం చేసాడు. స్వచ్ఛమైన బంగారం ఉపయోగించి, దాని దిమ్మను, స్తంభాన్ని తీర్చిదిద్దాడు. తర్వాత పువ్వుల్లా కనపడే గిన్నెలు చేసాడు. గిన్నెలకు మొగ్గలు, పువ్వులు ఉన్నాయి. అన్నీ స్వచ్ఛమైన బంగారంతోనే చేయబడ్డాయి. ఈ వస్తువులన్నీ ఒకే భాగంగా కలుపబడ్డాయి. 18 దీపస్తంభం ప్రక్కల్లో ఆరు కొమ్మలు ఉన్నాయి. ఒక పక్క మూడు కొమ్మలు, మరో పక్క మూడు కొమ్మలు ఉన్నాయి. 19 ఒక్కో కొమ్మకు మూడేసి బంగారు పూలున్నాయి. ఈ పూలు బాదం పూలవలె చేయబడ్డాయి. వాటికి మొగ్గలు, రేకులు ఉన్నాయి. 20 బంగారంతో చేయబడ్డ నాలుగు పూవులు దీపస్తంభంపు కాండానికి ఉన్నాయి. అవి కూడా మొగ్గలు, రేకులతో బాదం పూవుల్లానే ఉన్నాయి.
21 ఆరు కొమ్మలు రెండేసి చొప్పున మూడు భాగాలుగా ఉన్నాయి. ఒక్కో కొమ్మ విభాగం కింద ఒక్కో మొగ్గ ఉంది. 22 మొగ్గలు, కొమ్మలు, దీపస్తంభం అన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డాయి. ఈ బంగారం అంతా కొట్టబడి, ఒకే భాగంగా చేయబడింది. 23 ఈ దీపస్తంభానికి అతడు ఏడు దీపాలు చేసాడు. తర్వాత అతడు పళ్లెం, పట్టకారులు చేసాడు. సమస్తం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. 24 దీపస్తంభం, దాని పరికరాలు అన్నీ తయారు చేయడానికి అతడు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.
ధూప వేదిక
25 ధూపం వేసేందుకు అతడు ధూప వేదిక చేసాడు. తుమ్మ కర్రతో అతడు దీన్ని చేసాడు. వేదిక చతురస్రాకారం. దాని పొడవు 18 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 36 అంగుళాలు. వేదిక మీద నాలుగు కొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్క మూలను ఒక్కొక్క కొమ్మ ఉంది. ఈ కొమ్మలు వేదికతో కలిపి ఒకే భాగంగా చేయబడ్డాయి. 26 పై భాగం, అన్ని ప్రక్కలు, కొమ్మలకీ అతడు బంగారు తాపడం చేసాడు. తర్వాత అతడు బలిపీఠం చుట్టూ బంగారు నగిషీబద్ద చేసాడు. 27 బలిపీఠానికి అతడు రెండు బంగారు ఉంగరాలు చేసాడు. బలపీఠం నగిషీబద్దకు అడుగు భాగాన ఒక్కో ప్రక్క ఒక్కోటిగా బంగారు ఉంగరాలను అమర్చాడు. వేదికను మోసే కర్రలను ఈ బంగారు ఉంగరాలు పట్టి వుంచేవి. 28 స్తంభాలను తుమ్మ కర్రతో చేసి, బంగారం తాపడం చేసాడు అతడు.
29 తర్వాత అభిషేకించే పవిత్ర తైలం చేసాడు. స్వచ్ఛమైన పరిమళ వాసనగల ధూపం కూడ అతడు చేసాడు. అత్తరు చేసే నైపుణ్యంగల ఒకని చేత ఇవన్నీ చేయబడ్డాయి.
16 “మీ విశ్వాసం చెదిరిపోకూడదని ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 2 వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో సమానంగా భావించే కాలం వస్తుంది. 3 వాళ్ళకు నా గురించి కాని, తండ్రిని గురించి కాని, తెలియదు కనుక అలా చేస్తారు. 4 ఆ సమయం వచ్చినప్పుడు నేను హెచ్చరించినట్లు మీకు జ్ఞాపకం ఉండాలని ఈ విషయం చెపుతున్నాను. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. కనుక మీకీ విషయం మొదట చెప్పలేదు.
పవిత్రాత్మ చేసిన క్రియలు
5 “కాని యిప్పుడు నేను నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తున్నాను. కాని మీలో ఒక్కరైనా నేను ఎక్కడికి వెళ్తున్నానని అడగలేదు. 6 నేను ఈ విషయం చెప్పటంవల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. 7 కాని నేను వెళ్ళటం మీ మంచి కోసమే. ఇది నిజం. నేను వెళ్ళకపోతే మీకు సహాయం చెయ్యటానికి ఆదరణకర్త రాడు. నేను వెళ్తే ఆయన్ని పంపగలను.
8 “ఆయన వచ్చాక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రపంచాన్ని ఒప్పింప చేస్తాడు. 9 ప్రజలు నన్ను విశ్వసించలేదు కనుక వాళ్ళలో ‘పాపం’వుందని రుజువు చేస్తాడు. 10 మీరు చూడలేని చోటికి, అంటే తండ్రి దగ్గరకు, వెళ్తున్నాను. కనుక తండ్రితో నాకున్న సంబంధాన్ని ఆయన రుజువు చేస్తాడు. 11 కనుక నీతి విషయంలో ఈ లోకాధికారియైన సైతానుకు ఇదివరకే శిక్ష విధింపబడింది. కనుక ‘తీర్పు’ విషయంలో ఒప్పింప చేస్తాడు.
12 “నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నోఉన్నాయి. కాని వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు. 13 కాని సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగ మాట్లాడడు. తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు. 14 నా సందేశం మీకు తెలియజేయుటవల్ల ఆయన నన్ను మహిమ పరుస్తాడు. 15 తండ్రికి చెందినవన్నీ నావి. అందువల్లే ఆత్మ నా సందేశం తీసుకొని మీకు తెలియచేస్తాడని చెప్పాను.
దుఃఖము సంతోషముగా మారటం
16 “కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు. ఆ తదుపరి మరి కొంత కాలం గడిచాక మీరు నన్ను చూస్తారు.”
17 ఆయన శిష్యుల్లో కొందరు, “‘కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు’ అని అనటంలోను మరియు, ‘మరి కొంత కాలం గడిచాక మీరు మళ్ళీ నన్ను చూస్తారు’ అని అనటంలో అర్థమేమిటి? పైగా ‘నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ అని అంటున్నాడే! అంటే ఏమిటి?” అని పరస్పరం మాట్లాడుకున్నారు. 18 “‘కొంత కాలం’ తర్వాత అని అనటంలో ఆయన ఉద్దేశ్యమేమిటి? ఆయనేమంటున్నాడో అర్థం కావటం లేదు!” అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుకొన్నారు.
19 ఈ విషయాన్ని గురించి వాళ్ళడగాలని అనుకుంటున్నారని యేసు గ్రహించాడు. అందువలన ఆయన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “‘కొంత కాలం గడిచాక నన్ను చూడరు, మరి కొంత కాలం గడిచాక నన్ను చూస్తారు’ అని నేనటంలో అర్థమేమిటని పరస్పరం మాట్లాడుకుంటున్నారా? 20 మీరు దుఃఖిస్తున్నప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది. మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. ఇది నిజం.
21 “ప్రసవించే సమయం వచ్చినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ నొప్పులు అనుభవిస్తుంది. శిశువు పుట్టాక ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తెచ్చిన ఆనందంలో తన వేదన మరచి పోతుంది. 22 అదే విధంగా యిది మీరు దఃఖించే సమయం. కాని నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పుడు మీ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఆనందాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. 23 ఆ రోజు మీరు నన్ను ఏమీ అడగరు. ఇది నిజం. నా పేరిట మీరేది అడిగినా తండ్రి మీకిస్తాడు. 24 ఇంత కాలం మీరు నా పేరిట ఏమీ అడగలేదు. ‘అడగండి; మీకు లభిస్తుంది’ అప్పుడు మీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది.
లోకముపై జయము
25 “నేను యింతవరకూ ఉపమానాలతో మాట్లాడుతూ వచ్చాను. కాని యిలాంటి భాష ఉపయోగించకుండా నేను స్పష్టంగా మాట్లాడే సమయం వస్తోంది. అప్పుడు నేను మీకు తండ్రిని గురించి స్పష్టంగా చెబుతాను. 26 ఆ రోజు మీరు నా పేరిట తండ్రిని అడుగుతారు. మీ పక్షాన నేను తండ్రిని అడుగుతున్నానని అనటం లేదు. 27 నేను తండ్రి నుండి వచ్చానని మీరు నమ్మారు. మీకు నా పట్ల ప్రేమ ఉంది. కనుక తండ్రికి స్వయంగా మీ పట్ల ప్రేమ ఉంది. 28 నేను తండ్రి నుండి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు నేనీ ప్రపంచాన్ని వదిలి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.”
29 శిష్యులు, “ఇప్పుడు మీరు ఉపమానాల ద్వారా కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు. 30 మీకు అన్నీ తెలుసునని మేము ఇప్పుడు గ్రహించాము. ఎవరునూ మీకు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. అందువల్ల మీరు దేవుని నుండి వచ్చారని విశ్వసిస్తున్నాము” అని అన్నారు.
31 యేసు, “చివరకు నమ్ముతున్నారన్న మాట! 32 మీరు నన్ను ఒంటరిగా ఒదిలి మీమీ యిండ్లకు వెళ్ళే సమయం రానున్నది. ఇప్పుడే వచ్చింది. నా తండ్రి నాతో ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా ఉండను.
33 “నా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ మీకు చెప్పాను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను” అని అన్నాడు.
13 ఒక తెలివిగల కుమారుడు అతడు ఏమి చేయాలని అతని తండ్రి చెబుతాడో, దానిని జాగ్రత్తగా వింటాడు. కాని గర్విష్ఠి వినడు. తనది తప్పు అని అతడు ఎన్నడూ నమ్మడు.
2 మంచి వాళ్లు, తాము చెప్పే మంచి విషయాలకు బహుమానం పొందుతారు. కాని దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు చేయాలని ఆలోచిస్తారు.
3 తాను చెప్పే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఉండే మనిషి తన ప్రాణం కాపాడుకొంటాడు. కాని ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి నాశనం చేయబడతాడు.
4 బద్ధకస్తునికి వస్తువులు కావాలి, కాని అతడు వాటిని ఎన్నటికీ పొందలేడు. కాని కష్టపడి పని చేసేవాళ్లు, తాము కోరుకొనే వాటిని పొందుతారు.
5 మంచివాళ్లు అబద్ధాలను అసహ్యించుకొంటారు. దుర్మార్గులు అవమానించబడతారు.
6 మంచితనం, నిజాయితీగల మనిషిని మంచితనం కాపాడుతుంది. కాని పాపం చేయాలని ఇష్టపడేవాడికి కీడు కలుగుతుంది.
7 కొంతమంది మనుష్యులు ధనికుల్లా నటిస్తారు, కాని వారికి ఏమి వుండదు. ఇతరులు పేదవాళ్లలా నటిస్తారు, కాని వాస్తవానికి వారు ధనికులు.
8 ఒక ధనికుడు తనప్రాణం కాపాడుకొనేందుకు వెల చెల్లించాల్సి వస్తుందేమో. కాని పేదవాళ్లకు అలాంటి బెదిరింపులు ఏమీ వుండవు.
9 ఒక మంచి మనిషి ప్రకాశవంతంగా వెలిగే దీపంలా ఉంటాడు. కాని దుర్మార్గుడు ఆరిపోయే దీపంలా ఉంటాడు.
10 ఇతరులకంటె తామే మంచివాళ్లము అనుకొనే మనుష్యులు కష్టం మాత్రమే కలిగిస్తారు. అయితే ఇతరులు తమకు చెప్పే విషయాలను వినేవారు జ్ఞానము గలవారు.
11 డబ్బు సంపాదించటంకోసం ఒక వ్యక్తి మోసం చేస్తే, ఆ డబ్బు త్వరలోనే పోతుంది. అయితే తన డబ్బును కష్టపడి సంపాదించే మనిషి దానిని మరీ ఎక్కువగా పెంచుకొంటాడు.
12 నిరీక్షణ లేకపోతే హృదయానికి దు: ఖం. నీవు కోరుకొన్నది సంభవిస్తే, అప్పుడు ఆనంద భరితుడవు.
13 ఒక వ్యక్తికి ఇతరులు సహాయం చేయటానికి ప్రయత్నించినప్పుడు అతడు వినిపించుకోకపోతే, అప్పుడు అతడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. అయితే ఇతరులు తనకు చెప్పిన సంగతులను గౌరవించేవాడు బహుమానం పొందుతాడు.
14 జ్ఞానముగల మనిషి యొక్క ఉపదేశాలు జీవాన్ని ఇస్తాయి. ఆ మాటలు మరణ బంధకాల నుండి తప్పించుకొనుటకు సహాయం చేస్తాయి.
15 తెలివిగల మనిషిని మనుష్యులు గౌరవిస్తారు. కాని ఒక వ్యక్తి నమ్మదగిన వాడు కానప్పుడు అతనికి కష్టం కలుగుతుంది.
16 జ్ఞానముగల మనిషి ఏదైనా చేయకముందే అతడు ఆలోచిస్తాడు. అయితే బుద్దిహీనుడు చేసే బుద్దిహీనత వలన అతడు మూర్ఖుడౌతాడు.
17 ఒక వార్తాహరుడు నమ్మజాలని వాడైతే, అప్పుడు అతని చుట్టూ కష్టం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి నమ్మదగిన వాడైతే శాంతి ఉంటుంది.
18 ఒక వ్యక్తి తన తప్పుల మూలంగా నేర్చుకొనేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు పేదవాడై, సిగ్గుపడతాడు. కాని ఒక మనిషి విమర్శించడినప్పుడు, శిక్షించబడినప్పుడు వినిపించుకొంటే లాభం పొందుతాడు.
19 ఒక మనిషి ఏదైనా కోరుకొని దానిని పొందితే, అతనికి చాలా సంతోషం. కాని మూర్ఖులు కీడునే కోరుకొంటారు. వారు మారుటకు అంగీకరించరు.
20 జ్ఞానముగల వారితో స్నేహంగా ఉండు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. కాని బుద్ధిహీనులను నీ స్నేహితులుగా నీవు ఎంచుకొంటే అప్పుడు నీవు కష్టాల్లో పడతావు.
21 పాపులు ఎక్కడికి వెళ్లినా కష్టం వారిని తరుముతుంది. కాని మంచివాళ్లకు మంచి సంగతులు జరుగుతాయి.
22 మంచి మనిషి దగ్గర అతడు తన పిల్లలకు, మనవలకు ఇచ్చేందుకు ఐశ్వర్యం ఉంటుంది. చివరికి చెడ్డవాళ్లకు ఉన్నవి అన్నీ మంచివాళ్ల పాలవుతాయి.
23 ఒక పేదవానికి విస్తారమైన ఆహారం పండించగల మంచి భూమి ఉండవచ్చును. కాని అతడు చెడు నిర్ణయాలు చేసి, ఆకలితో ఉంటాడు.
24 ఒక వ్యక్తి తన పిల్లలను నిజంగా ప్రేమిస్తే, వారు తప్పు చేసినప్పుడు అతడు వారిని సరిదిద్దుతాడు. నీవు నీ కుమారుణ్ణి ప్రేమిస్తే, అతనికి సరైన మార్గం నేర్పించేందుకు నీవు జాగ్రత్తగా ఉంటావు.
25 మంచి వాళ్లకు నిజంగా వారికి కావాల్సినవి ఉంటాయి. కాని దుర్మార్గునికి అవసరత కలిగివుంటుంది.
తల్లిదండ్రుల్ని గౌరవించండి
6 బిడ్డలారా! ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇది మంచిపని, 2 “మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి”(A) అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది. 3 “మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”(B)
4 తండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు. దానికి మారుగా ప్రభువు చెప్పిన మార్గాన్ని వాళ్ళకు బోధించి, అందులో శిక్షణనిచ్చి వాళ్ళను పెంచాలి.
బానిసలు, యజమానులు
5 బానిసలు తమ యజమానుల పట్ల విధేయతతో ఉండాలి. వాళ్ళకు మనస్ఫూర్తిగా క్రీస్తుకు విధేయులైనట్లు సేవ చెయ్యాలి. 6 వాళ్ళ అభిమానం సంపాదించాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు గమనిస్తున్నప్పుడు మాత్రమే కాక అన్ని వేళలా మీ పనులు మీరు చెయ్యాలి. మీరు క్రీస్తు బానిసలు. కనుక మనస్ఫూర్తిగా దైవేచ్ఛానుసారం చెయ్యండి. 7 సంతోషంగా సేవ చెయ్యండి. మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభువు సేవ చేస్తున్నట్లు భావించండి. 8 ప్రభువు మనిషి చేసిన సేవను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అతడు బానిస అయినా సరే. లేక యజమాని అయినా సరే. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి.
9 యజమానులు బానిసలపట్ల మంచిగా ఉండాలి. యజమానులు బానిసలను భయపెట్టరాదు. మీ యజమాని, వాళ్ళ యజమాని పరలోకంలో ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపడు.
దేవుడు యిచ్చిన ఆయుధాలు
10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. 11 సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి. 12 మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము. 13 కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.
14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. 15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. 16 వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. 17 రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. 18 ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి.
19 నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడ ప్రార్థించండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. 20 సంకెళ్ళలోవున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి.
చివరి వందనాలు
21 ప్రభువును విశ్వసిస్తున్న సేవకుడు, మన ప్రియ సోదరుడు అయిన “తుకికు” మీకు అన్నీ చెబుతాడు. అతని ద్వారా మీకు నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో తెలుస్తుంది. 22 మేము ఏ విధంగా ఉన్నామో మీరు తెలుసుకోవాలని మరియు అతడు మీకు ప్రోత్సాహం కలిగించాలని అతణ్ణి నేను మీ దగ్గరకు పంపుతున్నాను.
23 సోదరులందరికీ తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతో పాటు శాంతి, ప్రేమ లభించుగాక! 24 మన యేసు క్రీస్తు ప్రభువును ప్రేమించేవాళ్ళకు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ లభించుగాక!
© 1997 Bible League International