M’Cheyne Bible Reading Plan
36 “కనుక బెసలేలు, అహోలీయాబు, ఇంకా నైపుణ్యంగల పురుషులందరూ యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నీ చేస్తారు. ఈ పరిశుద్ధ స్థలం నిర్మించేందుకు అవసరమైన వాటిన్నింటినీ చేయటానికి అవసరమైన జ్ఞానం, అవగాహన దేవుడు ఈ మనుష్యులకు ఇచ్చాడు.”
2 తర్వాత బెసలేలును, అహోలీయాబును, యెహోవా నైపుణ్యాన్ని ఇచ్చిన ఇతర నిపుణులను మోషే పిలిచాడు. పనిలో సహాయం చేయాలని వీళ్లంతా వచ్చారు. 3 ఇశ్రాయేలు ప్రజలు కానుకగా తెచ్చిన వస్తువులన్నింటిని మోషే ఈ మనుష్యులకు ఇచ్చాడు. పవిత్ర గుడారం నిర్మించడానికి వీటన్నింటినీ వారు ఉపయోగించారు. ప్రతి ఉదయం ప్రజలు కానుకలు తెస్తున్నారు. 4 చివరకు నిపుణులైన పని వాళ్లు ఒక్కొక్కరు, ఆ పవిత్ర స్థలంలో వారు చేస్తున్న పని విడిచి పెట్టి, మోషేతో మాట్లాడటానికి వెళ్లారు. 5 “ప్రజలు కానుకలను విపరీతంగా తెచ్చేసారు. గుడారం పని ముగించడానికి కావలసిన దానికంటే మా దగ్గర ఎక్కువే ఉంది” అన్నారు వారు.
6 అప్పుడు, “ఇంక ఏ స్త్రీగాని, పురుషుడుగాని గుడారం కోసం ఏ విధమైన కానుక తీసుకురాకూడదు” అని బస్తి అంతటికీ మోషే కబురు చేసాడు. 7 పవిత్ర స్థలానికి అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను ప్రజలు సిద్ధం చేసారు.
పవిత్ర గుడారం
8 అప్పుడు నిపుణులు పవిత్ర గుడారం తయారు చేయటం మొదలు పెట్టారు. నీలం, ఎరుపు సన్నని నారబట్టతో పది తెరలు వారు చేసారు. రెక్కలు గల కెరూబుల చిత్రాలను ఆ బట్ట మీద వారు కుట్టి పెట్టారు. 9 ప్రతి తెర ఒకే కొలత. అది 14 గజాలు పొడువు, 2 గజాల వెడల్పు. 10 అయిదు తెరలు కలిపి ఒక భాగంగాను మిగిలిన అయిదు ముక్కలు కలిపి మరో భాగంగాను కలపబడ్డాయి. 11 తర్వాత మొదటి అయిదు తెరల భాగానికి బట్ట అంచు వెంబడి నీలం గుడ్డతో ఉంగరాలు చేశారు. మరో అయిదు ముక్కల భాగానికి కూడ అలానే చేశారు. 12 ఒక భాగంలో చివరి తెర మీద 50 ఉంగరాలు మరో భాగంలో చివర తెర మీద 50 ఉంగరాలు ఉన్నాయి. ఈ ఉంగరాలు ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉన్నాయి. 13 అప్పుడు వారు 50 బంగారు ఉంగరాలు చేశారు. రెండు తెరలను ఒకటిగా కలిపేందుకు ఈ బంగారు ఉంగరాలను వారు ఉపయోగించారు. అందుచేత గుడారం మొత్తం పవిత్ర స్థలంగా కలపబడింది.
14 అప్పుడు పవిత్ర గుడారం పైకప్పు కోసం మేక వెంట్రుకలతో 11 తెరలను పనివారు తయారు చేసారు. 15 మొత్తం 11 తెరలు ఒకే కొలత గలవి. వాటి పొడువు 15 గజాలు, వెడల్పు 2 గజాలు. 16 అయిదు తెరలను ఒక భాగంగా కలిపి కుట్టారు. పనివాళ్లు తర్వాత ఆరు తెరలను మరో భాగంగా కలిపి కుట్టారు. 17 మొదటి భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు అమర్చారు. మరో భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు అమర్చారు. 18 ఈ రెండు భాగాలను ఒక్కటిగా కలిపేందుకు 50 ఇత్తడి కొలుకులను పనివారు తయారు చేసారు. 19 తర్వాత గుడారానికి ఇంకా రెండు పై కప్పులను వారు తయారు చేసారు. ఒక పై కప్పు ఎరుపు రంగు వేసిన గొర్రె చర్మంతోను, మరొకటి నాణ్యమైన తోలుతోను చేయబడ్డాయి.
20 తర్వాత తుమ్మ కర్రతో పనివారు పలకలు చేసారు. 21 ఒక్కో పలక పొడవు 15 అడుగులు, వెడల్పు 27 అంగుళాలు. 22 ఒక్కో పలక అడుగున పక్క పక్కగా రెండు కొక్కీలు ఉన్నాయి. పవిత్ర గుడారపు పలకల్లో ప్రతి ఒక్కటీ ఇలాగే చేయబడింది. 23 గుడారం దక్షిణ భాగానికి 20 చట్రాలను వారు తయారు చేసారు. 24 ఆ తర్వాత ఈ 20 చట్రాల క్రింద పెట్టడానికి 40 వెండి దిమ్మలను వారు చేసారు. ప్రతి పలకకీ రెండేసి దిమ్మలు ఉన్నాయి. ఒక్కో బల్ల క్రింద ప్రతి పక్క కర్రలు, ఒక దిమ్మ. 25 గుడారం అవతలి వైపుకు (ఉత్తరం వైపు) కూడా వారు 20 పలకలు చేసారు. 26 ఒక్కో చట్రం క్రింద రెండేసి చొప్పున 40 వెండి దిమ్మలు అతడు చేసాడు. 27 పవిత్ర గుడారం వెనుక భాగానికి (పడమటి వైపున) ఆరు పలకలు అతడు చేసాడు. 28 పవిత్ర గుడారం వెనుక వైపు మూలలకు రెండు చట్రాలు అతడు చేసాడు. 29 ఈ చట్రాలు అడుగు భాగాన కలిపి బిగించబడ్డాయి. పై భాగాన అది జతచేయబడ్డ ఉంగరంలో అమర్చబడ్డాయి. ప్రతి మూలకూ అతడు ఇలాగే చేసాడు. 30 కనుక పవిత్ర గుడారం పశ్చిమాన 8 చట్రాలు, 16 వెండి దిమ్మలు అంటే ఒక్కో చట్రం కింద రెండేసి దిమ్మలు ఉన్నాయి.
31 తర్వాత అతడు తుమ్మ కర్రతో అడ్డ కర్రలు చేసాడు – పవిత్ర గుడారం మొదటి పక్కకు 5 అడ్డ కర్రలు, 32 పవిత్ర గుడారం రెండో పక్కకు 5 అడ్డ కర్రలు, గుడారం వెనుక పక్కకు 5 అడ్డ కర్రలు. 33 ఒక్కో చట్రంలోనుంచి దూరి అన్ని చట్రాల గుండా అమర్చబడేటట్టు మధ్య అడ్డ కర్రను అతడు చేసాడు. 34 ఈ చట్రాలను బంగారంతో అతడు తాపడం చేసాడు. అడ్డ కర్రలను పట్టి ఉంచేందుకు బంగారు ఉంగరాలను అతడు చేసాడు.
35 తర్వాత అతి పవిత్ర స్థలం యొక్క ప్రవేశ ద్వారానికి తెరను వారు చేయటానికి నాణ్యమైన సన్నని నారబట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణపు బట్ట వారు ఉపయోగించారు. నాణ్యమైన బట్టమీద కెరూబుల చిత్రాలను అతడు కుట్టాడు. 36 తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చేసి వాటికి బంగారం తాపడం చేసారు. ఆ స్తంభాలకు బంగారు కొక్కీలు వారు చేసారు. ఆ స్తంభాలకు నాలుగు వెండి దిమ్మలను వారు చేసారు. 37 తర్వాత గుడారం ప్రవేశ ద్వారానికి ఒక తెరను వారు తయారు చేసారు. నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్టను వారు ఉపయోగించారు. ఆ బట్ట మీద చిత్ర పటాల బుట్టాపని వారు చేసారు. 38 తర్వాత ఈ తెరకోసం అయిదు స్తంభాలు, కొక్కీలు వారు చేసారు. స్తంభాల శిఖరాలకు, తెరల కడ్డీలకు అతడు బంగారు తాపడం చేసాడు. స్తంభాలకు అయిదు ఇత్తడి దిమ్మలను వారు చేసారు.
తీగ, కొమ్మలు
15 “నా తండ్రి తోట యజమాని. నేను నిజమైన ద్రాక్షా తీగను. 2 నాలో ఫలం కాయని కొమ్మలన్నిటిని నా తండ్రి పూర్తిగా కొట్టి వేస్తాడు. ఫలమిచ్చే కొమ్మల్ని, అవి యింకా ఎక్కువ ఫల మిచ్చేటట్లు చెయ్యటానికి వాటికొనల్ని కత్తిరిస్తాడు. 3 నేను మీకు బోధించిన విషయాలవల్ల ఎక్కువ ఫల మిచ్చేటట్లు మీరిదివరకే కత్తిరింపబడ్డారు. 4 నాలో ఐక్యమై ఉండండి. నేను మీలో ఐక్యమై ఉంటాను. కొమ్మ స్వతహాగా ఫలమివ్వ లేదు. అది తీగకు అంటుకొని ఉండాలి. అదేవిధంగా మీరు నాలో ఉంటేనే ఫలమివ్వగలరు.
5 “నేను తీగను. మీరు నా కొమ్మలు. ఒక వ్యక్తి నాలో ఉండి నేను అతనిలో ఉంటే అతడెక్కువ ఫల మివ్వగలడు. నాకు దూరంగా ఉండి మీరేమీ చెయ్యలేరు. 6 నాలో ఉండని వాళ్ళు కొమ్మవలే పారవేయబడతారు. అప్పుడు కొమ్మలు ఎండి పోతాయి. వాటిని ప్రోగుచేసి ప్రజలు మంటల్లో వేస్తారు. అవి కాలిపోతాయి. 7 మీరు నాలో, నా ఉపదేశాలు మీలో ఉంటే మీరు మీకిష్టమైన దేదైనా అడగండి. అది మీకిస్తాను. కోరింది జరుగుతుంది. 8 మీరు ఎక్కువ ఫలం ఫలించి నా శిష్యులుగా ఉంటే నా తండ్రి మహిమ వ్యక్తం చేసిన వాళ్ళౌతారు.
9 “నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమకు పాత్రులైఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమలో నిలిచియున్నట్లుగా మీరు నా ఆజ్ఞలకు లోబడినట్లైతే నా ప్రేమలో నిలిచియుంటారు. 11 నా ఆనందం మీరు కూడా పంచుకోవాలని, మీరు సంపూర్ణంగా ఆనందించాలని మీకీ విషయాలన్నీ చెప్పాను. 12 నా ఆజ్ఞ యిది: నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో, అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి. 13 స్నేహితుల కోసం ప్రాణాలివ్వటం కన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను ఆజ్ఞాపించినట్లు చేస్తే మీరు నా స్నేహితులు. 15 నేను యిక మీదటి నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను. ఎందుకంటే, సేవకునికి తన యజమాని చేస్తున్నదేమిటో తెలియదు. కాని నేను నా తండ్రి నుండి విన్న వాటినన్నిటిని మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులని అన్నాను.
16 “మీరు నన్ను ఎన్నుకో లేదు. నేను మిమ్మల్ని ఎన్నుకొన్నాను. మీరు వెళ్ళి చిరకాలం ఉండే ఫలమివ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమించాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రి మీకిస్తాడు. 17 ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది నా ఆజ్ఞ.
ప్రపంచం యొక్క ద్వేషం
18 “ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆ ప్రపంచం మీకన్నా ముందు నన్ను ద్వేషించిందన్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి. 19 మీరు ప్రపంచానికి చెందిన వాళ్ళైతే ఆ ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని తమ వాళ్ళుగా ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచంనుండి ఎన్నుకొన్నాను. కనుక యిప్పుడు మీరు ఈ ప్రపంచానికి చెందరు. అందుకే ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
20 “‘యజమాని కంటే సేవకుడు గొప్పకాదు’ అని నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు నన్నే హింసించారు. కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు. వాళ్ళు నా సందేశం పాటించి ఉంటే మీ సందేశం కూడా పాటిస్తారు. 21 నన్ను పంపింది ఎవరో వాళ్ళకు తెలియదు. కనుక నా పేరిట వెళ్ళిన మీ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారు. 22 నేను రాకుండా, వాళ్ళకు బోధించకుండా ఉండివుంటే పాపదోషము వాళ్ళ మీద ఉండేది కాదు. కాని ఇప్పుడు వాళ్ళు తమ పాపాల నుండి తప్పించుకోలేరు.
23 “నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించిన వానిగా పరిగణింపబడతాడు. 24 నేను వాళ్ళ కోసం ఎవరూ చేయని ఈ మహాత్కార్యాలు చేసివుండక పోయినట్లైతే వాళ్ళకు ఈ పాపం అంటి ఉండేది కాదు. కాని యిప్పుడు వాళ్ళు నా అద్భుతాన్ని చూసారు. అయినా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు. 25 కాని ధర్మశాస్త్రంలో, ‘వాళ్ళు నిష్కారణంగా నన్ను ద్వేషించారు’[a] అని వ్రాయబడింది. నెరవేరటానికి యిలా జరిగింది.
26 “నేను నా తండ్రి నుండి సత్య స్వరూపియైన ఆత్మను మీకు ఆదరణకర్తగా పంపుతాను. తండ్రిలో నుండి వచ్చిన ఈ ఆత్మ నన్ను గురించి సాక్ష్యమిస్తాడు. 27 మీరు నాతో మొదటి నుండి ఉన్న వాళ్ళు కనుక మీరు కూడా సాక్ష్యం చెప్పాలి.
12 ఒక మనిషి జ్ఞానము కలిగి ఉండాలి అనుకొంటే, అతడు తప్పు చేసినప్పుడు దానిని ఎవరైనా అతనికి చెప్పగా అతనికి కోపంరాదు. తాను చేసింది తప్పు అని ఎవరైనా తనకు చెప్పటం ఇష్టంలేని మనిషి మూర్ఖుడు.
2 మంచి మనిషి విషయం యెహోవా సంతోషిస్తాడు. కాని దుర్మార్గుణ్ణి దోషిగా యెహోవా తీర్పుర్చు చెబుతాడు.
3 దుర్మార్గపు మనిషి ఎన్నడూ క్షేమంగా ఉండడు. అయితే మంచి మనుష్యులు సురక్షితంగా ఉండగలరు.
4 మంచి భార్య విషయమై భర్త సంతోషించి అతిశయిస్తాడు. కాని ఒక స్త్రీ తన భర్తను అవమానిస్తే, అప్పుడు ఆమె అతని శరీరంలో ఒక వ్యాధిలా ఉంటుంది.
5 మంచి మనుష్యులు తాము చేయాలని తలపెట్టే విషయాల్లో నిజాయితీగా, న్యాయంగా ఉంటారు. కాని దుర్మార్గుడు నీతో చెప్పే విషయాలను నమ్మవద్దు.
6 దుర్మార్గుల మాటలు రక్తంకోసం పొంచి వుంటాయి. కాని మంచి మనుష్యుల మాటలు వారిని అపాయం నుండి తప్పిస్తాయి.
7 దుర్మార్గులు నాశనం చేయబడగా ఇంకేమీ మిగులదు. అయితే మంచి మనుష్యులు వెళ్లిపోయిన తరువాత చాలా కాలం వరకు మనుష్యులు వారిని జ్ఞాపకం చేసికొంటారు.
8 జ్ఞానము గల మనిషిని ప్రజలు పొగుడుతారు. కాని మూర్ఖుడైన మనిషిని ప్రజలు గౌరవించరు.
9 భోజనం లేకపోయినా, ప్రముఖునిలా నటించే మనిషిలా ఉండటంకంటె, ప్రముఖుడు కాకపోయినా కష్టపడి పనిచేసే మనిషిలా ఉండటం మేలు.
10 మంచి మనిషి తన పశువుల విషయం శ్రద్ధ తీసుకొంటాడు. కాని దుర్మార్గులు దయగా ఉండలేరు.
11 తన పొలంలో పనిచేసే రైతుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. కాని పనికిమాలిన ఆలోచనలతో సమయం వృధా చేసేవాడు బుద్ధిహీనుడు.
12 దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు పసులు చేయాలని చూస్తుంటారు. కాని మంచివాళ్లకు చెట్ల వేర్లవలెలోతుకు చొచ్చుకొనిపోయే బలం ఉంటుంది.
13 దుర్మార్గుడు తెలివి తక్కువ విషయాలు మాట్లాడి, తన మాటలచేత పట్టుబడతాడు. కాని మంచి మనిషి అలాంటి కష్టం నుండి తప్పించుకొంటాడు.
14 ఒక వ్యక్తి తాను చెప్పే మంచి విషయాల మూలంగా బహుమానం పొందుతాడు. అదే విధంగా అతడు చేసే పనివల్ల అతనికి లాభం కలుగుతుంది.
15 బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన స్వంత విధానమే మంచిదని తలస్తాడు. కాని జ్ఞానముగలవాడు ఇతరులు తనతో చెప్పే మాటలు వింటాడు.
16 బుద్ధిహీనుడు త్వరగా కలవరం చెందుతాడు. అయితే ఇతరులు ఏదైనా తప్పు చెప్పినప్పుడు తెలివిగలవాడు త్వరగా క్షమిస్తాడు.
17 ఒక వ్యక్తి సత్యం చెబితే, అతడు చెప్పే విషయాల్లో నిజాయితీ గలవాడే. కాని ఒకడు అబద్ధాలు గనుక చెబితే, అది కష్టాలకు దారి తీస్తుంది.
18 ఒక వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడితే, అప్పుడు ఆ మాటలు ఖడ్గంలా బాధించవచ్చు. అయితే జ్ఞానముగలవాడు అతడు చెప్పే విషయాల గూర్చి జాగ్రత్తగా ఉంటాడు. అతని మాటలు ఆ బాధను నయం చేయవచ్చును.
19 ఒక వ్యక్తి అబద్ధం చెబితే, ఆ మాటలు వేగంగా వ్యర్థం అవుతాయి. కాని సత్యం శాశ్వతంగా జీవిస్తుంది.
20 దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టం కలిగించాలని కోరుకొంటారు. అయితే శాంతికోసం పని చేసేవారు సంతోషంగా ఉంటారు.
21 మంచి మనుష్యులు యెహోవా చేత క్షేమంగా కాపాడబడుతారు. కాని చెడ్డవాళ్లకు చాలా కష్టాలు ఉంటాయి.
22 అబద్ధాలు చెప్పే వాళ్లంటే యెహోవాకు అసహ్యం. అయితే సత్యం చెప్పే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం.
23 చురుకైనవాడు తనకు తెలిసిన అన్ని విషయాలూ చెప్పడు. కాని బుద్ధిహీనుడు అన్నీ చెప్పి, తాను బుద్ధిహీనుడను అని చూపెట్టుకొంటాడు.
24 కష్టపడి పనిచేసే మనుష్యులు ఇతరుల మీద అధికారులుగా నియమించబడుతారు. అయితే సోమరి బానిసలా పనిచేయాల్సి ఉంటుంది.
25 చింతించటం ఒక మనిషి సంతోషాన్ని తీసివేయగలదు. కాని దయగల ఒక మాట ఒక మనిషిని సంతోష పెట్టగలదు.
26 మంచివాడు తన చుట్టూవున్న వాళ్లకంటే ఎక్కువ పొందుతాడు. దుర్మార్గుల చెడు నడతలే వాళ్లను చెడు మార్గాలలో పెట్టి, విజయం నుండి తప్పిస్తాయి.
27 బద్ధకస్తుడు తాను కోరుకొనే వాటి వెనుక వెళ్లడు. కాని కష్టపడి పనిచేసే వానికి ఐశ్వర్యాలు వస్తాయి.
28 నీవు సరైన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి మార్గం.
5 మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. 2 క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.
3 కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. 4 అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. 5 ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు.
6 వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. 7 వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. 8 ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. 9 ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. 10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. 11 చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి. 12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. 13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. 14 వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది:
“నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో!
బ్రతికి లేచిరా!
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”
15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 18 మత్తు పదార్థాలు త్రాగుతూ, త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. 19 స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ, స్తుతిగీతాలు, పాటలు పాడండి. 20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.
భార్యాభర్తలు
21 మీకు క్రీస్తు పట్ల భయభక్తులు ఉన్నాయి. కనుక ఒకరికొకరు లోబడి ఉండండి.
22 స్త్రీలు మీరు ప్రభువుపట్ల విశ్వాసం కనబరచండి. అలాగే మీ భర్తలపట్ల కూడా గౌరవము కనబరుస్తూ జీవించండి. 23 క్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘము ఆయనకు శరీరంలాంటిది. ఆయన దాన్ని రక్షిస్తున్నాడు. అదే విధంగా భర్త భార్యకు శిరస్సులాంటివాడు. 24 సంఘం క్రీస్తుకు విధేయతగా ఉన్నట్లే భార్య తన భర్తకు అన్ని విషయాల్లో విధేయతగా ఉండాలి.
25 క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను అర్పించుకున్నట్లే భర్త తన భార్యను ప్రేమించి తనను అర్పించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. 26 క్రీస్తు తన సంఘాన్ని పవిత్రం చేయాలని తనను తాను అర్పించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుని వాక్యమను నీళ్ళతో కడిగాడు; సువార్త సందేశంతో దాన్ని శుద్ధీకరించాడు. 27 దాన్ని తేజోవంతంగా, పవిత్రంగా మరకా మచ్చా లేకుండా, మరే తప్పూ లేకుండా, అపకీర్తి లేకుండా చేసేందుకు ఆ సంఘం కోసం తనకు తానే అర్పించుకొన్నాడు.
28 అదే విధంగా భర్త తన భార్యను తన శరీరంగా భావించి ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తే తనను తాను ప్రేమించుకొన్నదానితో సమానము. 29 సహజంగా ఎవ్వరూ తమ శరీరాన్ని ద్వేషించరు. అందరూ తమ శరీరాన్ని పోషించుకొంటూ రక్షించుకొంటారు. 30 అదే విధంగా మనము క్రీస్తు శరీరంలో భాగాలము. కనుక ఆయన సంఘంగా ఉన్న మనల్ని ఆయన పోషించి రక్షిస్తాడు. 31 “ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.”(A) 32 ఇది గొప్ప రహస్యం. కాని నేను క్రీస్తును గురించి, ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. 33 ఏది ఏమైనా ప్రతి ఒక్కడూ తనను తాను ప్రేమించుకొన్నంతగా తన భార్యను ప్రేమించాలి. భార్య తన భర్తను గౌరవించాలి.
© 1997 Bible League International