M’Cheyne Bible Reading Plan
సబ్బాతు నియమాలు
35 ఇశ్రాయేలు ప్రజలందర్నీ మోషే సమావేశ పర్చాడు. మోషే వారితో చెప్పాడు: “మీరు చేయాలని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలు నేను మీకు చెబుతాను.
2 “పని చేయడానికి ఆరు రోజులున్నాయి. అయితే ఏడో రోజు మీకు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. ఆ ప్రత్యేక దినాన విశ్రాంతి తీసుకోవడంవల్ల మీరు యెహోవాను ఘనపరుస్తారు. ఏడో రోజున పనిచేసే వ్యక్తిని చంపెయ్యాలి. 3 సబ్బాతు రోజున మీరు నివసించే స్థలాల్లో నిప్పు కూడ రాజబెట్టకూడదు.”
పవిత్ర గుడారము కొరకు వస్తువులు
4 ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఆజ్ఞాపించినది ఇదే. 5 యెహోవా కోసం ప్రత్యేక కానుకలు సమకూర్చండి. మీరు ఏమి ఇస్తారో మీలో ప్రతి ఒక్కరూ మీ హృదయంలో తీర్మానం చేసుకోవాలి. అప్పుడు ఆ కానుక యెహోవా కోసం తీసుకుని రావాలి. బంగారం, వెండి, ఇత్తడి. 6 నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట, శ్రేష్ఠమైన సన్నటి బట్ట, మేక బొచ్చు. 7 ఎరుపు రంగు వేసిన గొర్రె తోళ్లు, మంచి చర్మాలు, తుమ్మ కర్ర, 8 దీపాల కోసం ఒలీవ నూనె, అభిషేక తైలం కోసం పరిమళ ద్రవ్యాలు, సువాసన ధూపంకోసం పరిమళ ద్రవ్యాలు, 9 లేతపచ్చ రాళ్లు, యితర నగలు కానుకలుగా తీసుకు రావాలి. యాజకులు ధరించే ఏఫోదు, న్యాయ తీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు, నగలు అమర్చబడుతాయి.
10 “నైపుణ్యంగల వాళ్లందరూ యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ చేయాలి. (యెహోవా ఆజ్ఞాపించిన వస్తువులు ఇవి): 11 పవిత్ర గుడారం, దాని బయటి గుడారం, దాని కప్పు, కొక్కీలు, చట్రాలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, 12 ఒడంబడిక పవిత్ర పెట్టె, దాని కర్రలు, పెట్టెను మూసే దాని మూత, పెట్టె ఉండే చోటును కప్పి ఉంచే తెర 13 బల్ల, దాని కర్రలు, బల్ల మీద వస్తువులన్నీ, బల్ల మీద ఉండే ప్రత్యేక రొట్టె, 14 వెలుగు కోసం ఉపయోగించే దీప స్తంభం, దీప స్తంభానికి సంబంధించిన వస్తువులన్నీను, దీపాలు, దీపానికి నూనె, 15 ధూపం వేసేందుకు బలిపీఠం, దాని కర్రలు, అభిషేక తైలం, సువాసన గల ధూపద్రవ్యాలు, పవిత్ర గుడారం, ప్రవేశం దగ్గర ద్వారాన్ని కప్పి ఉంచే తెర, 16 అర్పణలు దహించే బలిపీఠం, దాని ఇత్తడి రేకు, కర్రలు, బలిపీఠం దగ్గర ఉపయోగించే అన్ని వస్తువులు, గంగాళం, దాని పీట, 17 ఆవరణపు తెరలు, వాటి కర్రలు, దిమ్మలు, ఆవరణ ద్వారపు తెర 18 గుడారం, ఆవరణ గుడారం పట్టి ఉంచే మేకులు, మేకులకు కట్టే తాళ్లు, 19 పరిశుద్ధ స్థలంలో యాజకులు ధరించే ప్రత్యేక నేత వస్త్రాలు. యాజకుడైన అహరోను, అతని కుమారులు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలు ఇవి. వాళ్లు యాజకులుగా సేవ చేసేటప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు.”
ప్రజల మహా గొప్ప అర్పణ
20 అప్పుడు ప్రజలంతా మోషే దగ్గర్నుంచి వెళ్లిపోయారు. 21 ఇవ్వాలి అనుకొన్న ప్రజలంతా వచ్చి యెహోవాకు కానుక తెచ్చారు. సన్నిధి గుడారం, గుడారంలోని సమస్త సామగ్రి, ప్రత్యేక వస్త్రాలు చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి. 22 ఇవ్వాలనుకున్న స్త్రీ పురుషులంతా అన్ని రకాల బంగారు వస్తువులు తెచ్చారు. ముక్కుకమ్ములు, చెవిపోగులు, ఉంగరాలు, ఇతర బంగారు వస్తువులు వారు తీసుకు వచ్చారు. వాళ్లంతా వారి బంగారాన్ని యెహోవాకు ఇచ్చారు. ఇది యెహోవాకు ప్రత్యేక అర్పణ.
23 నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు బట్ట ఉన్న ప్రతి వ్యక్తీ వాటిని యెహోవా కోసం తెచ్చాడు. మేక బొచ్చు, లేక ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలు లేక నాణ్యమైన తోలు ఉన్నవారు ఎవరైనా సరే వాటిని యెహోవా కోసం తెచ్చారు. 24 వెండిని లేక ఇత్తడి ఇవ్వాలనుకున్న ప్రతి వ్యక్తి వచ్చి, దానిని యెహోవాకు కానుకగా తెచ్చారు. తుమ్మకర్ర ఉన్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా ఇచ్చాడు. 25 నిపుణతగల ప్రతి స్త్రీ నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట తయారు చేసింది. 26 సహాయం చేయాలనుకొన్న నైపుణ్యంగల స్త్రీలంతా మేక వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేసారు.
27 పెద్దలు లేతపచ్చలు, ప్రశస్తమైన ఇతర రాళ్లు తెచ్చారు. యాజకుని ఏఫోదు, న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు రత్నాలు అమర్చబడ్డాయి. 28 సుగంధ ద్రవ్యాలు, ఒలీవ నూనె కూడ ప్రజలు తెచ్చారు. సువాసనగల పరిమళ ద్రవ్యం, అభిషేక తైలం, దీపాల నూనె కోసం ఉపయోగించబడ్డాయి.
29 సహాయం చేయాలనుకొన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహవాకు కానుకలు తెచ్చారు. ఈ కానుకలు ఉచితం, మరియు ప్రజలు ఇవ్వాలనుకొన్నారు గనుక వాటిని ఇచ్చారు. మోషేకు, ప్రజలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి.
బెసలేలు, అహోలీయాబు
30 అప్పుడు ప్రజలతో మోషే ఇలా అన్నాడు: “చూడండి, యూదా గోత్రానికి చెందిన ఊరు కుమారుడు బెసలేలును యెహోవా ఏర్పరచుకొన్నాడు. (హోరు కుమారుడు ఊరు). 31 బెసలేలును యెహోవా తన ఆత్మతో నింపాడు. అన్ని రకాల పనులు చేయడానికి యెహోవా అతనికి నైపుణ్యం ఇచ్చాడు. 32 అతడు నమూనాలు చేసి బంగారం, వెండి, ఇత్తడితో వస్తువులు చేయగలడు. 33 ప్రశస్తమైన రాళ్లను రత్నాలను చెక్కిసానబెట్టగలడు. బెసలేలు చెక్కపని చేసి అన్ని రకాల వస్తువులు తయారు చేయగలడు. 34 ఇతరులకు నేర్పించగల నైపుణ్యాన్ని బెసలేలుకు, అహోలీయాబుకు దేవుడు యిచ్చాడు. (దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడు అహోలీయాబు). 35 అన్ని రకాల పనులు చేయటానికి ప్రత్యేక నైపుణ్యాన్ని యెహోవా వారికి ఇచ్చాడు. వడ్లవాని పనులు, లోహపు పనులు వారు చేయగలరు. నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు, నాణ్యమైన బట్టల మీద బుట్టా పని వారు చేయగలరు. ఉన్ని వస్త్రాలను వారు నేయగలరు.
యేసు తన శిష్యులను ఆదరించటం
14 “మీరు ఆందోళన చెందకండి. దేవుణ్ణి నమ్మండి. నన్ను కూడా నమ్మండి. 2 నా తండ్రి యింట్లో ఎన్నో గదులున్నాయి. అలా లేక పోయినట్లైతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము నేర్పాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం. 4 నేను వెళ్ళే చోటికి వచ్చే దారి మీకు యిదివరకే తెలుసు” అని యేసు అన్నాడు.
5 తోమా ఆయనతో, “ప్రభూ! మీరు వెళ్ళే చోటు ఎక్కడుందో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకా దారి ఏ విధంగా తెలుస్తుంది?” అని అన్నాడు.
6 యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే! నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు. 7 నేను ఎవరో మీకు నిజంగా తెలిసివుంటే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. ఆయనెవరో మీకు తెలుసు” అని సమాధానం చెప్పాడు.
8 ఫిలిప్పు, “ప్రభూ! మాకు తండ్రిని చూపండి. అది చాలు” అని అన్నాడు.
9 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను యింత కాలం మీతో కలిసి ఉన్నాను కదా! అయినా నేనెవరినో నీకు తెలియదా ఫిలిప్పు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అలాగైతే తండ్రిని చూపుమని ఎందుకు అడుగుతున్నావు? 10 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నాడని, నీవు నమ్మటం లేదా? నేను చెప్పే మాటలు నా స్వంతవి కావు. నాలో నివసిస్తున్న తండ్రి తన పనిని చేస్తున్నాడు. 11 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నామని నమ్మండి. లేక మహాత్కార్యాలు చూసైనా నమ్మండి.
12 “ఇది నిజం. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నన్ను నమ్మిన ప్రతి ఒక్కడూ నేను చేసిన కార్యాలు చేస్తాడు. వీటికన్నా యింకా గొప్ప కార్యాలే చేస్తాడు. 13 కుమారుని ద్వారా తండ్రి మహిమ పొందటానికి మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను. 14 నా పేరిట నన్ను ఏమడిగినా నేను చేస్తాను.
పవిత్రాత్మ వాగ్దానం
15 “మీకు నా మీద ప్రేమ ఉంటే నేను ఆజ్ఞాపించినట్లు చేస్తారు. 16-17 మీతో చిరకాలం ఉండి, మీకు సహాయం చెయ్యటానికి మరొక ఉత్తరవాదిని[a] పంపుమని నేను తండ్రిని అడుగుతాను. ఆయన ఆత్మను పంపుతాడు. ఆ పవిత్రాత్మ సత్యాన్ని ప్రకటించటం తన కర్తవ్యం. ప్రపంచం ఆయన్ని చూడలేదు. ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కనుక ఆయన్ని అంగీకరించలేదు. ఆయన మీతో ఉన్నాడు కనుక మీకు ఆయన గురించి తెలుసు. ఆయన భవిష్యత్తులో మీతో ఉంటాడు. లోకం ఆయన్ని అంగీకరించలేదు, ఎందుకంటే అది ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు.
18 “నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. మీ దగ్గరకు తిరిగి వస్తాను. 19 కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో అదే విధంగా మీరు కూడా జీవిస్తారు. 20 ఆ రోజు నేను తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న విషయం మీరు గ్రహిస్తారు. 21 నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్షమౌతాను.”
22 అప్పుడు యూదా (యూదా ఇస్కరియోతు కాదు), “కాని ప్రభూ! మీరు మాకు మాత్రమే ప్రత్యక్షమై, ప్రపంచానికి ప్రత్యక్షంకానని ఎందుకంటున్నారు?” అని అన్నాడు.
23 యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము. 24 నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.
25 “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 26 తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు.
27 “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి. 28 నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29 ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను.
30 “ఈ లోకాధికారి రాబోతున్నాడు. అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు నన్నేమీ చెయ్యలేడు. 31 కాని నాకు తండ్రిపై ప్రేమ ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే యిలా చేస్తున్నాను.
“రండి, యిక్కడి నుండి వెళ్దాం!”
11 వస్తువులను సరిగ్గా తూచలేని త్రాసులను కొందరు మనుష్యులు ఉపయోగిస్తారు. మనుష్యులను మోసం చేయటానికి వారు ఆ త్రాసులను ఉపయోగిస్తారు. ఆ తప్పుడు త్రాసులు యెహోవాకి అసహ్యం. కాని సరిగ్గా ఉండే త్రాసులు యెహోవాకు ఇష్టం.
2 గర్వించి, గొప్పలు చెప్పుకొనే మనుష్యులు ఎన్నిక లేని వారవుతారు. కాని దీనులు జ్ఞానముగల వారవుతారు.
3 మంచి, నిజాయితీగల మనుష్యులు నిజాయితీ పంథాను అనుసరిస్తారు. కాని దుర్మార్గులు ఇతరులను మోసం చేసినప్పుడు వారిని వారే నాశనం చేసుకొంటారు.
4 దేవుడు మనుష్యులకు తీర్పు తీర్చేనాడు, డబ్బుకి విలువ ఏమీ ఉండదు. కాని మంచితనం మనుష్యులను మరణం నుండి రక్షిస్తుంది.
5 ఒక మంచి మనిషి గనుక నిజాయితీగా ఉంటే, అతని జీవితం సులభంగా ఉంటుంది. కాని దుర్మార్గుడు అతడు చేసే చెడు పనుల మూలంగా నాశనం చేయబడతాడు.
6 నిజాయితీగల మనిషిని మంచితనం రక్షిస్తుంది. కాని దుర్మార్గులు వారు చేయాలనుకొన్న చెడు విషయాల ఉచ్చులో పట్టుబడతారు.
7 దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతనికి నిరీక్షణ ఏమీలేదు. అతడు ఆశించినది అంతా పోతుంది అదంతా మొత్తం ఏ విలువలేనిది అవుతుంది.
8 మంచి మనిషి కష్టాన్ని తప్పించుకొంటాడు. ఆ కష్టం మరొక దుర్మార్గునికి సంభవిస్తుంది.
9 ఒక దుర్మార్గుడు చెప్పే విషయాల మూలంగా అతడు ఇతరులను బాధించగలడు. కాని మంచి మనుష్యులు వారి జ్ఞానము చేత కాపాడబడుతారు.
10 మంచి మనుష్యులకు విజయం కలిగినప్పుడు పట్టణం అంతా సంతోషిస్తుంది. దుర్మార్గులు నాశనం చేయబడినప్పుడు ప్రజలు సంతోషంతో కేకలు వేస్తారు.
11 నిజాయితీగల మనుష్యులు వారు నివసిస్తున్న పట్టణానికి తమ దీవెనలు ఇచ్చినప్పుడు, అది గొప్పది అవుతుంది. కాని ఒక దుర్మార్గుడు చెప్పే విషయాలు ఒక పట్టణాన్ని నాశనం చేయగలవు.
12 బుద్ధిహీనుడు ఇతరులను విమర్శిస్తాడు. అయితే జ్ఞానముగలవానికి ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు.
13 ఇతరులను గూర్చి రహస్యాలు చెప్పే వారెవరూ నమ్మదగినవారు కారు. కాని నమ్మదగిన మనిషి చెప్పుడు మాటలను వ్యాపింపచేయడు.
14 ఒక దేశానికి సమర్ధత లేని నాయకులు ఉంటే, ఆ దేశం పతనం అవుతుంది. అయితే అనేకమంది మంచి సలహాదారులు ఆ దేశాన్ని క్షేమంగా ఉంచుతారు.
15 ఇంకో మనిషి బాకీ నీవు చెల్లిస్తానని వాగ్దానం చేస్తే, అప్పుడు నీవు విచారిస్తావు. అలాంటి వ్యవహారాలను నీవు తిరస్కరిస్తే నీవు క్షేమంగా ఉంటావు.
16 దయగల, మర్యాదస్థురాలు గౌరవం సంపాదిస్తుంది. చొచ్చుకుపోయే పురుషులు ధనం మాత్రమే సంపాదిస్తారు.
17 దయగల మనిషి లాభం పొందుతాడు. కాని నీచుడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు.
18 దుర్మార్గుడు మనుష్యులను మోసం చేసి, వారి డబ్బు తీసుకొంటాడు. అయితే న్యాయంగా ఉండి, సరైనది చేసేవాడు నిజమైన బహుమానం పొందుతాడు.
19 నిజంగా, మంచితనం జీవాన్ని తెచ్చిపెడ్తుంది. కాని దుర్మార్గులు దుర్మార్గాన్ని వెంటాడి, మరణం తెచ్చుకొంటారు.
20 దుర్మార్గం చేయటానికి ఇష్టపడే వాళ్లు యెహోవాకు అసహ్యం. అయితే మంచిని చేసేందుకు ప్రయత్నించే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం.
21 దుర్మార్గులు నిశ్చయంగా శిక్షించబడతారు అనేది సత్యం. మంచివాళ్లు స్వతంత్రులుగా చేయబడతారు.
22 ఒక స్త్రీ అందంగా ఉండి, అవివేకంగా ఉంటే అది అందమైన బంగారు ఉంగరం పంది ముక్కుకు ఉన్నట్టే ఉంటుంది.
23 మంచి మనుష్యులకు వారు కోరింది లభించినప్పుడు దాని అంతం ఎల్లప్పుడూ మంచిదిగానే ఉంటుంది. కాని దుర్మార్గులకు వారు కోరింది లభించినప్పుడు, చివరికి అది చిక్కుగానే ఉంటుంది.
24 ఒక మనిషి ధారాళంగా ఇస్తే, అప్పుడు అతనికి అంతకంటే ఎక్కువ లభిస్తుంది. కాని ఒకడు ఇచ్చేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు దరిద్రుడు అవుతాడు.
25 ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పొందుతాడు. నీవు యితరులకు సహాయం చేస్తే, అప్పుడు నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.[a]
26 తన ధాన్యం అమ్మేందుకు నిరాకరించే దురాశగల మనిషి మీద ప్రజలు కోపగిస్తారు. అయితే ఇతరులకు ఆహారం పెట్టేందుకు తన ధాన్యం అమ్మేవాని విషయంలో ప్రజలు సంతోషిస్తారు.
27 మంచిని చేయుటకు ప్రయత్నించే మనిషిని ప్రజలు గౌరవిస్తారు. కాని దుర్మార్గం చేసే మనిషికి కష్టం మాత్రమే వస్తుంది.
28 తన ఐశ్వర్యాలను నమ్ముకొనే మనిషి పడిపోతాడు. కాని, మంచి మనిషి పచ్చటి చిగురాకులా పెరుగుతాడు.
29 ఒక మనిషి గనుక తన కుటుంబానికి కష్టం కలిగిస్తే అతనికి లాభం ఏమీ కలుగదు. చివరికి బుద్ధిహీనుడు జ్ఞానముగల మనిషికి సేవ చేయుటకు బలవంతం చేయబడతాడు.
30 మంచి మనిషి చేసే విషయాలు జీవవృక్షంలా ఉంటాయి. ఒక జ్ఞానముగల మనిషి ప్రజలకు కొత్త జీవితం ఇస్తాడు.
31 మంచి మనుష్యులకు భూమి మీద ప్రతిఫలం ఇవ్వబడితే, నిశ్చయంగా దుర్మార్గులు, పాపులు వారికి తగిన దానిని పొందుతారు.
క్రీస్తు దేహంలో ఐక్యత
4 ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించమని ప్రభువు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2 అన్ని వేళలా విధేయతగా, శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతర్ల తప్పులను ప్రేమతో క్షమించండి. 3 శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. 4 శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. 5 ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే. 6 ఆయనే అందరికి తండ్రి. అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా పని చేస్తున్నాడు.
7 క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది. 8 అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:
“ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు.
మానవులకు వరాలిచ్చాడు.”(A)
9 “ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగి నాడనే అర్థం కదా! 10 క్రిందికి దిగినవాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి సమస్తమును నింపి వేసాడు. 11 పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. 12 అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. 13 కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు.
14 అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు ఇటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. 15 మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. 16 శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది.
వెలుగు పిల్లలుగా జీవించటం
17 ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కానివాళ్ళవలే జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి. 18 వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళలో ఉన్న మూర్ఖత కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్ళకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు. 19 వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు. 20 కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు. 21 మీరు యేసును గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకొన్నారు. 22 మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది. దాన్ని మరిచిపొండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పు దారి పట్టించాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. 23 మీ బుద్ధులు, మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి. 24 దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి.
25 మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. 26 మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. 27 సాతానుకు అవకాశమివ్వకండి. 28 దొంగలు యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేదవాళ్ళకు సహాయం చెయ్యగలుగుతారు.
29 దుర్భాషలాడకండి. ఇతర్ల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్నవాళ్ళకు లాభం కలగాలి. 30 మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. 31 మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. 32 దయాదాక్షిణ్యాలు అలవరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.
© 1997 Bible League International