Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 33

నేను మీతో రాను

33 అయితే మోషేతో యెహోవా యిలా అన్నాడు: “ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన నీ ప్రజలూ, నీవూ ఇక్కడనుండి వెళ్లిపోవాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశానికి వెళ్లండి. నేను వాళ్లకు వాగ్దానం చేసాను. మీ సంతానమునకు ఆ దేశాన్ని ఇస్తానని నేను చెప్పాను. మీకు ముందు వెళ్లడానికి ఒక దూతను నేను పంపిస్తాను. కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను పెరిజ్జీయులను. హివ్వీయులను, యెబూసీయులను నేను ఓడిస్తాను. ఆ ప్రజలు మీ దేశాన్ని విడిచిపెట్టేసేటట్టు బలవంతం చేస్తాను. కనుక అనేక మంచి వాటితో నిండిన దేశానికి వెళ్లండి. కానీ నేను మీతో రాను. మీరు చాలా మొండివారు. నేను మీతో వస్తే మార్గంలో కోపంవచ్చి మిమ్మల్ని నేను నాశనం చేయవల్సి వస్తుందేమో.”

ఈ దుర్వార్తను ప్రజలు విని చాలా విచారించారు. దీని తర్వాత ప్రజలు నగలు పెట్టుకోలేదు. “మీరు మొండివారు నేను మీతో కొంచెంసేపు ప్రయాణం చేసినా సరే నేను మిమ్మల్ని నాశనం చేయాల్సి వస్తుంది. కనుక మీ నగలన్నీ తీసి వేయండి. అప్పుడు మీ విషయం ఏమి చేయాలో నేను ఆలోచిస్తాను” అని మోషేతో యెహోవా చెప్పినందువల్ల వారు నగలు ధరించలేదు. కనుక హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు వారి నగలన్నీ తీసి వేసారు.

తాత్కాలిక సన్నిధి గుడారం

గుడారాన్ని, నివాస డేరాలకు కొంత దూరం బయటకు జరిపాడు మోషే. “సన్నిధి గుడారం” అని మోషే దానికి పేరు పెట్టాడు. ఏ వ్యక్తిగాని యెహోవాను ఏదైనా అడగాలంటే, నివాస డేరాలకు వెలుపల ఉన్న సన్నిధి గుడారానికి వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడైనా సరే, బయటకు ఆ గుడారానికి మోషే వెళ్తే ప్రజలంతా అతన్ని గమనిస్తూ ఉండేవారు. ప్రజలంతా వారి గుడారపు ద్వారం దగ్గర నిలబడి మోషే సన్నిధి గుడారంలో ప్రవేశించేవరకు అతణ్ణి గమనించి చూస్తుండేవారు. మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లినప్పుడల్లా స్తంభంలా నిలువుగా ఉన్న మేఘం నిలిచి ఉండేది. ఈ విధంగా మోషేతో యెహోవా మాట్లాడతాడు. 10 సన్నిధి గుడారపు ద్వారం దగ్గర మేఘాన్ని చూడగానే ప్రజలు యెహోవాను ఆరాధించుటకు సాష్టాంగపడేవారు.

11 మోషేతో ముఖాముఖీగా యెహోవా మాట్లాడాడు. ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో యెహోవా మాట్లాడాడు. దేవునితో మాట్లాడిన తర్వాత, మోషే ఎప్పుడూ బసకు వెళ్లిపోయేవాడు. నూను కుమారుడైన యెహోషువ అనే ఒక యువకుడు మోషేకు సహాయకుడు. మోషే సన్నిధి గుడారం వదిలినప్పుడల్లా యెహోషువ సన్నిధి గుడారంలో నిలిచి ఉండేవాడు.

యెహోవా మహిమను మోషే చూశాడు

12 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “ఈ ప్రజల్ని నడిపించమని నీవు చెప్పావు. నాతో ఎవర్ని నీవు పంపిస్తావో నీవు చెప్పలేదు. ‘నీవు నాకు బాగా తెలుసు. నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను.’ అని నీవు నాతో చెప్పావు. 13 నిజంగా నేను నీకు ఆనందం కలిగించి ఉంటే, నీ మార్గాలు నాకు బోధించు. నేను నిన్ను వాస్తవంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగైతే, నేను ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెడ్తూ ఉండగలుగుతాను. వీళ్లంతా నీ ప్రజలని జ్ఞాపకం ఉంచుకో.”

14 “నేను నీతో కూడా వస్తాను నేను మిమ్మల్ని నడిపిస్తాను” అని యెహోవా జవాబిచ్చాడు.

15 అప్పుడు మోషే ఆయనతో అన్నాడు: “నీవు మాతో రాకపోతే మాత్రం, మమ్మల్ని యిక్కడ నుండి పంపించి వేయకు. 16 మరియు నా విషయంలో, ఈ ప్రజల విషయంలో నీవు సంతోషిస్తున్నట్టు మాకెలా తెలుస్తుంది? నీవు మాతో కూడా వస్తే, అప్పుడు మాకు తెలుస్తుంది. నీవు మాతో రాకపోతే, ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర ప్రజలకంటే నేను, ఈ ప్రజలు ప్రత్యేకం కాదు.”

17 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు అడిగినట్టు నేను చేస్తాను. నీ పట్ల నాకు ఆనందం గనుక నేను ఇలా చేస్తాను. నీవు నాకు బాగా తెలుసు.”

18 అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు.

19 అప్పుడు యెహోవా జవాబిచ్చాడు: “నా మంచితనం అంతా నీ ముందు నడిచేటట్లు చేస్తాను. నేను యెహోవాను. నీకు వినబడేటట్టు నా పేరు నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించుకున్న వారికి ప్రేమ, దయ నేను చూపెడతాను. 20 కాని నా ముఖం నీవు చూడలేవు. ఏ మనిషీ నన్ను చూచి బ్రతకలేడు.

21 “అక్కడ నా దగ్గర ఒక చోట ఒక బండ వుంది. నీవు ఆ బండమీద నిలబడవచ్చు. 22 నా మహిమ ఆ స్థలాన్ని దాటి వెళ్తుంది. ఆ బండలోని ఒక పెద్ద సందులో నేను నిన్ను ఉంచి, నేను దాటి వెళ్లేటప్పుడు, నా చేతితో నిన్ను కప్పుతాను. 23 అప్పుడు నేను నా చేయిని తీసివేస్తాను. నీవు నా వెనుకవైపు చూస్తావు. కాని నా ముఖం మాత్రము నీవు చూడలేవు.”

యోహాను 12

యేసు బేతనియలో తన స్నేహితులతో

(మత్తయి 26:6-13; మార్కు 14:3-9)

12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.

4-5 యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు వీడే. యూదా, “ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు పేద వాళ్ళ కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు. యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.

యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది. మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.

లాజరుకు విరోధముగా కుట్ర

ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారు. 10-11 తద్వారా ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని పన్నాగం పన్నారు. ఎందుకంటే యితని కారణంగానే చాలామంది యూదులు యేసు దగ్గరకు వెళ్ళి ఆయన యందు నమ్మకం ఉంచారు.

యేసు యెరూషలేము ప్రవేశించటం

(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; లూకా 19:28-40)

12 మరుసటి రోజు పండుగ కోసం వచ్చిన గుంపు ఒకటి యేసు యెరూషలేంలోకి వస్తున్నాడని విన్నది. 13 వాళ్ళు ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని,

“హోసన్నా![a]
    ప్రభూవు పేరిట వచ్చిన ఇశ్రాయేలు రాజు ధన్యుడు!”(A)

అని కేకలు వేస్తూ ఆయన్ని కలవటానికి వచ్చారు.

14 యేసు ఒక గాడిద పిల్లను కనుగొని దానిపై కూర్చున్నాడు. ఈ సందర్భాన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

15 “సీయోను కుమారీ, భయపడకు!
    గాడిద పిల్లపై కూర్చొని
నీ రాజు వస్తున్నాడు చూడు!”(B)

16 ఇవి ఆయన శిష్యులకు అప్పుడు అర్థంకాలేదు. కాని యేసు మహిమ పొందిన తర్వాత ప్రవక్తలు ఆయన్ని గురించి వ్రాశారని గుర్తించారు. అంతేగాక తాము చేసిన వాటిని గురించి అర్థం చేసుకొన్నారు.

17 యేసు లాజరును సమాధినుండి లేచి రమ్మని పిలవటము, అతణ్ణి బ్రతికించటము చూసిన ప్రజలు ఆవార్త ప్రచారం చేసారు. 18 చాలా మంది ఆయన ఈ అద్భుతాన్ని చేసాడని విన్నందువలన ఆయన్ని కలుసు కోవటానికి వెళ్ళారు. 19 అందువలన పరిసయ్యులు పరస్పరం, “చూడండి! మనం గెలవటం లేదు. ప్రపంచమంతా అతని వెంట ఎట్లా వెళ్తున్నారో చూడండి!” అని మాట్లాడుకున్నారు.

జీవము, మరణముల గురించి యేసు మాట్లాడటం

20 పండుగ రోజు ఆరాధన చెయ్యటానికి వెళ్ళిన వాళ్ళల్లో గ్రీకులు కూడా ఉన్నారు. 21 వాళ్ళు ఫిలిప్పును కలుసుకొని, “అయ్యా! మేము యేసును చూడటానికి వచ్చాము” అని అన్నారు. ఫిలిప్పు, గలిలయలోని బేత్సయిదా అనే గ్రామానికి చెందిన వాడు. 22 ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ వెళ్ళి యేసుతో చెప్పారు.

23 యేసు ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది. 24 ఇది నిజం. గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. 25 తన ప్రాణాన్ని ప్రేమించే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు. 26 నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు.

యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం

27 “ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రీ నేనేమనాలి? ఈ గడియనుండి నన్ను రక్షించుమని అడగాలా? కాదు! నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా! 28 తండ్రీ నీ పేరుకు మహిమ కలిగించుకో.”

అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను యిదివరలో నా పేరుకు మహిమ కలిగించాను. మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను!” అని అన్నది.

29 అక్కడ నిలుచున్న ప్రజలు యిది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు.

మరి కొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు.

30 యేసు, “ఆ గొంతు మీ కోసం పలికింది. నా కోసం కాదు. 31 ఈ ప్రపంచంపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే సమయం వచ్చింది. 32 కాని దేవుడు నన్ను ఈ భూమ్మీదినుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందర్ని నా యొద్దకు ఆకర్షిస్తాను. వాళ్ళను నా దగ్గరకు పిలి పించుకుంటాను” అని అన్నాడు. 33 ఇది చెప్పి తాను ఏ విధంగా మరణించనున్నాడో సూచించాడు.

34 ప్రజలు, “మేము ధర్మశాస్త్రం ద్వారా ‘క్రీస్తు’ చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు మనుష్యకుమారుణ్ణి దేవుడు పైకెత్తుతాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనుష్యకుమారుడెవరు?” అని అన్నారు.

35 అప్పుడు యేసు వాళ్ళతో, “వెలుగు మీకోసం యింకా కొంత కాలం మాత్రమే ఉంటుంది. చీకటి రాకముందే, అంటే వెలుగు ఉండగానే ప్రయాణం సాగించండి. చీకట్లో నడిచే వ్యక్తికి తానెక్కడికి వెళుతున్నాడో తెలియదు. 36 వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు” అని అన్నాడు. యేసు మాట్లాడటం ముగించాక వాళ్ళకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళిపోయాడు.

యూదులు నిరాకరించటం

37 యేసు ఇన్ని మహాత్కార్యాలు వాళ్ళ సమక్షంలో చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వసం కలుగలేదు. 38 ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి యిలా జరిగింది:

“ప్రభూ! మా సందేశం ఎవరు విశ్వసించారు?
    ప్రభువు తన శక్తిని ఎవరికి చూపాడు?”(C)

39 అందుచేత వాళ్ళు విశ్వసించలేక పోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరొక చోట చెప్పినది నెరవేరునట్లు యిలా జరిగింది:

40 “ప్రభువు వాళ్ళ కళ్ళు కప్పి,
    వాళ్ళ హృదయాలు మూసి వేశాడు.
వాళ్ళు చూడరాదని, వాళ్ళు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశ్యం.
అలా చేయకపోతే వాళ్ళు నా వైపు మళ్లుతారు
    వాళ్ళకు నేను నయం చేయవలసివస్తుంది.”(D)

41 యెషయా యేసు మహిమను చూసాడు. కనుకనే ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు.

42 ఈ పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. 43 ఎందుకంటే, వీళ్ళకు దేవుని మెప్పుకన్నా ప్రజల పొగడ్తలంటే ఎక్కవ యిష్టం.

యేసు బోధ జనులకు తీర్పు తీర్చును

44 యేసు, “నన్ను విశ్వసించేవాడు, నన్నే కాక నన్ను పంపిన వానియందు కూడా విశ్వసిస్తాడు. 45 అతడు నన్ను చూసేటప్పుడు నన్ను పంపిన వానిని చూస్తున్నట్లే! 46 నేను ఈ ప్రపంచంలోకి వెలుగ్గా వచ్చాను! ఎందుకంటే నన్ను విశ్వసించేవాడు చీకటిలో ఉండ కూడదని. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రీ నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే.

47 “ఎవడైనను నా మాటలు విని వాటిని అనుసరించని వానికి నేను తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి తీర్పు తీర్చటానికి రాలేదు, కాని నేను రక్షించటానికి వచ్చాను. 48 నన్ను, నా మాటల్ని ఇష్టపడక వ్యతిరేకించేవానిపై ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నేను పలికిన మాటయే చివరి దినమున వానికి తీర్పుతీరుస్తుంది. 49 నేను నా యిష్ట ప్రకారం మాట్లాడలేదు, గాని నా తండ్రి ఏమి చెప్పుమని నాకు ఆజ్ఞాపించాడో అలాగే చెప్పాను. 50 ఆయన ఆజ్ఞ నిత్య జీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రి నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే” అని అన్నాడు.

సామెతలు 9

జ్ఞానము ఆహ్వానించుట

జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను. ఆమె (జ్ఞానము) భోజనం సిద్ధం చేసి, ద్రాక్షారసమును కలిపి, భోజనమును బల్లపైఉంచెను. అప్పుడు ఆమె (జ్ఞానము) తన సేవకులను, ప్రజలను నగరములోని ఎత్తయిన స్థలమునకు తనతో పాటు తినుటకు ఆహ్వానించెను. కొండ మీదికి వచ్చి, ఆమెతో కూడ భోజనం చేసేందుకు మనుష్యులను ఆహ్వానించుటకు తన సేవకులను ఊళ్లోనికి పంపింది. “నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న మనుష్యులారా, మీరు రండి” అని ఆమె చెప్పింది. బుద్దిహీనులను కూడా ఆమె పిలిచింది. “నా జ్ఞాన భోజనం ఆరగించండి, రండి. నేను చేసిన ద్రాక్షారసం తాగండి. మీ పాత బుద్ధిహీన పద్ధతులు విడిచి పెట్టండి. మీకు జీవం ఉంటుంది. తెలివిగల మార్గాన్ని అనుసరించండి” అని ఆమె చెప్పింది.

ఒక గర్విష్ఠికి, అతడు చేసింది తప్పు అని చూపించటానికి నువ్వు ప్రయత్నిస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. ఆ మనిషి దేవుని జ్ఞానము గూర్చి హేళన చేస్తాడు. ఒక దుర్మార్గుడిదే తప్పని నీవు చెబితే అతడు నిన్ను హేళన చేస్తాడు. కనుక ఒకడు ఇతరుల కంటే తాను మంచి వాడినని తలిస్తే అతనిది తప్పు అని అతనికి చెప్పవద్దు. దానివల్ల అతడు నిన్ను ద్వేషిస్తాడు. కాని జ్ఞానముగల ఒక మనిషికి సహాయం చేయటానికి నీవు ప్రయత్నిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు. జ్ఞానముగల ఒక మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా జ్ఞానము గలవాడవుతాడు. ఒకవేళ మంచి మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు.

10 యెహోవా యెడల భయము కలిగి యుండుట జ్ఞానము సంపాదించుటకు మొదటి మెట్టు. యెహోవాను గూర్చిన జ్ఞానము తెలివి సంపాదించుటకు మొదటి మెట్టు. 11 నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. 12 నీవు జ్ఞానివి అయితే నీ మంచి కోసమే నీవు జ్ఞానముగలవాడవు అవుతావు. కాని నీవు గర్వంగలవాడవై, యితరులను హేళన చేస్తే అప్పుడు నీ కష్టానికి నిన్ను నీవే నిందించుకోవాలి.

బుద్ధిహీనత—ఇతర స్త్రీ

13 బుద్ధిహీనుడు గట్టిగా అరిచే చెడు స్త్రీలాంటివాడు. ఆమెకు తెలివి లేదు. 14 ఆమె తన ఇంటి గుమ్మంలో కూర్చుంటుంది. పట్టణంలో కొండ మీద తన కుర్చీలో ఆమె కూర్చుంటుంది. 15 ప్రజలు ఆ ప్రక్కగా నడిచినప్పుడు ఆమె వారిని పిలుస్తుంది. ఆ మనుష్యులకు ఆమెయందు ఆసక్తి లేదు. కాని 16 “నేర్చుకోవాల్సిన ప్రజలారా, రండి” అని ఆమె అంటుంది. బుద్ధిహీనులను కూడ ఆమె ఆహ్వానించింది. 17 “మీరు నీళ్లు దొంగిలిస్తే అవి మీ స్వంత నీళ్లకంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. మీరు రొట్టెను దొంగిలిస్తే మీరు స్వయంగా తయారు చేసుకొనే రొట్టెకంటె అది ఎక్కువ రుచిగా ఉంటుంది” అని ఆమె చెబుతుంది. 18 ఆమె ఇల్లు దయ్యాలతో మాత్రమే నిండి వుందని ఆ బుద్ధిహీనులకు తెలియదు. మరణస్థానపు లోతుల్లోకి వారిని ఆహ్వానించింది!

ఎఫెసీయులకు 2

క్రీస్తులో పునర్జీవం

ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్లో, అతిక్రమాల్లో మరణించారు. అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించే వాళ్ళు. ఆ వాయుమండలాధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్ళలో ఇప్పుడూ పని చేస్తుంది. నిజానికి మనం కూడా మన మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంచల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తి పరుచుకుంటున్నవాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము.

కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది. మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. యేసు క్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి, తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు.

మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు. అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు. 10 దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.

మనము క్రీస్తులో ఒకటిగా ఉన్నాము

11 మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందినవాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 12 అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 13 కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు.

14 మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. 15 ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. 16 ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. 17 క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. 18 ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది.

19 అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. 20 మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. 21 ఆయనవల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము. 22 ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యితర్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International