Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 29

యాజకుల నియామకం, వేడుక

29 “అహరోను, అతని కుమారులు యాజకులుగా ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని తెలియజేసేందుకు నీవు చేయాల్సిన దానిని యిప్పుడు నీకు నేను చెబుతాను. ఒక గిత్తను, కళంకం లేని రెండు పొట్టేళ్లను సంపాదించు. తర్వాత పులియజేసే పదార్థంలేని సన్నని గోధుమ పిండితో రొట్టె చేయాలి. ఒలీవ నూనెతో కలిపి చేసే రొట్టెలకు గూడ అవే వస్తువులు ఉపయోగించాలి. నూనెతో కలిపి చిన్న చిన్న పల్చటి అప్పడాలు చేయాలి. ఈ రొట్టెలు, అప్పడాలు ఒక బుట్టలో పెట్టాలి. ఆ బుట్టను అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వాలి. అదే సమయంలో గిత్తను రెండు పొట్టేళ్లను కూడ వారికి ఇవ్వాలి.

“తర్వాత అహరోనును అతని కుమారులను సన్నిధి గుడారం ముందటి ద్వారం దగ్గరకు తీసుకు రావాలి. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి. అహరోనుకు అతని చొక్కా తొడిగించాలి. ప్రత్యేక ఏఫోదుతో వుండే అంగీని అతనికి ధరింపజేయాలి. అప్పుడు ఏఫోదును, న్యాయతీర్పు పైవస్త్రాన్ని అతనికి కట్టాలి. అందమైన దట్టీని అతనికి కట్టాలి. తర్వాత అతని తలమీద తలపాగ చుట్టాలి. ప్రత్యేక కిరీటాన్ని బంగారు బద్ద తలపాగా చుట్టూరా ఉంచాలి. అభిషేక తైలము తీసుకొని అతని తలమీద పోయాలి. అహరోను ఈ పనికి ఏర్పరచబడ్డాడని ఇది సూచిస్తుంది.

“తర్వాత అతని కుమారులను అక్కడికి తీసుకురావాలి. వారికి తెల్ల అంగీలు ధరింపజేయాలి. అప్పుడు వారి నడుములకు దట్టీలు చుట్టాలి. ధరించేందుకు ప్రత్యేక టోపీలను వారికి ఇవ్వాలి. వారు యాజకులుగా ఉండడం అప్పుడు ప్రారంభం అవుతుంది. శాశ్వతంగా కొనసాగే ప్రత్యేక చట్టంవల్ల వారు యాజకులుగా ఉంటారు. ఈ విధంగా అహరోనును, అతని కుమారులను నీవు యాజకులుగా చేయాలి.

10 “తర్వాత సన్నిధి గుడారం ఎదుటకు గిత్తను తీసుకురావాలి. అహరోను, అతని కుమారులు ఆ గిత్త తల మీద వారి చేతులు పెట్టాలి, 11 “అప్పుడు ఆ సన్నిధి గుడారం ఎదుట ఆ గిత్తను చంపాలి. దీనిని యెహోవా చూస్తాడు. 12 అప్పుడు గిత్త రక్తంలో కొంత తీసుకొని బలిపీఠం దగ్గరకు వెళ్లాలి. బలిపీఠం కొమ్ముల మీద నీ వేళ్లతో కొంచెం రక్తం చిలకరించాలి. మిగిలిన రక్తం అంతా బలిపీఠం అడుగున కుమ్మరించాలి. 13 తర్వాత గిత్త లోపలి కొవ్వు అంతా తీయాలి. కాలేయంలో కొవ్విన భాగాన్ని రెండు మూతగ్రంథులను వాటి చుట్టూ ఉండే కొవ్వును తీసి బలిపీఠం మీద దహించాలి. 14 తర్వాత గిత్త మాంసం, చర్మం, ఇతర భాగాలు తీసుకొని మీ పాళెము వెలుపటికి వెళ్లాలి. అక్కడ, పాళెము వెలుపల వీటిని కాల్చివేయాలి. ఇది యాజకుల పాపాలను తీసివేయు అర్పణ.

15 “తర్వాత పొట్టేళ్లలో ఒకదాని తలమీద తమ చేతులు పెట్టమని అహరోనుకు, అతని కుమారులకు చెప్పు. 16 అప్పుడు ఆ పొట్టేలును చంపి ఆ రక్తం భద్రం చేయాలి. ఆ రక్తాన్ని బలిపీఠం నలువైపుల వెదచల్లాలి. 17 అప్పుడు పొట్టేలును ముక్కలు ముక్కలుగా కోయాలి. పొట్టేలు లోపలి భాగాలను కాళ్లను కడగాలి. వీటిని పొట్టేలు తల ఇతరభాగాలతో కలిపి పెట్టాలి. 18 అప్పుడు ఆ మొత్తాన్ని బలిపీఠం మీద దహించి వేయాలి. ఇది దహించబడ్డ దహన బలి. ఇది యెహోవాకు అర్పించబడింది. యెహోవా అర్పణను వాసన చూస్తాడు. అది ఆయనకు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు అర్పించే అర్పణ.

19 “ఇంకో పొట్టేలు మీద వారి చేతులు వుంచమని అహరోనుకు, అతని కుమారులకు చెప్పు. 20 ఆ పొట్టేలును చంపి, దాని రక్తం భద్రం చేయాలి. అహరోనుకు, అతని కుమారులకు వారి కుడి చెవి కొనల మీద ఆ రక్తం చల్లాలి. ఇంక వారి కుడి చేతుల బొటన వేళ్ల మీద కొంత రక్తం ఉంచాలి. వారి కుడి పాదాల బొటన వేళ్లపై మరికొంత రక్తం ఉంచాలి. అప్పుడు బలిపీఠం మీద నాల్గువైపులా రక్తం చల్లాలి. 21 తర్వాత బలిపీఠం నుండి కొంత రక్తం తీసుకోవాలి. ప్రత్యేక తైలంతో దాన్ని కలిపి, అహరోను మీద, అతని బట్టల మీద దాన్ని చల్లాలి. ఆయన కుమారుల మీద, వారి బట్టల మీద దాన్ని చల్లాలి, అహరోను, అతని కుమారులు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది సూచిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, వారి బట్టలు ఉపయోగించబడుతాయని ఇది సూచిస్తుంది.

22 “అప్పుడు పొట్టేలు నుండి కొవ్వును తీయాలి. (అహరోనును ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించబడే పొట్టేలు ఇది). తోక చుట్టూ ఉండే క్రొవ్వును, శరీరం లోపలి భాగాలను కప్పివుండే కొవ్వును తీయాలి. కాలేయంలో క్రొవ్విన భాగాన్ని తీయాలి. మూతగ్రంధులు రెండింటిని, కుడి కాలును తీయాలి. 23 పులియని పదార్థం లేకుండా నీవు చేసిన రొట్టెలు గల బుట్టను తీసుకొని యెహోవా ముందు పెట్టాలి. బుట్టలోని రొట్టె ఒకటి, ఒలీవ నూనెతో చేసిన రొట్టె ఒకటి, పలుచని చిన్న అప్పడం ఒకటి బుట్టలో నుండి బయటికి తీయాలి. 24 అప్పుడు వీటిని అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వు. యెహోవా యెదుట వీటిని తమ చేతులతో పట్టుకొని ఉండమని వారితో చెప్పు. ఇది యెహోవాకు ప్రత్యేకమైన అర్పణ. 25 అప్పుడు అహరోను, అతని కుమారుల చేతుల్లోనుంచి వీటిని తీసుకొని, పొట్టేలుతో బాటు బలిపీఠం మీద పెట్టు. యెహోవా ఈ దహనబలి అర్పణ వాసన చూసి ఆనందిస్తాడు. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు ఇచ్చే అర్పణ.

26 “అప్పుడు పొట్టేలుయొక్క బోరను తీసుకోవాలి. (ఇది అహరోను ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించే పొట్టేలు). పొట్టేలు బోరను యెహోవా సన్నిధిలో ఇచ్చి పుచ్చుకొనే ప్రత్యేక అర్పణగా అర్పించాలి. జంతువుల్లోని ఈ భాగం నీది. 27 అప్పుడు అహరోనును ప్రధాన యాజకునిగా చేయుటకు ఉపయోగించి పొట్టేలు రొమ్ము, కాలు తీసుకో, వాటిని అహరోనుకు, అతని కుమారులకు ఇయ్యి. ఇది అర్పణలో ఒక ప్రత్యేక భాగం అవుతుంది. 28 ఇశ్రాయేలు ప్రజలు ఈ భాగాలను అహరోనుకు, అతని కుమారులకు ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు అర్పణ అర్పించినప్పుడల్లా ఈ భాగాలు ఎప్పుడూ యాజకులకే చెందుతాయి. ఈ భాగాలను వారు యాజకులకు ఇచ్చినప్పుడు అవి యెహోవాకు ఇచ్చినట్టే అవుతుంది.

29 “అహరోను తయారు చేసిన ఆ ప్రత్యేక వస్త్రాలను భద్రం చేయాలి. అతని తర్వాత జీవించే వారందరికీ ఈ వస్త్రాలు చెందుతాయి. వారు యాజకులుగా ఏర్పాటు చేయబడినప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు. 30 అహరోను తర్వాత అతని కుమారుడు ప్రధాన యాజకుడు అవుతాడు. ఈ కుమారుడు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేందుకు సన్నిధి గుడారంలోనికి వచ్చినప్పుడు ఆ వస్త్రాలు ధరిస్తాడు.

31 “అహరోనును ప్రధాన యాజకునిగా చేసేందుకు ఉపయోగించిన పొట్టేలు మాంసాన్ని ఒక పవిత్ర స్థలంలో వండాలి. 32 అప్పుడు అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారం ఎదుటి ద్వారం ముందు ఆ మాంసం తినాలి. మరియు బుట్టలోని రొట్టెను కూడ వారు తినాలి. 33 వారు యాజకులుగా చేయబడ్డప్పుడు వారి పాపాలను పరిహరించేందుకు ఈ అర్పణలు ఉపయోగించబడ్డాయి. ఇప్పుడు వారు ఈ అర్పణలను తినాలి. 34 ఆ పొట్టేలు మాంసంలోగాని, ఆ రొట్టెలోగాని ఏమైనా మర్నాటి ఉదయానికి మిగిలి ఉంటే దానిని కాల్చివేయాలి. ఆ రొట్టె, మాంసం ఒక ప్రత్యేక సమయంలో, ఒక ప్రత్యేక విధానంలో మాత్రమే తినవలసినవి గనుక మీరు వాటిని తినకూడదు.

35 “అహరోను, అతని కుమారులకోసం నీవు చేయాలని నేను నీకు ఆజ్ఞాపించిన వీటన్నింటినీ నీవు చేయాలి. వీటిని ఏడురోజుల వ్యవధిలో నీవు చేయాలి. 36 రోజుకు ఒక ఎద్దు చొప్పున ఏడు రోజులు వధించాలి. ఇది అహరోను, అతని కుమారుల పాపముకోసం అర్పణగా ఉంటుంది. బలిపీఠాన్ని పవిత్రం చేసేందుకు నీవు ఈ బలులను ఉపయోగించాలి. బలిపిఠాన్ని పవిత్రం చేసేందుకు దాని మీద ఒలీవ నూనెపోయాలి. 37 ఏడురోజుల పాటు బలిపీఠాన్ని నీవు పవిత్రం చేయాలి. ఆ సమయంలో బలిపీఠం అతిపవిత్రం అవుతుంది.

38 “బలిపీఠం మీద ప్రతిరోజూ ఒక అర్పణ అర్పించాలి. ఒక సంవత్సరం వయస్సుగల రెండు గొర్రె పిల్లల్ని వధించాలి. 39 ఒక గొర్రెపిల్లను ఉదయం, మరో గొర్రెపిల్లను సాయంత్రం అర్పించాలి. 40 మొదటి గొర్రెపిల్లను నీవు వధించినప్పుడు పదవవంతు సన్నటి గోధుమ పిండిని ఒక పావు ద్రాక్షారసంతో కలిపి అర్పణగా చేయాలి. ఉదయం చేసినట్టే సాయంత్రం రెండో గొర్రెపిల్లను వధించినప్పుడు కూడ పదవవంతు సన్నని పిండిని అర్పించాలి. ఒక పావు ద్రాక్షారసం అర్పించాలి. 41 ఇది యెహోవాకు భోజన అర్పణం అవుతుంది. ఈ అర్పణ నీవు దహించినప్పుడు, యెహోవా దీని సునాసనను చూసి ఆనందిస్తాడు.

42 “ప్రతిరోజూ యెహోవాకు అర్పణగా వీటిని నీవు దహించాలి. సమావేశ గుడారం ముందు ద్వారం దగ్గర, యెహోవా ఎదుట వీటిని చేయాలి. ఇలానే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. నీవు అర్పణ అర్పించునప్పుడు, యెహోవానైన నేను నిన్ను అక్కడ కలుసుకొని నీతో మాట్లాడుతాను. 43 ఆ స్థలంలో నేను ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొంటాను. నా మహిమవల్ల ఆ స్థలం పవిత్ర పర్చబడుతుంది.

44 “కనుక సన్నిధి గుడారాన్ని నేను పవిత్రం చేస్తాను. మరియు బలిపీఠాన్ని నేను పవిత్రం చేస్తాను. అహరోను, అతని కుమారులు నాకు యాజకులుగా సేవ చేయగలిగేటట్టు నేను వారిని పవిత్రం చేస్తాను. 45 నేను ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. నేను వారికి దేవుడిగా ఉంటాను. 46 ‘నేనే యెహోవాను, వారి దేవుడ్ని’, అని ప్రజలు తెలుసుకొంటారు. నేను వారితో నివసించేందుకు వారిని ‘ఈజిప్టునుండి బయటికి రప్పించింది నేనే’ అని వారు తెలుసుకొంటారు. నేనే వారి దేవుడైన యెహోవాను.”

యోహాను 8

యేసు మళ్ళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు. సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్ళీ మందిరంలో కనిపించాడు. అక్కడ ప్రజలు ఆయన చుట్టూ సమావేశమయ్యారు. వాళ్ళకు బోధించటానికి ఆయన కూర్చున్నాడు.

వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు కలిసి అక్కడికి తీసుకొని వచ్చారు. ఆమెను అందరి ముందు నిలుచో బెట్టి యేసుతో, “బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. మోషే, ధర్మశాస్త్రంలో యిలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారు?” అని అడిగారు.

ఆయన్ని పరీక్షించటానికి ఈ ప్రశ్న వేసారు. ఆయన్ని శిక్షించటానికి కారణం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. కాని యేసు వంగి, నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలు పెట్టాడు. వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే, అతడు ఆమెపై మొదటిరాయి విసర వచ్చు!” అని అన్నాడు. ఇలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు.

ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. 10 యేసు తలెత్తి చూస్తూ, “వాళ్ళెక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని అడిగాడు.

11 “లేదు ప్రభూ!” అని ఆమె అన్నది.

“నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి పాపం చెయ్యకు!” అని అన్నాడు.

యేసు ఈ ప్రపంచానికి వెలుగు

12 యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు.

13 పరిసయ్యులు సవాలు చేస్తూ, “నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” అని అన్నారు.

14 యేసు సమాధానం చెబుతూ, “నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. 15 మీరు అందరి మానవులవలె తీర్పుచెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను. 16 కాని నేను ఒక వేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. 17 ఇద్దరు కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో వ్రాసారు. 18 నేను నా పక్షాన సాక్ష్యం చెబుతున్నాను. నా యింకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి” అని అన్నాడు.

19 అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు.

యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు. 20 ఆయనీ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ యింకా రాలేదు!

కొందరు యూదులు యేసును అపార్థము చేసికొనటం

21 యేసు మరొకసారి వాళ్ళతో, “నేను వెళ్తున్నాను. మీరు నా కోసం వెతుకుతారు. కాని నేను వెళ్ళేచోటికి మీరు రాలేరు. ఎందుకంటే మీరు మీ పాపాల్లో మరణిస్తారు” అని అన్నాడు.

22 యూదులు, “ఆత్మహత్య చేసుకొంటాడా? అందుకేనా, ‘నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు” అని అన్నారు.

23 యేసు, “మీరు యిక్కడి వాళ్ళు. నేను పైనుండి వచ్చిన వాణ్ణి. మీరు ఈలోకపు వాళ్ళు. నేను ఈ లోకపు వాణ్ణి కాదు. 24 మీరు మీ పాపాలతో మరణిస్తారు” అని అన్నాడు.

25 వాళ్ళు, “అది సరే కాని, నీవెవరు?” అని అడిగారు.

యేసు, “నేను యింతవరకు ఎవర్నని చెబుతున్నానో ఆయన్నే” అని అన్నాడు. 26 “నేను మీ తీర్పు విషయంలో ఎన్నో సంగతులు చెప్పగలను. కాని దానికి మారుగా నన్ను పంపిన వాని నుండి విన్న వాటిని మాత్రమే ప్రపంచానికి చెబుతున్నాను. ఆయన నమ్మదగినవాడు” అని అన్నాడు.

27 ఆయన తన తండ్రిని గురించి చెబుతున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. 28 అందువలన యేసు వాళ్ళతో, “మనుష్యకుమారుణ్ణి పైకి లేపినప్పుడు ఆయన నేనేనని మీరు తెలుసుకుంటారు. అంతేకాక స్వతహాగా నేను ఏమీ చెయ్యనని, నా తండ్రి బోధించిన వాటిని మాత్రమే చెబుతానని తెలుసుకుంటారు. 29 నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను అన్ని వేళలా ఆయనకు యిష్టమైనవే చేస్తాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలి వేయడు” అని అన్నాడు. 30 ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన విశ్వాసులైయ్యారు.

పాపమునుండి విమోచనము గురించి యేసు మాట్లాడటం

31 తనను నమ్మిన యూదులతో యేసు, “మీరు నా బోధనలు పాటిస్తే, మీరు నా నిజమైన శిష్యులు. 32 అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసు కుంటారు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది” అని అన్నాడు.

33 వాళ్ళు, “మేము అబ్రాహాము వంశీయులం. మేమింతవరకు ఎవ్వరికి బానిసలుగా ఉండలేదు. మరి మాకు స్వేచ్ఛ కలుగుతుందని ఎందుకంటున్నావు?” అని అన్నారు.

34 యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస ఔతాడు. 35 బానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. కాని కుమారుడు శాశ్వతంగా ఆ యింటికి చెందినవాడు. 36 కుమారుడు స్వేచ్ఛ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. 37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. అయినా మీకు నా సందేశం నచ్చలేదు. కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. 38 నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి[a] నుండి విన్నదాన్ని చేస్తున్నారు” అని అన్నాడు.

39 “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు! 40 నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు. 41 మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు.

వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు.

42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు. 43 మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. 44 మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావము. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి.

45 “నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు. 46 నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు. 47 దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”

యేసు, అబ్రాహాము

48 “నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా?” అని వాళ్ళు ప్రశ్నించారు.

49 యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు. 50 నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొకాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి. 51 ఇది నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావుచూడడు” అని అన్నాడు.

52 ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటున్నావు. 53 నీవు మా తండ్రి అబ్రాహాము కన్నాగొప్ప వాడవా? అతడు చనిపొయ్యాడు. ప్రవక్తలు కూడా చనిపొయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటున్నావు?” అని అన్నారు.

54 యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు. 55 ఆయన మీకు తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే, నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను. 56 మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు: ఆనంద పడ్డాడు” అని అన్నాడు.

57 ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై ఏళ్ళైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా?” అని అన్నారు.

58 యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను” అని అన్నాడు. 59 ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్ళి పోయాడు.

సామెతలు 5

వ్యభిచారము చేయకుండుటను గూర్చిన జ్ఞానము

నా కుమారుడా, నా జ్ఞానోపదేశము విను. వివేకము గల నా మాటలు గమనించు. అప్పుడు జీవించుటకు సరైన మార్గం నీవు తెలుసుకుంటావు. నీవు జ్ఞానివి అని నీ మాటలు తెలియజేస్తాయి. మరొకరి భార్య పెదవులు తేనెలా తియ్యగా ఉండవచ్చు. ఆమె ముద్దులు తైలం కంటే మెత్తగా ఉండవచ్చు. కాని అంతలో కక్ష, బాధ, మాత్రమే ఆమె తెచ్చి పెడుతుంది. ఆ బాధ విషమంత చేదుగాను, ఖడ్గమంత వాడిగాను ఉంటుంది. ఆమె పాదాలు చావుకు దారితీస్తాయి. ఆమె నిన్ను తిన్నగా సమాధికి నడిపిస్తుంది. ఆమెను వెంబడించవద్దు! ఆమె సరైన మార్గాలలో నుంచి తప్పిపోయింది. అది ఆమెకు తెలియదు, జాగ్రత్తగా ఉండు! జీవమార్గాన్ని వెంబడించు!

నా కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు మరచిపోవద్దు. వేశ్యకు దూరంగా ఉండండి. ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు కూడ వెళ్లవద్దు. ఒకవేళ నీవు అలా చేస్తే నీ మీద ప్రజలకున్న గౌరవం పోగొట్టుకుంటావు. ఇతరులు నీవు సంవత్సరాలు తరబడి సంపాందించినది అంతా తీసివేసుకుంటారు. 10 నీకు తెలియని ప్రజలు నీ ఐశ్వర్యమంతా తీసివేసుకుంటారు. నీ కష్టార్జితం ఇతరుల పాలవుతుంది. 11 నీ జీవితాంతం కూడా నీవు మూల్గుతావు. నీ శరీరం, నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది. 12-13 అప్పుడు నీవు, “నా తల్లిదండ్రుల మాటలు నేనెందుకు వినలేదు? నా ఉపదేశకుల మాటలు నేనెందుకు వినలేదు? క్రమ శిక్షణతో ఉండుటకు నేను నిరాకరించాను, సరిదిద్దబడుటకు నేను నిరాకరించాను. 14 ఇప్పుడు అంతంలో, నా జీవితం వ్యర్ధం అయిపోయినట్లు నేను చూస్తున్నాను. మనుష్యులంతా నా అవమానం చూస్తున్నారు” అని నీవు అంటావు.

15-16 నీ స్వంత బావి నుండి ప్రవహించు నీళ్లు మాత్రమే త్రాగు. మరియు నీ నీళ్లను బయట వీధుల్లోకి ప్రవహించ నీయకు. (నీ స్వంత భార్యకు ఒక్కదానికి మాత్రమే, నిన్ను నీవు అప్పగించుకో. నీవు నీ ప్రత్యేక ప్రేమను ఇవ్వాల్సింది ఆమెకు మాత్రమే. నీ కుటుంబానికి వెలుపల పిల్లలకు నీవు తండ్రివి కావద్దు). 17 నీ పిల్లలు నీకు మాత్రమే చెందినవారై ఉండాలి. నీ స్వంత ఇంటికి వెలుపలి వారితో నీవు నీ పిల్లల్ని పంచుకోరాదు. 18 అందుచేత నీ స్వంత భార్యతో సంతోషించు. నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీవు పెళ్లాడిన స్త్రీతో అనుభవించు. 19 ఆమె అందమైన లేడి వంటిది, అందమైన దుప్పిలాంటిది. ఆమె ప్రేమ నిన్ను పూర్తిగా తృప్తిపరచనివ్వు. ఆమె ప్రేమ నిన్ను బంధించి వేస్తుంది. 20 మరొకని భార్య నిన్ను అదే విధానాల్లో బంధించనియ్యకు. మరొకత్తె ప్రేమ నీకు అవసరం లేదు.

21 ప్రతి మనిషి చేసే ప్రతిది యెహోవా తేటగా చూస్తాడు. మనుష్యులు చేసే ప్రతిదాన్ని యెహోవా క్షుణ్ణంగా చూస్తాడు. 22 దుర్మార్గుని పాపాలు వానినే పట్టుకొంటాయి. అతని పాపాలు అతణ్ణి బంధించే పాశాల్లా ఉంటాయి. 23 ఈ మనిషి క్రమశిక్షణలో ఉంచేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తాడు. అతడు తన స్వంత బుద్దిహీనమైన కోరికల వల్లనే పట్టు బడతాడు.

గలతీయులకు 4

నేను చెప్పేదేమిటంటే వారసుడు చిన్నవానిగా ఉన్నంత కాలం, అతడు ఆస్తికంతా వారసుడైనా అతనికి, బానిసకు వ్యత్యాసం లేదు. అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీనంలో ఉండవలసిందే. అదే విధంగా మనము పిల్లలంగా ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బానిసలమై జీవించాము. కాని సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు. మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు.

మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ “అబ్బా![a] తండ్రీ!” అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు. కనుక మీరు బానిసలు కారు. మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు వారసులను చేసుకొన్నాడు.

గలతీయుల పట్ల పౌలు శ్రద్ధ

ఇదివరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు వట్టి దేవుళ్ళకు బానిసలై జీవించారు. కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిస్సారమైన, నిరర్థకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? 10 మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు. 11 మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది.

12 సోదరులారా! నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చెయ్యలేదు. 13 నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది. 14 నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు. విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసు క్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు. 15 మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. 16 నిజం చెప్పటంవల్ల యిప్పుడు నేను మీ శత్రువునయ్యానా?

17 వాళ్ళు మిమ్మల్ని లోబరచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మానుండి మిమ్మల్ని వేరు చెయ్యాలని వాళ్ళ ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 18 ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి. 19 నా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రసవవేదన పడ్తూ ఉండవలసిందే. 20 మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది.

హాగరు మరియు శారా

21 ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా? 22 అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి వుంది. 23 బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు.

24 ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక వచ్చింది. దీని వల్ల జన్మించిన వాళ్ళు బానిసలు కావాలని ఉంది. “హాగరు” ను ఆ మొదటి ఒడంబడికతో పోల్చవచ్చును. 25 అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా “హాగరు” ను పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు. 26 కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి. 27 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా!
    ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా!
గట్టిగా కేకలు వేయి!
ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త
    లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.”(A)

28 కనుక సోదరులారా! మీరు ఇస్సాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు. 29 ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది. 30 కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? “బానిస స్త్రీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి”(B) అని వ్రాయబడి ఉంది. 31 సోదరులారా! మనము స్వంత స్త్రీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం కాము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International