Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 24

దేవుడు మరియు ఇశ్రాయేలీయులు ఒడంబడిక చేయటం

24 మోషేతో దేవుడు ఇలా చెప్పాడు: “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల డెబ్బయి మంది పెద్దలు (నాయకులు) పర్వతం మీదకు వచ్చి అంత దూరంలోనుంచే నన్ను ఆరాధించాలి. అప్పుడు మోషే తాను మాత్రం యెహోవాకు సమీపంగా రావాలి. మిగతా పురుషులు యెహోవాకు సమీపంగా రాకూడదు. మిగతా ప్రజలు పర్వతం మీదకి కూడా రాకూడదు.”

కనుక యెహోవా ఇచ్చిన నియమాలు, ఆజ్ఞలు అన్నింటిని గూర్చీ మోషే ప్రజలతో చెప్పాడు. అప్పుడు ప్రజలంతా, “యెహోవా చెప్పిన ఆజ్ఞలు అన్నింటికీ మేము విధేయులమవుతాము” అన్నారు.

కనుక యెహోవా ఆజ్ఞలు అన్నింటినీ మోషే రాసాడు. మర్నాటి ఉదయం పర్వతం దగ్గర మోషే ఒక బలిపీఠం నిర్మించాడు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒకటి చొప్పున పన్నెండు రాళ్లు నిలబెట్టాడు. అప్పుడు బలులు అర్పించటానికి యువకులను మోషే పంపించాడు. దహన బలులుగా, సమాధాన బలులుగా ఎడ్లను ఈ మనుష్యులు అర్పించారు.

ఈ జంతువుల రక్తాన్ని మోషే భధ్రం చేసాడు. రక్తంలో సగాన్ని పాత్రల్లో ఉంచాడు మోషే. మిగతా సగం రక్తాన్ని బలిపీఠం మీద ఆయన పోసాడు.[a]

ప్రత్యేక ఒడంబడిక వ్రాయబడ్డ పత్రాన్ని మోషే చదివాడు. ఆయన చదువుతోంది ప్రజలంతా వినగలిగేటట్టు మోషే ఆ ఒడంబడిక పత్రం చదివాడు. అప్పుడు ప్రజలు, “యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మేము విన్నాము. వాటికి విధేయులం అయ్యేందుకు మేము ఒప్పుకొంటున్నాము” అన్నారు.

తర్వాత బలి అర్పణ రక్తంతో నిండిన పాత్రలను మోషే పట్టుకొన్నాడు. ఆ రక్తాన్ని ప్రజలమీద మోషే చిలకరించాడు[b] “మీతో యెహోవా ఒక ప్రత్యేక ఒడంబడిక చేసాడు అని ఈ రక్తం సూచిస్తుంది. మీకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే ఈ ఒడంబడికను వివరిస్తాయి,” అని ఆయన చెప్పాడు.

అప్పుడు మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు పెద్దలు డెబ్బయి మంది పర్వతం మీదకు వెళ్లారు. 10 పర్వతం మీద ఈ మనుష్యులు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూసారు. ఆకాశం అంత నిర్మలంగా కనబడుతున్న నీలంలాటి దేనిమీదనో దేవుడు నిలబడ్డాడు. 11 ఇశ్రాయేలు నాయకులంతా దేవుణ్ణి చూచారు, కాని దేవుడు వాళ్లను నాశనం చేయలేదు.[c] వాళ్లంతా కలిసి తిని త్రాగారు.

దేవుని ఆజ్ఞలు పొందడానికి మోషే వెళ్లటం

12 “పర్వతం మీద నా దగ్గరకు రా, నా ప్రబోధాలను, ఆజ్ఞలను పలకలుగా ఉన్న రెండు రాళ్ల మీద రాసాను. ఈ ప్రబోధాలు ప్రజలకోసం. ఆ రాతి పలకలను నేను నీకిస్తాను” అని యెహోవా మోషేతో చెప్పాడు.

13 కనుక మోషే, ఆయన సహాయకుడైన యెహోషువ కలసి దేవుని పర్వతం మీదకు వెళ్లారు. 14 మోషే, “మాకోసం ఇక్కడ వేచి ఉండండి. మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము. నేను లేనప్పుడు అహరోను, హోరు మీ దగ్గరే ఉన్నారు. ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ల దగ్గరకు వెళ్లండి,” అని ఆ పెద్దలతో (నాయకులతో) చెప్పాడు.

మోషే దేవున్ని కలుసుకోవడం

15 అప్పుడు మోషే పర్వతం మీదికి వెళ్లాడు. ఆ పర్వతాన్ని మేఘం కప్పేసింది. 16 సీనాయి పర్వతం మీద యెహోవా మహిమ దిగివచ్చింది. ఆరు రోజుల పాటు పర్వతాన్ని మేఘం కప్పేసింది. ఏడోరోజున ఆ మేఘంలోనుంచి యెహోవా మోషేతో మాట్లాడాడు. 17 ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మహిమను చూడగలిగారు. అది ఆ పర్వతం మీద మండుతున్న అగ్నిలా వుంది.

18 అప్పుడు మోషే ఆ పర్వతం మీద యింకా పైకి ఎక్కి మేఘంలోకి వెళ్లాడు. నలభై పగళ్లూ, నలభై రాత్రులు మోషే ఆ పర్వతం మీదే ఉన్నాడు.

యోహాను 3

యేసు నికోదేముకు బోధించటం

నీకోదేము అనే పరిసయ్యుడు యూదుల నాయకునిగా ఉండేవాడు. అతడు ఒకనాటి రాత్రి యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ! నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. నీవు చేస్తున్న అద్భుతాలు దేవుని అండ లేకుండా ఎవ్వరూ చెయ్యలేరు” అని అన్నాడు.

యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. క్రొత్తగా జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు.

నికోదేము, “కాని ఒక వ్యక్తి వృద్ధుడయ్యాక తిరిగి ఏవిధంగా జన్మిస్తాడు? మళ్ళీ జన్మించటానికి తల్లిగర్భంలోకి రెండవ సారి ప్రవేశించలేము కదా!” అని అడిగాడు.

యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. నీళ్ళద్వారా, పవిత్రాత్మద్వారా, జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. మానవుడు భౌతికంగా జన్మిస్తాడు. కాని, ఆధ్యాత్మికత పవిత్రాత్మ వల్ల జన్మిస్తుంది. అందువల్ల నేను, ‘నీవు మళ్ళీ జన్మించాలి’ అనటం విని అశ్చర్యపోవద్దు. గాలి తన యిష్టం వచ్చినట్లు వీస్తుంది. మీరు దాని ధ్వని వినగలరు కాని అది ఏ వైపు నుండి వీచిందో, ఏ వైపుకు వీస్తుందో చెప్పలేరు. పవిత్రాత్మవల్ల జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు” అని అన్నాడు.

“అది ఏ విధంగా సంభవమౌతుంది?” అని నికోదేము అడిగాడు.

10 యేసు, “నీవు ఇశ్రాయేలు వారిలో పండితుడవు కదా! నీకీ విషయాలు అర్థం కాలేదా? 11 ఇది నిజం. మేము మాకు తెలసిన విషయాలు చెబుతున్నాము. చూసిన వాటికి సాక్ష్యం చెబుతున్నాము. అయినా మీరు మేము చెబుతున్న వాటిని అంగీకరించరు. 12 నేను మాట్లాడిన ప్రాపంచిక విషయాలను గురించి మీరు నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? 13 పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకమునకు ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు.

14-15 “ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడూ నశించకుండా అనంత జీవితం పోందాలంటే, మోషే ఎడారిలో పామును ఎత్తినట్లు మనుష్యకుమారుడు కూడా ఎత్త బడాలి” అని అన్నాడు.

16 దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం. 17 దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికే గాని తీర్పు చెప్పటానికి పంపలేదు. 18 తన కుమారుణ్ణి నమ్మినవానికి ఆయన శిక్ష విధించడు. నమ్మనివానిపై, అనగా తన ఏకైక కూమారుణ్ణి నమ్మలేదు కనుక, యిదివరకే శిక్ష విధించాడు. 19 దేవుడు చెప్పిన తీర్పు యిది: ప్రపంచంలోకి వెలుగు వచ్చింది. ప్రజలు దుర్మార్గపు పనులు చేసారు. కనుక వాళ్ళు వెలుగుకు మారుగా చీకటిని ప్రేమించారు. 20 చెడుపనులు చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడు. తన చెడు బయట పడుతుందేమోనని అతడు వెలుగులోకి రాడు. 21 మంచి పనులు చేసేవాడు తాను చేసిన పనులు దేవునివల్ల చేసిన విషయమై ప్రజలు గ్రహించాలని వెలుగులోకి వస్తాడు.

యోహాను చెప్పిన సందేశం

22 ఇది జరిగిన తర్వాత యేసు తన శిష్యులతో యూదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్దిరోజులు గడిపాడు, బాప్తిస్మము నిచ్చాడు. 23 అదేవిధంగా యోహాను కూడా సలీము పట్టణం దగ్గరున్న ఐనోను గ్రామంలో నీళ్ళు పుష్కలంగావుండటం వల్ల, అక్కడి ప్రజలకు బాప్తిస్మమునిస్తూ ఉన్నాడు. ప్రజలు బాప్తిస్మము పొందటానికి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. 24 ఇది యోహానును కారాగారంలో వెయకముందు జరిగిన సంఘటన.

25 పవిత్రం కావటానికి శుద్ధి చేసే ఆచారం విషయంలో ఒక యూదునికి, యోహాను శిష్యులకు వాదన జరిగింది. 26 వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చి, “రబ్బీ! యొర్దాను నదికి అవతలి వైపున మీతో ఉన్నవాడు, మీరు ఎవర్ని గురించి సాక్ష్యము చెప్పారో ఆయన బాప్తిస్మము నిస్తున్నాడు. అందరూ అయన దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు.

27 యోహాను సమాధానం చెబుతూ, “దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్నీ పొందలేరు. 28 నేను క్రీస్తును కానని, ఆయన కన్నా ముందు పంపబడిన వాణ్ణి మాత్రమేనని నేను ముందే చెప్పాను. దీనికి మీరు సాక్ష్యం. 29 పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి కుమారుని స్నేహితుడు పెళ్ళికుమారుని మాట వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆ ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది. 30 ఆయన ప్రాముఖ్యత పెరగాలి. నా ప్రాముఖ్యత తరగాలి.

పరలోకమునుండి వచ్చువాడు

31 “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. 32 ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకరించరు. 33 దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు. 34 ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు. 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు. 36 ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు.

యోబు 42

యెహోవాకు యోబు జవాబు

42 అప్పుడు యెహోవాకు యోబు ఇలా జవాబు చెప్పాడు.

“యెహోవా, నీవు అన్నీ చేయగలవని నాకు తెలుసు.
    నీవు పథకాలు వేస్తావు, నీ పథకాల్లో ఏదీ మార్చబడజాలదు, నిలిపివేయబడదు.
‘నా సలహాను గూర్చి ఈ వెర్రి ప్రశ్నలు అడుగుతున్న ఇతడు ఎవరు?’ అని యెహోవా, నీవు ప్రశ్నించావు.
    నేను (యోబును) నాకు అర్థం కాని విషయాలు యెహోవాని అడిగాను.
    నేను తెలిసికోలేనంత మరీ విపరీతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలను గూర్చి నేను మాట్లాడాను.

“యెహోవా, ‘నీవు నాతో యోబూ, నేను నీతో మాట్లాడుతాను.
    నేను నిన్ను ప్రశ్నలు అడుగుతాను. నీవు నాకు జవాబు ఇవ్వాలి’ అన్నావు.
యెహోవా, ఇదివరకు నిన్ను గూర్చి నేను విన్నాను.
    కానీ ఇప్పుడు నా స్వంత కళ్లతో నేను నిన్ను చూశాను.
కనుక ఇప్పుడు, నన్ను గూర్చి
    నేను సిగ్గుపడుతున్నాను.
యెహోవా, నేను విచారిస్తున్నాను.
    నేను ఈ ధూళిలో, బూడిదలో కూర్చొని ఉండగానే నేను నా జీవితం, నా హృదయం మార్చుకొంటానని వాగ్దానం చేస్తున్నాను.”

యోబుకు తన ఐశ్వర్యాలను యెహోవా తిరిగి యివ్వటం

యెహోవా యోబుతో మాట్లాడటం చాలించిన తర్వాత, ఆయన ఎలీఫజుతో మాట్లాడినాడు. ఎలీఫజు తేమాను పట్టణస్థుడు. ఎలీఫజుతో యెహోవా ఇలా చెప్పాడు: “నీ మీద, నీ యిద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను గూర్చి సరిగా చెప్పలేదు. కానీ యోబు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పాడు. యోబు నా సేవకుడు. కనుక ఎలీఫజూ ఇప్పుడు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను నీవే తీసుకో. వాటిని నా సేవకుడు యోబు దగ్గరకు తీసుకొని వెళ్లి, మీ నిమిత్తం దహనబలిగా వాటిని అర్పించండి. నా సేవకుడు యోబు మీ కోసం ప్రార్థిస్తాడు. అప్పుడు నేను అతని ప్రార్థనకు తప్పక జవాబు ఇస్తాను. అప్పుడు మీరు శిక్షించబడాల్సిన విధంగా నేను మిమ్మల్ని శిక్షించను. మీరు చాలా అవివేకంగా ఉన్నారు గనుక మీరు శిక్షించబడాలి. మీరు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పలేదు. కానీ నా సేవకుడు యోబు, నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పాడు.”

కనుక తేమానువాడగు ఎలీఫజు, షూహి దేశస్థుడైన బిల్దదు, నయమాతీ పట్టణస్థుడైన జోఫరు యెహోవాకు విధేయులయ్యారు. అప్పుడు యెహోవా చెప్పినట్లు వాళ్లు చేశారు. అప్పుడు యెహోవా యోబు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు.

10 కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించటం ముగించాడు. అప్పుడు యెహోవా యోబుకు మరల విజయం ఇచ్చాడు. యోబుకు అంతకు ముందు ఉన్నదానికి రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. 11 యోబు సోదరులు, ఆడపడుచులు అందరూ తిరిగి యోబు ఇంటికి వచ్చారు. అంతకు ముందు యోబును ఎరిగిన ప్రతి ఒక్కరూ అతని ఇంటికి వచ్చారు. వాళ్లంతా యోబుతో కలిసి విందు భోజనం చేశారు. యోబుకు యెహోవా చాలా కష్టం కలిగించాడు గనుక వాళ్లంతా అతనిని ఓదార్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెండి నాణెం, ఒక బంగారు ఉంగరం యోబుకు ఇచ్చారు.

12 యోబు జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగాన్ని యెహోవా అధికంగా ఆశీర్వదించాడు. పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటెలు, రెండు వేల ఆవులు, వెయ్యి ఆడ గాడిదలు యోబుకు స్వంతంగా యిచ్చాడు. 13 యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు మరల కలిగారు. 14 యోబు మొదటి కుమార్తెరైకు యెమీమా అని పేరు పెట్టాడు. యోబు రెండో కుమార్తెకు కెజీయా అని పేరు పెట్టాడు. యోబు మూడో కుమార్తెకు కెరెంహప్పుకు అని పేరు పెట్టాడు. 15 దేశం అంతటిలో యోబు కుమార్తెలు మహాగొప్ప సౌందర్యవతులు. యోబు తన కుమార్తెలకు తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. వారి సోదరులు కూడ తమ తండ్రి ఆస్తిలో వాటా పొందారు.

16 కనుక యోబు మరో నూటనలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన పిల్లలను, మనుమలు, మనుమరాండ్రను, మునిమనుమలు, మనుమరాండ్రను, వారి పిల్లలను చూచేంతవరకు నాలుగు తరాలు జీవించాడు. 17 యోబు చనిపోయినప్పుడు అతడు కడు వృద్ధుడు. యోబు సుదీర్ఘమైన కాలం జీవించాడు.

2 కొరింథీయులకు 12

పౌలుకు దర్శనం, ముల్లు

12 లాభం లేకపోయినా నేను గర్వంగా చెప్పుకొంటూ పోవాలి. ప్రభువు వలన కలిగిన దర్శనాలు, ప్రత్యక్షతలు గురించి చెప్పనివ్వండి. క్రీస్తును విశ్వసించే ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశమునకు తీసుకు వెళ్ళాడు. అతణ్ణి శరీరంతో తీసుకొని వెళ్ళాడో లేక అతని ఆత్మను తీసుకొని వెళ్ళాడో, నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. నాకు తెలిసిన ఈ వ్యక్తి శరీరంతో వెళ్ళాడో లేక అతని ఆత్మ మాత్రమే వెళ్ళిందో నాకు తెలియదు. దేవునికే తెలుసు. దేవుడు యితణ్ణి పరదైసునకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అతడు పవిత్రమయిన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి అనుమతి లేదు. నేను అతణ్ణి గురించి గర్వంగా చెపుతున్నాను. కాని నా గురించి నేను గర్వంగా చెప్పుకోను. నా బలహీనతను గురించి మాత్రమే గర్వంగా చెప్పుకొంటాను.

ఒకవేళ నేను గర్వంగా మాట్లాడినా, నేను ఎప్పుడూ నిజం చెబుతాను కనుక తెలివిలేనివాణ్ణని అనిపించుకోను. నేను చెప్పినవాటి కన్నా, చేసినవాటి కన్నా నన్ను గురించి మీరు గొప్పగా అనుకోరాదని నా అభిలాష. కనుక నేను నన్ను గురించి గర్వంగా చెప్పుకోకుండా నిగ్రహించుకొంటాను.

దేవుడు కనుపరచిన ఈ గొప్పవిషయాల వల్ల నాకు గర్వం కలుగరాదని నా శరీరంలో ఒక ముల్లు ఉంచబడింది. అది సాతాను దూత. అది నన్ను బాధపెడుతూ ఉంటుంది. ఆ ముల్లు తీసివేయమని ప్రభువుతో మూడు సార్లు మొరపెట్టుకొన్నాను. కాని ప్రభువు నాతో, “నీకు నా అనుగ్రహం చాలు. నా శక్తి నీ బలహీనత ద్వారా పరిపూర్ణత పొందుతుంది” అని అన్నాడు. అందువల్ల క్రీస్తు శక్తి నాలో ఉండాలని నా బలహీనతను గురించి ఇంకా ఎక్కువ ఆనందంతో, గర్వంగా చెప్పుకొంటాను. 10 అందువల్లే క్రీస్తు కోసం నేను బలహీనతల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, కష్టాల్లో ఆనందం పొందుతూ ఉంటాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉంటాను.

కొరింథు ప్రజల విషయంలో చింత

11 నేను తెలివిలేని వానిలా ప్రవర్తిస్తున్నాను. కాని దీనికి మీరే కారకులు. నేను ఏమీకాకపోయినా ఆ “గొప్ప అపొస్తలుల” కన్నా తీసిపోను. కనుక మీరు నన్ను మెచ్చుకోవలసింది. 12 అపొస్తలుడని అనిపించుకొనుటకు తగిన రుజువులు, అద్భుతాలు, మహత్కార్యాలు మీ మధ్య నేను పట్టుదలతో చేసాను. అని నేను మీ కోసం పట్టుదలతో చేసాను. 13 నేను మీకు ఎన్నడూ భారంగా ఉండలేదు అన్న విషయంలో తప్ప ఇతర సంఘాలకన్నా మీరు ఏ విషయంలో తీసిపోయారు? దీనికి నన్ను క్షమించండి.

14 ఇక యిప్పుడు మూడవసారి మీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి కూడా నేను మీకు భారంగా ఉండను. నాకు కావలసింది మీ దగ్గరున్న వస్తువులు కాదు. మీరు నాకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తిని కూడపెట్టరు. కాని తల్లిదండ్రులే తమ పిల్లల కోసం ఆస్తి కూడబెడ్తారు. 15 అందువల్ల నా దగ్గరున్నదంతా ఆనందంతో మీకోసం వ్యయంచేస్తాను. “నన్ను” మీకోసం ఉపయోగించుకోండి. నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తే నన్ను మీరు తక్కువగా ప్రేమిస్తారా?

16 అది అలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదని తెలుసు కాని, “నేను పన్నాగాలు పన్ని మిమ్మల్ని వలలో వేసుకొన్నానని” కొందరు అనవచ్చు. 17 నేను పంపిన మనుష్యుల్లో ఎవర్నైనా మిమ్మల్ని మోసగించటానికి ఉపయోగించుకొన్నానా? లేదని నాకు తెలుసు. నేను వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకొన్నానా? 18 నేను తీతును మీ దగ్గరకు వెళ్ళమని వేడుకొన్నాను. మా సోదరుణ్ణి అతని వెంట పంపాను. తీతు మిమ్మల్ని వంచించలేదు కదా? వంచించాడా? లేదు. మేమంతా ఒకే ఆత్మతో, ఒకే మార్గాన్ని అనుసరించామని మీకు తెలుసు.

19 మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకోవాలని మా పక్షాన మేము వాదిస్తున్నామని అనుకొంటున్నారా? లేదు. మేము దేవుని ముందు క్రీస్తులో మాట్లాడుతున్నాము. సోదరులారా! మీ విశ్వాసాన్ని ధృఢపరచాలని మేము యివి చేస్తున్నాము. 20 ఎందుకంటే, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకొన్నట్లు మీరు, మీరనుకొన్నట్లు నేను ఉండమేమోనని నాకు భయం వేస్తోంది. కలహాలు, అసూయలు, కోపాలు, కక్షలు, వదంతులు, గుస గుసలు, అహంభావాలు, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాము. 21 నేను మీ దగ్గరకు మళ్ళీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తోంది. గతంలో కామక్రీడలు, వ్యభిచారం లాంటి అపవిత్రమైన పనులు చేసి ఆ పాపాలకు పశ్చాత్తాపం పొందనివాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివాళ్ళవల్ల నాకు దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International