Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 23

23 “ప్రజలకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పకండి. న్యాయస్థానంలో మీరు సాక్షులుగా ఉంటే, ఒక దుర్మార్గుడు అబద్ధాలు చెప్పేందుకు సహాయం చేయడానికి ఒప్పుకోవద్దు.

“మిగిలిన వారంతా చేస్తున్నారనిచెప్పి నీవు ఏదీ చేయవద్దు. ఒక గుంపు ప్రజలు తప్పు చేస్తుంటే, నీవు వారితో కలువ వద్దు. నీవు చెడ్డ పనులు చేసేటట్టు ఆ ప్రజలు నిన్ను ఒప్పించనియ్యవద్దు. సరియైనది, న్యాయమైనది నీవు చెయ్యాలి.

“ఒక పేదవానికి తీర్పు జరుగుతుంటే, కొన్నిసార్లు అతని విషయంలో జాలిపడి, కొందరు అతణ్ణి బలపరుస్తారు. నీవు అలా చేయకూడదు. (అతనిది సరిగ్గా ఉంటేనే బలపర్చు.)

“తప్పిపోయిన ఒక ఎద్దును లేక గాడిదను నీవు చూస్తే, దాన్ని దాని యజమానికి నీవు తిరిగి అప్పగించాలి. ఆ యజమాని నీకు శత్రువైనా సరే, నీవు ఇలా చేయాల్సిందే. మోయలేనంత భారం ఉండడం చేత ఒక జంతువు నడవలేక పోతున్నట్టు నీవు చూస్తే, నీవు ఆగి ఆ జంతువుకు సహాయం చేయాలి. ఆ జంతువు నీ శత్రువులలో ఒకనికి చెందినా సరే నీవు దానికి సహాయం చేయాలి.

“ఒక పేదవానికి ప్రజలు అన్యాయం చేయకూడదు. ఇతరులు ఎవరికైనా తీర్చినట్టే తీర్పు తీర్చాలి.

“ఏదైనా విషయంలో ఒకడు నేరస్థుడు అని నీవు చెబితే, నీవు చాల జాగ్రత్తగా ఉండాలి. ఒకడి మీద అబద్ధపు నిందలు వేయవద్దు. నిర్దోషియైన ఒకడ్ని తాను చేయని పనికి శిక్షగా ఎన్నడూ మరణించనివ్వవద్దు. ఒక నిర్దోషిని చంపేవాడు ఎవడైనా సరే చెడ్డవాడే, ఆ మనిషిని నేను క్షమించను.

“ఒకడు తప్పు చేస్తూ నీవు అతనితో ఏకీభవించాలని చెప్పి, నీకు డబ్బు ఇవ్వ జూస్తే, ఆ డబ్బు తీసుకోవద్దు. అలా చెల్లించిన డబ్బు న్యాయమూర్తులు సత్యాన్ని చూడకుండా చేస్తుంది. అలా చెల్లించిన డబ్బు మంచివాళ్లు అబద్ధాలు చెప్పేటట్టు చేస్తుంది.

“విదేశీయుని యెడల నీవు ఎన్నడూ తప్పు చేయకూడదు. మీరు ఈజిప్టు దేశంలో నివసించినప్పుడు మీరు పరాయి వాళ్లేనని జ్ఞాపకం ఉంచుకోవాలి. (ఒకడు తన స్వంతంకాని దేశంలో వుంటే వాడికి ఎలా వుంటుందో మీరు అర్థం చేసుకోవాలి.)

ప్రత్యేకమైన పండుగలు

10 “విత్తనాలు చల్లి పంటకోసి, ఆరు సంవత్సరాల పాటు భూమిని సాగుచేయండి. 11 అయితే ఏడో సంవత్సరం భూమిని ఉపయోగించకండి. (ఏడో సంవత్సరం భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉండాలి) మీ పొలాల్లో ఏమీ నాటవద్దు. ఒకవేళ అక్కడ ఏవైనా పంటలు పెరిగితే, వాటిని పేద ప్రజలను తీసుకోనివ్వాలి. మిగిలిపోయిన ఆహారాన్ని అడవి మృగాల్ని తిననివ్వాలి మీ ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు, తోటల విషయంలో కూడ మీరు అలాగే చేయాలి.

12 “ఆరు రోజులు పని చేయండి. ఏడోరోజున విశ్రాంతి! మీ బానిసలు, ఇతర పని వాళ్లకు దీనివల్ల విశ్రాంతి, మరియు విరామం లభిస్తుంది. మీ ఎడ్లు, మీ గాడిదలకు కూడ విశ్రాంతి దొరుకుతుంది.

13 “ఈ ఆజ్ఞలన్నింటికీ విధేయులు కావాలని మాత్రం ఖచ్చితంగా తెల్సుకోండి. వేరే దేవుళ్లను పూజించకండి. చివరకి వాళ్ల పేర్లు కూడా మీరు పలుకగూడదు.

14 “ప్రతి సంవత్సరం మూడు ప్రత్యేక పండుగలు మీకు ఉంటాయి. ఈ పండుగల రోజుల్లో మీరు నన్ను ఆరాధించటానికి నా ప్రత్యేక స్థలానికి రావాలి. 15 మొదటిది పులియని రొట్టెల పండుగ. ఇది నేను మీకు ఆజ్ఞాపించినట్టే ఉంటుంది. ఈ సమయంలో పులియజేసే పదార్థం వినియోగించకుండా చేయబడ్డ రొట్టెలు మీరు తింటారు. ఇలా ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. అబీబు[a] మాసంలో మీరు దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన సమయం యిదే. ఆ సమయంలో ప్రతి వ్యక్తి ఒక బలి అర్పణ నాకు తీసుకురావాలి.

16 “రెండోది కోత పండుగ. ఈ పండుగ వేసవి పూర్వార్ధంలో అంటే మీ పొలాల్లో మీరు నాట్లు వేసిన పంటల కోత మొదలుబెట్టే సమయంలో ఉంటుంది. మూడోది గుడారాల పండుగ.

“ఇది ఆకురాలు కాలంలో ఉంటుంది. ఇది మీ పొలాల్లో పంటలన్నీ కూర్చుకొనే సమయంలో ఉంటుంది.

17 “కనుక యెహోవా ప్రభువుతో ఉండేందుకు సంవత్సరానికి మూడుసార్లు పురుషులంతా ఒక ప్రత్యేక స్థలానికి వస్తారు.

18 “నీవు ఒక జంతువును చంపి దాని రక్తం బలిగా అర్పించేటప్పుడు, పులియజేసే పదార్థంతో చేయబడ్డ రొట్టెలు నీవు అర్పించకూడదు. ఈ బలి అర్పణలోని మాంసం మీరు తినేటప్పుడు ఆ మాంసం అంతా ఒక్క రోజులోనే తినెయ్యాలి. మాంసంలో ఏమీ మర్నాటికి మిగల్చకూడదు.

19 “మీరు మీ పంట కూర్చుకొనే కోత కాలంలో మీరు కోసే ప్రతి దానిలో మొదటి భాగం మీ యెహోవా దేవుని ఆలయానికి తీసుకురావాలి.

“దాని తల్లి పాలతో ఉడకబెట్టబడిన మేకపిల్ల మాంసాన్ని మీరు తినకూడదు.”

ఇశ్రాయేలీయులు దేశాన్ని ఆక్రమించుటకు దేవుడు సహాయం చేయటం

20 దేవుడు యిలా చెప్పాడు: “మీకు ముందర ఒక దేవదూతను నేను పంపుతున్నాను. మీ కోసం నేను సిద్ధం చేసిన చోటికి ఈ దేవదూత మిమ్మల్ని నడిపించటం జరుగుతుంది. 21 ఈ దేవదూతకు విధేయులుగా వెంబడించండి. ఆయన మీద తిరుగుబాటు చేయవద్దు. ఆయన విషయంలో మీరు చేసే తప్పిదాలను ఈ దేవదూత క్షమించడు. ఆయనలో నా శక్తి ఉంది. 22 ఆయన చెప్పే ప్రతి దానికీ మీరు లోబడాలి. నేను మీతో చెప్పే ప్రతీదీ మీరు చేయాలి. మీ శత్రువులందరికీ నేను వ్యతిరేకంగా ఉంటాను. మీకు వ్యతిరేకంగా ఉండే ప్రతి వ్యక్తికి నేను విరోధినే.”

23 దేవుడు చెప్పాడు: “ఈ దేశంలోనుంచి నా దూత మిమ్మల్ని నడిపిస్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వేర్వేరు ప్రజల మీదికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. అయితే వీళ్లందర్నీ నేను ఓడిస్తాను.

24 “వాళ్ల దేవుళ్లను పూజించవద్దు. ఆ దేవుళ్లకు ఎన్నడూ సాష్టాంగపడవద్దు. వాళ్ల జీవిత విధానంలో మీరు ఎన్నడూ జీవించకూడదు. వాళ్ల విగ్రహాల్ని మీరు నాశనం చేయాలి. వాళ్ల దేవుళ్లను వాళ్లు జ్ఞాపకం చేసుకొనేందుకు వాళ్లకు తోడ్పడే వాటన్నిటినీ మీరు విరుగగొట్టాలి. 25 మీ యెహోవా దేవుణ్ణి మీరు సేవించాలి. మీరు ఇలా చేస్తే, భోజన పానీయాలు సమృద్ధిగా ఇచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. సర్వరోగాల్నీ మీలోనుండి తొలగించి వేస్తాను. 26 మీ స్త్రీలంతా పిల్లల్ని కనగల్గుతారు. వారి శిశువుల్లో ఏ ఒక్కరూ పుట్టుకలో చావరు. మిమ్మల్ని అందరినీ సుదీర్ఘ ఆయుష్షుతో బ్రతకనిస్తాను.

27 “మీరు మీ శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు నా మహత్తర శక్తిని మీ ముందర పంపిస్తాను. మీరు మీ శత్రువులందర్నీ ఓడించటానికి నేను మీకు సహాయం చేస్తాను. మీకు వ్యతిరేకంగా ఉండే మనుష్యులు యుద్ధంలో కలవరపడిపోయి, పారిపోతారు. 28 మీకు ముందు కందిరీగలను[b] నేను పంపిస్తాను. ఆ కందిరీగలు మీ శత్రువులు పారిపొయ్యేట్టు చేస్తాయి. హివ్వీ ప్రజలు, కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, మీ దేశాన్ని వదిలేస్తారు. 29 అయితే త్వరగా మీ దేశాన్ని విడిచి పెట్టేటట్టు నేను వాళ్లను బలవంతం చేయను. ఇదంతా నేను ఒక్క సంవత్సరంలోనే చేయను. ఆ ప్రజల్ని నేను అంత వేగంగా వెళ్లగొడితే, దేశం ఖాళీగా ఉంటుంది. అలాగైతే అడవి మృగాలు అధికమై దేశాన్ని ఆక్రమించుకొంటాయి. అవి మీకు చాల తొందర కలిగిస్తాయి. 30 కనుక ఆ ప్రజల్ని చాలా నిదానంగా బయటకు వెళ్లగొడతాను. దేశంలోనికి మీరు చొచ్చుకు పోతూనే ఉంటారు. మరి మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఇతర ప్రజలను నేను బలవంతంగా వెళ్లగొట్టేస్తాను.

31 “ఎర్ర సముద్రం నుండి యూఫ్రటీస్ నదివరకు ఉన్న దేశం అంతా నేను మీకు యిస్తాను. ఫిలిష్తీ సముద్రం (మధ్యధరా సముద్రం) పశ్చిమాన సరిహద్దుగాను, అరేబియా ఎడారి తూర్పు సరిహద్దుగాను ఉంటాయి. అక్కడ నివసిస్తున్న ప్రజల్ని మీరు ఓడించేటట్టు చేస్తాను.

32 “ఆ ప్రజల్లో ఎవరితో గాని లేక వారి దేవుళ్లతోగాని మీరు ఎలాంటి ఒడంబడికలూ చేసుకోకూడదు. 33 వాళ్లను మీ దేశంలో ఉండనివ్వవద్దు. మీరు వాళ్లను ఉండనిస్తే, మీరు పాపం చేయటానికి వాళ్లు కారకులు అవుతారు. ఒకవేళ మీరు వాళ్లను ఉండనిస్తే వాళ్లు ఒక ఉరిలా ఉంటారు. మీరేమో వాళ్ల దేవుళ్లను పూజించటం మొదలు పెడతారు.”

యోహాను 2

కానా పట్టణంలో వివాహం

మూడవరోజు గలిలయ దేశంలోని “కానా” పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది.

యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు.

ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది.

ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి.

యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!” అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.

ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు.

వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద, ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు. ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో, 10 “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు.

11 యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.

12 ఇది జరిగాక యేసు తన తల్లితో, సోదరులతో, శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్దిరోజులు బస చేసారు.

యెసు మందిరాన్ని పరిశుభ్రం చేయటం

(మత్తయి 21:12-13; మార్కు 11:15-17; లూకా 19:45-46)

13 యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు. 14 ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని, పావురాల్ని, అమ్మటం చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చటం చూసాడు. 15 త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు. 16 పావురాలు అమ్ముతున్న వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి మీకెన్ని గుండెలు?” అని అన్నాడు.

17 ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయ జ్ఞాపకం చేసుకొన్నారు:

“నీ యింటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది.”(A)

18 యూదులు యేసుతో, “ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికారమున్నదని నమ్ముతాము” అని అన్నారు.

19 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో మళ్ళీ కడతాను.”

20 యూదులు, “ఈ మందిరం కట్టటానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తావా?” అని అన్నారు.

21 కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి. 22 ఆయన బ్రతికింపబడ్డాక, ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు.

23 పస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూషలేములో ఉండి చేసిన అద్భుతాల్ని ప్రజలు చూసారు. వాళ్ళకు ఆయన పట్ల విశ్వాసము కలిగింది. 24 కాని ఆయనకు మానవ స్వభావము తెలుసు. కనుక తనను తాను వాళ్ళకు అప్పగించుకోలేదు. 25 మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవుల్ని గురించి ఆయనకు ఎవడును సాక్ష్యం చెప్పనవసరం లేదు.

యోబు 41

41 “యోబూ, నీవు మొసలిని గాలముతో పట్టుకొనగలవా?
    దాని నాలుకను తాడుతో కట్టివేయగలవా?
యోబూ, మొసలి ముక్కులోనుంచి తాడును నీవు వేయగలవా?
    లేక దాని దవడకు గాలపు ముల్లు ఎక్కించగలవా?
యోబూ, తన్ను స్వేచ్చగా పోనిమ్మని మొసలి నిన్ను బ్రతిమలాడుతుందా?
    అది మర్యాద మాటలతో నీతో మాట్లాడుతుందా?
యోబూ, మొసలి నీతో ఒడంబడిక చేసుకుంటుందా?
    శాశ్వతంగా నిన్ను సేవిస్తానని వాగ్దానం చేస్తుందా?
యోబూ, నీవు ఒక పిట్టతో ఆడుకొనగలవా? మొసలితో ఆడుకొనగలవా?
    నీ దాసీలు దానితో ఆడుకొనేందుకు దానికి ఒక తాడు కట్టగలవా?
యోబూ, జాలరులు నీవద్ద మొసలిని కొనుటకు ప్రయత్నిస్తారా?
    వారు దానిని వ్యాపారులకు అమ్మేందుకు దానిని ముక్కలుగా కోయగలరా?
యోబూ, మొసలి చర్మం మీదికి, దాని తలమీదికి శూలాలు నీవు విసరగలవా?
    లేక చేపలను వేటాడే అలుగులు అనేకం కొట్టగలవా?

“యోబూ, ఒక వేళ నీవు నీ చేతిని మొసలి మీద ఉంచితే దానితో నీ గట్టి పోరాటాన్ని నీవు ఎప్పటికీ మరచిపోలేవు.
    మరియు నీవు దానితో మరల ఎన్నటికీ పోరాడవు.
ఒక వేళ నీవు మొసలిని ఓడించగలనని అనుకుంటే అది మరచిపో!
    అలాంటి ఆశ ఏమీ లేదు!
    దాన్ని చూస్తేనే నీకు భయం పుడుతుంది.
10 మొసలికి కోపం పుట్టించగలిగినంత
    ధైర్యంగల మనిషి ఎవరూ లేరు.

“కనుక అలాంటప్పుడు యోబూ, నాకు విరోధంగా నిలువగలవాడు ఎవడు?
11 నేను (దేవుణ్ణి) ఎవరికీ ఏమీ బాకీ లేను.
    ఆకాశమంతటి క్రింద ఉన్న సర్వము నాదే.

12 “యోబూ, మొసలి కాళ్లను గూర్చి, దాని బలం,
    దాని అందమైన ఆకారం గూర్చి నేను నీతో చెబుతాను.
13 మొసలి చర్మాన్ని ఎవరూ ఊడదీయలేరు.
    ఒక కళ్లెం పట్టుకొని ఎవ్వరూ దాని సమీపంగా రాజాలరు.
14 మొసలి దవడలు తెరిపించడానికి ఎవరూ దానిని బలవంతం చేయలేరు.
    దాని దవడల్లోని పళ్లు మనుష్యులను భయపెడతాయి.
15 మొసలి వీపు మీది గట్టి పొలుసుల వరుసలు
    దగ్గర దగ్గరగా కుదించబడ్డాయి.
16 గాలి జొరబడలేనంత దగ్గర దగ్గరగా
    ఆ పొలుసులు ఉంటాయి.
17 ఆ పొలుసులు ఒక దానితో ఒకటి జత చేయబడ్డాయి.
    వాటిని ఊడబెరుకుటకు వీలులేనంత గట్టిగా ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉంటాయి.
18 మొసలి తుమ్మినప్పుడు అది వెలుగు ప్రకాశించినట్టుగా ఉంటుంది.
    దాని కళ్లు ఉదయపు వెలుగులా ఉంటాయి.
19 దాని నోటి నుండి మండుతున్న జ్వాలలు బయటకు వస్తాయి.
    నిప్పు కణాలు బయటకు లేస్తాయి.
20 ఉడుకుతూ ఉన్న కుండ కింద కాలుతున్న
    పిచ్చి మొక్కలనుండి పొగవచ్చినట్టుగా మొసలి ముక్కునుండి పొగ వస్తుంది.
21 మొసలి శ్వాస బొగ్గులను మండిస్తుంది.
    దాని నోటినుండి అగ్ని జ్వాలలు వస్తాయి.
22 మొసలి మెడ చాలా బలంగా ఉంటుంది.
    మనుష్యులు దానిని చూచి భయపడి దాని నుండి పారిపోతారు.
23 మొసలి శరీరంలో బలహీనత ఏమీ లేదు.
    అది ఇనుములా గట్టిగా ఉంటుంది.
24 మొసలి గుండె బండలా ఉంటుంది.
    దానికి భయం ఏమీ లేదు. అది తిరుగలి క్రింది రాయిలా గట్టిగా ఉంటుంది.
25 మొసలి మేల్కొన్నప్పుడు బలమైన మనుష్యులు భయపడతారు.
    మొసలి తోక ఆడించినప్పుడు వారు పారిపోతారు.
26 ఖడ్గం, బల్లెం, బాణం మొసలిని కొడితే అవి తిరిగి వస్తాయి.
    ఆ ఆయుధాలు దానికే మాత్రం హాని చేయవు.
27 మొసలికి ఇనుమును గడ్డి పరకలా విరుగ గొట్టడం తేలిక.
    ఇత్తడిని పుచ్చిపోయిన చెక్కలా విరుగ గొట్టటం తేలిక.
28 బాణాలు మొసలిని పారిపోయేటట్టు చేయలేవు.
    దానిమీద విసిరిన బండలు ఎండి గడ్డిపోచల్లా ఉంటాయి.
29 దుడ్డు కర్రతో మొసలిని కొట్టినప్పుడు అది దానికి ఒక గడ్డి పరకలా అనిపిస్తుంది.
    మనుష్యులు దాని మీద ఈటెలు విసిరినప్పుడు అది నవ్వుతుంది.
30 మొసలి శరీరం క్రింద ఉన్న చర్మం పగిలి పోయిన చాలా వాడి చిల్లపెంకుల్లా ఉంటుంది.
    అది నడిచినప్పుడు మట్టిలో నురిపిడి కొయ్యలా గుంటలు చేస్తుంది.
31 కాగుతున్న కుండలోని నీళ్లను అది బుడగలు పొంగిస్తుంది.
    నూనె మసులుతున్న కుండలా అది నీటిని పొంగిస్తుంది.
32 మొసలి ఈదినప్పుడు దాని వెనుక ఒక దారి ఏర్పడుతుంది.
    అది నీళ్లను పొంగింప జేసినప్పుడు దాని వెనుక తెల్లని నురుగు ఉంటుంది.
33 భూమి మీద ఏ జంతువూ మొసలిలాంటిది లేదు.
    అది భయం లేని జంతువుగా చేయబడింది.
34 మహా గర్విష్ఠి జంతువులను మొసలి చిన్న చూపు చూస్తుంది.
    క్రూర జంతువులన్నిటికీ అది రాజు.”

2 కొరింథీయులకు 11

పౌలు మరియు అబద్ధపు అపొస్తలులు

11 నా తెలివితక్కువతనాన్ని మీరు కొద్దిగా సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని నాకు తెలుసు. మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని అనుకున్నాను. సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్ధాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక, వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవసందేశానికి, ఆత్మకు వ్యతిరేకంగా దైవసందేశాన్ని, ఆత్మను ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు.[a]

ఆ “గొప్ప అపొస్తలుల కన్నా” నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను. మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము అన్ని విధాలా మీకు స్పష్టంగా తెలియజేసాము.

దైవసందేశాన్ని మీకు ఉచితంగా ప్రకటించాను. మీకు ప్రాముఖ్యత యిచ్చి నేను తగ్గించుకొన్నాను. అలా చెయ్యటం పాపమా? ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది. నేను మీతో ఉన్నప్పుడు ఎవ్వరికీ భారంగా ఉండలేదు. మాసిదోనియ నుండి వచ్చిన సోదరులు నాకు కావలసినవన్నీ తెచ్చారు. నేను మీపై ఏ విధమైన భారం మోపలేదు. ఇకముందు కూడా మోపను. 10 దీన్ని గురించి నేను గర్వపడకుండా అకయ ప్రాంతంలో ఉన్నవాడెవ్వడూ నన్ను ఆపలేడు. ఇది నేను క్రీస్తు సత్యంగా చెపుతున్నాను. 11 ఎందుకు, మీ పట్ల నాకు ప్రేమ లేదనా? నేను ప్రేమిస్తున్నానని దేవునికి తెలుసు.

12 వాళ్ళు తమను గురించి గర్వంగా చెప్పుకోవాలని చూస్తారు. తాము మాతో సమానంగా ఉన్నట్లు మీరు గమనించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు గర్వించటానికి కారణం లేకుండా చెయ్యటానికి నేను చేస్తున్నది చేస్తూపోతాను. 13 అలాంటివాళ్ళు దొంగ అపొస్తలులు. మోసాలు చేస్తారు. క్రీస్తు అపొస్తలుల వలే నటిస్తారు. 14 దీనిలో ఆశ్చర్యమేలేదు! సాతాను కూడా తాను వెలుగుదూత అయినట్లు నటిస్తాడు. 15 మరి సాతాను సేవకులు నీతిమంతులవలె నటించటంలో ఆశ్చర్యమేలేదు! చివరన వాళ్ళు చేసిన పనుల్ని బట్టి ఫలితం పొందుతారు.

పౌలు తన కష్టాలలో అతిశయించుట

16 నన్నొక తెలివతక్కువవానిగా పరిగణించవద్దని మళ్ళీ చెపుతున్నాను. మీరు నేను తెలివతక్కువవాణ్ణని అనుకొంటే, తెలివిలేనివాణ్ణి అంగీకరించినట్లు నన్ను అంగీకరించండి. అప్పుడు దానికి నేను కొద్దిగా గర్వపడవచ్చు. 17 నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల గర్వంగా మాట్లాడుతున్నాను. ప్రభువు మాట్లాడమన్నట్లు కాకుండా తెలివిలేనివాడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను. 18 అందరూ లౌకికులవలె తమను గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నారు. కనుక నేను కూడా గర్వంగా మాట్లాడుతున్నాను. 19 మీరు బుద్ధిమంతులైయుండి తెలివిలేనివాళ్ళ పట్ల మీరు ఆనందంగా సహనం చూపిస్తున్నారు. 20 మిమ్మల్ని బానిసలుగా చేసుకొన్నవాళ్ళపట్ల, దోచుకొనేవాళ్ళపట్ల, మీ వల్ల లాభం పొందేవాళ్ళపట్ల, మిమ్మల్ని అణచి పెట్టేవాళ్ళపట్ల, మీ చెంపమీద కొట్టినవాళ్ళపట్ల, మీరు సహనం చూపుతారు. 21 వాళ్ళలా ప్రవర్తించే ధైర్యం మాకు లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది.

ఎవరికైనా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంటే, నేనూ ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంది. 22 వాళ్ళు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుణ్ణి, వాళ్ళు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడను. వాళ్ళు అబ్రాహాము వంశీయులా? నేను కూడా అబ్రాహాము వంశీయుణ్ణి. 23 వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను.

24 యూదులు నన్ను ఐదు సార్లు ముప్పైతొమ్మిది కొరడాదెబ్బలు కొట్టారు. 25 మూడు సార్లు ఇనుప కడ్డీలతో కొట్టారు; ఒకసారి రాళ్ళతో కొట్టారు. మూడు సార్లు పడవ పగిలి ఒక రాత్రి, ఒక పగలు సముద్రం మీద గడిపాను. 26 విరామం లేకుండా ప్రయాణం చేసాను. ఆ ప్రయాణాల్లో నదులవల్ల ప్రమాదం కలిగింది. బందిపోటు దొంగలవల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయులవల్ల ప్రమాదం కలిగింది. యూదులుకానివాళ్ళవల్ల ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం మీద ప్రమాదం కలిగింది. దొంగ సోదరులవల్ల ప్రమాదం కలిగింది.

27 నేను కష్టాలు ఎదుర్కొని, కష్టించి పని చేసాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఆకలి దప్పులు అంటే ఏమిటో తెలుసుకొన్నాను. ఎన్నోసార్లు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు లేకుండా గడిపాను. 28 ఇవే కాక, సంఘాల కొరకు నేను ప్రతిరోజూ దిగులు పడుతుంటాను. 29 మీలో ఒకడు బలహీనుడైనప్పుడు, నేనూ బలహీనుడు కాకుండా ఉండగలనా? ఒకడు పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా? పాపం చెయ్యటానికి మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్ల నాకు కోపం కలగదా?

30 నేను గర్వంగా చెప్పుకోవాలి అంటే బలహీనతను చూపే వాటిని గురించి గర్వంగా చెప్పుకొంటాను. 31 యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి, సర్వదా స్తుతింపతగిన దేవునికి, నేను అసత్యం ఆడటం లేదని తెలుసు. 32 నేను డెమాస్కసులో ఉన్నప్పుడు అరెత అను రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాధికారి, నన్ను బంధించాలని ఊరి చుట్టూ కాపలా ఉంచాడు. 33 కాని కొందరు నన్ను గంపలో ఉంచి గోడ మీదనుండి క్రిందికి దింపారు. నేను చిక్కకుండా తప్పించుకొని పారిపోయాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International