Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 16

ఇశ్రాయేలీయులు సణగగా దేవుడు ఆహారాన్ని పంపటం

16 తర్వాత ప్రజలు ఏలీము నుండి ప్రయాణం చేసి సీనాయి ఎడారి చేరుకొన్నారు. ఈ స్థలం ఏలీముకి, సీనాయికి మధ్య ఉంది. ఈజిప్టు వదలిన తర్వాత రెండోనెల 15వ రోజున వారు ఈ స్థలానికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ఆ ఎడారిలో వారు మోషే అహరోనులకు ఫిర్యాదు చేసారు. “ఈజిప్టు దేశంలోనే యెహోవా మమ్మల్ని చంపేసి ఉంటే మాకు బాగుండేది. ఈజిప్టులో తినేందుకు మాకు సమృద్ధిగా ఉండేది. మాకు కావాల్సిన భోజనం అంతా మాకు ఉండేది. కానీ ఇప్పుడు నీవు మమ్మల్ని ఈ ఎడారిలోనికి తీసుకొచ్చావు. మేమంతా ఆకలితో ఇక్కడే చస్తాము” అంటూ ప్రజలు మోషే అహరోనులతో చెప్పారు.

అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు, “ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాను. ఈ ఆహారం మీరు తినేందుకే. ప్రతిరోజూ ప్రజలు బయటకు వెళ్లి ఆరోజు తాము తినేందుకు ఎంత భోజనం అవసరమో అంతే సమకూర్చు కోవాలి. నేను చెప్పినట్టు ప్రజలు చేస్తారో లేదో చూద్దామని నేను యిలా చేసాను. ఒక్క రోజుకు ఎంత భోజనం సరిపోతుందో సరిగ్గా అంతే ప్రజలు ప్రతిరోజూ తీసుకోవాలి. అయితే శుక్రవారం నాడు ప్రజలు భోజనం సిద్ధం చేసుకొనేటప్పుడు రెండు రోజులకు సరిపడే భోజనం ఉండేటట్టు వారు చూసుకోవాలి.”

కనుక మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పారు, “ఈ రాత్రి యెహోవా శక్తి మీరు చూస్తారు. ఈజిప్టు దేశం నుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడని మీరు తెలుసుకొంటారు. యెహోవా మహిమను రేపు ఉదయం మీరు చూస్తారు. యెహోవాకు మీరు ఫిర్యాదు చేసారు. ఆయన మా మనవి విన్నాడు. (ఆయన మీకు సహాయం చేస్తాడు) మీరు మా దగ్గర ఫిర్యాదు మీద ఫిర్యాదు చేసారు. మేము ఏ పాటి వారం?”

“మీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, యెహోవా మీ ఫిర్యాదులు విన్నాడు. కనుక రాత్రివేళ ఆయన మీకు మాంసం ఇస్తాడు. మీకు అవసరం ఉన్న భోజనం అంతా ప్రతి ఉదయం మీకు ఉంటుంది. నా దగ్గర, అహరోను దగ్గర మీరు ఫిర్యాదు చేస్తూ ఉండినారు. కానీ ఇప్పుడు మేము కొంచెం విశ్రాంతి తీసుకొంటాం. మీరు ఫిర్యాదు చేస్తోంది నా మీద, అహరోను మీద కాదని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యెహోవాకు విరోధంగా ఫిర్యాదు చేస్తున్నారు” అన్నాడు మోషే.

ఆ తర్వాత మోషే అహరోనుతో, “నీవు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు: ‘యెహోవా, మీ ఫిర్యాదులు విన్నాడు గనుక ఆయన ఎదుట సమావేశం అవ్వండి’ అని వారితో చెప్పు అన్నాడు.”

10 అహరోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. వాళ్లంతా ఒక్కచోట చేరారు. అహరోను మాట్లాడుతూ ఉండగా, ప్రజలంతా పక్కకు తిరిగి ఎడారిలోకి చూచారు. యెహోవా మహిమ ఒక మేఘంలా ప్రత్యక్షమవడం వారు చూశారు.

11 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 12 “ఇశ్రాయేలు ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. కనుక నేను చెబుతున్న నా మాటలు వారికి చెప్పు. ‘రాత్రివేళ మాంసం మీరు తింటారు. ప్రతి ఉదయం మీకు కావాల్సినంత భోజనం మీరు తింటారు. అప్పుడు మీ యెహోవా దేవుణ్ణి నమ్ముకోవచ్చని మీరు తెలుసుకొంటారు.’”

13 ఆ రాత్రి వారి బస అంతటా పూరేళ్లు (పిట్టలు) వచ్చాయి. (మాంసం కోసం ప్రజలు ఈ పిట్టల్ని పట్టుకొన్నారు) ప్రతి ఉదయం బసకు దగ్గర్లో నేలమీద మంచు కురిసింది. 14 సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది. 15 ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది. 16 ప్రతి వ్యక్తి తనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికీ 2 పావుల[a] కొలత ప్రకారం మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి అని యెహోవా చెబుతున్నాడు.”

17 కనుక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేసారు. ప్రతి వ్యక్తి ఈ భోజనం కూర్చుకొన్నారు. కొంతమంది మిగతా వాళ్ల కంటె ఎక్కువ కూర్చుకొన్నారు. 18 ఆ ప్రజలు వారి కుటుంబంలో ప్రతివొక్కరికీ ఆ భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థం కొలుచుకొన్నప్పుడల్లా, ప్రతి వ్యక్తికీ సరిపడ్డంత మాత్రమే ఉండేది. కాని ఎన్నడూ ఎక్కువ మిగిలేది కాదు. ప్రతి వ్యక్తీ తాను, తన కుటుంబం ఎంత తినగలరో సరిగ్గా అంతే తీసుకొన్నారు.

19 “రేపటికోసం ఆ భోజనం దాచుకోకండి” అని మోషే వారితో చెప్పాడు. 20 కానీ ప్రజలు మోషేకు లోబడలేదు. కొంత మంది మర్నాడు తినవచ్చని తమ భోజనంలో కొంత దాచుకొన్నారు. అలా దాచుకొన్న భోజనం పురుగులు పట్టేసి, కంపు కొట్టేసింది. ఇలా చేసినవాళ్ల మీద మోషేకు కోపం వచ్చింది.

21 ప్రతి ఉదయం ప్రజలు భోజనం కూర్చుకొన్నారు. ప్రతి వ్యక్తీ తాను తిన గలిగినంత కూర్చుకొన్నాడు. అయితే, ఎండ ఎక్కువ కాగానే ఆహారం కరిగిపోయి కనబడకుండా పోయింది.

22 శుక్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకులు మోషే దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు.

23 “ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో.

24 కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని మర్నాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్టలేదు.

25 శనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: “ఈవేళ సబ్బాతు, అంటే యెహోవా విశ్రాంతి రోజు. అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండకూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి. 26 ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవాలి. అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.”

27 శనివారంనాడు ప్రజల్లో కొంతమంది ఆహారం కూర్చుకోవాలని బయటకు వెళ్లారు కాని వారికి ఆహారం ఏమీ కనబడలేదు. 28 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు. “నా ఆజ్ఞలకు ఉపదేశాలకు లోబడకుండా ఎన్నాళ్లు మీరు తిరస్కరిస్తారు? 29 చూడండి, శనివారం మీకు విశ్రాంతి రోజుగా చేసాడు యెహోవా. అందుచేత రెండు రోజులకు సరిపడేంత ఆహారం శుక్రవారమే యెహోవా మీకు ఇస్తాడు. కనుక శనివారంనాడు మీలో ప్రతి ఒక్కరూ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి.” 30 కనుక శనివారంనాడు ప్రజలు విశ్రాంతి తీసుకొన్నారు.

31 ఆ ప్రత్యేక ఆహారాన్ని “మన్నా”[b] అని పిలవడం మొదలుబెట్టారు ప్రజలు. మన్నా కొత్తిమెర గింజల్లా చిన్నగా తెల్లగా ఉండి, తేనెపూసిన పూతరేకుల్లా ఉంది. 32 అప్పుడు మోషే అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటికి రప్పించినప్పుడు ఎడారిలో నేను మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ సంతానం వాళ్లు చూడ గలిగేటట్టు ఈ ఆహారం 2 పావులు దాచి ఉంచమని యెహోవా చెప్పాడు.”

33 కనుక మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “ఒక పాత్ర తీసుకొని దానిలో 8 పావులు మన్నా నింపు. ఈ మన్నాను మన సంతానం వారి కోసం దాచిపెట్టు” 34 మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. మన్నా పాత్రను ఒడంబడిక పెట్టె[c] ముందర పెట్టాడు అహరోను. 35 40 సంవత్సరాల పాటు ప్రజలు మన్నా తిన్నారు. కనాను దేశ సరిహద్దుల వచ్చేంతవరకు వారు దాన్ని తిన్నారు 36 (మన్నా కొలిచేందుకు వారి ఉపయోగించిన కొలత ఓమెరు. ఓమెరు అంటే ఏపాలో పదో భాగం.)

లూకా 19

జక్కయ్య

19 యేసు యెరికోను చేరి ఆ పట్టణం ద్వారా వెళ్తూవున్నాడు. ఆ గ్రామంలో జక్కయ్య అనేవాడు ఉండేవాడు. అతడు పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా. జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకొన్నాడు. కాని ప్రజలు గుంపులు గుంపులుగా వుండిరి అతడు పొట్టివాడు అవటంవలన యేసును చూడలేకపోయాడు. యేసు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి ఆయన్ని చూడటానికి అందిరకన్నా ముందు పరుగెత్తి ఒక మెడి చెట్టెక్కి కూర్చున్నాడు.

యేసు ఆ చెట్టుదగ్గరకు వచ్చాక పైకి చూసి, “జక్కయ్యా! జక్కయ్యా! వెంటనే క్రిందికి దిగిరా! ఈ రోజు నేను నీ యింట్లో బసచెయ్యాలి!” అని అన్నాడు.

అతడు వెంటనే క్రిందికి దిగి ఆనందంతో యేసుకు స్వాగతం చెప్పాడు. ప్రజలు జరిగినదంతా చూసి, “యేసు ఒక పాపి యింట్లో బస చెయ్యటానికి వెళ్తున్నాడే!” అని గొణిగారు.

కాని జక్కయ్య ప్రభువుతో, “ప్రభూ! నేనుయిక్కడే నా ఆస్తిలో సగం పేదవాళ్ళకు యిస్తాను. నేను ఎవరినుండైనా ఏదైనా మోసం చేసి తీసుకొని ఉంటే దానికి నాలుగు రెట్లు వాళ్ళకు చెల్లిస్తాను” అని అన్నాడు.

అప్పుడు యేసు, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. కనుక ఈ యింటికి ఈ రోజు రక్షణ వచ్చింది. 10 మనుష్యకుమారుడు తప్పిపోయిన వాళ్ళను వెతికి రక్షించటానికి వచ్చాడు” అని అన్నాడు.

పది మీనాల ఉపమానం

(మత్తయి 25:14-30)

11 ప్రజలు ఆయన చెబుతున్న విషయాలు వింటూ ఉన్నారు. ఆయన యెరూషలేము దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు దేవుని రాజ్యం రాబోతొందని అనుకున్నారు. కనుక ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 12 “గొప్ప కుంటుంబంలో పుట్టినవాడొకడు దూర దేశానికి వెళ్ళి తన దేశానికి రాజుగా నియమింపబడ్డాక తిరిగి రావాలనుకొన్నాడు. 13 వెళ్ళేముందు తన సేవకుల్ని పది మందిని పిలిచి ఒక్కొక్కనికి ఒక మీనాయిచ్చి, ‘నేను తిరిగి వచ్చేదాకా ఈ డబ్బుతో వ్యాపారం చెయ్యండి’ అని అన్నాడు. 14 అతని ప్రజలకు అతడంటే యిష్టం ఉండేది కాదు. కనుక వాళ్ళు తమ ప్రతినిధుల్ని పంపి, ‘ఇతడు మా రాజుగా ఉండటం మాకిష్టం లేదు’ అని చెప్పనంపారు.

15 “అయినా అతడు రాజుగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత అతడు తన దేశానికి తిరిగి వచ్చాడు. తాను డబ్బిచ్చిన సేవకులు ఎంత సంపాదించారో కనుక్కోవటానికి వాళ్ళను పిలిపించాడు. 16 మొదటి వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో మరొక పది మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. 17 ‘మంచిది! నీవు మంచి సేవకుడివి. నీవు చిన్న వాటిలో కూడా ఇంత నమ్మకంగా ఉన్నందుకు పది గ్రామాలపై నీకు అదికారం ఇస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.

18 “రెండవ వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో ఐదు మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. 19 ‘నిన్ను ఐదు గ్రామాలపై అధికారిగా నియమిస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.

20 “మూడవవాడు వచ్చి, ‘ప్రభూ! ఇదిగో మీరిచ్చిన మీనా. దాన్ని నేను ఒక గుడ్డలో చుట్టి దాచి ఉంచాను. 21 మీరు చాలా కఠినాత్ములు కనుక మీరంటే నాకు భయం. మీరు మీవి కానివాటిని లాక్కుంటారు; విత్తకుండానే కోయాలంటారు’ అని అన్నాడు.

22 “ఆ రాజు, ‘ఓరి, దుర్మార్గుడా! నిన్ను శిక్షించటానికి నీ మాటలే ఉపయోగిస్తాను. నేను కఠినాత్ముడనని నీకు తెలుసునన్నమాట. నేను ఇవ్వని వాటిని లాక్కుంటానన్నమాట. విత్తనం వేయకుండా ఫలం పొందుతానన్నమాట. 23 అలాంటప్పుడు నా డబ్బు వడ్డీకి ఎందుకు యివ్వలేదు? అలా చేసివుంటే నేను తిరిగి వచ్చినప్పుడు నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది కదా!’ అని అన్నాడు. 24 ఆ తర్వాత అక్కడ నిలుచున్న వాళ్ళతో ‘వాని నుండి ఆ మీనా తీసుకొని పదిమీనాలున్న వానికి ఇవ్వండి!’ అని అన్నాడు.

25 “‘అయ్యా! అతని దగ్గర పదిమీనాలున్నాయి కదా!’ అని వాళ్ళు అన్నారు.

26 “అతడు, ‘వున్నవానికి యింకా ఎక్కువ ఇవ్వబడుతుంది. ఏమిలేని వాని నుండి అతని దగ్గర ఉన్నవి కూడా తేసివేయబడతాయి. 27 ఇక నేను తమ రాజుగా ఉండటానికి నిరాకరించిన శత్రువుల్ని పిలుచుకు వచ్చి నా ముందు చంపండి’” అని అన్నాడు.

యేసు యెరూషలేము ప్రవేశించటం

(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; యోహాను 12:12-19)

28 యేసు ఈ ఉపమానం చెప్పి యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. 29-30 వాళ్ళు ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ గ్రామాలను చేరుకొన్నాక యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరా గ్రామాన్ని ప్రవేశించగానే స్థంభానికి కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద యిదివరకు ఎవ్వరూ ఎక్కలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. 31 ఎవరైనా ‘ఎందుకు విప్పుతున్నారు?’ అని అడిగితే, ఇది ప్రభువుకు కావాలని చెప్పండి” అని అన్నాడు.

32 వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పిన విధంగా గాడిద స్థంభానికి కట్టబడి ఉండటం చూసారు. 33 వాళ్ళు దాన్ని విప్పుతుండగా దాని యజమానులు వచ్చి, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు.

34 ఇది “ప్రభువుకు కావాలి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. 35 వాళ్ళు దాన్ని యేసు దగ్గరకు తీసుకు వచ్చి తమ వస్త్రాల్ని దానిపై పరిచి, దాని మీద యేసును ఎక్కించారు. 36 ఆయన వెళ్తుండగా, ప్రజలు తమ వస్త్రాల్ని దారి మీద పరిచారు.

37 ఆయన ఒలీవల కొండమీద నుండి క్రిందికి దిగే స్థలాన్ని చేరుకున్నాడు. శిష్యుల గుంపంతా తాము మహత్యాలు చూసినందుకు ఆనందంతో బిగ్గరగా యిలా దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు:

38 “‘ప్రభువు పేరిట రానున్న రాజు ధన్యుడు!’(A)

పరలోకంలో శాంతి! మహోన్నత స్థలాల్లో దేవునికి మహిమ!”

39 గుంపులో ఉన్న కొందరు పరిసయ్యులు యేసుతో, “బోధకుడా! మీ శిష్యుల్ని అదుపులో పెట్టుకో!” అని అన్నారు.

40 యేసు, “వాళ్ళు గొంతెత్తి మాట్లాడటం ఆపితే, రాళ్ళు గొంతెత్తి మాట్లాడటం మొదలు పెడతాయి” అని సమాధానం చెప్పాడు.

యేసు యెరూషలేమును చూచి యేడవటం

41-42 ఆయన యెరూషలేము సమీపిస్తూ ఆ పట్టణాన్ని చూసి ఈ విధంగా విలపించ సాగాడు: “శాంతిని స్థాపించటానికి ఏమి కావాలో నీకు ఈ రోజైనా తెలిసుంటే బాగుండేది. కాని అది నీకిప్పుడు అర్థం కాదు. 43 నీ శత్రువులు నీ చుట్టూ గోడకట్టి నాలుగు వైపులనుండి ముట్టడి చేసే రోజులు రానున్నాయి. 44 వాళ్ళు నిన్ను, నీ ప్రజల్ని నేల మట్టం చేస్తారు. దేవుని రాకను నీవు గమనించలేదు. కనుక వాళ్ళు ఒక రాయి మీద యింకొక రాయి ఉండకుండా చేస్తారు.”

యేసు ఆలయంలోనికి వెళ్ళటం

(మత్తయి 21:12-17; మార్కు 11:15-19; యోహాను 2:13-22)

45 ఆ తర్వాత ఆయన మందిరంలోకి ప్రవేశించి అక్కడ అమ్ముతున్న వ్యాపారస్తుల్ని తరిమి వేయటం మొదలు పెట్టాడు. 46 వాళ్ళతో, “నా ఆలయం ప్రార్థనా ఆలయం.(B) కాని మీరు దాన్ని ‘దొంగలు దాగుకొనే స్థలంగా’(C) మార్చారు!” అని చెప్పబడిందని అన్నాడు.

47 ఆయన ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ ఉండే వాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజా నాయకులు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. 48 కాని ప్రజలు యేసు మాటలు శ్రద్ధతో వింటూ ఉండటంవల్ల ఆయన్ని ఏ విధంగా చంపాలో వాళ్ళకు బోధపడలేదు.

యోబు 34

34 ఎలీహు మాట్లాడటం కొన సాగించాడు:

“జ్ఞానంగల మనుష్యులారా, నేను చెప్పే విషయాలు వినండి.
    తెలివిగల మనుష్యులారా నా మాటలు గమనించండి.
చెవి తను వినే సంగతులను పరీక్షిస్తుంది.
    అదే విధంగా నాలుక, తను తాకే వాటిని రుచి చూస్తుంది.
అందుచేత మనం ఈ పరిస్థితిని పరిశీలించాలి. ఏది సరైనదో మనమే నిర్ణయించాలి.
    ఏది మంచిది అనేది కూడా మనం అంతా ఏకంగా నేర్చుకొంటాం.
యోబు అంటున్నాడు, ‘యోబు అనే నేను నిర్దోషిని.
    కానీ దేవుడు నాకు న్యాయం చేయలేదు.
నాది సరిగ్గా ఉంది, కానీ ప్రజలు నాది తప్పు అనుకొంటారు.
    నేను అబద్దీకుణ్ణి అని వాళ్లు అనుకొంటారు. నేను నిర్దోషిని అయినప్పటికి నా గాయం మానదు.’

“యోబులాంటి వ్యక్తి మరొకడు లేడు.
    మీరు యోబును అవమానించినప్పటికి అతడు లెక్క చేయడు.
చెడ్డ వాళ్లతో యోబు స్నేహంగా ఉన్నాడు.
    దుర్మార్గులతో కలిసి సహవాసం యోబుకు యిష్టం.
‘ఎందుకంటే, ఒకడు దేవునికి విధేయత చూపించేందుకు ప్రయత్నిస్తే
    దానివల్ల అతనికి ప్రయోజనం ఏమీ కలుగదు’ అని యోబు చెబుతున్నాడు.

10 “కనుక గ్రహించగలిగిన ఓ మనుష్యులారా, నా మాట వినండి.
    దేవుడు ఎన్నటికీ చెడు చేయడు.
    సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు.
11 ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి చెల్లిస్తాడు.
    మనుష్యులకు రావలసిందే దేవుడు వారికి ఇస్తాడు.
12 ఇది సత్యం. దేవుడు తప్పు చేయడు.
    సర్వశక్తిమంతుడైన దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు.
13 భూమికి పర్యవేక్షకునిగా ఉండేందుకు దేవుణ్ణి ఎవరు నియమించారు?
    భూభారాన్ని దేవునికి ఎవరు అప్పగించారు? (దేవుడు అన్నింటినీ పుట్టించాడు మరియు అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి.)
14 దేవుడు తన ఆత్మను,
    తన ప్రాణవాయువును మనుష్యుల్లోనుండి తీసివేయాలని ఒకవేళ అనుకొంటే
15 అప్పుడు భూమి మీద మనుష్యులు అందరూ చనిపోతారు.
    అప్పుడు మనుష్యులు మరల మట్టి అయిపోతారు.

16 “మీరు జ్ఞానంగల వారైతే,
    నేను చెప్పేది వినండి.
17 న్యాయంగా ఉండటం యిష్టంలేని మనిషి పరిపాలకునిగా ఉండజాలడు.
    యోబూ, బలమైన మంచి దేవుణ్ణి నీవు దోషిగా తీర్చగలవని నీవు తలుస్తున్నావా?
18 ‘మీరు పనికిమాలిన వాళ్లు’ అని రాజులతో చెప్పేవాడు దేవుడు.
    ‘మీరు దుర్మార్గులు’ అని నాయకులతో దేవుడు చెబుతాడు.
19 దేవుడు నాయకులను మనుష్యులకంటె ఎక్కువేమీ ప్రేమించడు.
    దేవుడు ధనికులను దరిద్రుల కంటే ఎక్కువేమీ ప్రేమించడు.
    ఎందుకంటే, ప్రతి మనిషినీ దేవుడే చేశాడు గనుక.
20 ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా మరణించవచ్చును.
    మనుష్యులను దేవుడు రోగులుగా చేస్తాడు.
    వారు మరణిస్తారు.
    ఏ కారణం లేకుండానే శక్తిగల మనుష్యులు మరణిస్తారు.

21 “మనుష్యులు ఏమి చేస్తున్నదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు.
    ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి తెలుసు.
22 దుర్మార్గుడు దేవునికి కనబడకుండా దాగుకొనేందుకు చీకటి చోటు ఏమీ లేదు.
    ఏ చోటైన చీకటిగా ఉండదు.
23 మనుష్యులను మరింత పరీక్షించేందుకు దేవునికి ఒక నిర్ణీత సమయం అవసరం లేదు.
    మనుష్యులకు తీర్పు తీర్చేందుకు దేవుడు వారిని తన ఎదుటికి తీసుకొని రానవసరం లేదు.
24 దేవుడు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు.
    కానీ దేవుడు శక్తివంతమైన వారిని నాశనం చేసి ఇతరులను వారి స్థానంలో ఉంచుతాడు.
25 కనుక మనుష్యులు ఏమి చేస్తారో దేవునికి తెలుసు.
    అందుకే దేవుడు దుర్మార్గులను రాత్రిపూట ఓడించి, వారిని నాశనం చేస్తాడు.
26 చెడ్డవాళ్లు చేయు దుర్మార్గపు పనులను బట్టి దేవుడు వారిని నాశనం చేస్తాడు.
    ఆ చెడ్డవారిని అందరూ చేసేలా ఆయన శిక్షిస్తాడు
27 ఎందుకంటే ఆ చెడ్డవాళ్లు దేవునికి విధేయత కావటం మానివేశారు గనుక.
    మరియు ఆయన కొరిన వాటిని చేయటం ఆ చెడ్డవాళ్లు లక్ష్య పెట్టలేదు గనుక.
28 పేద ప్రజలను బాధించి, వారు సహాయం కోసం దేవునికి మొర పెట్టేలాగా ఆ చెడ్డవాళ్లు చేశారు.
    మరియు పేదవారు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆయన వింటాడు.
29 కానీ ఒకవేళ పేద ప్రజలకు సహాయం చేయకూడదని
    కనుక దేవుడు నిర్ణయంచేస్తే ఎవరూ ఆయనను దోషిగా నిర్ణయించలేరు
ఒకవేళ దేవుడు ప్రజలకు తన ముఖం మరుగు చేసికొంటే వారికి సహాయం చేయగలవాడు ఎవడూ ఉండడు.
    అయితే ఆయన వ్యక్తులను, రాజ్యాలను పాలిస్తాడు.
30 తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుష్యులను మోసగించే వ్యక్తిని
    దేవుడు పాలకునిగా ఉండనివ్వడు.

31 “ఒకవేళ ఒక వ్యక్తి దేవునితో అనవచ్చును:
    ‘నేను దోషిని, నేను ఇంకెంత మాత్రం పాపం చేయను.
32 దేవా, నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు.
    నేను తప్పు చేసి ఉంటే ఇకమీదట ఎన్నటికి మరల దానిని చేయను.’
33 కానీ యోబూ, నీవు మారటానికి తిరస్కరిస్తూ ఉండగా,
    నీవు ఏ విధంగా ప్రతిఫలం కావాలని కోరుకొంటావో అలా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలా?
యోబూ, ఇది నీ తీర్మానం, నాది కాదు.
    నీవు ఏమి అనుకొంటున్నావో నాకు చెప్పు.
34 జ్ఞానం గలిగి, గ్రహింపు ఉన్న ఏ మనిషిగాని నాతో ఏకీభవిస్తాడు.
    నా మాటలు వినే జ్ఞానం గల మనిషి ఎవరైనా సరే అని అంటారు,
35 ‘యోబు తెలియనివానిలా మాట్లాడతాడు.
    యోబు చెప్పే మాటలకు అర్థం లేదు.’
36 యోబును పరీక్షించేందుకు అతనికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తే బాగుండునని, నా ఆశ.
    ఎందుకంటే ఒక దుర్మార్గుడు జవాబిచ్చినట్టుగా యోబు మనకు జవాబు ఇస్తున్నాడు గనుక.
37 యోబు తన పాపం అంతటికి తిరుగుబాటుతనం అదనంగా కలిపాడు.
    యోబు మనలను అవమానించి, మన ఎదుట దేవుణ్ణి హేళన చేస్తున్నాడు.”

2 కొరింథీయులకు 4

మట్టి కుండలో సంపద

దేవుని అనుగ్రహం వల్ల మేము ఈ సేవ చేస్తున్నాము. కనుక ధైర్యం కోల్పోము. నిజానికి అవమానం కలిగించే రహస్య మార్గాలను మేము వదిలివేసాము. మేము మోసాలు చెయ్యము. దైవసందేశాన్ని మార్చము. సత్యాన్ని అందరికీ స్పష్టంగా తెలియచేస్తాము. తద్వారా మేము ఎలాంటివాళ్ళమో మేము దేవుని సమక్షంలో ఏ విధంగా జీవిస్తున్నామో ప్రజలు తెలుసుకున్నారు. మేము చెప్పే దైవసందేశం మూయబడితే నశించేవాళ్ళకు మాత్రమే అది మూయబడింది. క్రీస్తు దేవుని ప్రతిరూపం. దైవసందేశం ఆయన మహిమను ప్రకాశింప చేస్తుంది. దాన్ని చూడనీయకుండా ఈ యుగపు పాలకుడు[a] నమ్మని ప్రజల హృదయాలను గ్రుడ్డి చేసాడు. మమ్మల్ని మేము ప్రకటించుకోము. యేసు క్రీస్తు ప్రభువని ప్రకటిస్తాము. యేసు కొరకు మేము మీ సేవకులమని ప్రకటిస్తాము. “చీకటి నుండి వెలుగు ప్రకాశించనీ!”[b] అని అన్న దేవుడు తన వెలుగు మా హృదయాల్లో వెలిగించాడు. క్రీస్తు ముఖంలో దేవుని మహిమ ప్రకాశిస్తోంది. ఆ మహిమలో ఉన్న జ్ఞానాన్ని మాలో ప్రకాశింప చేసాడు.

దేవుడు ఇచ్చిన ఈ ఐశ్వర్యం మాములు మట్టికుండల్లో దాగివుంది. మేమే ఆ కుండలము. దీనివల్ల ఈ శక్తి మాది కాదని, దేవునిదని స్పష్టంగా తెలుస్తోంది. మా చుట్టూ కష్టాలు ఉన్నాయి. కాని మేము ఆ కష్టాలకు నలిగిపోలేదు. మాకు అవమానాలు కలిగాయి. కాని మేము వాటివల్ల దిగులుపడలేదు. మేము హింసించబడుతున్నాము కాని, మేము దిక్కులేనివాళ్ళము కాము. మేము క్రింద పడ్డాము కాని నశించిపోలేదు. 10 మేము అన్ని వేళలా యేసు మరణాన్ని మోసుకొని తిరుగుతూ ఉంటాము. “ఆయన” జీవితం మా జీవితాల ద్వారా వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. 11 బ్రతికి ఉన్న మేము యేసుకోసం మా జీవితాలను మరణానికి అప్పగిస్తూ ఉంటాము. ఆయన జీవితం మా భౌతిక దేహాల్లో వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. 12 కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన జీవితం మీలో పని చేస్తోంది.

13 లేఖనాల్లో, “నేను విశ్వసించాను. కనుక మాట్లాడుతున్నాను”(A) అని వ్రాయబడి ఉంది. మేము కూడా అదే విధంగా విశ్వసించాము. కనుక మాట్లాడుతున్నాము. 14 ఎందుకంటే, చనిపోయిన యేసు ప్రభువును బ్రతికించినవాడు, ఆయనతో సహా మమ్మల్ని కూడా బ్రతికిస్తాడని మాకు తెలుసు. ఆ విధంగా మమ్ములను కూడా లేపి, మీతో సహా మమ్మల్ని కూడా దేవుని సమక్షంలో నిలబెడతాడు. 15 ఇవన్నీ మీ కోసమే జరుగుతున్నాయి. దైవానుగ్రహం ప్రజల్లో వ్యాపిస్తూ పోవాలనీ, దేవుని మహిమ నిమిత్తమై ప్రజలు అర్పించే కృతజ్ఞతలు పెరుగుతూ పోవాలని యిందులోని ఉద్దేశ్యం.

విశ్వాసంద్వారా జీవించటం

16 కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం ప్రతి రోజూ శక్తి పొందుతూ ఉంది. 17 క్షణికమైన మా మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. మనము పొందుతున్న మహిమతో, అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింపతగినవి కావు. 18 అందువల్ల కనిపించే వాటిపై మా దృష్టి ఉంచక కనిపించని వాటిపై మా దృష్టి కేంద్రీకరిస్తున్నాము. కనిపించేది క్షణికము. కనిపించనిది అనంతము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International